[‘లేత మనసులు’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం చివుకుల శ్రీలక్ష్మి గారూ.
చివుకుల శ్రీలక్ష్మి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1. మీరు రాసి, ప్రచురించిన 30 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ ‘లేత మనసులు’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: నా ప్రథమ కథాసంపుటి ‘లేత మనసులు’ సంచిక ద్వారా పరిచయం చేస్తున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, శ్రీ సోమశంకర్ గారికి ఇతర సంచిక టీమ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదే విధంగా అడిగిన వెంటనే అతి తక్కువ సమయంలో ‘లేత మనసులు’ పుస్తకానికి ముందుమాటలు రాసి అందించిన విజయనగరం సాహిత్య సరస్వతి డా. చాగంటి తులసి మేడమ్ గారికి, ‘కథాభీష్మ’ శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావుగారికి, దండెం రాజు ఫౌండేషన్ ద్వారా ఎంతో సాహితీసేవ చేస్తున్న డా.రామశర్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నన్నూ, నా రచనలనూ ఎంతో ప్రోత్సహించే నాకు అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యులకూ, మిత్రులకూ, సన్నిహితులకూ, అభిమానులూ, నా శిష్యబృందానికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకు సాగుదాం.
‘లేత మనసులు’ కథా సంపుటి వెయ్యడానికి మరియొక ప్రథమ కారణం దివాకర్ అనే ఒక స్టూడెంట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుండి నా కథలపై పీహెచ్డీ చేయడానికి వచ్చి నన్ను కలిశారు. అప్పటికి అస్తవ్యస్తంగా తలొకచోట పడి ఉన్న కథల సమూహంలో నుండి ఏరి కొన్ని కథలను ఇచ్చాను. అప్పుడే అనుకున్నాను ఒక సంపుటి ఉంటే ఆ పుస్తకం ఇస్తే సరిపోయేది కదా అని. అందువలన సంపుటి వేయటానికి వేదిక కోసం వెతుకుతుండగా రామశర్మ గారు కల్పించారు.
అదే విధంగా శ్రీమతి శశికళ గారు సోంపేట నుండి మహిళా రచయిత్రుల కథలపై రీసెర్చ్ చేస్తున్నారు. నన్నూ, నా కథలను కూడా తమ పరిశోధనకు వినియోగిస్తామని అడుగగా ఆమెకు నా కథలను జిరాక్స్ తీసి పంపించడం జరిగింది.
నేను రాసిన మొదటి కథ ‘మరో కోణం’ దగ్గర నుండి ఇటీవల రాసిన ‘దృక్పథం’ కథ వరకు ఇంచుమించు అన్ని కథలకూ ఎక్కడో అక్కడ జరిగిన సంఘటనలే ఆధారం.
అదే విధంగా ‘లేత మనసులు’ కథ కూడా జరిగినదే! పసిపిల్లలతో మనం మమేకం కాగలిగితే ఎంత ఆనందం పొందవచ్చు అన్నది లేత మనసులు కథ! ఆ కథకు అంతకంటే మంచి పేరు నాకు దొరకలేదు.
అలాగే ప్రతి కథ పేరు కూడా కథను గురించి సూచించేదిగా ఉంటుంది. అది అసంకల్పితంగానే జరుగుతూ ఉంటుంది.
ప్రశ్న 2. “చివుకుల శ్రీలక్ష్మి ఇన్ని సంవత్సరాలుగా వ్రాసిన కథల లోంచి విలువలతో కూడిన కథలను ఏరి ‘లేత మనసులు’ పేరుతో తొలి కథల సంపుటి వేసుకోవడం చాలా ఆనందదాయకం” అన్నారు డా. చాగంటి తులసిగారు తమ ముందుమాటలో. మీరు మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: మొట్టమొదటిగా నేను కాకినాడ తెలుగు సాహితీ సమాఖ్య వారి కవితల పోటీకి ‘మహిలో మనుగడ’ అనే పేరుతో కవితను పంపించాను. దానికి ప్రత్యేక బహుమతి వచ్చింది. పుస్తకం వెలువరించారు. అందుకోసం 20 రూపాయలు పంపమంటే పంపలేకపోయాను. అందువలన దాని ప్రతి నా దగ్గర లేదు. తర్వాత నుంచి కథలూ, కవితలూ సమానంగానే ప్రాధాన్యం ఇస్తూ రాసాను. కాకపోతే కథల సంఖ్య తక్కువ. కవితలు చాలా ఎక్కువ.
