ప్రత్యేక సంపాదకీయం జూన్ 2023

16
1

[2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక సంపాదకీయం.]

[dropcap]తా[/dropcap]డిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడింకొకడుంటాడు అంటారు. తోటకూర నాడే …అని మరో సామెతవుంది.  నేరం చేసి పట్టుబడి అవమానాల పాలయ్యే బదులు, పొగడ్తలందుకుంటే, ఎలాంటి తప్పు చేసినా తప్పించుకోవచ్చన్న ధీమా రావటమే కాదు, నేరం చేయటం తమ హక్కు అనుకుంటారు. ఇంకెవరయినా వారిదారిలో నడిచి నేరం చేసి తప్పించుకుంటే సహించలేరు.  ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య అకాడెమీ యువ పురస్కారం ప్రకటన తరువాత జరుగుతున్న వాదాలు, వివాదాలను అర్థం చేసుకోటానికి ఈ సామెతలు  చాలు.

ముందుగా బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయిన డి.కె చదువుల బాబుకు అభినందనలు. ఒక ఉద్యమంలా బాల సాహిత్యాన్ని సృజిస్తున్న సృజనకారుడీయన.

యువ సాహిత్య పురస్కారం అందుకున్న తక్కెడశిల జానీ బాషాకు అభినందనలు. ఆయన సాహిత్య సృజన నాణ్యతతో సంబంధం లేకుండా, వారి వేలితో వారి కన్నే పొడిచిన ఆయన నైపుణ్యానికి అభినందనలు. ఈ పురస్కారానికి వయసు ప్రాధాన్యం తప్ప నాణ్యత ప్రధానం కాదన్న నిజాన్ని గమనిస్తే ఆయనకీ అవార్డు ఇవ్వటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలుండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కనీసం ఈయన రచనల్లో విద్వేషాల జ్వాలలు, విచ్చిన్నకరమయిన ఆలోచనలు, తమకేదో అన్యాయమైపోతోందీ దేశంలో, సమాజంలో అన్న వికృతపు కేకల బాకాలూ వుండవు. గతంలో ఈ అవార్డు అందుకున్న వారితో పోలిస్తే, అర్థం లేకున్నా అనర్థానికి బీజాలుండని ఈయన రచనలే మెరుగు.

