కవి, కథకుడు శ్రీ గోపగాని రవీందర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0
1

[‘మా ఊరొక కావ్యం’ అనే కవితా సంపుటిని వెలువరించిన గోపగాని రవీందర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం గోపగాని రవీందర్ గారూ.

గోపగాని రవీందర్: నమస్కారం.

~

ప్రశ్న 1. మా ఊరొక కావ్యంపుస్తకాన్ని కవితా సంపుటి అన్నారు. కానీ, అన్ని కవితలూ మీ జీవితానికి సంబంధించినవి. కాబట్టి ఈ పుస్తకాన్ని ఒక ఖండకావ్యం అనవచ్చు కదా? లేక జీవితచరిత్రాత్మక కావ్యం అనవచ్చు కదా?

జ: నా కవితా సంపుటిని ఏ రకంగా పిలుచుకున్న పర్వాలేదు. ఇందులో చోటు చేసుకున్న కవితలన్నీ నా బాల్యం చుట్టూ, మా ఊరు చుట్టూనే తిరుగుతుంటాయి. ఊరుకు సంబంధించిన కొన్ని మరువని జ్ఞాపకాలను మాత్రమే ఇలా కవితల రూపంలో వ్యక్తీకరించాను. దీనికి ఏ పేరు పెట్టిన కూడా నాకు సంతోషమే. నేను మాత్రం మా ఊరును ఒక కావ్యం గానే ప్రేమిస్తాను.

ప్రశ్న 2. ఇటీవలి కాలంలో దీర్ఘ కావ్యాలు రావటంలేదు. చాలాకాలం తరువాత ఇలాంటి పుస్తకం వచ్చింది. ఈ కావ్య రచనకు మీరు ప్రణాళిక ఎలా వేసుకున్నారు. ఏ కవితకు ఆ కవిత రాసి తరువాత ఒక పద్ధతిలో అమర్చారా లేక ఒకదాని తరువాత ఒకటి రాశారా?

జ: మొదట్లో దీన్నొక దీర్ఘకావ్యంలాగానే రాయాలనుకున్నాను.

ఈ కవితా సంపుటి వెనుక నాలుగు సంవత్సరాల నా అంతరంగ మథనమున్నది. ఐదు దశాబ్దాల నా జీవన ప్రస్థానమున్నది. కరోనా వైరస్ వ్యాప్తితో విలవిల్లాడిన మానవ సమాజాన్ని చూసి కలత చెందాను. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల చదివిన పుస్తకాన్నే చదువుకుంటూ గడిపాను. అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. బాల్య మిత్రులను ఊరును గుర్తు చేసుకుంటూ ‘కవితా.. ఓ.. కవితా..!’ శీర్షికతో రెండు నెలల పాటు కవితలు రాశాను. సావధానంగా ఆలోచించుకునే సమయం చిక్కింది. అప్పుడే ఒక ప్రణాళిక ప్రకారం రాసుకుంటూ పోయాను. రెండేళ్ల తర్వాత వాటిని మళ్లీ చదువుకుంటూ అవసరమైన సవరణలు చేసుకుంటూ ఇలా ఒక 35 కవితలతో పుస్తకాన్ని ప్రచురించాను. మొదట్లో వీటికి ఏమి శీర్షికలు పెట్టుకోలేదు. అలాగే వేద్దామనుకున్నాను. పది వాక్యాలున్న కవిత్వాన్ని చదవడానికి ఇష్టపడట్లేదు. కవిత్వ పుస్తకాలు 200 కాపీల కంటే ఎక్కువగా ప్రచురించడం లేదు. సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులుగా గుర్తింపు పొందిన వాళ్లకు, పోస్టల్ ఖర్చులు భరించి ఉచితంగా పుస్తకాన్ని పంపిద్దామనుకున్నా కూడా కవిత్వ పుస్తకాలు వద్దంటున్న కాలం వచ్చింది. ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. అందుకే దీర్ఘ కావ్యమని అంటే చదవడానికి ఆసక్తిని చూపరనుకొని కవితా సంపుటని అన్నాను. ప్రతి కవితకు ఒక శీర్షికను పెట్టడం వల్ల ఉన్న సౌలభ్యం ఏంటంటే దేనికి అదే చదువుకోవచ్చు. ఒకేసారి చదవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఈ కవిత్వ సంపుటిని చదివిన సాహితీ పెద్దలు, మిత్రులందరు దీర్ఘ కావ్యమనే అంటున్నారు. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతికిన అతి భయంకరమైన కరోనా కాలంలోనే ఈ కవితా సంపుటికి బీజం పడింది. మనిషిని మనిషి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభిమానాన్ని చాటుకునే జీవనానికి అడ్డుపడింది. ఊరు ఊరంతా ఒక సామూహిక జీవనంగా బతికిన నా బాల్యమంతా గుర్తుకు వచ్చింది. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాను. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి అనుకోండి. వాటిని మరో కవితా సంపుటి ద్వారా వెల్లడిస్తాను.

ప్రశ్న 3. సాధారణంగా కవులు తమ అనుభవాలనే కవితలుగా మలుస్తారు. కానీ, ఇందులో కవితలు మీ జీవితమే. ఇంతవరకూ మీరు రాసిన ఇతర కవితలకూ, ఈ కవితల రచనకూ మీ అనుభూతిలో, రచనా సంవిధానంలో తేడాను వివరిస్తారా?

