రచయిత, జర్నలిస్ట్ శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు ప్రత్యేక ఇంటర్వ్యూ

0
3

[‘జీవనరాగాలు-1’ అనే ఆత్మకథని వెలువరించిన శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం తుర్లపాటి నాగభూషణ రావు గారూ.

తుర్లపాటి నాగభూషణ రావు: నమస్కారమండి, రండి కూర్చోండి.

~

ప్రశ్న 1. మీ జీవిత విశేషాలను పాఠకులతో పంచుకోవాలని ఎప్పుడు, ఎందుకు అనిపించింది?

జ: నా జీవిత విశేషాలు పాఠకులతో పంచుకుంటానని 2024 ఉగాది దాకా అనుకోలేదండి. నిజం చెబుతున్నాను. నేనో జర్నలిస్ట్ ని. అత్యంత సాధారణ జీవనం గడుపుతున్న ఓ మధ్యతరగతి కుటుంబీకుడ్ని. పైగా రిటైర్ అయిన వ్యక్తిని. ఉగాది పండుగప్పుడు మేము బెంగుళూరులోని మా అమ్మాయి దివ్య శ్రావణి వారింట్లో ఉన్నాము. ఉగాది పండుగకి నా జీవితంలోనే ఓ విశిష్ట స్థానం ఉంది. మరీ ముఖ్యంగా నేను ‘ఆంధ్రప్రభ’లో చేరినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ప్రతి ఏడూ ఉగాది నాడు ఏదో రకమైన సాహితీ సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొనడమో లేదా వాటిని నిర్వహించడమో చేయడం ఆనవాయితీగా మారింది. బహుశా ఇది ఆ భగవంతుడు నాకిచ్చిన వరం అనుకుంటాను. బెంగుళూరులో ఉన్నా, అలాగే మా అబ్బాయి ఉంటున్న బేసింగ్ స్ట్రోక్ – ఇంగ్లండ్‌లో ఉన్నా అక్కడి తెలుగు వారిని కలుసుకుని సాహితీ ముచ్చట్లు చేయడమో లేదా వ్యాసాలు వ్రాసి వివిధ మీడియాలకు పంపడమో చేస్తుంటాను. అదే క్రమంలో 2024 ఉగాది కూడా ‘తెలుగు తేజం’ అన్న పేరుతో ఓ వ్యాసం వ్రాసి నాకు తెలిసిన సాహితీ మిత్రులకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేశాను. మిత్రుల్లో కొందరు మీడియా వారూ ఉండటంతో ఆ వ్యాసం ఒకటి రెండు చోట్ల వెబ్ సైట్స్ లో వచ్చింది. ఆ సమయంలోనే నాకున్న మంచి మిత్రుల్లో ఒకరైన కస్తూరి మురళీకృష్ణ గారికి కూడా పంపాను. అలా పంపిన కాసేపటికి వారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు –

“ఇది మా ‘సంచిక’ కోసం ప్రత్యేకంగా వ్రాసినదేనా?”

“కాదండి” – నా సమాధానం.

“అలా అయితే తుర్లపాటి గారూ ఒక పని చేయండి, ఎక్స్‌క్లూజివ్‌గా వ్రాసి పంపండి”

“అలాగే అండీ. తప్పక పంపుతాను. ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలండీ, ఉగాది పండుగకూ నా జీవితానికి సాహీతీ సంస్కృతిక బంధం ఉన్నదండి. ఆంధ్రప్రభలో ఈ పండుగకే అనేక సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు నిర్వహించానండి. ఇప్పటికీ ఉగాది వస్తుందనగానే ఏదో చేయాలన్న తపన మాత్రం తగ్గలేదు” అంటూ చెప్పుకుపోతుంటే..

“ఓహ్ అలాగా, అయితే మీరో పని చేయండి. మీ అనుభవాలు ‘సంచిక’ కోసం ప్రత్యేకంగా వ్రాసి పంపండి. వేద్దాం. ఒక్క ఉగాది గురించే కాదు, అసలు మీ జీవిత విశేషాలు ఇద్దామండి. బాగుంటుంది”

కస్తూరి గారి ఈ మాటలు నాకెంతో ప్రోత్సాహం ఇచ్చాయి.

“సరే అండి వ్యాసం వ్రాసి పంపుతాను”

“ఒక వ్యాసం కాదండి, వారం వారం వ్రాయండి, మీ బోటి వారి అనుభవాలు, జ్ఞాపకాలు పాఠకుల్లో స్ఫూర్తి కలిగించవచ్చు”

“సరే” – అన్నాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను. నేనేదో ఒక వ్యాసం వ్రాసి సరిపెడదామంటే, కస్తూరి గారేమో ఏకంగా సీరియల్‌గా వ్రాయమంటున్నారు. నా మటుకు నాకు ఇదో ఛాలెంజ్. శ్రీమతితో ఈ విషయం చెబితే, తప్పకుండా వ్రాయండి. మీ దగ్గర అంత మేటరూ ఉంది. అంటూ ప్రోత్సహించింది.

అలా సంచిక – డైనమిక్ వెబ్ వారపత్రికకు వ్రాయడం మొదలుపెట్టాను. స్వీయచరిత్ర వ్రాయడం, అందునా నా బోటి వాడు వ్రాయడం సాహసమే. ఈ ‘సాహస’ సాహితీ యాత్రకు అలా కస్తూరి గారు ప్రేరణగా నిలిచారు. వారు బీజం వేశారు. అది ఇప్పుడు ‘జీవనరాగాలు-1’ పుస్తకం తీసుకువచ్చే స్థాయికి ఎదిగింది. ఇంకా శాఖోపశాఖలుగా జీవనరాగాలు పుస్తకం రెండవ భాగం దిశగా ఎదుగుతూనే ఉంది. సంచిక మేగజైన్‌లో – తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర పేరిట వారం వారం రచన సాగిస్తూనే మరో ప్రక్క అందులోని కొన్ని భాగాలను పుస్తకంగా ఇదిగో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను.

