[‘పైనాపిల్ జామ్’ అనే కథాసంపుటిని వెలువరించిన డా. విజయ్ కోగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. విజయ్ కోగంటి గారూ.
డా. విజయ్ కోగంటి: నమస్కారం. నేను గొప్ప కథా రచయితను కాకపోయినా ఇలా నా కథల గురించి ప్రశ్నిస్తూ నాకు కొంత ఆలోచించే సమయాన్ని మీరిస్తున్నందుకు కృతజ్ఞతలు
~
ప్రశ్న 1: మీరు ప్రధానంగా కవి. వ్యాసకర్త. కథా రచనకూ, కవిత్వ సృజనకూ మీరు గమనించిన భేదాలేమిటి? మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు, కథా రచనకా? కవిత్వ రచనకా?
సమాధానం: నేను ప్రధానంగా కవినే అయినా విమర్శ, కథా రచన, నాకు మనసులో మెదలకుండా ఉండవు.
వస్తువు ఎంపికలో వైవిధ్యం కథా రచనలోనే సాధ్యపడుతుందని నేను అనుకుంటాను. పూర్తి ఆత్మాశ్రయ కవిత్వాన్ని, ఆత్మాశ్రయమౌతూ సమాజాన్ని ప్రతిబింబించే కవిత్వాన్ని రచించడానికి నేను ఇష్టపడతాను. అయితే వైవిధ్య భరితమైన సమాజ ప్రతిఫలనం కథా రచనలో జరిగినంత, ఒదిగినంత కవిత్వంలో జరగదని నేను అనుకుంటాను. కవిత్వము, కథా ఏ ముగింపులనూ ఇవ్వవు. అవి పాఠకుడి మనసును ఉద్దీపింపజేసి ఒక ఆలోచనను వెలిగిస్తాయి. కవిత్వం ఒక తాత్వికమైన వెలుగునిస్తూ వివేచనను కలుగచేస్తే, కథ సమాజం పట్ల తన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఆలోచనను కలుగచేస్తూ బాధ్యతను గుర్తు చేస్తుంది.
మంచి కవిత్వమైనా, కథ అయినా ఆలోచింపజేయగలగాలి. ఇక నేను దేనికి ప్రాధాన్యమిస్తాను? అంటే నా మటుకు నాకు రెండూ ఇష్టమే. కవిత అమ్మ మాటలా మనసును ఆహ్లాదింప చేస్తూ దారి చూపిస్తే, కథ నాన్న మాటలా విశదీకరిస్తూ లోకానికి దగ్గరగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి అమ్మ ఇష్టమా? నాన్న ఇష్టమా? నాకు ఇద్దరూ ఇష్టం.
ప్రశ్న 2: మీరు కథా రచనలో దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఇతివృత్తానికా? శైలీ శిల్పాలకా? కథనానికా? ఆలోచనలకా?
సమాధానం: ఏ రచన చేసినా ఆలోచన చాలా ముఖ్యం. అయితే ఇతివృత్తం, శైలి, శిల్పం, కథనం ఇవన్నీ శరీర భాగాల్లాగా అన్ని కలిస్తేనే కథ అనే స్వరూపం ఏర్పడుతుంది. ఒకోసారి చిన్నదే అయినా ఒక సన్నివేశం కథగా కుదురుతుంది. ఇంకోసారి ఓ సంభాషణలో ఓ కథాంశం గూడు కట్టుకుంటుంది. ముందు ఇతివృత్తాన్ని ఎంచుకున్నాక దాన్ని కథగా మార్చే ఆలోచన, చెప్పదలుచుకున్న శైలి, అందించే శిల్పనిర్మాణం–అన్ని కుదిరితేనే మంచి కథ అవుతుందని నా అభిప్రాయం. అందరికీ తెలిసిన ఇతివృత్తమైనా వినూత్నంగా అందించగలగడం, విభిన్న కోణాల నుంచి చెప్పగలగడం, పాత్రలను మలచడం – ఇలా అన్నింట్లోనూ ఆలోచనాత్మకంగా చేయగలగడం కథా రచనను పరిపుష్టం చేస్తుందనుకుంటాను. ఒక కథకు ఒదిగిన శైలి ఇంకొక కథకు ఒదగదు. ఇతివృత్తాన్ని బట్టి కథనం, శిల్పం, శైలీ మారాలి. అన్నీ ఒకే రకంగా ఉంటే వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనత్మకంగా పరిశీలిస్తే కథా వస్తువులు, పాత్రలు దేనికవే కొత్తగా వైవిధ్య భరితమైన గ్యాలరీ లాగా అనిపించాలని నేను అనుకుంటాను. మీరన్నట్లు ఆలోచనలు కూడా చాలా ముఖ్యమే. కథా వస్తువు, శిల్పం గురించిన దీర్ఘమైన ఈ ఆలోచన ఎంపిక పరంగాను, నిర్మాణంలోనూ కూడా ముఖ్యమైనదని నా భావన. ఏ రచయితయినా వీటన్నిటికీ ప్రాధాన్యతనీయాలని నా ఉద్దేశ్యం.
