ప్రసిద్ధ రచయిత్రి డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రత్యేక ఇంటర్య్వూ

2
3

[ఇటీవల ‘కొన్ని శేఫాలికలు’ అనే వ్యాస సంపుటిని వెలువరించిన డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారూ.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి: నమస్కారమండీ

~

ప్రశ్న 1. ‘కొన్ని శేఫాలికలు’ పుస్తకం మీరు రచించిన సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ పుస్తకానికి శేఫాలికలు అని పేరు పెట్టటం వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం, ఉద్దేశాలున్నాయా?

జ: శేఫాలిక అంటే సంస్కృత భాషలో పారిజాతం. భాసుడి నాటకాలలో ఈ పదం కనిపిస్తుంది. ముఖ్యంగా స్వప్న వాసవదత్త నాటకంలో! దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా తనను ఈ శేఫాలికతో పోల్చుకున్నారు. పైన తెలుపు, లోపల ఎర్రని కాడ లాంటి రక్తపు జీర అని, తన లోపలి విషాదం గురించి చెప్తూ.

పారిజాతాలు సుకుమారమైన చిన్న పూలు. కానీ గాఢమైన పరిమళం వెదజల్లుతాయి. గొప్ప సాహిత్యం కూడా క్లుప్తంగా ఉంటూ మథించిన వారికి ఆలోచనామృతం అవుతుంది. ఆ విషయాన్ని ప్రతీ వ్యాసం లోనూ ఉదాహరణ పూర్వకంగా చెప్పడం వల్ల శీర్షికకు ఆ పేరు పెట్టాను. మరో సంగతి. ఎప్పుడో ముఫ్ఫయిఏళ్ల కిందట మా ఇంటికి కూడా శేఫాలిక అని పేరు పెట్టుకున్నాను. నాకు ఆ పదం చాలా ఇష్టం. ఇంకా విభూతిభూషణ్ బందోపాధ్యాయ కూడా తన నవలలలో శేఫాలికా పుష్పాల మాట రాస్తాడు.

ప్రశ్న 2. ఈ వ్యాసాలు ఒక ప్రణాళిక ప్రకారం రచించినవా, లేక ఏ వారానికావారం మనసుకు నచ్చిన రచనను విశ్లేషిస్తూ రాశారా?

జ: సారంగ అంతర్జాల మాసపత్రిక సంపాదకుడు అఫ్సర్ చాలా కాలంగా పత్రికకు ఏదేనా రాయమని అడిగేవాడు. నేను వాయిదా వేసేదాన్ని. చివరకు నన్ను ప్రభావితం చేసిన సాహిత్యరూపం ఏదైనా సరే దాని మీద రాయమని సూచించారు. ఈ సూచన నన్ను ఉత్సాహపరిచింది. వెంటనే ఎన్నో గుర్తొచ్చాయి. నేను చదివిన పుస్తకాలు, విన్న పాటలు, చూసిన సినిమాలు ఇలా చాలా చాలా మనసులో మెదిలేయి. ఇక అప్పటినుంచి నెల నెలా ఒక్కొక్క అంశం గురించి రాసుకుంటూ వచ్చాను. దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక అంటూ ఏదీ లేదు. కానీ అంతస్సూత్రం ఉంది. అది ఏ సాహితీ కళారూపాన్నైనా సరే అస్వాదించే విధానాన్ని చదువరులకు అందించటం.

ప్రశ్న 3. తెలుగు సాహిత్య విమర్శలో పాశ్చాత్య విమర్శ సూత్రాలు, లేకపోతే కమ్యూనిస్టు విమర్శ సూత్రాలను అనుసరించటం కనిపిస్తుంది అధికంగా.. కానీ, మీరు ప్రత్యక్షంగా ప్రస్తావించకున్నా, మీ విమర్శ విశ్లేషణల్లో భారతీయ సాంప్రదాయిక సాహిత్య విమర్శ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా రసానికి, అనుభూతికి పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. మనం మన సాంప్రదాయిక అలంకార శాస్త్రాలను విస్మరించటం వల్ల ఆధునిక తెలుగు సాహిత్యం వస్తు ప్రాధాన్యమై, రసాన్ని విస్మరించటంవల్ల ఎంతో కోల్పోయామా?