ప్రశ్న 2. మీ జీవనరాగాలను శ్రుతి చేయడానికి మీకు ఎవరి ఆత్మకథ ప్రేరణనిచ్చింది? ఎవరి స్వీయ చరిత్ర చదివినప్పుడు మీకు మీ స్వీయచరిత్ర రాయాలనే స్ఫూర్తి కలిగింది?

జ: నిజమే ప్రతి రచన వెనుక ఎక్కడో అక్కడ ఎవరిదో ఒకరి ప్రేరణ ఉంటుంది. కస్తూరి గారు అన్న మాటలు ప్రేరణగా నిలిచాయని చెప్పాను కదా. అయితే వ్రాయడం మొదలుపెట్టాక నా మిత్రుల్లో కొంత మంది (పరకాల రాజేశ్వర రావు, కస్తల విజయబాబు, రాజేష్ వంటి వారు) వారం వారం చదవడం మొదలుపెట్టి వారి అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. మొత్తంగా వారి అభిప్రాయం ఏమంటే, చూడటానికి స్వీయచరిత్రలా ఉన్నా, రచన సాగుతున్న తీరు విభిన్నంగా ఉంది. ఇది ముళ్లపూడి వారి ‘కోతి కొమ్మచి’ లాగానూ, మొక్కపాటి వారి ‘బారిష్టర్ పార్వతీశం’ లాగానూ, ఆర్ కె నారాయణ్ – ‘మాల్గొడి డేస్’ లాగానూ ఉందన్నారు. మా అబ్బాయి రాజేష్, అలాగే కస్తూరి గారు ఒక సూచన చేశారు. బాల్యంలో అనేక అనుభవాలు ఉంటాయి. వాటిని ముడిపెడుతూ మీ సాఫల్య యాత్రను కొనసాగించండని.

ప్రశ్న 3. మీ ఆత్మకథాత్మక కథనాలను సంచికవెబ్ పత్రిక ద్వారా పాఠకులకు చేర్చాలని ఎందుకు అనుకున్నారు?

జ: ‘సంచిక’ వెబ్ పత్రికలో ఏదైనా వ్రాయాలని కొంత కాలంగా అనుకుంటున్న మాట నిజమే. ఆస్ట్రేలియాలో ఉన్న మిత్రులు ఎం. సారథి గారు, అలాగే కస్తూరి గారు ఒకటి రెండు సందర్భాల్లో ప్రోత్సహించారు కూడా. ఏవేవో అనుకున్నాను కానీ కార్యరూపం దాల్చలేదు. ఆత్మకథ లేదా స్వీయచరిత్ర వ్రాయాలని మాత్రం అనుకోలేదు. ఆత్మకథలు వ్రాసేటంతటి గొప్పవాడిని కాదన్నది నా అభిప్రాయం. అయితే రచన కొనసాగిస్తుంటే, నాలో తపన మొదలైంది. నా అనుభవాలు, ఆలోచనలను ఇతరులకు పంచడానికీ, వారిలో ఎంతో కొంత స్ఫూర్తి నింపడానికి మరీ ముఖ్యంగా నేటి యువతకు, పిల్లలకు పనికి వచ్చే విధంగా వ్రాయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని అనుకున్నాను. అది నిజం అని ఇప్పుడు అనిపిస్తున్నది.

ప్రశ్న 4. జీవితంలోని ఒక్కో ఘటననీ ఒక్కో సందర్భంతో ముడిపెట్టి నవ్విస్తూనో, కాస్తంత ఏడ్పిస్తూనో లేదా అబ్బురపరుస్తూనో వ్రాయాలని ఎందుకు అనిపించింది?

జ: నవ్వడం, ఏడ్వడం, అబ్బుర పడటం ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరి జీవితంలోని ఫీలింగ్స్. వీటికి ఎవ్వరూ అతీతులు కారు. నవరసాలు లేని జీవనాన్ని ఊహించగలమా చెప్పండి. ఈ పుస్తకంలో 20 చాప్టర్లు ఉన్నాయి. చివరి చాప్టర్ మాత్రం రాబోయే రెండవ భాగానికి లింక్‌గా వ్రాశాను. 19 చాప్టర్లూ మీరన్నట్లు నవ్విస్తూనో, ఏడిపిస్తూనో.. అంతలో మళ్ళీ కవ్విస్తూనో, అబ్బుర పరుస్తూనో ఇలా మరి కొన్ని భావాలకు పెద్ద పీట వేస్తూ రచన సాగిందన్న మాట నిజమే. ఏ సంఘటన తీసుకున్నా ఆ టాపిక్ అన్నది పూలదండలోని దారం లాంటిది. ఆ దారం తెగకుండా పూలదండ తయారు చేయడం రచయితగా నా విధి. పైగా చిన్నా పెద్దా కలసి చదివేటట్లుగా నా రచన సాగాలన్నది నా అభిప్రాయం. అందుకే ప్రతి చాప్టర్‌లో ఎన్నో సంఘటనలు చెబుతున్నప్పటికీ పాఠకుడు ఏకబిగిన చదివించేలా చూడటమే నా ఉద్దేశం. ఇది సఫలమైందనడానికి ఓ పాఠకుని కామెంట్ ని ముచ్చటిస్తాను. – “మీ పుస్తకం అందినదండి. ఏకబిగిన గంటన్నర సేపు చదివించింది మీ రచన” – అని మెసేజ్ పెట్టారు. నా లక్ష్యం నెరవేరుతుందనే భావిస్తున్నాను. మనం ఏం వ్రాశామన్న దానికంటే మనం వ్రాసింది పాఠకుని చేత చదవింప జేయగలుగుతున్నామా లేదా అన్నది చాలా కీలకమైనది. అందుకే ప్రతి చాప్టర్‌ని పాఠకుడ్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే వ్రాశాను. స్వీయచరిత్ర అయినప్పటికీ నేను, నా భావాలు వంటి వాటిని ప్రక్కన పెట్టి వ్రాశాను. అందుకే ఓ మిత్రుడు అన్నాడు – స్వీయచరిత్ర వ్రాయడంలో ఇదో కొత్త ఒరవడి – అని. బెంగుళూరులో ఉంటున్న శాస్త్రవేత్త ఈ పుస్తకం కేవలం స్వీయచరిత్ర కాదూ, ఇందులో అనేక అంశాలు అదనంగా ఉన్నాయని అన్నారు. నిజమే ఈ పుస్తకంలో సందర్భోచితంగా 60, 70, 80 దశకాల్లోని సామాజిక జీవన స్థితిగతులు, ఆర్థిక అంశాలు, ఆ రోజుల్లో వాడిన వస్తువులు వంటి వాటి గురించి చెప్పడం జరిగింది.

