[‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ అనే సంకలనాన్ని వెలువరించిన డా. నాగసూరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారూ.
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్: నమస్కారమండీ.
~
ప్రశ్న 1: అడివి బాపిరాజు గారి సాహితి, చిత్రలేఖన, శిల్ప, నాట్య, సంపాదక, సినీకళానైపుణ్యాల విశ్లేషణల సంకలనం ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ ప్రచురించినందుకు ధన్యవాదాలు! ఈ ఆలోచన ఎలా వచ్చింది?
జ: చాలా చాలా ధన్యవాదాలండి మురళీకృష్ణ గారు! ఈ ప్రాజెక్టు గురించి మీకు తెలుసు, మిమ్మల్ని సంప్రదించడం, మీరు మంచి వ్యాసం రాయడం చాలా ఆనందదాయకం. అలాగే అంతకుమించి ఇందులో వ్యాసాలు ఇచ్చిన దాదాపు 45 , 50 మంది వ్యాసకర్తలకు రెండు సంపుటాలు బహుమతిగా శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ వారు పంపించారు. ‘అఖిలకళా వైభవ శ్రీ అడివి బాపిరాజు’ (సాహితీ చిత్రలేఖన శిల్ప నాట్య సంపాదక సినీ కళా నైపుణ్యాల విశ్లేషణ) పుస్తకం శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ విజయవాడ వారి ద్వారా వెలువడింది. ఇందులో మొత్తం 870 పేజీలు పైచిలుకు, ఇవన్నీ రెండు సంపుటాలుగా మనకు కనబడతాయి. ఇందులో 840 పుటల టెక్స్ట్, ఒక 15 పేజీల బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, అలాగే 14 పేజీల కలర్ ఫోటోలు ఉన్నాయి. అంటే 870 పేజీలు మ్యాటర్‌ని సుమారు 7 విభాగాలుగా విభజించి అందించాము. ఐదారు తరాలకు సంబంధించిన పండితులు అంటే అడివి బాపిరాజు సమకాలీనులు విశ్వనాథ సత్యనారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆస్వాల్డ్ కూల్డ్రే, దామెర్ల రామారావు, కవికొండల వెంకటరావు ఇలాంటి వాళ్లతో పాటు ప్రస్తుతం తెలుగు సాహిత్య రంగంలో గట్టి కృషి చేస్తున్న సుమారు 50 మంది ప్రముఖులు అందించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అంటే సుమారు 170 అంశాలను సుమారు 100 మంది రచయితలు అందజేసినవి ఏడు విభాగాలుగా ఇందులో కనబడతాయి. నిజానికి ఇది నా వరకు ఒక అపురూపమైన అవకాశం గానే భావిస్తాను.
2003వ సంవత్సరంలో ‘శత వసంత సాహితీ మంజీరాలు’ అనే ఏడు వందల పైచిలుకు పేజీల 100 వ్యాసాల సంకలనం తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైన ప్రయత్నంగా మిగిలిపోయింది. అందులో 20వ శతాబ్దానికి సంబంధించి 100 తెలుగు పుస్తకాలను సుమారు 100 మంది ప్రముఖులు లోతైన విశ్లేషణలను చేశారు. ‘శతవసంత సాహితీ మంజీరాల’ తర్వాత ప్రత్యేకంగా ఈ అడివి బాపిరాజు సంకలనం ‘అఖిలకళా వైభవ శ్రీ అడివి బాపిరాజు’ సంకలనాల గురించి నేను చెప్పుకోవచ్చు.
నాకు బాగా గుర్తు 2020 నవంబర్ 24న మిత్రులు మండలి బుద్ధ ప్రసాద్ గారు “మిమ్మల్ని కలవాలి, ఇంట్లో ఉన్నారా” అని ఫోన్ చేసి, వచ్చి కలిసారు. అప్పట్లో నేను హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తున్నాను. వారు మా ఇంటికి వచ్చి అడివి బాపిరాజు 125 జయంతి సందర్భంగా ఒక సంకలనం చేయాలనుకున్నాము, కరోనా కారణంగా ఆలస్యమైంది. మీరు సాయం చేసి ఆ బాధ్యతను తీసుకోగలరా అని కోరారు. నిజానికి ఈ బాధ్యతను నేను ఒక్కడుగా అంటే (ఇది బృందం కాదు) నేనొక్కడే ఈ పని పూర్తి చేయవలసి ఉంటుంది, ఎంత పని ఉంది ఏమిటి అనే స్పృహ కొంతవరకు లేకుండానే నేను అంగీకరించానేమో!
దీనికి కొంత నేపథ్యం ఉంది సుమారు రెండు దశాబ్దాల క్రితం 2004-2005 ప్రాంతంలో నేను విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేస్తున్న కాలంలో అక్కడి సాహితీ ప్రముఖులు, అడివి బాపిరాజు గారి బంధువు అయిన కామర్స్ భాస్కరరావు ఓ రోజు ఉదయం మా ఇంటికి వచ్చి అడివి బాపిరాజు గురించి కొంత కృషి చేయాలనుకుంటున్నాము, ఆ సంస్థకు మీరు మార్గ నిర్దేశికత్వం వహిస్తే బాగుంటుంది అని కోరుతూ ఒక రెండు సంచికలను నాకు బహూకరించి వెళ్లారు. అవి 1985లో వెలువడిన ‘నాదబిందు శశికళ’; అలాగే 1995లో వెలువడిన శతవార్షిక అడివి బాపిరాజు. మొదటిది పుస్తకం కాగా, రెండవది జిరాక్స్ ప్రతి. ఈ రెండూ నాకు బహుకరించి కూడా వెళ్లారు. అయితే అప్పటికి నా పని ఒత్తిడి కారణంగా కామర్స్ భాస్కర్ రావు గారి విన్నపాన్ని నేను స్వీకరించి లేక మృదువుగా తిరస్కరించారు. అయితే ఈ పని చేశాను అన్న అసంతృప్తి మాత్రం ఉండేది. ఎందుకంటే బాపిరాజు గారు చాలా రకాలుగా బహుముఖ ప్రజ్ఞాశాలి వారు ఉదాత్తమైన సౌశీల్యం కల శీలవంతుడైన రచయిత, కళాకారుడు, సంపాదకుడు, శిల్ఫి, చిత్రకారుడు, స్వాతంత్ర సమరయోధులు! వారి పాటలు, నవలలు, కథలు వారు చిత్రించిన బొమ్మలు ఇలా చాలా మనకు, స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా గుర్తు కనుక ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించి నేను ఒక రెండున్నర సంవత్సరాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేయగలిగాను. దానికి ఆలోచన, ఇచ్చి కొన్ని వ్యాసాలు మరి ముఖ్యంగా నెట్ నుంచి సేకరించి పంపిన పెద్దలు బుద్ధప్రసాద్ గారికీ, అలాగే ఎంతో వ్యయంతో కూడిన ఈ 870 పేజీల పుస్తక ప్రచురణకు దిగిన శ్రీ రాఘవేంద్ర ప్రచురణల మిత్రులకు ముఖ్యంగా దిట్టకవి రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.
