Site icon Sanchika

కవి, అనువాదకులు శ్రీ వై. ముకుంద రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ

[అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారు శ్రీ ముకుంద రామారావు గారికి 2024 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందించి, ‘ప్రతిభా వైజయంతి’ సమ్మానోత్సవ విశేష సంచిక వెలువరించిన సందర్భంగా ముకుంద రామారావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం ముకుంద రామారావు గారూ.

ముకుంద రామారావు: నమస్కారం.

~

ప్రశ్న 1. మీ గురించి ఒక సమ్మానోత్సవ విశేష సంచిక వెలువరించటంపై మీ భావనలు, ఆలోచనలు ఏమిటి?

జ: ఆశ్చర్యం ఆనందం కంటే ఏముంటుంది ఎవరికైనా. బహుమతితో బాటు వారి మీద ఒక సమ్మానోత్సవ విశేష సంచిక వెలువరించటం, అజోవిభో లాంటి సంస్థలే చేస్తున్నాయి. అందుకు వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే.

ప్రశ్న 2. ముందుమాటలో ఈ పుస్తక సంపాదకులు కాస్తంత మౌనానికి ధ్యానానికీ అవకాశం ఇచ్చే అతి తక్కువ కవుల్లో ఆయనొకరుఅని వ్యాఖ్యానించారు. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు?

జ: బహుశా నా కవిత్వంలో వారికి ఆడంబరాలు పటాటోపాలు లేని శుద్ధ కవిత్వం కనిపించిందేమో. లేదంటే నా వయస్సుతో బాటు, నా కవిత్వంలో నావైన అనుభవాలే వారికి అలా అనిపించాయేమో తెలీదు.. నేను ఎప్పుడూ ఈ విషయం వారిని అడగలేదు.

అజొ విభో కందాళం ఫౌండేషన్ పురస్కారం

 

ప్రశ్న 3. మీ స్పందనలో మీ గురించి మీరు చెప్పుకుంటూ నేను అన్న కవితను ఉదహరించారు. ఆ కవిత చివరలో మార్గదర్శకుల నీడని/ఆకుల కన్నీరు కారుస్తున్న చెట్టుని/రాస్తూ చెరిపేస్తున్న వర్షాన్ని/సముద్రం తల్లీ తండ్రికి చేరువవుతున్న నదినిఅన్నారు. ఈ పాదాల అర్థాలను వివరిస్తారా? ముఖ్యంగా చివరి పాదం అర్థం.. మరణాన్ని సూచిస్తున్నట్టు అనిపుస్తున్నది. ఈ పాదాల అర్థాలు విపులంగా వివరిస్తారా?

జ: నాకు, నా కవిత్వానికీ, ఎందరో మార్గదర్శకులు ఉన్నారు.. వారి నీడలో నడవడం నాకు ఆనందం కలిగించే విషయం.

అలాగే నాకు కూడా కష్టాలూ కన్నీళ్లూ ఉన్నాయి – చెట్టులానే సహజంగా వాటిని జారవిడుస్తాను. నాలోనే దాచుకోలేనివి సేకరించుకున్నవి నాతోనే ఉంచుకోలేను – వర్షంలానే వాటిని నాదైన నేలమీద రాస్తూ వాటిని మరచిపోతాను, కొత్త సేకరణలతో కడుపు నింపుకుంటాను మళ్లీ వాటిని పంచేవరకూ..

సముద్రం తల్లీ తండ్రికి చేరువవుతున్న నదిని – అన్నది మీరు అనుకున్నట్టు మరణాన్ని సూచిస్తున్నదే, అయితే అది అందరికీ జరిగేదే, దానికి నేనే కాదు ఎవరూ అతీతులు కారు.

అదే గాలి పుస్తకవిష్కరణ

ప్రశ్న 4. ఈ పుస్తకంలో 88  ప్రముఖులు మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి, మీతో పరిచయం గురించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇలా ప్రముఖులు, నిష్ణాతులు మీ గురించి వ్యక్తపరచిన అంశాల పట్ల మీ స్పందన ఏమిటి?

జ: ఇంతమందికి నామీద ఇంతగా ప్రేమాభిమానాలు ఉన్నాయి అన్నది నేను జీవించి ఉండగానే నాకు తెలిసింది. వారి వారి దృష్టికోణాల్లో నన్ను, నా రచనల్నీ వారు అంచనా వేసారు. అవేవీ కావాలని రాసినవి కావని నాకు తెలుసు. అందులో నన్ను నేను చూసుకున్నాను.

