శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రత్యేక సంపాదకీయం

3
10

[dropcap]సం[/dropcap]చిక పాఠకులండరికీ శ్రీ శోభకృత్ ఉగాది శుభాకాంక్షలు!!!!!

అయిదు సంవత్సరాల క్రితం ఉగాది రోజున ‘సంచిక’ తెలుగు సాహిత్య ప్రపంచంలో కళ్ళు తెరిచింది. కళ్ళల్లో తారకలతో, మనసు నిండా విశ్వాసంతో, తెలుగు సాహిత్యం పట్ల తీవ్రమైన అభిమానంతో ‘సంచిక’ ఆరంభమయింది. తెలుగు పత్రికలు మూతబడిపోతున్నాయి. తెలుగు పాఠకులు లేరు. తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్న సమయంలో, తెలుగు పాఠకులున్నారు, చక్కని రచనలందిస్తే ఆదరించి అక్కున చేర్చుకునే సహృదయులయిన సాహిత్యాభిమానులున్నారు అన్న విశ్వాసంతో పాఠకులను అలరించే రచనలందిస్తే పత్రికను ఆదరిస్తారన్న నమ్మకంతో ‘సంచిక’ను ఆరంభించాము. నిర్దిష్టమైన ప్రామాణికాలు ఏర్పరచుకున్నాము. ఎట్టి పరిస్తితులలో సాహిత్య విలువలతో రాజీ పడకూడదని, సత్యం చెప్పేందుకు జంకకూడదని, ఎవరెంత బాధపడ్డా నిష్ఠూరమైన నిజాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా పాఠకుల ముందుంచాలన్న నిశ్చయంతో ‘సంచిక’ ఆరంభమయింది. పాఠకులపై మా విశ్వాసం కానీ, మా ఆత్మవిశ్వాసం కానీ, ఈ అయిదు సంవత్సరాలలో త్రిగుణీకృతమైంది. నిజం చెప్పాలంటే, ఈ ఉగాదికి ‘సంచిక’ ఆత్మవిశ్వాసం అంబరాన్ని తాకుతూంటే, పాఠకుల విచక్షణపై విశ్వాసం అనంత అంతరిక్షం అంచులను దాటి ముందుకు దూకుతోంది. నాణ్యమైన రచనలను తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఈ అయిదు సంవత్సరాలలో సంచికకు పెరుగుతున్న పాఠకుల సంఖ్య నిరూపిస్తుంది. ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించి ఆదరించటంలో పాఠకులు ప్రదర్శిస్తున్న విజ్ఞతలో అణుమాత్రమైన సాహిత్య పెద్దలు, విమర్శకులు ప్రదర్శిస్తే తెలుగు సాహిత్యానికి మంచిరోజులు వచ్చినట్టే!!!

తెలుగు పత్రిక ప్రపంచంలో కొన్ని అపోహలు స్థిరపడి వున్నాయి. అలాంటి స్థిరపడ్డ అభిప్రాయాలన్నీ అపోహలని ఈ అయిదేళ్ళ కాలంలో సంచిక నిరూపించింది. పద్యాలకు కాలం చెల్లింది, పద్యాలు చదివే పాఠకులు లేరు అని తెలుగు పత్రికలు పద్యాలు ప్రచురించటం మానేశాయి. కానీ, తెలుగు సాహిత్యానికి గుర్తింపు సంతకం పద్యం అన్నది ‘సంచిక’ నమ్మిక. అందుకే వెతికి వెతికి మరీ పద్యాలు రాసే కవులతో పద్య కావ్యాలు రాయించి ప్రచురించాం. పద్యాలు, ఖండకావ్యాలు, శతకాలకు లభించిన పాఠకాదరణ విస్మయాన్ని కలిగించింది. పద్యాలు ప్రచురించటం మాని తెలుగు పత్రికలు తెలుగు సాహిత్యానికి, భాషకు, కవితా ప్రపంచానికి చేసిన అన్యాయం అర్థమయింది. పద్యాన్ని రాజకీయ రంగులతో చూసి, దానికి లేని మచ్చలను చూపి కొందరు కావాలని నెరపిన దౌష్ట్యం ఇది. ఒక్కరోజులో ఈ పొరపాటును సరిదిద్దటం కుదరదు. తన పరిమితుల్లో సంచిక పద్యాలకు ప్రోత్సాహాన్నివ్వాలని ప్రయత్నిస్తోంది.

నాటకాలు, నాటికలు ఒకప్పుడు సమాజంపై ప్రభావాన్ని చూపాయి. సాహిత్యంలో ప్రధాన స్థానాన్ని అనుభవించాయి. కానీ, సినిమా ప్రభావంతో నాటకాలకు కాలం చెల్లిందని, నాటకాలను పాఠకులు చదవరని పత్రికలు నాటకాలు ప్రచురించటం లేదు. కానీ, సంచిక నాటకాల రచయితలను సంప్రతించి వారు రచించిన నాటికలను ప్రచురిస్తోంది, ఈ నాటకాలు పాఠకాదరణను పొందుతున్నాయి.

