[‘చివరి వలస’ అనే కథా సంపుటిని వెలువరించిన డా. సి. భవానీదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. సి. భవానీదేవి గారూ.
డా. సి. భవానీదేవి: నమస్తే.
~
జ: నిజమే! “గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అని కవివాక్కు. మన దేశం ఈ 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంగా అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించింది. ఆ అభివృద్ధి సాధనలో మనిషి యంత్రంగా మారి డబ్బు ముద్రించే మరో యంత్రంగా మారిపోయాడు. ‘Time is money’ కి సరి అయిన ఉదాహరణగా నిలిచాడు. ఒక మనిషి మరో మనిషిని పలకరించినా, అభివాదం చేసినా అతనికి ఆ మరో మనిషి వల్ల ఏదో లబ్ధి చేకూరాల్సే ఉంటుంది. లేకపోతే తెలిసినవాళ్ళు కూడా అపరిచితులౌతారు. వృద్ధులనైతే కుటుంబ సభ్యులే పలకరించరు. వస్తు సంస్కృతి పట్ల మోజు, డబ్బు పట్ల మితిమీరిన క్రేజులో మనిషి ఎటు పోతున్నాడో తెలియని ఈ కాలంలో మనిషి మనిషిగా మనగలగాలని నా ఆకాంక్ష. అందుకే మానవ సమాజం ఇప్పటి కంటే ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షిస్తాను. ఈ భావాన్ని అంటే మాయమౌతున్న మానవీయత గురించి నా అనేక కథల్లో ప్రస్తావించాను. నా తొలి కథ ‘మారని ఆంతర్యం’ (స్వాతి మాసపత్రిక, 1973) లో కూడా ఇదే ఇతివృత్తం. మనిషి కంటే డబ్బుని ప్రేమించే లక్షణం సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ డబ్బు కోసం, దాని ద్వారా లభించే అధికారం, పలుకుబడి, హోదా కోసం మనిషి ఎన్ని దురాగతాలైనా చేస్తున్నాడు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం, సామ్రాజ్యవాదం, కులాహంకారం, వ్యక్తిగత దురహంకారం.. ఇలా రకరకాల అహంకార ప్రవృత్తికి ధనం దోహదపడుతుంది. ఈ క్రమంలో మానవత్వం అనేది మరుగున పడిపోతున్నది. మనిషికి మరో మనిషిని చూస్తే జడుపు పుడుతోంది. నమ్మకం కలగటం లేదు. కుటుంబంలో, సంఘంలో మానవ సంబంధాలన్నీ క్రమంగా పూర్తిగా ఆర్థిక సంబంధాలౌతున్నాయి. మరో దుర్మారం మోసం చేయటం. శ్రీరాముడు ఒక్కమాట కోసం అడవికి వెళ్ళాడు, రాజ్యాన్ని పరిత్యజించాడు. మరి ఇప్పుడు మాటకు విలువుందా? నిలబెట్టుకునే వాళ్ళెంత మంది? ప్రామిసరీ నోటు అనే మాటకున్న అర్థం ఏమయిపోయింది? వీటన్నిటికీ మూలం పాఠశాల విద్య నుంచి నైతిక విలువలు నేర్పకపోవటం. భాష, సైన్సు, సోషల్ కాదు, ‘man making education’ మనిషిని మనిషిగా ఎదిగించే విద్య నేర్పుతున్నారా అని ప్రశ్నించుకోవాలి. నా కథలన్నీ మానవత్వం తిరిగి శ్వాసించాలనీ, మనం కోల్పోతున్న ఆ ప్రధాన విలువన్ని నిలబెట్టుకోవాలనే రాసినవే!