తక్కెడశిల జానీబాషాకు అవార్డివ్వటం పట్ల జరుగుతున్న వివాదంలో సాహిత్యం తప్ప ఇతర అన్ని విషయాలూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వేంపల్లె గంగాధర్ పేరు యువ పురస్కారం లభించిన తరువాతే అధికులకు తెలిసింది. వేంపల్లె షరీఫ్ అయినా, అప్పిరెడ్డి హరనాథ రెడ్డి అయినా పురస్కారం లభించేవరకూ అధికులకు తెలియదు. ఈ ముగ్గురికి మొదటి మూడు అవార్డులు వచ్చిన తరువాతనే అందరి దృష్టీ యువ పురస్కారం పైన పడింది. ఆ తరువాత ఒక యువ మహిళా జర్నలిస్టూ, మరో యువ మహిళా రచయిత్రి అవార్డు కోసం బహిరంగంగా పోటీ పడి, బర్త్ సర్టిఫికెట్లు తప్పువి పెట్టేరని ఆరోపణలు చేసుకుని అక్షరాల్లో దాదాపుగా జుట్లు పట్టుకున్న స్థాయిలో కోట్లాడుకోవటం అందరికీ తెలుసు. ఆ ఇద్దరికీ అవార్డు రాకపోవటం పొయెటిక్ జస్టిస్. అయితే ఇలా గొడవలు బాగాలేవని సాహిత్య మాఫియా ముఠాలు రంగ ప్రవేశం చేసి  ఒక పద్ధతి ప్రకారం తమవారికి అవార్డులు నిర్ణయించటం మొదలయింది. ఆ తరువాత అవార్డుల పంపకం మొదలయింది. ఈసారి నీకు, వచ్చేసారి వారికీ అంటూ ఒప్పందాలు జరగటం, బేరసారాలు జరగటం అన్నీ బహిరంగ రహస్యాలే. అయితే, ఇలా బేరసారాలు, ఒప్పందాలన్నీ మాఫియా ముఠాల  జట్లకు చెందినవారి నడుమ జరగటం, వారిలో వారు రాజీలుపడి ఒప్పందాలు, పంపకాలు చేసుకోవటంవల్ల పెద్దగా వాదవివాదాలు చెలరేగలేదు. కానీ, ఇలా ఒకే గుంపు వారికి అవార్డులు వస్తూండటంతో, అవార్డులు రావాలంటే, ఏం చేయాలో, ఎవరిని పట్టాలో అందరికీ తెలిసిపోయింది. గొడవ లేదు. ఈ అవార్డులు పొందినవారు, అవార్డు తమ వయసు ప్రాతిపదికగా వచ్చిందన్న నిజాన్ని విస్మరించి, తామే ఉత్తమోత్తమ రచయితలన్నట్టు ప్రవర్తిస్తూండటం వల్ల ఇతర యువ  రచయితలూ  అవార్డు పొందాలని ఆశపడటం సహజంగా జరిగింది. కానీ, ఈ గుంపులో చేరని వారు అవార్డుల కోసం తహతహలాడటం చూసి అవార్డులిప్పిస్తామని యువ రచయితలను తప్పుదారి పట్టించేవారూ, వారి అవార్డు ఆశ ఆధారంగా  తమ కోరికల సరదాలు తీర్చుకునేవారూ రంగప్రవేశం చేశారు. ఎందరో యువ రచయిత, రచయిత్రులు ఇలాంటి చెడు అనుభవాల వల్ల సాహిత్యాన్ని వదిలిపోయారు. ఇంకొందరు ఆశతో శక్తివంతమయిన జట్లలో చేరి, ఆ జట్టు పెద్దలకు వందిమాగధ భజనబృందాల్లా మిగిలిపోయారు, రచనలు మరచిపోయి. మరికొందరు యువ పురస్కారం రాకపోతే పోయె, ఇతర పురస్కారాలు వచ్చే త్రోవలు వెతుక్కున్నారు. పురస్కార రచయితలుగా మిగిలిపోయారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే!

