Site icon Sanchika

కవి, సంపాదకులు శ్రీ విల్సన్‍రావు కొమ్మవరపు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘నాగలి కూడా ఆయుధమే..!’ అనే కవితాసంపుటిని వెలువరించిన విల్సన్‍రావు కొమ్మవరపు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం విల్సన్‍రావు కొమ్మవరపు గారూ.

విల్సన్‍రావు కొమ్మవరపు: నమస్కారం సార్.

~

ప్రశ్న 1. నాగలి కూడా ఆయుధమే..!కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఈ సంపుటిలోని కవితల ఏకసూత్రతని వివరిస్తారా?

జ: ముందుగా మీకు ధన్యవాదాలు సార్. నా కవితా సంపుటిని పూర్తిగా చదివి, నా కవిత్వంపై ముఖాముఖిలో మీతో పాల్గోవడానికి నాకు అవకాశం ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. అంతేగాకుండా ఎంతోమంది సాహితీవేత్తల, సాహిత్య పాఠకుల ఆదరణ పొందిన ‘సంచిక’తో ముఖాముఖి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

ఇక మీరు సంధించిన పూలబాణం గురించి చెప్పాలంటే: ఒక కవితా సంపుటిలో వస్తు వైవిధ్యంతో పాటు ఆయా కవితా వస్తువుల మధ్య భావపరమైన ఏకసూత్రత ఉండాలి. త్యాగభరితమైన, బహుముఖీన రైతు జీవన ఔన్నత్యం, ప్రపంచీకరణ సంక్షోభంలో రైతు దుస్థితి, రైతును కాపాడుకుంటే రాజ్యాన్ని కాపాడుకున్నట్లు అనే ఎరుక, శ్రామిక దృక్పథం, దళిత దృక్పథం, ఈ భావనల్లో నుండి జీవన తాత్త్విక దృష్టిని అర్థం చేసుకోవాలనే ఉదాత్త సందేశం ఈ సంపుటి నిండా పరుచుకొని ఉన్నది. కుటుంబ సంబంధాల సోయి, మానవ అనుబంధాల దృష్టి, అంతిమంగా నాణ్యమైన మనిషితనం కోసం అన్వేషణ, ఉత్పత్తి సమూహాల కష్టనష్టాలు ఈ సంపుటిలో దర్శనమిస్తాయి. ఈ విధంగా ఈ సంపుటిలోని ఏకసూత్రతను అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న 2. నాగలి కూడా ఆయుధమే..!అనే శీర్షికని ఈ సంపుటిలోని రెండు కవితలకు ఎంచుకోవడంలో మీ ఆలోచన ఏమిటి? కవితా పరంగా కొనసాగింపు కాకపోయినా రైతుల సమస్యల ప్రస్తావన కొనసాగింపు కాబట్టి రెండో కవితకి కూడా అదే పేరు ఎంచుకున్నారా? ఈ రెండు కవితల్లో పత్రికలో ముందుగా ప్రచురితమైన కవితని (జనవరి 2021) పుస్తకంలో రెండో కవితగా ఎంచుకోవడంలోని ఆంతర్యమేమిటో వివరిస్తారా?

జ: హ్హా.హ్హా..మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా సార్. ఒకే వస్తువును వివిధ రకాలుగా దర్శించే వస్తు విస్తృతి, భావగాఢత, సరళత వున్న కవితలు అవి. కాకపోతే నేటి పాఠకులు సంక్షిప్తత ఉన్న కవితలే ఎక్కువగా చదువుతున్నారనేది నా గమనింపులో ఉంది. అందుకే క్లుప్తత, సంక్షిప్తత పాటించి రాసిన కవితను మొదటిగా ఉంచి, వస్తువు డిమాండ్ చేసిన దృష్ట్యా కొంచెం పెద్దగా ఉన్న కవితను తరువాత పెట్టాను. అంతేగానీ, దానికొక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు.

ప్రశ్న 3. మంచి కవిత్వమెలా ఉండాలో మీకు శివారెడ్డి గారు నేర్పారని చివరి కవితలో మీరు రాసుకున్నారు. మీ కవిత్వపు శైలి మీద, వస్తువు మీద, అభివ్యక్తి మీద శివారెడ్డి గారి ప్రభావమెంత?