ప్రశ్న 5. కొన్ని కథనాలను మరీ హాస్యంగా చెబితే, విషయం పలచబడిపోయే ప్రమాదం ఉందని అనిపించలేదా?

జ: సీరియస్ మేటర్‌ని చెబుతూ కూడా హాస్యపు జల్లులు కురిపించడమేమిటనేగా మీ సందేహం. నిజమే , ఈ రెండూ కలపడం కొంత గందరగోళం సృష్టించవచ్చు. అయితే ఉగాది పచ్చడిని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. షడ్రుచుల సమ్మేళనమేగా జీవితమంటే. టాపిక్ లింక్ తెగకుండా, చెప్పదలచుకున్న సీరియస్ మేటర్ లోకి ఒకేసారి దూకేయడం కంటే, సున్నితంగా, చమత్కారంగానే సంఘటనను ప్రస్తావిస్తూ నిదానంగా సీరియస్ అనే చీకటిలోకి పాఠకుడ్ని తీసుకువెళ్ళి, ఆ వెంటనే పరిష్కారం చెబుతూ వెలుగులోకి పాఠకులను తీసుకువచ్చేయడం నా ఉద్దేశం. దీని ద్వారా పాఠకునిలో వ్యక్తిత్వ వికాసం, కష్టాలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసం వంటివి అబ్బుతాయి. మరోక విషయం ఏమంటే, కష్టాలు ఎవరికైనా వస్తుంటాయి. అవి నిలకడగా ఉండవు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధను తగ్గించే అసలు సిసలైన టానిక్ – హాస్య రసం. నిజమండి, ఓ సారి ఆలోచించండి. మనం సీరియస్‌గా ఉన్నంత మాత్రాన, అరుపులు కేకలు పెట్టినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారమవుతుందా. కాదు కదా. ఓ ఇంటి ఓనర్ తాను అద్దెకిచ్చిన వ్యక్తిని ఖాళీ చేయించాలనుకున్నాడు. అతగాడేమో ఖాళీ చేయడంలేదు. పైగా ఖాళీ చేయించాలంటే నీ తలలోని జేజేమ్మ దిగిరావాలని ఓనర్‌ని బెదరించాడు. అప్పుడు ఆ ఓనర్ ఇలా అన్నాడు – జేజేమ్మ దాకా ఎందుకు, మనూరి గ్రామదేవత చాలు కదా – అని. దీంతో ఆ టెనెంట్ కూలై పోయాడు. ఆలోచనలో పడ్డాడు.

ప్రశ్న 6. మీ జీవనరాగాలు-1లో ఎక్కువగా బాల్యంతో ముడిపడ్డ ఘటనలే ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఏమిటంటారు? బాల్యం ప్రభావం మిగతా రెండు దశలపై అమితంగా ఉందా?

జ: అవునండి. బాల్యంలో జరిగే అనేక సంఘటనలు ఆ తర్వాత సాగే జీవనంలోని గెలపు ఓటమిలకు బీజాలు వంటివే. మనలో చాలా మంది గుర్తించరు, వయసులో ఉన్నప్పుడు వారు సాధించిన విజయం లేదా అపజయం వెనుక బాల్యంలోని ఓ సంఘటన వద్దనే వీటికి బీజం పడి ఉంటుందని. ఒక వ్యక్తి కలెక్టర్ అయినా, మరో వ్యక్తి కండెక్టర్ అయినా ఇంకో వ్యక్తి డాక్టర్ అయినా ఏదో ఒక బలమైన బాల్య సంఘటన దీనికి హేతువు అవుతుంది. నా విషయంలోనూ అలాగే జరిగింది. ‘పలికింది ఆకాశవాణి’ – చాప్టర్ తీసుకోండి. ఇందులో ఎనిమిదేళ్ల పిల్లాడు ఓ ఇంట్లో రేడియో పెట్టెను చాలా ఆశ్చర్యంగా చూసి మాట్లాడే పెట్టె లోకి దూరి తానూ కబుర్లు చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత అతగాడి జీవనయానంలో ఈ కల నిజమైంది. రేడియోలో వార్తలు చదివగలిగాడు. నాటికలు, రూపకాలు రేడియో కోసం వ్రాయగలిగాడు. అంటే చిన్ననాటి కలను పెద్దయ్యాక తీర్చుకుని సంబరపడ్డాడు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్‌కి ప్రోగ్రామ్ డైరెక్టర్ కాగలిగాడు. మధ్యలో అంటే 70వ దశకం చివర్లో తన స్నేహితుడు విష్ణుతో కలిసి రేడియో స్టేషన్ పెట్టి సంచలనం సృష్టించాడు. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందండి. పెద్దయ్యాక ఒక స్థాయికి ఎదగడానికి చిన్నప్పటి కలలు, కోరికలే కారణమని అనిపించడం లేదా.