ప్రశ్న 2: సాధారణంగా పెద్ద యూనివర్సిటీలు, అకాడెమీలు చేయాల్సిన పని ఇది! మీరు ఒంటరిగా ఈ కార్యాన్ని సాధించారు! మీకు ఏ సందర్భంలోనైనా ఈ పని నావల్ల కాదు అన్న అధైర్యం కలిగిందా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ముందుకు సాగారు?
జ: నిజమే ఈ సంకలనాలు చూడని వారికి ఈ ప్రశ్న ఎంతో అతిశయోక్తిగా కనపడవచ్చు కానీ ఈ గ్రంథాలను చూసిన వాళ్లు ఖచ్చితంగా దీన్ని పూనుకున్న వారి నేపథ్యం ఏమిటి, కృషి ఏమిటి అనే ప్రశ్నలు వేసుకోక మానరు. ఎందుకంటే ఇందులో సుమారు 870 పేజీల పుటలలో ఏడు విభాగాలు ఉన్నాయి. సుమారు 170 అంశాలు దాదాపు 100 మంది రచయితలు ఇందులో దర్శనమిస్తారు. తొలి విభాగంలో మండలి బుద్ధ ప్రసాద్ గారి ముందుమాట తర్వాత సంపాదకుడిగా ఈ ప్రయత్నంలోని సాధకబాధకాలతో పాటు కృషి పూర్తి అయిన తర్వాత కలిగిన అభిప్రాయాలు వగైరా ఒక 24 పేజీల విశ్లేషణగా మీకు కనబడుతుంది. ‘కళ వ్యక్తిత్వ దిగంతం’ ఇది రెండో విభాగం పేరు. కొంత సులువుగా అర్థం అవడానికి దానికి ‘అంతేవాసుల అనుశీలన’ అని కూడా మేము అన్నాము. ఇందులో సుమారు 39 రచనలు 150 పేజీల మ్యాటరు ఉంది. విశ్వనాథ సత్యనారాయణ, పిలకా గణపతి శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, ఇంద్రగంటి హనుచ్ఛాస్త్రి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, బుద్ధవరపు కామరాజు, తిరుమల రామచంద్ర, తాడికొండ రాధా వసంత, పింగళి లక్ష్మీకాంతం, రాయప్రోలు సుబ్బారావు, కవికొండల వెంకట్రావు, అమరేంద్ర, పందిరి మల్లికార్జునరావు, కాటూరి వెంకటేశ్వరరావు, కరుణశ్రీ, సంజీవదేవ్, దేవులపల్లి రామానుజరావు, బొమ్మకంటి సుబ్బారావు, నాయని కృష్ణకుమారి, మొక్కపాటి కృష్ణమూర్తి, ఆచంట జానకిరామ్, రాధా కిరణ్, గుత్తి రామకృష్ణ, ఆర్ ఎస్ వసుందరా దేవి, జలసూత్రం రుక్మిణినాథశాస్త్రి, దిగవల్లి వెంకటరత్నం, రాంభట్ల కృష్ణమూర్తి, బుచ్చిబాబు, విష్ణువర్ధన, శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, ఆస్వాల్డ్ జే కూల్డ్రే, పండ్రంగి రాజేశ్వరరావు. వీళ్ళు రాసిన వ్యాసాలూ అందులో కొందరు రాసిన కవితలు, పద్యాలు కూడా ఈ రెండవ భాగం అంటే ‘కళా వ్యక్తిత్వ దిగంతం’లో ఉన్నాయి. అంటే అడవి ఒక రాజు గారి మిత్రులు, సన్నిహితులు, శిష్యులు, గురువులు, గురుప్రాయులు వ్యక్తిగరించిన అభిప్రాయాలు ఇందులో కనబడతాయి. ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞ గలిగిన అడివి బాపిరాజు 1895 అక్టోబర్ 8న జన్మించారు, తన 57వ ఏట వయసులో 1952 సెప్టెంబర్ 22న కనుమూశారు. ఇక మూడవ విభాగంలో ‘స్మరణిక’లో మనకు సుమారు 70 పేజీలు కనబడతాయి. ఇందులో ఒక 20 దాకా వ్యాసాలున్నాయి. ఇందులో అడివి బాపిరాజు రాత, సంతకం కనబడుతుంది. ఆయన అంకిత పద్యాలు కనపడతాయి. కూల్డ్రే శిష్యులకు అంటే అడివి బాపిరాజుతో సహా ముగ్గురు శిష్యులకు ఇచ్చిన అంకిత సందేశం కనపడుతుంది. కుటుంబ సభ్యులు, కోలవెన్ను వంటి వారి మిత్రులు, ప్రమోద్ కుమార్ చటర్జీ వంటి గురువులు అలాగే వారు వేసిన ముఖచిత్రాలు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ కవితలకు వేసిన బొమ్మలు ఇలాంటివీ ఇంకా కనకాభిషేకం విశేషాలు, ఆ సందర్భంగా రాసిన కవితలు, ఆస్వాల్డ్ కూల్డ్రే ఉత్తరం, తర్వాత తన సన్నిహిత మిత్రులు రాసిన వ్యాసాలు, ఇంకా అడివి బాపిరాజు గురించి ఇదివరకు వచ్చిన సంకలనాల లేదా ప్రత్యేక సంచికల విశేషాలు ఇందులో కనబడతాయి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి వారు 52 సెప్టెంబర్ 22న కనుమూసిన తర్వాత 54లో రామచంద్రపురం నుంచి రావులపర్తి భద్రిరాజు పూనుకొని ‘కులపతి’ అనే సంచికను ఎక్కువ పేజీలతో చక్కగా వెలువరించారు. తర్వాత 8 సంవత్సరాలకి వారు కనుమూసి పదేళ్లైన సందర్భంగా బందరు నుంచి ‘చుక్కాని’ పక్షపత్రిక 1962 అక్టోబర్ మొదటి పక్షాన లో ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది. తర్వాత 90వ జయంతి సందర్భంగా దిట్టకవి శ్యామలా దేవి, బుద్ధవరపు కామరాజు పూనుకొని ‘నాద బిందు శశికళ’ అనే సంచికను వెలువరించారు. వారి శతజయంతి సంవత్సరం సందర్భంగా విజయవాడ నుంచి వెలువడే ‘ప్రజాసాహితి’ మాసపత్రిక జూలై మాసంలో ప్రత్యేక సంచికను అడివి బాపిరాజు సేవలను స్మరించుకుంటూ వెలువరించింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి భరాగో సంపాదకుడిగా శతవార్షిక సంచిక అచ్చయింది. తర్వాత 2002లో ఒక సంచిక తేవాలని ప్రయత్నం జరిగింది, కానీ వచ్చినట్టు లేదు. 2013లో 118 జయంతి సంచిక వచ్చింది. ఈ నాలుగు సంచికలు నాలుగు సంకలనాలు, రెండు సంచికలు గాలించి వాటిని సంపాదించి మేము ఈ ఖుషి లో దిగాము. అలాగే నా దగ్గర మంచి గ్రంథాలయం 34 ఏళ్లుగా ఎంపిక చేసుకున్న పుస్తకాలతో ఇంట్లో ఉంది. కనుక వాటి నుంచి చాలా వ్యాసాలు రచనలూ అలాగే ఇప్పటి తరానికి సంబంధించి ఒక 45, 50 మందితో వ్యాసాలు ఆహ్వానించి మేము ఈ సంచికలో చేశాం. ఈ ప్రశ్నలో మొదట ప్రస్తావించిన విషయాన్ని అంటే పెద్ద యూనివర్సిటీలు, అకాడమీలు చేయాల్సిన పనిని ఒంటరిగా సాధించారు అని. మీ అభినందనలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు!