జ: అవును. వివరిస్తాను. శివారెడ్డి గారి ఇంటికి దగ్గరలోనే నేను ఉండేవాడిని. చాలా తరచుగా కలిసేవాళ్ళం. వాళ్ళ ఇంటిదగ్గర ఒక చింతచెట్టు ఉంది. అక్కడ రెండు ‘టీ’ దుకాణాలు ఉన్నాయి. అక్కడే రాఘవేంద్ర హోటల్ కూడా ఉంది. ఆయా ప్రదేశాల్లో మేము కలిసినప్పుడు ఒక్కొక్కసారి టీ కొట్టు, ఒక్కొక్కసారి రాఘవేంద్ర హోటల్‌లో కూర్చొని చాలాసేపు గడిపేవాళ్ళం. ఆ సమయంలో నా తాజా కవితలు శివారెడ్డి గారికి, వారి తాజా కవితలు నాకు, ఒకరికొకరం చదివి వినిపించుకునే వాళ్ళం. ఆ సమయంలో నేను నా కవితలలో వాడే పదాలలో, వాక్యాలలో అస్పష్టత వున్నా, వస్తువుకు తగిన భాష లేకపోయినా, శిల్పం ఆకట్టుకోకపోయినా, వాటి గురించి వివరించి, సవరించమని చెప్పేవారు. నేను నా కవిత చదివేటప్పుడు తాను ఒక ధ్యానంలో ఉన్న మునిలా కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధగా ఇష్టంగా వినేవారు. అలా తాను విని సవరణలు చెప్పిన కొన్ని, కవితల పోటీలలో బహుమతులు పొందాయి కూడా. తన సమగ్ర సాహిత్యం నాకు ఇవ్వడమే గాక, ఇతరుల సాహిత్యం కూడా నాకు ఇచ్చి చదవమని ప్రోత్సహిస్తున్నారు. అలాగే తాను చదివిన తన కవితలు నాకు అర్థం కాకపోతే వివరించమని అడిగినప్పుడు, ఓపికగా వివరించేవారు. అలా నేను విన్న నాలుగైదు తన కవితలకు, నేను సూచించిన శీర్షికను పెట్టేవారు. నేను చాలా ఆనందపడేవాడిని.

ఇక శైలి, వస్తువు, భావ వ్యక్తీకరణ విషయంలో శివారెడ్డి గారి ప్రభావం నాపై ఉందా లేదా అనేది మీరు, పాఠకులే చెప్పాలి. నావరకైతే వారి ప్రభావం నా కవిత్వంపై లేదనే చెబుతాను.

ప్రశ్న 4. మీ కవితలలో పీడిత వర్గాల పట్ల ఆర్తి, వారి సమస్యల పట్ల ఆవేదన వ్యక్తమైనా, అందుకు కారకులు/పరిస్థితులపై ఉద్రేకమో/విద్వేషమో కనబడడం లేదు. ఎంతో అవగాహన, సంయమనం ఉంటే కానీ ఇది సాధ్యం కాదని మా అభిప్రాయం. మీరేమంటారు?

జ: చాలా మంచి ప్రశ్న. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నన్ను రైతు పక్షపాతి అనీ, స్త్రీ పక్షపాతి అని, పీడిత వర్గాల పట్ల ఆర్తి గలవాడినని, వారి సమస్యలపట్ల ఆవేదన వుందని ఎంతోమంది సాహితీవేత్తలు అన్నారు.. ఎవరి పక్షపాతినైనా కవిత్వం ద్వారా వారి బతుకులకు భరోసానివ్వలేము కదా! కానీ దీనికి కారకులు ఎవరో కూడా పసిగట్టగల నైపుణ్యం ఉంది. అలాగని కారకులపై ఉద్రేకమో, విద్వేషమో కనబరిస్తే పీడిత వర్గాలకు ఉపయోగం ఉంటుందా?. అలా ఉద్రేకపడిన వారి పరిస్థితి మనం గమనిస్తానే ఉన్నాము. చట్టాలను చుట్టాలుగా మలచుకొని అనేకమంది ఎలా చెలరేగిపోతున్నారో మనం గమనిస్తూనే ఉన్నాము. నేటి మన దేశ పరిస్థితి ఎవరికి తెలియనిది?

ఉద్రేకం నా మనస్తత్వానికి సరిపడదు. సంయమనం నా ప్రాణ స్నేహితురాలు. ఎవరినైనా ఒక మాట అనాలంటే చాలా ఆలోచిస్తాను. మాట తూలను. తూలితే వెనక్కి తిరిగి రాదు కదా, దానితో అనేక ఇబ్బందులు. అందుకే నన్ను బాగా ఎరిగిన మిత్రులు నా స్నేహాన్ని ఇష్టపడతారు.

ప్రశ్న 5. కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: ఛందో బందోబస్తులన్నీ పగలగొట్టుకొని గత అర్ధ శతాబ్దంగా వచన కవిత్వం పరుగులు పెడుతోంది. మనం వచన కవిత్వానికి పితామహుడుగా భావిస్తున్న కుందుర్తి ఆంజనేయులు గారు ఒకానొక సందర్భంలో పామరులకు కూడా అర్ధమయ్యే, సరళ సుందరమైన భాషను ఉయోగిస్తూ కవిత్వం రాయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

మీరన్నట్టు లయ, భావ వ్యక్తీకరణ, వస్తువు వచన కవిత్వానికి అవసరమే. లయను గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు.. లయవాసన లేని గద్యమును కవిత్వముగా పరిగణించుట కష్టమని, కవిత్వమన్నప్పుడు.. గణ నియమము లేకున్నా కనీసము లయ అయినా వాంఛనీయం అన్నారు పెద్దలు. ప్రసిద్ధ కవి ఆర్నాల్డ్.. కవిత్వాన్ని ‘criticism of life’ అన్నాడు. ఇతను కూడా కవిత్వానికి లయ అవసరమని అభిప్రాయపడ్డాడు. ‘కవి హృదయము, భావ శబలితమై వుద్రిక్తమైనప్పుడు, భావములు తమంత తాము ఉచితమైన భాషను వెతుక్కొని లయాన్వితముగా ప్రవహించును’ అంటారు దువ్వూరి రామిరెడ్డి గారు. కాబట్టి వచన కవిత్వంలో లయ అనేది ఆవశ్యకము అంటాను నేను.