అలాగే, పెద్ద కథలకు కాలం చెల్లిందని కథల నిడివి తగ్గించి, చివరకు ఏకవాక్య కథలు కూడా రంగ ప్రవేశం చేసిన కాలంలో నిడివితో పనిలేదని, రచన ఆకర్షణీయంగా వుంటే, రచనలో చదివించే గుణం వుంటే పాఠకులకు రచన నిడివి రచనను ఆదరించేందుకు ప్రతిబంధకం కాదని పెద్ద కథలను ప్రచురించింది, ఇంకా ప్రచురిస్తోంది ‘సంచిక’. ఆ కథలకు లభిస్తున్న పాఠకాదరణ ‘సంచిక’ విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తోంది. అవసరమయితే పెద్ద కథలను రెండు మూడు వారాలు సీరియల్‍గా కూడా ప్రచురిస్తోంది సంచిక. రచనలో పస వుంటే, నిడివి ఒక సమస్యకాదన్నది సంచిక నమ్మకం.

తెలుగు పత్రికలలో అధికంగా కనబడని విభిన్నమయిన రచనలు ‘సంచిక’లో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ ఫిక్షన్, డిటెక్టివ్ ఫిక్షన్ వంటి రచనలకు ‘సంచిక’ పెద్ద పీట వేస్తోంది. అంతే కాదు, అనేక విభిన్నమైన అంశాలను పరిచయం చేసే విశిష్టమయిన రచనలను అందిస్తోంది. అందుకే, ఇతర పత్రికలు అందించేటటువంటి రచనలు ‘సంచిక’ కూడా అందిస్తుంది. కానీ, ‘సంచిక’ అందించేటటువంటి రచనలు ఇతర ఏ పత్రికలోనూ లభించవన్నమాట సర్వత్ర వినబడుతోంది. ఒక నాణ్యమైన రచన చదవగానే ఇది ‘సంచిక’లో ప్రచురితమయిన రచన అని పాఠకులు గుర్తించగలుగుతున్నారంటేనే ‘సంచిక’ ఏ స్థాయిలో పాఠకుల విశ్వాసాన్ని చూరగొన్నదో తెలుస్తుంది. పాఠకులకు ‘సంచిక’పై వున్న విశ్వాసాన్ని పెంంచుకుంటూ, కొత్త పాఠకులను పెద్ద సంఖ్యలో ఆకర్షింఛాలని సంచిక ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే త్వరలో సంచిక ప్రత్యేక సాహిత్య సప్లిమెంట్‍ను ప్రారంభిస్తోంది. ప్రఖ్యాత నటుడు బల్‍రాజ్ సహ్ని నటన వైదుష్యాన్ని విశ్లేషించే వ్యాసపరంపరను ఆరంభిస్తోంది. అలాగే మాయా ఎంజెలో కవితలను తెలుగులోకి అనువదించి అందించే వినూత్నమయిన శీర్షిక ఆరంభమవుతోంది. దీనికి తోడుగా హిస్టారికల్ ఫిక్షన్ రచనల పరంపరను కొనసాగిస్తూ, బందా బహదూర్ జీవితం ఆధారంగా సృజించిన హిస్టారికల్ ఫిక్షన్ నవలను అందిస్తోంది సంచిక. సాహిత్య ప్రపంచంలో నెలకొని వున్న విద్వేష భావలనలను వ్యతిరేకిస్తూ త్వరలో ‘రామకథాసుధ’ రామ కథల సంకలనాన్ని వెలువరిస్తుంది ‘సంచిక’. ఈ రకంగా నాణ్యమయిన విభిన్నమయిన రచనలను అందిస్తూ, పాఠకులు అభినందించి, ఆదరించే అత్యుత్తమ రచనల ద్వారా తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదయిన ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నది ‘సంచిక’. విచ్ఛిన్నకరమైన ఆలోచనలు, విద్వేషాల విషాలు విస్తరించే విషబీజాల రచనల వంటివాటికి దూరంగా వుంటూనే, సమాజంలో ఉన్నతమయిన ఆలోచనలను, స్నేహ సౌభ్రాతృత్వ భావనలను వెదజల్లే రచనలను అందిస్తూ ముందుకు సాగుతోంది ‘సంచిక’.