మరి అలాంటప్పుడు జానీబాషాకు అవార్డు వస్తే ఇంత గోల ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న వస్తుంది. ఇందుకు మొదటగా చెప్పుకోవాల్సిన కారణం, ఈ యువ పురస్కార గ్రహీత అవార్డులు పొందే అర్హత వున్న గుంపుకు చెందినవాడు కాకపోవటం. తెలుగు సాహిత్య ప్రపంచంలో రచయితగా గుర్తింపు పొందాలంటే, చేరాల్సిన గుంపుకు చెందనివాడికి అవార్డు వస్తే, ఆ గుంపు ప్రతిష్ఠకెంత నష్టం? ఇలా ఎవరికి వారు స్వంత బలంతో అవార్డులు తెచ్చేసుకుంటే ఇక సాహిత్య మాఫియా ముఠాల విలువేముంటుంది?? వారికి అస్తిత్వం ఏంఉంది?  అందుకే గతంలో ఎంత అర్హత లేని వారికి అవార్డొచ్చినా కిమ్మనక చప్పట్లూ చరిచి పొగడ్తల్లో ముంచెత్తి, ఆయనకీ అవార్డా? అని ఆశ్చర్యం వ్యక్తపరచిన వారిపై విమర్శలు కురిపించే వారంతా, ఇప్పుడు సాహిత్యానికి ఏదో ఘోరమైన నష్టం జరిగినట్టు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆవేదన అంతా, అవార్డుపై తమకు పట్టుపోతుందేమో, ఇంతవరకూ పద్ధతి ప్రకారం ఒప్పందాలననుసరించి వస్తున్న అవార్డులిక వేరేవారు కొట్టుకుపోతారేమో, ఇలా, వ్యవస్థాపరమయిన అవార్డులు సంపాదించే పద్ధతి స్థానే, బలమున్నవాడు అవార్డు కొట్టేసే అరణ్య వ్యవస్థ వచ్చేస్తుందేమో అన్న భయాలు తప్ప సాహిత్యానికేదో నష్టం వాటిల్లుతుందన్న బాధ ఏ కోశానా లేదు. పైగా, ఒక కవి పది సంవత్సరాలుగా నామినేట్ అవుతున్నా అతనికి దక్కలేదు, ఇదే అతని చివరి అవకాశం కాబట్టి, జానీబాషా అవార్డు రద్దు చేసి అతనికివ్వాలని ఓ విచిత్ర వాదన మొదలుపెట్టారు. పదేళ్ళుగా నామినేట్ అయినా అవార్డు లభించలేదంటేనే, ఈ కవికన్నా ఇంకా కావాల్సినవారికే అవార్డు లభించిందనీ, అందుకే అప్పుడు చేయని గోల ఇప్పుడు చేస్తున్నారనీ స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాదు, ఈసారి కూడా, ఆ పదేళ్ళు నామినేట్ అయిన కవికి రాకున్నా, తమవారిలో ఎవరికో ఒకరికి వచ్చుంటే ఒక్కరు కూడా నోరిప్పేవారు కారు. పైగా, ఈ పదేళ్ళు నామినేట్ అయి అవార్డు పొందని కవి పేరుకూడా ఎత్తేవారు కారు. ఇక్కడే మరో విషయం గమనించాలి. అందరూ, పాపం, ఎలాంటి గుంపు, సమర్ధించే పెద్దల అండ లేని వాడని అతడిని విమర్శల్లో ముంచెత్తుతున్నారు. కానీ, ఎవరూ కూడా, అతని పుస్తకానికి ముందుమాట రాసిన సాహిత్య పెద్దని కానీ, అతడికీ అవార్డు రావటానికి కారణమయిన మరో భీష్మ పితామహుడిలాంటి పెద్దని కానీ ఏమీ అనటం లేదు. ఇక్కడే, తాడిని తన్నేవాడూంటే సామెత విలువ తెలుస్తుంది.

జానీ బాషా పుస్తకానికి ముందుమాట రాసి అతని రచనకు ప్రామాణికత కల్పించిన  ఆయన ప్రసక్తి ఎవరూ తేవటంలేదు. ఇలాంటి రచయిత పుస్తకాన్ని ఎలా పొగిడేరు? అని ఆయనను  ఎవరూ నిలదీయటం లేదు. ఎందుకంటే ఆయనా ఈ గుంపులకు సన్నిహితుడు.    పోనీ, తాను ముందుమాట రాసిన పుస్తకానికి అవార్డు ఇవ్వటాన్ని ఇందరు ఇంతగా విమర్శిస్తూంటే, ఆయన ఆ రచయితకు  సమర్థనగా  నోరు విప్పటం లేదు. ఎందుకని? అంటే, ఈ పొగడ్తల ముందుమాటలన్నీ, పై పై కబుర్లేనా? పాఠకులను మభ్యపెట్టే ఉత్తిత్తి అక్షరాలేనా? మరి, ఈ పుస్తకానికి అవార్డు వచ్చేట్టు చేసిన  కురువృద్ధ గురువృధ్ధ బాంధవుడిని ఎవరూ నిలదీయటం లేదెందుకని? ఎందుకంటే ఆయనా వీళ్ళకు కురుగురువృద్ధుడే కాబట్టి. గతంలో అర్హతలేని వీళ్ళ వాళ్ళకు ఎన్నో అవార్డులిప్పిచ్చేడు కాబట్టి. ఇక్కడే జానీ బాషాను అభినందించాల్సి వుంటుంది. వారి వేలితో వారి కన్నే పొడిచాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడుంటాడని నిరూపించాడు.  వారు ఏర్పాటు చేసిన పద్ధతిలోనే వారిని దెబ్బతీశాడు. దాంతో మింగలేక కక్కలేక, తమ వారిని ఏమీ అనలేక విలవిల లాడుతూ ఆ ఆక్రోశం అంతా, జానీబాషాపై చూపిస్తున్నారు. ఏం, జానీబాషాకు అవార్డు సంపాదించటం కోసం కష్టపడే అర్హత లేదా? కష్టపడ్డవాడికి ఫలితం దక్కితే ఉక్రోషం ఎందుకు? అవార్డులపై వీరికే గుత్తాధిపత్యం వుందా? ఇంతవరకూ వచ్చిన అవార్డులన్నీ అర్హత ఉన్నవారికే వచ్చాయా?  అప్పుడులేని ఆవేదనాక్రోషాలిప్పుడెందుకు? అప్పుడుపట్టని సాహిత్యం సంగతి ఇప్పుడే ఎందుకు? ఎందుకంటే అవార్డులపై తమకు హక్కున్నట్టుగా భావిస్తున్న మాఫియా ముఠాల గుంపులకు చేందకున్నా, వారిని దెబ్బతీసి మరీ జానీబాషా అవార్డు పొందగలిగాడు కాబట్టి.