ఇక ‘వస్తువు’ గురించి అడిగారు కదా. ఒక కవిత గానీ, కథ గానీ, నవల గానీ.. వాటిని గురించి చర్చించేటప్పుడు, రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ఒక సాహితీవేత్త తన రచనలో వ్యక్తీకరించడానికి అనుసరించిన పద్ధతి ఏమిటి అనేది, రచన దేనిని గురించి చెబుతుంది అనేదే ఆయా రచనల యొక్క వస్తువు అవుతుంది. అలా తీసుకున్న వస్తువుకు తగ్గట్టుగా రూపాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ రచన విజయవంతమవుతుంది. ఏ సాహితీవేత్త అయినా సమకాలీన సాంఘిక జీవితాన్ని వస్తువుగా తీసికొని తను ఎంచుకున్న భాషలో రచనను కొనసాగించాలి,అనేది నా భావన.

ఇక ‘భావవ్యక్తీకరణ’ గురించి: భావ వ్యక్తీకరణ అంటే కవి.. తన మనసులోని విషయాన్ని పాఠకుడికి చేరేలా చెప్పడం. కవిత్వీకరణలో భాగంగా వాడే భాష.. సాదాసీదాగా కాకుండా కవిత్వ భాషను వాడుతూ అంతులేని అర్థాలను, అనంతార్థాలు స్ఫురించే పదాల ఎంపిక చాలా ముఖ్యం. అంటే వస్తువుకు తగిన భాషను ఎన్నుకొని చెప్పదలచుకొన్న విషయాన్ని అస్పష్టత, సంక్లిష్టత లేకుండా పాఠకుడికి అర్ధమయ్యేలా చెప్పి మెప్పించిన రచన మాత్రమే కలకాలం నిలబడుతుంది.

ఇలా లయ, వస్తువు, భావ వ్యక్తీకరణ ఒక రచనకు మూల స్తంభాలుగా భావించవచ్చు.

ప్రశ్న 6. జీతే రహో బేటీకుమార్తెల పట్ల ఓ తండ్రి ఆపేక్షని అద్భుతంగా చిత్రించిన కవిత. ఈ కవిత రాయడానికి పురికొల్పిన సంఘటనో లేదా దాని నేపథ్యమో వివరిస్తారా?

జ: ‘జీతే రహో బేటీ’ కవితను అద్భుతంగా చిత్రించారు అని నన్ను సంతోషపరచిన మీకు ధన్యవాదాలు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా కుటుంబంలో నేను ఒక్కడినే సంపాదించేది. నా భార్య హోమ్ మేకర్. ఇద్దరి కుమార్తెలకు మంచి నాణ్యమైన చదువులు చెప్పించాను. పెద్దమ్మాయి ఇప్పుడు యూనియన్ బ్యాంక్‌లో చీఫ్ మేనేజర్, చిన్నమ్మాయి యం.డి. డాక్టర్. వాళ్లకు పిల్లలు కూడా. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి. తరచుగా కలుస్తుంటారు. ఇద్దరూ హైదరాబాద్ లోనే నివాసం. నేను వుండే ఇంటికి,వాళ్ళ ఇంటికి ఎనిమిది కిలోమీటర్లు దూరం. వారం వారం కలుసుకుంటూనే ఉంటాం. పెళ్లయ్యేవరకు మాత్రమే ఆడపిల్లలు మన దగ్గర వుంటారు కదా. ఆ తరువాత విషయం తెలిసిందే. సంతానాన్ని ప్రేమించనివాళ్ళు ఎవరుంటారు గానీ, నాలో కొంత అధికం.

ఒకానొక సందర్భంలో సుమారు పదకొండు నెలలపాటు మేము కలుసుకోలేకపోయాము. నిత్యం ఎంతో మథన పడేవాడిని. కన్నీళ్ల పర్యంతమయ్యేవాడిని. అప్పుడు పుట్టిందే ఈ కవిత. ఈ కవితను రాస్తూ ఎంత కన్నీరు కార్చానో నాకొక్కడికే తెలుసు. బహుశా ఏడ్చిఏడ్చి ఆ కాలంలో కన్నీళ్ళు ఇంకిపోయాయేమో!. ఆ తరువాత నా కన్నీటిని వృథా చేసుకోలేదు. ఈ కవితను విశాలాక్షి మాసపత్రిక వారు నిర్వహించిన కవితల పోటీకి పంపితే మొదటి బహుమతి వచ్చింది.

