కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ ప్రత్యేక ఇంటర్వ్యూ

0
1

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎలనాగ గారితో డా. చిరువోలు పార్థసారథి జరిపిన ముఖాముఖిని అందిస్తున్నాము.]

అనువాదంలో వేగం నా బలం:

[dropcap]“అ[/dropcap]నువాదాన్ని ఒక తపస్సులా భావించి చేస్తాను. సాధ్యమైనంత వరకు సరైన పదం వెదికేందుకు చాలా ప్రయత్నిస్తాను. కొన్ని సార్లు కొన్ని నెలలపాటు ఇందుకు వెచ్చించవలసి వస్తుంది. కానీ వెదకటం నాకు అలవాటుగా మారిపోయింది” అంటున్నారు ఎలనాగ. 2017లో ప్రచురితమైన పవన్ కె.వర్మ రచించిన ‘గాలిబ్-నాటికాలం’ పుస్తకం అనువాదానికి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గాలిబ్ కాలపు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక స్థితిగతుల నేపథ్యంలో ఆయన జీవితం, రచనావ్యాసంగం, ఒడిదొడుకులు ఇందులో చిత్రితమయ్యాయి.

కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించిన ఎలనాగ వృత్తి రీత్యా డాక్టర్. 1980 నుండి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో, ఆ తర్వాత 1989 నుండి 2012 వరకు ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్‌లో పని చేసి, రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ పొందారు. హైస్కూల్లో ఉన్నప్పటినుండే రచనలు చేయడం మొదలు పెట్టారు. తన మొదటి కవిత, కరీంనగర్ నుండి వెలువడే గౌతమి అనే పత్రికలో ప్రచురితమైంది. మెడిసిన్ చదువుతున్న కాలంలో భారతి, కృష్ణా పత్రిక, స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. 2005 ముందు వరకు తన సొంత పేరు నాగరాజు సురేంద్ర పేరుతోనే రచనలు చేశారు. తర్వాత కలం పేరుతో ప్రసిద్ధులయ్యారు, సాహితీవేత్తగా వివిధ ప్రక్రియలో కృషి చేస్తున్న ఎలనాగ.

~

డా. చిరువోలు పార్థసారథి: నమస్కారం ఎలనాగ గారూ.

ఎలనాగ: నమస్కారం.

ప్రశ్న 1: కవి, కథకుడు, అనువాదకుడు, భాషాసంగీత ప్రేమికుడు, గళ్లనుడికట్టు రచయిత ఇలా సాహిత్యంలో విభిన్న భూమికలు నిర్వహిస్తున్న మీరు.. మిమ్మల్ని ఎలా చెప్పుకోవటానికి ఇష్టపడతారు?

జవాబు: ఇవన్నీ నేను ఇష్టపడేవే అయినా కవిత్వాన్నీ, అనువాదాన్నీ ఎక్కువ ఇష్టపడతాను.

ప్రశ్న 2: ఈ ఏడాది జనవరిలో మీరు కవిగా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు అనువాదకునిగా సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్నారు. ఇది మీకెలాంటి అనుభూతిని కలిగిస్తోంది?

జవాబు: మొదట ఉకియోటో వారి అంతర్జాతీయ పురస్కారం, ఇప్పడు కేంద్ర సాహిత్య అకాడమి వారి అవార్డు రావటం నాకు చాలా ఆనందాన్ని కలిగించిన మాట వాస్తవం. నాకు వచ్చిన స్థానీయ పురస్కారాలు (తెలంగాణ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చేవి) దాదాపు శూన్యం. ఇంకా, ఆంధ్రప్రాంతం వాళ్లే కొంచెం ఎక్కువగా విలువనిచ్చారు నాకు!

ప్రశ్న 3: మీకు అవార్డు తెచ్చిపెట్టిన గాలిబ్-నాటికాలం.. పవన్ కె.వర్మ పుస్తకంలో విశేషంగా ఆకట్టుకున్న అంశాలేమిటి? ఆ రచయిత రచనా శైలిని వివరించండి?

జవాబు: అది కేవలం జీవిత చరిత్ర కాదు. అందులో గాలిబ్ కవిత్వం గురించి, జీవితం గురించి మాత్రమే కాకుండా ఆనాటి సామాజిక రాజకీయ అంశాలు, దేశకాల పరిస్థితులు, బ్రిటిష్ ప్రభుత్వపు తీరుతెన్నులు, క్విట్ ఇండియా ఉద్యమం, హిందూ ముస్లిం మొదలైన వివిధ మతాల మధ్య ఉండిన సామరస్యం.. ఇవన్నీ చాలా చక్కగా చిత్రింపబడినాయి.

ప్రశ్న 4: ఈ పుస్తకం అనువాదంలో మీకు ఎదురైన అనుభవాలేమిటి? ఎక్కడయినా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా?

