కథా, నవలా రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ

1
1

[‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని వెలువరించిన డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారూ.

డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి: నమస్కారం.

~

ప్రశ్న 1. సమాజంలో అధికులు చర్చించడానికి కూడా ఇష్టపడని మానసిక ఆరోగ్యంఅనే అంశం మీద నవల రాయాలని ఎందుకు అనిపించింది? ఇందుకు ఏ విషయాలు/ఏ వ్యక్తులు మీకు ప్రేరణనిచ్చారు?

జ: నేను 2013-15 మధ్య బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ప్రజా విధానాన్ని అధ్యయనం చేశాను. దానిలో భాగంగా ప్రభుత్వ విధానాన్ని మెరుగుపరచే విషయంపై ఒక డిజర్టేషన్ వ్రాయవలసి ఉంది.

సరైన అంశం కోసం ఆలోచిస్తున్న తరుణంలో నా స్నేహితులు ఇళంగోవన్-గీతలు గుర్తుకు వచ్చారు. ఇళంగోవన్ గారు నా బ్యాచ్‌మేట్. ఆయన, వారి సతీమణి గీత గారితో కలిసి డాక్యుమెంటరీలు తయారు చేసేవారు. మనం మాటలాడడానికి ఇష్టపడని అంశాల మీద అవగాహన పెంచడానికి వాటిని తీసేవారు. ఉదా: మెంటల్ రిటార్డేషన్, నెలసరి, మూడవ లింగం, మొదలైనవి. ముందు నేను నోరు వెళ్ళబెట్టినా, ఆ తరువాత నాలో ఉన్న బూజుని నేను దులుపుకున్నాను. వాళ్ళ స్ఫూర్తితో మానసిక ఆరోగ్య విధానం మీద డిజర్టేషన్ వ్రాద్దామని పూనుకున్నాను.

మానసిక ఆరోగ్య విధానాన్ని ఎంచుకోవడానికి ఒక కారణముంది. నాకు జ్వరం వచ్చిందంటే పరామర్శించే చుట్టాలూ-పక్కాలూ, నేను క్రుంగుబాటుకు గురయ్యి, మానసిక వైద్యుణ్ణి కలిసొచ్చానంటే మొహం చాటేస్తారు. ఇటువంటి మనస్తత్వం ఉంటే మానసిక రుగ్మతలు పెరుగుతాయే గాని తగ్గవు. మానసిక ఆరోగ్యం కూడా భౌతికారోగ్యం వంటిదేనని, మన శరీరానికి రుగ్మతలు రావడం ఎంత సహాజమో, మన మనస్సుకు కూడా రుగ్మతలు రావడం అంతే సహజమని అర్థం చేసుకునే వీలుంటుందనుకుని ఈ శీర్షికని ఎంచుకున్నాను.

ప్రశ్న 2. మానసిక సమస్యను వ్యాధిగా పరిగణించవచ్చా? లేక, అది ఒక డిజార్డరా? మానసిక సమస్యలు సంపూర్ణంగా పరిష్కారమయ్యే వీలుందా?

జ: వైద్య పరిభాషలో మానసిక సమస్యలను ‘డిజార్డర్’ గానే పరిగణిస్తారు. అంటే ఆ సమస్యలకు మూలకారణం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట.

