ప్రముఖ కథా, నవలా రచయిత డా. చిత్తర్వు మధు ప్రత్యేక ఇంటర్వ్యూ

1
2

[‘ఆల్గోరిథమ్’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీ డా. చిత్తర్వు మధు ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. చిత్తర్వు మధు గారూ.

డా. చిత్తర్వు మధు: నమస్కారం.

~

ప్రశ్న 1: ఓ రచయితగా విభిన్న జానర్‍లలో మీరు కథలూ, నవలలు రాసినప్పటికీ తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసే కొద్దిమందిలో ఒకరిగా మీకు గుర్తింపు ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మీరు – బైబై పోలోనియా, కుజుడి కోసం, నీలి ఆకుపచ్చ, భూమి నుంచి ప్లూటో దాకా – వంటి నవలలు రాశారు. ఇవి గ్రహాంతరయానాలు, గ్రహాంతరవాసులు, అంతరిక్షనౌకలు వంటి ఇతివృతాలతో సాగుతాయి. మీ తాజా కథాసంపుటి ‘ఆల్గోరిథమ్’ లోని సైన్స్ ఫిక్షన్ కథలలో పై నేపథ్యం కాకుండా, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులూ, వాటి వల్ల ప్రభావితమవబోయే జనజీవితాల గురించిన ఇతివృత్తాలు ఉన్నాయి. ‘స్పెక్యులేటివ్ ఫిక్షన్’ అని పిలవడబడుతున్న వీటిని సైన్స్ ఫిక్షన్‍లో భాగంగా భావించవచ్చా?

జ. స్పెక్యులేటివ్ ఫిక్షన్ అంటే తెలుగులో ఏ పదం వాడాలో తెలియదు కానీ ఊహాజనితమైన సాహిత్యం లేక వైజ్ఞానిక ఊహా కల్పనా సాహిత్యం అనొచ్చునేమో. స్పెక్యులేటివ్ ఫిక్షన్ అనే మాటని రాబర్ట్ హెన్ లిన్ అనే రచయిత 1941లో మొదటిసారిగా వాడాడు, అని చెప్తున్నారు. పూర్తిగా రుజువైన సైన్స్ సిద్ధాంతాల మీద ఆధారపడి కాకుండా, ఇప్పుడు ప్రతిపాదన దశ లోనే ఉండి భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని ఊహించి కల్పించి రాసే సాహిత్యాన్ని స్పెక్యులేటివ్ ఫిక్షన్ అనొచ్చు. దీనిలోనే భాగాలుగా, సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఫాంటసీ, ఆల్టర్నేటివ్ హిస్టరీ యుటోపియన్, డిస్టోపియన్, ఏపోక్యాలిఫ్టిక్, పోస్ట్ఎపో కాలిప్టిక్, సూపర్ హీరో, హారర్, సూపర్ నాచురల్, పారానార్మల్ ఫిక్షన్ ఇవన్నీ స్పెక్యులేటివ్ ఫిక్షన్ లేక ఊహాజనిత కల్పనా సాహిత్యం కిందికి వస్తాయి. ఉదాహరణకి, సైన్స్ ఫిక్షన్ పూర్తిగా నిరూపించబడిన సైన్స్ సిద్ధాంతాల మీద ఆధారపడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తుంది. సాధారణంగా దీంట్లో గ్రహాంతర ప్రయాణాలు, గ్రహాంతర వ్యక్తులు, కాల ప్రయాణం ఇలాంటివి ఉంటాయి. సైన్స్ ఫాంటసీలో పూర్తిగా సైన్స్ మీద కాకుండా ఫాంటసీ అంటే అంటే ఊహా కల్పనా,మీద ఆధారపడిన ఇతివృత్తాలు ఉంటాయి. ఉదాహరణకి స్టార్ వార్స్, స్పేస్ ఒపేరా కథలు, టైం మెషిన్ ఇలాంటివి. నిజానికి ఇంతవరకు టైం మెషిన్, అనేది కనిపెట్టబడలేదు. కాలంలో ముందుకి వెనక్కి ప్రయాణిస్తే తార్కికంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, కాలంలో వెనక్కి పోయి సంఘటనలు మారిస్తే చరిత్ర ఎలా మారిపోవచ్చు, గ్రాండ్ ఫాదర్ పారడాక్స్, ఇలాంటివి నిజానికి ఫాంటసీ లోకి వస్తాయి.

ఇంకా సైన్స్ ఫిక్షన్ అని చెప్పబడే దాంట్లో సూపర్ హీరోస్ అంటే అద్భుతమైన శక్తులు ఉన్న నాయకుల లాంటి పాత్రలు వారితో ఊహించి సృష్టించే అద్భుతమైన కథలు, ఇవన్నీ సెక్యులేటివ్ ఫిక్షన్ కిందికే వస్తాయి.  అలాగే పేరానార్మల్, సూపర్ నేచురల్ శక్తుల గురించీ సమాంతర కొలతల్లోకి వెళ్ళటం, వేరే ప్రపంచాల్లో జరిగే కథలు ఇవి కూడా స్పెక్యులేటివ్ ఫిక్షన్ కిందకి వస్తాయి. ఎందుకంటే సైన్స్ పరంగా వీటికి పూర్తి ఆధారాలు లేవు. కానీ జరగవచ్చు “వాట్ ఇఫ్?” అలా జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నతో పాఠకులు నమ్మగలిగేట్లు రాసేది స్పెక్యులేటివ్ ఫిక్షన్.

ఇది కాక యుటోపియన్ సాహిత్యం అంటే భవిష్యత్తులో ఆదర్శంగా ఉండే సమాజంలో జరిగే కథలు, డిస్టోపియన్ సాహిత్యంలో, భవిష్యత్తులో ఒకానొక నియంతృత్వ లేక ధనికస్వామ్యము ఉన్న సమాజంలో మానవ హక్కులు లేకుండా భయంకరమైన అన్యాయాలు జరిగేటువంటి పరిస్థితి గురించి రాసిన కథలు ఇవి కూడా స్పెక్యులేటివ్ ఫిక్షన్ కిందకి వస్తాయి. వీటికి ఉదాహరణగా ఇటీవల వచ్చిన హంగర్ గేమ్స్, మార్గరెట్ ఎట్ వుడ్ రాసిన ఏ హ్యాండ్ మైడ్స్ టేల్ చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో ఆంగ్లంలో నవలలూ సినిమాలు వున్నాయి.

