Site icon Sanchika

‘రామకథాసుధ’ కథా సంకలనంలోని ‘ఘటన’ కథా రచయిత్రి శ్రీమతి జె. శ్యామల తో ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘రామకథాసుధ’ కథా సంకలనంలోని ‘ఘటన’ కథా రచయిత్రి జె. శ్యామల గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ]

సంచిక టీమ్: నమస్కారం శ్యామల గారు.

జె. శ్యామల: నమస్కారమండీ.

ప్రశ్న1: ‘రామకథాసుధ’ సంకలనంలో ప్రచురితమయిన మీ కథ ‘ఘటన’ రాసినప్పుడు ‘రామకథాసుధ’ సంకలనం తయారీ ఆలోచన కూడా లేదు. ఈ కథ రాయాలని ఎలా అనిపించింది? కథకు ప్రేరణ ఏమిటి?

జవాబు: ‘ఘటన’ కథ రాయడం అనుకోకుండానే జరిగింది. రచయిత్రిగా, వివిధ అంశాల గురించి శోధించే సందర్భంలో ఓసారి ‘పద్మ పురాణం’ లోని చిలుకల వృత్తాంతం కనిపించింది. ఆసక్తితో చదివాను. ఆ తర్వాత నాలో ఎన్నో ఆలోచనలు..

సీతపై అపవాదు వేసిన చాకలికి ఆ తర్వాత సుఖశాంతులు దక్కాయా? చాకలి మాట ఎలా ఉన్నా, అతడి భార్య ఎలా స్పందించి ఉంటుంది? భర్త తీరును.. ఒక స్త్రీగా ఆమె సమర్థించగలదా? ఈ ఆలోచనల ఫలితమే ‘ఘటన’ కథ.

ప్రశ్న2: ‘ఘటన’ కథ ద్వారా మీరు ఏమి చెప్పాలనుకున్నారు?

జవాబు: ఎవరి పట్ల అయినా క్షమార్హం కాని అపకారం చేసిన వారు, జీవితంలో సుఖశాంతులు పొందలేరని.. తాత్కాలిక కోపావేశాలతో.. అనాలోచితంగా.. ఎవరూ కూడా అనర్థాలకు కారకులు కాకూడదని.

ప్రశ్న3: సాధారణంగా, రాముడిని దోషిగా చూపి విమర్శించటం తెలుగు సాహిత్యంలో పరిపాటి. ఇందుకు భిన్నంగా మీరు రాముడన్నా, రామాయణమన్నా ఎంతో గౌరవంతో సృజించారు కథను. కాల్పనిక కథ అయినా వాల్మీకి పాత్రల వ్యక్తిత్వాలను భంగం చేయలేదు. ఎందుకని?

జవాబు: వాల్మీకి, అనన్య సామాన్య రీతిలో.. ఎంతో ఉదాత్తంగా, మహోన్నతంగా తీర్చిదిద్దిన పాత్రలను, అగౌరవపరచడం అనుచితంగా భావిస్తాను నేను.

ప్రశ్న4: మీ కథ సంకలనంలో చూసుకుంటే ఎలా అనిపించింది?

జవాబు: విశిష్టమైన ‘రామకథాసుధ’ కథల సంకలనంలో.. అందునా, ఎందరో విశేష జ్ఞాన సంపన్నులు, గొప్ప రచయితల కథల సరసన నా కథ చోటు చేసుకోవడం సంతోషంగా అనిపించింది.

ప్రశ్న5: ‘రామకథాసుధ’ సంకలనంలోని కథలన్నీ మీరు చదివారు. ఈ సంకలనంపై మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు: ‘రామకథాసుధ’ కథల సంకలనం.. గొప్ప ఆలోచన. రామాయణం గురించి విభిన్న కోణాలలో, వైవిధ్య భరితంగా ఆవిష్కృతమైన కథలను ఒకచోట అందంగా చేర్చి, అందించడం చాలా చాలా బాగుంది.

ప్రశ్న6: ఈ సంకలనంలో మీకు బాగ నచ్చిన కథ ఏది? ఎందుకు?

జవాబు: ఈ సంకలనంలో, నాకు అమితంగా నచ్చిన కథ ‘వారాది రాముడు’. నంద్యాల సుధామణి గారి కథన శైలి మనోజ్ఞంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా ఒక్కరి కోసం.. ఊరు ఊరంతా.. కలిసికట్టుగా, త్రికరణ శుద్ధిగా మహత్కార్యం నిర్వహించడం.. ఎంతో ఆదర్శనీయం.

ప్రశ్న7: ఏదయినా కథ ఈ సంకలనంలో ఎందుకు వుంది అనిపించిందా?

జవాబు: అలా ఏమీ అనిపించలేదు.

ప్రశ్న8: భవిష్యత్తులో పౌరాణిక పాత్రల ఆధారంగా కథలు రాసే ఉద్దేశం వుందా?

జవాబు: ప్రస్తుతం పౌరాణిక పాత్రల ఆధారంగా కథ రాసే ఆలోచన లేదు. కానీ ఎప్పుడైనా రాయాలి అని బలంగా మనసుకు అనిపిస్తే తప్పక రాస్తాను.

~

సంచిక టీమ్: ఈ ఇంటర్వ్యూకి సమయం కేటాయించి, మా ప్రశ్నలకు తగిన జవాబులిచ్చినందుకు కృతజ్ఞలు శ్యామల గారు.

జె. శ్యామల: ధన్యవాదాలు. సంచిక సంపాదకులకు అభినందనలు.

***

‘రామకథాసుధ’ పుస్తకం ప్రతులకు 0866-2436643. 9849992890
ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha

 

Exit mobile version