కథలు కవితలతో పాటుగా రేడియోలో కథలు, కవితలూ, వ్యాసాలు చదవడం, నాటకాలకు దర్శకత్వం వహించడం, విశ్వవిద్యాలయస్థాయిలో సదస్సులలో పత్ర సమర్పణలు, యూట్యూబ్‌కు లఘు చిత్రాలు తయారు చేయడం ఇవి నా హాబీలు
అదేవిధంగా మొట్టమొదటిసారి హైదరాబాదులో రవీంద్రభారతి దగ్గర ‘విశ్వంభర’ నృత్య నాటిక చూడడానికి మా స్నేహితురాలితో కలిసి వెళ్లాను.
‘విశ్వంభర’ రచయిత, ‘జ్ఞానపీఠ్’ పురస్కారగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డిగారిని చూసి, కలిసి, మాట్లాడే భాగ్యం కలిగింది. వారితో మాట్లాడినప్పుడు “విజయనగరం నుండి వచ్చాను.” అని చెబితే “అమ్మా! నీ రచనలు విజయనగరం గొప్పదనాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా ఉండాలి. అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను విజయనగరం వైభవానికి ‘దిక్సూచి’ పుస్తకం రాయడానికి ప్రారంభించాను. సుమారు నాలుగు సంవత్సరములు పట్టింది అది రాయటానికి.
తరువాత ‘ఆది నుండి అనంతం దాకా..’ భారతదేశ గొప్పతనం గురించి వచన కవితల రూపంలో వ్రాయాలని 116 మందితో ప్రారంభించి 136 రోజులలో పూర్తి చేయడం జరిగింది. ఆ పుస్తకం
1.నైమిశారణ్యం;
2.తెలుగువిభాగం:
ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నం;
3.త్యాగరాజసభ, హైదరాబాద్;
4.నెల్లూరు;
5.బెంగళూరు:
6.సంస్కృత విశ్వవిద్యాలయం: తిరుపతిలో ఉపకులపతిగారు ఆ పుస్తకాన్ని భారతమాతకు అంకితం ఇవ్వడం జరిగినది.
ఎంతో మంది ప్రముఖులు ఆ పుస్తకాన్ని ఎంతో ప్రశంసించారు. ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ రావడమే కాకుండా అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడుగారికి కానుకగా అందించడం జరిగింది.
అది ఎంతో మధుర స్మృతి.
ప్రశ్న 3. “కథా రత్నాలమాలలో ఒక్కొక్క కథ ఒక్కో ప్రత్యేక రత్నమై వెలిగిపోతోంది. కథనం కథను ఎంతో ఎత్తులో నిలబెట్టుతోంది” అన్నారు డా. డి.ఎన్.వి. రామశర్మ తమ ముందుమాటలో. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలిలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: అన్నీ బాగుండాలి అప్పుడే కథ నిలబడుతుంది. ఎందుకంటే ఒక మహా గ్రంథానికి సరిపడినంత వస్తువుని కూడా ఒక రెండు పేజీల కథలో ముగించగలగడం అనేది రచయిత యొక్క ప్రతిభకు నిదర్శనంగా నేను భావిస్తాను. అలాంటి రచయితలు చాలామంది ఉన్నారు. శైలికి సంబంధించి ఆధునికత చాలా కొత్త పోకడలతో వెళుతోంది. అది స్వాగతించవలసిన విషయం.