సాధారణంగా సైన్స్ ఫిక్షన్‌లో రాసే గ్రహాంతర వ్యక్తులు కుజ గ్రహం నుంచి వచ్చినట్లు, గ్రహాంతర యుద్ధాలు, కాంతి వేగంతో ప్రయాణాలు చేయడం అలా చేసే అంతరిక్ష నౌకలు, టైం మెషిన్లు, ఇలాంటి కథలు కాకుండా ప్రస్తుతం మన సమాజంలో విజ్ఞాన శాస్త్రంలో జరుగుతున్న ప్రగతీ, మార్పులూ సాంకేతిక పరిజ్ఞానం, సమాచార విప్లవం, కృత్రిమ మేధా, రోబోట్స్ అంటే మరమనుషులు, ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే ఊహతో రాసినవే ఈ ‘ఆల్గోరిథం’ అనే కథా సంపుటి లోని మొదటి పది కథలు. కాబట్టి ఇవి స్పెక్యులేటివ్ ఫిక్షన్ లోనే ఒక భాగం మాత్రమే. సైన్స్ ఫిక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి స్పెక్యులేటివ్ ఫిక్షన్‌కి ప్రస్తుత సమాజంలో ఆధారం ఉండదు కానీ భవిష్యత్తులో ఉంటుంది. ఇదే కాదు, పారానార్మల్ అంటే ప్రకృతికతీతమైన శక్తులు దెయ్యాలు ఇతర డైమెన్షన్స్ నుంచి వచ్చే భయానక ప్రాణులు ఇలాంటి వాటి గురించి కథలు కూడా స్పెక్యులేటివ్ ఫిక్షన్ కిందనే వస్తాయి. చారిత్రక కథలు వాటి పాత్రలు, పురాణ పాత్రలు వర్తమానంలోకి రావడం, సమాంతర చరిత్ర, అంటే చరిత్ర వేరే విధంగా రాయటం, ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేటివ్ ఫిక్షన్ లోకి ఒక పెద్ద విశాలమైన ఛత్రం (umbrella) కింద కలిపి వర్గీకరించవచ్చు. దీని మీద ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుతం నిరూపితమైన సైన్స్ సిద్ధాంతాల మీద హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కాకుండా వూహాజనితమైన భవిష్యత్తులో జరిగే సైన్స్ సిద్ధాంతాల వల్ల టెక్నాలజీ వల్ల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయో, మానవతా విలువలు, మానవుడి ప్రగతీ, మానవత్వం ఎలా ప్రభావితం అవుతుందో వర్ణించి కళాత్మకంగా చెప్పేదే స్పెక్యులేటివ్ ఫిక్షన్. అందువల్లనే నా ఈ కథలు స్పెక్యులేటివ్ ఫిక్షన్‌గా చెప్పుకున్నాను.

ప్రశ్న 2: గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంగా రాసిన ‘రెండు డిగ్రీలు’ కథ రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలను వెల్లడిస్తుంది. దీన్ని ఓ హెచ్చరికలా భావించాలా లేక ఉన్న కాస్త సమయంలోనే – అన్ని దేశాలలలోనూ కొద్దో గొప్పో జరుగుతున్న భూమిని కాపాడుకునే ప్రయత్నాలను సమన్వయపరుస్తూ, వేగవంతం చేయాలన్న సూచనగా తీసుకోవాలా? 

జ. మహమ్మారిలా వ్యాపించే వ్యాధులు అంటే పాండమిక్‌లు, అణ్వాయుధాలతో వినాశనం జరిగే యుథ్థాలూ మానవాళికి ఎక్కువ ప్రమాదం అయితే వీటి తర్వాత వాతావరణ కాలుష్యం భూమి వేడెక్కటం అనే సమస్యలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నాసా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్యసమితి, ఇలాంటి సంస్థల రిపోర్ట్‌లు ఎన్నో ఉన్నాయి. పర్యావరణ సమస్య మీద ఒక కథ రాయాలని అనుకున్నప్పుడు భూమి వేడెక్కడం మీద రాయాలా,లేక భూమి చల్లబడిపోవడం మీద రాయాలని అనుమానం కలిగింది. దీని గురించి చాలా చదివి ఆశ్చర్యమైన అనేక విషయాలు తెలుసుకున్నాను. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటమే సమీప భవిష్యత్తులో ఎక్కువ ప్రమాదకరమని అనేక రిపోర్టులు సూచిస్తున్నాయి. శిలాజ ఇంధనాలు అంటే ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోలు బొగ్గు లాంటివి ఎక్కువ వాడటం వల్ల పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి భూమి వాతావరణం వేడెక్కుతూ వచ్చింది. కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వాయువులు ఎక్కువగా ఉత్పత్తి అయి గ్రీన్ హౌస్ఎఫెక్ట్ వల్ల భూమి వాతావరణం వేడెక్కుతుంది. ఇది కాక ఓజోన్ పొరలో చిల్లులు పడి అల్ట్రా వైలెట్ కిరణాలు కూడా భూమిని వేడి చేస్తాయి. ఇదీ కాక అరణ్యాలు కొట్టివేయడం వల్ల చెట్లు నశించి ఆక్సిజన్ తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరిగి భూమి వేడెక్కుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే రెండు డిగ్రీలు వాతావరణంలో వేడి పెరిగితే భవిష్యత్తులో ఉత్పాతాలు కొన్నిచోట్ల వరదలు కొన్నిచోట్ల కరువులు ప్రజల వలసలు పోవడం నదులు ఎండిపోవటం ఇలాంటివి జరిగిపోతాయని ఒక ఊహతో రాసిన కథ ‘రెండు డిగ్రీలు’. మీరు కనుక రెండు డిగ్రీలు అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఎంతో సమాచారం దొరుకుతుంది. ప్రపంచ దేశాలన్నీ COP summit పేరుతో సమావేశమై ఫాసిల్ ఫ్యూయల్ ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలని తగ్గించడం కోసం చర్యలు తీసుకోవడం కోసం సమావేశాలను నిర్వహిస్తున్నాయి. వీటిని గురించిన వివరాలు ఈ కథలో ఉన్నాయి. బహుశా తెలుగులో పర్యావరణ ఉష్ణోగ్రత మీద వాతావరణ కాలుష్యం మీద రాసిన మొదటి కథేమో అని నా ఉద్దేశం. అయితే ఇది భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ఒక కథాపూర్వకమైన హెచ్చరిక గానీ, ఇలా కచ్చితంగా జరుగుతుందని నా ఉద్దేశం కాదు. ప్రపంచ దేశాలు ప్రజలు ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడం యొక్క ఆవశ్యకతని గుర్తుచేసే ఒక హెచ్చరికగానే తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను డిస్టోపియన్ కథలు చూడటానికి చదవడానికి నిరాశాజనకంగా ఉన్నా వాటి వల్ల వచ్చే సందేశం విలువైనది అనుకుంటున్నాను.