తెలుగు సాహిత్య ప్రపంచంలో రచయితకు, రచనకు పెద్దపీట వేసే సత్సాంప్రదాయాన్ని ‘సంచిక’ అత్యంత నిష్ఠగా పాటిస్తుంది. ‘సంచిక’ దృష్టిలో రచయిత భగవంతుడికన్నా ఎక్కువ. సృష్టికి ప్రతి సృష్టిచేసే సృజనాత్మక సృష్టికారుడు రచయిత. అలాంటి సృజనాత్మక కళాకారుడికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది ‘సంచిక’. ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో సంపాదకులు, విమర్శకులుగా చలామణీ అయ్యేవారూ, రచయితను చిన్న చూపు చూడటం కనిపిస్తుంది. రచయిత రచనను ప్రచురించి రచయితను ఉద్ధరించినట్టు ప్రవర్తించటం, రచనను  సమీక్షించటం రచయితకు చేస్తున్న సహాయంగా భావించటం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ రచయితలెలా రాయలో, ఏం రాయాలో చెప్పి రచయిత కన్నా తమని ఉన్నతంగా భావించుకోవటం తెలుస్తుంది. కానీ, అందరికన్నా ఉన్నతుడు రచయిత అన్నది ‘సంచిక’ నమ్మకం. రచయిత రాయకపోతే సంపాదకులకు పనిలేదు. విమర్శకుడికి ఉనికి లేదు.  సాహిత్యం లేదు. కాబట్టి, రచయిత ఎవరికీ తలవంచాల్సిన పని లేదు. రచయిత నిరంకుశంగా తనకు నచ్చిన అంశాల ఆధారంగా, తనకు నచ్చిన రీతిలో రచించటం రచయిత హక్కు, అది రచయిత ధర్మం అని నమ్ముతుంది ‘సంచిక’. అందుకే రచయితలకు, రచనలకు ప్రాధాన్యం ఇస్తుంది ‘సంచిక’. ఈ సందర్భంగా అన్ని అపోహలను వదలుకుని తెలుగు రచయితలు ‘సంచిక’కు తమ రచనలను అందించి ‘సంచిక’ను మరింత పరిపుష్టం చేయాలని వినమ్రంగా రచయితలందరినీ అభ్యర్ధిస్తోంది ‘సంచిక’.

పక్షపాతంతో అనర్హమయిన రచనలకు అవార్డులిస్తూ, అనర్హులను అందలం ఎక్కిస్తూ, తక్కువ స్థాయి రచనలను ప్రామాణిక రచనలుగా చలామణీ చేస్తూ, సాహిత్యానికి అన్యాయం చేస్తున్న చర్యలకు ప్రతిగా ‘సంచిక’, రచయితలందరినీ ఏకత్రాటి మీదకు తెచ్చి, ఇతర సాహిత్య సంస్థలతో కలసి ఒక ప్రత్యేక సాహిత్య అకాడెమీ ఏర్పాటు చేసి, ఉత్తమ రచయితలకు గుర్తింపు, ఉత్తమ రచనలకు బహుమతులు ఇచ్చే పథకాలు వేస్తున్నది. ఆ పథకానికి శ్రీకారం ఈ ఉగాది చుడుతోంది. ఎలాగయితే తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రత్యామ్నాయ ఆలోచనలు వినిపించే స్వరాలకు వేదికగా ‘సంచిక’ ఎదుగుతోందో, అలాగే, సాహిత్య మాఫియా ముఠాల వల్ల సాహిత్యానికి కలుగుతున్న నష్టాన్ని పూడ్చి అసలయిన సాహిత్యానికి పెద్ద పీట వేసే ప్రయత్నాలనూ ఈ ఉగాది నుంచి ‘సంచిక’ ఆరంభిస్తోంది. ఇందుకు సాహిత్యాభిమానులు, పాఠకులు, రచయితలు తమ విలువయిన సలహాలూ, సూచనలూ, సహాయ సహకారాలను అందించాలని ’సంచిక’ అభ్యర్ధిస్తోంది, భవిష్యత్తు తరాలకు బంగారు సాహిత్యబాటను నిర్మించే ప్రయత్నాలలో తోడ్పడాలని వేడుకుంటోంది. Make it a better place for you and for me and the entire human race.. అన్న ఆకాంక్షను సాహిత్య ప్రపంచానికీ విస్తరించాలని ఆశిస్తోంది.

ఈ శోభకృత్ ఉగాది సందర్భంగా ‘సంచిక’లో ప్రత్యేకంగా ప్రచురితమవుతున్న రచనల వివరాలు:

కవితలు:

  • శోభకృత్‌కి స్వాగతం – శంకరప్రసాద్
  • 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు – మోటమఱ్ఱి సారధి
  • తెలుగు వారి ప్రియమైన పండుగ.. ఉగాది! – గొర్రెపాటి శ్రీను
  • ఏది ఉగాది?! – సముద్రాల హరికృష్ణ

కథ:

  • శిక్ష – శిక్షణ – దోనేపూడి శ్రీలక్ష్మి

సినిమా:

  • రంగస్థల నటునికి చివరికి మిగిలిన అంతరంగం – ‘రంగమార్తాండ’! – సినీ సమీక్ష – వేదాంతం శ్రీపతిశర్మ

అవీ ఇవీ:

  • ఇయర్‍హుక్ ఆడియో ఓటిటి 2023 ఉగాది కథల పోటీ ఫలితాలు – సంచిక టీమ్
  • 2023 ఉగాది కవిసమ్మేళనం – ప్రెస్ నోట్ – డా. భీంపల్లి శ్రీకాంత్

సంచికకి ఎప్పటిలానే మీ ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here