ప్రశ్న 3: ఈ ‘పైనాపిల్ జామ్’ కథా సంపుటిలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం ‘క్లుప్తత’. ఒకటి రెండు కథలు మినహాయిస్తే, మిగతావన్ని ఒకటిన్నర-రెండు పేజీల లోపు నిడివి ఉన్నవే. క్లుప్తంగా చెబుతూనే ప్రభావవంతంగా చెప్పడం ఎలా సాధ్యమయింది? కవిగా మీ అనుభవం ఇక్కడ పనిచేసిందని అనుకుంటున్నారా?
సమాధానం: జీవితంలోని చాలా సన్నివేశాల సారాంశాన్ని హృద్యంగా చెబితే కవిత. సన్నివేశాన్ని సృజనాత్మకంగా వివరిస్తూ సాగితే కథ. కవిత్వంలో క్లుప్తత నాకు చాలా ఇష్టం. తక్కువ నిడివి, భాషలో ఎక్కువగా మనసుకు పట్టి నిలిచిపోయే భావాన్ని చెప్పడం కవిత్వంలో క్లిష్టమైన పని. అలాగే మంచి దీర్ఘ కవిత రాయడం కూడా నా దృష్టిలో చాలా కష్టమైన విషయం. చారిత్రకమైన, వేదాంతపరమైన, ఐతిహాసిక లక్షణం గల ఇతివృత్తమైతేనే వస్తువు పరంగా దీర్ఘ కవిత కుదురుతుంది. ఇందాక చెప్పినట్టు భావవ్యక్తీకరణ క్లుప్తంగానే ఉంటూ ఆలోచనాత్మకంగా చేయగలిగితే అది మంచి కవిత అవుతుంది. ప్రతిదాన్ని సందేశాత్మకంగానే చేయాలనుకోవడం, కొటేషన్లన్నీ కవితలుగా చెప్పడం కొందరికి సాధ్యమవుతుందేమో కానీ నా మటుకు నాకు మంచి కవిత అందమైన భావాల ద్వారా, తగిన భాషలో ఉద్వేగభరితమైన క్షణాలని, సన్నివేశాలని, సారవంతమైన మాటల ద్వారా సందేశాన్ని నేరుగా ఇవ్వకుండా ఆలోచింపచేస్తూ రాయగలిగేది. కథ కూడా అంతే. ఉన్నంత తక్కువ నిడివిలో గాఢతని పోగొట్టుకోకుండా విషయాన్ని ప్రకటించగలిగితే మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
అయితే నిడివి అనేది కథా వస్తువును బట్టి, పాత్రల లోతును బట్టి, అవసరమైన వివరణలను బట్టి ఉంటుంది.
శ్రీ సోమ శేఖర ప్రసాద్ ‘హాన్స్ ఇండియాలో’ని తన రివ్యూలో ఈ కథలని ‘ఫ్లాష్ ఫిక్షన్’ గా అభివర్ణించాడు. అది నిజమే, అయితే ‘ఫ్లాష్ ఫిక్షన్’ ఈ కాలం నాటిది కాదు. ఫ్రాంజ్ కాఫ్కా కూడా 1916లోనే ఇలాంటి క్లుప్తత కలిగిన కథలని వ్రాశాడు. అయితే అవి చాలా abstract గా ఉంటాయి. ‘ఫ్లాష్ ఫిక్షన్’ రాయడం చాలా కత్తి మీద సాము. ఒక సన్నివేశం లోనో, సంభాషణలోనో కూడా రచయిత కథాంశాన్ని చూడగలగాలి.