ప్రశ్న 3: ‘కరెంటు బొమ్మ’ కథలోలా ఒక మనిషి మెదడుని రోబోకి అమర్చడం, భవిష్యత్తులోనైనా, సాధ్యమవుతుందా? ఓ హ్యుమనాయిడ్‌కి మనిషి మెదడుని అమర్చి సక్రమంగా పనిచేయించగల్గితే సంభవించగలిగే పరిణామాలని మానవ జాతి తట్టుకోగలదా? రోబోలకి భావోద్వేగాలు కలిగించడం వల్ల ప్రయోజనం ఏముంటుందని భావిస్తున్నారు?

జ. మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిది. మనిషి జ్ఞాపకాలు ఆలోచనలు, అతడు నేర్చుకున్న విద్య మొదలైనవన్నీ మెదడులోని న్యూరల్ నెట్వర్క్ లలో నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ పాత జ్ఞాపకాలని దాచుకుని ఉండేటువంటి కంప్యూటర్ మానవ మేధస్సు. దీనిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జిపిటి లాంటి వాటిలో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనిషి మెదడులో ఉండే న్యూరల్ నెట్వర్క్‌ని పోలినటువంటి నెట్వర్క్ వాడి ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ బాగా అభివృద్ధి చెందాయి. నేను ఈ కథలు రాసిన తర్వాత కూడా, గత రెండేళ్లలో కృత్రిమ మేధస్సులో ఎంతో మార్పు, ఓపెన్ ఏఐ సంస్థ ప్రారంభించిన చాట్ జిపీటీ లాంటివి చూస్తున్నాం. ఒకే నిమిషంలో అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు, ఒక ఇతివృత్తం ఇస్తే ఒక క్షణంలో కథ రాయడం, పద్యం రాయడం, ఇలాంటివన్నీ చేసే చాట్ జిపిటి, బింగ్ మొదలైనవి ఇప్పటికే చాలా అందుబాటులో ఉన్నాయి. అవి బొమ్మలు వేసి వీడియోలు కూడా చిత్రిస్తాయి. అయితే ఒక మనిషి మెదడులోని జ్ఞాపకాలు మరొకరి మెదడులోకి సరఫరా చేయటం ఇంకా సాధ్యపడలేదేమో. క్వాంటం కంప్యూటింగ్, పార్టికల్ ఫిజిక్స్ ద్వారా మనిషి జ్ఞాపకాలకి ఆలోచనలకి అంతరాత్మకి అర్థం తెలుసుకోవడం కోసం శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘మూడో జన్మ’ అనే కథ ఈ నేపథ్యంలో రాసినది. భౌతికమైన శరీరం శిధిలమైనప్పుడు అతని మెదడులోని జ్ఞాపకాలు మరొక యువకుడి శరీరంలో పెట్టి మళ్లీ కొత్త జీవితం వచ్చేట్లు చేయటం, దాన్ని వ్యాపార కారణాల కోసం వాడుకోవటం, ఇలాంటి ఇతివృత్తంగా రాసినది. అయితే దీనివల్ల ఏమీ శాశ్వత సంతోషం కలుగదని, నిరుత్సాహం, బాధ, అసంతృప్తి తప్ప అది ఒక పరిష్కారం కాదని సూచించే ప్రయత్నం కూడా ఈ కథలో జరిగింది. ఈ మెమరీ ట్రాన్స్‌ఫర్ భవిష్యత్తులో త్వరలో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పటి సాంకేతిక ప్రగతి వేగం చూస్తే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది. రచయితలుగా మనం ఈ ప్రగతి యొక్క నైతిక మానసిక, సాంఘిక పరిణామాల గురించి కథలు రాయటం వల్ల భవిష్యత్ తరానికి ఉపయోగముండొచ్చు.

ప్రశ్న 4: ‘పాండెమిక్ తరువాత..’ కథలో భవిష్యత్తులో రోబోలకి మానవుల అవసరం ఉంటుందని అంటూ కొందరు తెలివైన జంటలని ‘ఎలిమినేట్’ చేయకుండా బంధించి తమ బానిసలుగా చేసుకుంటాయి. ఎలెక్ట్రానిక్ వైరస్‍లు తమ వ్యవస్థపై దాడి చేయవచ్చు అంటాయవి. మనుషులే లేని వ్యవస్థలో ఎలెక్ట్రానిక్ దాడి అంటే, ఇతర రోబోటిక్ వ్యవస్థల నుంచి అని భావించాలా? ఇది మరో నవలకో కథకో ఇతివృత్తమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా?