నేను కథ రాయాలి అనుకున్నప్పుడు ముందుగా కథా వస్తువు, కథనం, శైలి, ముగింపు అన్నీ మనసులోనే అనుకున్న తర్వాత ఒక గంటలో రాయడం జరుగుతుంది. రాస్తూ ఆగిపోయిన సందర్భాలు చాలా తక్కువ.
ప్రశ్న 4. 1992లో తొలి కథ వ్రాశారు. ఆపై చాలా పుస్తకాలు ప్రచురించారు. కానీ దాదాపు 30 సంవత్సరాల వరకూ కథా సంపుటి వెలువరించకపోవటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? వివరించండి.
జ: కథల సంఖ్య తక్కువ కావడం కావచ్చు. కవితల సంఖ్య ఎక్కువే అయినప్పటికీ సంకలనం ఇప్పటివరకు రాలేదు అంటే ఈ మధ్యలో నేను పూర్తి సమయాన్ని విజయనగర వైభవానికి ‘దిక్సూచి’; ‘ఆది నుండి అనంతం దాకా..’, ‘శ్రీరామచంద్ర ప్రశస్తి’ 16 మంది రచయితల రచనల సంకలనం మొదలగు బృహత్ గ్రంథాల మీద కేంద్రీకరించడం కావచ్చు. వాటికి ఎక్కువ సమయము, ఆర్థిక బలము కూడా ఉండాలి. అవి రాయడం నా బాధ్యతగా భావించాను.
ప్రశ్న 5. 30 సంవత్సరాల కాలంలో రాసిన 30 కథలని ఎంచుకుని ‘లేత మనసులు’ సంపుటి వెలువరించారు. ఈ సుదీర్ఘ కాలవ్యవధిలో సమాజంలోనూ, సాహిత్య రంగంలోనూ ఏ మార్పులను మీరు గుర్తించారు?
జ: నా మొదటి కథ ‘వనిత’ మాసపత్రికలోనూ నా మొదటి కవితలు ‘ఆంధ్రభూమి’ కోయిలా… కూయిలా.. లోను ప్రచురించబడ్డాయి. ఈ మధ్యకాలంలో సమాజంలో చాలా మార్పు వచ్చింది.
వచ్చిన మార్పు సాహిత్యంలో ప్రతిఫలిస్తూ ఉన్నది. పూర్వం అపరాధ పరిశోధనలకు, శృంగారానికి, బాలలకు, యువతకు, మహిళలకూ వేరువేరు పత్రికలు ఉండేవి. వారి రచనలు అందులో వచ్చేవి. కానీ ఇప్పుడు ఒకే పత్రికలో అన్ని రకాల ప్రక్రియలను ఉంచడం వలన పత్రికలకు పాఠకుల సంఖ్య ఎక్కువైంది. ఇది నా అభిప్రాయం.
పూర్వం రచయితలు తెల్ల కాగితాల మీద ఒకవైపున కలంతో రాసేవారు. తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా రాయవలసి వచ్చేది. రెండు కాపీలు పోస్టులో పంపించడం, ప్రచురణకు అంగీకరించని రచనలను తిరిగి పంపించడానికి రిటన్‌కి కవర్లు పెట్టడం అలాంటి పనులు ఫిజికల్‌గా చేయవలసి ఉండేది.
ఇప్పుడు వాట్సాప్‌లో, యూనికోడ్‌లో రాసుకోవడం వలన వాళ్ళు ఇచ్చిన మెయిల్ లేదా వాట్సాప్ నెంబర్‌కి పంపించడం చాలా సులభం అయింది.
అదే విధంగా మారుతున్న సాంకేతికత వలన మొబైల్ లోనే తెలుగులో టైప్ చేయడానికి లేదా వాయిస్ టైపింగ్ కూడా అందుబాటులోనికి రావడం వలన రచయితలకు చాలా సమయం కలిసొచ్చింది.