జ: నిజంగా మీరు చాలా మాట మంచి మాట చెప్పారు. ఇందులోని ప్రతి అక్షరం నా జీవితమే. సమాజంలోని అనేక సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటి ఆధారంగా నచ్చిన సాహితీ ప్రక్రియలో అభిప్రాయాలను జోడించి రాస్తుంటాను. కవిత్వంలో గాఢంగా వ్యక్తీకరించడానికి, సున్నితంగా హెచ్చరించడానికి ఒక మార్గం దొరికినట్టుగా అనిపిస్తుంది. పరిపరి విధాలైన ఆలోచనలకు ఒక రూపం కావాలంటే నన్ను హత్తుకున్న ప్రక్రియ కవిత్వం. నా కవిత్వంలో ఎవరిపైన వ్యంగ్యం ఉండదు. ఆకాశాలకు ఎత్తడం ఉండదు. బరువైన పదాలు ఉండవు. భావానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. నా ఇతర కవితా సంపుటాలైన ‘అంకురం’, ‘చిగురు’, ‘చెరగని సంతకం’, ‘దూరమెంతైన’ కవితల్లో నిత్యజీవితంలో నేను చూసిన వాటికి స్పందించి రాసిన కవితలు ఎక్కువగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. వాటికి స్పందించకుండా ఉండలేము కదా. రకరకాలైన రాజకీయాలు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, వాదాలు నా కవితా సంపుటాల్లో కనిపిస్తాయి. అవి పూర్తిగా సామాజిక చైతన్యం కోసం నా కవిత వాక్యాలు దోహదపడాలని రాశాను. విభిన్నమైన పోలికలను, కొత్త కొత్త పదాలను, భావ చిత్రాలను ఉపయోగించాను. ఈ కవితా సంపుటికి మాత్రం సహజ సుందరమైన సరళమైన భాషనే వాడాను. ఎందుకంటే ఇదంతా నేను అనుభవించిన జీవితం కాబట్టి. అలవోకగా కవిత్వం పరుగులు పెడుతుంది. ఇందులో వాదవివాదాలకు ఎటువంటి తావులేదు.

ప్రశ్న 4. ఇటీవలి కాలంలో ఊరితో అనుబంధం అన్న మాట వినబడటంలేదు. అవకాశం ఎక్కడ లభిస్తే అదే ఊరు అంటున్నారు. మీరు ఉద్యోగ రీత్యా ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ ఊరితో ఈ అనుబంధాన్ని ఎలా కొనసాగించారు?

జ: మన భావాలు విశాలంగా ఉంటే అన్ని గ్రామాలు మనవే అనిపిస్తాయి. జన్మించిన స్థలకాలాలను బట్టి అక్కడ వాళ్ళు ఇక్కడి వాళ్లని నిర్ధారణ చేస్తున్నారు. మనిషి పుట్టిన దగ్గరనే ఆగిపోతే ఇంత నాగరికత విలసిల్లేది కాదు. అందుకే ఏ గ్రామాన్ని చూసిన మా ఊరిని చూసినట్టే ఉంటుంది. నేను ఎక్కడ ఉద్యోగం చేసిన మా ఊర్లో చేసినట్టే ఉంటుంది. మా ఊర్లో ‘ఏకశిలా యూత్ అసోసియేషన్ అండ్ లైబ్రరీ’ యువజన సంఘం ఐదు దశాబ్దాలుగా పనిచేస్తున్నది. నా జీవితానికి ఒక మార్గం అంటూ ఉందంటే ఆ యువజన సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన నా సాహితీ గురువు ముప్పా మల్లేశం సార్ గారి ప్రభావం నామీద బలంగా ఉన్నది. మా కులాలు ఒకటి కాకపోయినా నన్ను బయట వ్యక్తులకు ఎవరికైనా పరిచయం చేయాలంటే మా అన్న కొడుకు అని పరిచయం చేసేవారు. ఇది రక్తసంబంధం కంటే ఎక్కువ కదా. అది మా ఊరు నేర్పించిన సంస్కారం నాకు. ఏ కుటుంబంలో పుట్టిన కూడా బంధుత్వాలను కాపాడుకోవాల్సింది మనమే కదా. మనుషుల్ని ప్రేమించలేని వాడు నా దృష్టిలో కవి ఎప్పుడు కాలేడు. అసలు మనిషి కూడా కాలేడు. అతడు గొప్ప రచయిత అయినా కానీ సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు. భిన్న అభిప్రాయాలను గౌరవించే సుగుణం ఉండాలి. వితండవాదాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. వరంగల్ నగరానికి పట్టుమని పది కిలోమీటర్లు కూడా లేని మా ఊర్లో అన్ని సమస్యలే ఉండేవి. నేను చదువుకోవాలంటే దూరంగా ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకునే వాడిని. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. నేను ఉద్యోగరీత్యా ఉట్నూరు ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నా బాల్యంలో మా ఊరు ఎట్లా ఉండేదో ఉట్నూరు కూడా అలాగే అనిపించింది. దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న ఉట్నూరు ఒక మినీ ఇండియాకు ప్రతీకలా ఉన్నది. ఎనమిది భాషలు మాట్లాడే ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివాసీ నాగరికతతో పాటు, మైదాన ప్రాంత నాగరికత కూడా విలసిల్లుతున్నదక్కడ. యువజన సంఘం కార్యక్రమాలు, బంధువర్గాల రకరకాల కార్యక్రమాలకు నిత్యం హాజరు కావడం వల్ల నేను ఎక్కడున్నా మా ఊరుతో సంబంధాలు సజీవంగానే కొనసాగుతున్నాయి. నా రెండో కవితా సంపుటి ‘చిగురు’ మా ఊళ్లోనే ఆవిష్కరించాను. నా ‘చెరగని సంతకం’ మా ఊరు యూత్‌కు అంకితమిచ్చాను. ఈ కవితా సంపుటిని నేను చదువుకున్న పాఠశాలకు, ఉపాధ్యాయులకు, బాల్య మిత్రులకు అంకిత మిచ్చాను. అసలు ఎవరైనా కానీ గ్రామాల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి నగరాలకు వలస పోతుంటారు. నేను మాత్రం వరంగల్ నగరం నుండి అటవీ ప్రాంతమైన ఉట్నూరుకు వలస వెళ్లాను. విస్తారమైన అడవిని చూసాను. భిన్నమైన జీవన విధానాన్ని అర్థం చేసుకున్నాను. నాకు మా ఊరైన ఏ ఊరైన కానీ ఒక్కటేనని ఇప్పటికీ అనుకుంటాను. నా దృష్టిలో ఈ ప్రపంచమే ఒక ఊరు. సంకుచిత భావాలను విడనాడనంతకాలం వసుధైక కుటుంబం అనే మాటకు అర్థం లేదు కదా. ఈ కవితలన్నీ మా ఊరువే కావచ్చు. కానీ ఇది అన్ని ఊర్ల గురించి చెప్పినట్టుగానే భావిస్తాను.