‘చివరి వలస’ కథాసంపుటిలో ‘రాతిలో తేమ’, ‘మరణ గౌరవం’ ఇలాంటి కథలన్నింటిలో నా ఆవేదన బలంగా వెలిబుచ్చాను. ఇది నా ఒక్కదాని ఆవేదన కాదు. మొత్తం సమాజం లోది. ఒక వ్యక్తిని, లేదా తల్లిని మనం ఎంత హీనంగా చూస్తున్నాం, ఆమె లేనిదే మనం లేము కదా! ఆమె మరణించాక మిగిలిన కర్మకాండ గొప్పగా చేసి, ప్రదర్శనగా సమాజం ముందు చూపటం నిజంగా ఆమె పట్ల ప్రేమ ఉండి కాదు కదా! ఆ ప్రేమే ఉంటే ఆమె జీవించి ఉన్నప్పుడే వ్యక్తం చేయాలి. మరణించాక పలు విధాలుగా చేసే ‘షో’లు చాలా చూస్తున్నాం. అదీ చేయని వాళ్లు ఇంకా ధన్యులు! అన్నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అయినప్పుడు ఇంక మనిషికీ మనిషికే మధ్య మిగులుతున్నదేంటి? గతంలో నేను రాసిన ‘స్నేహం ఖరీదు’ కూడా అలాంటిదే! స్నేహం పేరుతో కూడా జరిగే మోసాలు డబ్బు కోసమే అవుతున్నాయి.
ప్రశ్న 2. మీరు తొలి కథ ప్రచురించినప్పటి నుంచి ఇప్పటి వరకూ – దాదాపు అయిదు దశాబ్దాలకి మించిన కాలవ్యవధిలో కథా సాహిత్యంలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటి? మీ దృష్టిలో అది సానుకూల మార్పా, ప్రతికూల మార్పా?
జ: నా తొలి కథ ‘మారని అంతర్యం’ 1972 సం॥లో బరంపురం లోని ‘వికాసం’ సంస్థ వారి పోటీలలో ప్రథమ బహుమతి పొంది స్వాతి మాస పత్రికలో 1973లో ప్రచురితమైంది. అది ఒక వికలాంగుని కథ. ఆ దివ్యాంగుడ్ని ఒక ప్రదర్శనా వస్తువుగా సమాజం ముందు ప్రదర్శించి ఆ అభాగ్యుడు చేసే విన్యాసాలు సాధనంగా డబ్బు సంపాదించే వ్యక్తి పట్ల అసహ్యం కలుగుతుంది.. ఆ యజమానికి అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి.
దానికన్నా అతడు కష్టించి పనిచేసి ఆ దివ్యాంగుడ్ని బాగా చూసుకోవచ్చు. కానీ కష్టించి పనిచేయటం చాలా కష్టం. అయాచితంగా ఇతరుల కష్టాన్ని దీచుకోవటం మనిషి నైజంగా మారిందనే నా ఆవేదన.
నేను తొలికథ ప్రచురించినప్పటి నుండీ ఇప్పటి వరకూ దాదాపు అయిదు దశాబ్దాలకు మించిన కాలవ్యవధిలో కథా సాహిత్యంలో వచ్చిన ప్రధానమైన మార్పు కథ కథానికగా మారటం. అంటే గతంలో కథ ప్రచురించినప్పుడు దాదాపు 10 పేజీలకు తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు కథ 2, 3 పేజీలకు మించి ఉండటంలేదు. అంటే రచయితలే అలా రాస్తున్నారని కాదు, పత్రికలు వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి పేజీలు, అంశాల గురించి నిబంధన లేదా పరిమితి విధిస్తున్నాయి. మరో మార్పు భాష. దాదాపు 50, 40 సంవత్సరాలకు ముందున్న కథల్లో భాష తెలుగులోనే ఉండేది. ఇప్పటి కథల్లో ఇంగ్లీషు ఎక్కువైంది. ఇది మనకు చలన చిత్రాల విషయంలో కూడా కనిపిస్తుంది
కథా ప్రారంభం ఒక దృశ్యం కానీ, ప్రకృతి వర్ణనతోగానీ ఉండేది. ఇప్పుడు నేరుగా కథలోకి ఒక సంబోధన, సంఘటన, డైలాగ్ ద్వారా ప్రవేశించడం జరుగుతున్నది. నాటి కథల్లో నైతిక విలువలు, మనిషి బలహీనతలు, సమాజ రుగ్మతలు ముఖ్యాంశాలు. కథ రాశారంటే ఒక సందేశం, తాత్త్వికతతో ఆలోచింపచేసేవి.. గుర్తుండి పోయేవి. ఇప్పుడు వెలువడుతున్నవి చాలా వరకు కాలక్షేపం కథలు. కథా నిర్మాణ శిల్పం, కథనం పట్ల ఎటువంటి అవగాహన లేకుండా – ఒక వార్తనూ, సంఘటననూ యథాతథంగా రాస్తున్నారు. ముగింపు, నాటి కథల్లో పాఠకుల్లో ఆనందాన్ని, ఆలోచననీ కలిగించేది. ఇప్పుడు అంత విలువైన ముగింపులు లేవు. కొందరు ఓ.హెన్రీ లాగా బలవంతపు ‘కొసమెరుపు’తో రాసున్నారు. కథ శాశ్వతంగా గుర్తుండాలంటే నిలబడాలంటే నిడివి పరిమితి ఉండకూడదు. ‘అంశం’ నిబంధన ఉండకూడదు.