జ. ‘పాండమిక్ తరువాత’ అనే కథ ఒక పోస్ట్- ఎపోకాలిప్టిక్ అంటే ప్రళయానంతర, కథకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మానవ వ్యవస్థలన్నీ కూడా రోబోట్స్ కృత్రిమ మేధా వ్యవస్థలతో ఆటోమేటిక్‌గా పని చేసేటట్లుగా తయారు చేయబడతాయి అని ఒక ఊహ. ఇవి అన్ని రంగాలలో, వైద్యం ఆర్థికం రక్షణ పారిశ్రామిక వ్యవస్థలన్నిటిలో కూడా జరగొచ్చు. వీటిని శాశ్వతంగా నడిపించేందుకు ఆటోమేటిక్‌గా నడిపించేందుకు సోలార్ ఎనర్జీ లేక ఇతర వ్యవస్థల ద్వారా ఏర్పాటు చేయబడి ఉండొచ్చు. మనుషులందరూ నశించిపోయినా కృత్రిమ మేథ రోబోట్‌ల వ్యవస్థ మిగిలే ఉంటుంది. మనుషులకు వైరస్ వస్తే వాటికి పరిష్కారాలు రోబోట్స్ వల్ల కనుక్కోవచ్చు. అలాగని రోబోట్స్‌కి ఏ రిపేరు రాదని కాదు. కంప్యూటర్ వ్యవస్థకు వైరస్ వచ్చినట్టే రోబోట్స్‌కి వైరస్ రావచ్చు. అది సాఫ్ట్‌వేర్ వైరస్. అవి మనుషులు వారి అంతులేని మేధస్సుతో పరిష్కరించవచ్చు.

ఆ రకంగా రోబోట్ వ్యవస్థకి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మానవులు కూడా అవసరమే. మానవ వ్యవస్థా, అపారమైన విజ్ఞాన సర్వస్వాన్ని క్షణంలో అవగాహన చేసుకోగలిగే కృత్రిమ మేధస్సు పరస్పరం సహకరించుకుంటాయి అనే ఉద్దేశంతో రాసిన కథ ఇది. అందుకే ఆ రోబోట్లు మానవజాతి పూర్తిగా నశించకుండా ఉండటం కోసం ఆరోగ్యకరమైన జంటలని నిర్బంధంగా తీసుకువెళ్తాయి అనే సూచన ఈ కథలో ఉంది.

ప్రశ్న 5: ఈ సంపుటిలోని ‘ప్రయాణం’ కథ మిగతావాటి కంటే భిన్నమైనదనిపిస్తుంది . టైం ట్రావెల్ ఇతివృత్తంతో అల్లిన కథైనా భవిష్యత్తులోకి వెళ్ళడానికి కారణం తండ్రి కావటం, తిరిగి వర్తమానంలోకి వచ్చాకా, తన తండ్రి కంటే ముందే తాను చనిపోతాడని కథానాయకుడికి తెలియడం; బ్రతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలని అతడు భావించడం వల్ల ఈ కథ ఓ మంచి కథని చదివిన తృప్తిని పాఠకులకు కలిగిస్తుంది. ఓ సైన్స్ ఫిక్షన్ కథలో ఇంతలా భావోద్వేగాలను చొప్పించగలడం ఎలా సాధ్యమైంది?

జ. నిజానికి సైన్స్ ఫిక్షన్‌లో ఎంతో పాత అంశం అయినా చివరికి టైం ట్రావెల్ గురించి కూడా ఒక కథ తప్పనిసరిగా ఉండాలని ఆశయంతో రాసిన కథ ‘ప్రయాణం’. కాలంలో ప్రయాణం చేయడానికి తగిన సాధనాలు సైన్స్ పరంగా ఇంతవరకు చేయకపోయినా గత వంద సంవత్సరాల నుంచి కాల ప్రయాణపు కథలు సైన్స్ ఫిక్షన్‌లో వస్తూనే ఉన్నాయి. అయితే కాల ప్రయాణంలో భవిష్యత్తులోకి భూతకాలంలోకి వెళ్లి ప్రయాణం చేసి అక్కడ సంఘటనలు చూసి రావటం అనేది సాధ్యమా కాదా అనే విషయం పక్కన పెడితే దీంట్లో తార్కికంగా వేదాంతపరంగా ఎన్నో అంశాలు చర్చించబడుతుంటాయి. కాలంలో ముందుకు వెళ్లి చూసే కథలు కొన్ని అయితే భూతకాలంలోకి వెళ్లే కథలు మరికొన్ని. ఇప్పుడు కాలంలో పక్కకు లేటరల్ ట్రావెల్ లాగా ప్రయాణించడం కూడా ఇతివృత్తంతో కథలు వస్తున్నాయి. ఒక వ్యక్తి భవిష్యత్తులో కానీ భూతకాలంలో కానీ ఎందుకు ప్రయాణించాలనుకుంటాడు? ఏదో అవసరానికి కదా. నిజానికి అది చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. ఈ కథలో తన తండ్రికి క్యాన్సర్ వ్యాధి ఉండటం దానికి ఆరు నెలల్లో ఒక మందు తయారీ సిద్ధమవుపోతుందని తెలియటం ఆరు నెలలు భవిష్యత్తులోకి వెళ్లి ఆ మందు తీసుకువస్తే తండ్రి బతుకుతాడు అనే ఆశతో ఒకే ఆరునెలలు భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తాడు. కానీ నిజం వేరే విధంగా ఉంటుంది. కాలప్రయాణంలో లాజికల్ సమస్యలు ఎక్కువ. ‘గ్రాండ్ ఫాదర్ పారడాక్స్’ గురించి మీకు తెలిసే ఉంటుంది. భూతకాలంలో వెళ్లి మీ తాతగారిని మీరు చంపి వేయగలరా? అలా చేయగలిగితే మీరే ఉండరు కదా. కాబట్టి కాల ప్రయాణంలో ఏ సంఘటనల్లో జోక్యం కలుగజేసుకోరాదు అని నిబంధనలు పెడతారు. ఒకవేళ అలా పెడితే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. చరిత్ర మారిపోవచ్చు. ‘ప్రయాణం’ అనే ఈ కథ విధి బలీయమైనదని, ఎవరు జరగబోయే దాన్ని మార్చలేరని, జరిగిన సంఘటనల్లో జోక్యం కలగజేసుకోకూడదని ఊహతో రాసినది. అయితే అలా చేయడం సాధ్యం అని నమ్మగలిగేట్లు రాసిన కథలు కూడా సాహిత్యంలో వున్నాయి. ఇదే ఇతివృత్తంతో భూతకాలంలోకి ప్రయాణం చేయటం ‘బటర్ఫ్లై ఎఫెక్ట్’ ఇతివృత్తంతో రాసినది ‘సీతాకోకచిలుక’ కథ కూడా ఉంది. ఇవి అర్థం కావాలంటే ఆ కథలు చదవాల్సిందే. ఇది మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