ప్రశ్న 7. తాళాలు లేని వేకువ దేహంఅన్న కవితకి శీర్షిక విభిన్నంగా ఉంది. వేకువ దేహమవటం, దానికి తాళం వద్దనడంలోని ఆలోచన ఏమిటి?

జ: చాలా సందర్భాలలో నేను తెల్లవారు ఝామునే లేచి చదువుకుంటాను. అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా చదువుకుంటున్నప్పుడు కొత్త ఊహలు తలెత్తుతాయి. ఇవి కొత్త వెలుగులా గతం తాలూకు భావాలను తెంచుకొని స్వేచ్ఛగా కొత్త వేకువను స్వప్నిస్తాయి.. ఈ స్వేచ్ఛ దేనికీ బందీ అయి ఉండదు. ఏ బంధనాలు ఈ స్వేచ్ఛను వెనుకకు లాగవు. అంటే ఈ ఊహలకు ఏ అడ్డు అదుపు ఉండదని అర్థం. అందుకే ‘వేకువ దేహానికి తాళాలు లేవు’ అని అన్నాను. జలపాతాల కోర్కెలు గెలవటం. పరిమళం కోల్పోయిన వస్తువుల్ని వదులుకోవటం క్రియా వాక్యాన్ని వెతుక్కోవటం ఇవన్నీ ఈ ఊహలలోని లక్షణాలు. పరిమళం కోల్పోయిన వస్తువుల్ని వదులుకోవటంలో గతంలోని నిర్బంధ లక్షణాలని అడ్డులని వదులుకుంటుందని అర్థం.

ప్రశ్న 8. స్వప్న శిశువుకవితలోని – ఋతువు లోంచి ఋతువెళ్ళిపోయింది/కాలం లోంచి కాలం వెళ్ళిపోయింది – అనే తొలి రెండు వాక్యాలలోని భావం పైకి అర్థమవుతున్నది మాత్రమే కాదని తెలుస్తోంది. వాటి అంతరార్థం వివరిస్తారా?

జ: నిజమే, between the lines, ఏ కవితనూ చూడలేము. పైకి కనిపించే వాచ్యఅర్ధం కంటే మించింది లోపల ఏదో ఉంటుంది. దాన్ని లోనారసి చూడాలి. లోపలకు వెళ్లడంలో కూడా పాఠకుడికీ, పాఠకుడికి మధ్య అంతరం ఉంటుంది. ‘ఋతువులోంచి ఋతువు వెళ్ళి పోయింది’ అన్నప్పుడు కవి ఋతువును దేనికి ప్రతీకగా తీసుకున్నాడో దాన్ని గ్రహించాలి. రెండవ లైనులో వున్న ‘కాలం’ దేనికి ప్రతీకో అర్ధం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే లోపలి భావం అర్థం అవుతుంది. ఇక్కడ నేను ఋతువుని కాలవాచకంగా కాక మరొక భిన్నమైన అంశానికి ప్రతీకగా తీసుకున్నాను. ఆ అంశం రెండవ లైనులోని కాలం అనే కాల వాచకానికి సంబంధం కలిగి ఉంది. ఋతువు మనిషి జీవితంలోని బాల్య, యవ్వన, కౌమార, వృద్దాప్యాలకు ప్రతీక అనుకుంటే రెండవ పంక్తిలోని కాలానికి సరిపోతుంది. కాలం వలన మనిషి ఆస్తిత్వానికి, మనిషి వలన కాల గమనానికీ సార్ధక్యం కలుగుతుంది. అవి పరస్పర ఆశ్రితాలు, పూరకాలు. ఇది దృష్టిలో ఉంచుకుని ఆ వాక్యాలు ఇచ్చే భావం శత సహస్ర దళ వికసిత పద్మమై హృదయంలో విప్పారుతుంది.

 

ఈ కవితని మరో కోణంలోంచి కూడా చూడవచ్చు:

ఋతువులోంచి ఋతువెళ్ళిపోయింది అనడంలో సాధారణమైన ఋతువులన్నీ కొంత ఆహ్లాదాలను, ఆనందాలను పంచిస్తాయి. మరికొన్ని దుఃఖాన్ని పంచిస్తాయి. ఇలా రకరకాల భావాలని ఇస్తాయని చాలామంది భావన. వచ్చిన ఋతుకావ్యాలలోనూ ఇలాంటి భావనలు కనిపిస్తాయి. ఈ వాక్యాలలో వ్యథ కలిగిన జీవితాలలో ఋతువులలో నుంచి ఆకరాల సంబంధమైన ఋతువు వెళ్ళిపోయి ఆ కాలం నిరపేక్షంగా మిగిలిందని అర్థం. కాలంలో నుంచి కాలం వెళ్లిపోవడంలోని అర్థం కూడా అదే. దుఃఖిత జీవనాలు శ్వాసను వెతుక్కుంటున్నాయి అనే అర్థంలోనూ అదే ఉంది. నిజానికి ఇక్కడ ఋతువు, కాలము కేవలం సంకేతాలు మాత్రమే. జీవనాన్ని మాత్రమే చెప్పడం ఇక్కడ లక్ష్యం. కొందరి జీవితాల్లో ఊపిరాడలేనంత దుఃఖం ఉందని చెప్పడమే ఇక్కడి సారాంశం.