ప్రశ్న 5. మొదటి వ్యాసం ఏబీకే ప్రసాద్ గారిది. ఇది సంపాదకీయం. ఒక కవిత సంపుటి గురించి సంపాదకీయం రాసే అపురూపమైన సంఘటన ఎలా సంభవమైంది?

జ: అప్పట్లో ఏబీకే గారు, తనకు నచ్చిన వాటిమీద సంపాదకీయాలు అప్పుడప్పుడు రాసేవారు. అలా వచ్చిన సంపాదకీయాల్ని ఏబీకే సాహిత్యకీయాలు అన్న పుస్తకాలు కూడా వేసారు. ఆ తరువాత ఎప్పుడో వారితో పరిచయం కలిగింది.

ఆకాశయానం పుస్తకావిష్కరణ

ప్రశ్న 6. ఇండియన్ లిటెరేచర్ సంపాదకులు మీ కవితం గురించి, it is ‘primarily meditative’  అన్నారు. ఈ వ్యాఖ్య వెనుక దాగిన మీ కవితల్లోని ఆలోచనలను తెలియచేస్తారా?

జ: సమ్మానోత్సవ సంపాదకులు కూడా దాదాపు ఇదే మాట అన్నారు. బహుశా నా కవితలు చటుక్కున అర్థం చేసుకునేవి కావు, కాస్తంత ఆలోచనల్ని రేకెత్తించేవి అనుకొని ఉండొచ్చు.. నిజానికీ వారినీ ఎప్పుడూ ఈ విషయం అడగలేదు.

ప్రశ్న 7. మీరు ప్రధానంగా సృజనాత్మక కవి. అనుభూతులను అందంగా ఆవిష్కరించే సున్నిత హృదయ స్పందన కల కవి. మీరు అనువాదాలవైపు ఎలా మళ్ళేరు?

జ: నా కవిత్వం పట్ల, నా పట్ల మీ స్పందనకు అభిప్రాయానికి ముందుగా ధన్యవాదాలు. నేను న్యూయార్క్‌లో ఉండగా, కవి మిత్రుడు యదుకుల భూషణ్‌తో సాన్నిహిత్యం, తరువాత అక్కడ ఉన్న న్యూయార్క్ స్టేట్ గ్రంథాలయం, ఆ దిశలో నన్ను ఎక్కువగా తీసుకువెళ్లాయి. వారాంతాలే కాదు, నాకు సమయం చిక్కినప్పుడల్లా అక్కడే గడిపేవాడిని. అభ్యాసంలా అక్కడ చేసిన చిన్నచిన్న అనువాదాల్ని సైతం భూషణ్ బాగున్నాయని ప్రోత్సహించడంతో అటువైపు మళ్లాను.

సినారె – ఇంద్రగంటి గారిచే సన్మానం

ప్రశ్న 8. ‘అదే గాలి, ‘అదే నేల పుస్తకాల నేపథ్యం, కవితల సేకరణ అనువాదంలో తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తారా.