మరో ఉదాహరణ – బెల్ట్ మాష్టారు – చాప్టర్ తీసుకోండి. ఇందులో సోషల్ పుస్తకం తెరిస్తే చాలు, యుద్ధాలు, చంపుకోవడాలు.. వంటివి ఆ పిల్లాడి బుర్రకెక్కలేదు. సోషలే ఇలా ఉంటే లెక్కలైతే మరీ దారుణం. పానిపట్టు యుద్ధం చదవడం కష్టమైనా దాన్ని గోళీల సాయంతో ఒక ప్రక్క ఆడుతూనే మరో ప్రక్క చదువుకున్నాడని వ్రాశాను. ఈ సంఘటన వల్ల ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చనీ, అలాగే క్రియేటివిటీ పెరగడానికి ఇలాంటి విద్యావిధానం అవసరమని ఆ రోజుల్లోనే (70వ దశకంలోనే) ఆ పిల్లాడు గుర్తించాడు. అంతే కాదు గోళీలనే రాజులుగా, సైనికులుగా మలుస్తూ ఆడటం అనే ప్రక్రియ వల్ల ఆ తర్వాత నాటక రచనలో అతను ఎలా పట్టు సంపాదించుకున్నాడో, ఆకాశవాణి నుంచి జాతీయ ప్రతిభా పురస్కారం ఎలా అందుకున్నాడో చెప్పాను. అలాగే లెక్కల మాష్టారు బెల్ట్ దెబ్బల సంఘటన ద్వారా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కునే తత్వం అలవడిందనీ, జర్నలిజం కెరీర్‌లో కూడా ఇలాంటి వారి వల్ల పునాదులు గట్టిపడ్డాయనీ చెప్పాను. అంటే ఈ చాప్టర్ బాల్య సంఘటనతో మొదలైనా పెద్దయ్యాక నా ఎదుగుదలను కూడా ప్రస్తావించాను కదా. ఈ రకంగా చూస్తే కేవలం బాల్య సంఘటనలతోనే ‘జీవనరాగాలు-1’ నిండిపోయిందని అనుకోకూడదు. ప్రతి చాప్టర్ లోనూ వ్యక్తి వికాసంతో కూడిన సంపూర్ణత చూపగలిగాను. ఏ చాప్టర్‌కి ఆ చాప్టర్ లోనే కలలు కనే కళ్ల నుంచి కలలను సాకారం చేసుకునే సాఫల్యత వరకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొదటి భాగం కేవలం బాల్యంలోని అనుభవాలను, మరో భాగంలో కెరీర్, రిటైర్‌మెంట్ లైఫ్ వంటివి ఉంటాయని అనుకునే అవకాశం ఇవ్వలేదు. ఎంచుకున్న టాపిక్‌తో లింక్ అయిన సంఘటనలను – బాల్యం నుంచి ఇప్పటి వరకు అంటే ఆరుపదుల వయసు వరకు కూడా తీసుకుంటూ అల్లుకుంటూ వ్యక్తి ఎదుగుదలను పాఠకులకు అందించే ప్రయత్నం చేశాను కనుకనే ప్రతి చాప్టర్ వేగంగా, చురుగ్గా ఆలోచించే రీతిలో సాగింది. నాటకీయత వల్ల దృశ్యమాధ్యంలో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

ప్రశ్న 7. ఎమ్.ఎస్.సి స్టూడెంట్‍గా ముగిసిన విద్యాభ్యాసం తరువాత రకరకాల ఉద్యోగాలు చేసి, చివరికి జర్నలిస్ట్‌గా స్థిరపడ్డారు. ఈ క్రమంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన ఉద్యోగం ఏది?

జ: నేను చదువుకుంటున్నప్పుడే లెక్చరర్ కావాలనుకున్నాను. అయ్యాను కూడా. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఓ ప్రైవేట్ కాలేజీలో బోటనీ సబ్జెక్ట్ టీచ్ చేశాను. అంతే కాదు, ఎంబీబీఎస్ ఎంట్రెన్స్‌కి వెళ్ళే విద్యార్థులకు బోటనీ బోధించాను. అయితే నేను ‘ఈనాడు’ పత్రిక కోసం వ్రాసిన ఒక వ్యాసం నన్ను జర్నలిస్ట్‌గా తీర్చిదిద్దింది. ‘ఈ పడవకెంత దిగులో..’ – అన్న చాప్టర్‌లో ఇదంతా ఎలా జరిగిందో వ్రాశాను. ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేసినా, టివీ5లో చేసినా తరంగా రేడియో స్టేషన్‌కి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నా, వెబ్ పత్రికల్లో కాలమిస్ట్‌గా ఉన్నా వాటన్నింటిలో జర్నలిజం అనే కోణం దాగుంది. చివరకు నాటకాలు వ్రాసినా కూడా నాలోని జర్నలిస్ట్ – ఏది ఎంత వ్రాయాలీ, ఎలా వ్రాయాలన్న విషయాలను నిర్దేశిస్తుంటాడు. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే, నేను ఎంచుకున్న వృత్తులు పైకి వేరువేరు అనిపించినా వాటన్నింటికీ ఆధారమైనది జర్నలిజం అనే దారమే. అందుకే నాకు అదే ఇష్టమైన వృత్తి. ఆర్థికంగా బాగా ఎదగలేక పోవచ్చేమో కానీ, ఓ మంచి రచయితగా, జర్నలిస్ట్‌గా నిలవగలిగాను. చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను సాకారం చేయడంలో ఈ జర్నలిజమే నాకు తోడుగా నిలిచింది.. నిలుస్తున్నది.