ఇదే కవితలో చివరి వాక్యంలో మహాశ్వాసను తొడుక్కుని బద్దలు కొడుతుందని చెప్పడం కనిపిస్తుంది. అంటే తన స్థితికి తానే పరిష్కారం వెతుక్కుంటుందని, కాలాన్ని ధిక్కరిస్తుందని అర్థం. అలా ధిక్కరిస్తున్న దానిని స్వప్న శిశువుగా చెప్పటమే ఇక్కడ కనిపిస్తుంది అంటే కలలో అలాంటి స్వేచ్ఛాయుత మైనటువంటి జీవనాన్ని స్వప్నించానని అర్థం. ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైనప్పుడు ఎంతోమంది మెసేజ్‌లు, ఫోన్‌లు చేసి అభినందించడం నాకు మరచిపోలేని తీపి జ్ఞాపకం.

ప్రశ్న 9. మహా సంకల్పంకవితలో ప్రస్తావించిన నా బిడ్డ లాంటి బిడ్డల కోసం/ఇంగిత జ్ఞానం బోధించే/అనేకానేక మహా విశ్వవిద్యాలయాలు నిర్మించాలిఅన్న లక్ష్యం నెరవేరాలంటే స్త్రీలకు తోడుగా – ఓ తండ్రిగా, ఓ మగవాడిగా, ఓ మనిషిగా ఏం చేయాలని మీ అభిప్రాయం?

జ: సమాజంలో మార్పు రావాలని కోరుకునే ముందు, మార్పు ఏదైనా మన ఇంటినుంచే మొదలవ్వాలి. మనం మంచి అలవాట్లతో మసలుకుంటే మన పిల్లలు అదే అలవాట్లు అలవరచుకొని పెరిగి పెద్దవుతారు. అలా కాకుండా ఉంటే ఫలితం మనకు తెలిసిందే. అనేక శతాబ్దాలుగా స్త్రీలను మగవాళ్ళకంటే తక్కువగానే పరిగణిస్తున్న మన దేశంలో పురాణాలు.. స్త్రీలను తక్కువగానే పరిగణించాయి. భర్తకు, భార్య అణగిమణిగి ఉండాలనే నేర్పాయి. మెజారిటీ కుటుంబాలలో ఇదే ఇప్పటిదాకా జరుగుతోంది. ఒక స్త్రీని వివస్త్రను చేసి బజారుల్లో ఈడ్చుకు పోతుంటే, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు గాని, ఆ చర్యను ఆపే వాళ్ళు ఒక్కరూ కనపడరు.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగినట్లే భావించి ఎదుర్కొనే రోజులు రావాలి. సమాజంలో కూడా మార్పు రావాలి. చట్టాలు కూడా సత్వర న్యాయం కల్పించే విధంగా వుండాలి. బిల్కిస్ బానో సంఘటనతో సహా ఎన్నో సంఘటనలు ఇటీవలి కాలంలో చూసాము. పాఠశాలల్లో విద్యార్థినిలు.. ఉపాధ్యాయులచే అత్యాచారానికి గురవడం వార్తల్లో చూస్తున్నాము. వీటన్నిటికీ బాధ్యులు ఎవరో తెలిసినా చట్టపరిధిలో న్యాయం జరగడానికి ఎంతో సమయం పడుతోంది. ఈలోగా చట్టాన్ని చుట్టంగా మార్చుకునే ప్రబుద్ధులు తయారవుతూనే వున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాలకులు చట్టపరంగా సత్వర పరిష్కారం జరిగేలా చూడాలి.

ప్రశ్న 10. ఆశపువ్వులో కోరుకున్నట్టుగా – కలలోనైనా సంపదపై మక్కువను తొలగించే రోజువస్తుందంటారా? సంపదపై మోజు తీరితే సాటి మనుషులతో సమత్వం ఏర్పడే అవకాశం ఉంటుందన్న భావన ఈ కవితకి మూలమని అనిపిస్తుంది. వివరిస్తారా?

జ: వాస్తవ జీవితాల్లో సంపదపై మక్కువ తొలగే రోజు రాదు గాక రాదు. అది సత్యం. అంతేకాదు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. సంపదపైన మక్కువ తొలగినంత మాత్రాన సమానత్వం వస్తుందా? రాదు కదా. సమానత్వం అనే భావన ఒక ఆదర్శం తప్పితే దానికదే ఒక సాధ్యమైన ఆచరణ కాదు. మనిషి లోపల ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు, మత స్పృహ కాదు, సంపద పట్ల వ్యామోహం కాస్త తగ్గవచ్చు. ఆశ పువ్వు అంటే ఆశ పువ్వు లాంటిది అని కదా అర్ధం. ఎంత అద్భుత పుష్పమైనా దాని పరిమళం ఒక పూటో, ఒక రోజు పాటో ఉంటుంది కదా!. కవులు అల్ప సంతోషులు కదా. అందుకే అలా రాశాను.

ప్రశ్న11. ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?