జవాబు: మూలంలోని ఆంగ్లభాష చాలా జటిలంగా ఉంది. మొదటి అధ్యాయంలో ఐతే, అది సాధారణస్థాయి అనువాదకులు తర్జుమా చేయలేని విధంగా ఉంది.

ప్రశ్న 5: తెలంగాణలో, కరీంనగర్‌లో పుట్టిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమం మీపైన ఎలాంటి ప్రభావం చూపింది? కవిగా మీరేమయినా ప్రత్యేకంగా రచనలు వెలువరించారా?

జవాబు: ఏ ఉద్యమమైనా కవులమీద, రచయితలమీద బలమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతాను నేను. కాబట్టి, నా విషయంలో కూడా అదే జరిగిందని భావిస్తాను.

ప్రశ్న 6: కేంద్ర సాహిత్య అకాడమీకి మీరు చేసిన అనువాదాల గురించి వివరించండి?

జవాబు: ఇప్పటివరకు చేసినవి రెండే. వాటిలో ఇది మొదటిది కాగా, సైరస్ మిస్త్రీ రాసిన నవల Chronicle of a Corpse Bearer కు నా అనువాదం ‘శవాలను మోసేవాడి కథ’ రెండోది. తెలుగు నుండి ఆంగ్లంలోకి నేను చేసిన మరొక తర్జుమా సాహిత్య అకాడమీ ఇంకా ప్రచురించవలసి ఉంది.

ప్రశ్న 7: కాళోజీ, దాశరథి, వట్టికోట ఆశ్వారు స్వామి కథలను ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కథలు ఈ తరంలో, ఆంగ్ల పాఠకుల్లో కలిగించిన ప్రభావం ఎలా ఉంది?

జవాబు: పెద్దగా ఫీడ్‌బ్యాక్ లేదు. పటిష్ఠమైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోతే మన రచనలను ఎక్కువమంది పాఠకులను చేరే వీలుండదు. ఐనా, కొందరు ఫోన్ చేసి నన్ను అభినందించారు.

ప్రశ్న 8: ఆంగ్లం నుంచి తెలుగులోకి.. తెలుగులో నుంచి ఆంగ్లంలోకి రెండు వైపులా అనువాదాలు చేసే తక్కువ మంది రచయితల్లో మీరొకరు. ఈ రెండు అనువాదాల్లో ప్రక్రియపరంగా ఏది కష్టం అనిపిస్తుంది?

జవాబు: నాకైతే రెండూ సమానంగా, సులభంగా ఉంటాయి. నిజానికి కొన్నిసార్లు ఇంగ్లిష్ లోకి అనువదించడమే ఎక్కువ హాయి అనిపిస్తున్నది ఈ మధ్య.

ప్రశ్న 9: మంచి వచనం తక్కువ వస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం భావం పట్ల శ్రద్ధ చూపుతున్న రచయితలు భాష పట్ల చూపకపోవటమా? తెలుగింగ్లీష్ ఎక్కువ కావటమా?

జవాబు: చక్కని, కుదురైన వాక్యం రాయటం వచన రచనకు చాలా అవసరం. కథలు, వ్యాసాలు, నవలలు రాయదల్చుకున్నవాళ్లు ముందుగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలని అంటాను నేను. వాక్యం అప్పీలింగ్ గా (ఆకర్షణీయంగా) ఉంటేనే పాఠకుడు రచనను చివరిదాకా చదువుతాడు.

ప్రశ్న 10: మీ ఆంగ్ల కవితల సంపుటి ‘డాజ్ లర్స్’ టర్కీష్, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ తదితర భాషల్లోకి అనువాదమై మీకు విశేషమైన కీర్తిని తెచ్చి పెట్టింది. దీని గురించి వివరించండి?

జవాబు: ఉకియోటో అనే అంతర్జాతీయ ప్రచురణ సంస్థ చాలా పెద్దది. అది తను అచ్చు వేసిన పుస్తకాలను 70 కన్న ఎక్కువ దేశాలకు పంపుతుంది.. విక్రయాల కోసం. ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా పుస్తకాలను ప్రచురించింది. దానిగురించి ఇంటర్నెట్లో చదివి, నా Dazzlers ను ఇ-మెయిల్ ద్వారా పంపాను. పదిహేను, ఇరవై పనిదినాలలో జవాబిస్తామని చెప్పారు. కానీ అంతలోనే ప్రచురిస్తామన్న సమాచారం అందింది. తర్వాత వాళ్లే Poet of the Year Award – 2023 ను ఇచ్చారు. గత పది సంవత్సరాలలో తాము అచ్చువేసిన అన్ని పుస్తకాలను, కొన్ని ఇతర సంస్థల ప్రచురణలను లెక్కలోకి తీసుకున్నారు. మరింత ఎక్కువ ఆనందం కలిగించే విషయం ఏమంటే, వాళ్లే దాన్ని టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్, జపనీస్ భాషలలోకి అనువదింపజేశారు.