మానసిక రుగ్మతలు రెండు రకాలు. కామ‌న్‌గా వచ్చేవి [క్రుంగుబాటు, వల్లమాలిన భయాలు (ఫోబియాలు), వేలంవెర్రులు (మేనియాలు) మొదలైనవి] సరైన మందులు, కౌన్సిలింగ్ తీసుకుంటే పూర్తిగా నయమవుతాయి. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌లో మాత్రం రోగి ఒక ఆబ్సెషన్ బారినుండి బయటపడ్డాక మరొక ఆబ్సెషన్‌లోకి దిగజారే ప్రమాదం ఉంది. నిజానికి ఏ వ్యక్తికి  కూడా సంపూర్ణ మానసిక స్వాస్థ్యత వుందని చెప్పలేము. ప్రతి వ్యక్తీ ఏదో ఒక తరుణంలో మానసిక సమతౌల్యం కోల్పోతాడు. తార్కికమైన ఆలోచనను వదలి అకారణమైన భయాలను ప్రదర్శిస్తాడు. అయితే, ఎవరైతే, తమపై తాము అదుపు తెచ్చుకుని, ఈ భయాలను అణచిపేడతాడు. ఎవరయితే, తమపై నియంత్రణ కోల్పోతారో  , ఈ నియంత్రణ కోల్పోవటం తరచుగా సంభవిస్తుందో  అప్పుడతడిని మానసిక సమతౌల్యం కోల్పోయిన వ్యక్తిగా పరిగణిస్తాము. అంతే.  వాడెవడో తనని ఏదో అన్నాడని అనుకుని బాధపడేవారు, ఎవరేది మాట్లాడినా తనగురించే ఏదొ మాట్లాడేస్తున్నారనుకు ఏడ్చేవాళ్ళు, భర్త మరొకరితే మాట్లాడితేనే ఏదో వుందనుకునేవారు, భార్య మరొకరివైపు చూస్తేనే అసూయ చూపేవారు, చదివిన విన్న ప్రతి రోగం తమకుందని బాధపడేవారు, ఇంటి తాళం వేశామో లేదో, గాస్ స్టవ్ ఆర్పామో లేదో, లైట్ స్విచ్లు ఆర్పాలేదనీ, ఇలా నిత్య జీవితంలో మామూలు మనుషుల్లో ఇలాంటి లక్షణాలెన్నో కనిపిస్తాయి. అదుపు తప్పితే మానసిక వైకల్యం అవుతుంది.  ఇవి అదుపుతప్పితే తీవ్రమైన మానసిక రుగ్మతలుగా పరిణమిస్తాయి.

తీవ్రమైన మానసిక రుగ్మత (స్కిజోఫ్రేనియా, బైపోలార్ మొదలైనవి)ల నుండి సంపూర్ణంగా బయటపడడం కష్టం. క్రమం తప్పకుండా మందులు వాడితే కొంతకాలానికి రోగలక్షణాలు (సింటమ్స్) మాయమవచ్చు (అంటే, రోగి ఎసింటోమాటిక్ అవచ్చు). కానీ లైట్ డోస్‌లో మందులు మాత్రం బీపీ మందుల్లా జీవితాంతం వేసుకోవలసిందే! మానసిక అనారోగ్యంతో ఉన్న మనిషిచేత మందులు తీసుకునేటట్టు చేయడం ఒక బ్రహ్మవిద్య. భౌతికంగా బాగానే ఉంటారు కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారంటే వాళ్ళు సాధారణంగా ఒప్పుకోరు. ప్రతిఘటిస్తారు కూడా!

ప్రశ్న 3. మానసిక సమస్యలను బాల్యంలోనే గుర్తించే వీలుందా? ఉంటే ఎలా?

జ: వీలుంది. కానీ దానికి తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వాళ్ళకీ చాలా అవగాహన కావాలి. మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. నిజానికి చిన్నతనంలో పిల్లల ప్రవర్తనను అల్లరిగా కొట్టేస్తారు. అదే సర్దుకుంటుందని అనుకుంటారు. అందుకే పిల్లల్ల ప్రవర్తన మరీ విచిత్రంగా  వుంటే తప్ప బాల్యంలోనే మానసిక సమస్యలను గుర్తించరు.

ప్రశ్న 4. సాధారణంగా రచయిత జీవితంలోంచి రచనలు వస్తాయంటారు. ఈ రచనకూ మీ జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధం ఏమైనా వుందా?

జ: నా జీవితంతో ప్రత్యక్షంగా సంబంధం లేదు గానీ, నా వ్యక్తిత్వంతో సంబంధం ఉంది. సమాజానికి నాకు తోచిన రీతిలో ఏదైనా మంచి చేయాలన్న ఆరాటం నాకు ఎప్పుడూ ఉండేది. ఐఐఎంలో డిజర్టేషన్ పూర్తి చేసే క్రమంలో నేను పెంచుకున్న ఆ అవగాహనను ప్రజాబహుళ్యంతో పంచుకోవాలనే తపన నాకు ముందు నుంచీ ఉంది. తెలుగులో కథలు వ్రాయడం మొదలుబెట్టాక, ఈ విషయాన్ని నవలా రూపంలో వ్రాయగలనా, అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ‘అన్నప్రాశన రోజునే ఆవకాయ’న్న చందాన, కథల్లో అ-ఆలు దిద్దుకుంటున్న నేను, ఒక నవల వ్రాసే సాహసం చేయగలనా, అన్న అనుమానాలూ రాకపోలేదు.