అంతకుముందే అర్హతలేని పుస్తకానికి అవార్డు ఇచ్చినప్పుడు తమవాడని చప్పట్లు చరచక ఇలాగే విమర్శలు కురిపించివుంటే, ఈరోజు ఇలా రచనలు చేయటం రానివారు కూడా అవార్డుల కోసం ఆత్రపడి సాధించుకునే మార్గాలు బార్లా తెరచుకుని వుండేవి కావు కదా! ఇక్కడే తోటకూర నాడే సామెతను గుర్తు చేసుకోవాల్సి వుంటుంది. తమవారికి అర్హత లేకున్నా అవార్డులోస్తే మౌనంగా వున్నవారు, అర్హతలేని వేరేవాడు అవార్డు తెచ్చుకుంటే అరిచే హక్కు కోల్పోతారు. గత సాహిత్య అకాడెమీ జట్టు కాలపరిమితి అయిపోయి కొత్త సభ్యుల జట్టు ఏర్పడే సమయంలో, గతంలో అవార్డుల ఎంపికలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపిస్తూ సంచిక కొన్ని వ్యాసాలను ప్రచురించింది. అప్పుడీ సాహిత్యాభిమానులెవ్వరూ నోళ్ళిప్పలేదు. అప్పుడే వీరంతా సంచికతో కలసివుంటే సాహిత్యాభిమానుల ఐక్య స్వరాన్ని వినిపించే వీలు చిక్కేది. అందుకే, అటు సాహిత్య అకాడెమీ పురస్కారాల్లోని డొల్లతనాన్ని, ఇటు సాహిత్య పెద్దల ముందుమాటల మోసాన్ని, అవార్డు రికమండేషన్ల అక్రమాల స్వరూపాలను ప్రపంచానికి ప్రకటించటమే కాక మాఫియ ముఠాల అసలు స్వరూపాలను బట్టబయలు చేసిన జానీ బాషాను సాహిత్యాభిమానులంతా హృదయ పూర్వకంగా అభినందించాల్సివుంటుంది. ధన్యవాదాలు తెలపాల్సివుంటుంది.

ఈ ఉదంతానికి మరో కోణం వుంది.