జ: అన్ని కవితలూ ఇష్టమైనవే. నా సంతానంలో ఎవరు ఇష్టమని అడిగితే ఏమని చెబుతాము. ఒకరు ఇష్టమని చెబితే ఇంకొకరికి కోపం. నేను రాసిన చాలా కవితల్లోంచి మేలిమి అనుకున్న కవితలను మాత్రమే ఈ సంపుటిలో చేర్చాము. ఈ సంపుటికి సంపాదకత్వం వహించిన యం. నారాయణ శర్మ గారు, వంశీకృష్ణ గారు ప్రతి కవితను చదివి, ఇవి మంచి కవితలు అని సంతృప్తి చెందాకే ఆయా కవితలు ఈ సంపుటిలో చోటు సంపాదించుకున్నాయి. సరే అడిగారు కాబట్టి తప్పుకోకుండా ‘పద్యానికి పూచిన పువ్వు’ కవిత నాకు చాలా ఇష్టం. ఈ కవితకు వస్తువు, మునిసిపాలిటిలో రోడ్లు ఊడ్చే కార్మికుడు. తెల్లవారు ఝామున విధులకు వచ్చి,తెల్లారేసరికి రోడ్లను ఊడ్చి,చెత్త బండిలోకి ఎత్తి, మనం బజారుల్లోకి వచ్చేసరికి రోడ్డును శుభ్రం చేస్తారు. వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా తమ విధులు నిర్వర్తిస్తారు. ఇంత చేసినా వాళ్లపై జాలి చూపి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఆలోచన చేయని పాలకులను ఎలా చూడాలి?. ఈ కవిత రాశాక ఒక మునిసిపల్ కార్మికుడుకి వినిపిస్తే చలించి కళ్లనీళ్ల పర్యంతమైనాడు. అదే కదా కవిత్వ పరమావధి. ఈ కవిత కూడా కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందినది. నా కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పై ఇప్పటిదాకా ఇరవై సమీక్షలు వచ్చాయి. సమీక్షించిన ప్రతి సమీక్షకుడు ఈ కవితను స్పృశించారు.

ప్రశ్న12. ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఎందుకని?

జ: నా కవితల్లో ఏ కవిత రాయడానికీ కష్టపడలేదు. ఇష్టంగానే ప్రతి కవితను రాశాను. నా మనసులో మొలకెత్తిన వస్తువు నాతో చాలా రోజులు నడుస్తుంది. నన్ను ఊరిస్తుంది, ఊగిస్తుంది,నా మనసుని బుర్ర పురుగులా తొలిచేస్తుంది. నాలో ఆ వస్తువు తాలూకా ఫ్రేమ్ తయారయ్యాక కాగితంపై ప్రత్యక్షమవుతుంది. అలా ఒక ఆకారం నా ముందు ప్రత్యక్షమైన తరువాత నేను రాసిన కవితను వెంటనే పత్రికకు పంపడమో, లేదా ముఖ పుస్తకంలో షేర్ చేయడమో చేయను. కవితను రాసాక ఇక దానివైపు కనీసం పది రోజులైనా చూడను. కొన్ని రోజుల తరువాత తీసి చూస్తే, ఏ కాలు వంకరో, ముక్కు వంకరో గుర్తించి సరి చేసి బిగ్గరగా చదువుతాను. అలా చదివినప్పుడు కవితలో ఎక్కడైనా లయ తప్పినప్పుడో, సరైన పదం వాడనప్పుడో గుర్తించి సరి చేసి నాకు ఇష్టమైన మిత్రులు నారాయణ శర్మ గారికి, వంశీకృష్ణ గారికి, గుడిపాటి గారికి పంపుతాను. వాళ్ళు ఓకే చెప్పాకే పత్రికలకు పంపుతాను.

ప్రశ్న13. ఈ పుస్తకం ప్రచురణ అనుభవాలు చెబుతారా? అమ్మకాలు ఎలా ఉన్నాయి? పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: అబ్బో! ఒకటా, రెండా. ఎన్ని కష్టాలో! డి.టి.పి. మొదలుకొని పుస్తకం నా చేతుల్లోకి వచ్చేసరికి సరిగ్గా దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. ఎవరి దగ్గర ఆలస్యం అంటే ఏమి చెబుతాం. కర్ణుడికి అన్నీ శాపాలే అన్నట్లు అయింది. ఒక సంతోషం ఏమిటంటే.. ఈ సంపుటి ప్రచురణకు తెలుగు యూనివర్సిటీ వారు పదకొండు వేలు, ప్రముఖ కవి, కథకులు శ్రీ యం.వి.రామిరెడ్డి గారు ఇరవై వేలు, నా సహోద్యోగులు వాసంతి గారు, సత్యమ్మ గారు పది వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఆవిష్కరణ కూడా విజయవాడలో ఘనంగా జరిగింది. తరువాత హైదరాబాద్, శ్రీకాకుళం, కర్నూల్, తిరుపతిలలో పరిచయ సభలు జరిగాయి. సాహితీవేత్తలు, సాహిత్య పాఠకులు నా కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. నేను ఎప్పుడైనా సభలలో కనిపించినప్పుడు మీ కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ పై చాలా సమీక్షలు వస్తున్నాయ్.. చదువుతున్నాము, అంటుంటే సంతోషంగా ఉంటుంది.