ప్రశ్న 8. దిగువ మధ్య తరగతి నుంచి మొదలైన జీవన ప్రస్థానంలో, ఎగువ మధ్య తరగతికి లేదా ఆర్థికంగా దిగులు లేని స్థితికి ఎదిగిన క్రమంలో ఎప్పుడైనా చిన్ననాటి లేదా పెద్దల ద్వారా సంక్రమించిన విలువలను వదులుకున్నట్టో లేక రాజీపడినట్టో అనిపించిందా?

జ: అనిపించలేదండి. నిజానికి నేను బాల్య స్నేహితుల నుంచి మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలను ఇప్పటికీ పదిలంగా నా హృదయంలో దాచుకున్నాను. వాటిలో కొన్ని ఈ ‘జీవనరాగాలు-1’ పుస్తకం ద్వారా పాఠకులకు తెలియజేయగలిగాను. ఆనాటి జ్ఞాపకాలు, విలువలు కలిగిన జీవితం – ఇలాంటివన్నీ నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తుంటాయి. చిన్ననాటి స్నేహితులను, పెద్దలను ఆత్మీయంగా ఇప్పటికీ అక్కున జేర్చుకుంటూనే ఉంటాను. అంత దాకా ఎందుకు, మీరు ఈ ఇంటర్వ్యూకి రావడానికి కొద్ది రోజుల ముందే, హైదరాబాద్‌లో ఈ పుస్తకం ఆవిష్కరణ సభ పెట్టాను. అయితే దీన్ని ఓ ఆత్మీయ సమ్మేళనంగా తీర్చిదిద్దాను. చిన్ననాటి స్నేహితులు తరలి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారిని సత్కరించాను. అలాగే ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరణ సభ నందిగామలో మా బంధువులు, స్నేహితుల మధ్య – ప్రస్తుత (2024) నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి చేతుల మీదగా ఆవిష్కరింపజేశాను. ఆ రకంగా బంధువుల నుంచీ, ఊరి పెద్దల నుంచి కొన్ని జీవన విలువలను గుర్తుచేసుకోగలిగాను. నాటి జీవన విలువలను ఎప్పుడూ వదులుకోలేదూ, రాజీ పడలేదు.

ప్రశ్న 9. మీ వృత్తిపరమైన జీవితంలో మిమ్మల్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులెవరు? ఎందుకు?

జ: జర్నలిజమే నా వృత్తి. అంటే ప్రతి రోజూ ఏదో అంశంపై రాస్తూనే ఉండాలి. అందుకే నాలోని రచయిత ప్రతి రోజూ మేల్కుంటూనే ఉండేవాడు. ఎప్పటికప్పుడు వినూత్న ప్రక్రియల్లో రచన సాగించే అవకాశం నాకు జర్నలిజం వృత్తి అందించింది. ఒక వార్తను కేవలం న్యూస్ చేరవేయడం కోసమే అన్నట్లూ వ్రాయవచ్చు. అదే వార్తను ఆకర్షణీయంగానూ వ్రాయవచ్చు. ఇంకోసారి రూపకంగానూ మలచవచ్చు. నాటికకు కథావస్తువుగా ఆ వార్తను తీసుకోవచ్చు. ఇలా రచనలోని అన్ని రూపాలను స్పృశిస్తూ వ్రాయగలిగే నేర్పు అబ్బింది. కాలేజీ చదువుల నాటి నుంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు. బారిష్టర్ పార్వతీశం, విశ్వరూపం, నరావతారం నుంచి వేమన శతక పద్యాలు, అన్నమాచార్య కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు వంటివీ చదివాను. అలాగే యండమూరి వారి రచనలు చదువుతున్నప్పుడు ప్రేరణ పొందాను. ఎలా వ్రాస్తే చదివే వారికి ఆసక్తి పెరుగుతుందో నేర్చుకోగలిగాను. ఇక వృత్తిపరంగా నా గురువులు (పొత్తూరి వారు, దీక్షితులు గారు, వరదాచారి గారు, పతంజలి గారు, కొండవీటి వెంకట కవి గారు ఇలా చాలా మంది) నుంచి ఎన్నో నేర్చుకున్నాను.

ప్రశ్న 10. మీ కుటుంబ సభ్యులలో మిమ్మల్ని అమితంగా ప్రోత్సహించిన వారెవరు? ఎవరి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీ నుంచి మీ తరువాతి తరం వారు నేర్చుకున్న విషయాలు ఏవని మీరు అనుకుంటున్నారు?