జ: నాకు పాశ్చాత్య విమర్శ సూత్రాల గురించి ఎక్కువ తెలియదు. నేను భారతీయ అలంకార శాస్త్రం చదువుకున్నాను. కొంత కాలం పాఠం చెప్పేను. కానీ నా సాహిత్య అధ్యయనంలో ఇవేవీ పెద్దగా పనికి రాలేదు. సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి అన్న దానికి మా మాష్టారు శ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు చూపిన రాజపథం ఒకటి ఉంది. అదే ఇంత కాలంగా నన్ను నడిపిస్తోంది.

ఏ సాహిత్య ప్రక్రియ నైనా అవసరమైతే ఒకటికి నాలుగు సార్లు చదవడం. అటుపైన మననం చేసుకోవడం చెయ్యాలి. అంటే అందులోని శిఖరాలూ, లోయలూ తెలియాలంటే దాన్ని ప్రసన్నం చేసుకోవాలి. నన్నయ గారు దాన్నే ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్నారు.

ప్రసన్నమైన తర్వాతనే అనుభూతికి అందుతుంది.

సాహిత్య ఆస్వాదనం అంటే షాపింగ్ మాల్‌కి వెళ్ళి వస్తువులు కొనుక్కుని కార్డ్ స్వైప్ చెయ్యడం లాంటిది కాదు అని మనం పదేపదే చెప్పాలి. అది నిరంతర కృషి. అలా చేస్తేనే ఇలాంటి ఆనందం దొరుకుతుంది అని కళ్ల ముందుకు తెచ్చి చూపించాలి. అదీ ‘కొన్ని శేఫాలికల’లో నేను చేసిన పని.

ఇక మీ ప్రశ్నలో చివరి భాగానికి వద్దాం. వస్తు ప్రాధాన్యత ఉండడంలో తప్పులేదు. కానీ వస్తువుని ఎలాగ ఆవిష్కరిస్తున్నాము అన్నది చాలా ముఖ్యం. నినాదం కవిత్వం కాదని మనందరికీ తెలుసు. నూతన ఆవిష్కరణ లేకపోతే రసానుభూతి లేదు. రసానుభూతి లేకపోతే వస్తువు గురించిన ఆలోచనలో సీరియస్‌నెస్ లోపిస్తుంది. అందుచేత కథ చెప్పినా, కవిత్వం చెప్పినా వస్తువు ఎంత ప్రధానమో, దాన్ని చెప్పే విధానం కూడా అంత నిత్య నూతనంగానూ, క్లుప్తంగా, గాఢంగా ఉన్నప్పుడే అది సాహిత్యంగా మారుతుంది అని పదేపదే చెప్పాల్సి వస్తుంది.

శ్రీ శ్రీ మహాప్రస్థానం తీసుకుందాం అది ఇప్పటికీ వస్తు, రూప ప్రాధాన్యతలు సమానంగా ఉన్న పుస్తకం. మరో 100 ఏళ్లకు కూడా దానికి తిరుగు ఉండదు. అందువల్ల వస్తు ప్రాధాన్యతను కూడా మనం కాదనడానికి లేదు కానీ కావ్యం తాలూకు పరమ ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే అంతా తేటతెల్లం. ప్రయోజనాలు అనేకంఉండవచ్చు. పరమ ప్రయోజనం ఒకటే ఉంటుంది.

ప్రశ్న 4. మీరు కుమార సంభవాన్ని అప్పటి ప్రేమ కథ అన్నారు. శకుంతలలో స్త్రీవాదుల మాటలు విన్నారు. స్వప్నవాసవదత్తలో విషాదాన్ని చూశారు. కానీ, అంతర్లీనంగా మూడూ ప్రేమ కథలే కదా?

జ: ప్రతీ ప్రేమకథా కొత్తదే. ఇప్పటికీ ఎవరైనా సరే బలంగా చెబితే ఆ ప్రేమ కథ కొత్తగానే ఉంటుంది. అయితే ఒక్కొక్క ప్రేమ కథ ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. నిజానికి అలా చెప్పాలి రచయిత. కాళిదాసు ‘కుమార సంభవం’లో ప్రేమ తాలూకు నిష్టని చెప్పాడు. ‘శకుంతల’లో నన్నయ్య శకుంతల యొక్క వికసించిన వ్యక్తిత్వాన్ని చూపించాడు. భాసుడు ‘స్వప్నవాసవదత్త’లో ప్రేమలోని అపురూపమైన సున్నితత్వాన్ని చూపించాడు. కానీ మరింత లోతుగా చూస్తే నేను విడదీసి చూపించిన వేరే కోణాలు కూడా అందులో ఉన్నవే.

