[‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని వెలువరించిన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం అల్లూరి గౌరీలక్ష్మి గారూ.
అల్లూరి గౌరీలక్ష్మి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1. వృద్ధులు, వారి సమస్యలు, వారి జీవన విధానంపై నవల రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ అంశాలపై ఇప్పటికే వచ్చిన నవలల కంటే మీ నవల ఎందుకు భిన్నమైనదనుకుంటున్నారు?
ప్రశ్న 2. నవలకి ‘మలిసంజ కెంజాయ’ అనే శీర్షిక బాగా నప్పింది. నవలకి ఈ పేరు ఎంచుకోడం వెనుక నేపథ్యం వివరిస్తారా?
జ: మలి సంజలో ప్రవేశించిన వారు తమ జీవితాల్ని ఆత్మపరిశీలన చేసుకుంటూ, కాస్త నిర్మమమకారం అలవరచుకుని, సంయమనంతో ఉండాలి. వచ్చిన శారీరక ఇబ్బందులను, మిగిలిన ఇబ్బందులను సహనంతో నిభాయించుకుంటే వారి మలి వయసును కూడా ఆనందంగా గడపవచ్చు అన్న సూచనతో రాసిన నవల ఇది. నా అభిప్రాయానికి తగినట్టుగా నామకరణం చేసిన వారు, మా అభిమాన గురువుగారు శ్రీ శ్రీ రామారావు గారు.
ప్రశ్న 3. సంచికలో ధారావాహికగా ప్రచురితమైన ఈ నవలతో కలిపి, ఇప్పటిదాకా మీరెన్ని నవలలు రాశారు? అందులో ఎన్ని పత్రికలలో సీరియల్స్‌గా వచ్చాయి?
జ: నేను రాసిన నవలలు మొత్తం నాలుగు. మొదటిది ‘అనుకోని అతిథి’. ఇది ఆంధ్రభూమి మంత్లీలో 1998లో అనుబంధ నవలగా వచ్చింది. 2011లో ‘అంతర్గానం’ ఆంధ్రప్రభ దినపత్రికలో డైలీ సీరియల్ గానూ, 2018లో ‘ఎదలోపల ఎద’ అనే నవల ఆంధ్రప్రభ ఆదివారం మ్యాగజైన్ లోనూ సీరియల్‌గా వచ్చాయి. ఈ ‘మలి సంజ కెంజాయ’ నవల సంచిక.కామ్ లోనే 2023 లో 23 వారాలు వచ్చింది.
ప్రశ్న 4. సాధారణంగా రచయిత జీవితంలోంచి రచనలు వస్తాయంటారు. ఈ రచనకూ మీ జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధం ఏమైనా వుందా?
జ: అందరికీ తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు. ఇంకా మిగిలిన పెద్దలు కూడా మన కుటుంబాల్లో తప్పకుండా ఉంటారు. ఆ విధంగా వారిని చూసిన అనుభవం ప్రతివారికీ ఉంటుంది. నేను కూడా ఆరు పదులు దాటాను కాబట్టి ఆ స్వీయానుభవంతో కూడా ఈ ఇతివృత్తానికి మరికాస్త న్యాయం చెయ్యగలను అని ఈ నవల మొదలుపెట్టి రాశాను. వ్యక్తిత్వం విషయానికి వస్తే నాది సానుకూల దృక్పథం. నా బ్లడ్ గ్రూప్ ‘బీ’ పాజిటివ్. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, దేశాల మధ్య అయినా మనుషుల మధ్య హక్కులు,రూల్స్ కన్నా మానవుల మధ్య ఒకరి పట్ల మరొకరికి సహానుభూతీ, సానుభూతీ, ప్రేమా ఉండడం అవసరం. LIVE & LET LIVE అన్నట్టుగా ‘సామరస్య వాతావరణం పెంచుకోవడం ద్వారానే అన్నిచోట్లా శాంతీ, సౌఖ్యం సాధ్యం!’ అని నా అభిప్రాయం. అసలు విశ్వమంతా ఒక సహజీవనమే! పరస్పర ఆధారితమే!
