[‘నేను.. కస్తూర్‌బా ని’ అనే పుస్తకాన్ని వెలువరించిన శ్రీ చందకచర్ల రమేశ బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం చందకచర్ల రమేశ బాబు గారూ.
చందకచర్ల రమేశ బాబు: నమస్కారం.
~
ప్రశ్న 1. ‘కస్తూర్ బా’ జీవితగాథ ‘నాను.. కస్తూర్’ అనువదించే అవకాశం మీకెలా వచ్చింది? మూల రచనని ఒక పాఠకుడిగా ముందే చదివారా? లేక అనువాదం కోసం చదివారా?
జ: నాకు పరిచయమున్న ఒక కన్నడ రచయిత తను ఈ పుస్తకాన్ని తమిళంలోకి అనువాదిస్తూ నాకు పంపి, మీరు చదివి మీకు నచ్చితే తెలుగులోకి చేయండి అన్నారు. పుస్తకం చదివాక నాకు అందులో చెప్పిన పద్ధతి నచ్చింది. తెలుగులోకి అనువాదం చేయాలనుకుని మూల రచయిత్రిగారి అనుమతి పొంది ప్రారంభించాను.
ప్రశ్న 2. ‘నేను కస్తూర్ బా’ పుస్తకం అనువాదానికి అవకాశం వచ్చినప్పుడు ఓ కన్నడ పుస్తకాన్ని తెలుగులోకి తేవడంగా భావించారా లేక కస్తూర్ బా జీవితగాథలోని అంశాలు, వారి వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకర్షించి అనువాదానికి అంగీకరించారా?
“ప్రతి మనిషి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది” అనే సామెత మనందరం వినే ఉన్నాం. మరి ఇంతటి మహాత్ముడి వెనుక ఉన్న ఆడది కస్తూర్ గారు. గుజరాతీలో బా అంటే అమ్మ అని అర్థం. అందుకే ఆమె కస్తూర్ బా అని పిలవబడ్డారు. ఆమె గురించి తెలుసుకుందామని దొరికిన కొన్ని పుస్తకాలు చదివాను. ఆమె గురించి ఎక్కడో ఒక రెండు మూడు వాక్యాలు కనిపించాయే తప్ప ఆవిడ జీవిత చరిత్ర తెలుసుకోవడం కుదరలేదు. ఇలా ఉండగా కన్నడ పత్రికలో ప్రచురితమైన తమ అనువాద కథను నా స్నేహితులు శ్రీ నల్లతంబి గారు పంపి చదవమన్నారు. అది తమిళ కథ అనువాదం. కలైచెల్వి గారని, ఆవిడ రాసిన తమిళ కథను ఈయన కన్నడంలోకి అనువదించారు. నాకు ఆ కథ చాలా నచ్చి, నేను ఆవిడ అనుమతి తీసుకుని తెలుగులోకి చేశాను. అది కౌముది వెబ్ సంచికలో “మరణానికి ఒక నిముషం ముందు” అనే పేరుతో ప్రకటించబడింది. దాంతర్వాత నల్లతంబిగారు నాకు గాంధీగారి పైన ఉన్న గౌరవాన్ని గుర్తించి ఈ ‘నాను.. కస్తూర్’ పుస్తకాన్ని పంపారు, “చదివి మీరు తెలుగులోకి అనువదించగలరా” అని అడుగుతూ. దాన్ని చదివినాక నాకొక రకమైన సంతృప్తి కలిగింది. ఆమెను గురించిన అనేక విషయాలు తెలిసినట్టనిపించింది. నేను చేస్తాను అని చెప్పి మూల రచయిత్రిని మెయిల్ ద్వారా కలిసి ఆమె అనుమతి తీసుకుని మొదలెట్టాను.