వీలయినంత ఇంగ్లీషు లేదా పర భాషా పదాలు పరిహరించాలి. కథ కథలా మిగలకూడదు. అది జీవితాన్ని మంచి వైపు, మెరుగయిన సమాజం వైపు మరలించటానికి దోహదపడాలి. నా దృష్టిలో ఇప్పటి కథల పరిణామం కొంత ప్రతికూల మార్పే. వేగంగా పరుగెడుతున్న సమాజావసరాన్ని బట్టి కాలమ్ కథలు, 99 సెకన్ల కథలు, మినీ కథలు, కార్డు కథలు వస్తున్నాయి. కానీ రచయిత స్వేచ్ఛకు ఇవి అవరోధాలు. పాఠకులకు చదివే సమయం లేదని కథని ఇలా కుదించటం న్యాయం కాదు. రచయిత తాను శిల్పీకరించుకునే కథకు తగిన స్థానం ఖచ్చితంగా ఇవ్వటం వల్ల గొప్ప కథలు వస్తాయని నా అభిప్రాయం. గత కథా కాలం లోంచి ఇప్పటికీ మనం ఉటంకించే కథలు ఇలాంటివే!
చెప్పులు, విషాదం, ఆమె విముక్తి, కమ్మతెమ్మెర, రాతిలో తేమ, గాలివాన ఇలాంటి ఎందుకు గుర్తున్నాయంటే ఆ కథల్లోని మానవీయ తాత్విక మూలాలే! కళ్ళల్లో చెమ్మ, మనసు తడి, జ్వరం రేకెత్తించే కథలు తెలుగు సాహిత్యంలో అనేకం ఉన్నాయి.
ప్రశ్న 3. ఈ కథాసంపుటిలోని 15 కథల్లో ఏ కథలని ఒక్కో దశాబ్దానికి ప్రాతినిధ్య కథలుగా పరిగణించవచ్చు?
జ: ‘చివరి వలస’ కధలన్నీ ఒకే దశాబ్దంలో రాసినవి. ఇవి ఆ దశాబ్దానికే ప్రాతినిధ్యం వహిస్తాయి. కొన్ని కథల్లో గత దశాబ్దాల ఆలోచనల పరిణామాలు పరివర్తనాలు కన్పిస్తాయి. ఉదా. ‘వచ్చే జన్మకయినా’ అనే కథ. ‘స్పర్శ’ అనే కథ గత కాలంలో 50 ఏళ్ళు నుంచి తీసుకుంటే రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని నేటి పరిస్థితితో పోల్చి రాసింది. ‘అపుత్రికస్య..’ గత దశాబ్దపు ప్రాతినిధ్యపు కథ. ‘రెండో జీవితం’ వర్తమాన దశాబ్దపు కథ. ‘బతుకాట’ కూడా అంతే! తల్లిదండ్రుల్ని కూడా నిర్వీర్యం చేయగల పిల్లలు ఎక్కువౌతున్నారు. అది ఈ పదేళ్ళ కాలంలో చాలా పెరిగింది. ‘తోడొకరుండిన’ కథ కూడా గత దశాబ్దపు కథే!
కానీ నేను రాసేటప్పుడు దశాబ్దపు ప్రాతినిధ్యం అని ఆలోచించి రాయలేదు. సమాజం, అందులోని పాత్రలు, సంఘర్షణలు, సమస్యలు నా కథల్లో ప్రతిబింబించాయి. వాటి రూపాలు మారవచ్చు. కానీ సమస్యలు, సంఘర్షణలు సరికొత్త రూపాల్లో ఎప్పుడూ వస్తుంటాయి. అహంకారం, డబ్బు వీటికి మూల కారణాలని నాకనిపిస్తుంది.
ప్రశ్న 4. సాధారణంగా రచయిత జీవితంలోంచి రచనలు వస్తాయంటారు. ఈ కథలకూ మీ జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధం ఏమైనా వుందా? ఈ 50 ఏళ్ళ కాలంలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకున్నారా?