మీరు మూడు కథల్లో విషయాల్ని బాగా పట్టుకున్నారు.

ప్రశ్న 5. అపూర్వ పురాణ గాథల స్మృతి వ్యాసంలో మీరు పురాణాల ఆధారంగా చేసే స్వేచ్చ సృజనని ఆహ్వానించటం కనిపిస్తుంది. అయితే పురాణాలలో లేనివి వాటికి ఆపాదిస్తూ, పురాణ పాత్రల వ్యక్తిత్వాలను దెబ్బ తీసేలా చేసే సృజన కూడా ఆమోదయోగ్యమా?

జ: పురాణ పాత్రలను తీసుకుని మార్చి రాసే కథల మీద నాకు సభిప్రాయం లేదు. చలం గారు కూడా పురాణ కథలు నాటకాలుగా రాశారు. ఆయన ఉద్దేశం ఆ కథల్లో దాగివున్న ఏ సత్యాలను అయితే మనం మిస్ అవుతున్నామో వాటిని తీసి చూపించడం. అంతే తప్ప వాటికి పెడర్ధాలు చెప్పటం ఆయన ఉద్దేశం కాదు. సౌదా అపూర్వ పురాణ గాథల్లో కూడా నాకు చలం గారు చేసిన పనే చేశాడు అనిపించింది. అందుకనే బర్బరీకుడి కథ గురించి రాయవలసి వచ్చింది. అప్పటి కథలను కాలం నుంచి విడదీసి చూడడం చేస్తే ఔచిత్యం పోతుంది కదా.

ప్రశ్న 6. ఇటీవలి కాలంలో పేరున్న రచయితలు కూడా పుస్తకాలు మనుషుల్ని మార్చవు. సమాజంపై ప్రభావం చూపవు అనటం కనిపిస్తోంది. కానీ, ‘కొన్ని శేఫాలికలు’ పుస్తకంలోని వ్యాసాలు చదివితే పుస్తక పఠనం మిమ్మల్ని సున్నితమనస్కురాలిగా మలచటమేకాదు, జీవితంలోని ప్రతి క్షణంలోని అందాన్ని గమనించి ఆనందించే వ్యక్తిగా మలచింది సాహిత్యం అనిపిస్తుంది. మీ వ్యక్తిత్వం పై సాహిత్య పఠన ప్రభావం వివరిస్తారా?

జ: సాహిత్యం ప్రభావం సమాజం మీద మూకుమ్మడిగా ఉండదు. అది వ్యక్తుల మీద ఉంటుంది. వ్యక్తులు సాహిత్యాన్ని చదివి, సాహిత్యాన్నీ జీవితాన్నీ వేరువేరుగా భావిస్తే కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. సాహిత్యాన్ని తమ ఆలోచనల్ని వికసింప చేసే సాధనం గాను, జీవితంలో తమకు సంభవించిన అనేక సంక్లిష్టతలకు దారి దీపం గానూ భావిస్తే తప్పకుండా ముందుకు వెళ్తారు. నేను మొదటి నుంచి కూడా ఒక కథ చదివినా, కవిత చదివినా, నవల చదివినా కూడా దాన్నుంచి మనం ఏం గ్రహించేం, అది మన జీవితానికి ముందుకు వెళ్ళటానికి ఏ విధంగా పనికొస్తుంది, అన్న దృష్టితోనే చదువుకుంటూ వచ్చాను.

సాహిత్యం నన్ను కొన్ని సందర్భాల్లో సేద తీర్చింది. కొన్ని సందర్భాల్లో నా అనేక అనేక సంక్లిష్టతలను విడదీసి చూపెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచంలో మానవ సంబంధాలను సవ్యంగా ఉంచుకోవడానికి మార్గదర్శకం అయింది. ఇలా సాహిత్యాన్ని గురువుగా భావిస్తే లేదా, తోడుగా భావిస్తే ఎవరికైనా సరే ఆ సరస్వతి తన మిత్ర హస్తాన్ని అందిస్తుంది. దానికి నేనే ఉదాహరణ.

ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా తొందరగా కొన్ని ప్రతిపాదనలు చేయడం అలవాటైపోయింది. దానికి ముందు వెనకల ఆలోచన ఏమీ ఉండదు. కాబట్టి ఆ ప్రతిపాదనలని మనం సులువుగా తిరస్కరించవచ్చు. ఇంకొకటి ఏమిటంటే ఎంత సాహిత్యం చదువుకునీ, రాసీ కూడా ఏమీ మారకుండా అక్కడే ఉండిపోయిన వాళ్ళని చూసినప్పుడు కూడా ఇలాంటి స్టేట్‌మెంట్స్ వస్తాయేమో!!