ప్రశ్న 3. ‘కస్తూర్ బా’ జీవితగాథని కన్నడంలో రచించేందుకు డా. ఎచ్. ఎస్. అనుపమ చాలా పరిశోధన చేశారు. ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించేందుకు మీరెలా కృషి చేశారు? ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: అనువాదాలు చేసేవారి పని ఈ రకంగా సులభమే. అనువాదం అనుసృజనే కాబట్టి, ముడి సరుకు మీ ముందు ఉంటుంది. ఒక రకంగా కుక్డ్ ఫుడ్. దాన్ని అనువాదం చేసి ఈ భాష పాఠకులకు అందించడమే పని. మళ్ళీ ప్రత్యేక పరిశోధన చేయలేదు. జాగ్రత్తలంటే ఆమె కన్నడ భాషలో చెప్పిన విధంగానే చెప్పడానికి ప్రయత్నించాను. అనువాదం బాగుందంటూ ముందు మాట రాసిన ఓల్గా గారు, ప్రఖ్యాత రచయిత శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ గారు అన్నారు.
ప్రశ్న 4. ‘నేను కస్తూర్‌ని’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమై, పాఠకులని ఆకట్టుకుంది. డా. అనుపమ గారి కన్నడ మూల రచనకి పాఠకుల స్పందన ఎలా ఉంది? కన్నడంలో పుస్తకం పాఠకాదరణ పొందిందా?
జ: కన్నడంలో పుస్తకం చాలానే ప్రజాదరణ పొందింది. మొదట ముద్రణలో వేసిన ౨౦౦౦ ప్రతులు అమ్ముడు పోగా రెండో ముద్రణలో ౧౦౦౦ ప్రతులు వేయడం జరిగింది. రెండో ముద్రణలో అనుపమ గారు తనకు ఈ పుస్తకం గురించి వచ్చిన అనేక అభిప్రాయాలను పంచుకున్నారు. రాసినవారిలో ప్రముఖ రచయితలు, రచయిత్రులు, విలేకరులు, విమర్శకులు, విశ్లేషకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠకులు ఉన్నారు. పుటల కొద్దీ తమ ప్రశంసలను, విశ్లేషణలను ఆమె ఆ ముద్రణలో మన ముందుకు తెచ్చారు. ఒకామె ఇలాగే బాబా సాహెబ్ గారి భార్యగారైన రమాబాయిగారి గురించి రాయాలని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కాక. ఒక్క సంవత్సరం అవధిలోనే మొదట వేసిన ౨౦౦౦ కాపీలు అమ్ముడు పోయి, మరుముద్రణకు (౧౦౦౦ కాపీలు) నోచుకోవడం కూడా పుస్తకం పొందిన ఆదరణకు నిదర్శనం అనుకోవచ్చు.
ప్రశ్న 5. ‘నాను.. కస్తూర్’ కన్నడ పుస్తకం ఆంగ్లం లోకి గాని, ఇతర భారతీయ భాషలోకి అనువాదమైనదా?
జ: తెలుగు కాక తమిళంలో అనువదింపబడింది.
ప్రశ్న 6. ‘నాను.. కస్తూర్’ తెలుగు అనువాదంలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? బాగా కుదిరాయనకున్న వాక్యాలో పేరాలో ఉండి అనువాదకుడిగా మీకు తృప్తిని కలిగించాయా?
జ: అనువాదానికి చాలా వీలుగా ఉన్న భాష వాడారు అనుపమ గారు. నేను కూడా వీలున్నంతవరకూ సరైన పదాలు వాడుతూ పోయాను. కొన్ని చోట్ల సమానమైన పదాలు దొరక్క కష్టపడ్డదీ ఉంది. కానీ మొత్తం మీద నవల అనువాదం నాకు తృప్తికరంగా అనిపించింది.
నచ్చిన అంశం అంటే కస్తూర్ బా గారు అన్న మాట. “అమ్మగానూ, సోదరిగానూ, భార్యగానూ, కూతురుగానూ ఏమున్నా ఆమె ఆడది. ఇంతవరకూ నువ్వు విన్నది ఒక ఆడదాని కథ.” ఇంకోటి. ఆమె అంటుంది – “చివరికి బాపు ఎంత ఎత్తు ఎదిగారంటే నా కొలతకు అందనంత. నా పోట్లాట అంతా ఆయన నీడతోనే అన్నట్టు.” ఇంకోచోట “బాపు దేశం కోసం అన్నిటినీ త్యజించారు. నేను బాపునే ఇచ్చాను. అందుకే బాపు బాపునే, బా బానే. కదూ ?” అని. ఈ వాక్యాలు, దాని సందర్భాలు నన్ను చాలా కదిలించాయి, ప్రభావితం చేశాయి కూడా.