నూతన సాహిత్య అకాడెమీ సభ్యుల  ఎంపిక జరిగే కన్నా ముందు కొందరు సాహిత్య అకాడెమీని రక్షించాలనీ, కాషాయీకరణం నుంచి సాహిత్య అకాడెమీని కాపాడాలనీ సభలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కొత్త సభ్యుల బృందం ఏర్పడింది. ఈ సమావేశాలను ఏర్పాటుచేసిన ఆ సాహిత్యాభిమానికీ సభ్యత్వం దక్కింది. జానీబాషాకు అవార్డు వచ్చినట్టు ప్రకటించగానే వచ్చిన నిరసన వెల్లువను చూసి, ఈ అవార్డు ఎంపికలో కొత్త బృందం ప్రమేయం ఏమీలేదని, ఇది గతంలోనే నిర్ణయమైపోయిందనీ, కన్వీనర్ అమెరికాలో వున్నారు కాబట్టి ఆమెకూ ఏం తెలియదనీ ప్రకటించి చేతులు దులుపుకున్నదీ ప్రథమంగా ఆ సాహిత్యాభిమానే. అవార్డు ప్రక్రియ గతంలోనే ఆరంభమయినా ప్రకటించేది వీరి హయంలోనే కాబట్టి, అందుకు బాధ్యత వీరిదే కాబట్టి, మాకు ఈ అవార్డుతో సంబంధం లేదనటం బాధ్యతా రాహిత్యమే కాదు, చేతకానితనం అవుతుంది. పదవీకాలం అయిపోయిన సభ్యులు నామినేట్ చేయటంవల్ల సభ్యులయిన వీరు,  వారిపట్ల కృతజ్ఞతాభావంతో వారి నిర్ణయాలకు తలవూపేరని సగటు సాహిత్యాభిమాని భావించటంలో తప్పేమయినా వుందా? లోలోపల ఏవేవో డీలింగులు, అలాయిబలాయిలు జరిగి వుంటాయనుకోవటంలో అసంబధ్దమేమయినా వుందా? ఎందుకంటే, ఈ కొత్త సభ్యుల బృందం కూడా అదే తాను గుడ్డలే. ఎవరో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రజల పన్నుల డబ్బులతో విమానాల్లో ప్రయాణాలూ, పంచ నక్షత్రాల పూటకూళ్ళ ఇళ్ళల్లో బసలూ క్షమించరాని నేరం కాదా? ముందుగా సాహిత్య అకాడెమీని, సాహిత్యాన్ని  ఇలాంటి బాధ్యత తెలియని, కేవలం ఏకవర్ణం మాత్రమే (ఇక్కడ వర్ణం స్వలాభానికి ప్రతీక) చూడగలిగే సాహిత్యాభిమానులనుంచి  రక్షించుకోవాల్సిన ఆవశ్యకత వుంది. సాహిత్యాన్ని ఇలాంటి మాఫియా ముఠాలు, వారి ప్రచ్చన్న సమర్థకుల కబంధ హస్తాల నుంచి తప్పించాల్సిన ఆవశ్యకత వుంది. ఇకనైనా ఈ క్రొత్త బృందం, గత బృందం నిర్ణయాలను పునస్సమీక్షించి, కనీసం రాబోయే అవార్డుల విషయంలోనైనా, ఇది మా నిర్ణయం అని ధైర్యంగా చెప్పి తమపై పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందుతారని ఆశించటం దురాశ కాదు కదా? ఇప్పటికే ఈ కొత్తవారి హయాంలో ఎవరెవరికి ఏయే అవార్డులొస్తాయో ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలో కాస్తయినా నిజాయితీ కనబరుస్తారని, ఏకవర్ణ దృష్టిని మెరుగుపరచుకుంటారని, వారికా సద్భుద్ధినివ్వాలనీ సరస్వతీమాతను ప్రార్థిస్తున్నారు సాహిత్యాభిమానులు.

ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు గమనించయినా అసలయిన ఉత్తమ సాహిత్యాభిమానులు తమ పెను నిద్దురను, ఉదాసీనతను వదలాల్సి వుంటుంది. ఒక పొరపాటు జరిగిందంటే, అందుకు కారణమయిన వారితో పాటూ మౌనంగా వున్నవారూ నేరస్థులే అన్న నిజాన్ని సాహిత్యాభిమానులూ, రచయితలూ గ్రహించాలి. కానీ, నిక్కచ్చిగా ప్రవర్తిస్తే ఇక భవిష్యత్తులో అవార్డులు రావేమో అన్న భయంతో రచయితలెందరో మౌనంగా వుండిపోతున్నారు. కానీ వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈనాడు వచ్చే అవార్డులకోసం పొరపాటును ఖండించకపోతే, భవిష్యత్తు తరాల ముందు నేరస్థులుగా నిలవాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here