కొంతకాలంగా మరీ ముఖ్యంగా పాతిక సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలంలో మన సమాజం ఎంతో బాధ్యతారాహిత్యంగా మారిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దృష్టి వివిధ రకాలుగా వ్యక్తులు దార్శనికత కోల్పోతే, సంస్థలు కూడా ఏమి చేయలేని, పూనుకోలేని పరిస్థితికి జారిపోతాయి. ఇది ప్రభుత్వ సంస్థల కైనా ప్రైవేట్ సంస్థల కైనా వర్తిస్తుంది. 1970 దాకా చాలా రకాలుగా తెలుగులో విభిన్నమైన కృషిని చాలా రకాల సంస్థలు చేశాయి. అయితే ఇటీవల కాలంలో సంస్థలు ఉన్నాయి గాని అటువంటి కృషి చేస్తున్న వ్యక్తులు మాత్రమే తమ సొంత ప్రయత్నంతో వారు పూనుకుంటున్నారు, సాధిస్తున్నారు. ఇక మీరు అడిగిన మరో విషయం ఏమిటంటే ఏ సందర్భంలో అయినా ఈ సంకలనం చేస్తున్నప్పుడు అధైర్యం కలిగిందా, ఆ ప్రశ్న వచ్చిందా అని మీరు అన్నారు! అలాంటి సందర్భం రాలేదు కానీ, ఈ పని చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ పని ఉంది అని మాత్రం అనిపించింది. అంతకుమించి నా జీవితకాలంలో సుమారు రెండేళ్ల వ్యవధిని ఈ సంకలనం హరించింది అని అనిపించింది. అంతేగాని అధైర్యం అనే సందర్భం రాలేదు. చాలా సందర్భాల్లో ప్రచురణ కర్త ఎవరు అని ముందే నిర్ణయించుకొని దిగిన సందర్భాలు చాలా తక్కువ. ఇది కూడా అంతే! మొదట మనం పని చేద్దాం, తర్వాత చూద్దాం అనే దృష్టి నాకు ఉంది. కనుకనే నేను ఇప్పుడు సుమారు 50 గ్రంథాలు రచించడం 30 విభిన్నమైన సంకలనాలకు సంపుటాలకు సంపాదకత్వం వహించడం జరిగింది. ఈ పుస్తకాలను ఏ ఒక్క రచన కర్త ప్రచురించలేదు, ఆ జాబితా చూస్తే సుమారు పాతిక, 30 మంది వ్యక్తులు గాని, సంస్థలు గాని మీకు కనబడతాయి. అందులో నేను కూడా సొంతంగా వ్యయం చేసి ప్రచురించుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయి!
ప్రశ్న 3: ఎందుకని మన అకాడమీల్లో, యూనివర్సిటీల్లో ఇలాంటి సాహిత్య ప్రయోజనం కల పనులు సాగటంలేదు? ఎందుకని అకాడమేతర వ్యక్తులు , వ్యక్తిగతంగా ఇలా సాహిత్య సంబంధిత కార్యాలను తమ భుజాలపై వేసుకోవాల్సివస్తోంది? విద్వాన్ విశ్వం, సర్దేశాయి తిరుమలరావు, ఇప్పుడు అడవి బాపిరాజు ఇలాంటి వ్యయప్రయాసల భారాన్ని సాహిత్యాభిమానులు భరించాల్సిన దుస్థితి ఎందుకు నెలకొని వుందంటారు?
జ: అవును నిజమే! ఎందుకంటే దాదాపు ఎవరు స్పృశించని విషయాలకు సంబంధించి నేను ఇటువంటి సంకలనాలు వెలువరిస్తున్నాను. తాపీ ధర్మారావు, సైన్స్ ఎందుకు రాస్తున్నాం, పర్యావరణ కథలు, వర్తమాన మద్రాసు తెలుగు వారి జీవితాలను చిత్రించిన కథలు.. ఇలాంటి కృషి చేస్తున్నాను. అలాగే మహాత్మా గాంధీ సంబంధించి కొన్ని సంకలనాలు వెలువరించాను, ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణికి సంబంధించిన సాహితీ విశ్లేషణల వ్యాస సంకలనం సుమారు 500 పేజీలతో ప్రచురణకు కావాల్సి ఉంది.
ఇటువంటి బాధ్యతారాహిత్యమైన పరిస్థితి ఒక్క తెలుగులోనే దాపురించి ఉందేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. మనకు మిగతా ప్రాంతాల్లో, మిగతా దేశాల్లో జరుగుతున్న కృషి, అక్కడ నడుస్తున్న విధానాలు ఏమిటి అని కూడా ఆలోచన చేసే సందర్భంగా అని, అవకాశం గాని లేకుండా మనం ఉంటున్నాం. లేకపోతే అందరికీ అవసరమైన విషయాలను కొందరు మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి? వ్యక్తులనుకోండి వారి కవిత్వం, కథలు వేసుకుంటారు, ఆనందపడతారు. అయితే పర్యావరణం, సైన్స్ ఫిక్షన్, తాపీ ధర్మారావు సంబంధించి.. ఇలాంటి విషయాలకు సంబంధించిన మొత్తం సమాజానికి అవసరమైన కృషిని కొందరు వ్యక్తులే పట్టించుకుని భరించడం, చేపట్టడం అనేవి ఆశ్చర్యమైన విషయాలు! అలాగే చరిత్ర గలిగిన పెద్ద పెద్ద సంస్థలను నిర్వహించే వ్యక్తులు ఎంతో బాధ్యతారాహిత్యంతో, స్వార్థ దృష్టితో సాగడం ఇటీవల దశాబ్దాల్లో బాగా పెరిగింది. ఎవరికి వారు వారి పల్లకీలు ఏర్పాటు చేసుకోవడం; లేదా శిష్యులతో ఏర్పాటు చేయించుకోవడం వంటిది నడుస్తోంది. అంతేకానీ మంచి పని చేసే వాళ్లకి సాయం చేస్తాము అనే దృష్టి కొరవడింది. దీనికి సంబంధించి ఇంతకు మించి వివరణ ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఒక సుమారైన నిడివి గల వ్యాసం దీని గురించి రాయాల్సి ఉందేమో; ముందు, ముందు నేనే రాస్తానేమో చూడాలి!
ప్రశ్న 4: అడివి బాపిరాజు గారి సృజనాత్మక నైపుణ్యానికి అద్దంపట్టే ఈ సంకలనానికి ప్రణాళిక ఎలా వేసుకున్నారు?
జ: చాలా అవసరమైన మంచి ప్రశ్న! ఎందుకంటే ఇటువంటి బృహత్సంకలనాలు చూసినప్పుడు ఈ ప్రణాళిక ఎలా మొదలైంది అనే సందేహం కొందరి కైనా తప్పక కలగాలి!