ప్రశ్న 7. “వినే ఒక ఆప్త ప్రాణి ఎదుట తన జీవిత వివరాలను విప్పి చెప్తూ పోయిన పెద్దావిడ మాట్లాడే ధోరణిలో నా రచనను మార్చాను” అన్నారు మూల రచయిత్రి ఈ రచన నేపథ్యాన్ని వివరిస్తూ. మూల రచయిత్రి శైలితో గాని, ఆమె చెప్పిన అంశాలతోగాని అనువాదకుడిగా విభేదించవలసిన అవసరం మీకెదురయిందా?
జ: అనుపమగారు తమ మాటగా రాసిన మాటలో ఆత్మచరిత్ర ఎలా రాయాలో అన్న సందిగ్ధత గురించి రాశారు. నేరుగా రాస్తూ పోయి చూడగా అది పూర్తిగా బాపు, స్వాతంత్ర సంగ్రామ చరిత్రగా మారిపోయినట్టు అనిపించి దాన్ని మొత్తంగా చెరిపేసి నవలలో రాసిన విధంగా రాశానన్నారు. నాకు కూడా అలా చెప్పిన విధానం నచ్చింది. ఆత్మీయంగా అనిపించింది.
అన్ని అంశాలు ఆమె చెప్పదలచుకున్న విషయానికి సంబంధించినవే ఉన్నట్టు కనిపించింది. శైలి కూడా నేను అనువదించడానికి సౌకర్యంగానే ఉండింది. ఆమె రాసిన శైలితో గాని, చెప్పిన అంశాలతోగాని విభేదించవలసిన అవసరం ఎదురవ్వలేదు.
ప్రశ్న 8. ఈ అనువాదంలో ఏవైనా భాషాపరమైనా, ఇతర ఇబ్బందులు ఎదుర్కున్నారా? ఎదుర్కుంటే వాటిని ఎలా పరిష్కరించుకున్నారు?
జ: ఇబ్బందులంటే విశేషంగా ఏమీ లేవు. కానీ అనువాదం చేసేటప్పుడు ప్రతి అనువాదకుడికీ ఎదురయ్యే కష్టాలు మాత్రం చాలానే ఎదురయ్యాయి. కన్నడ భాషలో వాడిన పదాలకు సమానమైన తెలుగు పదాలు వెతకుతున్నప్పుడు ఒక భారీ పదం వాడితే అది పాఠకులకు ఎంతవరకూ అర్థమవుతుంది అనే ఆలోచన. అప్పటికీ అదే అర్థం వచ్చే మరో తేలిక పదం వాడడం జరిగింది. ముందుమాటలో ఓల్గా గారు కూడా ఆ మాట అన్నారు. పదం కరెక్టే, అది సమాన పదమే కానీ భారీ అనిపిస్తుంది. అలాంటి చోట్ల కష్టపడడం జరిగింది. ఒక చోట ‘విసర్జించేద్దాం’ అనే పదానికి సరిపడా తేలిక పదం కోసం సలహా తీసుకోవడం కూడా జరిగింది. చివరికి ‘వదిలేసుకుందాం’ అనే పదానికి సర్దుకున్నాం. కానీ ఇప్పటికీ నాకు ఈ పదం’ విసర్జించేద్దాం పదం ఇచ్చే అర్థం వస్తుందని పూర్తిగా అనిపించడం లేదు.
ప్రశ్న 9. కస్తూర్‍బా జీవితం ప్రాసంగిత నేటి తరంవారిపై ఎలా ఉంటుంది? ఆవిడ జీవితం నేటి తరం పాఠకులను ఏ రకంగా ప్రభావితం చేయవచ్చని మీరు భావిస్తున్నారు?