ఆ సమయంలో ఒక స్నేహితుడి ప్రోత్సాహంతో కథగా వ్రాసి, తిరిగొచ్చిన ‘అపజయాలు కలిగిన చోటే…’ నవలా రూపం దాల్చింది. అదే సమయంలో కొంచెం అటూ-ఇటూగా ‘పిచ్చి డాక్టరమ్మ’ అనే కథను వ్రాశాను. మానసిక శాస్త్రం అధ్యయనం చేయడానికి కూడా ఉండే అడ్డంకులను అందులో ప్రస్తావించాను- అన్నీ ఐఐఎంలో చేసిన అధ్యయనం ఇచ్చిన స్ఫూర్తి వల్లనే! ఆ కథ నాకు చాలా గుర్తింపుని తెచ్చింది.

అప్పటి నుంచీ మానసిక ఆరోగ్యంపై నవల వ్రాయాలనుకున్నాను. అది 2020లో సాకారమయ్యింది. ఈ నవల రెండు మూడు సార్లు తిరస్కారానికి గురయ్యింది. ఇది ప్రజానీకానికి ఉపయోగపడే అంశంగాని, ప్రజారంజకమైన అంశం కాదు కదా! మనలని ఇబ్బంది పెట్టె విషయాలని మనసులో దాచుకుంటూ పోతే, ఒక రోజు అది ఒత్తిడి తట్టుకోలేక బద్దలవుతుంది.

ప్రశ్న 5. ఈ నవలలో మెంటల్ హెల్త్ని ప్రధానాంశంగా వ్రాసి చదువరులలో అవగాహన కలిగించేందుకు మీరు ఏయే పుస్తకాలను అధ్యయనం చేశారు? కొన్ని రిఫెరెన్స్ పుస్తకాల పేర్లు చెప్తారా?

జ: నవల కోసం ప్రత్యేకంగా పుస్తకాలేవీ చదువలేదు. అనారోగ్యం విషయమై అవగాహన ఉంది కనుక గూగుల్ సహాయంతో లక్షణాలు తెలుసుకుని, వాటికి తగ్గట్టు పాత్రలని నిర్మించాను.

ప్రశ్న 6. ఈ నవలలో ప్రస్తావించిన మానసిక రోగులు మంజుల, ప్రభాత్, ఆనంద్, నిరూప్ వంటి వారిని మీరు వ్యక్తిగతంగా ఏమైనా కలిసారా? ఇటువంటి సమస్యలున్న మానసిక రోగులు ఇలా ప్రవర్తిస్తారని ఎలా తెలుసుకున్నారు?

జ: లేదు. ఆయా వ్యాధుల లక్షణాలను బట్టి, వాటికి బోలెడంత కల్పన జోడించి, చిత్రించాను.

ప్రశ్న 7. వ్యక్తిగతంగా ఈ రచనలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఏ పాత్ర సృజన కోసం కష్టపడ్డారు? ఈ పాత్రను ఇలా కాక మరోరకంగా మలచివుంటే బాగుండేది అని అనిపించిన పాత్ర ఏదైనా వుందా?

జ: (అ) గగన్, దివిజ్. గగన్ చదువులో అందరికన్నా బాగా రాణించినా, ఏరి-కోరి ఈ ఉద్యోగం చేపట్టాడు. అన్నిటికీ అతీతుడై తన సేవ తను చేసుకుని పోయే రకం. రోగికి మేలు చేయడమే అతని ఆశయం. ఎక్కువ మాట్లాడడు గాని లోతుగా ఆలోచిస్తాడు. దివిజ్ జీవితంలో అధిష్ఠించిన ఉన్నత శిఖరాలని వదులుకున్నవాడు. తను ముందుండడం కోసం మిగిలిన వారిని వెనక్కు నెట్టడం మంచి పద్ధతి కాదని గ్రహించినవాడు. తాను చివర నిలబడి, అందరినీ ముందుకు పంపే ఉద్దేశంతో సేవ చేయడానికి వచ్చినవాడు. మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి కొత్త ఆలోచనలు చేసినవాడు. వీరిద్దరిదీ గురు-శిష్య బంధం; కృష్ణార్జునుల సంబంధం.