ఆధునిక భావాలు కలిగిన రచయితలు/రచయిత్రులు అన్ని విభాగాలలో రాస్తున్నారు. ఇది స్వాగతించాల్సిన విషయం. అదేవిధంగా చాలా వాట్సాప్ గ్రూపులలో పద్యాలు నేర్పించడం, పద్యాలలో నూతన ప్రక్రియలను నేర్పించడం, అలాగే కథలలో కూడా సీనియర్ల చేత సూచనలు ఇప్పిస్తూ, నూతన విధానంలో రాయించడం; ఒకే అంశంపై వివిధ కథకులు గొలుసు కథలూ, సీరియల్ నవలలూ రాయించడం ఎంతో శుభ పరిణామం.
ప్రశ్న 6. తొలికథ నాటి నుంచి ఇటీవలి వాట్సప్ గ్రూపుల కథలూ, ఆడియో కథల వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అయ్యారు?
జ: అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా! అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చాలా సమయం ఉండేది. ఇప్పుడు సమయం తక్కువ కనుక మినీలకు ప్రాధాన్యత పెరిగింది.
ఈ మార్పు యూట్యూబ్‌లో కూడా మనం చూడవచ్చు. షార్ట్స్ ఒక్క నిమిషంలో చూపిస్తారు. పూర్తి వివరాలు మనకి కావాలంటే అరగంట సేపు చూడడానికి లింకు ఇస్తారు.
రచయిత ఆధునికతను స్వాగతించే వారైతే ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే సంఘటనలను తన రచనల ద్వారా కథా రూపంగానైనా, నవలా రూపంగానైనా, కవితా రూపంగానైనా రాసి అందరితో పంచుకోవడం జరుగుతుంది. దీనికి చాలా సమూహాలు, వాట్స్అప్ గ్రూపులు, అంతర్జాల పత్రికలు, అనేక వేదికలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నాయి.
రచనలలో కొంత స్పీడ్ పెరిగింది. ఇది రచయితలు అందరికీ వర్తిస్తుంది.
అంటే మొబైల్లోనే మనం టైప్ చేసుకోవడం అది తెలుగు భాషలో చేసుకునే అవకాశం రావడం దీనికి ఈ మధ్యకాలంలో వాయిస్ మనం మాట్లాడుతూ ఉంటే అది టైప్ చేస్తుంది. అక్షర దోషాలను చిన్న సవరణలు చేస్తే మనకి సరిపోతుంది.
అదేవిధంగా ‘లేతమనసులు’ పుస్తకము విజయనగరానికి చెందిన పప్పు భోగారావుగారికి అందించినప్పుడు అతను రచయితల కథలను తమ అద్భుతమైన గళంలో ఆడియోలుగా వినిపిస్తారు. ఆ విధంగా నా కథలు కూడా చాలామంది ప్రేక్షకులకు వినిపించారు. ఈ ఆడియో కథలు అనేవి ఒక దగ్గర కూర్చొని చదవకుండా మనం పనులు చేసుకుంటూ వినడానికి చాలా అనువుగా ఉంటాయి. ప్రస్తుతం చాలామంది రచయితలు తమ రచనలను తమ గళములో గాని ఇతరుల గళాలలో గాని వినిపిస్తున్నారు. ఇది చాలా మంచిగా నాకు అనిపించింది.
ప్రశ్న 7. ఈ సంపుటి లోని ‘గాంధీ గారికి స్పెషల్ ప్రైజ్’ అనే కథ చాలా చక్కని కథ అనీ, మానవతా విలువలు జోడించి రాసిన మంచికథ అని శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావుగారు తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ఆ కథకు నేపథ్యం కథలోనే ఉంది అచ్చంగా అలాగే జరిగిన కథ.
శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు మహాత్మా గాంధీ 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా గాంధీ గారిపై ప్రచురించిన కథాసాహిత్య సంకలనంలో ఈ ‘గాంధీ గారికి స్పెషల్ ప్రైజ్’ కథ కూడా చోటు చేసుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.
అలాగే ‘జీవన హేల’ కథకు దేశభక్తి కథలు సంకలనంలో చోటు దొరికింది. వారి సహృదయతకు నమస్కారములు తెలియ జేస్తున్నాను.
ప్రశ్న 8. ‘ఎప్పటికెయ్యది..’ కథలో కోవిడ్ కాలం నాటి ఫ్రంట్‌లైన్ వారియర్స్ గురించి చెప్తున్న సందర్భంలో – మానవ శరీర అవయవ వ్యవస్థతో; సమాజ, పాలనా వ్యవస్థలోని కీలక వ్యక్తులను అద్భుతంగా పోల్చారు. ఈ ఆలోచన ఎలా తట్టింది? దాని వెనుక ఏదైనా ఆసక్తికర సంఘటనో/ అనుభవమో ఉంటే వివరిస్తారా?
జ: పరిశీలన, పోలిక అనే రెండు అంశాలు రచయితలకు అవసరమని ఈ కథ నిరూపిస్తుంది.
చిన్నప్పుడు నేను 2వ తరగతి చదివేటప్పుడు తెలుగులో ఒక కథ ఉండేది. ఎవరు గొప్ప? అని. ఆ కథలో శరీరంలోని అవయవాలన్నీ పొట్టని ఏ పని చేయదు అని దానిమీద సమ్మె చేసి దానికి ఆహారం అందకుండా చేస్తాయి. అప్పుడు పొట్టకీ ఆహారం అందక నీరసం వచ్చినప్పుడు మిగిలిన అవయవాలు అన్నిటికీ అర్థమవుతుంది. తాము పొట్టపైనే ఆధారపడి ఉన్నామని. అది మన సాహిత్యం యొక్క గొప్పదనం.
డా.రామశర్మగారి కథారవళి సమూహంలో ఈ కథ పుట్టింది. కరోనా రెండు పర్యాయములు వచ్చినప్పుడు మనం అనుభవించిన బాధలనూ, కోల్పోయిన మనుషులనూ, హాస్పిటల్లో పరిస్థితులనూ, నిత్యజీవితంలో మనకు అవసరమైన ప్రతి వస్తువును అందించే ఆ సైనికులను ఎంతో మర్యాదగా చూడాలని నేర్చుకున్నారు ప్రజలు. వీటికితోడు మా నాయనమ్మ మడీ చాదస్తం, బెల్లం కాఫీలు తాగే కుటుంబాలు, అన్నీ కలిపి ఒక జంట షష్టిపూర్తిని జరుపుకునే సన్నివేశాన్ని కల్పించి కథని నడిపించాను. ఇది నిజానికి ఒక హాస్యకథ కింద రాద్దామని అనుకున్నాను. హాస్యం కంటే సాంఘిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా కథ సాగింది. మంచి కథగా మిగిలింది.
ప్రశ్న 9. ఈ సంపుటిలో పిల్లల కోసం రాసిన ‘మాటల మహిమ’ అనే కథని చేర్చారు. పెద్దల కథల మధ్య పిన్నల కథని చేర్చడం వెనుక మీ ఆలోచన ఏమిటి? అందులోనూ ఆ కథని పుస్తకంలో చివరి కథగా, విడిగా కాకుండా మధ్యలో వచ్చేలా అమర్చారు. దీని వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా?