జ: ‘చివరి వలస’ కథా సంపుటి లోని కథలకు నేను చూసినవి, విన్నవి, నా అనుభవాలు, అన్నీ ప్రేరణలే! నేను లీగడ్ ఎయిడ్ కౌన్సిలింగ్ సభ్యురాలిగా ఉన్నప్పుడు వివిధ వయస్సుల, వర్గాలకు చెందిన స్త్రీల జీవితాలను దగ్గరగా చూశాను. నా కథల మూలాంశాలు కొన్ని అలాంటి జీవితాల ప్రభావమే! 60 ఏళ్ళు దాటిన మహిళకు కూడా భర్త ద్రోహం చేస్తే ఆమె ఏం చేయగలదు. జీవిత కాలం చాకిరీని ఉచితంగా వేసిన భార్యకు ఒకనాడైనా ప్రేమగా కృతజ్ఞతలు పరోక్షంగా నైనా చెప్పని భర్త గురించి భార్య ఏమని భావిస్తుంది (అనురాగ స్మృతి- గత సంపుటిలోనిది)? ఇవన్నీ ఆర్థికంగా భర్తపై ఆధారపడిన మహిళల సమస్యలు, మనోభావాలు.
మరి చదివి ఉద్యోగినిగా ఆర్థిక స్వావలంబన ఉందనుకుంటున్న మహిళలకు నిజంగా ప్రశాంత జీవితం ఉందా? ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ఉద్యోగినీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నప్పుడు ఉద్యోగినుల సమస్యలు, లైంగిక వేధింపులు, అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు అనివార్యంగా పని ఒత్తిడి వల్ల ఒక గంట ఆలస్యంగా ఇంటికి వెళ్తే అనుమానించే అత్త, భర్త; కూతురి పెళ్ళి చెస్తే ఎదుర్కోనే పీడన, భర్త తన అనుమతి లేకుండా రహస్యంగా రెండో పెళ్ళి చేసుకోవటం, తన పెళ్ళినాటికే భర్తకి ఇద్దరు భార్యలుంటే భరించలేని బాధతో హుస్సేన్ సాగర్‌లో దూకేసిన సోదరి.. ఇలా ఎన్నెన్నో విషాద గాథలు. ఇవన్నీ నా చుట్టూ ఉన్న కుటుంబాలు, సమాజం లోనివే! నా కథలకు ప్రేరణ ఇవే! మూలం ఇలాంటివి అయినా కల్పనను జోడించి పాత్రల స్వభావాన్ని వ్యక్తపరిచి ఎటువంటి ముగింపు వల్ల అలాంటి స్త్రీలు చైతన్యవంతమౌతారో, కథలో చూపించాను.
నా కథలకీ, నా వ్యక్తిత్వానికీ, జీవితానికీ సంబంధం లేదని చెప్పలేను. నేను, నా కుటుంబం, సమాజంలో భాగంగా ఉన్నాము. నా జీవితంలో ఎదుర్కునే సంఘటనలు కూడా ప్రేరకాలే! ఉదాహరణకి అనాథ అయిన మా అమ్మ జీవితాన్ని ఆమె వైపు నించి ఆలోచించి రాసిన కథలున్నాయి. ఎవరినైనా మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలనేది నా స్వభావం. అప్పుడే కొంతయినా వాళ్ళ బాధ మనకి తెలుస్తుంది. దీనికి మహాభారతంలోని ‘ఒరులేయని యొనరించిన’ పద్యభావం ఉదాహరణ. ఒడ్డున కూర్చుని చూసేవారికి, నీళ్ళల్ల మునకలేసే వాడి బాధ ఏమర్థమౌతుంది! మరో విషయం ఏమంటే నా కథలు విషాదాంతాలు కావు. ఆశాజనకమైన శక్తిని ఇంధనంగా అందించే అక్షర దీపాలు.
ప్రశ్న 5. ఈ కథాసంపుటి లోని కథలు తొలిసారిగా ప్రచురితమైన తేదీలు/ప్రచురించిన పత్రికల పేర్లు ఇవ్వలేదు. అందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అలా ఇచ్చి ఉంటే కాలక్రమంలో సమాజంలోనూ, రచయిత్రి లోను వచ్చిన మార్పులను పాఠకులు/విశ్లేషకులు గ్రహించే వీలు ఉండేది. పరిశోధకులకు కూడా ఉపయుక్తంగా ఉండేది కదా. లేక, ఈ కథల ఇతివృత్తాలు సర్వకాలికమైనవని, ఏ కాలానికైనా వర్తిస్తాయని మీరు భావించారా?