ప్రశ్న 5. సమాజాన్ని నిశితంగా పరిశీలించటంలోనూ, మానవ సంబంధాలను అవగతం చేసుకోవటంలోనూ మీ ఉద్యోగ బాధ్యతలు మీకు ఉపకరించి ఉంటాయని భావిస్తున్నాము. మీరేమంటారు?
జ: నేను పదేళ్ల వయసు నుంచే ఇంటికి వచ్చే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి మ్యాగజైన్లు, ఇంకా పెద్దవాళ్లు లైబ్రరీ నుంచి తెచ్చుకునే నవలలు వాళ్ళతో పాటు, బాగా చదివేదాన్ని. ఆ పుస్తకాల్లో ఉండేవి సంభాషణలు, సంఘటనలు, మనుషులు, తద్వారా సాగే కధాగమనం! అలా పుస్తకాలు చదివి, చదివి క్రమంగా చుట్టూ ఉండే మనుషుల్ని కూడా చదవడం అలవాటయింది. అలా పక్కన ఉండే వారి ప్రవర్తనని, మాటల్ని బట్టి వారి వ్యక్తిత్వాల్నిఅర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని.అందువల్ల కాలక్రమేణా నేను రచనలు చేస్తూ, నా కథల్లోని పాత్రలను సృష్టించినప్పుడు ఆయా పాత్రల హావభావాలు, మాటలు సులువుగా రూపుదిద్దుకునేవి. నేను 36 సంవత్సరాలు APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation) లో ఉద్యోగం చేశాను. అంత సుదీర్ఘకాలంలో నేను ఎన్నో సెక్షన్లలో ఎందరో బాసులు, సహోద్యోగులతో కలిసి పని చేశాను. సీనియారిటీ పెరిగాక నా పర్యవేక్షణలో పనిచేసే జూనియర్లు వచ్చారు. ఇంకా మిత్రులూ,సన్నిహితులూ ఉంటారు.
అలా చుట్టూ నిత్యం ఓ 200 మంది మనుషులను చదివే అవకాశం కలిగింది. నేను దాదాపు 15 సంవత్సరాలు పబ్లిక్ రిలేషన్స్ సెక్షన్లో అంటే పౌరసంబంధాల శాఖలో పని చేశాను. అప్పుడు బయట నుండి మా ‘APIIC’ సంస్థకి వచ్చే అనేకమంది పారిశ్రామికవేత్తలు మా సెక్షన్ ద్వారా, Land Allotments కోసం మా MD గారిని కలవడానికి వచ్చేవారు. ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా Marketing Staff కూడా Advertisements కోసం మా సెక్షన్‌కి వచ్చేవారు. ఆ విధంగా జర్నలిజం ఫీల్డ్ మిత్రులను కూడా ఎక్కువమందిని నేను దగ్గరగా చూసే అవకాశం కలిగింది. నేను స్వయంగా 32 సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నందున వివిధ సందర్భాలలో ఆయా పత్రిక ఎడిటర్స్‌నీ, సబ్ ఎడిటర్స్ & స్టాఫ్‌నీ నేను కలవడం వల్ల వారిని కూడా గమనించగలిగాను. అలాగే ఏళ్ల తరబడి సహ రచయితలతో అనుబంధం, ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. వయసు రీత్యా కుటుంబం పెరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులూ, బంధువులూ పెరుగుతారు. వారితో కూడా సహజంగానే అనేక అనుభవాలు ఎదురవుతాయి కదా!
