[‘ఆదివారం కథలు’ అనే కథా సంపుటిని వెలువరించిన శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం సి.ఎన్. చంద్రశేఖర్ గారూ.
సి.ఎన్. చంద్రశేఖర్: నమస్తే.
~
జ: నేను ఇప్పటివరకూ దాదాపు రెండు వందల కథలు వ్రాశాను. వీటిలో క్రైమ్ సస్పెన్స్ కథలు ఓ పాతిక దాకా ఉన్నాయి. మిగిలిన కథలన్నీ సామాజిక ప్రయోజనం కోసం రాసిన కథలే. మానవత్వపు విలువలు పెంపొందించడం కోసం, కుటుంబ వ్యవస్థ మెరుగుపరచడం కోసం, సామాజిక బాధ్యతల్ని తెలియజెప్పడం కోసం వ్రాసిన కథలు. నేను వ్రాసిన కార్డు కథల్లో కూడా ఓ సందేశం అంతర్లీనంగా ఉంటుంది. మనం వ్రాసే ప్రతి కథకూ ఓ ప్రయోజనం ఉండాలన్నది నా అభిప్రాయం. కథ పాఠకుల్ని ఆలోచింపజేయాలి లేదా వినోదమన్నా ఇవ్వాలి.
ప్రశ్న 2. ఈ కథలలో మీ స్వీయానుభవాల పాలు ఎంత? కల్పన ఎంత? అన్ని కథలూ నిజజీవితంలోంచి వచ్చినట్టే అనిపిస్తున్నాయి?
జ: అవును. ఇందులో యాభైశాతం నా స్వీయ అనుభవాలే. ఎనభై శాతం నిజజీవితం నుంచి వచ్చిన పాత్రలే. నేను చూసిన, అనుభవించిన జీవితాల నుంచే ఈ కథాంశాలు తీసుకున్నాను.
ప్రశ్న 3. సాధారణంగా ప్రతి కథ రచయిత హృదయంలోంచి వస్తుందంటారు? ఈ కథలలో మీరెంత కనిపిస్తారు?
జ: కొన్ని కథల్లో కనిపిస్తాను. అందరికీ సహాయం చేసే చందూ పాత్రలో (చందూ), తల్లితండ్రుల బాధ్యతల్ని స్వీకరించిన మురళి పాత్రలో (తల్లి దీవెన), అందరి గురించి ఆలోచించే సుందరం పాత్రలో (సుందరం), క్రమశిక్షణ, నిబద్ధత కల ఉద్యోగి ప్రసాద్ పాత్రలో (నీరాజనం), తోబుట్టువులే కాకుండా కుటుంబం మొత్తం బాగుండాలని తపించిన పెద్దన్నయ్య శివరాం పాత్రలో (పెద్దన్నయ్య) నేనున్నాను. మా తల్లితండ్రుల పెంపకం, మంచి వ్యక్తుల స్నేహం, చదివిన పుస్తకాలు నాకు ఆ సంస్కారాన్ని ఇచ్చాయి.
ప్రశ్న 4. ఈ కథలలో ఏ కథ మీకు అత్యంత సంతృప్తి నిచ్చింది?
జ: ఈ కథల్లో ‘పిత్రార్జితం’ కథ నాకు బాగా నచ్చింది. చదివిన చాలామందికి కన్నీళ్ళు తెప్పించిన కథ ఇది. మరణించి కూడా బ్రతికి ఉండటం అంటే ఏమిటో తెలియచెప్పిన కథ. ‘తల్లి దీవెన’ కథ కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఈ కథ చదివిన నా స్నేహితుల కొడుకులు తమ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు తామే చేస్తామని తల్లితండ్రులతో అన్నారట. రచయితగా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన విషయం ఇది.
ప్రశ్న 5. ఈ కథలలో ఏ కథ రాయటానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు?
జ: కష్టపడలేదు కానీ ఎక్కువ ఆలోచించి రాసింది ‘దృష్టి’ కథ. నేను అంతవరకూ స్పృశించని కథాంశం కనుక ఈ కథ రాయడానికి కాస్త సమయం తీసుకున్నాను.
ప్రశ్న 6. మీ కథల్లో దుష్టుడుండడు. దౌష్ట్యం వుండదు. ఎందుకని?
జ: ఈ కథల్లో కూడా నెగటివ్ పాత్రలు ఉన్నాయి. అయితే కథ – నేపథ్యం, అవసరాన్ని బట్టి వాటి క్రూరత్వం ఉంటాయి. నేను రాసిన క్రైమ్ కథల్లో దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు. అయితే ఆ కథల్లో కూడా ‘మంచి గెలవాలి, చెడు ఓడిపోవాలి’ అన్న సూత్రాన్ని చాలావరకు పాటించాను.
ప్రశ్న 7. మీరు ఇన్ని పుస్తకాలు ప్రచురించారు. పుస్తక ప్రచురణ, అమ్మకాలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: ఇదివరకైతే అందరికీ ఉచితంగా ఇచ్చుకోగా మిగిలిన పుస్తకాలు నా దగ్గరే మిగిలిపోయేవి. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషియల్ మీడియా సాధనాలొచ్చాక వచ్చాక పుస్తకాల అమ్మకం పెరిగింది. సోషల్ మీడియాలో నేను నా కథల్ని కొన్నిటిని పోస్ట్ చేశాను. అది చదివిన చాలామంది నాకు ఫోన్లు చేసి పుస్తకాలు కొన్నారు. నా ‘ఆదివారం కథలు’ పుస్తకంపై సమీక్షలు చదివి చాలామంది డబ్బులు పంపి ఆ పుస్తకం కొన్నారు. పుస్తకం చదివాక నా పుస్తకాల సెట్ మొత్తం కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నా పన్నెండు పుస్తకాల్లో అయిదు పుస్తకాల స్టాక్ ఇప్పుడు నా దగ్గర లేదు.. పాఠకులను చదివించగలిగే శైలిలో రచనలు చేస్తే పుస్తకాలు అమ్ముడుపోతాయని నా నమ్మకం.
ప్రశ్న 8. మీ రచనలు సమాజంపై ప్రభావం చూపుతాయని మీరు భావిస్తున్నారా?
జ: తప్పకుండా ప్రభావం చూపుతుంది. నా రచనలు చదివి తమ జీవన విధానాన్ని మార్చుకున్నామని కొంతమంది పాఠకులు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా నాకు తెలియజేశారు. మంచి సాహిత్యం వందమందిలో ఒక్కరిని మంచి దారిలో నడిపినా వారిని చూసి ప్రభావితం అయ్యేవారు మరో పదిమంది ఉంటారు.
ప్రశ్న 9. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? రాబోతున్న పుస్తకాలేమిటి?
జ: ఈ సంవత్సరం నా మరో కథాసంపుటి ‘అందమైన జీవితం’ రాబోతూంది. 2019లో అమెరికా వెళ్ళొచ్చాను. అక్కడ నేను చూసిన ప్రదేశాల్ని, అనుభూతుల్ని కొంత ఫిక్షన్ కూడా కలిపి నవల రాస్తున్నాను. నా చివరి శ్వాస వరకూ రచనలు చేస్తూ ఉండాలని నా అభిలాష.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సి.ఎన్. చంద్రశేఖర్ గారూ.
సి.ఎన్. చంద్రశేఖర్: ధన్యవాదాలు.
***
రచన: సి.ఎన్. చంద్రశేఖర్
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్,
పేజీలు: 136
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: ఫోన్ – 9492378422
~
‘ఆదివారం కథలు’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/adivaram-kathalu-book-review/