జ: ఈ కథాసంపుటి లోని కథలు తొలిసారిగా ప్రేచురితమైన తేదీలు, ప్రచరించిన పత్రికల పేర్లు ఇవ్వకపోవటానికి ప్రత్యేకించి కారణమేమీ లేదు. గతంలో వెలువడిన మూడు సంపుటాల్లో ఆ వివరాలు ప్రతి కథకూ ఇవ్వటం జరిగింది. మీ సూచన ఇక ముందు కొనసాగుతుంది.
ఈ కథల ఇతివృత్తాలు సర్వకాలీనమైనవని భావిస్తున్నాను. అయితే ఈ భావన వల్ల కథ ప్రచురితమైన తేదీ, ప్రచరించిన పత్రిక వివరాలు ఇవ్వకుండా ఉండక్కర్లేదు.
ప్రశ్న 6. ఈ విశేష సంపుటి కోసం కథలను ఎలా ఎంచుకున్నారు? కథలను ప్రస్తుతం అమర్చిన క్రమంలోనే ఇవ్వడానికి ఏదైనా కారణం ఉందా లేక యాదృచ్ఛిక అమరికనా?
జ: కథాక్రమానికి ఏ కారణం లేదు. యాదృచ్ఛికమైన అమరిక అది.
ప్రశ్న 7. వ్యక్తిగతంగా ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందుకు?
జ: వ్యక్తిగతంగా ఈ సంపుటిలో నాకు నచ్చిన కథ ‘మరణ గౌరవం’. ఇది నవ్య వార పత్రికలో ప్రచురితం. మా అమ్మాయి డా. హిమబిందు వైద్యురాలిగా యు.కె.లో ఉంది. తను నాతో యు.కె.లో వృద్ధుల కందించే వైద్యసేవలు, ఆదరణ, ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించే విధానం వివరించినప్పుడు మన దేశంలో వృద్ధుల పరిస్థితి గుర్తొచ్చి వేదన చెందాను. కుటుంబంలోని వృద్ధుల పట్ల ఎంతో ఏహ్యతను, నిరాదరణనూ, నిర్లక్ష్యాన్ని కన్పరచినవాళ్ళే ఆ వృద్దులు కాలం చేశాక తమ వ్యక్తిగత పరపతికి వృద్ధుల చావుని వాడుకుంటూ ‘షో’ చేయటం చూశాను. మానవత మరిచి వికృతంగా ప్రవర్తించే అలాంటి వ్యక్తులను చూసి రాసిన కథ ఇది. మనుషుల్ని గౌరవించి ప్రేమించలేని వాళ్ళు తమ వాళ్ళు మరణించిన తర్వాత ఆడంబరంగా, ఎంత అట్టహాసంగా కర్మకాండలు మొదలైనవి ప్రదర్శన కోసం, సమాజం దృష్టిలో గొప్పగా అనిపించుకోవటానికి చేయటం చూస్తుంటే వెగటు పుడుతుంది. తల్లికి ఆమె బతికుండగా, వృద్ధురాలైన తర్వాత ఒక పూటయినా ఒక్క ముద్దయినా పెట్టని వాళ్ళు ఆమె మరణించాక పిండాలను అందంగా, ఆర్భాటంగా చేయటం దేనికి? ఇదే ఆలోచిస్తే వృద్ధాశ్రమాల్లో అమ్మ లెందుకుంటారు. ఆ సంస్కృతి ఎందుకు పెరుగుతున్నదో తెలుస్తుంది.
ప్రశ్న 8. ఈ కథాసంపుటిలోని ఎక్కువ కథలు ప్రధానంగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగినవే. చివరి కథ ‘ఎవరో ఏదో చేస్తారని..’ మాత్రం ఆర్భాటపు సాహితీవేత్తలు/సాహితీసంస్థలపై అధిక్షేపంలా అనిపిస్తోంది. దీన్ని మీ సాహితీయానంలో మీరు గమనించిన పరిణామంగా తీసుకోవచ్చా?