అయితే నేను ఇదివరకు విద్వాన్ విశ్వం, సర్దేశాయి తిరుమలరావు, తాపీ ధర్మారావు వంటి వారి గురించి; మహాత్మా గాంధీ గురించి, ఇప్పుడు తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా పిలవబడే వ్యక్తులలో మాతృభాషగా తెలుగు ఉన్న ప్రముఖ వ్యక్తులు చాలామంది మనకు తెలియదు, వారి గురించి, అలాగే పర్యావరణ కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు ఇలాంటి సంకలనాలు చేశాను. అయితే ఇందులో కీలక విషయం ఏంటంటే మనం దిగబోతున్నాం. దాని దారీతెన్ను తెలియకుండా ప్రణాళిక వేయడమనేది సరికాదు కదా. అందుకని మొదట నా వరకు అవసరమైన సమాచారాన్ని పలుమార్గాల్లో సేకరించడానికి దిగుతాను. ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాలను దూరం నుంచి చూసినప్పుడు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. తర్వాత మనకు కలిగిన ఆలోచనలకు ఉదాహరణలుగా ఇంకొన్ని దృష్టాంతాలు తారసపడుతుంటాయి. అప్పుడు మనం అనుకున్న ఆలోచన గురించి మరింత దృష్టి పెట్టాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము చేస్తున్నాం, అలాంటప్పుడు ఇప్పటికే ఆయన గురించి జనసామాన్యంలో లేదా పండితుల్లో లేదా విమర్శకుల్లో ఎటువంటి విషయాలు వ్యాప్తిలో ఉన్నాయి? ఎటువంటి కోణాలు వెలికి రావాల్సి ఉంది? అలాంటి వాటిలో వర్తమాన సమాజానికి అత్యంత అవసరమైనవి ఏమిటి? అని మొదట ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇదివరకే కొంత కృషి జరిగిన రంగాల గురించి మరింత లోతు అవసరమై ఉంటే దాని మీద దృష్టి పెట్టడం గాని ఉంటుంది. లేకపోతే మళ్లీ చర్వితచరణంగా చేయాలనే ఆలోచన నాకు పెద్దగా రుచించదు. కనుక ఈ బాపిరాజు కృషికి సంబంధించి మొదట రకరకాల వ్యాసాలు, రచనలు; పాతవి, కొత్తవి సేకరించండం ప్రారంభించాను ఆయన కనుమరుగై దాదాపు 7 దశాబ్దాలు అయింది ఆయనను నేరుగా చూసిన వాళ్లు ఎవరు మనకు అందుబాటులో దాదాపు లేరేమో! అంతే కాకుండా ఆయనను గుర్తు పెట్టుకొని, ఆయన కృషిని స్మరించాలని ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో మనకు కనబడరు. అడివి బాపిరాజు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి లోని వివిధ కోణాలని విశ్లేషించే రచనలు పై దృష్టి పెట్టాము.. మహామహులు రాసిన ఇదివరకటి రచనలు ఇప్పటి మహానుభావులు రాసిన రచనలను తీసుకున్నాం. అయితే ఆయన సమగ్ర రచనల సంపుటం అనే దృష్టి మాకేం లేదు. అలాగే ఆయన కథలు, నవలలు, శశికళ గేయాలు అందుబాటులో ఉన్నాయి. అలాకాకుండా ఆయన సినిమాకు సంబంధించిన కృషి, సంపాదకుడుగా చేసిన కృషి, జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా చేసిన సేవ, చిత్రకారుడుగా, శిల్పిగా అందించిన సేవలు, స్వాతంత్ర సమరయోధులుగా పోరాటం.. ఇలాంటి విషయాలు మీద దృష్టి పెట్టాం. తొలిదశలో మాత్రం ఇదే ప్రణాళిక!
ప్రశ్న 5: ఇలాంటి బృహత్సంకలనం తయారుచేయటం సామాన్యమైన విషయం కాదు. విషయసేకరణ ఎలా చేశారు? సాహిత్య ప్రపంచం మీ ఆలోచనకు ఎలా స్పందించింది??
జ: సాహిత్య ప్రపంచం ఈ ఆలోచనకు ఎలా స్పందించింది అని మీరు అడుగుతున్నారు కదా! అయితే ఇక్కడ స్థూలంగా ఒక విషయం మనం గమనించాలి. అలా పట్టించుకునే స్పందనాగుణం మన సమాజానికి ఉండి ఉంటే; అడివి బాపిరాజు అంతటి ప్రతిభా సంపన్నులు ఎందుకు తెరమరుగు అవుతారు? ఆయన స్వాతంత్ర సమరయోధులు, లా చదువుకున్నారు, బందరులో జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు, ఉత్తమ నవల ‘నారాయణరావు’ను 1934లో రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విశ్వనాథ సత్యనారాయణతో కలిసి తొలి బహుమతి పొందిన వ్యక్తి. అలాగే ఆయన గొప్ప సంపాదకుడు, తొలి తెలుగు సినిమా కళా దర్శకుడు! మరి అలాంటి వ్యక్తిని మర్చిపోవడం ఎలా సాధ్యపడింది? అగ్రవర్ణపు వ్యక్తి, అలాగే గోదావరి జిల్లాల వ్యక్తి! అతను రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ వ్యక్తి కాదు! మరి ఆయనను ఎందుకు మరిచిపోయారు? అడివి బాపిరాజు గురించి సంకలనం చేయాలి అన్నప్పుడు అనూహ్యంగా స్పందన రాలేదు! అదే ధోరణి ఆ సంకలనాలు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది.
ఇక విషయ సేకరణ గురించి అడిగారు కదా! అది కూడా ఈ సంకలనం ఆలోచన కరోనా హడావుడి నడుస్తున్న కాలంలో మొదలైంది. అంటే 2020 నవంబర్ చివరివారంలో ఈ సంకలనం చేస్తే బాగుంటుంది అని బుద్ధ ప్రసాద్ గారు కోరడం, నేను అంగీకరించడం తర్వాత ఏ ఏ రిసోర్సెస్ ఉన్నాయి? ఎటువంటి పుస్తకాలు ఆయన గురించి అధ్యయన గ్రంథాలుగా అందుబాటులో ఉన్నాయి? ఎవరెవరు పిహెచ్‌డి పట్టాలు పొందారు? ఇటువంటి విషయాలను సేకరించి, సంబంధిత గ్రంథాలను సేకరించడం ప్రారంభించాను. కొన్ని కీలక అంశాలపై వ్యాసాలు రాయమని కొందరిని కోరితే పెద్దగా వారు పెద్దగా స్పందించలేదు, ఎవరు అనేది అంత ముఖ్యం కాదు, కానీ అప్పుడు మళ్లీ అడివి బాపిరాజు ఈ సంస్మరణ సంకలనం కోసం ఒక కమిటీ ఏర్పడినట్టు, అందులో ఈ సంకలనం సంపాదకత్వం నేను చూస్తున్నట్టు ఒక ప్రకటన ఇచ్చాం. దినపత్రికల్లో సోమవారం సాహిత్య పేజీల్లో కూడా ఈ ప్రకటన ప్రచురింపబడింది.
దీనికి స్పందించి కొందరు కొన్ని వ్యాసాలు పంపారు, అందులో గొప్పగా ఉన్నవి పెద్ద సంఖ్యలో లేవు! అన్నీ కూడా జనరల్‌గా అంటే కొంచెం కొంచెం అన్ని రంగాలను తడిమి పరిచయం చేసేలాగా ఉన్నాయి. కానీ ఆయన విభిన్న ముఖాలను పరిచయం చేసే రీతిలో కనబడలేదు. అంతకుమించి అటువంటి విషయాల్లో ఆయన సమకాలీనులూ ఆయన నేరుగా ఎరిగినవారూ చెబితే ఉన్న మజా వేరు! కనుక వేర్వేరు పత్రికలు, అప్పటి పత్రికలు, వేరువేరు పుస్తకాల్లో ఉన్న వాటి కోసం గాలించాం.
