[‘లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు’ అనే పుస్తకాన్ని వెలువరించిన శ్రీ హెచ్. రమేష్‌బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం రమేష్‌బాబు గారూ.
హెచ్. రమేష్‌బాబు: నమస్కారం.
~
ప్రశ్న 1. ఈ పుస్తకానికి గానూ, మీకు తెలంగాణ సారస్వత పరిషత్తు అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు.. ఈ అవార్డు మీ పేర ప్రకటించినప్పుడు మీకు ఎలా అనిపించింది?
జ: నిజంగా కూడా ఒక పది ఏళ్ల పరిశోధనా శ్రమకు వచ్చిన గుర్తింపుగా భావించాను. పరిషత్తు వాళ్ళు సాహిత్య ప్రక్రియలకు మాత్రమే పురస్కారాలు ఇస్తారు కానీ ఒక సినిమా పరిశోధన గ్రంథానికి ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటాను. తెలంగాణ సినిమా మీద వచ్చిన మొదటి పుస్తకం కూడా ఇదే. కనుక ఆ కేటగిరిలో ఈ పుస్తకానికి అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం లేకుంటే పుస్తకం లేదు. అందుకే తెలంగాణ అమరవీరులకు ఈ పురస్కారాన్ని అంకితం చేశాను.
ప్రశ్న 2. ఇంతకు ముందు మీరు చేసిన మీ సినిమా రచనల గురించి వివరిస్తారా?
ప్రశ్న 3. మీకు ఇలాంటి పుస్తకం రాయాలని ఎప్పుడు, ఎలా, ఎందుకని అనిపించింది?
జ: 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం అది. నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొంటున్నాను. అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా చరిత్ర, సంస్కృతి ఇటువంటి చాలా అంశాల మీద చాలామంది వ్యాసాలు రాస్తూ ఉన్నారు. ఆ సమయంలో సినిమాకు సంబంధించి ఒక 20 ఏళ్ల పాటుగా వివిధ రకాల వ్యాసాలు రాసిన నేను తెలంగాణ కోణంలో సినిమాను చూస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన మొదలైంది. సరిగ్గా అప్పుడే తెలంగాణ ఉద్యమం కోసం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభమైంది. అప్పుడు ఆ పత్రిక ఆదివారం బతుకమ్మ సంచికలో తెలంగాణ సినిమా గురించి రాస్తానని అవకాశం ఉంటే స్పేస్ ఇవ్వమని కందుకూరి రమేష్ బాబు గారిని అడిగాను. అందుకు ఆయన నవ్వి తెలంగాణ సినిమా ఏముంది ఏం రాస్తారు? అన్నారు అనుమానంగానే. అప్పుడు నేను అన్నాను కదా! ఒక రెండు వారాలు రాద్దాము. రీడర్స్ రెస్పాన్స్‌ని బట్టి కొనసాగించడమా, ఆపేయడమా ఆలోచించొచ్చు. ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడిగాను. అప్పుడు ఆయన అన్యమనస్కంగానే సరే చూద్దాం అన్నారు. ఓ రెండు వారాలకు వ్యాసాలను పంపించాను. నేను తెలుగు సినిమాలో, హిందీ సినిమాలలో తెలంగాణ వారి కంట్రిబ్యూషన్ మీద వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. తెలంగాణలో సినిమా వాళ్ల గురించి దాదాపుగా తెలియని ఆ సమయంలో ఈ వ్యాసాలు చాలా బాగా ఆదరణ పొందాయి. ఆ విధంగా ఆన్ తెలంగాణ, బై తెలంగాణ, ఆఫ్ తెలంగాణ అన్న కాన్సెప్ట్‌తో ఒక పాతిక వారాలు రెగ్యులర్‌గా తెలంగాణ సినిమా వారిపై వ్యాసాలు రాశాను. వీటిలో 1922లో ధీరేన్ గంగూలి కలకత్తా నుండి వచ్చి హైదరాబాదులో సినిమాలు తీసిన అంశాలు కూడా రాశాను. 2014-15లో రెండవ విడత బతుకమ్మ నవ తెలంగాణ సోపతి ఆదివారం సంచికలలో దక్కన్ ల్యాండ్ మాస పత్రికలో వరుసగా కాలమ్స్ రాసాను. ఉద్యమ సమయానికి వ్యాసాలన్ని కూడా తెలంగాణ అంతట చాలా ఆదరణ పొందినవి.