జ: ఈ దశాబ్దంలో కలిగిన సాంస్కృతిక చైతన్యం వలన యువతలో, మరీ ప్రత్యేకంగా యువతులలో మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. మన దేశ చరిత్రలో సమాజం పట్ల తమ సేవలను అందించిన మహిళల పట్ల గౌరవం కూడా పెరుగుతోంది. ఈ సందర్భంలో కస్తూర్ బా గారి జీవిత చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తి వీళ్ళలో కలగవచ్చు అని నా భావన. ఆమె జీవిత చరిత్రలో ఆమె ఎంత తన భర్త అడుగుజాడలలో నడిచినా, అక్కడక్కడ ఆమె తిరుగుబాటు చేసిన సందర్భాలున్నాయి. బయట ఎంత ఆయన మహాత్ముడనిపించుకున్నా, ఆమెకయితే భర్తే. ఆయన నిర్దేశించిన కొన్ని నియమాలను ఆమె వాదించి ఒప్పుకున్న సంఘటనలు పుస్తకంలో ఉన్నాయి. వీటిని చదవడం వలన నేటి తరం యువతులు కూడా కేవలం మగజాతి పట్ల నిర్లక్ష్యం, కోపం కలగజేసుకోకుండా ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించి ఒప్పుకోవడమా లేదా వాదించి ఒప్పుకోవడమా లేదా తిరస్కరించడమా అన్నది అలవాటు చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఎలాగూ పెద్ద వయసువాళ్ళు తప్పకుండా ఆమె గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారన్నది నమ్మకం.
ప్రశ్న 10. ఈ జీవితగాథని తెలుగులో అనువదించడానికి ఎంత కాలం పట్టింది? ‘నేను కస్తూర్బాని’ పుస్తకం రూపంలో తీసుకురావడంలోని అనుభవాలేవైనా పంచుకుంటారా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?
జ: ఈ జీవితగాథను అనువందించడానికి నాకు ౫ నెలలు పట్టింది. పుస్తక రూపంలోకి తీసుకురావడానికి సంవత్సరం పైనే పట్టింది.
ఈ పుస్తకాన్ని ప్రకటించిన ఛాయా రిసోర్సెస్ సెంటర్ వాళ్ళు బాగానే ప్రచారం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి నెలలో వస్తున్న బుక్ ఫేర్‌లో తమ స్టాల్‌లో ఈ పుస్తకాన్ని ఉంచుతున్నారు. ఈ పుస్తకాన్ని అమెజాన్‌లో కూడా దొరికేలా చేశారు. సోషల్ మీడియాలలో కూడా దీని గురించి ప్రకటన చేస్తున్నారు. నేను కూడా నా సోషల్ మీడియాలలో పంచుకోవడం జరిగింది. పాఠకుల నుండి మంచి స్పందన రావచ్చు అనిపిస్తుంది.
ప్రశ్న 11. రచయితగా, అనువాదకుడిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: నా నేచర్ ఎలాంటిది అంటే ఎవరైనా తన నవలనో కథా సంకలనమో ఇచ్చి దీన్ని అనువదించి పెట్టండి అంటే గుడ్డిగా దాన్ని చేయడానికి ఒప్పుకోను. చదివి నాకు నచ్చితే మాత్రమే చేస్తాను. ౨౦౦౧ నుండి కన్నడ భాష కథలు అనువాదం చేస్తున్నాను. నచ్చిన కథకు ఎలాగైనా కష్టపడి అనుమతి సంపాదించి, అనువాదం చేసి పంపేవాణ్ణి. ఇదే ధోరణి కొనసాగిస్తాను. అనువాదమే నా పట్టు. స్వంత కథలను అల్లలేను. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ఒక హిందీ పుస్తకం ‘సహేలి’ని తెలుగుకు అనువదించాను. అలాగే కన్నడం నుండి కానీ, హిందీ నుండి కాని కొన్ని మంచి కృతులను తెలుగు పాఠకులకు అందించాలనే తపనైతే ఉంది. చూద్దాం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రమేశ బాబు గారూ.
రమేశ బాబు: ధన్యవాదాలు, నమస్కారం.
***
కన్నడం: డా. ఎచ్. ఎస్. అనుపమ, తెలుగు: చందకచర్ల రమేశ బాబు
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్.
పేజీలు: 222
వెల: ₹ 250/-
ప్రతులకు:
ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్. 9848023384
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000413413
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/NENU-KASTURBAA-NI-Dr-ANUPAMA/dp/B0CR1MFJM8
~
‘నేను.. కస్తూర్‌బా ని’ పుస్తకం సమీక్ష
https://sanchika.com/nenu-kasturubaa-ni-book-review-kss/