Site icon Sanchika

ప్రముఖ రచయిత, సంకలనకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ప్రత్యేక ఇంటర్వ్యూ-రెండవ భాగం

[‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ అనే సంకలనాన్ని వెలువరించిన డా. నాగసూరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము. గత వారం తరువాయి. మొదటి భాగం లింక్]

ప్రశ్న 10: ఇన్ని రకాల వ్యాసాలు ,  ఎనిమిదివందలకు పైగా పేజీల గల పుస్తకానికి సరిపడ రచనలను చదివిన తరువాత అడివి బాపిరాజు గారి సృజనాత్మక వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగా అడివి బాపిరాజు గారి గురించి మీకు ఏర్పడిన అభిప్రాయం ఏమిటి?

జ: అవును, దీని గురించి చెప్పాలంటే కొన్ని వ్యాసాలను నేను మూడు, నాలుగుసార్లు చదివిన సందర్భాలున్నాయి. ఎందుకంటే దేన్ని ఎక్కడ, ఏ వ్యాసం తర్వాత పెట్టాలని! అలాగే కొన్ని ముఖ్యంగా ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, తిరుమల రామచంద్ర, పండ్రంగి రాజేశ్వరరావు, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య వంటి వారు రాసిన వ్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని చాలా ఇష్టంగా పలుసార్లు చదువుకున్న సందర్భాలు కూడా ఈ సంకలనం చేస్తున్న సమయంలో ఉన్నాయి.

అయితే ఇక్కడ అడివి బాపిరాజు అమోఘమైన ప్రతిభావంతుడు, అలాగే పలు రకాలుగా చాలా శీఘ్రంగా శ్రమించగల నేర్పరితనం ఉన్న వ్యక్తి అని నాకనిపించింది. ఆయన వైద్యం జ్యోతిష్యం, తత్వశాస్త్రం, రాజకీయాలు వంటి విషయాలు మాత్రమే కాకుండా వంట పని అలాగే స్త్రీల పేరంటాల ఏర్పాటు పని కూడా చేయగలిగిన ఆసక్తి ఉన్నవారు. అంతకుమించి భార్య అనారోగ్యం, కూతురు అనారోగ్యం, పేదరికం.. ఇలాంటి సందర్భాల్లో కూడా వారు రిస్క్ తీసుకుని తన అభిరుచికి తగిన ఉద్యోగాన్ని తను చేస్తూ వెళ్లిపోయారు. ఒకరకంగా స్థిరత్వం లేదు అని కొందరనవచ్చు. ఆయనకు ఆ కళపట్ల ఉన్న అచంచలమైన విశ్వాసమే దానికి కారణం. అంతేకానీ ఐహికమైన విషయాలను ఆయన పట్టించుకోలేదు. గొర్రపాటి వెంకటసుబ్బయ్య ఒకచోట అంటారు – వెంకట వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యులు ఎలాగో గాంధీ మహాత్ముడికి తెలుగులో బాపిరాజు అలాంటి సంకీర్తనచార్యుడు అని. ఇది చాలా పెద్ద కితాబు అని నేను భావిస్తాను. అయితే ఇంతటి ప్రతిభావంతుణ్ణి, ఇంతటి కళాకారుణ్ణి ఇంతటి సౌశీల్యమున్న మహానుభావుడిని మనం సరిగా అంచనా వేయలేదే, సరిగా ఆయన గుర్తులు దాచుకోలేదే, సరిగా ఆయనను మరింత హాయిగా జీవనం చేసేట్టు చేయలేదే అని అనిపించింది! అదే సమయంలో తెలుగు వాళ్లకు బహుముఖ ప్రజ్ఞాశాలురను గుర్తించే సామర్థ్యం కొరవడిందేమో అని కూడా అనిపించింది! దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కావచ్చు, అడివి బాపిరాజు కావచ్చు, కట్టమంచి రామలింగారెడ్డి కావచ్చు, తాపీ ధర్మారావు కావచ్చు, విద్వాన్ విశ్వం కావచ్చు ఇలా ఎంతోమంది ఏకకాలంలో విభిన్న రంగాల్లో గొప్ప కృషి కాంట్రిబ్యూట్ చేసినవాళ్లు ఉన్నారు. వాళ్లు పదవి కోసమో లేదా పురస్కారం కోసమో ఈ పనులు చేయలేదు. మరి అన్ని కళలని, అన్ని పార్శ్వాలను సమానంగా లేదా మరింత లోతుగా అధ్యయనం చేయగలిగిన వాళ్ళు బేరీజు వేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ లోటు కొట్ట వచ్చినట్టు నాకు అనిపించింది! ఇక అధ్యయనం చేసిన తర్వాత ఏమిటి అనేది ఆ సంపాదకీయం చివర సూచించాను. మరీ ముఖ్యంగా తెలుగు ఫిక్షన్‌లో రీడబిలిటీ అనే గుణం లేదా పఠనీయత అనే గుణం ఎవరినుంచి ఎలా సంక్రమించి, ప్రవహించింది అని అధ్యయనం చేయాలి అని అనిపించింది! ఆ కోవలో కొన్ని క్లూస్ నాకు స్ఫురించాయి. మరి వాటి గురించి ముందు ముందు కొంత కృషి చేస్తానేమో నాకు ఇప్పుడైతే తెలియదు. అయితే చాలా ఆనందం కలిగించిన కృషి ఇది. ఖచ్చితంగా నాకు గౌరవాన్ని కలిగించే సంకలనం అని భావిస్తున్నాను!