ప్రశ్న 6: ‘ఆల్గోరిథమ్’ కథ డ్రైవర్‍లెస్ కార్ ఇతివృత్తంతో సాగింది. కథలో సంభవించిన పరిణామాలు నిజజీవితంలోనూ సంభవించవచ్చు. కృత్రిమ మేధ సాయంతో ప్రోగ్రామింగ్ చేయబడిన కార్లను ఆమోదించడం పాశ్చాత్య దేశాలలో సాధ్యమై ఉండవచ్చు. కానీ మన దేశంలో డ్రైవర్‍లెస్ కార్లను అనుమతించమని, దానివల్ల ఎందరో ఉపాధి కోల్పోతారని కేంద్ర రవాణా శాఖ మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

జ. ‘ఆల్గోరిథమ్’ అనే కథ చాలా పరిశోధన చేసి రాసినది. నాకు చాలా ఇష్టమైనది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్‌లెస్ కార్లు ఆటోమేటిక్‌గా నడిచేవి తయారుచేసి వాడుతున్నారు. నిజానికి డ్రైవర్ ఉన్న కార్ల కంటే డ్రైవర్ లేకుండా కంప్యూటర్ నడిపే కార్లకి తక్కువ యాక్సిడెంట్లు అవుతాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కార్లు నడపటానికి కంప్యూటర్ ఆల్గోరిథమ్‌లు సరిగ్గా ప్రోగ్రాం చేయబడాలి. ఎదురుగా వచ్చే వ్యక్తులు వాహనాలు చుట్టుపక్కల ఉండే వాహనాలు వ్యక్తులు ఇలాంటి అవరోధాలు అన్ని దాటుకుని లేకపోతే, ఆగిపోయి ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానం చేరుకోవాలి. ఈ క్రమంలో యజమానికి ఏ అపాయం రాకూడదు. వాటికి అనేక సెన్సార్లు ఉంటాయి. అవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా యజమానికి అపాయం రాకుండా ప్రోగ్రాం చేయబడతాయి. ఈ కథ రాయటానికి ట్రాలీ ప్రాబ్లం అనే విషయం గురించి చాలా చదవాల్సి వచ్చింది. ఒక ట్రాలీ రైలు పట్టాల మీద అతివేగంగా వస్తుందనుకోండి. మీ చేతిలో దానిని ఆపే పరికరం ఉంటుంది. అదే పట్టాల మీద ఐదుగురు వ్యక్తులు పని చేస్తుంటారు. ట్రాలీ ఆపకపోతే వారు మరణిస్తారు. పరికరంతో ట్రాలీ నా పక్కపట్టాల మీదకి తిప్పితే అక్కడ ఒకే వ్యక్తి పని చేస్తుంటాడు. అతను మరణిస్తాడు. ఐదుగురిని కాపాడటం కోసం ఒక వ్యక్తిని చంపాలా. ఎవరిని కాపాడాలి ఎవరిని చంపాలి. ఇలాంటి నిర్ణయాలు ఆల్గోరిథమ్‌లో పొందుపరచాలి. చిన్నపిల్లల్ని ముసలి వారిని స్కూల్స్ దగ్గర ఆడుకునే పిల్లల్ని ప్రమాదంలో పడేయకుండా కారుని ప్రోగ్రాం చేయాలి. ఇలాంటి విషయాలు ఎన్నో ‘ట్రాలీ ప్రాబ్లం’ లో ఉంటాయి. ఇవి చదివి ఈ కథ రాశాను. అమెరికా లాంటి దేశాల్లో మంచి రోడ్లు ట్రాఫిక్ సిగ్నల్స్ రూట్లు మంచి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి డ్రైవర్‌లెస్ కార్లు ఆటోమేటిక్ కార్లు వెళ్ళటం తేలిక. వాటిని ప్రోగ్రాం చేయడం తేలిక. ఎలాన్ మస్క్ యజమాని అయిన టెస్లా కంపెనీ ఇలాంటి కారులను ఇప్పటికే తయారు చేస్తోంది. అయితే మన భారతదేశం లాంటి రోడ్ల పరిస్థితుల్లో ఎప్పుడు కిక్కిరిసి ఉండే ట్రాఫిక్ సమూహంలో డ్రైవర్‌లెస్ కార్లు ఆటోమేటిక్ కార్లు ప్రవేశ పెట్టడం సాధ్యమేనా అనే అనుమానం నిజమే. అది అసాధ్యం అని అనిపిస్తుంది. దీనివల్లనే ఇంకా వీటికి అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు.

ప్రశ్న 7: కరోనా నేపథ్యలో రాసిన ‘విజేత’ కథ – రోగులకు చికిత్స చేస్తూ వైరస్ బారినపడి చనిపోయిన వైద్యులు, ఇతర సిబ్బంది వెతలను మనసుని కదిలించేలా చెబుతుంది. మనం భయపడాల్సింది భయానికే అని కథలో డా. శాంతి సాగర్ – విన్‍స్టన్ చర్చిల్ మాటలని గుర్తు చేసుకున్నా – కరోనా వేవ్‍లు ఒకదాని తరువాత ఒకటిగా కలిగించిన ఉత్పాతం; ఇటీవలి కాలంలో కేరళలో కొత్త వేరియంట్ తలెత్తడం వంటి వాటివల్ల ఆ భయం అనేది నిరంతరం కొనసాగవలసిన పరిస్థితి తలెత్తుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ సాధ్యమవుతుందా?