ప్రశ్న 5. ఈ పుస్తకంలోని కవితల్లో మీ సున్నిత హృదయం కనిపిస్తుంది. గడప చూసి కథలు గుర్తుకు తెచ్చుకోవటం, వాకిళ్ళు స్మృతులను తట్టిలేపటం, ఇలా అడుగడుగునా అనేక జ్ఞాపకాల వెల్లువ కనిపిస్తుంది. ఈ అనుబంధం మీరు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంతో కొనసాగిందా? లేక మీ ఊరికే పరిమితమా?

జ: ఈ అనుభూతులన్ని ప్రతి గ్రామంతో ఉన్నాయి. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంబంధాలు ఏర్పరచుకుంటాను. అందరూ మనవాళ్లే అనుకుంటాను. కులాలు, మతాలు ప్రాంతాలు అనే పట్టింపులను పాటించను. మనందరం మానవీయమైన మనుషులుగా మసులుకోవాలని తండ్లాట పడుతుంటాను. అందుకనే ఈ కవితా సంపుటిలో ఉట్నూరుతో ఉన్న జ్ఞాపకాలను రాసినప్పుడు కూడా అంతే సజీవమైనవే రాసాను. మా ఊరుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక ఇటీవలనే అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను. నా విశ్రాంత జీవనాన్ని గడపడానికి. నాలుగు దశాబ్దాల క్రితం ఉన్న ఊళ్లోని ప్రతి గడప నాకు తెలుసు. ఎందుకంటే మా కులవృత్తినే తాటి కల్లును అమ్ముకోవడం. అట్లా అందరితో కలివిడిగా ఉండే అవకాశం లభించింది నాకు. ఇప్పుడంటే ఊరు మొత్తం మారిపోయింది అనుకోండి. అప్పటి అనుబంధపు అనుభవాలు చెప్తుంటే నిజంగా ఇట్లా ఉండేదా అని ఇప్పటి తరం ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

ప్రశ్న 6. జీవన పథానికి విద్యను తోడునూ అందించిన వరంగల్లు అంటే ప్రేమ అన్నారు. ఈ ప్రేమకూ, మీ ఊరిపై ప్రేమకూ తేడా ఏమిటి?

జ: ప్రాథమిక విద్యను మా తిమ్మాపూర్ గ్రామంలో, పదవ తరగతి వరకు మమునూరు క్యాంప్ పాఠశాలలో, హనుమకొండ జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ, పీజీ చేశాను. ఓరుగల్లులోని కళాశాలలు, కాకతీయ విశ్వవిద్యాలయలం విద్యావంతుడిగా ఎదగడానికి ఊతమిచ్చాయి. ఇక్కడే నేను బీయిడీ కళాశాలలో తెలుగు పండిట్‌గా శిక్షణ తీసుకున్నాను. కాకినాడ నుండి వచ్చిన వాడ్రేవు రమణశ్రీ నాకు సహాధ్యాయి. వాడ్రేవు వీరలక్ష్మీదేవి, చినవీరభద్రుడుల చెల్లెలు. అప్పటికే వాళ్లు సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్ఠులు. ఆమెతో కలిగిన నా సాహితీ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. అనతి కాలంలోనే ఇద్దరం పెద్దలను ఒప్పించి ఒకటిగా మారిపోయాం. కొంతకాలం పాటు చినవీరభద్రుడు గారు ఉట్నూర్ ఐటిడిఏ గిరిజన వృద్ధి శాఖకు అధికారిగా ఉండేవారు. ఆ పరిచయం తోటే మేము ఉట్నూరు గ్రామంలోని సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులుగా వెళ్ళాము. అందుకనే జీవనపథంలో విద్యను, తోడును అందించిన వరంగల్లు అంటే ప్రేమ అని ఆత్మీయంగా రాసుకున్నాను.