జ: నాకు ముందునుండీ కొంత ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం నేర్చుకోవడం అలవడింది. నాకు న్యూయార్క్ గ్రంథాలయంతో ఏర్పడ్డ దగ్గరితనం, అమెరికా లోని గ్రంథాలయాలతో ఒక నిషాలా ఏర్పడింది. ఉద్యోగ నిమిత్తం దఫదఫాలుగా అమెరికా వెళ్లిరావడం, పిల్లల కోసం అక్కడకు వెళ్లి ఉండడం మూలంగా నాకు అక్కడి గ్రంథాలయాలు, నా పుస్తక దాహాన్ని తీర్చేవి. అంచాత నోబెల్ కవులను చదువుకోవడం, సూఫీ కవులను చదువుకోవడం నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి. నేను విదేశాలకు ముందు వెళ్లిన ప్రదేశం స్పెయిన్ లోని బార్సిలోనా. విమానం నుండి దిగిన వెంటనే నాకు ఎరుకలోకి వచ్చింది, మనకు తెలిసిన అదే ఆకాశం, అదే గాలి, అదే నీరు, అదే నేల, అదే కాంతి – నాకు వెంటనే వచ్చిన ఆలోచన, పంచభూతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఒకటే కదా, కవిత్వం కూడా, భాషలు వేరు కావచ్చేమో కానీ, అందులో కవిత్వం అన్నది ఉంటే, ఏ భాషయినా ఏ దేశమయినా ఒకటే అనిపించి, నేను అనువాదాలు అన్నవి చేసుకుంటే ఇవే పేర్లతో చేసుకోవాలి అనుకున్నాను. అయితే అవి సాధ్యం అవుతాయని నాకు అప్పట్లో అనిపించలేదు. అయితే ఆ అలోచన ఉండడం మూలాన, నేను న్యూయార్క్‌లో చేసిన విదేశీ కవితల అనువాదాల సంకలనానికి ‘అదే అకాశం’ అని పేరుపెట్టాను. ఇంకా ప్రపంచ కవిత్వం మత్తులో ఉన్నాను కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని కవిత్వాల్ని చదువుకోవడం, సేకరించడం మొదలు పెట్టాను. అది ఒక కొలిక్కి వస్తున్న క్రమంలో వాటిని మిసిమి పత్రిక ప్రతి నెలా ధారావాహికంగా ప్రచురించింది. అది పూర్తయాక ‘అదే గాలి’ పుస్తకం వచ్చింది. అందులో భారతీయ కవిత్వం లేదు. మన కవిత్వం భాషలవారీగా చదువుకుంటున్నపుడు, నేను పొందిన ఆనందం, ప్రపంచ భాషల కవిత్వం చదువుకుంటున్నప్పటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అవి చదవడం మూలంగా ‘అదే నేల’, ‘చర్యాపదాలు’, ‘అదే కాంతి’, ‘బెంగాలీ బౌల్ కవిత్వం’ పుస్తకాలు వచ్చాయి. ప్రపంచ కవిత్వం, భారతీయ భాషల కవిత్వం చదువుతున్నపుడు ‘అదే గాలి’, ‘అదే నేల’లో న్యాయం చేయలేకపోయాను అనుకున్న కొందరి కవుల్ని, వారి కవిత్వాన్ని, నెల్లూరు నుండి వచ్చే విశాలాక్షి పత్రిక ప్రతినెలా ధారావాహికంగా ప్రచురించింది. అలా ఒక వంద మంది కవులను, వారి కవిత్వాలను అనువాదం చేసిన సంతృప్తితో అక్కడికి ఆపేసాను. అది ‘అదే నీరు’ పుస్తకం అయింది. అయితే అవి పుస్తకాల నుండి సేకరించిన వస్తువు, సాధ్యమైనంత వరకు ఆయా కవుల అనుమతి తీసుకొని చేసినవే.

హ్యూస్టన్‍లో సత్కారం

ప్రశ్న 9. ‘అదే కాంతి పుస్తకం నేపథ్యాన్ని వివరిస్తూ, అందులోంచి మీకు నచ్చిన భక్తి కవితను ఉదహరించండి.

జ: నేను ముందే చెప్పినట్టు భారతీయ కవిత్వాన్ని చదువుకుంటున్నపుడు,  మన కవిత్వంలో ఒక దశలో వచ్చిన భక్తి కవిత్వం, నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అది ‘అదే నేల’ భారతీయ భాషల కవిత్వం నేపథ్యం పుస్తకంలో రేఖామాత్రంగానే పరిచయం చేయగలిగాను. ఆ వస్తువు ఎంత విస్తృతమైనది అంటే, అదే కొన్ని పుస్తకాలకు పనికొచ్చేది. అది ఆరవ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకూ ఒక ఉద్యమంలా సాగిన దానిని, అదే క్రమంలో పరిచయం చేయడానికి ప్రయత్నం చేసాను. అందులో ఏ ప్రాతం భక్తి కవిత్వాన్ని చూసినా అంతే ఆసక్తికరంగా అనిపించింది. దేవుడు దేవత ఎవరైనా వారితో వారంతా ఒక స్నేహితుడులానో, బంధువులానో దగ్గరైన ప్రేమ, కోరికలకు అతీతంగా సాగింది. అందులో ఉన్న కవితలన్నీ నాకు బాగా ఇష్టమైనవి నచ్చినవి, ఏదో ఒక కవితనే ఉదహరించడానికి నాకు మనసొప్పడం లేదు. మన్నించాలి.

గురజాడ గారింట్లో చాగంటి తులసి, తదితరులతో

ప్రశ్న 10. ఈ పుస్తకంలో కొన్ని ముందే ప్రచురితమైన రచనలున్నాయి. కొన్ని ఈ పుస్తకం కోసమే ప్రత్యేకంగా రాసినవి వున్నాయి. వీటిల్లో ఎవరి రచన మీకు అత్యంత ఆనందాన్ని కలిగించింది?