ప్రశ్న 11: కోల్‌కతా సమారోహ కార్యక్రమంలో పాల్గొన్న మీ అనుభవాలను తెలియచేయండి. తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య వాతావారణానికి అక్కడికి మీరు గమనించిన ప్రధాన వ్యత్యాసం ఏమిటి?

జవాబు: చాలా బాగుండింది. గత సంవత్సరం తోశాలి సాహిత్య వేడుక కోసం భువనేశ్వర్ వెళ్లాను. అక్కడి కార్యక్రమం, కలకత్తాలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నాయి. నిరర్థక ఉపన్యాసాలు, పాటలు లాంటివి వారి సభల్లో ఉండవు. ఫలితంగా సీరియస్ సాహిత్య వాతావరణం నెలకొంటుంది.

ప్రశ్న 12: ఈ తరం రచయితలకు ప్రయోజనం కలిగేలా కవిగా మీరు చేసిన ప్రయోగాలు కొన్ని తెలియచేయండి? ముఖ్యంగా ప్రయోగపద్యాల సంపుటి.. కొత్త బాణీలో ఉన్న విశేషాంశాలను తెలియచేయండి?

జవాబు: అచ్చం వచన కవితలలా కనిపించే ఛందోబద్ధ పద్యాలు రాశాను. అట్లాంటివి రెండు సంపుటాలను వెలువరించాను. వాటి పేర్లు ‘మోర్సింగ్ మీద మాల్కౌcస్ రాగం’, ‘కొత్త బాణి’. వాటివల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నిచవచ్చు. వాటి వల్ల ఇతర కవులకు స్ఫూర్తినివ్వడమనే సాహిత్య ప్రయోజనం కలుగుతుంది. అదే విధంగా, ప్రోజ్ పొయెమ్స్ (పారాగ్రాఫ్ కవితలు) పెద్దసంఖ్యలో రాశాను. ఒక కొత్త కవితా రూపాన్ని పాప్యులరైజ్ చేశాననవచ్చు. ఆ కవితల వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించినవాళ్లున్నారు. మామూలు వచన కవితల వలన ఏం ప్రయోజనమో వాటివలన కూడా అదే అనేది నా సమాధానం. పందొమ్మిదవ శతాబ్దంలోనే పుట్టి, ఫ్రాన్స్ దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ‘ప్రక్రియ’ తెలుగు కవిత్వంలో ఇంకా బలంగా స్థిరపడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రోజ్ పొయెమ్స్‌ను సమర్థంగా రాయగలిగేవారు తక్కువ ఉంటారు. ఈ పరిస్థితికి బహుశా ఇదే కారణమై ఉంటుంది.

ప్రశ్న 13: సోమర్‌సెట్ మామ్ అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన నవల అనువాదం మీ తొలి పుస్తకం అనుకోవచ్చా? మామ్ శైలిలో ఎలాంటి ప్రత్యేకతలను చూడాలి?

జవాబు: మామ్ రచనలను నేను నైజీరియాలో ఉన్నప్పుడు (1980 – 1986) విస్తృతంగా చదివి, బాగా ప్రభావితుడినయ్యాను. ఆ విధంగా అతని ‘ది ఏలియెన్ కార్న్’కు నేను చేసిన అనువాదం ‘కలుపుమొక్క’ నా మొదటి అనువాదం. మామ్ రచనలలో పాత్రల స్వభావ చిత్రణ చాలా సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ, విశిష్టంగా ఉంటుంది. మామ్ ఆంగ్లవాక్యరచనా విధానం రెండవ ఆకర్షణీయ అంశం. ఇవాళ నా ఆంగ్లభాషారచనలో ఏదైనా బలం ఉందనుకుంటే, దానికి కారణం నేను మామ్ కథలను, నవలలను చదవటమే.

ప్రశ్న 14: మీరు అటు పద్య కవిత్వం, ఇటు వచన కవిత్వం రెండింట్లోనూ కృషి చేశారు. వచన కవిత్వం రాసేవారికి చందోబద్ధ కవిత్వంలో ప్రవేశం ఉండటం అవసరమా కాదా?

జవాబు: కవిత్వం రాయదల్చుకున్నవారికి భాషానైపుణ్యం ఒక మంచి పునాదిగా పని చేస్తుంది. ఛందోబద్ధ పద్యాలలో ఉండే ముఖ్యమైన అంశం అదే కదా. శ్రీశ్రీ, సినారె లాంటి పాత కవులెందరో ముందు పద్యాలు రాసిం తర్వాతనే వచన కవిత్వం రాశారనే విషయాన్ని మనం మరచిపోకూడదు.