ప్రశ్న 6. మీ తొలి నవల ఎప్పుడు రాశారు, అప్పటికీ, ఇటీవలి ‘మలిసంజ కెంజాయ’ వరకు – నవలలకి సంబంధించి – ఎంచుకునే ఇతివృత్తాలలో గాని, రచనా సంవిధానంలో గాని ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
జ: గతంలో కన్నా ఇప్పుడు కొన్ని ప్రయోగాత్మక ఇతివృత్తాలతో నవలలు విరివిగా వస్తున్నాయి. పాత పరిధులను దాటి ప్రస్తుత సాహిత్యం సాగుతోంది. నేటి కాలపు వైరుధ్యాలు, సమాజంలోని అసందిగ్ధతలు, రాజకీయాలు, టెక్నాలజీ విలువలు, సవాళ్లు కూడా నవలల్లో కనబడుతున్నాయి. నేను నా మొదటి నవల 1998లో రాశాను. అది ఊహల పందిరి వేసుకున్న ఓ అమ్మాయికి వాస్తవం ఎలా ఉంటుందో వివరించిన నవల. ఈ నాలుగవ నవల 2022లో రాశాను. మధ్య దాదాపుగా పాతికేళ్లు గడిచాయి. మధ్యలో రాసిన రెండు నవలల్లో ఆర్థిక స్వాతంత్ర్యం లేని స్త్రీల పరిస్థితి, ఆ స్వాతంత్ర్యం వచ్చాక సాధికారత దిశగా ఆమె చేసే ప్రయాణం వస్తువుగా ఒక నవల, యువతీయువకులు పెళ్లి కాకుండా సహజీవనం చేసే విషయానికి సంబంధించి మరో నవల రాశాను. ఈ నాలుగవ నవలలో నేను తీసుకున్న థీమ్, నేడు సామాజిక మార్పుల దృష్ట్యా వివిధ తరగతుల కుటుంబాల్లోని వయసుమీరిన పెద్దల పరిస్థితి ఎలా ఉంది? అన్న సమస్యకి సంబంధించినది. ప్రస్తుత కాలానికి రిలవెన్స్ ఉన్న సబ్జెక్ట్‌నే తీసుకున్నాను. నా రచనా విధానంలో పెద్దగా మార్పు వచ్చి ఉండకపోవచ్చు. అప్పటికన్నా ఇప్పుడు అనుభవం వల్ల భావవ్యక్తీకరణలో కాస్త వెసులుబాటు వచ్చి ఉండవచ్చు అని నేను అనుకున్నా, ఆ సంగతి చెప్పవలసింది పాఠకులే!
ప్రశ్న 7. సాధారణంగా ఒక నవలని మీరు ఎంత సమయంలో రాస్తారు? ఈ నవల వ్రాయడానికి ఎంత కాలం పట్టింది? ఈ నవలకి – మీ ఇతర నవలలకి పట్టినంత సమయమే పట్టిందా? ఆలస్యమైందా? తొందరగా పూర్తయిందా?
జ: అలా చెప్పడానికి నేను పుంఖానుపుంఖాలుగా నవలలు రాయలేదండీ! అయితే నాకు ఒకో నవలా రచనకు ఒక్కో టైమ్ పట్టింది. ఈ నవల రాయడానికి మాత్రం కొంచెం ఎక్కువే సమయం పట్టింది. కారణం కాస్త ఎక్కువ కేసెస్ స్టడీ చేసి వాటిని, ఒక ఆర్డర్‌లో పెట్టి రాయవలసిన అవసరం ఉండడం వల్ల.
ప్రశ్న 8. ఈ నవలని ఉగాది రోజున పార్వతమ్మ, వసంత పాత్రలతో మొదలుపెట్టి మళ్లీ ఉగాది నాటికి ఆ రెండు పాత్రలతోనే ముగించారు. ఇది యాదృచ్ఛికమా? లేక ఒక ప్రణాళిక ప్రకారం కథని అలా నడిపించారా?
జ: ఈ నవల ఒక ఉగాది రోజున రాయడం మొదలుపెట్టి, ఆ తర్వాతి ఉగాది రోజున పూర్తి చేశాను. నవలలో జరిగిన కథాకాలం కూడా రెండు ఉగాదుల మధ్య ఉండాలని అనుకునే రాశాను. అలాగే పార్వతమ్మ, వసంత అనే రెండు పాత్రలతో నవల ప్రారంభించాను. మళ్లీ ఆ రెండు పాత్రలతోనే ముగించాలని అనుకుని రాసినదే! యాదృచ్ఛికం కాదు.
ప్రశ్న 9. వ్యక్తిగతంగా ఈ రచనలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఏ పాత్ర సృజన కోసం కష్టపడ్డారు? ఈ పాత్రను ఇలా కాక మరోరకంగా మలచివుంటే బాగుండేది అని అనిపించిన పాత్ర ఏదైనా వుందా?