జ: ఈ సంపుటి లోని చాలా కథలు ప్రధానంగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగినవే. మీరన్నట్లు, ‘ఎవరో ఏదో చేస్తారని’ కథ – సాహితీవేత్తలు, సాహితీ సంస్థలు, కల్చరల్ వల్చర్ల గురించి రాసింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ సాహితీ సాంస్కృతిక సంస్థల పేరుతో.. కీర్తి కోసం, డబ్బు కోసం, పరపతి కోసం వెంపర్లాడుతున్న సంస్థల్లో – సంస్కృతీ, సాహితీ సేవ మచ్చుకైనా కనిపించదు. అది ఇంకొక ‘షో’. నేను చాలా సాంస్కృతిక సంస్థలతో పనిచేశాను. చాలా వరకూ అలాగే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వదిలేసి ఇలాంటి సంస్థలు నడపటం కేవలం సేవా భావంతో అంటే – వాళ్ళ జీవన శైలి. సంపాదించిన ఆస్తులు గమనిస్తే కేవలం అది ఒక ముసుగు మాత్రమే! “ఒక దండ పడేస్తే ఆయనకి చాలు”; “నా సంస్థ బ్యానర్‌కి ఇంత ఇవ్వాలి”, “అన్నీ మీరే భరించాలి” అన్నప్పుడు ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యానర్‌ని అమ్ముకునే దురదృష్టకర సంస్కృతి! కొందరు కవులకి వేదికల ఆరాటం. దానిని సంస్థలు వాడుకుంటాయి. డబ్బులు వసూలు వేసి అవార్డుల పేరుతో ఒక చెక్క ముక్క, నాసిరకం శాలువాను మందలకు అందించి ఫోటోలు దిగి ఒక లంకె పత్రికకు పంపి ప్రచురింప జేస్తారు. ఆ ఫోటో చూసుకుని మురిసిపోయే కవుల సంఖ్యకి కొదువలేదు. అనాదిగా కవులు, రచయితలు రాజాశ్రయంలో ఎదిగారు. కాలం మారింది. ప్రభుత్వాలకి తిట్టుకోవటానికి తప్ప తెలుగు భాషా సాహిత్యాలు అంటరానివి. అందువల్ల కొందరు రచయితలు అవకాశాల కోసం సంస్థలను ఆశ్రయిస్తారు. దీనిని ఆయా సంస్ధలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. నా జీవితంలో అనేక సంస్థల్ని ఇలా చూశాను. అదృష్టం ఏమిటంటే గుర్తించి దూరంగా ఉండటమే! ఇలాంటి సంస్థల కన్నా రచయితల్ని పత్రికలు ఆదరిస్తున్నాయి. ఇది నిజం. గతంలో పత్రికలు రచయితలకు పారితోషికం పంపేవి. ఇప్పుడు ఇవ్వకపోయినా పరవాలేదు గానీ సంస్థల్లాగా ఎదురు డబ్బులడగట్లేదు అంతే!
ప్రశ్న 9. ‘చివరి వలస’ కథలో ‘మధ్యలో మనుషులు గిట్టనంత దూరం’ అని ఒక వాక్యం ఎంతో లోతైన అర్థాన్నిస్తోంది. బహుశా కుటుంబీకుల మధ్య, వారి ఆశలు, ఆకాంక్షల మధ్య వస్తున్న ఒక గ్యాప్‍కి ప్రతీకగా భావించవచ్చనిపిస్తోంది. మనుషులు గిట్టకపోవడానికీ, దూరమవడానికీ ప్రధాన కారణం ఆర్థికమా లేక వ్యక్తిగత స్వేచ్ఛని కోరుకోవటమా లేక బాధ్యతల నుండి తప్పుకునేందుకు ఒక సాకా? మీరేమనుకుంటున్నారు?