ఒక రకంగా కవిత కంటే కథ రాయడం కొంత సులువు అని నా అభిప్రాయం. కథ ఎప్పుడూ రచయితకి కొంత విస్తృతికి అవకాశం ఇస్తుంది. తన కథా వస్తువుకి తగినంత కాన్వాస్‌ను ఎంచుకునే సౌలభ్యం ఇస్తుంది. గుస్తవే ఫ్లాబే చెప్పినట్లు కథ అయినా, నాటకమైనా, నవల అయినా ‘ప్రారంభించే తీరు’, ‘సంఘర్షణ’ లేక ‘కథా వస్తువు మూలాన్ని విషయకరిస్తూ అందించే విధానం’, ‘ముగింపు’ – ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. కొన్నిసార్లు వర్ణనలు, వివరణలు, పాత్రలపై కథా రచయిత అభిప్రాయాలు అన్నీ అవసరానికి మించి ఎక్కువ పాళ్లలో ఉంటే నిడివి పెరిగిపోయి పాఠకుడికి మొనాటనీ కూడా అనిపిస్తుంది. కవిత్వ విషయంలోనూ అంతే. ఒకేరకమైన themes కూడా విసుగనిపిస్తాయి. అందుకే కవితలోని మెరుపును ఆస్వాదించినట్లు, కథ చదివి ఆలోచనలో మునగాలి. ఒక్కోసారి కథ చాలా పెద్దదైనా ఆశించినంత ఆనందం, ఆలోచన దక్కకపోవచ్చు. ‘ఫ్లాష్ ఫిక్షన్’ విషయంలో కథ మొదలయ్యే విధానం, సంఘర్షణలు, ముగింపు – మూడూ కలిసి వచ్చేలా క్లుప్తంగా వ్రాయడానికి మంచి పరిశీలన, సాధన కావాలి.
ఈ సంపుటిలో పెద్ద కథలు చాలా కాలం క్రితమే రాసినవి 2005 నుంచి 2015 లలో వ్రాసినవి. 2017 తర్వాత చిన్న కథల కోసం బాగా ప్రయత్నించాను. హెచ్.ఆర్.కే గారు తన ‘రస్తా’లో ప్రచురిస్తూ ప్రోత్సహించారు. ‘ఈమాట’ మాధవ్ కూడా అంతర్గతంగా అనేక చర్చల తర్వాత ప్రచురిస్తున్నందుకు ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. (‘పది నిమిషాలు’ కథ) ‘ప్రస్తుత జీవితాల్లోని వేగం మనిషిని దేనిని పూర్తిగా చదవనీయకుండా చేస్తోంది. అలాంటి ఈ సమయాల్లో ‘ఆసక్తిగా వేగంగా కథలని చదువుకునే అవకాశం ఈ పుస్తకం అందిస్తోంద’ని ఓ మిత్రుడు సంభాషణలో పంచుకున్నాడు. అలాగని పెద్దకథలు వ్రాయకూడదనీ పక్కనపెట్టేయాలనీ కాదు. హైకూ ఎలాంటి ఆనందాన్ని అయితే ఇస్తుందో, చిన్న కథ కూడా అలాంటి ఆనందాన్ని ఇవ్వగలగాలని నేను భావిస్తాను.
చాలా చిన్న కాన్వాస్‌లో కథని చదివిన అనుభూతిని, ఆనందాన్ని ఇవ్వడానికి కవిత్వానికి ఉపకరించిన క్లుప్తత నాకు బాగా ఉపయోగించిందని నేను అనుకుంటాను.
ప్రశ్న 4: చాలా వరకు కథల్లో మధ్యతరగతి మనుషుల ఊగిసలాటను, సందిగ్ధాలను ప్రదర్శిస్తూనే, స్థిర నిర్ణయాల్నీ, నమ్మికనీ బాగా వ్యక్తీకరించారు. పరిస్థితులతో రాజీపడి బతికేవారిని చూపించారు (‘పాఠం’ కథలో సత్యదేవ్); ‘మూవ్ ఆన్’ అయి ముందుకు సాగిపోయేవారిని చూపించారు (‘ట్రాన్స్‌ఫర్’ లో కల్పన). ఇలాంటి వ్యక్తులు నిజ జీవితంలో మీకు తారసపడ్డారా? లేదా Disclaimer లో చెప్పినట్టు ఇతివృత్తం అనుకున్నాక, సన్నివేశాలను సృష్టించి ఆయా పాత్రలను కల్పించారా?