ప్రశ్న 4. పుస్తకం కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు? ఈ పరిశోధనలో మీరు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? మీకు సహాయ సహకారాలందించిన వారెవరు?
ప్రశ్న 5. పుస్తకానికి విషయ సేకరణ చేస్తున్న సమయంలో మీకు కలిగిన మరుపురాని అనుభవం ఏదయినా మా పాఠకులతో పంచుకుంటారా?
జ: నిజానికి నేను 2005 నాటికే ‘తెలుగువారి మూకీ యుగం’ అనే ఒక పుస్తకం రాయాలని అనుకున్నాను. అప్పటికే నాకు మద్రాసులో జరిగిన మూకీల పరిణామాలపై కొన్ని సందేహాలు ఉండినవి. ఎవరైనా చరిత్రలో తమ వాళ్ళ గురించి రాసినప్పుడు అంతకుముందు ఎవరు పని చేశారు అన్నది రాస్తారు. కానీ తెలుగు సినిమా మూకీల విషయాలను రాసినప్పుడు చాలామంది ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదనిపిస్తుంది నాకు. మద్రాసులో వెంకయ్య కన్నా ముందు సామి కణ్ణు విన్సెంట్ అనే రైల్వే ఉద్యోగి మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో సైలెంట్ సినిమాలను ప్రదర్శించాడు. ఈ విషయాలను మన వాళ్ళు ఎక్కడ రాయలేదు. ఎటు తిరిగి వెంకయ్యతోనే మొదలుపెడతారు. ఇవి నాకున్న సందేహాలు. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రను రాసిన వాళ్ళు మూకీల కాలంలో తెలుగువారి కంట్రిబ్యూషన్ను పొడిపొడిగా రాసిన వారే కానీ పూర్తిస్థాయిలో సమగ్రంగా ఎక్కడా రాయలేదు. పైగా మద్రాసులో నిర్మాణమైన ఏ సైలెంట్ సినిమా కూడా ఎక్కడ ఒక్క కాపీ ఫిజికల్‌గా అందుబాటులో లేదు. అయితే నేను బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ కొన్న ఒక పుస్తకం ‘లైట్ ఆఫ్ ఆసియా’ లో 1929లో హైదరాబాదులో నిర్మాణమైన ‘పితృ ప్రేమ’ (ఫాదర్స్ లవ్) అన్న సైలెంట్ సినిమా ఇప్పటికీ బొంబాయి ఫిలిం ఆర్కైస్‌లో ఉన్నట్లుగా ఆ సినిమా కథను రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ఒక్క అంశం హైదరాబాదులో సైలెంట్ సినిమాల నిర్మాణం జరిగినట్లుగా మనకు బలమైన సాక్ష్యంగా కనిపించింది. ఒక సినీ చరిత్ర పరిశోధకుడిగా ఈ అంశం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అట్లానే డెహ్రాడూన్‌కు చెందిన ఆర్కే వర్మ రాసిన ‘ఫిల్మోగ్రఫీ సైలెంట్ సినిమా’ అన్న పుస్తకంలో హైదరాబాద్ మరియు మద్రాసులో తయారైన తొలినాటి సైలెంట్ చిత్రాల వివరాలు చాలా ఉన్నవి. అంతేగాక ఈ పుస్తకంలో ఎక్కడా కనిపించని మైసూరులో సైలెంట్ చిత్రాల నిర్మాణం వివరాలను కూడా ఆయన పొందుపరిచారు. ఇందు కొరకే నేను హైదరాబాద్ సైలెంటు చిత్రాల గురించి సమగ్రంగా రాస్తూనే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళలో జరిగిన సైలెంట్ చిత్రాల నిర్మాణంపై కూడా ఒక తులనాత్మక అధ్యయనం చేయగలిగాను. హైదరాబాద్ కేంద్రంగా సైలెంట్ సినిమాలు నిర్మాణమైన ఈ నేపద్యంలోనే ఈ పుస్తకానికి ‘లోటస్ ఫిలిం కంపెనీ హైదరాబాద్’ అనే పేరు పెట్టాను.
ప్రశ్న 6. ఇంతకాలం హైదరాబాదు మూకీల చరిత్ర ఎందుకని మరుగునపడిపోయింది? ఎందుకని ఎవ్వరూ ఈ విషయంపై దృష్టి పెట్టలేదు?