ప్రశ్న 7. మీరు రాసిన ఎర్రడబ్బా కవిత పోస్ట్ డబ్బా జ్ఞాపకాలను తాజా చేస్తుంది. మార్పు సహజమంటారు. ఈ మార్పు తెచ్చే కొత్త సౌకర్యాలనుభవిస్తూ, కోల్పోయిన పాత అలవాట్లకై బాధపడటం సమంజసమా?

జ: పాత రోజులు రావాలని కోరుకోవడం నా ఉద్దేశం కాదు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం. అనుభూతిని గుర్తు చేసుకోవడం. ఇప్పటి తరానికి ఎలా తెలుస్తుంది. ఒక ఉత్తరాన్ని ఎంతో నేర్పుతో రాసేవాడిని. మా ఊరికి వచ్చే ఉత్తరాలను తెచ్చే టప్ప కొమరయ్య కోసం ఎంతగానో ఎదురు చూసే సందర్భాలు గుర్తుకు వస్తాయి. ఎక్కడైనా ఎర్ర డబ్బా కనపడితే నా మనసంతా విలవిలాడుతుంది. అందుకే ఈ కవితను రాసాను. నిజంగా ఇది బాధనే ఆ రోజులు మళ్ళీ రావని తెలుసు. ఇప్పటి సౌకర్యాన్ని వాడుకోవద్దని కాదు. అట్లాంటి అనుభూతులు ఇప్పుడు రావట్లేదని. మార్పును అంగీకరించకపోతే అభివృద్ధి లేదు కదా. ఎవరు ఎన్ని చెప్పినా కొన్ని జ్ఞాపకాలు మనల్ని వీడి పోలేవు.

ప్రశ్న 8. ఈ పుస్తకంలోని కవిత మనసెప్పుడూ ఖాళీగా వుండదులో పొందుపరచిన అనేకానేక భావనల గురించి వివరిస్తారా? ఇలాంటి కవిత చదివి చాలాకాలమైంది.

జ: నిజంగా ఈ కవితను ఈ సంపుటిలో పెట్టడానికి ఒక నెల రోజులపాటు ఆలోచించాను. ఇది మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఒకటి రెండు మాటల్లో చెప్పి ముగించలేను. నేను పుట్టి పెరిగిన ఊర్లో 25 సంవత్సరాలు ఉన్నాను. ఉట్నూరులో 25 సంవత్సరాలకు పైగా ఉన్నాను. ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి ఉన్నత పాఠశాలకు బదిలీ అయినప్పుడు ఉట్నూరుతోనున్న బంధాన్ని వదల లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఆలోచన నుండి పుట్టిందే ‘మనసెప్పుడూ ఖాళీగా ఉండదు’ కవిత. ఉట్నూర్ అంటే ఆకలితో ఉంటే అన్నం పెట్టిన అమ్మ లాంటిది. ప్రేమతో అక్కున చేర్చుకున్న ప్రాంతమది. అందుకే అక్కడి మిత్రులను మరువలేకుండా ఈ కవితను రాసుకున్నాను. ఒకే ఇంట్లో మేము 16 సంవత్సరాలు ఉన్నాం. మా జీవన విధానానికి ఆ ఇల్లొక మూగసాక్షి. అక్కడే ఉట్నూరు సాహితీ వేదికను స్థాపించాను మిత్రులతో కలిసి. 50 నెలల పాటు ప్రతి నెల మొదటి ఆదివారం కవి సమ్మేళనంతో పాటు ఒక ప్రముఖ సాహితీవేత్తను ఆహ్వానించి ప్రసంగాన్ని ఏర్పాటు చేసేది. నా సాహిత్య జీవనానికి కూడా ఊపిరి పోసిన ఊరు ఉట్నూరు. నా మొదటి కవిత సంపుటి ‘అంకురం’ ఇక్కడే ఆవిష్కరించాను. అసంఖ్యాకమైన అనుభవాలు ఉన్నాయి. అందుకనే ఈ కవితను నాకు నేనుగా ఇష్టంగా రాసుకున్నాను. అనేక ఆలోచనల కలబోత ఈ కవిత.

ప్రశ్న 9. అసలు ఇలా కవితల రూపంలో ఆత్మకథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: ఇంతకు ముందు ప్రశ్నల్లోనే నా ఆలోచనలు మీతో పంచుకున్నట్టుగా, నాలుగు దశాబ్దాల క్రితం ఉన్న ఊరు నా కళ్ళల్లో ఇప్పుడు కూడా మెదులుతూనే ఉంది. ఆ దృశ్యాలు ఎప్పుడూ వాడిపోవు. నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ బరువును కొంత దించుకోవడానికి ఇట్ల కవితలు కొన్ని రాసాను. అప్పటి తరాలకు చెందిన చాలా మంది కనుమరుగు అయిపోయారు. ఇప్పటి తరానికి ఇదంతా అవసరమా అనిపిస్తుంది కావచ్చు. ఆత్మకథలు రాసుకునే అంత గొప్పవాణ్ని కాదు నేను. నేను చూసిన వాటిని కొన్ని రికార్డు చేయాలనే తపన నన్ను నిలవనీయలేదు. ప్రతి ఊర్లో ఉంటారు ఓ 10 లేదా 20 మంది మహానుభావులు. వాళ్లు ఎవరికోసం పనిచేయరు. వాళ్ల జీవన తత్వమే అంత. ఉన్న ఆస్తుల్ని ఊరి కోసం ఖర్చు చేస్తారు. ఆస్తులను పెంచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయరు. ఎవరు విసుక్కున్నా, తిట్టుకున్నా బాధపడరు. అట్లాంటి వాళ్ళని గురించి తప్పకుండా రాయాల్సిందే కదా. అందుకనే ‘మహానుభావులు’, ‘జనజీవన గీతాలు’ వంటి కవితల్లో వాళ్ళ ప్రస్తావన ఉంటుంది. ఒక్కొక్క కవిత రాసుకుంటూ పోయాను.. ఇలా ఆత్మకథగా మారిపోయింది. ఇది కూడా మంచిదే కదా.. కవిత్వంలో ఆత్మకథ రాసుకున్న గోపగాని అని గుర్తుండిపోతాను.

ప్రశ్న 10. మీకన్న ముందు ఇలా ఆత్మకథాత్మక కవితాకావ్యం ఎవరయినా రాశారా? ఈ విషయంలో మీకు ఆదర్శం ఎవరు?

జ: నేను చదువుకున్నంత వరకు మాత్రం చాలా రచనలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన ‘పునర్యాయానం’ నాకు బాగా నచ్చినది. సుద్దాల అశోక్ తేజ ‘శ్రమ కావ్యం’ ఇది ఆత్మకథ కాకపోయినప్పటికీ చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. అన్నవరం దేవేందర్ రచించిన ‘ఊరి దస్తూరి’ వ్యాస సంపుటి ‘మా ఊరొక కావ్యాని’కి ప్రేరణగా నిలిచింది. నాకు ఉత్తమ పురుషలో సాగే రచనలంటే బాగా నచ్చుతాయి. కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, చరిత్రలను ఇష్టంగా చదువుతానును. దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన ‘ఊరు వాడ బతుకు’ నాకు చాలా ఇష్టమైనది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రచనలను గుర్తు చేసుకోవాలి. ఒక తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగిన అతి సాధారణమైన ఉపాధ్యాయుని యొక్క అంతరంగ ఆవిష్కరణ ‘మా ఊరొక కావ్యం’ అని గర్వంగా చెప్పుకుంటాను.

ప్రశ్న11. ఇటీవలి కాలంలో కవిత అంటే రాజకీయ తీర్మానాలు, అసంతృప్త ఆర్భాటాలు, అణచివేతల కోలాహలాలన్న రీతి స్థిరపడింది. ఇలాంటి సమయంలో అనుభూతి ప్రాధాన్యమైన రచన చేసే ధైర్యం ఎలా కలిగింది? ఈ పుస్తకం పట్ల సాహిత్య ప్రపంచం స్పందన ఎలా వుంది?

జ: మీరు అంటున్నది వంద శాతం వాస్తవం. సాహిత్యంలోని ఏ ప్రక్రియ తీసుకున్న సరే ఏదో ఒక రాజకీయానికి చెందిన భావజాలానికి చిరునామాగానే ఉంటుంది. ఏదో ఒక ముద్ర కింద పని చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రతి దానికి కొన్ని పరిమితులు ఉన్నట్టుగానే నాకు కూడా ఉంటాయి. అనేక రకాలైన ఉద్యమాలు సాహిత్యాన్ని ప్రభావితం చేసినట్లుగానే సాహిత్యం కూడా ఉద్యమాలను ప్రభావితం చేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. మార్పు అనేది జలపాతంలా ఉండదు. సన్నని సెలయేరులా నెమ్మదిగా పారుతున్నట్టుగానే ఉంటుంది. మీకు తెలియంది కాదు కానీ ఏ రచన పరమార్ధమైన అది ప్రజల కోసమే కదా. కాలానికి నిలబడి ఉండే కవిత్వమే కావాలి. అప్పటికప్పుడు సంచలనం సృష్టించేది కాదు. ఎవరి దారి వారిది. నేను ప్రస్తావించిన విషయాలను ఎవరైనా కాదన గలరా? ఇవి అందరి జీవితాల్లో ఉన్న విషయాలే. చదివిన వాళ్ళందరూ తమ తమ జీవితాన్ని చూసుకుంటున్నామని స్పందిస్తున్నారు. నాతో వాళ్ళ సంతోషపు అనుభూతిని పంచుకుంటున్నారు. గతం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎవరూ బాధపడరు. వర్తమానంలో మనం ఏ వైపు నిలబడి మాట్లాడుతున్నామో పరిశీలిస్తూ మనల్ని అంచనా వేస్తారు. భావ కవిత్వమో అనుభూతివాద కవిత్వమో ఏదైనా కానీ ఇది నా చరిత్ర.. మా ఊరు చరిత్ర.. ఇదెవరు కాదనలేని వాస్తవం.

ప్రశ్న12. ‘జనజీవన గీతాలు కవితలో సామరస్యపూరిత సమాజాన్ని వర్ణించారు. ఈ కవితలో ప్రదర్శించిన అంశాల గురించి మరింత విపులంగా వివరిస్తారా? కులంతో సంబంధం లేకుండా, ఆత్మీయంగా ఏదో ఒక సంబంధం కలుపుకుని ఒక కుటుంబంలా జీవించిన ఆ సమాజ స్వరూపాన్ని వివరిస్తారా?

జ: నా చిన్నతనంలో చూసిన అనేక సంఘటనలు ఈ కవితకు ఆధారం. మా ఇంటి చుట్టూ రెండు హోటల్లుండేవి. ఒకటి కొమ్మయ్య హోటల్. ఇంకొకటి భాగ్యమ్మ హోటల్. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు తమ తమ కష్టాలు సుఖాలను వెళ్లబోసుకునేవారు. మా ఇంటి ముందే సావడిగడ్డ (రచ్చబండ) వుండేది. గ్రామపంచాయతీ భవనం ఊరు మధ్యలోనే ఉంటుంది. ఊర్లో ఏ సంఘటన జరిగినా ఇక్కడికి చేరుతుంది. ఏ సమావేశమైన అది పగలైనా రాత్రయినా ఇక్కడే జరుగుతుంది. నాటకమైన, బుర్రకథలైనా ఇక్కడే జరిగేవి. ఊరు జనమంతా కళ్ళ ముందు ఉండేవారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. దుఃఖాలను వెళ్లబోసుకునేవారు. బతుకమ్మ పండుగ తర్వాత దసరా పండుగ నాడు కోలాటం వాడేవారు. అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. పీర్ల పండుగలప్పుడు అసై ..దుల ఆటలు పాటలతో ఆడేవారు. 80వ దశాబ్దిలో ఓరుగల్లు పోరుగల్లుగా ఉద్యమాల బాటలో పర్వల్లు తొక్కుతుండేది. మేమంతా అందుకు మినహాయింపు కాదు. వామపక్ష భావజాలంతో కూడిన విప్లవచైతన్య గీతాలు గ్రామాల్లో మారుమోగుతుండేవి. దళితుల పిల్లలు విద్యావంతులు కావాలని కొందరు నడుం కట్టారు. వయోజనులందరూ చదువుకోవాలని కొందరు పాటుపడ్డారు. దురాచారాలు పోవాలని కొందరు పిలుపునిచ్చారు. సామాజిక సంస్కరణల కోసం పాటుబడిన ఆనాటి ఆ యువ తరంగాల కార్యక్రమాలు నా మీద ప్రభావం చూపించాయి. నా దృష్టిలో వాళ్లంతా హీరోలే. దొరల పెత్తనాన్ని ప్రశ్నించిన మా ఊరి కథానాయకులు వాళ్లు. ఒక్క మాట మీద కట్టుబడి ఉండేవాళ్ళు. పట్టుదలల ఉండేవి. కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరూ వరుసలు పెట్టుకొని పిలుచుకునేవారు. అక్క, బావ, మామ, అత్త, అల్లుడా, కోడలా, కొడుకా, బిడ్డ ఇట్లా ఎక్కడికి పోయినా పిలిచేవారు. అందుకే ఊరంటే ఒక కుటుంబంలా అనిపించేది నాకు. కష్టాల్లో ఒకరికి ఒకరుగా అండగా అందరూ తోడుండేవారు. అందుకనే ఈ కవితలో అందరిని స్మరించుకున్నాను కూడా.

ప్రశ్న13. అలాగే కాలగర్భంలో కలసిన వృత్తులు సామాజిక పరిస్థితులను ఎలా రూపాంతరం చెందించాయో కాలగర్భంలో కవితలో చూపించారు. వృత్తులు పోయిన వారి పరిస్థితులు ఊళ్ళలో ఎలా వున్నాయో చెప్తారా?

జ: కులవృత్తులు చేసుకునే వాళ్ళ సామూహిక ప్రదేశం ఊరు. కులవృత్తులు ఎప్పుడైతే కోల్పోతూ వచ్చారో ఊరు జీవం కూడా మసక బారింది. కమ్మరోళ్లు, కుమ్మరోళ్లు వడ్రంగులు, చాకలోళ్ళు, దళితులు ఇలా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తూ కలివిడితనంతో ఉండేవాళ్ళు. ఒకరి అవసరాలు ఒకరికి ఉండేవి. అందరూ వరసలు పెట్టుకొని పిలుచుకునే వాళ్ళు. ఒక్కొక్కటిగా వాళ్ళ అవసరాలు తగ్గిపోతూ వచ్చాయో ఊళ్లోని మానవ సంబంధాలు కూడా కనుమరుగవుతూ వస్తున్నాయి. కులవృత్తిలో నైపుణ్యం కలిగిన నాటి తరం కనుమరుగైపోయింది. ఇప్పటి పిల్లలకు ఆ మెలకువలు కూడా తెలియవు. ఆ వాడల పొంటి పోయినప్పుడు మనసంతా దిగులుతో గూడు కట్టుకుంటుంది. మా గౌడ వృత్తి కూడా చేసే వాళ్ళు తగ్గిపోయారు. వేరే పనులు చేయలేక సతమతమవుతున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా నగరాలకు పట్టణాలకు వలస వెళ్తున్నారు. కలకలలాడిన ఇండ్లన్నీ వెలవెలబోతున్నాయి. అందుకే ‘కాలగర్భంలో’ అనే కవితలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను. ప్రభుత్వం ఇచ్చే రెండు వేల పెన్షన్ కోసం వృద్ధతరమంతా నిరీక్షిస్తూ బతుకుతున్నారు. అవసరాలు ఎప్పుడు గొప్ప సంబంధాలను కలుపుతుంటాయి. ఆదరణ తగ్గిన కులవృత్తులు గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చివేసాయి. ఇప్పుడైతే ఒకప్పుడు ఉండేవని చెప్పుకోవాల్సి వస్తుంది. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఆ చిత్రాలు చూస్తుంటే చిన్నప్పటి సంగతులన్ని నిలువనీయవు. బాధాతప్త హృదయంతోనే అక్షరీకరించాను.

ప్రశ్న14. ‘పఠనీయ గ్రంథం కవితలో మీరు ప్రదర్శించిన వాతావరణం గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. తండాలలో ఉపాధ్యాయుడిగా మీ వ్యక్తిగత అనుభవాలను, ఆలోచనలను వివరిస్తారా?

జ: ఎంతటి వారినైనా అడవి సమ్మోహన పరుస్తుంది. అడవి మధ్యన కొలువుతీరిన ప్రాంతం ఉట్నూరు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గుండె వంటిది అది. అదిలాబాద్, నిర్మల్, బాసర, ఇంద్రవెల్లి అమరుల స్తూపం, కేస్లాపూర్ నాగోబా జాతర, కొమురం భీమ్ జోడెన్ ఘాట్ పోరాట ప్రాంతం, మర్లవాయి, ఆసీఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, ఖానాపూర్ తదితర ప్రాంతాలను సందర్శించాను. చాలా కవితల్లో వాటిని తలుచుకున్నాను కూడా. నేను కవ్వాల్, ఉట్నూర్, పెర్కగూడ పాఠశాలలో పనిచేసే అవకాశం లభించింది. ఉట్నూర్ ప్రాంతంలో కొంతకాలం పాత్రికేయుడుగా కూడా పని చేసాను. అందువల్ల జిల్లా అంత తిరిగే అవకాశం దొరికింది. ఇక్కడి సాంప్రదాయాలు, సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజ్ గోండుల సంస్కృతి, వాళ్ల కట్టుబాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. పండుగ అంటే ఒక ఇంటికి పరిమితం కాకుండానే ఆ గోండుగూడ వాసులందరు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒక లంబాడా తండాలోని గిరిజనులు కలిసికట్టుగా చేసుకుంటారు. ఇంకా వాళ్లలో ఆ సాంప్రదాయాలు బతికి ఉన్నాయి. వాళ్ల ప్రేమమయమైన పలకరింపులతో పరవశం చెందుతాం. ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు సముద్రమంతా ఆత్మీయత అనురాగాలు ఉంటాయి. అందుకే వాళ్ళ మధ్యలోనే ఇంతకాలం ఉండిపోయాను. నమ్మించి మోసం చేయడం అనేది ఇంకా వాళ్ళు నేర్చుకోలేదు. దండారి, గుస్సాడీ నృత్యాలు, టీజ్ పండుగ నృత్యాలు సాంప్రదాయక వాయిద్యాలు ఇప్పటికీ కాపాడుకుంటున్నారు వాళ్ళు. కల్మషం లేని సుమన స్కూలు గిరిజనులు, ఆదివాసులు. అందుకే ఆ ప్రాంతం మీద మక్కువతో ఒక పఠనీయమైన గ్రంథమనే కవితను రాసాను. మైదాన ప్రాంతం నుండి వలస వచ్చిన వారితోటి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ వాళ్లు కూడా ఇప్పుడు ఆధునిక వసతులను అందుకుంటున్నారు. విద్యా వైద్య రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. నాకెప్పుడూ అటవీ ప్రాంతం ఒక అపూర్వమైన కావ్యమే. భిన్న వర్గాల వాళ్ళు ఉన్నా కూడా సోదర భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒకసారి వాళ్లు మన వాళ్లు అనుకున్నారంటే ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటారు. తెలుగు వాళ్లకు మాతృభాష కాదు. తెలుగు భాషా బోధకుడిగా సులువుగా తెలుగు నేర్చుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేసాను. ఉట్నూరు సాహితీ వేదిక తరపున 10 మంది గిరిజన యువకులు తమ పుస్తకాలను ప్రచురించారు. మూడు కవితా సంకలనాలను ప్రచురించాను.

ప్రశ్న15. జీవితమంటేనే ఒక సుదీర్ఘ ప్రయాణం. ఒక అర్ధ శతాబ్ది ప్రయాణాన్ని విహంగ వీక్షణంగా ఈ పుస్తకంలోని కవితల్లో ప్రదర్శించారు. భవిష్యత్తులో కలిగే అనుభవాలను ఇలా కవితల్లో పొందుపరచే ఆలోచన వుందా?

జ: తప్పకుండా రాస్తాను. సమాజంలో నేను ఒక భాగం. ఒకప్పటి సమాజం కంటే ఇప్పుడు భిన్నమైనది. ఎక్కడ చూసినా జనాభా కనిపిస్తూనే ఉంటుంది. వారిలో మాత్రం ఇసుమంతైనా చైతన్యం కనిపించడం లేదు. సమూహంలో ఒంటరివారైపోతున్నారు. సెల్‌ఫోన్ మాయాజాలంలో చిక్కుకొని కనీస పలకరింపులకు కూడా సమయాన్ని కేటాయించలేని కాలం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగున్నది. ఇదొక భయంకరమైన కాలం. అందుకనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అభిప్రాయాలను పంచుకోవడం తెలియడం లేదు. కనీసం చెప్పిన వినడం లేదు. చిన్న పిల్లలు కూడా మత్తు పానీయాలకు బలవుతున్నారు. పెద్దలపట్ల చిన్నచూపు కనపరుస్తున్నారు. ఉపాధ్యాయులంటే విలువ లేదు. ఒక మైకంలో జీవిస్తున్నారు అందరు. సాహిత్యం పాత్ర ఇంకా విలువైనది. మంచి మాటల బోధనలు కాకుండా జీవన కాంక్షను పెంచే కవిత్వాన్ని రాయాలని ఉన్నది. కొంత సీరియస్‌నెస్ కూడా అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయినప్పటికీ కూడా మానవీయమైన సంబంధాలుగా రూపొందే దాకా ఎవరి ప్రయత్నం వారు చేయాల్సిందే. కవిత్వంతో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మనసు కవితలు అందించాలనే బలమైన కాంక్ష నాలో ఉన్నది.

ప్రశ్న16. తెలుగులో నిష్పాక్షికమైన సాహిత్య విమర్శ లేదు. కోవెల సంపత్కుమారాచార్య, సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్రయ్య వంటి వారి పంథాను ఎవరూ అనుసరించలేదు. ఒక అధ్యాపకుడిగా దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఒక కవిగా ఈ లోటువల్ల కలిగే అనర్ధాలేమిటనుకుంటున్నారు?

జ: నిష్పక్షపాతమైన విమర్శ ఈ రోజు చాలా అవసరం. ఆ రకంగా మన విమర్శకులు ఎవరు కృషి చేయడం లేదు. ఎందుకంటే అధ్యయనం ఒక లోటుగా అనిపిస్తుంది. విమర్శను భరించే స్థాయికి కవులు ఇంకా ఎదగనట్టుగానే అనిపిస్తుంది. ప్రశంసలకు ఇచ్చినంత ప్రాధాన్యత అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా స్పందించడం లేదు. సాహిత్యం కూడా ఇప్పుడు వికేంద్రీకరణ అయింది. ఒక రచన యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో చెప్పే నేర్పు ఒక్క విమర్శకుడికి మాత్రమే ఉంటుంది. నిక్కచ్చి విమర్శన ప్రచురించే పత్రికలు కూడా కరువైపోతున్నాయి. ఆర్థిక లోటుతో అవి సతమతమవుతున్నాయి. విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలు కూడా అంత లోతుగా ఉండటం లేదని అనిపిస్తుంది. ఎవరి మార్గం వారికి ఉంటుంది. మన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించగలం. ఇది మాత్రమే కరెక్ట్ అంటే అహంకారం అవుతుంది. మంచి విమర్శ రాసే వాళ్లకు సరైన ప్రోత్సాహం లభిస్తే మంచి రచనలు పది కాలాల పాటు నిలబడతాయి. రచయిత పేరుతో కాక తాను రాసిన రచనతోనే గుర్తింపు రావాలంటే విమర్శకులు నిక్కచ్చితనంగా ఉండాలి. తెలుగు సాహిత్యంలో ఈ కొరత ఎప్పటికి తీరుతుందో వేచి చూడాల్సిందే.

ప్రశ్న17. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఇంకా ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు?

జ: ఉట్నూరు ప్రాంతంలోని నేపథ్యంతో ఒక 12 కథలు రాసాను. ‘ఉట్నూరు కథల’ పేరుతో ప్రచురించాలని ఉన్నది. సాధ్యమైనంత త్వరగా అవి కథాపాఠకుల కోసం అందుబాటులోకి తెస్తాను. ఒక 20 నవల మీద రాసిన సమీక్ష వ్యాసాలు ఉన్నాయి. అదొక పుస్తకంగా ప్రచురించాలి. కవిత్వ విమర్శ పేరుతో ‘శతారం’ 75 వ్యాసాలతో ప్రచురించాను. కవిత్వం మీద రాసిన ఇంకా 50 వ్యాసాలు ఉన్నాయి. వాటిని కూడా ఇంకొక పుస్తకంగా తీసుకురావాలి. కథలు చదవడం నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. వివిధ రచయితలు రాసిన కథా పుస్తకాల మీద రాసిన 30 వ్యాసాలున్నాయి. వాటిని కూడా ఒక పుస్తకంగా త్వరలోనే తీసుకురావాలి. ఇతర కవితలు అన్ని కలిపి ‘గోపగాని కవిత’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించే పనిలో ఉన్నాను. మనిషికి మనిషికి మధ్యన సాహిత్యం ఒక స్నేహ వారధి. దాన్ని మరింతగా విస్తృతపరచడానికే నా వంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తూనే ఉంటాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రవీందర్ గారూ.

రవీందర్: ధన్యవాదాలు.

***

మా ఊరొక కావ్యం (కవిత్వం)
రచన: గోపగాని రవీందర్
ప్రచురణ: కస్తూరి విజయం
పేజీలు: 160
వెల: ₹ 270/-
ప్రతులకు:
(ప్రింట్ ఆన్ డిమాండ్)
కస్తూరి విజయం
ఫోన్: 9515054998
kasturivijayam@gmail.com
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Maa-Uroka-Kavyam-Gopagani-Ravinder/dp/8196611684

 

~

‘మా ఊరొక కావ్యం’ కవితా సంపుటి సమీక్ష:
https://sanchika.com/maa-uroka-kavyam-book-review/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here