ఇంతకుముందే చెప్పినట్టు నాలుగు సంకలనాలు, రెండు పత్రికల ప్రత్యేక సంచికలు ఇవి కాకుండా వేరువేరు పుస్తకాలు ఇప్పటిదాకా రకరకాల సందర్భాల్లో అడివి బాపిరాజు సాహిత్యం గురించి వచ్చిన వ్యాసాలను సేకరించాం. అంతకుమించి ఇంటర్నెట్ ద్వారా లభించిన మెటీరియల్ కూడా బాగానే ఉంది. అయితే ఇంటర్నెట్ సంబంధించి కొంత సమస్య కూడా ఉంది. అది ఏ పత్రికలో వెలువడిందో తెలీదు. దాని ప్రచురణ తేదీ ఏమిటో తెలీదు, అయితే ఆ ప్రతి ఉంటుంది, రచన, శీర్షిక ఉంటుంది దాన్ని తిరస్కరించలేం. అదే సమయంలో దాని తేదీని చెప్పలేం ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు తెలీదు. ఇది కేవలం మన తరంతో మొదలైన సమస్య వ్యవహారం ఏమిటి అని కూడా అనిపించింది! అయితే దానికి ఒకరిద్దరు చేసే పరిష్కారం సరిపోదు, మరి సమిష్టిగా చేయాలంటే దానికి దారీ తెన్ను తెలియదు.
ప్రశ్న 6: మీరు ఈ సంకలనం కోసం సేకరించిన విధానం గురించి వివరిస్తారా?
జ: నిజానికి మొదలు పెట్టడానికి ముందే ఎటువంటి సంకలనం తేవాలి అనే స్పృహ స్పష్టంగా ఉంది. చాలా అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞావంతుడు, కళా శోభతులు అయినా అడివి బాపిరాజును మనం పూర్తిగా మర్చిపోయాం ఎందుకు.. అనే దానికన్నా ఇప్పుడు ఆయన్ని గుర్తు చేసుకోవాలంటే ఎలాంటి విషయాలు ఈ సమాజానికి లేదా భవిష్యత్తుకు అవసరం అనే దృష్టితోనే సంకలనం సిద్ధం చేద్దాం ఇదివరకే చెప్పినట్టు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎన్ని పేజీలు తేవాలి అన్నది పూర్తిగా నా పరిధిలోని విషయం. అలాగే ఇన్ని పేజీలు ఉండాలి అనే నియమం కూడా ఏం పెట్టుకోలేదు. ఎలాంటివి ఉండాలి అనే స్పృహ ఉంది కనుక మేము సేకరణ చేస్తూ వెళ్ళాం. ఒకవైపు ఇదివరకే ఆయన గురించి వచ్చిన ప్రత్యేక ప్రచురణలు, ప్రత్యేక సంచికలు ఆరు దాకా ఉన్నాయి. ఆయన రచనల్లో క్లాసిక్స్ అనదగ్గవాటి గురించి మళ్లీ కొత్తగా ఇప్పటి కాలపు దృష్ట్యా విశ్లేషింప చేసి, పరిచయం చేయడం ఒక అంశం కాగా ఆయనకు సంబంధించి ఆయన రచనల్లో లేదా ఆయన కృషిలో కొన్నింటిని ఈ తరానికి పరిచయం చేస్తూ; అర్ధంతరంగా వారు కనుమూసినప్పుడు కానీ లేదా అమోఘమైన ప్రతిభను చూపెట్టినప్పుడు గాని లేదా ఈ 60 70 ఏళ్లలో ఆయన రచనల గురించి వేరెవరైనా రాసిన విషయాలు గానీ సేకరించాలని దృష్టి పెట్టాం. కనుక అప్పటి కాలపు పత్రికల నుంచి రచనలు సేకరించడం ఒక విధానం. అలాగే తిరుమల రామచంద్ర, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నార్ల వెంకటేశ్వరరావు, సంజీవ్ దేవ్ ఇలాంటి వాళ్లు రాసిన రచనల నుంచి మనం వ్యాసాలు, కవితలు ఎంపిక చేయడం ఇంకొక మార్గం. ఇలా విభిన్నమైన మార్గాల గుండా ఈ అంశాలు లేదా వ్యాసాలు లేదా రచనలను సేకరించడం ప్రారంభించాం. ఇదివరకే అనుకున్నట్టు ఇంటర్నెట్ చాలా ఉపయోగపడింది. అయితే కొన్ని సందర్భాల్లో తలా తోకా లేకుండా ఆ వ్యాసాలు, వార్తాంశాలు లభించడం ఒక రకంగా ఆనందం కలిగించినా ముందు ముందు ఎవరైనా ఆసక్తి కలిగితే మళ్ళీ వాటిని సంప్రదించడానికి ఎటువంటి రెఫరెన్సు వివరాలు లేకుండా అంటే ఆ పత్రిక పేరు గానీ తేది గాని లేకుండా మనం ఆ రచన ప్రచురించడం ఎంతవరకు సబబు అనే ఒక ప్రశ్న కీలకమైంది. అందులో ఆ రచన ఎవరు రాశారు, ఆ రచన పూర్తిగా ఉండటం అనే విషయాలు మనకు స్పష్టంగా ఉంటాయి. ఆ మేరకు ఆ ఇమేజ్ మన ముందు కనబడుతూ ఉంటుంది. అయితే ఏ పత్రిక తెలీదు ఎప్పటిది. ఇది కొంత ధర్మసంకటానికి గురిచేసింది. దానికి సంబంధించి ఇప్పటికీ నాకు అసంతృప్తి ఉంది. అయితే కనీసం వీటినన్న దాచగలిగామన్న తృప్తి, దొరికాయి అనే ఆనందం కూడా ఉంది. ఇలా దాదాపు ఒక సంవత్సరం పాటు మేము ఈ మెటీరియల్‌ని అన్వేషించి ప్రోది చేశాం.