జ: ఇది చాలా ముఖ్యమైనదే కాదు అవసరమైన ప్రశ్న కూడా. నిజానికి స్థానిక చరిత్రలకు కూడా శతాబ్దాల తరబడి విశేషాలు కనిపిస్తాయి.
మరి ఆధునిక హైదరాబాద్ చరిత్ర పరాయి పాలనలో విస్మృతికి గురికాబడింది. అయితే హైదరాబాదులో 1952కు పూర్వం పరిపాలన భాష తెలుగు కాదు. కనుక ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా ఉర్దూలోనే రికార్డు కావడం వలన మనకు అవేవీ అందుబాటులో లేకుండా పోయినవి. అట్లానే రెండోది 1952 తర్వాత హైదరాబాద్ స్టేట్ అలాగే కొనసాగి ఉంటే మన చరిత్ర మనకు అందుబాటులోకి వచ్చేది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సినిమా చరిత్ర కూడా వెనక్కి నెట్టబడింది. ’56 నుండి ఇక్కడ పరిపాలనకు వచ్చిన సీమాంధ్ర వారి తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర, తెలుగు కళా రంగ చరిత్ర తెలంగాణ వారికి కూడా ఆపాదించబడి ఒక 50 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ 50 ఏళ్లలో ఎంతో విలువైన మన సాంస్కృతిక చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. దీనిని తవ్విపోసుకోవడం మళ్ళీ పునర్లిఖించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. అయితే నాబోటి వాడికి ఇప్పటికే సినిమాల గురించి ఒక పాతికేళ్లుగా రాసి ఉన్నాను కనుక భారతీయ సినిమా రంగంలో తెలంగాణ వారి పాత్ర పోషణ ఏమున్నదో విడదీసి రాయగలిగాను. అది కూడా తెలంగాణ ఉద్యమం వల్లనే సాధ్యమైంది. ఏ ఇతర పత్రికలు కూడా తెలంగాణ సినిమా గురించి రాయడానికి జాగా ఇవ్వలేదు. అసలు తెలంగాణ సినిమా అన్న మాటనే అంగీకరించలేదు. నేను రెగ్యులర్‌గా తెలంగాణ సినిమా అన్న పేరుతో వ్యాసాలు రాస్తుండడాన్ని పలువురు మిత్రులు నా పట్ల నిశ్శబ్దమైనటువంటి దూరాన్ని పాటిస్తూ వచ్చారు. ఏది ఏమైనా హైదరాబాదులో సినిమాల విషయాలు సినిమాకు తెలంగాణ ప్రాంత నుండి జరిగిన కృషి రికార్డు చేయడంలో నా ప్రయత్నం ఆగలేదు. దీనికి తెలుగు సినిమా రంగంలోని వారు, తెలుగు సినిమా చరిత్రకారులు చిన్నచూపు చూసినా కొన్ని చారిత్రక వాస్తవాలను వారు అంగీకరించలేదు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో తెలుగు నిర్మాతల మండలి వారు తెలుగు నిర్మాతల చరిత్ర రాశారు. అందులో ఒక్క అక్షరం కూడా ధీరేన్ గంగూలీ గురించి గానీ, హైదరాబాదులో మూకీల విషయాల గురించి గానీ రాయలేదు. ఇదంతా జరిగిన చరిత్ర. తెలంగాణ వాడిగా నేనేదో కల్పించి చెప్పడం లేదు. ఇక్కడ చరిత్ర మరుగున పడిపోవడానికి కారణం సీమాంధ్రుల ఆధిపత్య భావజాలమే. పైగా వారు చరిత్రను చరిత్రగా చూడలేదు.
ప్రశ్న 7. మీకు ఈ విషయాలకి ఆధారాలెలా దొరికాయి?