సమాధానం: జీవితమంటేనే ఊగిసలాట, సందిగ్ధత. ఇంకా చెప్పాలంటే, వాస్తవానికి, ఊహకి మధ్య నిలిచిన గాలివంతెన. కొందరు పరిస్థితులతో రాజీ పడుతూ వెళ్తారు. కొందరు రాజీ పడలేక సతమతమవుతారు. అయితే జీవితంలో ఆశావాద దృక్పథం నిలిచేవుంటుంది. నిలవాలి కూడా. చాలామంది గొప్పవారు ఆటోబయోగ్రఫీ రాసుకుంటారు. రాయించుకుంటారు. తమ బాధలను, వ్యథలను, చిన్న సంతోషాలను, ధైర్యంగా రాసుకోలేని వాళ్లు, రాయించుకోలేని వాళ్ళు, రాసుకుందామనుకున్నంత పట్టించుకోని వాళ్ళూ, మధ్యతరగతి మనుషులే. మన చుట్టూ ఎంతోమంది, ఒక్కోసారి మనం కూడా ఇలాగే బతుకు వెళ్లదీస్తుంటాం. ఇష్టం లేకపోయినా భరిస్తూనే నడుస్తుంటాం.
మన జీవితంలో అనేక మందిని కలుస్తూ పరిశీలిస్తూ ఉంటాం. పత్రికల్లో చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం. నాకు స్వతహాగా మనుషుల ప్రవర్తన, మాట్లాడే తీరు, హావభావాలు గమనిస్తూ ఉండడం, డైరీల్లో రాసుకుంటూ ఉండడం, చిన్నప్పటి నుంచి అలవాటు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నాన్నగారి ఉద్యోగం, నా చదువులు జరగడంతో రకరకాల మనుషుల మాటలు, ప్రవర్తనలు, విభిన్న వ్యక్తుల జీవన విధానాలు తీరుతెన్నులు చిత్రపటాలలా నా మనసులో నిలిచిపోయాయి.
నా ఉద్దేశ్యంలో ‘కల్పన’ అనేది ఎక్కడి నుంచో రాదు. మన చుట్టుపక్కల జీవితం నుంచే వస్తుంది. సన్నివేశాలను, సంభాషణలను చూసి ఆలోచిస్తూ ఉండడం ద్వారా వస్తుంది. ఈ కథల్లో కాల్పనికంగా జరిగిన విషయాలు కూడా అంతే. జీవితానికి దూరంగా జరగలేదు. జీవితానికి ఆధారంగానే, జీవితపు స్ఫూర్తితోనే జరిగాయి. మీరు చెప్పిన ‘పాఠం’ కథలోని సత్యదేవ్, ‘ట్రాన్స్‌ఫర్’ కథలోని కల్పన, ‘ఆగని పాట’ కథలోని స్త్రీ పాత్ర అన్ని ఇలాంటివే. అయితే చాలామంది ఇలాటి వ్యక్తులను కలిసినా పెద్దగా పట్టించుకుని ఆలోచించరు. నేను చూసిన చాలామంది గురించి ఆలోచిస్తాను. ఒకోసారి తీవ్ర వేదనకు గురవుతాను. అందుకే వాస్తవము, కల్పన కలిసిపోయి సృష్టించిన జీవితాలే ఈ కథలు. ఇతివృత్తాలు, సన్నివేశాలు, పాత్రలు, అన్నీ వాస్తవాల, కల్పనల కలపోతలు. ఎక్కడైనా ఎవరి జీవితం లాగైనా అనిపిస్తుందేమో, వారి గురించే రాశానేమో అనే అపోహలు రాకుండానే నా ఈ డిస్‌క్లెయిమర్.
ప్రశ్న 5: దాదాపుగా అన్ని కథలు సరళ శైలిలో సాగిపోయినా, ‘సర్పశిఖి’ కథ మాత్రం కొంత మార్మికతతో నిండి ఉందనిపించింది. ఒక గ్రీక్ కథని చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కథని ఈ పద్ధతిలోనే ఎందుకు రాశారు? వైవిధ్యం కోసమా? లేక మరేదైనా కారణం ఉందా?
సమాధానం: మీరు కథలన్నీ పరిశీలనాత్మకంగా చదివారు అనడానికి ఇదే ఉదాహరణ. మిగిలిన కథలు వర్తమాన సమాజాన్ని ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తాయి. ‘సర్పశిఖి’ మాత్రం కొంత పౌరాణికంగా అనిపిస్తుంది. ఒక మూల పాత్రను మాత్రమే (మెడ్యూస) గ్రీకు పురాణం నుంచి తీసుకున్నాను. మిగిలిన పాత్రలను కల్పన ద్వారా సృష్టించాను. మారిపోతున్న రాజ్యాలు, రాజులు వారి మానసిక స్థితిగతులను తెలియజేసేందుకు ఎంచుకున్న విభిన్న శిల్పం ఈ కథ. వైవిధ్యం కోసమే రాశాను.