అలాగే మా పత్రికాప్రకటన చూసి, ఫేస్బుక్‌లో, వాట్సాప్‌లో మా ప్రకటన షేర్ చేసినప్పుడు దాన్ని చూసి స్పందించి కొందరు వారి వ్యాసాలు పంపారు. మరికొందరైతే ఇదివరకే ప్రచురణ అయిన వ్యాసాలు వారివే కూడా మనకు పంపారు. అయితే చర్వితచరణంగా ఉన్న వాటిని కొన్ని తీసుకోలేకపోయాం. మరోవైపు ఇటువంటి ఔత్సాహకులు పంపే వ్యాసాల్లో సమస్య ఏమిటంటే అవన్నీ ఏ పత్రిక కోసమో ఆకాశవాణి కోసం ఆయనను పరిచయం చేస్తూ రాసినవే అవి నిడివిలో 400 పదాల నుంచి వెయ్యి పదాలు దాకా కలిగి ఉండొచ్చు. అందులో అన్ని విషయాలు అంటే పలు పార్శ్వాలను అలా స్పృశిస్తూ వెళుతుంటే కుదరదు కదా! మన మొత్తం పుస్తకమే బాపిరాజు గురించి ఉన్నప్పుడు ఇలా జనరల్‌గా ఉన్న వ్యాసాలు ఒకటి, రెండు వేయ్యొచ్చు తప్పా అన్ని మొత్తం వేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ‘నారాయణరావు’ గురించి వ్యాసం ఉండొచ్చు; లేదా ‘నారాయణరావు’, ‘వేయి పడగలు’ రచనలను పోలుస్తూ ఇంకో వ్యాసం ఉండవచ్చు; లేదా అడివి బాపిరాజు, విశ్వనాథ, చలం గార్ల రచనలు సరిపోలుస్తూ ఇంకో వ్యాసం ఉండొచ్చు; లేదా సాధారణంగా కనిపించే విషయం లేదా అసాధారణంగా కనిపించే పోకడా వీటి గురించి వివరించే విశ్లేషణలుండవచ్చు. ఆయన నవలల్లో కనిపించే బౌద్ధం గురించి రాయదుర్గం విజయలక్ష్మి రాస్తానన్నారు!
ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు అందుబాటులో ఉండి, వ్యాసాలు ఇచ్చిన వారిని మొదట సంప్రదించి, వారికి ఎందులో ఆసక్తి ఉందీ, ఏదైతే బాగా ఇష్టంగా చేస్తారు అని వారి అభిప్రాయాన్ని తీసుకొని ఒక నిండు ఇంద్రధనస్సు లాంటి దాన్ని చిత్రించాలని ప్రయత్నం చేశాం. ఎందుకంటే మిగతా రచయితలు లేదా పరిశోధకులు లేదా ఆసక్తి ఉన్నవాళ్లు కొంత కృషి చేసి ఉంటారు. వాళ్లకు కొన్ని ఇన్‌సైడ్స్ కచ్చితంగా ఉండి ఉంటే అలాంటప్పుడు వాటిని పరిగణన లోనికి తీసుకోవాలి కదా అనే దృష్టితో పని చేశాను. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది మనకు రాయగలరు అని అనిపిస్తే వారిని సంప్రదించగలం, వాళ్ళు రాయగలమని చెప్పడం లేదా రాయలేమని చెప్పడం వరకు బావుంటుంది. కానీ తిరస్కరించరు, రాయలేమని చెప్పరు, అయితే మనం ఫోన్ చేస్తేనే మాట్లాడుతారు లేదా ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వరు, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వరు.. ఇలాగా పండితులు రకరకాలుగా ఉంటారు మరి! ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రణాళిక, వ్యూహం! కాబట్టి అందరిని ఒకే పద్ధతిలో అనుకుంటే మనం బోల్తా పడతాము. అలాగే ఒక వ్యక్తి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది.
నాతో పాటు పాతిక మందికి పైగా సంపాదకులుగా, లేదా సహసంపాదకులుగా లేదా సంపాదిక వర్గ సభ్యులుగా పని చేసి ఉంటారు.. వాళ్ల పరిజ్ఞానము, అవగాహనా స్థాయి, అభిరుచీ ఆసక్తీ వగైరాలు ఒకే రకంగా ఉండవు. అలాగే వారిలో ఒక్కొక్కసారి మవేరే పరిమితులు కూడా ఉండి ఉంటాయి!
ఇప్పుడు నేనైతే నా విభిన్నమైన సంకలనాల్లో ఇంతవరకు ఇంక్లూడ్ చేసిన రచయితల జాబితా ఒక ఐదు వందలు దాకా ఉంటే ఉండొచ్చు. అందులో కొందర్ని, అంటే గత తరం వాళ్ళని ఎలాగో మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్లవి తీసుకుని మనం ప్రచురిస్తాము, మనకు గౌరవంగా ఉంటుంది. వాళ్లతో మాట్లాడి, సంప్రదించి రచనలు పొందిన వ్యక్తులు నా వరకు సుమారు ఓ 300 దాకా ఉంటారు. అయితే ఇది నాకు పెద్ద శ్రమ అనిపించదు, ముప్పై ఏళ్లకు పైగా ఆకాశవాణిలో పనిచేయడం వల్ల. పత్రికలకు కంటే ఆకాశవాణికి సంబంధించి ఈ విషయంలో ఒక ఎక్స్‌పీరియన్స్ వేరుగా ఉంటుంది. అంటే పత్రికలలో అయితే రచన మాత్రం ముందుగా వస్తుంది, తర్వాత సదరు రచయిత మనకు కనడవచ్చు. అందువల్ల సైకాలజీ ఏంటి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల నాకు ఏ రకమైన సమస్యా అనిపించలేదు. అదే సమయంలో ఈ సంకల్పంలో యోగ్యం కానివి అని అనిపించినపుడు మొహమాటం లేకుండా చేర్చలేదు. ఎవరి వ్యాసం సాధికారంగా ఉంది, గౌరవప్రదంగా ఉంది అనేదానికి మార్కులు వేసుకొని అటువంటి వాటిని ఎంపిక చేసుకున్నాము.
ప్రశ్న 7: మరి వర్గీకరణ గురించి కూడా చెప్పాలి కదా..
జ: ఈ సంకలనం ఇదివరకే చెప్పినట్టు రెండు భాగాలుగా ఉంది, 870 పేజీలు 7 విభాగాలు. మాకు లభ్యమైన ప్రయోజనకరమైన వాటిని ఇలా విభజించాం.
మొదటి విభాగంలో ముందుమాట, సంపాదకుని మాట.