జ. ‘విజేత’ అనే కథ కరోనా రోజుల్లో, ‘కొత్త కరోనా కథలు’ అనే కథా సంకలనం ప్రచురించేటప్పుడు వంశీ ఫౌండేషన్ వారి తరఫున ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి సుథాదేవి గారు, వంశీ రామరాజు గారు అడిగితే వారికి ఇచ్చిన కథ. కరోనా వైరస్ అనేది ఒక ప్రళయం. సైన్స్ ఫిక్షన్‌లో తరుచుగా రాయబడే లాంటి ఉత్పాతం. ఎందుకు వస్తుందో దానికి మందు ఏమిటో తెలియకుండానే లక్షల మంది ప్రపంచమంతా చనిపోయారు. ఎంతో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మరణాలు నివారించలేకపోయారు. ఇలాంటి విలయాలలో మనిషి నిజమైన ప్రవృత్తి త్యాగం, సేవాగుణం ఒకపక్క కనిపిస్తే, మనిషిలోని స్వార్థం, మూఢనమ్మకాలు, అమానవీయత మరొకవైపు కనిపిస్తాయి. మానవ ప్రవర్తనలోని నిజమైన సంక్లిష్టత ఇలాంటి పాండమిక్ సమయాల్లోనూ ప్రపంచం అంతం అవుతోంది అనుకునే సమయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం వల్ల వ్యాక్సిన్లు తయారుచేసి అనేక కోట్ల మందికి ఇచ్చి ప్రస్తుతం ఈ వ్యాధిని నివారించగలిగాం. కానీ మరొక వైరస్ మరొక మ్యుటేషన్,వేరియంట్ రాదని నమ్మకం ఏమీ లేదు. ఈ కథలోని డాక్టర్ లాగా అనేకమంది ఇతర శాస్త్రజ్ఞులు అంకిత భావంతో భవిష్యత్తులో వచ్చే మరిన్ని ఉత్పాతాల్ని పాండమిక్‌లని ఎదుర్కోవటమే మార్గం. ఇలాంటి ఉత్పాతాలు మళ్లీ రావని గ్యారెంటీ ఏమీ లేదు. ఇలాంటి ఉత్పాతాల్లో మనం ధైర్యంగా ఎలా వ్యవహరించాలో నేర్పేదే డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్. అయితే ఈ కథలోని సంఘటన నిజంగా ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఆధారంగా రాసిందే. ఒక డాక్టర్ కరోనా వైరస్‌తో చనిపోతే అతని శరీరాన్ని కూడా అంతిమ సంస్కారం చేయటానికి ప్రజలు అడ్డుపడిన సంఘటనలు మనకు తెలుసు. ఇది ఉత్పాతాల వల్ల మానవ ప్రకృతి ఎలా మారిపోతుందో ఒక ఉదాహరణ.

ప్రశ్న 8: ఈ సంపుటిలోని మూడు చారిత్రక కథలకు నేపథ్యం బుద్ధుడు, బౌద్ధం అవడం యాదృచ్ఛికమా లేక బౌద్ధం ఇతివృత్తంగా అల్లిన కథలని ఈ సంపుటిలో చేర్చారా?

జ. చరిత్ర కూడా ఒక విజ్ఞాన శాస్త్రం లాంటిదే. అది శాసనాలు, తవ్వకాలు, స్తూపాలు ఇలాంటి చారిత్రక ఆధారాలు ద్వారా నిర్మించబడుతూ ఉంటుంది. చారిత్రక కథలు రాయాలని నన్ను ప్రత్యేకంగా ఆకర్షించిన బౌద్ధ మతం మీద రాయాలని కోరిక ఉండేది. అసలు బౌద్ధమతం భారతదేశంలో పుట్టినా, ఎలా క్రమక్రమంగా అంతరించిపోయిందని సందేహం నాకు చాలా కాలం ఉండేది. ‘సుజాత’ అనే కథ బుద్ధుడు బోధి గయలో సుజాత అనే ఆమె దగ్గర పాయసం తాగి, జ్ఞానోదయం కలిగి బోధిసత్వుడై, ఆ తర్వాత ఉపవాస దీక్షలు మానేసి బుద్ధుడిగా మారిపోవటం అనే కథ నన్ను చాలా ప్రభావితం చేసింది. సుజాత పేరుతో స్తూపం ఇప్పటికీ బీహార్ గయ దగ్గర ఉంది. బుద్ధుని తర్వాత రెండో బుద్ధుడుగా పిలవబడే నాగార్జునుడు శ్రీ పర్వతం దగ్గర నాగార్జున విశ్వవిద్యాలయంలో అనేకమందికి విద్యా శిక్షణ చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒక చారిత్రక కథాకార్యశాలకు వెళ్ళినప్పుడు చారిత్రక కథలు రాయాలనే స్ఫూర్తి దొరికింది. వైద్యమూ, నాగార్జునాచార్యుడి నేపథ్యంలో కథ రాయాలని రాసిన కథ ‘సంఘం శరణం గచ్ఛామి’ నాగార్జునుడికి వైద్యంలో కూడా ప్రావీణ్యం ఉందని రసవాదం అనే ప్రక్రియ చేసేవాడని చరిత్ర గ్రంథాల్లో దొరికింది. “సంఘం శరణం గచ్ఛామి” అనే కథ ఎంతోమంది పాఠకుల ప్రశంసలు పొందింది. ఎన్నో వారాలు ఎంతోమంది రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ ఫోన్‌లు చేస్తూనే వున్నారు. నాగార్జుని మీద రాసిన కథలు లేవు అనుకుంటాను. ‘శ్రీపర్వతం’ అని నవల సంచికలో వచ్చినది మాత్రం చదివాను. ఆ స్ఫూర్తితోనే మరొక కథా సంకలనానికి బౌద్ధమతంలో బుద్ధుడు, నాగార్జునుడు, తర్వాత అంత గొప్పవాడైన పద్మ సంభవుడు అనే మరొక మహా గురువు వజ్రయాన కర్త గురించిన కథ ‘పద్మ గంధిని’ అనేది రాశాను. ఈ కథ ప్రముఖ సంపాదకుడు రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు కూర్చిన ‘తెలుగుపెద్ద కథలు’ సంకలనంలో ప్రచురించబడింది. బౌద్ధమతంలోని ముగ్గురు మహానుభావుల గురించిన మూడు కథలు కాబట్టి ఈ సంపుటిలో చారిత్రక కథల కింద ప్రచురించాను.