జ: ‘మనుషులు గిట్టనంత దూరం’ అనేది ఒక సత్య వేదన. కుటుంబీకుల మధ్య, వాళ్ళ ఆశలు ఆకాంక్షల మధ్య వచ్చే గ్యాప్‌కి కారణం డబ్బే! మరో కారణం ఈ కథలో చూపింది విదేశీ వ్యామోహం కూడా. అలాగే వ్యక్తి స్వార్థం, మానవ సంబంధాల లోపం, బాధ్యతలు లేని హక్కుల పట్ల మమకారం. ఇలా చాలా సాకులున్నాయి. ఎన్నో రంగుల్ని ప్రకృతి ప్రసాదిస్తున్నది. ప్రకృతిలో భాగమయిన మనిషి మాత్రం రకరకాల సాకులతో అన్ని రంగున్ని కోల్పోయాడు. తండ్రి మరణిస్తే విదేశంలో ఉన్న కొడుకు వాలిపోయి అమ్మని కౌగలించుకుని గట్టిగా ఏడ్చి ఆమె వేదనలో భాగమయి అండగా నిలవొద్దూ? విదేశంలోనే ఆనందిస్తూ అమ్మనే రమ్మని ఓ టికెట్ పంపుతాడా? “ఆత్మానాం పుత్ర నామాసి” అని – కని, గోరుముద్దలు పెట్టి పెంచిన కొడుకు చేత సంస్కారాలు చేయించుకోవాలని తల్లిదండ్రుల ఒకే ఒక కోరికను తీర్చలేని కొడుకు లెందుకు? అది వాళ్ళ కోరిక కాదు, కొడుకు బాధ్యత. ఇలాంటి, దురదృష్టకర సంఘటనలు చూస్తున్నాను. తల్లిదండ్రులుగా పైకి అనలేక కొడుకుని క్షమిస్తూ ఆస్తులు రాసిచ్చి వెళ్ళిపోతారు. అలాంటి కొడుక్కి ఆస్తులిచ్చే బదులు అనాథలకి రాయటం మంచిది. ఇది ఒక ఉద్వేగ వేదనలోంచి ఉబికిన కథ.
ప్రశ్న 10. ‘అవర్ణం’ కథలోని ఘటనని జీర్ణించుకోవడం కష్టం. ఈ కథకి ప్రేరణ ఏమిటి? ఈ కథ కల్పితమా లేక రాఘవరావు లేదా కుముద్వతి లాంటి వ్యక్తులు మీకు తారసపడితే అల్లిన కథా?
జ: ‘అవర్ణం’ కథలోని మూలం కామ స్వార్ధం! ఈ కథ వాస్తవిక గాథ. చివర ముగింపు కల్పితం. నాకు తారసపడిన ఓ వృద్ధురాలి జీవితంలో కుముద్వతి, రాఘవరావులు కోడలు, భర్తలుగా చూపించిన నరకం. ఇలాంటి వాళ్లుండటం నాకు నిద్రలేని రాత్రుల్ని చూపించింది. ఆ తల్లి మొహాన్ని నేనింకా మర్చిపోలేక పోతున్నాను.
ప్రశ్న 11. మధ్యతరగతి కుటుంబాలలో మగపిల్లలపై ఉండే మోజు గురించి చెబుతూ, ‘వచ్చే జన్మకైనా’ కథలో ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టిన కొడుకు అంతరంగాన్ని ఆవిష్కరించారు. కానీ ప్రస్తుత కాలంలో మగపిల్లల కన్నా ఆడపిల్లలే చదువుల్లోనూ, ఉద్యోగాలలోనూ రాణిస్తూ, తల్లిదండ్రులని ఆదరిస్తున్నారు కదా? వచ్చే జన్మలో తనని అమ్మాయిగా పుట్టించమని ఆ అబ్బాయి కోరుకుంటున్నట్టు రాయడంలో మీ ఆలోచన ఇదేనా?
జ: మధ్యతరగతి కుటుంబాల్లో నాలుగు మూడు దశాబ్దాల కింద వరకు మగ పిల్లలపై చాలా మోజు ఉన్నది. మీరన్నట్లు ప్రస్తుత కాలంలో అది తగ్గినా ఇంకా ఉంది. దీనికి కారణం మన సంస్కృతి. మగ పిల్లలకి కర్మకాండలో ప్రాధాన్యత ఉండటమే! ఈమధ్య అంతిమ సంస్కారాలు కూడా కూతురు చేయడం వింటున్నాం. నేను రాసిన కథలో మోజు కన్నా కొడుక్కి తరతరాలుగా బాధ్యతల్ని అందిస్తున్న సంస్కృతి. అతను అసమర్థుడైతే కూతుళ్ళు మోయాలి కదా! ఇక్కడ కొడుకు, కూతురు అనే తేడా లేకుండా హక్కులు బాధ్యతలు సమానంగా ఉండాలని నా భావన.
