[‘రామకథాసుధ’ కథా సంకలనంలోని ‘భ్రాతృప్రేమ’ కథా రచయిత గోనుగుంట మురళీకృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ]
సంచిక టీమ్: నమస్కారం గోనుగుంట మురళీకృష్ణ గారు.
గోనుగుంట మురళీకృష్ణ: నమస్కారమండీ.
ప్రశ్న1: ‘రామకథాసుధ’ సంకలనంలో మీ కథ ‘భ్రాతృప్రేమ’ ప్రచురితమయింది. అభినందనలు. ఈ కథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
జవాబు: పురాణాలు అన్నింటిలోకి నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ధర్మం అంటే ఏమిటి? మానవుడు ఎలా జీవించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ శ్రీరాముడు ఆచరించి చూపించాడు. అందుకే రామాయణం అంటే అంత ప్రీతి నాకు. అయితే సీతారాముల గురించి అందరికీ తెలుసు. వైవిధ్యభరితమైన అంశం ఎంపిక చేసుకుంటే ఆకట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ‘భ్రాతృప్రేమ’ అనే కథలో సంపాతి, జటాయువుల సోదరప్రేమ ఇతివృత్తంగా తీసుకున్నాను.
ప్రశ్న2: కథని సృజించటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? ఎందుకు?
జవాబు: చిన్నప్పుడు చందమామ సీరియల్‌గా రామాయణం చదివినప్పటి నుంచీ ఇప్పటివరకూ రకరకాల కవులు రాసిన రామాయణాలు చాలా చదివాను. లోతుకు వెళ్ళిన కొద్దీ కొత్తకొత్త విషయాలు అర్థం అవుతూ ఆనందంగా అనిపించేది. నేను వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకున్నాను. ఎందుకంటే రంగనాధ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం ఇలా చాలా రకాల రామాయణాలు ఉన్నా అన్నిటికీ వాల్మీకి రచించిన సంస్కృత కావ్యమే మూలం. అయితే ఒక కథ రాసేటప్పుడు మనం కావ్యంలో ఉన్నది ఉన్నట్లుగా రాయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది ఆ కవి ప్రతిభ అవుతుంది గానీ, మనది ఎందుకవుతుంది? దాని ద్వారా నేను ఏం అర్థం చేసుకున్నాను అనే పాయింట్ తీసుకుని నా శైలిలో ఆ కథ రాశాను.
ప్రశ్న3: కథాసృజనలో కల్పన ఎంత? నిజం ఎంత?
జవాబు: పౌరాణిక కథలు రాసేటప్పుడు కొంత కల్పన జోడించవచ్చు, తప్పులేదు అని నా అభిప్రాయం. ఉదాహరణకు కవి ఒక పద్యంలో చెప్పిన విషయాన్ని కథ రూపంలోకి మర్చాలనుకోండి. అందులోని విషయాన్ని పాత్రల మధ్య సంభాషణల రూపంలో, ఒక సంఘటనగా మార్చి రాయవచ్చు. ఇలా రాసేటప్పుడు ప్రధాన విషయం మాత్రం మారకూడదు.
ప్రశ్న4: రామాయణం ఆధారంగా కథను సృజించేటప్పుడు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది?
జవాబు: ఇప్పుడు చెప్పాను కదా, కవి చెప్పదలచుకున్న విషయం మార్చి వేరే ఉద్దేశంతో రాయకూడదు. అయన సృష్టించిన పాత్ర స్వభావం మార్చకూడదు. పాఠకులు సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగా సరళమైన భాషను ఉపయోగించవచ్చు.
ప్రశ్న5: ఇటీవలి కాలంలో కొందరు, రామాయణంలో లేని వాటిని రామాయణంలో ఉన్నట్లుగా ఆరోపించి రచిస్తున్నారు. అలాంటి రచనలను ఎలా అర్థం చేసుకోవాలి?
జవాబు: నేను చెప్పేది ఒక్కటే! ఏది నిజం, ఏది కల్పన అని తెలుసుకోవాలంటే మూలకావ్యం చదవాలి. అది తప్ప మరొక మార్గం లేదు. పైన మీరు చెప్పిన ఆరోపణలు వచ్చినప్పుడు మూలకావ్యం చదివినవారు వివరించి చెప్పాలి. అపోహలు తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ మొండిగా వాదిస్తున్నారనుకోండి, “పుర్రెకో బుద్ధి, ఏం చేస్తాం!” అనుకుని వదిలేయటం ఉత్తమం.
ప్రశ్న6: ఇది కాక పురాణాల ఆధారంగా ఇతర రచనలు ఏవైనా సృజించారా?