జ: చక్కటి కుటుంబ సభ్యులు లభించడం నిజంగా నా అదృష్టమండి. జీవితంలో మనం చేసిన ప్రతి పనీ అద్బుతాలు సృష్టించదు. చాలా ఫెయిల్ అవుతూనే ఉంటాయి. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నేను తలపెట్టిన ప్రతి పనినీ వారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. డబ్బుతో ముడి పెట్టకుండా ఇలా సపోర్ట్ చేయడం ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పైసా రాదు అని తెలిసినా ప్రోత్సహించే వారు ఎందరుంటారు చెప్పండి. అసలు డబ్బులు రావని తెలిసినా ఆరు పదులు దాటిన ఈ వయసులో తెల్లవారుఝామునే లేచి వ్రాయడం వంటివి నేను చేయడం, వాటిని కుటుంబసభ్యులు ప్రోత్సహించమేమిటి చెప్పండి. మంచి పని అని చెప్పగానే నా శ్రీమతి, పిల్లలు – ‘మీకు ఓపిక ఉంటే ఆ పని చేయండి’ అనే అంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. మూడు నెలలు మంచం మీదనే. కాస్తంత ఓపిక రాగానే నేను ల్యాప్‌టాప్ తీసుకుని నా సొంత ఛానెల్ పనులు మొదలుపెట్టాను. వెరైటీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాను. అయినప్పటికీ కుటుంబసభ్యులు వద్దని వారించలేదు. నచ్చిన కాలక్షేపం అని వదిలేశారు. ఇక, నా తర్వాతి తరం వారు ఏం నేర్చుకున్నారని అడిగారు కదా.. ‘జీవనరాగాలు’ పుస్తకావిష్కరణ సమయంలో మా అబ్బాయి రాజేష్, అమ్మాయి దివ్య శ్రావణి తమ సందేశాలు పంపారు. వారిద్దరూ వృత్తిపరంగా యుకెలో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. వారి సందేశాలు విన్న వారిలో కొంత మంది ఆ తర్వాత నాకు మెసేజ్‌లు పెట్టారు. “మీరు పెంచుకున్న విలువలను మీ పిల్లలకు, వారి పిల్లలకు చక్కగా పంచిపెడుతున్నారండీ, ఇదే మీరు సాధించుకున్న అసలైన జీవన సాఫల్యం” – అంటూ వ్రాశారు. నా కళ్లు చెమ్మగిల్లాయి. అలాగే “మీ తాత వ్యక్తిత్వం ఇదిరా..” అంటూ మనవళ్లకు నా పిల్లలు చెబుతుంటే నాకనిపిస్తోంది నా నుంచి ‘పెద్ద ఆస్తి’ వారికి అందుతున్నదని. అదే, విలువతో కూడిన జీవనం. ఇంటి పెద్దగా ఇంతకంటే నేను కోరుకునే ఆనందం మరొకటి ఏముంటుంది చెప్పండి.

(తుర్లపాటి గారు – చెమర్చిన కళ్లు తుడుచుకున్నారు)

ప్రశ్న11. ఈ స్వీయ చరిత్ర పుస్తక రూపంలో తెమ్మని సూచించినది మీ శ్రీమతి శ్రీదేవి గారని ఒకచోట వ్రాశారు. మీ శ్రీమతి గారిలో మీకు నచ్చే అతి ముఖ్యమైన గుణం ఏమిటి? ఆవిడ మీకిచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?

జ: సూటిగా చెప్పాలంటే, ఆమెలో నచ్చిన గుణం: ఓర్పు – సహనం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు కలిగినా ఈ రెండు గుణాలతో చివరకు ఆమె గెలవడమే కాదు, మమ్మల్నందరినీ గెలిపిస్తున్నది. ఆమె షిర్డీ సాయిబాబా భక్తురాలు. దీంతో మా కుటుంబమంతా బాబా వారు చూపిన మార్గంలోనే సాగుతుంటాము. శ్రీదేవి ఎక్కువగా ఆలోచిస్తుంది. తక్కువగా మాట్లాడుతుంది. క్రైసెస్ మేనేజ్‌మెంట్ తెలిసిన మనిషి. ఇక ఆమె నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటని అడిగారు కదా.. ‘నా మాట వింటారు కానీ వినరు’ – పైకి చూడటానికి భిన్నమైన కితాబుగా అనిపించినప్పటికీ నాకు ఇది మంచి కాంప్లిమెంట్. ఆమె సలహాలు తీసుకుంటాను. వాటి గురించి ఆలోచిస్తాను. నచ్చితే చేస్తాను. నచ్చకపోతే కూల్ గానే ప్రక్కన పెడతాను. మా వైవాహిక జీవితానికి 40 ఏళ్లు కావస్తున్నా మేమెప్పుడూ అరుచుకోలేదు. గొడవలు పడలేదు. అంత దాకా పరిస్థితి ఇద్దరమూ తెచ్చుకోము. ఆవిడ తన మాట వినకపోయినా ఏమీ ఫీలవదు. సలహా అడిగితే చెబుతుంది అంతే. అందుకే – నేను ‘వినీ వినని మొగుడ్ని’ అయ్యానన్న మాట.

ప్రశ్న12. మాన్యులు మన్నవ గిరిధరరావు గారు మీ మామగారు. మీ వివాహం కాకముందు, వారి రచనలు ఏవైనా చదివారా? వారు వ్రాసిన కాంతి రేఖలుఎందరికో గొప్ప ప్రేరణ! వారితో మీకున్న అనుబంధంలో ఏదైనా విశేష సంఘటనని పాఠకులతో పంచుకుంటారా?