(ఆ) ఏ పాత్ర కోసమూ కష్టపడలేదు. వారు నా ముందు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు నవ్వినప్పుడు నవ్వుతూ, బాధ పడినప్పుడు ఏడుస్తూ, ఒత్తిడికి గురైనప్పుడు కాస్సేపు రచనని ఆపేసి – ఇలా వాళ్ళ ప్రవర్తనను నేనూ అనుభవిస్తూ, అలా వ్రాసుకుంటూ పోయాను. కానీ, పాత్రల మధ్య సమన్వయం సరిగ్గా కుదిరిందా, లేదా చూసుకోవడానికి, పాత్రల ఔచిత్యం ఎక్కడా దెబ్బతినకుండా ఉందా అని సరి చూసుకోవడానికి ఇంచుమించు నెల రోజులు పట్టింది.

(ఇ) లేదు.

ప్రశ్న 8. ఈ నవలలోని ప్రధాన పాత్రల పేర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. గగన్-పూర్ణిమ, మృగనయని, నిరూప్, నిశిథ్, దివిజ్, అనామిక, నిర్విష, అమిత.. వంటి పేర్లు విభిన్నంగా ఉన్నాయి. పాత్రలకి ఈ పేర్లు వారి స్వభావాలని బట్టి పెట్టారా లేక యాదృచ్ఛికంగా తట్టిన పేర్లా? అలాగే ఒకచోట  సద్వలయం  అని వాడారు. అదీ బావుంది! ఎలా తట్టిందా పేరు?

జ: (అ) వీలైనంత వరకూ వారి స్వభావాలని బట్టి పెట్టాను. అలాగని అన్నీ సరిపోవు కూడాను. కొన్ని వ్యతిరేకార్థాన్నిస్తాయి. ఉదా: మృదు స్వభావం కలిగిన మంజుల క్రుంగుబాటుకు గురవుతుంది. ప్రభాత్ తన జీవితాన్ని చీకటిమయం చేసుకుంటాడు.

గగన్ అంటే ఆకాశం. శూన్యం. అతను రాగద్వేషాలకు అతీతుడై తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆకాశానికి చేదోడు-వాదోడుగా ఉంటూ భూమికి చల్లదనాన్ని ఇచ్చేది పూర్ణిమ. ఆమె కూడా తన చల్లదనాన్ని అందరికీ పంచుతూ ఉంటుంది.

మృగనయని అనే పేరు నాకు చాలా ఇష్టం. లేడి బెదురు చూపులు చూసినట్లే, ఈమె జీవితంలో బెదిరిపోయి, ఒత్తిడి తట్టుకోలేక కృంగిపోతుంది.

నిరూప్ అంటే రూపం లేని వాడు అని అర్థం కదా! ఇందులోని ఆ పాత్రధారి ఒకరి విద్వేషపు కుట్రకి బలైపోయి, చెడ్డపేరు తెచ్చుకుని అనామకుడిలా బ్రతుకుతుంటాడు. నిశిథ్ (చీకటి) ఒక మాత్సర్యపూరిత వ్యక్తి. తను తీసిన గోతిలోనే పడతాడు.

దివిజ్ అంటే స్వర్గంలో పుట్టువారు-దేవతలు, సూర్యుడు అని అర్ధం.  సూర్యుడు మనకు వెలుగునిస్తాడు.   మానసిక ఆరోగ్యంపై కొత్త వెలుగు ప్రసరించే పాత్రలో అతడు కనిపిస్తాడు. అనామిక తల్లిదండ్రుల మానసిక అనారోగ్యాల మధ్య నలిగిపోతూ కూడా తన పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడకుండా వెనుక నిలబడి, చేనేత కార్మికుల పంచన నిలుస్తుంది.

నిర్విష మానసిక రోగాలనే విషవలయాలలో చిక్కుకున్న సామాన్య ప్రజానీకానికి వైద్యం చేసే డిఎంహెచ్‌పి డాక్టర్.

అమిత తను చేయలేని పనంటూ ఉండకూడదని అమితాశతో ఉండి, దానివల్ల మానసిక అనారోగ్యం పాలవుతుంది.

(ఆ) విషయవలయాన్ని ఆంగ్లంలో vicious circle అంటారు. దాని వ్యతిరేకపదం virtuous circle. ఆ మాటని తెలుగులోకి అనువదించినప్పుడు సద్వలయం అనే పదాన్ని వాడాను.

ప్రశ్న 9. ఈ నవల వ్రాయడానికి ఎంత కాలం పట్టింది? మానసిక ఆరోగ్యం గురించి ఫిక్షన్‍లా వ్రాయడం మీమీద ఏమైనా ప్రభావం చూపించిందా?