ప్రశ్న 11: ఈ సంకలనం రూపొందించేందుకు ఎంతకాలం పట్టింది? మీరు అంతకాలం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి సడలకుండా ఎలా కాపాడుకున్నారు? ఈ కాలంలోనే మీరు చేపట్టి, పూర్తిచేసిన ఇతర సాహిత్య సంబంధిత కార్యక్రమాలేమిటి?

జ: చాలా సంతోషం మురళీ, ఇలాంటి ప్రశ్న మీలాంటి వారు మాత్రమే వేయగలరు! ఎందుకంటే ఏకకాలంలో ఎన్నో పనులు అవలీలగా చేసే వాళ్ళ సమస్యలు ఏమిటి? వారి ప్లానింగ్ ఏమిటి? అనే విషయాలు పట్ల మీకు కూడా సమగ్రమైన అవగాహన ఉంది కనుక.. మరోసారి థాంక్యూ!

ఇక ఈ అడివి బాపిరాజు ప్రాజెక్టు గురించి అంటే ఇది 2020 నవంబర్ చివరి వారంలో మేము చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇది ఎంతవరకు మనం సీరియస్‌గా చేస్తున్నాము, ఏమిటి అన్నది తొలి దశలో నాకు కొంత క్లారిటీ రాలేదు. తర్వాత ఒక నాలుగు నెలలు పోయిన తర్వాత, నేను ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత, దీని గురించి సీరియస్‌గా మనం ప్రారంభించకపోతే పని జరగదు అని అనిపించి మేము ఇద్దరం అంటే బుద్ధ ప్రసాద్ గారు, నేనూ చర్చించి ఒక నోట్ చక్కగా టైప్ చేయించి ప్రకటన విడుదల చేసాం. అది 2021 ఏప్రిల్ చివర్లో ప్రారంభమై మే, జూన్ నెలల్లో అది సర్క్యులేట్ అయింది.

ఇక్కడ ఒక విషయం మనకు గమనించాలి! మీరు గాని, నేను గాని ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో పని పూర్తి చేసినా దాని వెనక వయసుతో సమానమైన అనుభవం ఉంటుంది; మన ఇంటెలిజెన్స్, చిత్తశుద్ధి, ఇంటెగ్రిటీ ఆధారంగా దాని క్వాలిటీ నిర్ణయించబడుతుంది! కనుక ఇప్పుడు మనకు కనబడే వ్యవధి ఇలా అనిపించినా నిజానికి దాన్ని ఇదివరకు మనం సంపాదించుకున్న అనుభవం జ్ఞానం, అవగాహన, విశ్వసనీతల సమగ్ర ఫలితంగానే మనం పరిగణించాలని నేను భావిస్తున్నాను. అసలు పని 2020 నవంబర్ నుంచి ప్రారంభమైనట్టే!