జ: వసంత పాత్ర. ఆ పాత్ర కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ, నిరాశపడుతూనే నిబ్బరంగా నిలదొక్కుకుంటూ ఉంటుంది. స్నేహశీలి. సున్నిత మనస్కురాలు. అప్పుడప్పుడు కాస్త ఆవేశపడుతూ కూడా ఉంటుంది. ఆ పాత్ర అతి సహజమైన పాత్ర. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా ఉదాత్తమైన భావాలు కలిగిన స్త్రీ మూర్తి. ఇతరుల పట్ల దయ, కరుణ చూపగలిగిన సంస్కారవంతురాలు.
ఈ నవలలోని ఏ పాత్ర సృజనలోనూ నేను కష్టపడలేదు. ఈ నవలలోని క్యారెక్టర్స్ వంటి మనుషులను నేను చూసి ఉన్నాను కాబట్టి సులువుగానే రాయగలిగాను. ఏ పాత్రా నా చేయి దాటి, స్వతంత్రంగా ప్రవర్తించలేదు. ప్రతి పాత్రనీ ఎలా నేను రాయాలని ఊహించుకున్నానో అలాగే చిత్రించాను.
ప్రశ్న 10. తమపై చిన్నతనంలో అన్నలు/తమ్ముళ్ళు చూపిన ఆదరణ/ప్రేమ – పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయాకా చూపించరేమని ఓ పాత్ర బాధపడుతుంది. బహుశా ప్రస్తుత సమాజంలోని ఎందరో ఆడపిల్లల మనోభావం అదే కావచ్చు. దీనికి మీరేం పరిష్కారం చూపిస్తారు?
జ: నన్ను పరిష్కారం అడిగితే, ఆ సోదరులతో, తోడబుట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములుగా మీదైన, మీరు ఒక్కరే ఇవ్వగలిగిన ప్రేమను, భరోసాను ఇవ్వమని చెప్తాను. ప్రేమను ఇచ్చిన ప్రేమ వచ్చును. అక్కచెల్లెళ్ల నుండి ప్రతిఫలంగా సోదరులు కూడా ప్రేమను అందుకోవచ్చు. అది వారికి కూడా ఎంతో సంతృప్తినిస్తుంది. నేటి కాలపు ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం ధన సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ, తన భార్యాపిల్లలకు మాత్రమే జీవితాన్ని అంకితం ఇచ్చేయకుండా కొంత సమయాన్ని తను పెరిగి వచ్చిన కుటుంబ బంధాల కోసం వెచ్చించాలి. ఈ ఆహ్వానం భార్యా సమేతంగా అన్నదమ్ముల నుంచి రాకుండా, అక్కచెల్లెళ్ళు వారి ఇళ్లకు వెళ్లలేరు. ఒకవేళ ఆడపిల్లలు ప్రయత్నం చేసినా ఎక్కువకాలం ఆ రాకపోకలు సాగవు. కాబట్టి ఈవిషయంలో మగపిల్లలే ముందుగా ప్రేమహస్తం, తోడబుట్టిన అక్కచెల్లెళ్ల వైపు చాపాలి. అప్పుడే రాఖీ పండగ, ఇంకా మిగిలిన పండగలు కళకళలాడతాయి.
ప్రశ్న11. నవలలోని ముఖ్య పాత్రలలో ఒకరైన ప్రవచనకర్త రామ్మారుతి గారి పాత్ర రూపకల్పనకి స్ఫూర్తినిచ్చిన వారెవరైనా ఉన్నారా?