జ: నాలుగు-అయిదు నెలలు. నేను వ్రాసిన డిజర్టేషన్ చాలా సాంకేతికపరమైనది. అందులో సామాన్య మానవుడికి అర్థమయ్యే విషయాలను మాత్రమే తీసుకుని, వాటి గురించి మరిన్ని విషయాలు సేకరించి, నిజజీవితానికి అద్దంపట్టే విధంగా అన్వయించడానికి చేసిన ప్రయత్నానికి రూపమే ఈ నవల.

ఉదాహరణకి కామాక్షి పాత్ర. రైతుల ఆత్మహత్యలు, తత్ఫలితంగా వారి కుటుంబం చితికిపోవడం గురించి మనం తరచూ వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం. అలాంటి వాళ్ళ మానసిక ఆరోగ్యం దెబ్బ తినడానికి అవకాశాలు ఎక్కువ. అందుకని అటువంటి పాత్రని నవలలో చేర్చాను.

నవల పూర్తయ్యాక పుత్రికోత్సాహం వచ్చింది.

ప్రశ్న 10. మానసిక సమస్యల లక్షణాలని ఆయా పాత్రల సంభాషణలలో భాగంగా చెప్పడం వల్ల నవల – వ్యాసంగానో/ఉపన్యాసంగానో మారకుండా ఆసక్తికరంగా సాగింది. నవలని ఈ పద్ధతిలో రాస్తే మానసిక అవగాహన మరింత పెరిగి, మానసిక రోగుల ప్రవర్తన పట్ల ఓర్పు అలవడుతుందని మీరు భావించారా?

జ: అవును. నేను ఆశాజీవిని. నేను డిజర్టేషన్ వ్రాసినప్పుడు అది పూర్తిగా సిద్ధాంతపరంగా ఉంది. దాన్ని మక్కికి మక్కి తర్జుమా చేస్తే, ప్రజాబాహుళ్యానికి ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి! అందుకే ఆసక్తికరమైన సంభాషణాలతో వ్రాద్దామని పూనుకున్నాను. ఎంతవరకు కార్యసాధన చేశానో చదువరులే చెప్పాలి.

ప్రశ్న 11. ఈ నవలలో పాత్రికేయురాలు, సంఘసేవిక గీతా ఇళంగోవన్ గారి ప్రస్తావన వస్తుంది. వారితో మీకు వ్యక్తిగత స్నేహం ఉందా? నవలలోని కల్పిత పాత్రలు నేటి సమాజంలోని సజీవ వ్యక్తి నుంచి స్ఫూర్తి పొందడం విశేషం కదా! గీతా ఇళంగోవన్ గారి కృషి గురించి సంక్షిప్తంగా వివరిస్తారా?

జ: (అ) అవును. మా స్నేహం 2000వ సంవత్సరం నుంచీ కొనసాగుతోంది. మేమిద్దరం ప్రగతిశీలక ఆలోచనా సరళి ఉన్న వాళ్ళం. అలా మొదలైన మా స్నేహం పోను, పోను బలపడింది.

(ఆ) నేను వారి ‘నెలసరి’ చూసి ఎలా స్ఫూర్తి పొందానో, నా పాత్రలు కూడా అలాగే పొందాలని ఆశించాను.

(ఇ) గీతా ఇళంగోవన్ పాత్రికేయురాలు. స్త్రీల సమస్యలపై చేసిన నివేదికకు ఆమెకు ‘సరోజినీ నాయుడు ఉత్తమ పాత్రికేయురా’లి అవార్డు లభించింది. ఆ తరువాత తన మొదటి డాక్యుమెంటరీ ఒక రిటార్డెడ్ పిల్లాడికి సమాజపు మద్దతు గురించి చేశారు. అలాగే నెలసరి మీద తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో స్త్రీలకి తెలియని చాలా విషయాలని ప్రస్తావించారు. ఇప్పుడు స్త్రీల హక్కుల మీద రెండు పుస్తకాలను రచించారు.

ప్రశ్న 12. నవలలోని ప్రధాన పాత్ర డా. గగన్ మానసిక వైద్యులు. డిఎంహెచ్‌పి అనేది జాతీయ కార్యక్రమం కదా. ఈ ప్రోగ్రామ్ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదా? కేంద్ర ప్రభుత్వానిదా? అసలీ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో చెబుతారా?