ఇక రెండవ భాగం ‘కళా వ్యక్తిత్వ దిగంతం’ లేదా ‘అంతేవాసుల అనుశీలన’! ఇందులో ఆయన మిత్రులు, శిష్యులు గురువులు, గురుప్రాయులు, సమకాలీనులు రాసిన లేదా చెప్పిన విషయాలు కనబడతాయి. వీళ్లంతా కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌తో వ్యక్తులుగా సంపాదించిన పరిశీలనలతో చేసిన విశ్లేషణలు. వీటిని క్లాసిక్స్ అని కూడా అనొచ్చు. ఇవి చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో బుచ్చిబాబు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఈ ఇద్దరు అడివి బాపిరాజు గురించీ ఆయన సాహిత్యం గురించీ కొంత కటువుగానే విమర్శించారు. అయినా పర్వాలేదు.. అంటే పొడచూపిన ధోరణులన్నీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాటిని కూడా ఈ విభాగంలో కలిపాం. ఇక మూడవది ‘స్మరణిక’. రచనలు ఎలాగూ మనకు అందుబాటులో ఉన్నాయి, ప్రచారంలో ఉన్నాయి. ఆయన చేతిరాత కావచ్చు, ఆయనతో ఉన్న ఫోటోలు కావచ్చు.. ఆయన బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మొదలైన వాళ్ళు! అలాగే ఆయన చిత్రించిన చిత్రాలు, ఆయన పుస్తకాలకు వేసిన ముఖచిత్రాలు, ఆయన పాటకు కూల్డ్రే గారు ఒక బొమ్మ వేశారు అదీ! అలాగే ఆయన గురించి వివిధ సంకలనాలు, సంచికలు వచ్చాయి. అందుబాటులో ఉన్న కొత్తపల్లి రవిబాబు, దిట్టకవి శ్యామల దేవి గార్లతో వ్యాసాలు కొత్తగా రాయించాను — ఆ సంచికల ప్రయత్నాల నేపథ్యం గురించి వివరించే వాటిని కూడా ఇందులో చేర్చాం. నాలుగవది ‘భవదీయుడు బాపిరాజు’! ఇది సుమారు నూటపాతిక పేజీల దాకా ఈ భాగం ఉంటుంది. ఇందులో 50కు మించి ఆయన రచనలు కనపడతాయి. అందులో వ్యాసాలు ఉన్నాయి, కవిత్వము ఉంది, రెండు కథలు ఉన్నాయి, ఉత్తరాలు ఉన్నాయి.. అలాగే కూల్డ్రే, ముట్నూరు, చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి, దామెర్ల రామారావు, గాంధీజీ గురించి.. ఇలాగా! అలాగే ఇందులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా ఉన్నాయి.. సినిమా గురించి ఆయన చెప్పిన వివరమైన ఇంటర్వ్యూ ఇందులో ఉంది. అలాగే ‘బావా బావా పన్నీరు’ అనే పాట వారు రాసింది అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘కోనంగి’ నవలలో అంతర్భాగంగా ఈ హాస్య గేయాన్ని వారు రాశారు. దాన్ని కూడా ఇందులో చేర్చాం. గోదావరి, లేపాక్షి ఇలాంటి పాటలు ఎలాగూ ఉంటాయి. అలాగే నరసన్న పాపాయి, వడగళ్ళు కథలు కూడా ఉన్నాయి. అయితే నవలలు మాత్రం చేర్చలేదు, నిడివి సాధ్యం కాదు కనుక. కథలు ఎందుకు చేర్చామంటే విభిన్నమైనవీ, గొప్ప శిల్పంతో కూడినవి అనే ఉద్దేశంతో ఇక్కడ చేర్చడం జరిగింది.
‘నవనవోన్మేషం’ లేదా ‘సాహితీ కళావిజ్ఞాన విశ్వరూపం’. ఇందులో ఆవంత్స సోమసుందర్, పురాణం సుబ్రమణ్య శర్మ, అక్కిరాజు రమాపతిరావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు, చలసాని ప్రసాదరావు, అడపా రామకృష్ణారావు, పిలకా లక్ష్మీనరసింహ మూర్తి, వేల్చేరు నారాయణరావు, ముదిగొండ శివప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, రాంభట్ల కృష్ణమూర్తి, వింజమూరి అనసూదేవి, హెచ్ ఎస్ వి కే రంగారావు, జి కృష్ణ, శాంతారావు సంగిశెట్టి శ్రీనివాస్, కోడూరి శ్రీరామమూర్తి, మారేమండ శ్రీనివాసరావు.. ఇలాంటి వాళ్లు రాసిన విషయాలు ఇందులో మనకు కనబడతాయి. ఈ విభాగం ప్రత్యేకత ఏంటంటే రెండవ భాగంలో ‘కళావ్యక్తిత్వ దిగంతం’లో అంతా ఆయన సమకాలీనులూ రాస్తే; ఇవన్నీ కూడా తర్వాత తరంవారు.. అంటే ఇప్పటి తరానికి, అప్పటి తరానికి వారధిగా ఉన్న ప్రముఖ వ్యక్తులు విభిన్న విషయాలను ఇందులో చర్చించారు. ఇక్కడ నవలా విశ్లేషణ ఉంది, ఆయన పత్రికా జీవితం గురించి ఉంది, అది కూడా చాలా వైవిధ్యంగా మనకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా జోసెఫ్ అనే అనంతపురానికి చెందిన దళిత క్రిస్టియన్ బాలుని వాళ్ళ ఇంట్లో పెంచుకోవడం అనేది.. చిన్న విషయం కాదు!
ఇక తర్వాతది చాలా ప్రధానమైనది ఈ మొత్తం పుస్తకంలో ఎక్కువ పేజీలు అంటే దాదాపు 250 పేజీలు ఉన్నది ‘నిండు ఇంద్రధనస్సు’! ఇందులో మన్నవ సత్యనారాయణ, కొత్తపల్లి రవిబాబు, జివి పూర్ణచంద్, శివనాగిరెడ్డి, దిట్టకవి శ్యామలాదేవి, సూర్య భాస్కర్, రాయదుర్గం విజయలక్ష్మి, సుంకర చలపతిరావు, కె పి అశోక్ కుమార్, బాలాంత్రపు శ్రీమతి, వి వి వెంకటరమణ, కల్లూరి భాస్కరం, మంగు శివరాం ప్రసాద్, చంద్ర ప్రతాప్, రెంటాల జయదేవ, అమ్మంగి వేణుగోపాల్, ప్రభల జానకి, గుమ్మా సాంబశివరావు, వి రాజా రామ మోహనరావు, జ్యోతి, మృణాళిని, తాడికొండ రాధావసంత ఇలాంటి వాళ్ళు రాసిన రచనలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సంకలనం కోసం దాదాపు ప్రత్యేకంగా రాసిన రచనలు మాత్రమే.
ప్రశ్న 8: ఈ మీ వర్గీకరణలో ‘ఆఖరులో అందినవి’ అన్న విభాగం వుంది? ఈ పేరులో నిరసన వుందా?