ప్రశ్న 7. మీరు ఇన్ని రచనలను, రచయితలను ఈ రచనల్లో ప్రస్తావించారు. మీకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చి మీపై తిరుగులేని ప్రభావం చూపిన రచయిత ఎవరు? రచన ఏమిటి?

జ: మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ఏ గొప్ప రచయిత అయిన మన మీద తన ప్రభావాన్ని ఎంతో కొంత వేస్తాడు. అలా చూసినప్పుడు ఇందులో చాలా రచనలు నా ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం గాని, ప్రభావితం చేయటం గాని కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే చలం గారు, పాలగుమ్మి పద్మరాజు గారు వంటి రచయితలు ఆలోచింపజేస్తారు. వారి తాలూకు తాత్విక ఆలోచనల ప్రభావం నా మీద ఉంది. ప్రాచీన కవులు మన దారిని సుగమం చేస్తారు. సత్యజిత్తు రాయ్ లాంటి దర్శకులు మన కళ్ళ ముందు కొత్త లోకాలు తెరుస్తారు. అందువల్ల నేను ఇక్కడ ప్రత్యేకంగా ఒక్క పేరు చెప్పలేను.

ప్రశ్న 8. ఈ వ్యాసాల్లో ఏ వ్యాసం రచనకు కష్టపడ్డారు? ఇది నా వల్ల కాదు అనిపించిన వ్యాసం ఏమైనా వుందా?

జ: నిజానికి ఇవన్నీ నెలకి ఒకటి చొప్పున చాలా ఇష్టంగా రాసుకున్న వ్యాసాలు. ఇందులో దేనికోసమూ ఎక్కువ కష్టపడ్డాను అని అనుకోలేదు. కారణం ఏమిటంటే ఇవి ఈ వ్యాసాల కోసం అప్పటికప్పుడు చదివినవి కాదు. ఎప్పటినుంచో చదువుతున్నవి. ఒక్క కాళిదాసు కుమార సంభవం వ్యాసం మాత్రం అంతకు ముందు చదివేను. ఒక ప్రసంగం కోసం మళ్లీ చదువుకున్నాను. అదొక్కటి రాసేటప్పుడు మళ్లీ కుమార సంభవం శ్లోకాలు చదువుకుంటూ అందులో నుంచి కావాల్సినవి ఏరుకుంటూ రాసుకుంటూ వచ్చాను. ఇది కూడా ఇష్టంగానే చేసిన పని.

ప్రశ్న 9. ఈ మొత్తం వ్యాసాల్లో మీ మనసుకు బాగా నచ్చిన అయిదు వ్యాసాలేమిటో చెప్తారా?

జ: ఈ ప్రశ్న నాకు ఒక చిన్న పరీక్ష లాంటిది. అందులో చాలా వ్యాసాలు మళ్లీ చదువుకుంటే నాకు బాగానే బాగున్నాయి అని అనిపిస్తాయి. కానీ మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చూసి చెప్తున్నాను. విశ్వనాథ వారి రెండు కవితల్ని కలుపుతూ రాసిన రెండు ప్రయాణాలు అన్న వ్యాసం నాకు చాలా నచ్చింది. రష్యా దాకా తీసుకువెళ్లే కథ అని తాలుస్తాయి కథ మీద రాసుకున్న వ్యాసం, మెలకువ నిచ్చే అనుభవం ఇది అని అతనిదే మరో కథ మీద రాసిన వ్యాసం కూడా నాకు చాలా నచ్చిన వ్యాసాలు. ఇక అప్పటి ప్రేమ కథలు అనే కాళిదాసు వ్యాసం కూడా చాలా ఇష్టమైన వ్యాసం.

ఇక చివరిది చిన్నమ్మకి ఉత్తరం నా అనుభవం ఇన్నేళ్ల తర్వాత కూడా మర్చిపోలేను. పుస్తకానికి అంతకీ వన్నె తెచ్చే వ్యాసం అది అనిపిస్తుంది. మీరు చెప్పిన ఐదు అయిపోయాయి కదా.