ప్రశ్న 9: ఈ సంపుటిలోని కథల్లోని మూడు విభాగాల్లో మీ మనసుకు బాగా దగ్గరగా ఉన్న కథ ఏది? ఏ కథ రాయటానికి మీరు ఎక్కువగా శ్రమించారు?

జ. ఈ సంపుటిలోని అన్ని కథలు నాకు ప్రియమైనవే. ప్రతి కథా కొంత పరిశోధన చేసి సమాచారం సేకరించి రాసినదే. అయితే ఒకే ఒకటి చెప్పాలి అంటే అన్నిటికంటే నాకు ఇష్టమైన కథ, నాకు నచ్చిన కథ ‘ఆల్గోరిథం’. డ్రైవర్‌లెస్ కార్ల గురించి రాసినది. అయితే ఎక్కువ శ్రమించి రాసినది నాగార్జునుడు ముఖ్యపాత్రగా ఒక శిల్పి బౌథ్థభిక్షుణికి మథ్య జరిగిన ప్రేమకథతో రాసిన ‘సంఘం శరణం గచ్ఛామి’ కథ. ఈ కథ రాయటానికి కనీసం మూడు నెలలు పైనే పట్టింది.

ప్రశ్న 10: ఏదయినా కథ ఇంకా బాగా రాసి ఉండాల్సింది అనిపించిందా? కొంచెం నిడివి పెంచితే/తగ్గించితే చెప్పాల్సింది ఇంకా బాగా చెప్పి ఉండవచ్చనిపించిందా?

జ. అయితే చారిత్రక కథ ‘పద్మ గంధిని’ ఇంకా పరిశోధించి మరిన్ని వివరాలతో చాలా పెద్ద కథ కింద కానీ నవల కింద గాని రాయాల్సి ఉండిందని నాకు అనిపిస్తుంది. నిజంగానే ఈ కథలో రాసిన బొజ్జన్న కొండ గుహలు అనకాపల్లి దగ్గర  ఉన్నాయి. వజ్రయానంలోని గురువు రిన్ పోష్ అనబడే పద్మసంభవుడు తపస్సు చేసిన టైగర్ గుహలు భూటాన్‌లో ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాల మధ్య అల్లిన కథే ‘పద్మగంధిని’. అయితే చారిత్రక ఆధారాలు మత వివరాలు ఆ పద్మసంభవుడిని ప్రార్థన చేసే మంత్రాలు తప్ప మిగిలినవన్నీ నా కల్పన మాత్రమే. ఇది ఇంకా బాగా రాసి ఉండాల్సిందని, అభిరాముడు అనే ఆ తెలుగు గ్రామీణ యువకుడు ఇప్పటి అనకాపల్లి నుంచి భూటాన్ వరకు ప్రేయసిని వెదుకుతూ చేసిన ప్రయాణం గురించి మరింత పరిశోధన చేసి ఇంకా బాగా పదవ శతాబ్దపు వివరాలతో రాయాల్సిందే, అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాలో మెదిలే కథలకు నవలలకీ ఒక జీవిత కాలం సరిపోదేమో. ఇంకా ఎన్నో రాయాలనే అనిపిస్తుంది, ఎవరూ రాయని కథలు.

ప్రశ్న 11: కథా, నవలా రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ. సైన్స్ ఫిక్షన్ స్పెక్యులేటివ్ ఫిక్షన్ తెలుగులో ఇంకా రాయాలి మరిన్ని అంశాలతో కథలు రాయాలని నా అభిలాష. నా వయసు, వృత్తి, సమయం ఏకాగ్రత ఎక్కువ ఇవ్వడం లేదు. ఇతర బాధ్యతలు కూడా. సైన్స్ ఫిక్షన్ కథలు నవలలు రాసినవి ప్రచురణ అయినా చదివి మెచ్చేవారు తక్కువ. సామాజిక ప్రయోజనం లేక మనస్తత్వ చిత్రణ, లేక ఎక్కువ కవిత్వంతో, అస్తిత్వవాదాలు వున్న కథలకే తెలుగులో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు కథల్లో కవిత్వం రాయడం ఇష్టం వుండదు. కథలో కథ వుండాలి అనుకుంటాను. అయితే ప్రస్తుత సమాచార విప్లవం లోని ప్రగతితో ఇప్పుడు మనకు కృత్రిమ మేధా చాట్ జిపిటి లాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అనుభూతులు భావాలు ఉన్న రోబట్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నట్టుగా భవిష్యత్తులో రోబోట్స్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ని, వైద్యరంగమే కాకుండా అన్ని రంగాలలో ఇంకా ఎక్కువగా వాడుకోబోతున్నారు. ఒక దశలో కృత్రిమ మేధ మానవ మేధస్సు కంటే ఎన్నో రెట్లు అధిగమించి మానవ నాగరికతనే శాసించే పరిస్థితి వస్తుందేమో అనే భయాలు అందరికీ ఉన్నాయి. ఈ విషయాలతో ఇంకా కథలు రాయాలని నా కోరిక. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇంగ్లీషులో ‘ది లాస్ట్ సిటీ’ అనే నవల ప్రారంభించాను. తెలుగులో ఎన్ని నవలలు కథలు సైన్స్ ఫిక్షన్ పరిధిలో రాసినా గుర్తింపు తక్కువగా వస్తుంది పట్టించుకోరు అనే బాధ నాలో ఉంది. సైన్స్ ఫిక్షన్ గురించిన జాతీయ సమావేశాల్లో తెలుగులో రాసిన సైన్స్ ఫిక్షన్ కథల గురించి ప్రస్తావించినప్పుడు వాటికి ఆంగ్లానువాదాలు లేకపోవడం వల్ల మన రచయితలు ఉన్న కొద్దిమంది అయినా గాని వారి రచనల గురించి ఇతర భాషల వారికి తెలియడం లేదు.