జవాబు: చాలా రాశాను. రామాయణ భారత భాగవతాలే కాకుండా, దేవీ భాగవతం, అష్టాదశ పురాణాలు మొదలైనవి ఆధారంగా రాశాను. అయితే అందరికీ తెలిసిన విషయాలు కాకుండా లోతైన విషయాలు, చాలా తక్కువ మందికి తెలిసినవి రాయటం నాకిష్టం. ఇప్పటివరకు అలాంటివే రాశానని అనుకుంటున్నాను.
ప్రశ్న7: పౌరాణిక గాథలను ఆధారం చేసుకుని కాల్పనిక రచనలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాటించాల్సిన ఔచిత్యాలేమిటి?
జవాబు: పైన నాలుగవ ప్రశ్నకు చెప్పిన సమాధానమే దీనికి కూడా వర్తిస్తుంది. అయితే మనం ఎంచుకున్న విషయం అంతకుముందు కథగానో, నవల గానో వచ్చి ఉండవచ్చు. ఇన్నివేల కథలలో అది వెరిఫై చేయటం కష్టం. అందుకని రాసే రచనలో రచయిత ముద్ర కనబడాలి. తనదైన శైలిలో రచించాలి. చదివేవారికి ‘ఇది తెలిసిన కథ అయినా కొత్తగా ఉందే!’ అనిపించాలి. అప్పుడే ఆ రచన నిలబడుతుంది.
ప్రశ్న8: భవిష్యత్తులో ఇంకా పురాణాల ఆధారంగా ఏవైన రచనలు చేసే ఉద్దేశం ఉన్నదా?
జవాబు: ఉన్నది. నాకు తెలిసిన విషయం నలుగురితో పంచుకోవటం ఇష్టం. నేనొక్కడినే కాదు, ఇతర రచయితలు కూడా రాయాల్సిన అవసరం చాలా ఉంది. పురాణ జ్ఞానం అందరికే అవసరం. అప్పుడే ఏది మంచి, ఏది చెడు? ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు ఆయా పాత్రల ద్వారా తెలుస్తాయి.
ప్రశ్న9: తెలుగు సాహిత్య ప్రపంచంలో రామకథల సంకలనం ప్రాధాన్యం ఏమిటి? దాని స్థానం ఏమిటి?
జవాబు: మన ముందు తరాల పెద్దలకు పుస్తక పఠనం జీవితంలో ఒక భాగం. ఇప్పటి తరానికి అలా కాదు. వారి చదువు, వారి కెరీర్ ముఖ్యం. అందుకోసం ఇంగ్లీష్ మీడియం చదువు అత్యవసరం అయింది. ఇంగ్లీష్ మీడియం చదువులకి అలవాటు పడిన వారికి ప్రాచీన సాహిత్యం, అందులోని గ్రాంథిక భాష అర్థం కాదు. పైగా అనేక వర్ణనలతో కూడిన అంత పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేరు. అందుకని సులభశైలిలో చిన్నచిన్న కథల రూపంలో చెబితే అర్థం చేసుకోగలుగుతారు. ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో ‘రామకథాసుధ’ ఒక ఉత్తమమైన సాహిత్యాన్ని సృజించిందని చెప్పవచ్చు. ఇందులో కథలు బాలలు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ హాయిగా చదివి ఆనందించవచ్చు. ఈ పుస్తకంలో అనవసర వాక్యం ఒక్కటి కూడా లేదు. ఇంటిల్లిపాదీ చదవటమే కాదు, తెలిసిన వారికి బహుమతిగా ఇవ్వదగిన మంచి పుస్తకం. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలి. ప్రచురణకర్తలు కూడా ఇలాంటి గ్రంథాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. “బంగారు పళ్ళెం కైనా గోడ చేర్పు ఉండాలి” అన్నట్లుగా ఎంత మంచి పుస్తకం అయినా జనబాహుళ్యం లోకి వెళ్ళాలంటే ప్రచురణకర్తల తోడ్పాటు కూడా అత్యవసరం.
~
సంచిక టీమ్: ఈ ఇంటర్వ్యూకి సమయం కేటాయించి, మా ప్రశ్నలకు తగిన జవాబులిచ్చినందుకు కృతజ్ఞలు గోనుగుంట మురళీకృష్ణ గారు.
గోనుగుంట మురళీకృష్ణ: ధన్యవాదాలు. మీకు అభినందనలు.
~
***
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమశంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175 రూపాయలు
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు, 33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ -520002
0866-2436643. 9849992890
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha