[‘ఔరా అగ్గిరవ్వా’ అనే కథాసంపుటిని వెలువరించిన షేక్ మస్తాన్ వలి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం షేక్ మస్తాన్ వలి గారూ.
షేక్ మస్తాన్ వలి: నమస్కారం సార్.
~
ప్రశ్న 1. మీరు రాసి, ప్రచురించిన 15 కథల సంపుటికి శీర్షికగా తొలి కథ ‘ఔరా అగ్గిరవ్వా’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ఉందండీ! ఈ కథ హాస్యాన్ని పండించడంలో మిగిలిన కథలకన్నా ముందుందనిపించింది. పేరు కూడా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉండడం వలన ఆ పేరునే నిర్ణయించాను.
ప్రశ్న 2. మీరు 70లలో విస్తృతంగా రాశారని, అప్పటి ప్రముఖ పత్రికలలో మీ కథలు, కవితలు ప్రచురితమయ్యాయని తెలుసు. తరువాత కాలంలో రచనలకి విరామం ఇచ్చినట్టున్నారు. మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: నేను సహజంగా హాస్యప్రియుణ్ణి. నేను వివిధ సందర్భాలలో నా సహోద్యోగులు, మిత్రులు, బంధువులతో చెప్పే పలు విషయాలను వారెంతో ఆసక్తిగా విని ఆనందించేవారు. వాటిని అక్షరబద్ధం చేసి మరింతమందిని అలరించాలనే ఆలోచన నా కథలకు జన్మ నిచ్చింది. నిజానికి నా ఉద్యోగ అనుభవాలు, నాకెదురైన వ్యక్తుల తీరు తెన్నులు, బంధు మిత్రుల ద్వారా ఎదుర్కొన్న సంఘటన సందర్భాలు, నా పరిశీలనలు నా కథలకు వస్తువులు. పత్రికా సంపాదకుల ప్రోత్సాహం, పాఠకుల ప్రతిస్పందన నన్ను ఉత్సాహంగా ముందుకు నడిపించాయి. వయోభారం వలన తీసుకోకున్నా.. కొంత విరామం వచ్చిన మాట నిజం.
ప్రశ్న 3. “రచయిత కథను నడిపించటంలో దిట్ట. పాత్రోచిత మరియు సందర్భోచిత సంభాషణలు వీరి కథల విశిష్టతగా చెప్పవచ్చు” – అని డా. మైలవరపు లలితకుమారి గారు తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయంలో కథకి వస్తువు, శిల్పం, శైలి లో ఏది ప్రధానం? వివరించండి.
జ: ఏ రచన కైనా – ‘వస్తువు’ ప్రాణప్రదం అని భావిస్తాను. ఎంచుకున్న వస్తువుని బట్టి, పాత్ర చిత్రణ, సంఘటనల్ని బట్టి ‘శిల్పం’, ‘శైలి’ మలచబడతాయని నా అభిప్రాయం. అయితే ఒక కథ విజయవంతమవడంతో దేని ప్రాధాన్యత దాని కుంటుంది.
సంభాషణల్లో నేను భాష యొక్క ‘యాస’కి, ఆయా ప్రాంతాల పదప్రయోగానికి ప్రాధాన్యత నిస్తాను. కథని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ఇది ఉపయోగ పడుతుందని నా నమ్మకం.
ప్రశ్న 4. మీ మొదటి కథా సంపుటి ‘దీపం’ 2015లో ప్రచురితమైంది. రెండవ కథా సంపుటి ‘ఔరా అగ్గిరవ్వా’ 2024 లో వచ్చింది. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కథా వస్తువు, శైలి, కథా నిర్మాణం విషయాలలో రచయితగా మీలో ఏ మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
జ: వయసు రీత్యా కొంత మేరకు తగ్గిన ఊహాశక్తి ఉద్ధృతి తప్ప చెప్పుకోదగిన మార్పులేమీ లేవని నా భావన.
ప్రశ్న 5. మీ తొలి కథ నాటికి, ఇటీవలి కథ ‘ఒంటరి పోరాటం’ వరకు ఓ సాహితీవేత్తగా సమాజంలోని ఏ మార్పులను మీరు గుర్తించారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఎలా మలచుకున్నారు?
జ: సాహిత్యం పట్ల జనంలో ఆసక్తి ఒకప్పటి కన్నా బాగా తగ్గింది. దీనిక్కారణం ఇదివరలో పుస్తక పఠనమే ముఖ్యమైక ఆటవిడుపుగా, వినోద సాధనంగా ఉండేది. నేడు 24 గంటలు ప్రసారమౌతున్న టి.వి. కార్యక్రమాలు, వివిధ ఛానళ్ళు ఆకర్షణీయమైన ప్రత్యక్ష ప్రసారాలు.. ముఖ్యంగా మహిళల్ని కట్టిపడేస్తున్నాయి. మరో కారణం స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడం వలన సమయాభావం ఏర్పడింది. ముఖ్యంగా సెల్‍ఫోన్‍లతో కాలక్షేపం సర్వసాధారణం అయ్యింది.
తదనుగుణంగా నేను సంక్షిప్తతని పాటిస్తూ, నిడివి తగ్గించి, చిన్ని కథల్ని ఎక్కువగా రాస్తున్నాను.
ప్రశ్న 6. “హాస్య రసాన్ని ఆస్వాదించలేకపోతే, మనిషిలో మిగిలేది కేవలం నీరసమే అని నా భావన” అని అన్నారు ఈ పుస్తకం లోని ‘నా మాట’లో. ఈ సంకలనంలోని అధిక భాగం కథలలో – సన్నివేశాల కల్పన ద్వారా లేక సంభాషణల ద్వారా హాస్యం తొణికిసలాడినా, ఇతర రసాలు/భావోద్వేగాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘దిగ్భ్రమ’ కథలో భయానక రసం బాగా పండిందనిపిస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: భావోద్వేగాలను, శృంగార, కరుణ, హాస్యరసాలను అవసరం మేరకు నా కథల్లో చిత్రీకరించానని అనుకుంటున్నాను. ‘దిగ్భ్రమ’ వస్తువు ననుసరించి భయానక రసం పండింది. నిజానికది గుంటూరు లోని బంధువుల జీవితంలో జరిగిన సంఘటన. ఆనాటి సమాజపు మూఢ నమ్మకాన్ని ఖండిస్తూ భయం మనిషిని ఎలా బలహీన పరుస్తుందో చెబుతూ – సంస్కరణ దిశగా ఈ కథని మలచడం జరిగింది. ఈ సంపుటిలో ఇదొక బలమైన కథగా నిలిచింది.
ప్రశ్న 7. ‘ధనికుడు’ అర్చక కుటుంబం నేపథ్యంగా అల్లిన కథ. ఈ కథ కల్పితమా? లేక మీ పరిచయస్థుల కుటుంబంలో సంభవించిన ఘటనలతో అల్లిన కథా? వివరించండి.
జ: అహోబిలం లోని శ్రీ నరసింహస్వామి ఆలయానికి కొందరు మిత్రులలో వెళ్ళాము. ఆ సందర్భం లోనే ఖాళీ సమయంలో స్వామి అర్చకులు చెప్పిన యథార్థ సంఘటనకి కథకి అవసరమైన మేరకు కొంత కాల్పనికత జోడించి రాయడం జరిగింది. నేటి సమాజానికి దిశానిర్దేశం చేసే కథగా దీన్ని భావిస్తాను.
ప్రశ్న 8. మగ ధర్మం నేటి ధర్మం కాదని ‘నేటి ధర్మం’ కథలో నెరేటర్ అంటుంది. దగాపడ్డ మహిళ తెగువని చాటిన ఈ కథకి మీ కుమార్తె సహాకారం తీసుకున్నానని రాశారు? ఏ రకంగా? వివరిస్తారా?