సంచిక-స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ ఫిక్షన్ రచయితల సమావేశంలో శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ సలీం గార్లతో డా. చిత్తర్వు మధు

నాతో పాటుగా ప్రఖ్యాత రచయితలు కస్తూరి మురళీకృష్ణ, సలీం ఇప్పుడు చాలా బాగా సైన్స్ ఫిక్షన్ రాస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇంకెవరూ సైన్స్ ఫిక్షన్ రాసే రచయితలు కనిపించడం లేదు. దీనివల్ల జాతీయంగా అంతర్జాతీయంగా మనకి గుర్తింపు రావడం లేదు. ఇంగ్లీషులోకి గాని ఇతర భాషల్లోకి కానీ మన సైన్స్ ఫిక్షన్ రచనలు అనువాదం అయితే ఇప్పుడు ఇదివరకు మన భాషలో వెలువడిన అనేక అంతర్జాతీయ ప్రమాణాలు కల సైన్స్ ఫిక్షన్ రచనలు గుర్తింపుకొస్తాయి. ఇదివరకు రాసినవారు ఎందరో వున్నారు కూడా.

శ్రీ కిరణ్ ప్రభ గారితో డా. చిత్తర్వు మధు

నేను ఇదంతా ఎలాగూ చేయలేను కాబట్టి ఈసారి ఇంగ్లీషులో నవల ప్రారంభించాను. పదిహేను అధ్యాయాల దాకా అయింది. ఈ దశలో ముందే ఇతివృత్తం చెప్పినా నాకు నష్టం ఏమీ లేదు.

రాస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొరపాటున ప్రపంచాన్ని అంతం చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్టోపియన్ నవల. గత సంవత్సరం సంచిక వెబ్ మేగజైన్లోనే ‘నగరంలో మరమానవి’ అనే రోబోట్‌ల తిరుగుబాటు అనే అంశం మీద 14 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ రాస్తే ధారావాహికగా ప్రచురించారు. హ్యూమనాయిడ్ రోబోట్ల తిరుగుబాటు గురించిన ఇతివృత్తంతో రొమాన్స్ కూడా కలిపి ఉత్కంఠ కలిగించే నవలిక ఇది. ఇది ఇంకా పుస్తకంగా ప్రచురించవలసి ఉంది. ఇంగ్లీష్‌లో ‘ది లాస్ట్ సిటీ’ కూడా త్వరలోనే ముగించి పరిస్థితులు అనుకూలిస్తే ప్రచురించాలని ఆశ, ఆశయం. అయితే సైన్స్ ఫిక్షన్ స్పెక్యులేటివ్ ఫిక్షన్, పారానార్మల్ ఇతివృత్తాలు ఇలాంటి వాటితో ఈమధ్య తెలుగులో కొన్ని సినిమాలు, కొన్ని ఓటీటీ ప్లాట్ఫారం మీద సిరీస్ రావటం సంతోషకరమే. అయితే ఇవి ఇంకా ఉన్నత ప్రమాణాలతో రావాలి. చవకబారు హాస్యానికి హారర్‌లో, చీప్ సస్పెన్స్‌కి పారానార్మల్ సైన్స్ ఫిక్షన్‌లో ప్రాధాన్యత ఇవ్వకుండా, మంచి ప్రమాణాలతో, మానవత్వపు విలువలతో ఇంకా మంచి రచనలు రావాలి, సినిమాలు కూడా రావాలి అని కోరుకుంటున్నాను.

మొదటినుంచి ప్రతినెలా ఒక సైన్స్ ఫిక్షన్ కథ రాయమని నన్ను ప్రోత్సహించి ప్రచురించి తెలుగు సాహిత్యంలోని ఈ జోనర్‌ని ఎక్కువగా రాసిన నాకు గుర్తింపు వచ్చేట్లు ఎంతో చేసిన సంచిక సంపాదక వర్గానికి ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ గారికి, నా సైన్స్ ఫిక్షన్ కథలు ‘ఆల్గోరిథమ్’ పేరుతో ప్రచురించిన అన్వీక్షికి పబ్లిషర్స్ కూ , అంతకు ముందు వచ్చిన మరొక సంపుటి ‘Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు’ ప్రచురణ చేసిన జెవి పబ్లిషర్స్ రచయిత్రి జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలు.

“మీరు మామూలు కథలు ఇంకా బాగా రాయగలరు, రాయండి” అని అడిగే పాఠకులకి, స్నేహితులు సాహిత్య ప్రియులు విమర్శకులకు నేను చెప్పగలిగేది ఏమీ లేదు. Art is long but life is short.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మధు గారూ.

డా. చిత్తర్వు మధు: ధన్యవాదాలు, నమస్కారం.

***

ఆల్గోరిథమ్ (కథాసంపుటి)
రచన: డా. చిత్తర్వు మధు
ప్రచురణ: అన్వీక్షికీ పబ్లిషర్స్, హైదరాబాద్.
పేజీలు: 205
వెల: ₹ 200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/ALGORITHM-MADHU-CHITTARVU/dp/B0CLS5Y43S/

 

 

~

‘ఆల్గోరిథమ్’ కథాసంపుటిపై సమీక్షని ఇక్కడ చదవవచ్చు:
https://sanchika.com/algorithm-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here