ప్రశ్న 15: శాస్త్రీయ సంగీతంపైన, సంగీతకళాకారులపైన కవితలు, వ్యాసాలు రాశారు. ఇదెలా సాధ్యం అయ్యింది? సంగీతంలో మీకు ప్రత్యేకమైన ప్రవేశం ఉందా?

జవాబు: చిన్నప్పటినుంచే సంగీతం మీద ఇష్టం ఉన్నప్పటికీ, అది పుంజుకోవడమన్నది 1990 లలో ప్రారంభమై, తర్వాత మరింతగా పెరిగింది. ఈ విషయంలో నాకు ప్రధాన స్ఫూర్తి సామల సదాశివ గారు. నాకు శాస్త్రీయ సంగీతం పాడటం/వాయించడం రాదు. రేడియోలో ఆ సంగీతాన్ని, దానిమీద చర్చలను విపరీతంగా వినడం నన్ను సంగీతాభిజ్ఞునిగా (connoisseur of music గా) మార్చింది.

ప్రశ్న 16: భాషలో సవ్యత దిశగా మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రామాణిక గళ్ల నుడికట్టు పుస్తకం నుడిక్రీడ, యుక్తవాక్యం తదితర విశేషాలను వివరించండి.

జవాబు: The Hindu పత్రికలో నిగూఢ ఆధారాలతో (cryptic clues తో) వచ్చే ఇంగ్లిష్ క్రాస్వర్డ్స్ నన్ను బాగా ఆకర్షించి, కొత్తరకమైన తెలుగు పజిళ్లను రూపొందించేలా చేశాయి. భాష సవ్యంగా ఉండాలన్నది నా బలమైన ఉద్దేశం కాబట్టి, భాషా సవ్యతకు బాటలు వేద్దాం, యుక్తవాక్యం అనే పుస్తకాలను రాశాను.

ప్రశ్న 17: కథలు, కవిత్వం అనువాదాల్లో ప్రధానంగా కనిపించే వ్యత్యాసం ఏమిటి? భాషానువాదమా? భావానువాదమా? ఏది సరైన పద్ధతి? ఆయా వివిధ అంశాలకు సంబంధించి నిఘంటవులు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో రచయితలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జవాబు: భావానువాదమే ప్రధానం. ఐతే, ఆటోమేటిక్‌గా భాషాపరమైన తర్జుమా కూడా జరుగుతుంది కదా! కాబట్టి, రెండింటి మిశ్రమం ఉండాలి. నిజానికి అనువాదం అనే మాటకు భాషాంతరీకరణ ఒక పర్యాయపదం.

ప్రశ్న 18: అనువాదంపై పట్టు పెంచుకోవాలంటే ఏం చేయాలి?

జవాబు: అనువాదం చేసే ఏ భాష వంద శాతం మనకు వచ్చి ఉండాలి. మాతృభాషపైన ఎంత పట్టు ఉంటుందో అనువాదం చేసే చేయాలనుకునే భాషపై కూడా అంతే ఉండాలి. అప్పుడే అనువాదానికి న్యాయం చేయగలం.

ప్రశ్న 19: నిత్యం మీ సాహితీసేద్యం ఎలా సాగుతుంది? ఇందుకు మీరు ఎంత సమయం వెచ్చిస్తారు?

జవాబు: నేను ప్రతిరోజు ఎన్నో గంటలపాటు సాహిత్య రచనలో మునిగి ఉంటానని కొందరు అనుకుంటారేమో. కానీ అందులో వాస్తవం లేదు. ఏదైనా పెద్ద, మంచి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మాత్రం అలా జరుగుతుంది. పడిపడి రచనలు చేయటం నా పద్ధతి కాదు. ఐనా పందొమ్మిదేళ్లలో 37 పుస్తకాలు ఎలా రాయగలిగానంటే, అనువాదాలకు నేను ఇతరులకన్న చాలా తక్కువ సమయం తీసుకుంటాను. సరైన సమానార్థక పదాలు చప్పున స్ఫురించడం నా అదృష్టం. గాలిబ్ – నాటి కాలం, శవాలను మోసేవాడి కథ లాంటి పెద్ద గ్రంథాలను సైతం ఆరు నుండి పన్నెండు నెలల వ్యవధిలోనే సంతృప్తికరంగా తర్జుమా చేశాను. నిజానికి సాహిత్యం కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తానో సంగీతాన్ని వినేందుకు కూడా దాదాపు అంతే సమయాన్ని ఖర్చు చేస్తాను.

~

డా. చిరువోలు పార్థసారథి: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు ఎలనాగ గారూ.

ఎలనాగ: ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here