జ: అందరూ వారివారి కోణాల్లో నన్ను, నా రచనల్ని చూపించే ప్రయత్నం ఎంతో ఇష్టంగా ప్రేమగా చేసారు. అందులో రాసిన వారందరి వ్యాసాలూ నాకు ఎంతో సంతృప్తిని ఆనందాన్ని కలగజేసాయి. అంచాత ఇక్కడ కూడా నేను ఎవరివీ ప్రత్యేకించి చెప్పలేను.

ప్రశ్న11. మీరు కవిగా గుర్తింపు పొందటానికి ఇష్టపడతారా? అనువాదకుడిగానా?

జ: నా వరకూ నాకు రెండు ప్రక్రియలూ సృజనాత్మక ప్రక్రియలే. స్వీయ కవిత్వంలో ఉన్న స్వేచ్ఛ అనువాద కవిత్వాల్లో ఉండదు. ఆ మూల కవికి కవిత్వానికి న్యాయం చేస్తున్నానా లేదా అన్నది అందులో ప్రతి చరణం, అంశమూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందులోనూ నేను చేస్తున్నది ఎక్కువగా కవిత్వానువాదం కాబట్టి, నా కవిత్వ ప్రేమని అవి తీరుస్తున్నాయి. బాల్యం నుండీ మనల్ని పిలిచే పేర్లే మారుతూ ఉంటాయి. ఇంట్లో ఒకలాగ, బయట ఒకలాగ వారితో ఉన్న సామీప్యాన్ని బట్టి ఎలా పిలిచినా పలుకుతాం కదా.. ఇదీ అంతే.. మౌలికంగా నేను కవిత్వ ప్రేమికుడ్ని. అది స్వీయ కవిత్వం కావచ్చు, అనువాద కవిత్వమైనా కావచ్చు.

నోబెల్ కవిత్వం పుస్తకావిష్కరణ

ప్రశ్న12. మీరు భక్తి కవితలను అదే కాంతి పుస్తకంలో బౌద్ధ సంబంధిత కవితలను చర్యా పదాలలో పొందుపరచారు. ఈ రెండు రచనల ప్రభావం మీ ఆలోచనలను, మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేశాయి?

జ: ఆయా కవులు కవిత్వాల ముందు, నేను ఏమీ కాదు అన్నది వారిని చదువుతున్న కొద్దీ అర్థమయింది. మనకంటే వారంతా ఎంతో ముందున్నారు అన్నది కూడా తెలిసింది. మనకు తెలిసింది అతి తక్కువ, తెలుసుకోవాల్సిన దానికి జీవితకాలం సరిపోదు అన్నది కూడా అంతగానే అవగతం అయింది.

హ్యూస్టన్‍లో ప్రసంగం

ప్రశ్న13. మీ ప్రపంచకవిత్వాన్ని పరిచయం చేశారు. అవి అనువాదం చేస్తున్నప్పుడు ఇతర దేశాల కవిత్వంతో పోల్చినప్పుడు సమకాలీన తెలుగు కవిత్వం ఏ స్థాయిలో వుందనిపించింది?

జ: మన తెలుగు కవులు వారికి నచ్చిన దోరణులను సొంతం చేసుకుంటునే ఉంటారు. ఏ ఇతర భాషల కవిత్వాలకీ తీసిపోని కవిత్వం తెలుగులోనూ వచ్చింది, వస్తోంది. అయితే అంత గొప్ప కవిత్వం మన పొరుగునున్న భాషలవారికే అంతగా తెలియకుండా పోతోంది. మన భాషలో ఎవరికి వారు, వారి శక్తి సామర్థ్యాలతో తెలియపర్చుకోవాలి తప్ప, ఇంకో మార్గం లేకుండా పోతోంది. అది అందరికీ సాధ్యమయే పని కాదు. ఆ లోపం మూలంగా మన కవిత్వాలు ఇతర భాషలవారికి తెలియకుండా పోతోంది, తెలుగులో ఎవరికీ తీసిపోని కవిత్వం వస్తున్నా సరే.

వలసహోద మందహాస కన్నడ పుస్తకం ఆవిష్కరణ

ప్రశ్న14. మీరు ఎంతో నాణ్యత కల సున్నితమైన మానవ సంబంధాలను, అనుబంధాలను, మనస్తత్వాలను ప్రతిబింబించే కవితలను సృజించారు. మీరు ఎంతో నాణ్యమైన ఇతర భాషలు, దేశాల కవితలను పరిచయం చేశారు. మీకు లభించాల్సినంత గుర్తింపు, గౌరవం, జరగాల్సినన్ని విశ్లేషణలు తెలుగు సాహిత్య ప్రపంచంలో జరిగేయంటారా? లేకపోతే ఎందుకని జరగలేదనిపిస్తుంది? మాకు మాత్రం మీరు విప్లవాలకు, స్లోగన్ల కవితలకు, ఆవేశకావేశ ఆక్రోశార్భాట రాజకీయ రొష్టు కవితలకు దూరంగా వుండి, అనుభూతికి, సంవేదనలకు ప్రాధాన్యం ఇవ్వటమే అనిపిస్తుంది. మీరేమంటారు?