ప్రశ్న 10. సాహిత్యమనేమహా సాగరంలో మీరు అందించిన కొన్ని బిందువులివి. ఇంకా ఇలాంటి సాహిత్య వ్యాసాల రచన కొనసాగించే ఆలోచన వుందా?

జ: నేను నాకు ఓపిక ఉన్నంతకాలం పుస్తకాలు చదువుకుంటూనే ఉంటాను, వేగంగా కాకపోయినా నిజంగా నిదానంగా అయినా సరే. ఇక చదివిన తర్వాత నా మీద ప్రభావం చూపించిన వాటి గురించి, నచ్చిన వాటి గురించి తప్పకుండా రాద్దామనే ఉంది. ఇదే పేరుతో కాకపోయినా ఇటువంటి వ్యాసాలు పరంపర కొనసాగిస్తానని చెప్పగలను.

ప్రశ్న 11. ఈ వ్యాసాలు చదువుతూంటే, నూతన తరం రచయితలకు పాత తరం రచయితలకూ అధ్యయనంలో వున్న తేడా కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకని సాహిత్య పరమైన విలువలు తరువాత తరాలకు అందచేయటంలో ఒక తరం విఫలమయింది?

జ: ఇది వ్యక్తుల తాలూకు లేదా తరం తాలూకు వైఫల్యం అని నేను అనుకోనండి. ఇప్పటికీ శ్రద్ధగా చదివే సాహిత్య పాఠకులు ఉన్నారు. అలాగే మన తరంలో కూడా ఇంత లోతుగా సాహిత్య అధ్యయనం చేసిన వారు మరీ ఎక్కువ మంది లేరు. ముఖ్యంగా మా గురించి చెప్పాలంటే మాకు మా గురువులు, మా నాన్నగారు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు అందించిన చేయూత దీనికి కారణం.

ప్రశ్న 12. ఇలాంటి లోతయిన అవగాహనతో సమతౌల్యంతో సమన్వయ దృక్పథంతో రచించే సాహిత్య వ్యాసాలు దాదాపుగా మృగ్యమైపోయాయని చెప్పవచ్చు. ఈ వ్యాసాలు ప్రచురితమవుతున్నప్పుడు పాఠకులనుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

జ: మీ సునిశితమైన పఠనానికి, ప్రశంసకు ధన్యవాదాలు. ఈ వ్యాసాలు సారంగా అంతర్జాల పత్రికలో వస్తున్నప్పుడు గానీ, తిరిగి వాటిని నేను ఫేస్‌బుక్‌లో పెట్టినప్పుడు గానీ నాకు చాలా విశేషమైన స్పందన వచ్చేది. మంచి పాఠకులు ఉన్నారనిపించింది. నిజంగానే మనం సాహిత్యాన్ని భక్తితో చదివి సారాన్ని అందిస్తే అంతే శ్రద్ధగా అందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనిపించింది. ఇంత మంది పాఠకుల ప్రశంసలు నన్ను మరిన్ని వ్యాసాలు రాయటానికి ఉత్తేజపరిచేయని కూడా చెప్పగలను. ఈ సందర్భంగా వారందరికీ, ఇన్ని మంచి ప్రశ్నలు అడిగి నాతో మళ్లీ ‘కొన్ని శేఫాలికలు’ గురించి ఇన్ని ఆలోచనలు చేయించిన మీకు కూడా ధన్యవాదాలు.

ప్రశ్న 13. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: చదువుకోవటం నాకు జీవితంలో ఇష్టమైన పని. చదవవలసిన పుస్తకాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక రాయవలసిన వాటి గురించి చెప్పాలంటే దాదాపు ఇప్పటికీ ఒక 50 కథలు రాశాను మరికొన్ని కథలు రాయాలని, అవి రాసిన తర్వాత ఒక నవల రాయాలన్నది నా ఉద్దేశం. చాలా మంది మిత్రులు ఆత్మకథ రాయమని అడుగుతూ ఉంటారు. కానీ నేను ఆత్మకథాత్మకమైన నవల రాస్తే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను. రాస్తానో లేదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వీరలక్ష్మీదేవి గారు.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి: కృతజ్ఞతలండి!!

***

కొన్ని శేఫాలికలు (వ్యాసాలు)
రచన: శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి
ప్రచురణ: సాకేత్ ప్రచురణలు
పేజీలు: 240
వెల: ₹250.00
కాపీలకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/konni-shephalikalu
https://www.amazon.in/Shephalikalu-Vadrevu-Veeralakshmi/dp/B0CGXH2DXG/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here