అడివి పేరు అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏమిటి? నేను చదివింది ఏమిటి? నాకు బాగా గుర్తుంది ఏమిటి? అని నాకు నేనే ఆలోచన చేయడం లేదా ఈ ప్రశ్నలను నా బుర్రలో పడేయడం గానీ జరిగింది. ఇక 2021 జూన్, జూలై తరువాత ఈమెయిల్‌కి కొన్ని వ్యాసాలు రావడం లేదా కొన్ని టెలిఫోన్ సంప్రదింపులు రావడం మొదలైంది. తర్వాత ఎవరు రాస్తే బాగుంటుంది అని నాకు నేనే నా ఇన్ని ఏళ్ల అనుభవంతోపాటు వాళ్లు సంపాదించుకున్న క్రెడిబిలిటీ దృష్ట్యా నేను సంప్రదించడం, కొందరు అంగీకరించి చేయడం, మరి కొందరు చేస్తామని చెప్పి ఎగ్గొట్టడం తెలిసిందే!

అంటే తొలి ఆరు నెలలు ప్రిపరేటరీ పీరియడ్‌గా భావించవచ్చు తర్వాత ఒక సంవత్సరం ఈ సమాచారం, సామాగ్రి వగైరా సేకరించడం! ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు, పూర్తిగా టైపింగ్ అయిపోయిన వాటి కరెక్షన్స్, సీక్వెన్స్, క్లాసిఫికేషన్ ఇలాంటి విషయాలు మీద దృష్టి పెట్టానని నేను భావిస్తున్నాను. అయితే ఈ సమయంలో అప్పటికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని విరామం తీసుకున్నాయి. దీంట్లో ‘భానుమతి’ నవల పునః ప్రచురణా, ‘దక్షిణాంధ్ర దారి దీపాలు’ సంకలనం ఎన్‌హాన్సుడ్ ఎడిషన్, అన్నమయ్య, నా రేడియో గురించి రెండు పుస్తకాలు మొదలైనవి కాస్త విరామం తీసుకున్నాయి.

‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో 2020 జూలై చివరి వారంలో మొదలైంది ‘గాంధేయం ఓ గాండీవం’ శీర్షిక. అదింకా కొనసాగుతోంది. 2021 జూలై చివరి వారంలో నేను ‘సహరి’ ఈ-వీక్లీలో ఆకాశవాణి అనుభవాలు గురించి ఒక సంవత్సరం పాటు రాశాను. అది పుస్తకం వచ్చి ఉండేది, బాపిరాజు పనితో ఆగింది. కొనసాగుతున్న సాహిత్య అకాడమీ కోసం పప్పూరు రామాచార్యులు గురించి మోనోగ్రాఫ్ పూర్తి చేశాను. ఎన్.బీ.టీ.కి సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర అదే సమయంలో పూర్తి అయ్యింది. అల్లావుద్దీన్ సినిమాద్భుతం, అసలైన విప్లవవాది సిసలైన సిద్ధాంతకర్త గాంధీజీ 3, 4 ఎడిషన్లు పూర్తి చేశాను. కొన్ని పుస్తకాల ఎడిటింగ్, మరి కొన్నింటికి ముందుమాటలు రాశాను. ఇదే సమయంలో నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచనలు గురించి 75 వ్యాసాలతో 480 పేజీల సంకలనం పూర్తి చేశాను.

కనుక రెండున్నర సంవత్సరాల వ్యవధిలో ‘అఖిలకళావైభవశ్రీ అడివి బాపిరాజు’ సంకలనం పని పూర్తి చేశాను, మిగతా ఎన్నో పనులు చేస్తూ అని భావించాలి!