జ: ముందుగా నా పట్ల నా రచనల పట్ల మీ ప్రేమ పూర్వక అభిప్రాయానికి అనేక ధన్యవాదాలు. గుర్తింపు కోసం నాకు మొదటి నుండి ప్రాకులాట లేదు. గుర్తింపు కోసమే నేను రాయడమూ లేదు, ఆ ప్రయత్నాల పట్ల నాకు ఆసక్తీ లేదు. మీలా ఏ కొందరైనా గుర్తిస్తే సంతోషం, లేకపోయినా ఏ ఇబ్బందీ లేదు అన్నది నేను నేర్చుకున్న సారాంశం.

తాపీ ధర్మారావు పురస్కారం

ప్రశ్న15. మీరు పలు సందర్భాలలో సాహిత్య అకాడెమీ ఉత్తమ అనువాద అవార్డుల ఎంపికలో పాల్గొన్నారు. ఇది కూడా మీ సృజనను గుర్తించటంలో ప్రతిబంధకం అయిందా?

జ: అనువాద అవార్డుల ఎంపికల పాల్గొన్నది ఒకే ఒక్కసారి. అది కూడా నన్ను ప్రత్యేకంగా మాట్లాడి పైవారు కోరడం మూలంగానే. అది ప్రతిబంధకం ఎలా అవుతుందో నాకు తెలీదు. ప్రతిబంధకాలు ఎప్పుడూ మనమో ఎవరో సృష్టించుకునేవి లేదా సృష్టించబడేవే  కదా.

విడని ముడి పుస్తకావిష్కరణ

ప్రశ్న16. మీరు అనువదించిన ప్రపంచకవులలో మీకు బాగా నచ్చిన కవులెవరు? వారి కవితలను కొన్ని వివరించగలరా?

జ: చాలా చాలా మంది ఉన్నారు. అలా ఉండబట్టే ‘అదే గాలి’, ‘అదే నీరు’ పుస్తకాలుగా వచ్చినా ఇంకా సంతృప్తి తీరలేదు. అయితే కొందరు కవులు ఎంతగానో గుర్తొస్తుంటారు. వారిలో రూమీ, హఫీజ్, అత్తార్ లాంటి సూఫీ కవులూ ఉన్నారు, యెహూదా అమీహాయి, షుంతారో తనికవా , విస్లవా సింబోర్స్కా, నజీం హిక్మత్, ఖలీల్ జీబ్రాన్ లాంటి ఎందరో గొప్ప గొప్ప కవులున్నారు.

ప్రశ్న17. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: అనేక ప్రాంతాలు తిరిగిన వాడిని, అనేక భాషలతో వ్యక్తులతో పరిచయం ఉన్నవాడిని, ఇప్పటికే చాలా విషయాలు మరచిపోతున్న వాడిని, అంచాత నా ఆత్మకథ రాసుకోవాలను కుంటున్నాను. నాకు బాగా ఇష్టమైన మైత్రేయీ దేవి రాసిన బెంగాలీ నవల ‘న హన్యతే’ ని అనువాదం చేద్దామనుకుంటున్నాను. నా స్వీయ కవిత్వ సంకలనం ‘రాత్రి వీస్తున్న గాలి’, నా వ్యాస సంకలనం ‘ఆసక్తి’ కూడా రాబోతున్నాయి.

విజయభావన పురస్కారం

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు ముకుంద రామారావు గారూ.

ముకుంద రామారావు: ధన్యవాదాలు.

***

ప్రతిభా వైజయంతి (యల్లపు ముకుంద రామారావు సమ్మానోత్సవ విశేష సంచిక)
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
సంపాదకులు: ఎ.కె. ప్రభాకర్, కె.పి. అశోక్ కుమార్
పేజీలు: 424
వెల: ₹ 400
ప్రతులకు:
అజో-విభొ-కందాళం ఫౌండేషన్
హైదరాబాద్-27
ఫోన్ 040-40179673

 

 

 

~

‘ప్రతిభా వైజయంతి’ సమ్మానోత్సవ విశేష సంచిక సమీక్ష
https://sanchika.com/pratibha-vaijayanthi-mrr-book-review/

Exit mobile version