జ: మీ దృష్టి పడిందా దీని మీద?.ఇందులో మీకు నిరసన కనబడిందా? అయితే ఇందులో ఉంటే గింటే పనికిరాని ప్రయాస అంటే ప్రాస కోసం ప్రాకులాట ఏమన్నా ఉందేమో గాని, నిరసన ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సంకలనంలో ఒక కళాకారుడు రచయిత జీవితానికి సంబంధించి, ఆయన కృషికి సంబంధించి ఒక వంద మంది వ్యక్తులు చేసిన విశ్లేషణలను ఆరు విభాగాలుగా మనం అందిస్తున్నాం. మరి అలాంటి సందర్భంలో ‘అనుబంధం’ అని మనం పేరు పెడితే మళ్లీ వివరణ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది- ఏ రకంగా అది విభిన్నం అని. అందువల్ల అనుబంధం అనే పేరు నేను పెట్టడానికి మనస్కరించలేదు. ఇక రెండవ విషయం ఏంటంటే ఇన్ని అంశాలను మరి ముఖ్యంగా ఆయన గతించినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు టైప్ చేయడానికి, దాన్ని సరి చూడడానికి చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. అలాగే మీరు కొంచెం లోపలికి వెళ్లి గమనిస్తే ఇంటర్వ్యూల విషయంలో అంటే సినిమా గురించి ఆయన మాట్లాడిన కృష్ణా పత్రిక ఇంటర్వ్యూలో మాకు తుంపులు తుంపులుగా కాగితాలు దొరికితే విలువైంది కనుక, దాన్ని జాగ్రత్తగా చేసాము, మేటర్ దొరకనిచోట ఇది కొంత లభ్యం కాలేదు అన్నట్టు సూచన కూడా చేశాం. ఇలా చేసి వచ్చినట్టుగా కంపోజ్ చేయించాం. నిజానికి ఒక ఆరు స్పైరల్స్ ఏ ఫోర్ లో తయారయ్యాయి. ఇదివరకు మీకు ఎక్స్‌ప్లయిన్ చేసినట్టు ఐదు రకాల వర్గీకరణలో నేను రాసుకున్న జాబితా కనీసం 10, 12 సార్లు మార్చి మార్చి రాసి ఉంటాను. ఇక్కడ ఇంకో చిక్కుంది అలా రాసినప్పుడు ఏ ఒక్క రచయిత పేరు లేదా ఒక్క వ్యాసం తప్పిపోయినా,వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, నేను చాలా ఎంబ్రాసింగ్‌గా ఫీల్ కావాల్సి ఉంటుంది. సో మనం అనుకున్న పద్ధతి ప్రకారం దాన్ని అమర్చుకుంటూ పోయాము జాగ్రత్తగా. తర్వాత ఆ ఫైనల్ లిస్ట్ ప్రకారం వ్యాసాలు ఒకదాని తర్వాత పెట్టుకుంటూ వెళ్ళాం. ఇలా పూర్తి చేసిన క్రమంలో మాకు రెండు వచ్చేయి ఒకటి బాపిరాజు రాసిన కవిత జంషెడ్పూర్ తెలుగువాళ్లు నడిపిన పత్రిక 46 అక్టోబర్‌లో ఆ ప్రవాసి అనే పత్రికలోని కవిత ‘భవదీయుడు బాపిరాజు’లో పెట్టాలి. అవునా? అది పెట్టడం అంటే మొత్తం అంతా కదులుతుంది, పేజ్ నంబర్లు మారుతాయి. తర్వాత ఇంకొకటి ఎమిటంటే నారాయణరావు నవల సాహిత్య అకాడమీలో చర్చకు కారణమైంది. ఈ విషయాన్ని ‘ది ఇండియన్ లిటరేచర్’ పూర్వ సంపాదకులు డాక్టర్ డిఎస్ రావు గారు బుద్ధ ప్రసాద్ గారికి పంపిన ఈమెయిల్లో ఇంగ్లీషులో రాశారు. అందులో కొన్ని వ్యక్తిగత విషయాలు ఉన్నాయి. వాటిని పరిహరించి మన సంకలనానికి పనికొచ్చే విషయాలు తీసుకొని, అనువాదం చేశాం. ఇది ఎక్కడ వెళ్లాలి ఇది మూడో భాగం లోనో ఎక్కడో రావాలి.
దాదాపు పూర్తి అయిన తర్వాత బాపిరాజు గారి జన్మదినం సందర్భంగా 2022 అక్టోబర్ మొదటి సోమవారం ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ కోసం నేను ఒక వ్యాసం రాశాను. దాన్ని చదివిన తర్వాత ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు గారి కుమారులు నాకు ఫోన్ చేశారు మా నాన్నగారు చాలా మంచి వ్యాసం రాశారు, అది ఆకాశవాణి, హైదరాబాదులో ప్రసారమైంది. మేము వేసిన సంకలనంలో ఉంది. అది మీకు పంపిస్తాను మీరు చూడండి అని వారు పంపారు. ఇది చాలా విలువైన వ్యాసం. దాన్ని మనము వదిలేయడానికి వీలు లేదు మరి, ఇలాగ అనుకున్నట్టు దీన్ని యాడ్ చేస్తే దొంతర మారుతుంది. అంతకుమించి ఇదే ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం చదివిన ఒక మిత్రుడు మూడే మూడు వాక్యాలతో ఇంగ్లీషులో మెసేజ్ పెట్టారు. మెటలర్జీ లేదా లోహాలు సంగ్రహించి చెప్పడానికే అడివి బాపిరాజు ‘తుఫాను’ అనే నవల రాశారు. తుఫాను లాగా ఇంగ్లీషులో కూడా అప్పటికి నవలలు రాలేదు అని ఆయన రాసిన మూడు వాక్యాలకు లేదా రెండు వాక్యాలకు భావం. ఆయన కొచ్చర్లకోట కృష్ణ ప్రసాద్, వీరి నాన్నగారు మద్రాసు ఆకాశవాణిలో సంగీత నిలయవిద్వాంసులుగా పని చేశారు. ఆ మెసేజ్ పెట్టాక ఇంత సరిపోదు మిత్రమా, మీరు వివరంగా రాయండి. మీరు చెబుతున్న విషయానికి సాధికారంగా విశ్లేషించండి ఒక 800 మాటలు లేదా వెయ్యి మాటలు వచ్చిన పర్వాలేదు అని వారితో రిక్వెస్ట్ చేశాను. కృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా రాశారు. అప్పటికే నవలలు తుఫాను గురించి పి జ్యోతి చాలా వివరంగా వ్యాసం రాసి ఉన్నారు. అది కాస్త కూడా ఎక్కువ వివరించబడని కోణంలో కృష్ణ ప్రసాదు అందుకున్నారు. ఆయన రాసిన వ్యాసం చదివినాక అది చాలా విలువైనది అనిపించింది, నేను ఆంధ్రజ్యోతికి మీరు పంపండి వాళ్ళు కచ్చితంగా వేస్తారు. ఎందుకంటే దీంట్లో కంటెంట్ ఆ స్థాయిలో ఉంది అని చెప్పాను. తర్వాత నెలలో అది వేశారు. కాబట్టి ఈ రచన, డిఎస్ రావు గారి ఉత్తరం తర్వాత కొండపల్లి శేషగిరిరావు రేడియో ప్రసంగం, కృష్ణ ప్రసాద్ గారి కొత్త వ్యాసం.. ఇవి నాలుగు వేర్వేరు చోట్ల పెట్టాలి, ఇంతకు మించి ఏమీ లేదు. ఏ మాత్రం నిరసన లేదు, ఈ నాలుగూ చాలా ఇష్టంగా సంపాదకులు జోడించినవి. అయితే ‘ఆఖరిలో అందినవి’ అంటే నిరసన అని ధ్వనిస్తే ముందు ముందు అటువంటి మాటను పరిహరిద్దాం!
ప్రశ్న 9: సాధారణంగా సృజనాత్మక రచయితలంటే రకరకాల అహంకార సమస్యలు, వివాదాలు వుంటాయి. ఈ సంకలనం తయారీలో అలాంటి సమస్యలు ఎదురయ్యాయా? ఎదురయితే వాటిని ఎలా పరిష్కరించారు??
జ: ఆ స్థాయి దాకా పరిస్థితి ఎప్పుడు రాదు. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే వారు ఒకవేళ వ్యాసం ఇచ్చినా దాన్ని ప్రచురిస్తామే తప్పా వారికి పారితోషం ఇచ్చే పరిస్థితి లేదు! ఇంకా మాట్లాడాలంటే పుస్తకం వస్తుందో రాదో.. వస్తే ఎవరు వేస్తారో తెలియదు. ఈ పరిస్థితి దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాటి ఉండింది. కనుక మీరు ప్రస్తావించిన విషయం గురించి మనం పెద్దగా చర్చించుకొనక్కర్లేదు!
(మిగతా ఇంటర్వ్యూ వచ్చే వారం)
***
‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ (సాహితీ చిత్రలేఖన శిల్ప నాట్య సంపాదక సినీ కళా నైపుణ్యాల విశ్లేషణ, 2 వాల్యూమ్స్)
సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్
ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, విజయవాడ.
పేజీలు: 826
వెల: ₹ 1,000.00
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. 8464055559
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-1-
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-2-