ప్రశ్న 12: ఈ సంకలనం రూపొందిస్తున్నప్పుడు ఇది ఇంత పెద్దదవుతుందన్న గ్రహింపు కలిగిన తరువాత, ప్రచురణ గురించి ఎలాంటి ఆలోచనలు చేశారు? ముఖ్యంగా, పుస్తకాల అమ్మకాలు అంతంత మాత్రమే అయిన కాలంలో ఇంత పెద్ద సంకలనం ప్రచురించటం ఒక సాహసమే. ఆ సాహసం సుసాధ్యం ఎలా అయింది?

జ: అవును. ‌ముమ్మాటికీ సాహసమే! ఎందుకంటే ఎవరు వ్యాసాలు ఇస్తారో తెలియదు, ఎన్ని వ్యాసాలు అందుబాటులోకి వస్తాయో తెలీదు, ఎవరు వేస్తారు తెలీదు, అంటే పూర్తిగా దారీ తెన్ను తెలియకపోయినా పనిలో దిగడం ఒకరకంగా చాలా పెద్ద సాహసం! అయితే ఈ విషయంలో ఎడిటింగ్ వరకు మీరు చూసుకోండి, మంచి పుస్తకం రావాలి.‌ ప్రచురణ గురించి ఆలోచించవద్దు అని బుద్ధ ప్రసాద్ అన్నారు. నిజానికి చివరి దశలో అంత సులువు అనిపించలేదు.. అన్ని విషయాలు తెలుస్తున్నాయి.. అయితే చివరికి దిట్టకవి రాఘవేందర్ రావు గారి ఇనీషియేటివ్‌తో అది పూర్తయింది.. సంతోషం!

ఇక సాహసం అంటారా 30, 35 ఏళ్లపాటు సుమారు 10 ఆకాశవాణి కేంద్రాల్లో ఎటువంటి ఊతం లేకుండా లేకుండా పనిచేయడం, చాలా ప్రయోజనకరమైన ప్రయోగాలు చేయడం, దాంతో పాటు సైన్సు, పర్యావరణం, పత్రికారంగం, టెలివిషన్, సాహిత్యం, చరిత్ర, గాంధీజీ , పొట్టి శ్రీరాములు, గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి విషయాలకు సంబంధించి ఒక 75 పుస్తకాలు వెలువరించడంలో సాధకబాధకాలూ వాటిని వెలువరించడంలో ఎదురైనా ఎన్నో రకాల మోసాలూ కుంగుబాట్లు ఇలా చాలా ఉన్నాయి! అయినా వెరవాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు.. పోతే నేను ఇష్టంగా చేసిన పని మాత్రమే కదా అని నేను దిగాను.. ఆ మేరకు విజయం సాధించాను అనే అనుకుంటున్నాను!

ప్రశ్న 13: సాధారణంగా తమ సంకలనంలో కథలున్న రచయితలను కూడా కాపీలు కొనుక్కోమనే కాలంలో, మీరు మీ సంకలనంలో రచనలున్న ప్రతిరచయితకూ రెండు వాల్యూములూ పంపి గౌరవించారు. ఇదెలా సాధ్యమయింది?

జ: అవును.. నాకు తెలుసు.. ఇప్పటి కాలంలో తెలుగు రచయిత కనీసం ఏమి ఆశిస్తారో బాగా తెలుసు! కనుక నేను పడిన కష్టం గురించి ఆలోచించకుండా, వ్యాసాలు ఇచ్చిన రచయితలకు కనీసం ఒక సెట్టు ఇవ్వాలని ఆ ప్రచురణకర్తను కోరాను. అయితే ఇక్కడ విశేషమేంటంటే నా విన్నపాన్ని పూర్తిగా గౌరవించడం రాఘవేంద్రరావు గారి సహృదయత! ఎందుకంటే ఇదివరకు ఒకసారి 15 మంది రచయితల రచనలతో ఒక సంకలనాన్ని రూపొందించాం. కొన్ని నెలల తర్వాత ఆ పుస్తకం వచ్చింది, అయితే ఇంతవరకు ఆ ప్రచురణకర్త వెలువడిన పుస్తకం గురించి నాకు చెప్పలేదు, నాతో సహా ఏ రచయితకు సమాచారం ఇవ్వలేదు, పుస్తకం కాపీ పంపలేదు! అయితే చక్కగా అమ్ముకోవడం మాత్రం జరుగుతుంది.