జ: ఈ కథని తొలుత నా చిన్న కుమార్తె పర్వీన్ సంక్షిప్తంగా రాసి నాకు చూపించింది. అయితే వస్తువు ఎంతో బాగున్నా కథనం కావాల్సినంత రసాత్మకంగా, ప్రభావాత్మకంగా అనిపించలేదు. చాలా కాలం తర్వాత తన అనుమతితో దాన్ని ‘నేటి ధర్మం’గా రాశాను. మూల భావం తనదే కనుక తన పేరుని ప్రస్తావించడం జరిగింది. ఈ సంపుటిలో ఇదొక మేటి కథగా మన్నన లందుకుంది.
ప్రశ్న 9. ‘ఆవేదన’ కథలో రైలు ప్రయాణంలో ఓ బోగీలో జరిగిన ఉదంతాన్ని చాలా బాగా వర్ణించారు. “ఓర్పు, సహనం, సామరస్యం, సమన్యాయం లేక బంధుత్వాలు మరచి పరస్పరం ఘర్షణ పడే ముదనష్టపు సంతుతో బాధపడే భారతీయ సగటు స్త్రీల ఆవేదన ఆ పెద్దామె కళ్ళల్లో కనిపించింది” అంటూ ముగించిన ఈ కథకి ప్రేరణ బహుశా మీరు స్వయంగా చూసిన సంఘటన కావచ్చుననిపిస్తుంది. ఈ కథ నేపథ్యమేమిటో పాఠకులకి వివరిస్తారా?
జ: నిజమేనండీ! మీరు సరిగ్గానే ఊహించారు. నేను గుంటూరు నుంచి కురిచేడు వెళ్తుండగా ఈ సంఘటన నా కళ్ళ ముందే జరిగింది. నర్సరావుపేట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నా మనసు కలచి వేసి, ఆలోచనలో పడవేసింది. ఆయా పాత్రల ప్రవర్తన మిగిలిన ప్రయాణంలో ఈ కథకి జన్మనిచ్చింది.
ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: దాదాపు అన్ని కథలూ నాకు నచ్చినవే. అయితే, ఆడపిల్లలకు చిన్నతనంలో పెళ్ళి చేయడమనే సంప్రదాయం నేటికీ సమాజంలో వేళ్ళూనుకుని, వారి బంగారు భవిష్యత్తుని అడ్డుకుంటూ, వారిని సహజంగా ఎదగనీయడం లేదు. ఈ కఠోర సత్యం నన్ను ఆర్ద్రపరిచింది. అందుకే, ‘విధి బలీయం’ నాకు వచ్చిన కథగా చెబుతున్నాను.
ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘విధి బలీయం’ కథలో ‘కల్పన’ పాత్ర చిత్రణ క్లిష్టంగా అనిపించింది. నిజానికి ఇది కూడా యథార్థ సంఘటన ఆధారంగా రాయబడిన కథ. ఇద్దరు సహాధ్యాయినుల జీవన చిత్రణలో ఒకరి పాత్ర మధ్యలోనే ముగిసి పోవడమనే విధి విలాసం నా మనసుని అతలాకుతలం చేసింది.
మెరుగ్గా అనిపించిన విధానాన్నే ఎన్నుకోవడం వలన అలా ఎప్పుడూ అనిపించలేదు.
ప్రశ్న12. ‘ఔరా అగ్గిరవ్వా’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటిని పాఠకులకు ఎలా దగ్గర చేశారు?
జ: ఈ సంపుటి లోని కథల్ని వీలు వెంట అప్పుడప్పుడూ రాస్తూ వచ్చినా వివిధ కారణాల వల్ల పత్రికలకి పంపలేక పోయాను. మొత్తం కథలు జూలై 2023 నుంచి ఫిబ్రవరి 2024 మధ్యలో ప్రచురింపబడడం.. అందులోనూ 9 కథలు ‘సంచిక’లో ప్రచురింపబడడం ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో ‘సంచిక’ సంపాదకులకు ధన్యవాదము లర్పిస్తున్నాను.