ప్రశ్న 6: ఈ సంపుటిలోని కథల్లో మీ మనసుకు బాగా దగ్గరగా ఉన్న కథ ఏది?
సమాధానం: అన్ని కథలు ఏదో విధంగా మనసుకు దగ్గరగా ఉన్నవే. చాలా కథల్లో సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు ఏదో రకంగా కల్పితాలు. ‘పైనాపిల్ జామ్’ కథ నా జీవితంలోని సంఘటన. ఇప్పటికీ దాన్ని చదివినప్పుడు కంట నీరు చెమ్మగిల్లుతుంది. ‘దోషి’ కథ కూడా చాలా ఇష్టం. అలాగే ‘అర్థం కాని నవ్వు’, ‘జొమాన్స్’ కూడా.
ప్రశ్న 7: ఏ కథ రాయటానికి మీరు ఎక్కువగా శ్రమించారు?
సమాధానం: ‘లడ్డు కావాలా’ కథ క్లుప్తత కోసం, ‘పంజాబ్ మెకానిక్’ భిన్నంగా తీర్చడం కోసం, ‘పాఠం’ కథని సాత్వికంగా ముగించేందుకు, ‘కుంక బంకుడి గుడ్లు’ వ్యంగ్యంగా చెప్పేందుకు, విరామం తీసుకుంటూ రాశాను.
ప్రశ్న 8: ఏదయినా కథ ఇంకా బాగా రాసి ఉండాల్సింది అనిపించిందా? కొంచెం నిడివి పెంచితే చెప్పాల్సింది ఇంకా బాగా చెప్పి ఉండవచ్చనిపించిందా?
సమాధానం: అనిపించింది. ‘లడ్డు కావాలా’ ను ఇంకా పెద్దగా వ్రాస్తే బాగుండి ఉండేది అనిపించింది. కానీ క్లుప్తంగా చెప్పడం కోసం సవాలుగా తీసుకొని అలా రాశాను.
ప్రశ్న 9: ‘నన్నే వెతుక్కుంటూ’ కథలో – ఈ సంపుటి లోని కథల్లోని పాత్రలన్నీ రచయితకి ఎదురై – రచయితనే ప్రశ్నించడం విభిన్నంగా ఉంది. ఈ ఆలోచన ఎలా కలిగింది?
సమాధానం: అద్దేపల్లి ప్రభు తన ‘ఒక చిన్నమాట’లో కొడవడికంటి కుటుంబరావు ఇలాంటి సన్నివేశాన్ని సృష్టించారని చెప్పారు. కానీ నేను కొ.కు. రచనలు అన్నీ చదవలేదు. ఈ ప్రస్తావన ఉన్నదాన్ని కూడా చదవలేదు. లూయిజి పిరాండెలో వ్రాసిన ‘సిక్స్ క్యారెక్టర్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ అన్ ఆధర్’ అనే ఇటాలియన్ నాటకం స్ఫూర్తిగా తీసుకొని రాశాను. ముందు వేరే ఇతివృత్తంతో పాత్రలు, రచయితను ప్రశ్నిస్తున్నట్లు రాశాను. కానీ నా పాత్రలే నన్ను ప్రశ్నిస్తే ఎలా ఉంటాయి అనే ఆలోచనతో మార్చాను.
ప్రశ్న 10: మీరు ఆంగ్ల ఆధ్యాపకులు. ఆంగ్ల నాటక సిద్ధాంతాలపై పరిశోధన చేశారు. మీ కథలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉందా? ఉంటే ఎంత మేరకు? ‘బదిలీ’ కథలో కాలేజీ ప్రిన్సిపాల్ ఇంగ్లీష్ లెక్చరర్ రిలీవింగ్ లెటర్‌పై సంతకం పెట్టేముందు “కీట్సూ, శేక్సుపియరూ కాదూ – ఇది తెలవాలా” అని అంటాడు. ఈ పదాలు వ్రాయడంలో రచయితగా ఇబ్బంది పడి ఉండకపోవచ్చు. కానీ ఓ ఆంగ్ల అధ్యాపకుడిగా ఆలోచిస్తే ఓ క్షణం పాటు మనసు చివుక్కుమంటుంది కదా?