జ: అదృష్టవశాత్తూ, ఈ మధ్యకాలంలో టీవీ, రేడియో ఛానల్స్‌లో పురాణేతిహాసాలను చక్కగా వినిపిస్తున్నారు. ఇది శుభ పరిణామం! ప్రత్యేకించి వాటికోసం సమయం కేటాయించలేకపోయినా, అన్ని వయసులవారూ ఇతర పనులు చేసుకుంటూ వింటున్నారు, కార్లు నడుపుకుంటూ రేడియో వినే యువతతో సహా. శాస్త్రం బాగా చదువుకున్న సహృదయులైన పండితులు కొందరు ప్రవచనాల రూపంలో మానవుల కర్తవ్యం ఏమిటీ? వారు ఎలా ప్రవర్తించాలీ? అన్న విషయాలను సలహాపూర్వకంగా చెబుతున్నారు. అలా నాలుగు మంచి మాటలు అందరి చెవినా పడుతున్నాయి. వారు ఆచరణ సాధ్యం కాని కఠినమైన మార్గంలో కాకుండా, ప్రస్తుత హడావిడి ప్రపంచానికి తగినట్టుగా, శాస్త్ర విషయాలను సులభతరం చేసి హాస్యాన్ని జోడించి, సూక్ష్మంలో మోక్షంలా మన లోపాలు చెబుతూనే మనకి ఆచరణ సాధ్యమయ్యే సూచనలు చేస్తున్నారు. అవి మూఢనమ్మకాల జోలికి పోకుండా లాజికల్ రీజనింగ్‌తో ఉండడం వల్ల అందరికీ నచ్చుతున్నాయి. వారి ప్రసంగాలు జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అటువంటివారి స్ఫూర్తి తోనే నేను రామ్మారుతి పాత్రను సృష్టించాను.
జ: ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నామనే అహంకారంతోనూ, ఆస్తులున్నాయనే ధనగర్వంతోనూ కన్నతల్లులను చులకనగా చూస్తూ, అవమానపరిచే కూతుళ్లు నిత్యజీవితంలో మనకి చాలా చోట్ల కనబడుతూనే ఉంటారు. ఇటీవలి కాలంలో ఇంకా ఎక్కువయ్యారు. అయితే కొన్ని కఠిన వాస్తవాలు, నిష్ఠురసత్యాలు అనేకమందికి అనుభవైకవేద్యమే అయినా ఎందుకో మరి చలామణిలో ఉండవు. దాన్ని ఒక రహస్యంలా దాచిపెడతారు. ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనే ఆ పాత్రను వివరంగా చూపించాను (ఆడపిల్లలు తమ తల్లుల పట్ల చూపించే నిర్లక్ష్య వైఖరిని గమనించుకుంటారన్న ఉద్దేశ్యంతో).
ప్రశ్న13. ఈ నవలలో మరొక ముఖ్యమైన పాత్ర విశాల. యవ్వనపు తొలినాటి ప్రేమ విజయవంతం కాకపోయినా, నిస్పృహతో గడపకుండా జీవితాన్ని సారవంతం చేసుకుంటూ మనోనిబ్బరంతో సాగుతుంది. ఈ పాత్ర రూపకల్పన ఎలా జరిగిందో వివరిస్తారా?
జ: విశాల పరిణత మనస్కురాలు. నాకు నచ్చిన మరో పాత్ర కూడా! విశాల, మాధవ పాత్రలు రెండూ కేవలం ఊహాజనితాలే! చదువుకునే వయసులో వారికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉన్నా, మలిసంజలో వారు మంచి మిత్రులుగా మనగలిగే స్నేహం ఏర్పరచుకోవడం అనేది చక్కని మానవ సంబంధాలకు ప్రతీక అని నేను భావించాను. ‘మనుషుల మధ్య ప్రేమ కన్నా మధురమైనది స్నేహం!’ అని నా భావన! అనుభవం కూడా! ఒకరికొకరు కష్టసుఖాల్లో వెన్నుదన్నుగా ఉంటూ ఎటువంటి సంకోచాలూ, పరిధులూ లేకుండా మనసు నలిగిన వేళ, మిత్రుల చెంత సేదదీరవచ్చు. మదిలోని మాటను వారికి విప్పి చెప్పి, ఓదార్పు పొంది తిరిగి తగిన మానసిక స్థయిర్యాన్ని పుంజుకోవచ్చు అని నా నమ్మకం.