జ: డిఎంహెచ్‌పి జాతీయ కార్యక్రమమైనా కూడా, ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉండడం వల్ల,ఆ కార్యక్రమాన్ని రాష్ట్రాలే అమలు పరుస్తాయి. ఇందులో ఒక సైకియాట్రిస్ట్, ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్, ఒక మానసిక సేవిక, మానసిక నర్స్ ఉంటారు. వీరంతా కలిసి మానసిక రోగులకి చికిత్స చేస్తారు. ఇది నల్లేరుపై బండినడక కాదు. దీనిలోని ఇక్కట్లు తెలుసుకోవాలంటే, నా నవల చదవండి.

ప్రశ్న 13. ప్రజారోగ్యం చాలావరకు ప్రైవేటురంగంలోకి వెళ్ళిపోయిన ప్రస్తుత కాలంలో మానసిక ఆరోగ్యానికి సేవలందించే ప్రైవేటు ఆసుపత్రులు ఏవైనా ఉన్నాయా? ఉంటే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? లేక ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడవలసిందేనా?

జ: (అ) ఉన్నాయి.

(ఆ) మధ్య తరగతి వాళ్ళు ఒక స్థాయి వరకూ చికిత్స పొందగలుగుతారు.

(ఇ) చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడతారు.

ప్రశ్న 14. ఈ నవల సంచికవెబ్ పత్రికలో ధారావాహికంగా వచ్చి పాఠకులను ఆకట్టుకుంది. ధారావాహికగా వస్తున్నప్పుడో లేక పుస్తక రూపంలోకి వచ్చాకనో – మానసిక ఆరోగ్య రంగంలోని నిపుణులెవరైనా చదివారా? వారి స్పందన ఎలా ఉంది?

జ: పుస్తకానికి ముందుమాట వ్రాయమని నేను కోరినప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ అయిన డా॥ మంగిపూడి వాణి సుబ్రమణ్యం గారు చదివారు. వారి అభిప్రాయం పుస్తకంలోని ముందుమాటలో ఉంది.

ప్రశ్న 15. ఈ నవలని పుస్తక రూపంలో తీసుకురావడంలోని అనుభవాలేవైనా పంచుకుంటారా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?

జ: నా మొదటి నవల, ‘అపజయాలు కలిగిన చోటే…’ ని చదివి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు, తన ఆశీస్సులు అందిస్తూ, సమాజానికి ఉపయోగపడే అటువంటి నవలలు వ్రాయమన్నారు. అప్పుడు, నా రెండవ నవల గురించి చెప్పి, పుస్తక రూపంలో తేవడానికి అయ్యే బోలెడంత ఖర్చు గురించి వెనుకాడుతున్నానని చెప్పాను. ఆయన నా రచనను నమ్మి, ఒక ప్రచురణకర్తకి సిఫారసు చేశారు. అలా శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ ద్వారా ఈ పుస్తకం వెలుగు చూసింది. ఈ విషయంలో నేను ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారికి ఋణపడి ఉన్నాను.

ప్రశ్న 16. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ: ప్రణాళికలంటూ ఏవీ లేవు. మంచి ఆలోచనలు వస్తే, వాటికి అక్షర రూపం ఇస్తాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సూర్య లక్ష్మి గారూ.

సూర్య లక్ష్మి: నా ఇంటర్వ్యూ తీసుకున్న మీకు నా ధన్యవాదాలు. మీ ప్రశ్నలు పరిశోధించి, సంధించినట్టుగా ఉన్నాయి. వాటికి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చానని ఆశిస్తున్నాను.

***

మార్పు మన(సు)తోనే మొదలు (నవల)
రచన: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్
పేజీలు: 174
వెల: ₹126/-.
ప్రతులకు:
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, (ఎస్ఆర్ పబ్లికేషన్స్),
దిట్టకవి రాఘవేంద్ర రావు వీధి,
ఇన్నర్ రింగ్ రోడ్డు, అంబాపురం,
విజయవాడ. Cell: 9849181712, 8464055559
~
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్,
నల్లకుంట, హైదరాబాద్. 9032428516
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు:
https://srpublications.in/product_view.php?bt=MAARUPUMANASUTHONEMODALU
~
ఫిబ్రవరి 19 వరకు జరిగే 36వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (ఎన్.టి.ఆర్. స్టేడియం) లో శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారి స్టాల్ నెం 155లో ఈ నవల లభ్యమవుతుంది.

~

‘మార్పు మన(సు)తోనే మొదలు’ పుస్తక సమీక్ష
https://sanchika.com/marpu-manasutone-modalu-book-review-kss/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here