జ: నిజానికి చాలా పరిమితమైన ఈ ప్రాజెక్టు మొదలైంది. మొదటి దశలో భారతీయ మూకీ సినిమాల సమాచారం వివిధ డాక్యుమెంటేషన్లు ఉపయోగపడితే, భారతీయ సినిమా గురించి వచ్చిన పలు ఇంగ్లీష్ హిందీ పుస్తకాలు ఈ రచనకు సమాచారం అందించినవి. ఆర్కే వర్మ, సంజీవ్ తన్వర్‌ల సైలెంట్ సినిమా పుస్తకాలు, ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఇండియన్ సినిమా, పసుపులేటి కమలాకర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఇన్ హైదరాబాద్, గుజరాత్‌కు చెందిన హరీష్ రఘువంషి, రజత్ రాయ్, కిరణ్ మోయిరాహా, ఎస్.థియోడర్ భాస్కరన్, యామిని కృష్ణ, స్టీఫెన్ హ్యూస్, రాండర్ గై, అమృత్ గంగార్, నిజాం స్టేట్ స్టాటిస్టికల్ రికార్డులు, కేరళకు చెందిన సాజు చలాన్ఘట్, బి. నరసింగరావు, విజయవర్ధన్, పాశం యాదగిరి వంటి వారి ఇంటర్వ్యూలు ఈ పుస్తకానికి చాలా మటుకు ఉపయోగపడినవి.
ప్రశ్న 8. హైదరాబాదులో మూకీ సినిమాల వివరాలు టూకీగా చెప్తారా?
జ: ఈ అంశంలో కాస్త లోతుగా వెళితే హైదరాబాదులో మూకీ సినిమాల వివరాలు గురించి బొమ్మకంటి సుబ్బారావు ఒకసారి ఉదయం ఆదివారం సంచికలో ఏమి రాస్తారంటే తెలుగు నేలపై తొలిసారిగా మూకీలు నిర్మాణమైంది హైదరాబాదులోనే అని రాస్తారు. ఆ తర్వాత ఆరుద్ర హైదరాబాదులో సైలెంట్ సినిమాల గురించి 1986లో ‘రెండు దశాబ్దాల తెలుగు సినిమా’ అని హైదరాబాదులో సైలెంట్ సినిమాల గురించి రాశారు. అయితే వారి తర్వాతి తరం వారు ఈ అంశాలను అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ అంశాల పైన లోతుగా అధ్యయనం చేస్తే మద్రాసుతో సమాంతరంగా సైలెంట్ సినిమాలు చరిత్ర హైదరాబాదులో ఉన్నదనే విషయం బయటపడుతుంది. ఇది వారు అంచనా వేయడం వలననే నిశ్శబ్దంగా పట్టించుకోకుండా వదిలేశారు.
ఎందుకు చెబుతున్నానంటే మన తెలుగు వారికి చరిత్రలో పక్క వాడి కన్నా ముందుండటానికి తప్పిదమైన రాతలు రాస్తుంటారు. ఉదాహరణకు ఎలాంటి రుజువులు లేకుండానే తొలి తమిళ టాకీ కాళిదాస కన్నా ముందుగానే తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదల అయిందని చెప్పుకొనడానికి 1931 సెప్టెంబర్ 15ననే భక్త ప్రహ్లాద విడుదలైందని ఒక 70, 80 ఏళ్లుగా రాస్తూ వచ్చారు. ఇది పూర్తిగా చారిత్రక అసత్యమని రెంటాల జయదేవ అనే సినిమా పరిశోధకుడు 1931 అక్టోబరులో తొలి తమిళ టాకీ కాళిదాస విడుదలయితే 1932 ఫిబ్రవరి 6న తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదల అయిందని మన వారి తప్పిదాన్ని మనవాడే సరి చేశాడు. అసలు హైదరాబాద్ సినిమాల గురించి ఏ సీమాంధ్ర సినిమా జర్నలిస్టు కూడా సీరియస్‌గా తీసుకున్న సందర్భం ఎక్కడా కనిపించదు.
ప్రశ్న 9. అసలు మూకీ సినిమాల చరిత్రలో థియేటర్ల గురించి రాయాలని ఎందుకు అనిపించింది?
జ: ఇప్పటివరకు చాలామంది సినిమా థియేటర్ల చరిత్రను పట్టించుకోలేదు. సినిమా పుట్టుకతో పాటు థియేటర్లు కూడా పుట్టినవి. థియేటర్లు లేకుంటే సినిమాలే లేవు. కనుక నేను సైలెంట్ సినిమాల కాలంలో థియేటర్లు ఎక్కడెక్కడ ప్రారంభమైనవనే అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. ఒక్క తెలంగాణలోనే కాకుండా సీమాంధ్ర ప్రాంతంలో థియేటర్లు ఎక్కడ మొదలయ్యాయి ఎలా మొదలయ్యాయి, ఎవరు ప్రారంభించారు అన్న అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టి వాటి విషయాలను కూడా రాయడం జరిగింది. ఎందుకంటే సైలెంట్ సినిమాల కాలంలో సినిమాలకు సంబంధించి ఏ పరిణామం జరిగినా ఆ చరిత్ర పరిధిలోకి వస్తుంది. కనుకనే థియేటర్ల గురించి సమాచారాన్ని నేను పొందుపరిచే ప్రయత్నం చేశాను. ఇది చాలామందికి ప్రత్యేకంగా నచ్చింది కూడా.