ప్రశ్న13. కథ, కవితల్లో మీ కిష్టమైన ప్రక్రియ ఏది? దీనిని ఎక్కువ ఆనందించారు?
జ: కథారచన నా కిష్టమైన ప్రక్రియ. చెప్పదలుచుకున్న విషయం చెప్పడానికి కథారచన లోనే ఎక్కువ వెసులుబాటు ఉంటుందని నా అభిప్రాయం. కవితలు కూడా పేరున్న పత్రికలలో ప్రచురింపబడినా, నాకు ఎక్కువ తృప్తినిచ్చింది, పేరు తెచ్చింది కథలే.
ప్రశ్న14. మీ రచనా వ్యాసంగంలో మీకు ఎవరెవర్నించి సహకారం అందింది?
జ: 62 యేళ్ళుగా నా జీవిత భాగస్వామిని శ్రీమతి అస్మత్ ఆరా నా ప్రతి రచనకీ తొలి పాఠకురాలు. ఆమె తన విశ్లేషణాత్మక దృష్టితో కథానుకూలంగా కొన్ని సూచనలు, సవరణలు చెప్పేవారు. ఆ మార్పులు చాలా సందర్భాల్లో పాఠకుల మన్నన పొందాయి, కొన్ని సార్లు నాకు బహుమతుల్ని తెచ్చిపెట్టాయి. నా రచనలకు పుస్తక రూపమిచ్చే బాధ్యతని నా చిన్న చెల్లి శ్రీమతి షేక్. కాశింబీ నెరవేర్చారు. నా తొలి కథాసంపుటికి నా చిన్న కుమార్తె శ్రీమతి పర్వీన్ బాబి; రెండవ కథాసంపుటి ‘ఔరా అగ్గిరవ్వా’ కి చిన్న మనుమరాలు – కుమారి ఆస్మా షిరేన్ ముఖచిత్రాల నందించారు.
ప్రశ్న15. చివరగా నేటి తెలుగు సాహిత్యం సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చెబుతారా? మీ సూచన లేమిటి?
జ: తప్పకుండా! నిజం చెప్పాలంటే నేడు తెలుగు రచనలకి పాఠకులు కరువయ్యారు. పాత తరం వారు వయోభారం వలన విరివిగా చదవలేక పోతున్నారు. కొత్త తరం వారు తెలుగు రాక చదవలేక పోతున్నారు. పిలిచి ఊరికే పుస్తకం అందించినా చదివేవారు లేని దుస్థితి నెలకొన్నది. యూట్యూబ్‌ల వీక్షణా వరదలో యువతరం కొట్టుకుపోవడం ఎంతైనా విచారకరం.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తక పఠనాన్ని, తెలుగు భాష వాడకాన్నీ ప్రోత్సహించాలి. ప్రభుత్వం వారు గ్రంథాలయాల ద్వారా పఠనాసక్తిని పెంపొందించాలి. రచయితలకు తగిన ప్రోత్సహకాల నందించాలి. అప్పుడే తెలుగు సాహిత్యం గాడిన పడుతుందని నా అభిప్రాయం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు షేక్ మస్తాన్ వలి గారూ.
షేక్ మస్తాన్ వలి: ధన్యవాదాలండీ.
***
రచన: షేక్ మస్తాన్ వలి
ప్రచురణ: అస్మత్ పబ్లికేషన్స్, సికిందరాబాద్
పేజీలు: 120
వెల: ₹ 100/-
ప్రతులకు:
షేక్ మస్తాన్ వలి
ప్లాట్ నెం. 46, అశోక్ కాలనీ,
విజయా హైస్కూల్ వెనుక, కాప్రా,
ఇసిఐల్ పోస్ట్, సికిందరాబాద్ 500062
ఫోన్: 9440712591
~
‘ఔరా అగ్గిరవ్వా’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/auraa-aggiravvaa-book-review-kss/