సమాధానం: తక్కువ నిడివి, పరిధి, విస్తృతిలో అనేక విషయాలను సంధానపరుస్తూ ఆనందింప చేయడం ఆలోచింప చేయడం చాలా కష్టమైన విషయం. అందుకే నాటకం నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. కవిత్వం, నాటకం రాయడం, చిన్న కథను వ్రాయడం కత్తి మీద సాము అనే నేననుకుంటాను.
నా ‘రీసర్చ్’ కూడా నాటకం గురించే. చిన్నప్పటి నుంచి చదివిన షెహవ్, టోల్ స్టాయ్, ఓ హెన్రీ, మపాసా, కేథరిన్ మెన్స్ ఫీల్డ్, ఎర్నెస్ట్ హేమిన్గ్వే, ఫ్రాంజ్ కాఫ్కా వంటి కథకులు, కవులు, షేక్స్పియర్ నుంచి బెకిట్ వరకు నాటక రచయితలు, టాగూర్, కారా మాస్టారు, చాసో, జయకాంతన్ వంటి మన కథకులు నన్ను అనేక విషయాలలో ప్రభావితం చేశారు. అయితే మారుతున్న పద్ధతులు, పరిస్థితులు, జీవన విధానాలు – ఇవన్నీ నన్ను ఎప్పుడూ కొత్తగా ఆలోచింపచేస్తాయి. చాలా అబ్‌స్ట్రాక్ట్‌గా, సరియలిస్టిక్‌గా ఉన్న కథలు కూడా నా డైరీలో ఉన్నాయి. వాటిని పంచుకునేందుకు ఇంకా నాకు కొంత పరిణతి, శైలి అవసరమని ఆగాను. చాలా రకాలైన మనుషులు, చాలా రకాలుగా ప్రవర్తిస్తూ, ఆలోచిస్తూ మాట్లాడినట్టు ‘బదిలీ’ కథలో ఒక విద్యాధికుడై ఉండి ప్రిన్సిపల్ కూడా మాట్లాడాడు. అతని మాటలు లోపిస్తున్న విలువలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి నేను వాటిని సాటి మనిషిగా ఆలోచించమని చెప్పడానికి వాడాను. విలువలు లోపిస్తున్న వారు అంతకన్నా ఏం మాట్లాడగలరు? అవి వారి నైజాన్ని తెలియచేస్తాయి. రచయితగా ఆంగ్ల అధ్యాపకుడిగా నేను ముఖ్యంగా, మనిషిగా వాడడం అలాటి వ్యక్తుల గురించి ఆలోచింపజేస్తూ, వారి గురించి జాలి పడేలా చేస్తాయి. మనుషులుగా మనం నాగరిక మానవ నైజాన్ని పోగొట్టుకోకూడదని నా అభిప్రాయం.
ప్రశ్న 11: రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
సమాధానం: కొత్త ప్రణాళికలు అంటూ ఏమీ లేవు. ఎప్పటికప్పుడు దొరికిన సమయంలోనే ఇంకా చదువుకోవడం, కొత్తగా ఆలోచించడం, కవితనో, కథనో రాయడం, పంచుకోవడం.
ఎప్పుడూ చదువుతో ఆలోచనలతో నన్ను ఉత్తేజపరిచే మా అమ్మాయి శ్రీకావ్య తోను, సాహితీ మిత్రులతోనూ చర్చించడం నాకు ఇష్టమైన పనులు. డైరీలో సూచనగా రాసి పెట్టుకున్న నాటకాలకు పూర్తి రూపాన్ని ఇవ్వడం, ఎప్పుడో వదిలేసిన చిత్రకళను మళ్లీ సాధన చేయడం నాకు ప్రస్తుతమున్న కలలు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు విజయ్ గారూ.
డా. విజయ్ కోగంటి: ఎంతో ఆసక్తిగా నా కథలను చదివి మరింత ఉత్తేజాన్ని పొందేందుకు మంచి ప్రశ్నలతో ఆలోచింపజేసిన ‘సంచిక’ టీంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
***
పైనాపిల్ జామ్ (కథా సంపుటి)
రచన: డా. విజయ్ కోగంటి
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్
పేజీలు: 97
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 90004 13413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/PINEAPPLE-JAM-VIJAY-KOGANTI/dp/B0CG4S9BZK