ప్రశ్న 10. సమాచార సేకరణ అయిన తరువాత మీరు రచన ప్రణాళిక ఎలా వేసుకున్నారు?
జ: నిజానికి ఈ రచన 2019 నాటికి పూర్తయింది. చాలా విస్తృతంగా రాశాను. మొత్తం భారతీయ మూకీ చరిత్రను రాస్తూ అందులో పరిణామ క్రమంలో హైదరాబాద్ సైలెంట్ సినిమాల విషయాలను క్రోడీకరిస్తూ రాశాను. అయితే ప్రధాన ఉద్దేశ్యమైన హైదరాబాద్ సినిమాల అంశాలు వీటి నడుమ ప్రాధాన్యతను కోల్పోయినవి. దీంతో భారతీయ మూకీ సినిమాల పరిణామ వికాసాన్ని వీలైనంత తగ్గించుకుంటూ హైదరాబాదులో జరిగిన సైలెంట్ యుగాన్ని ఎలివేట్ చేస్తూ రాసే ప్రయత్నం జరిగింది. ఇందులో మళ్లీ బాంబే నుండి మద్రాసు, హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు, కేరళ ప్రాంతాలలో జరిగిన సైలెంట్ సినిమాల కాలంనాటి సంగతులను కంపారిటివ్ స్టడీగా రాసే ప్రయత్నం చేశాను. 1896 నుండి 1932 వరకు హైదరాబాదులో జరిగిన సైలెంట్ సినిమాల తొలి ప్రదర్శనలతో మొదలుకుని హైదరాబాదులో 198లో మూసి వరదల చిత్రీకరణ, 1910 లోనే కల్నల్ విలియం సికింద్రాబాద్‌లో మూకీ సినిమాలను చూపించడం, హైదరాబాదులోని పుష్ కాట్ సినిమా గురించి 1922లో దీరేన్ గంగూలీ సినిమాలు తీయడం, ఆ తర్వాత తెలంగాణ నుండి సునాళిని-మృణాళిని, ఎంఏ రెహమాన్, రామ్ ప్యారి, పైడి జయరాజ్, ఎండి బేగ్ తదితరులు మూకీల కాలంలో బొంబాయి వెళ్ళటం, 1929లో మహావీర్ ఫోటో ప్లేస్, నేషనల్ ఫిలిం కంపెనీలు సైలెంట్ సినిమాలు తీయడం వంటి వరుస క్రమంలో చరిత్రను గుదిగుచే ప్రయత్నం చేశాను. దీనితోపాటు బెంగళూరులో, కేరళలో సైలెంట్ సినిమాల నిర్మాణం గురించి సమాంతరంగా రాసాను. ఒక రకంగా నేను దక్షిణ భారత సైలెంట్ సినిమా చరిత్రను, హైదరాబాద్ సైలెంట్ యుగాన్ని కలగలిపి రాసే ప్రయత్నం చేశానని అనుకుంటాను. సైలెంట్ సినిమాల కాలంలో కేరళలో తొలిమూకీ సినిమా దళిత హీరోయిన్ పీ.కే.రోజి గురించి ఈ పుస్తకంలో రాయడం నాకు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తాను.
ప్రశ్న 11. హైదరాబాదు మూకీ సినిమాలకు, మద్రాసు మూకీ సినిమాలకూ తేడాలేమైనా వున్నాయా?
జ: ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మద్రాస్‌లో తయారైన సైలెంట్ సినిమాలు అన్నీ కూడా పౌరాణికాలపైనే ఆధారపడి నిర్మాణమైనది. అయితే హైదరాబాదులో 1922 నాటికే సోషల్ సబ్జెక్ట్ సైలెంట్ సినిమాగా లేడీ టీచర్ అన్న పేరుతో నిర్మాణమైంది. ఆ తర్వాత స్టెప్ మదర్ (1922) కిడ్నాప్డ్ బ్రైడ్ (1931) దేశ్ బంధు (1932) ఈ సినిమాలన్నీ కూడా సోషల్ సబ్జెక్టుతో రూపొందినవి కావడం విశేషం. మొత్తం నాలుగు నిర్మాణ సంస్థలు 20 సినిమాలు తీసినవి. కానీ చరిత్రకారుల చిన్న చూపు వీటన్నిటిని కూడా తెర మరుగున ఉండేలా చేసినవి.