జ. ఈ ప్రశ్నకు సంపూర్ణంగా సమాధానం చెప్పడం ఈ ఇంటర్వ్యూలో సాధ్యం కాదండి. సంచికలో వస్తున్న ఫీచర్ – తుర్లపాటి సాఫల్య యాత్ర – గమనంలోనే వీలు చిక్కినప్పుడల్లా సందర్భోచితంగా మామగారు మన్నవ గిరిధర రావు గారి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. మన్నవ గిరిధర రావు గారి గురించి నా పెళ్ళికి ముందు తెలియదు. వారి పెద్దమ్మాయి శ్రీదేవి- నా శ్రీమతి. పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓ సారి వారు ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్‌కు వచ్చి నా గురించి వాకబు చేశారు. ఆనాటి న్యూస్ ఎడిటర్ దగ్గర నుంచి సబ్ ఎడిటర్ మిత్రుల వరకు అంతా ఎవరి పాత్ర వారు పోషించి ఈ సంబంధం కుదిరేలా చేశారు. ఆ తర్వాత తెలిసింది వారి పూర్తి వ్యక్తిత్వం, అభ్యుదయ భావజాలం, రచనా పటిమ, సామాజిక స్పృహ, మంచితనం.. వంటివి. వారితో ఎప్పుడు మాట్లాడినా జీవితానికి పనికొచ్చే ‘మణిపూసలను’ ఏరుకునే వాడ్ని. వారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం తరచూ నన్ను బాధించే విషయం. ఉండి ఉంటే నా యీ ‘జీవనరాగాలు’ పుస్తకం చూసి చాలా సంతోషించే వారు. ఓ సందర్భంలో – “అల్లుడు గారు, ఏదైనా ఏకబిగిన రాస్తుంటారు, నా లాగా రఫ్, ఫెయిర్ కాపీలు ఉండవు” – అని మా ఆవిడతో అన్నారు. నాకు తెలుసు, ఇదంతా కేవలం నన్ను ప్రోత్సహించడానికే అని. మా పిల్లలకు ఈ తాతగారు ఆదర్శం. వారు వ్రాసిన పుస్తకాలు – కాంతిరేఖలు, మణిపూసలు, పనికొచ్చే కథలు, ఎమ్మెల్యే ఆత్మకథ, అప్రస్తుత ప్రసంగం, హిందూధర్మ వైభవం వంటివి నేను చదివాను. అంతే కాదు, అందులోని అనేక అంశాలను నోట్ చేసుకుని నా రచనల్లో ప్రస్తావిస్తుండే వాడ్ని. వారు కొంత కాలం ‘భారతీయమార్గం’ మాసపత్రికను ఎంతో చిత్తశుద్ధితో నడిపారు. జాగృతి మాసపత్రికలో కాలమ్స్ వ్రాశారు. ఇప్పటికీ కొంత మంది మిత్రులు వీరిని గుర్తుచేసుకుంటూ, ఈ రచనల్లోని అంశాలను కోట్ చేస్తూ ప్రసంగాలు చేస్తుంటామనీ, వ్రాస్తుంటామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇది నాకూ, మా ఆవిడకు ఎంతో సంతోషం కలిగించే మాటలు. మన్నవ గిరిధర రావు గారి గురించి ఈ జీవనరాగాలు పుస్తకంలో ఎక్కువ వ్రాయలేకపోవచ్చు. కానీ సమయం వస్తే, వారి జీవన యాత్ర గురించి వ్రాయాలని ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో ఆ ఈశ్వరేచ్ఛ.

ప్రశ్న13. మీ స్వీయ చరిత్ర ద్వారా మీకు మీ సొంతూరు నందిగామ అంటే బాగా ఇష్టమని అర్థమవుతుంది. నందిగామ అభివృద్ధిలో పాలుపంచుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పటికే అటువంటి కార్యక్రమాలలో భాగం పంచుకున్నారా? వివరించండి.

జ: ఎవరికి ఉండదు చెప్పండి, సొంత ఊరు మీద ప్రేమ, అభిమానం అందరిలో ఉంటాయి. కాకపోతే ఈ ఫాస్ట్ ట్రెండింగ్ లైఫ్‌లో చాలా మంది సొంత ఊర్ల నుండి చాలా కాలం క్రిందటనే వేరే ఊర్లకు తరలి వెళ్ళిపోయారు. దీంతో వారికి సొంత ఊరు దూరం అయి ఉండవచ్చు. కానీ మా కుటుంబం మాత్రం తరచుగా వెళ్ళి అక్కడో పదిహేను రోజులు ఉండి వస్తాము. అక్కడ కూడా సొంత ఇల్లు ఉంది. అక్కడి వారంతా నన్ను ప్రేమగా నాగరాజు అనే పిలుస్తారు. పుట్టిన ఊరైన అడవి రావులపాడు వెళితే ఇప్పటికీ కొంత మంది ‘చిన్నబ్బాయి గారు’ అనే పిలుస్తుంటారు. అందుకే నా మనసులో చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. కదిలిస్తే కథలెన్నో చెబుతాయి. నందిగామ అంటే ఇష్టం, ప్రాణం. అందుకే నందిగామ అభివృద్ధికి ఎన్నో సేవలు చేయాలనే ఉంది. మొన్నీ మధ్య ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మా దంపతులను సత్కరిస్తూ, ‘తుర్లపాటి గారి సేవలను ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది’ – అని సభాముఖంగా చెప్పారు.

మంచిని పెంచే ఏ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నా నేను సపోర్ట్ చేస్తాను. ఈ కోణంలో నాకంటూ ప్రత్యేక బాధ్యతలను అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని ఆ రోజు సభలో స్పందించాను. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడే ఉన్నాను. 68 ఏళ్లలో కూడా తెల్లవారుఝామునే నిద్రలేవడం నాకు అలవాటు. ఎక్కువగా ఆ సమయంలోనే నా రచనా వ్యాసంగం సాగిస్తుంటాను. మనసు, శరీరం ఉత్సాహంగా ఉన్నంత కాలం ఈ అక్షర యజ్ఞం సాగుతూనే ఉంటుంది. ఇదంతా జగన్మాత సంకల్పం. నేను నిమిత్తమాత్రుడిని.