అలాగే నేను చేసిన అనువాద పుస్తకం గురించి కూడా ఇలాంటి ఘనకార్యాన్ని మరో ప్రచురణ కర్త చేశారు. ఇలాంటివి నా వరకే ఇంకా చెప్పొచ్చు! అయితే ఇక్కడ చెప్పాల్సింది మాత్రం ఇదీ..

నా అభిప్రాయాన్ని గౌరవించి 870 పేజీల రెండు భాగాల సంకలనాన్ని సుమారు 50 మంది వ్యాసకర్తలకు ఆయన బహుమతిగా పంపారు. అయినా నాకు అదనపు తృప్తినిచ్చింది.

ప్రశ్న 14: పుస్తకం తయారీ ఒక ఎత్తు. ప్రచురణ మరో ఎత్తు! ఈ ప్రతిబంధకాలను అధిగమించినా సాహిత్య ప్రపంచంలో ప్రాచుర్యం లభించటం అసలయిన పరీక్ష. ఈ పుస్తకాలకు సాహితీ ప్రపంచం స్పందన ఎలా వుంది? మన తెలుగు పత్రికల సాహిత్య పేజీల్లో ఈ కృషి గురించి చర్చలు, వ్యాఖ్యలు సాగినట్టు లేవు. ఎందుకని మీకేమనిపిస్తుంది?

జ: అవును.. అయితే ఈ ధోరణులను దగ్గర్నుంచి నాలుగు దశాబ్దాలుగా చూస్తున్నవారికి ఆశ్చర్యం కలుగదు. వారు పైకి ఏమీ చెప్పినా చేసేది మాత్రం వారికి అవసరమైన పనులే! వారి సూచన మేరకో, అనుమతితో ఈ పనులు తలపెట్టడం లేదు కదా! వారి ద్వారా ప్రచారం పొందవలసిన వారు క్యూలో ఉన్నారని వారికి బాగా తెలుసు. కనుక ఈ బృహత్గ్రంధం వచ్చినట్టు చాలామందికి తెలియదు, అది అంతే! నాకేమీ నిరాశ కలిగించడం లేదు! సమకాలీన లేదా మీడియా ప్రశంస లేదా గుర్తింపు అసలు పరీక్ష అని పరిగణించే రోజులు పోయాయి!

ప్రశ్న 15: నిజానికి ఇలాంటి పుస్తకాల ప్రచురణ సాహిత్యప్రపంచం సంబరాలు చేసుకోవాల్సిన సంఘటన! కానీ, అలాంటి సంచలనం లేదెందుకని? తెలుగు సాహిత్యప్రపంచానికి సృజనాత్మక రచయితలను, విమర్శకులను గౌరవించాల్సిన బాధ్యత లేదంటారా? లేక ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో సాహిత్య పెద్దలనేవారు లేరంటారా?

జ: దీనికి ఎవరు చెప్పాలి? వాళ్ళు మీకు జవాబులు చెప్పేటట్టు అయితే వాళ్ళకు పెద్దరికం లేనట్టే! భవిష్యత్ దృష్టి, పరుల బాగు వంటి ఆలోచనలు మనకు పడవేమో!

నిజానికి అడివి బాపిరాజు గురించి ఇలాంటి సంకలనం ఇంతకు ముందు రాలేదు కనుక ఇది ఖచ్చితంగా ఉత్సవ సందర్భమే! ప్రజలకు బాధ్యత తెలియజేసేది కూడా మేధావి వర్గమే! ఏ రాష్ట్రంలో లేనంత దారుణంగా తెలుగు ప్రాంతం నేడుంది. ఇది మనం చర్చించి, విమర్శించి ప్రయోజనం లేదు. కనుకనే ఇతరులెవరూ స్పృశించని అంశాల మీద నా దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే ఈ ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ సంకలనం!