కూతుళ్ళకు బాధ్యతలు ఎందుకుండవు. హక్కులే ఎందుకు? కథలోని పరిస్థితుల్లో కూడా కొడుకులుంటారు. ఇది వాళ్ళ వైపు నించి రాసిన కథ. నాకు తెలిసిన కుటుంబాల్లో మగ పిల్లలు పుట్టకపోతే ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయిని దత్తత ఇటీవల చూశాను. అంటే ముందు పుట్టిన అమ్మాయిల్ని కన్న ఆ తల్లి మాతృత్వానికి విలువేమిటి? ఎన్నో ఆలోచల సుడిగుండాల్లోంచి బయట పడే కథలివి.
ప్రశ్న 12. ఈ కథాసంపుటి ఒక విశేష సందర్భపు ప్రచురణ కదా, మరి ఈ సంపుటికి ఎవరితోనూ ముందుమాటలు వ్రాయించలేదేం? అందుకు ఏదైనా ప్రత్యేక కారణముందా?
జ: ముందుమాటలు రాయించవచ్చు. ఈ కథా సంపుటి ప్రచురణ గానీ, మరే కవితా సంపుటి ప్రచురణ గానీ చేస్తున్నప్పుడు ‘ముందుమాట’ అడిగినప్పుడు ఆయా ప్రముఖులు సంవత్సరాల కాలం తీసుకున్న వాళ్ళున్నారు. వారం, పది రోజుల్లో చదివి రాసి పంపిన వాళ్ళున్నారు. అది గతం. ఇప్పుడు మన రచన చదవకుండా పడికట్టు పదాలతో అక్కడక్కడ మన పంక్తుల్ని, మాటల్ని ఎత్తి రాసి ముగిస్తున్నారు. పెద్దల నుంచి ఆశించేది పొగడ్తలు కావు, మార్గదర్శనం. అది అందించే వాళ్లు తక్కువ. ముందుమాటల ప్రహసనం మరో కథగా రాస్తాను. అందువల్లే ఎవరినీ అడగలేదు.
ప్రశ్న 13. ఈ కథా సంపుటిని పుస్తక రూపంలో తీసుకురావడంలోని అనుభవాలేవైనా పంచుకుంటారా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?
జ: పుస్తకానికి ప్రచారం, పరిచయం సాహితీ లోకమే! సమీక్షలు, అభిప్రాయాల ద్వారానే ఆశిస్తాను.
ప్రశ్న 14. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: రచయిత్రిగా 2023-24 సంవత్సరాల కాలం నా సాహితీ స్వర్ణోత్సవ సందర్భం. ఇలా అనుకోవటం నన్ను నేను మరిన్ని రచనలు చేయటానికి నడిపించుకోవటానికి.
ఈ దిశలో నేను కొన్ని ప్రచురణలకి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ పనిలో ఉన్నాను. మా గ్రామ చరిత్ర, ఒక కవితా సంపుటి, నేను రాసిన నాటక, నాటికలు, సంగీత రూపకాల సమగ్ర సాహిత్యం, నా కథల సమగ్ర సంపుటి, మా నాన్నగారి జీవిత చరిత్ర, శివాజీ నవల, నా అనుభవాలూ జ్ఞాపకాలూ – ఇలా పలు ఆలోచనలపై కార్యాచరణ ఉంది. కాలం నడిపిస్తుంది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు భవానీదేవి గారూ.
డా. సి. భవానీదేవి: ‘సంచిక’ అద్భుతమైన నిజాయితీ గల, నిబద్ధత గల పత్రికగా భావించి గౌరవిస్తున్నాను. నా రచనల్ని ‘సంచిక’ ఎప్పుడూ ఆదరిస్తున్నది. మన విలువైన పత్రికలో నా ‘ముఖాముఖి’ ని మీ సమయం వెచ్చించి, ప్రశ్నలడిగి, కొన్ని పేజీలను నాకు కేటాయించిన ఆదరణకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలండి.
***
రచన: డా. సి. భవానీదేవి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 152
వెల: ₹ 200
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 0866-24366642/643, 8121098500
రచయిత్రి: 986684700
ఆన్‍లైన్‍లో
https://www.logilitelugubooks.com/book/chivari-valasa-dr-c-bhavani-devi
~
‘చివరి వలస’ పుస్తక సమీక్ష లింక్:
https://sanchika.com/chivari-valasa-book-review-kss/