ప్రశ్న14. ఈ జీవనరాగాలు మొదటి భాగం పై పాఠకుల అభిప్రాయం ఎలా ఉంది? పుస్తకాల అమ్మకాలు ఎలా ఉన్నాయి?

జ: చక్కటి స్పందన వస్తున్నదండి. ఓ పాఠకుడు స్పందిస్తూ – ఈ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు ‘నాన్ డిటైల్’ (ఉప వాచకం)గా ఉంచాలని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల విద్యా శాఖాధికారుల దృష్టికి ఈ పుస్తకాన్ని తీసుకువెళ్ళాలని కోరారు. జీవనరాగాలు పుస్తకంలోని ప్రతి పేజీ పిల్లల ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉందని ఇంకో వ్యక్తి స్పందించారు. ఈ రచన ‘సంచిక’ డైనమిక్ వెబ్ వీక్లీలో వస్తున్నప్పుడే చక్కటి స్పందన మొదలైంది. ఇప్పుడు పుస్తక రూపం దాల్చింది. మంచి విషయాల సమాహారంగా ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు పాఠక లోకం తప్పకుండా ఆదరిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఇక అమ్మకాలంటారా.. ఇప్పుడే మొదలైంది. అది ఏ తీరాలకు చేరుతుందో, ఎలా సాగుతుందో చూద్దాం.

ప్రశ్న15. జీవనరాగాలు- రెండవ భాగం పుస్తకంగా ఎప్పటికి రావచ్చు? మొదటి భాగంలో స్పృశించని అంశాలు రెండవ భాగంలో ఏమి ఉండబోతున్నయో మొదటి భాగంలో చివర్లో రేఖామాత్రంగా తెలిపారు. వాటిలో ఏది హైలైట్ అని మీరు భావిస్తున్నారు?

జ: జీవనరాగాలు పార్ట్ 2 పుస్తకం రావడానికి మరో కొంత కాలం ఆగాలి. ఎందుకంటే ‘సంచిక’ వెబ్ డైనమిక్ వీక్లీలో సాఫల్య యాత్ర కొనసాగుతూనే ఉంది. జీవనరాగాలు మొదటి భాగం కోసం 19 చాప్టర్స్ తీసుకున్నాను. అంటే 20వ చాప్టర్ నుంచి నవంబర్ 10 నాటికి 32 చాప్టర్స్ పూర్తవుతాయి. అంటే రెండవ పుస్తకం కోసం 13 భాగాల రచన పూర్తయింది. మరో రెండు నెలలకి మొదటి పుస్తకానికి కొనసాగింపుగా 20 చాప్టర్లు సిద్ధమవుతాయన్న మాట. అప్పుడు జీవనరాగాలు-2 పుస్తకం ప్రింట్ ప్రారంభించాలని అనుకుంటున్నాను. మూడవ పుస్తకం కూడా వస్తుందా రాదా అని ఇప్పుడే అడగకండేం. (నవ్వు) సరే, జీవనరాగాలు-2 లో కూడా ఇదే ఒరవడి ఉంటుంది. ఎక్కడా తగ్గేదే లేదు. కచ్చితంగా ఈ పుస్తకం కూడా పాఠకులను ఆకర్షిస్తుంది. మొదటి పుస్తకం మొదటి చాప్టర్ – ‘ఎలుక పుట్టింది’- పుస్తకం చదువుతున్న వారికి తెలుసు కదా. రెండవ పుస్తకంలో తొలి చాప్టర్ – ‘సింహం నవ్వింది’. మరి ఈ ‘సింహం’ ఎవరో తెలుసుకోవాలంటే రెండవ పుస్తకం కోసం ఆగాలి మరి. మొదటి భాగం పుస్తకాన్ని ఇప్పుడు ఇంగ్లీష్‌లో కూడా అనువదిస్తున్నాము. ఆ పని చురుగ్గానే సాగుతోంది. ఇతర దేశాల్లోని తెలుగు కుటుంబాల్లోని పిల్లలను, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల తెలుగు నేర్చుకోని పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇంగ్లీష్ వర్షెన్ మొదలుపెట్టాను. దీన్ని కూడా బుక్‌గా తీసుకు వస్తాము. చూద్దాం, ఈ జీవనరాగాలు ఎన్ని తీరాలు దాటుతుందో..

ఇక, జీవనరాగాలు పుస్తకంలో ఏది హైలెట్‌గా ఉండబోతుందంటే, ఒక రచయితగా నేను చెప్పేది ఒకటే – ఆధ్యాత్మిక చింతన. జీవనయాత్రలోని చివరి మజలీ. ఇప్పటికే ఈ చింతన మొదలైంది. నేను అన్న భావన నుంచి బయటపడుతున్నాను. అంటే – ‘నేను చేశాను, నేను గొప్ప’ అన్న భావన నుంచి ఈ విశ్వాన్ని నడిపించే అద్భుత శక్తి మనందర్నీ నడిపిస్తున్నదన్న భావన దిశగా సాగుతున్నాను. ఇక మిగిలిన నా జీవనయాత్రలో ఏది జరిగినా అది అమ్మవారి ప్రసాదంగానే భావిస్తాను. ముగురమ్మల మూలపుటమ్మ – కనకదుర్గమ్మను స్మరించుకుంటూ స్వస్తి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు తుర్లపాటి నాగభూషణ రావు గారూ.

తుర్లపాటి నాగభూషణ రావు: ధన్యవాదాలు.

***

జీవనరాగాలు-1 (స్వీయచరిత్ర)
రచన: తుర్లపాటి నాగభూషణ రావు
పేజీలు: 272
వెల: 295/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
రచయిత: 9885292208

 

 

 

 

 

~

‘జీవనరాగాలు-1’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/jeevana-raagaalu-1-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here