ప్రశ్న 16:  మీరు ఏ పనిచేసినా దానికొక ప్రయోజనం, ముఖ్యంగా విజ్ఞాన విస్తరణ అనే లక్ష్యం అంతర్లీనంగా కనిపిస్తుంది. దీనికి కారణమేమిటి? మీరు సమాచార మాధ్యమాల గురించి రాసినా, సైన్స్ గురించి రాసినా, సాహ్హిత్యాన్ని స్పృశించినా, కొత్త విషయాలు చెప్పటం కనిపిస్తుంది! 

జ:మీ పరిశీలనకు హృదయ పూర్వక ధన్యవాదాలు! సైన్స్, పర్యావరణం, పత్రికారంగం, టెలివిజన్ మీడియా, రేడియో మాధ్యమం, చరిత్ర, మహనీయులు, తెలుగు వర్తమాన సమాజం వంటివి స్థూలంగా నా రచనా వస్తువులు. వీటన్నింటికీ సైన్స్ ఆత్మ, రచనా శైలి సాహిత్య సృజన! అంతరార్థం ఫిలాసఫీ!!

ప్రశ్న 17: మీ భవిషత్తు ప్రణాళికలేమిటి? ఇంకా రావాల్సిన పుస్తకాలు, తయారు కావలసిన పుస్తకాల గురించి చెప్పండి!

జ: ఇంత సమగ్రంగా చేస్తున్న ఈ ఇంటర్వ్యూ చాలా రకాలుగా ప్రత్యేకమైంది. అభినందనలు, ధన్యవాదాలు! మధ్య మధ్యలో వీరి గురించి పరోక్షంగా చెప్పాను కనుక రాబోయే పుస్తకాల జాబితా యిస్తున్నాను:

  1. యద్దనపూడి సులోచనారాణి రచనలు గురించి 480 పుటల సంకలనం ప్రచురణలో ఉంది.
  2. పప్పూరు రామాచార్యులు గురించి మోనోగ్రాఫ్ నేడో రేపో వస్తుంది.
  3. సర్వేపల్లి రాధాకృష్ణయ్య సంబంధించిన జీవిత చరిత్ర అచ్చులో ఉంది.
  4. ‘నా ఆకాశవాణి అనుభవాలు’ పుస్తకం అచ్చులో ఉంది.
  5. 1928 లో వెలువడిన నవల పునః ప్రచురణ
  6. దక్షిణాంధ్ర దారి దీపాలు రివైస్డ్ అండ్ ఎన్లార్జుడ్ ఎడిషన్
  7. గాంధీయే మార్గం 3 & 4 వాల్యూమ్స్ ప్రచురణ
  8. ఆకాశవాణి సాంస్కృతిక గమనం గురించిన గ్రంథం
  9. ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు
  10. అన్నమయ్య గురించిన సంకలనం
  11. గాంధీజీ – పర్యావరణం గ్రంథం
  12. వాకాటి పాండురంగారావు గురించిన సంకలనం
  13. తెలుగు మీడియా గురించి బృహత్సంకలనం
  14. ప్రకాశం జీవితచరిత్ర

ఇవి ఇప్పటికి గుర్తుకు వచ్చినవి ఇవే!

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ.

వేణుగోపాల్: ధన్యవాదాలు మీకు, బహు కృతజ్ఞతలు!

***

‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ (సాహితీ చిత్రలేఖన శిల్ప నాట్య సంపాదక సినీ కళా నైపుణ్యాల విశ్లేషణ, 2 వాల్యూమ్స్)

సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్

ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, విజయవాడ.

పేజీలు: 826

వెల: ₹ 1,000.00

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413

శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. 8464055559

ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:

https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-1-

https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-2-

Exit mobile version