కవిత్వ సంపుటాల అమ్మకాల గురించి చెప్పాలంటే.. పేరున్న కవుల పుస్తకాలే ఎవరూ కొనరు. అది మన తెలుగు సాహితీవేత్తల అలవాటేమో!. ఒక పత్రికలో సమీక్ష వచ్చిందంటే.. ఆ రోజు కనీసం పది ఫోన్‌లు అయినా వస్తాయి. మీ కవితా సంపుటిపై సమీక్ష చదివాము. మీ పుస్తకం పంపండి. నా అడ్రస్ మీకు పంపుతాము అని అడుగుతారు. పోనీలే చదువుతారేమో అని పంపితే అందినట్లుగా కూడా సమాచారం ఉండదు. ఇదీ మన దుస్థితి. బుక్ హౌస్‌ల పరిస్థితి కూడా అంతే. నాకు తెలిసి నవోదయ బుక్ హౌస్ మాత్రం ఠంచనుగా ప్రతి ఆరు నెలలకు అమ్ముడుపోయిన పుస్తకాలకు డబ్బులు ఇస్తోంది. ఒక బుక్ హౌస్ యజమాని మాత్రం ‘కవిత్వం ఇప్పుడు ఎవరు చదువుతున్నారండి. అసలు అమ్ముడు పోవడం లేదు’ అన్నాడే గానీ వాళ్లకు నేనిచ్చిన నా పుస్తకాలు నాకు తిరిగి ఇవ్వండి అంటే.. ఎక్కడున్నాయో వెతకాలి అంటాడు. ఇది దుస్థితి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు నేలపై కవిత్వాన్ని కొనేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి.

ప్రశ్న14. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? కొత్త పుస్తకాలు ఏవైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?

జ: ఇంతకు ముందు నేను కొన్ని పుస్తక సమీక్షలు చేసాను గానీ, ఎందుకో సమీక్ష/విమర్శపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. వాటికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. కథలు కూడా రెండు రాశాను గాని,అవి అసంపూర్తిగా ఉన్నాయి. కథలు రాయాలనే దృఢ సంకల్పం వుంది.

నేను విశాలాక్షి మాసపత్రిక కోసం ప్రతినెలా ఒక్కొక్కరు చొప్పున సుమారు ముప్పైమంది యువకవులను ఇంటర్వ్యూ చేసాను. అయిదారుగురు ప్రసిద్ధ సాహితీవేత్తలను కూడా ఇంటర్వ్యూ చేసాను. వారిలో కొలకలూరి ఇనాక్ గారు, కె.శివారెడ్డి గారు, బి.యస్.రాములు గారు, సాగర్ శ్రీరామకవచం గారు, రంగనాథ రామచంద్ర రావుగారు వున్నారు. వాటిని గ్రంథస్థం చేస్తున్నాను. ఆ పనిలో తలమునకలవుతున్నాను. వచ్చే నెలలో ఇంటర్వ్యూల గ్రంథం మీ చేతికి వస్తుంది.

54 కవితలు డా. గణేశ్ రామ్ గారు హిందీలోకి అనువాదం చేశారు. అది కూడా ప్రచురణకు సిద్ధంగా ఉంది. ఎవరైనా ఆర్ధిక సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నాను.

అలాగే కొన్ని కవితలు ఆంగ్లంలోకి, కన్నడంలోకి, మలయాళం లోకి అనువాదం అయ్యాయి. వాటిని కూడా ప్రచురించాలని ఉంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు విల్సన్‌రావు గారూ.

విల్సన్‌రావు కొమ్మవరపు: ధన్యవాదాలు సార్. ఎంతో విలువైన ప్రశ్నలు అడిగి, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చారు. నేను ముందుగా చెప్పినట్లు, ‘సంచిక’ ద్వారా నన్ను ఇలా పరిచయం చేయడం నాకు ఆనందంగా ఉంది. మీకు కృతజ్ఞతలు.

~

విల్సన్‌రావు చిరు పరిచయం:

విల్సన్‌రావు కొమ్మవరపు అలియాస్ కవి కొమ్మవరపు: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ టి ఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని కాసరబాద గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు అక్కమ్మ, అచ్చయ్య. ప్రాథమిక విద్య నందిగామలో, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఏ, ఎం.ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివారు. ఆ తర్వాత బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్‌మెంట్‌లో పి.జి.డిప్లొమా చేశారు. తొలుదొలుత జీవిక కోసం అనేక ఉద్యోగాలు చేశారు. వృత్తిరీత్యా జీవిత బీమా సంస్థలో సహాయ డివిజనల్ మేనేజర్‌గా 2020 మే నెలలో పదవీ విరమణ పొందారు. ప్రవృత్తిరీత్యా చక్కటి అధ్యయనశీలి. ఏదో రాయాలన్న తపనతో అల్లాడే తత్వం గల కవి. ఇతనికి పుస్తకం.. బతుకులో అంతర్భాగం. కొత్త పుస్తకాలపై మనసు పారేసుకునే నైజం. అధ్యయనం నిత్య వ్యాపకం. రాయడం కన్నా చదవడంలోనే ఎక్కువగా నిమగ్నమయ్యే సృజనశీలి. రాసింది పదునుగా, ప్రభావవంతంగా రాయాలన్న తపన ఉన్న కవి. కొత్తగా చెప్పాలన్న చిరంతన ప్రయత్నం ఇతని కవితాయానంలో స్పష్టంగా కనిపించే అంశం. అరుదుగా రాసినా ఆర్ద్రంగా రాయడం మేలిమి గుణం. దాదాపు మూడు దశాబ్దాల పైబడిన రచనా వ్యాసంగంలో కవిత్వమే కాదు వ్యాసాలు, సమీక్షలు ఉన్నాయి. అయినా కవిగానే లోకానికి సుపరిచితులు. అక్షరం పట్ల ఎనలేని మమకారం. ‘మంచి కవిత్వమంటే దానికి ఒక గుండె ఉండాలి, ఆ గుండె కన్నీరు కార్చాలి’ అనే ప్రగాఢమైన నమ్మిక ఈ కవి జీవనశ్వాస. అందుకే అక్షరమక్షరం సౌందర్యంతో భాసించేలా సృజించడానికి నిండైన హృదయంతో తపిస్తారు. అరుదుగా రాసినా, విస్మయానికి లోను చేసే చిత్రమైన వ్యక్తీకరణతో పాఠకుల్ని సమ్మోహితుల్ని చేస్తారు. సామాజిక సంవేదనలనయినా, ఆత్మలోకంలోని అలజడినయినా అంతే దీక్షగా కవిత్వం చేస్తారు. మానవ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టివేసే సంఘర్షణా పూరితమైన సందర్భాల్లో వెనువెంటనే స్పందిస్తారు. అయితే కళాత్మక స్వభావాన్ని విస్మరించకుండానే పదునుగా, సూటిగా తన భావాల్ని వ్యక్తం చేస్తారు. వస్తుశిల్పాల్లో, శైలీ సంవిధానంలో వైశిష్ట్యం కనబరుస్తారు. ఈ లక్షణమే ప్రత్యేకముద్రతో కవితారంగంలో నిలబడటానికి దోహదం చేసింది. ఇదివరలో ‘న్యాయనిర్ణేతవూ నీవే’ (2011), ‘తెల్లారితే’ (2014), ‘దేవుడు తప్పిపోయాడు’ (2017), ‘ప్రేరణ’- (దేవుడు తప్పిపోయాడు కవితా సంపుటిపై పీఠికలు, విశ్లేషణలు) -(2023) వెలువరించారు. ‘దేవుడు తప్పిపోయాడు’ కవితా సంపుటి పై సాహితీ లోకంలో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు తన నాలుగవ కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ (2023) అనే శీర్షికతో పాఠకుల ముందుకు వచ్చిన ఈ కవి కవితా సంపుటి విజయవాడలో ఆవిష్కరణ జరుపుకుని, హైదరాబాద్ లో అంకితోత్సవ సభ, శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి నగరాలలోనూ, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక వారిచే ఏప్రిల్, 30వ తేదీన అంతర్జాలంలోనూ పరిచయ సభలు జరుపుకున్నది.

మే 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారు టాక్ ది బుక్ శీర్షికలో ఈ కవితా సంపుటిపై హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారితో గంటపాటు సమీక్ష చేయించారు. తద్వారా ఈ కవిత్వాన్ని సుమారు నలభై వేల మంది విద్యార్థులకు చేరువైనది.

కవితాభివ్యక్తిలో రామణియకత, సృజన సౌందర్యం వెల్లివిరుస్తున్న ఈ కవి కలం నుండి వెలువడిన ఈ కవితా సంపుటి పాఠకామోదం, ఆదరణం పొంది ఇప్పటికే ఇరవై దాకా సమీక్షలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి.

నాలుగేళ్లపాటు సృజన ప్రియ, సృజననేడు పత్రికలలో సాహితీ సంపాదకులుగా పనిచేసి, ప్రస్తుతం సృజన క్రాంతి దినపత్రికకు సాహితీ సంపాదకులుగా వున్నారు.

***

నాగలి కూడా ఆయుధమే..! (కవిత్వం)
రచన: విల్సన్‌రావు కొమ్మవరపు
పేజీలు: 182
వెల: ₹200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
కె. విల్సన్‌రావు
5-2-396/SS/P42,
సౌభాగ్యనగర్ కాలనీ,
సాహెబ్ ఖాన్ నగర్, వనస్థలిపురం,
హైదరాబాద్ 500070
ఫోన్: 8985435515
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/naagali-kooda-aayudhame

~

‘నాగలి కూడా ఆయుధమే..!’ అనే కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/naagali-koodaa-aayudhame-book-review-gl/

Exit mobile version