ప్రశ్న14. ఈ నవలలో మంచివాళ్ళూ ఉన్నారు, చెడ్డవాళ్ళని అనలేము కానీ, స్వార్థపరులూ ఉన్నారు. అయితే ఉదాత్తమైన పాత్రల ప్రభావం వల్ల – స్వార్థం చూసుకునే పాత్రలలో కొంతైనా మార్పు రావడం, ఆలోచన కలగడం – ఈ నవల సాధించిన ప్రయోజనం అని భావిస్తున్నాము. ఈ మేరకు ఈ నవల రాయడంలో మీరు ఆశించిన ఉద్దేశం నెరవేరినట్టేనా?
జ: అవునండీ! నెరవేరిందనుకుంటున్నాను.అందుకు తార్కాణం ఈ నవల సంచిక.కామ్‌లో ప్రచురించబడుతున్నప్పుడు ప్రతీవారం, కనీసం పదిమంది స్పందించేవారు. అదే నా నవల ప్రయోజనం అనిపించేది. ఒకోసారి మంచివారు ఇచ్చే సలహా కొంతమందిలో తప్పకుండా మార్పును తీసుకొస్తుంది. సహజంగానే తాము చేస్తున్న పనిపట్ల కొందరికి ఇది మంచిది కాదేమో? అని వారి అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. అయితే దాన్ని వారు పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. మనసుకు దగ్గరగా వచ్చినవారు ఎవరైనా చెప్పినప్పుడు, అలాంటి సందిగ్ధ స్థితిలో ఉన్న వారు ఆ సలహాని ఆటోమేటిక్‌గా పాటిస్తారు. అనవసరం అనుకుని ఒక పిల్లర్‌ని కూల్చాలనుకున్నప్పుడు, దానిపై దెబ్బ మీద దెబ్బ వేస్తారు. ఆఖరి దెబ్బకి అది పడిపోవచ్చు. అంతమాత్రాన ఆఖరి ఆ ఒక్క దెబ్బవల్లే అది పడింది అనుకోలేము. కొందరిలో, స్థిరంగా ఒక విషయంపై, వారిలో జరుగుతున్న అంతర్మథనం, మనం సరిగానే ప్రవర్తిస్తున్నామా? అనే ఆత్మపరిశీలన కూడా (అంతరాత్మను ఏనాడో భూస్థాపితం చేసి నిశ్చింతగా బతుకుతున్న వాళ్ల విషయం కాదు) వారు తీసుకోబోయే మంచి నిర్ణయానికి కారణం కావచ్చు. మనుషులు ఎవరికి వారు, పరిణతితో ఉన్నాం అనుకుంటూనే కొన్ని విషయాల్లో ఇతరులను నొప్పిస్తూ ఉంటారు. వారందరికీ ఈ నవల కొన్ని సూచనలు, సలహాలుగా కాసిని మంచిమాటలు చెబుతుంది అని ఆశపడుతున్నాను.
ప్రశ్న15. ఈ నవల ‘సంచిక’ వెబ్ పత్రికలో ధారావాహికంగా వచ్చి పాఠకులను ఆకట్టుకుంది. పుస్తక రూపంలోకి వచ్చాక నవలగా స్పందన ఎలా ఉంది? ఈ నవలని పుస్తక రూపంలో తీసుకురావడంలోని అనుభవాలేవైనా పంచుకుంటారా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?