ప్రశ్న 12. మీరు ఇంత ప్రాధాన్యం కల విషయాన్ని ప్రకటిస్తున్నా దీని గురించి మీడియా పెద్దగా చర్చించినట్టులేదు? ఎందుకని?
జ: విచిత్రం ఏమిటంటే తెలుగులో రెండు ప్రధాన పత్రికలు ఈ పుస్తకం పై ఉద్దేశపురకంగా రివ్యూలు రాయలేదు. ఇదంతా ఒక సామాజిక వర్గం ఈ పుస్తకం ప్రాచుర్యంలోకి రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు. కానీ వెలుగు, ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, తంగేడు, వంటి పత్రికలు ఈ పుస్తకం ఒక చారిత్రక అవసరాన్ని తీర్చిందని రాసినవి. ఒక ప్రధాన పత్రిక తన వెబ్‌సైట్‌లో ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ ఆ సమీక్షకుడు చాలా అంశాలు చరిత్రకు కొత్త చేర్పు అని అంటాడు తప్ప కొత్త చరిత్రను రాశాడని చెప్పడానికి అతడికి నోరు రాలేదు. రాయడానికి అక్షరం దొరకలేదు. పైగా చాలా అంశాల పట్ల తన ప్రాంతీయ వివక్షతను ప్రదర్శిస్తూ ఈ రివ్యూ రాశాడు. వాళ్లు అలాగే రాస్తారని కూడా నాకు తెలుసు. అవేవీ ఈ పుస్తకం గురించి ప్రముఖులు చెప్పిన అభిప్రాయాల ముందు నిలబడలేదు. ఎమ్.ఎల్. నరసింహం, తమ్మారెడ్డి భరద్వాజ, బి నరసింగరావు, విఎకే రంగారావు వంటి చాలామంది ప్రముఖులు ప్రశంసించారు. హిందూలో తెలంగాణ సినిమాకు గళం ఎత్తిన పుస్తకం అని రివ్యూ రాశారు.
ప్రశ్న 13. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? సినిమాకు సంబంధించి నిర్మాణాత్మక కార్యక్రమాలేమైనా తలపెడుతున్నారా?
జ: ఈ లోటస్ ఫిలిం కంపెనీ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో కూడా తేబోతున్నాము.( ఇంగ్లీషు పుస్తకం ప్రచురితమైంది) దీనితోపాటు సమగ్ర తెలంగాణ సినిమా చరిత్రను 500 పేజీల గ్రంథంగా రాస్తున్నాను. వీటితోపాటు డా. ప్రభాకర్ రెడ్డి, బి ఎస్ నారాయణ, టి. కృష్ణ ఆంగ్లంలో బి.నర్సింగరావు సినిమా జీవిత చరిత్ర, తొలి తెలుగు హీరోయిన్ సురభి కమలాబాయి, వంటి తెలంగాణ సినిమా ప్రముఖుల జీవిత చరిత్రలు, తెలంగాణలో ఉన్న థియేటర్ల చరిత్రను రాయబోతున్నాను. అలాగే తెలుగు సినిమాకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారంతో రెండు భాగాలుగా 2000 పేజీలతో ‘తెలుగు సినిమా సర్వస్వం’ అన్న పేరుతో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రస్తుతం హెచ్ ఎం రెడ్డి జీవిత చరిత్ర వెలువటానికి సిద్ధంగా ఉన్నది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రమేష్‌బాబు గారూ.
హెచ్. రమేష్‌బాబు: ధన్యవాదాలు, నమస్కారం.
***
లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు (తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932)
రచన: హెచ్. రమేష్‌బాబు
పేజీలు: 160
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/lotus-film-company-hyderabadu
రచయిత: 7780716386
rameshbabuh99@gmail.com
~
‘లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు’ పుస్తకం సమీక్ష లింక్
https://sanchika.com/lotus-film-company-hyderabadu-book-review-st/