జ: ఈ నవల రిలీజ్ రోజున కొందరు మిత్రులు ఈ నవల కొని చదివారు. ఆ తర్వాత మరికొందరు పోస్ట్ ద్వారా అందుకొని చదివారు. వారిలో కొందరు ‘ఇది చాలా మంచి నవల’, ‘ఈ కాలంలో రావాల్సిన నవల’ అని కితాబిచ్చారు. సంచిక.కామ్‌లో నవల పూర్తయిన వెంటనే ఈ నవలను పుస్తకరూపంలోకి తీసుకురావాలనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నవలా ప్రతి, DTP WORK కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాలాగే కొన్ని చక్కర్లు కొట్టింది. దానివల్ల నవలాప్రచురణ కాస్త ఆలస్యం అయ్యి, చివరికి శ్రీ ఉదయ్ ప్రింటర్స్ ద్వారా ముద్రించబడింది. జూన్ నెల, 2024లో ఈ పుస్తకాన్ని హైదరాబాద్, రవీంద్రభారతి లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రచారం విషయానికి వస్తే, కొన్ని ప్రముఖ పత్రికలకి సమీక్షకి పంపడం మాత్రమే మేము చేయగలిగిన పని. కొందరు వారి పత్రికల్లో ఉండే ఆస్థాన సమీక్షకుల చేత చక్కని సమీక్షలు రాయిస్తారు. కొందరు కేవలం బుక్ షెల్ఫ్‌లో పుస్తకం ఫోటో వేసి చెయ్యి కడుక్కుంటారు. మరికొన్ని పత్రికలు ఆ పని కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా పక్కకి పడేస్తాయి. ఇకపోతే ఎవరైనా మిత్రులు చదివి, మాపై అభిమానంతో తమ విలువైన సమయాన్ని వినియోగించి సమీక్ష రాయగా, మీ సంచిక లాంటి మ్యాగజైన్లలో వచ్చిన REVIEW లే మాకు ప్రచార సాధనాలు. అంతకుమించి ఏమీ లేదు. నడుంకట్టి ప్రమోట్ చేసే గ్రూప్స్ మాకు ఎలాగూ ఉండవు కాబట్టి, గుండె రాయి చేసుకుని నిమ్మళంగా ఉండడమే, రచయితలుగా మేము చేసే అలవాటైన పని. ఏటా సంవత్సరం ప్రారంభంలో వచ్చే బుక్ ఫెయిర్‌లలో కొత్త నవలగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కొనే అవకాశం మాత్రం ఉంటుంది.అంతే!
ప్రశ్న16. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: ప్రత్యేకించి ప్రణాళికలు ఏమీ లేవు. ఒక బాధ్యత గల రచయితగా వర్తమాన పరిస్థితులను గమనిస్తూ, రచనల ద్వారా పాఠకులను చేరే క్రమంలో, సమాజ పరిశీలన అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనసు స్పందించినప్పుడు చెప్పకుండా ఉండలేనప్పుడు ఒక నవలో, కథో, కవితో లేదా కాలమ్ గానీ రాయక తప్పదు. ప్రస్తుతం ఎక్కువగా చదవడానికే సమయాన్ని వినియోగిస్తున్నాను. పూర్తి పాఠకురాలిగా మారిపోవడంలో ఒక సౌఖ్యం ఉంటుంది. ఏదో ఒక రచన కోసం డ్రాఫ్ట్ రాయడం, టైప్ చేయడం, పత్రికలకు పంపడం అనే ప్రాసెస్‌లో ఒక టెన్షన్, యాంగ్జైటీ ఉంటాయి. దానివల్ల ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోలేం. మార్కెట్లోకి వచ్చే కొత్త పుస్తకాలు చదవడం, చదవదగ్గ పాత పుస్తకాలను మళ్లీ మళ్లీ చదవడం వల్ల మనసుకు ఎంతో ఉల్లాసంగా, తేలిగ్గా ఉంటుంది. రచయితనైనందుకు నాకు నచ్చిన రచనలను ఆస్వాదించే పాఠకురాలిగా నా ఆనందాన్ని మిస్ చేసుకోకూడదు కదా! అనిపిస్తోందిప్పుడు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు అల్లూరి గౌరీలక్ష్మి గారూ.
అల్లూరి గౌరీలక్ష్మి: ధన్యవాదాలండీ! నా నవలను ప్రచురించి, సమీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా నన్ను మరోసారి పాఠకుల చెంతకు చేర్చినందుకు సంచిక.కామ్ ఎడిటర్ శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికీ, శ్రీ సోమ శంకర్ గారికీ, మొత్తం సంచిక టీమ్ కీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.
***
రచన: అల్లూరి (పెన్మెత్స) గౌరీ లక్ష్మి.
పేజీలు:230
వెల: ₹ 200/-
ప్రతులకు:
9948392357
~
‘మలిసంజ కెంజాయ!’ నవల సమీక్ష
https://sanchika.com/malisanja-kenjaya-book-review-gls/