జ: నాకు బాల సాహిత్యం అంటే చాలా ఇష్టం. చాలామంది అంటూ ఉంటారు అన్ని రకాల కథలు రాయగలం కానీ బాలసాహిత్యం రాయటం చాలా కష్టం. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా, వారికి నచ్చే విధంగా, ఆసక్తికరంగా, కథకు తగిన చిత్రం వేసేటట్లుగా చేసి గోరుముద్దలాగా పిల్లలకు అందించాలి. ఇదివరకు చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి పత్రికలు పిల్లల కోసం వచ్చేవి. కానీ ప్రస్తుతం అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు వెలువడుతున్న దిన, వార, మాసపత్రికలలో, అనుబంధ పత్రికలలో, పిల్లల కోసం వారి సాహిత్యం కోసం, వారి ఆటల కోసం, పేజీలు కేటాయిస్తున్నారు. అందువలన బాలసాహిత్యంపై అభిరుచి ఉన్నవారు అందులో వ్రాయవచ్చును.
ఈ విషయంలో బాలల కోసం ఎంతో శ్రమించిన ‘బాలసుధ’ నడిపే బండారు చిన్నరామారావుగారి పేరు తప్పనిసరిగా అందరూ స్మరించుకోవాలి. ఎందరో రచయితల ద్వారా బాలల రచనలు చేయించి, బాలలకు అందించి, స్వయంగా వారి పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడి వారికి క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారు.
నేను పిల్లల కోసం రాసిన ‘శ్రీ రామాయణ కథా ప్రశ్నోత్తర మాలిక’లో (1200 ప్రశ్న – జవాబులు ఉంటాయి. వెల: అమూల్యం) ఆ పుస్తకాలు ఒక 50 అతనికి ఇచ్చి పాఠశాలలకు పంచమని చెప్పాను. ఎవరైనా ముందుకు వచ్చి శ్రమిస్తే మన వంతు సహాయం చేయడం వేరు మనమే మొత్తం పూనుకోవడం వేరు దానికి చాలా పెద్ద మనసు కావాలి.
అదే విధంగా వారి కోరిక మేరకు నేను భారతంలోని బాలల కథలను వారి మాస పత్రిక ‘బాలసుధ’ కోసం 12 నెలలు రాసి పంపించాను. “మరొక 12 పంపిస్తే పుస్తకం వేయించి, అందరికీ అందిస్తాను” అన్నారు. నాకున్న పని ఒత్తిడి వలన చేయలేకపోయాను. అందుకు చాలా విచారిస్తూ ఉంటాను. అందులోనిదే ఈ కథ ‘మాటల మహిమ’. పిల్లల కథలకు పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో ఆ పుస్తకం మధ్యలో కథ ఉంచడం జరిగింది.
ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: హహహ! రచయితలకు వారి కథలన్నీ వారి బిడ్డలే! చిన్న చిన్న లోపాలున్నా వారి కథల పట్ల వారి మక్కువ వారి సంతానం పట్ల గల మక్కువతో ఏ మాత్రం తీసిపోదు. ఇది నా భావన.
ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: కథ రాయాలి అనుకున్న తర్వాత దాని పూర్తి స్వరూపం మనసులో రూపుదిద్దుకున్న తరువాతే పేపర్ మీదకు పెడతాను.
అలా పూర్తికాని కథలన్నీ గాల్లో కలిసిపోతాయి. అందువల్లనే నేను రాసిన కథల సంఖ్య తక్కువ.
రాయడంలో ఏ కథ ఎక్కువ కష్టం అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి కథా ఎంత కష్టమో అంతే సులభం.
‘మరీచిక’ కథ కథారవళి సమూహంలో పెట్టినపుడు ముగింపు విషయంలో సమూహంలో చర్చ బాగా నడిచింది. ముగింపు ఏ విధంగా బాగుంటుందో మీరు రాసి పంపిస్తే పుస్తకంలో వేస్తాను. అన్నాను. ఎక్కువ మంది పంపి ఉంటే కథ చివరన వారి పేర్లతో వేసి ఉండేదాన్ని. ఇద్దరు, ముగ్గురు పంపారు.
ప్రశ్న12. ‘లేత మనసులు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
ఎందుకంటే.. వారు పెద్ద మనసుతో పుస్తకావిష్కరణకు అంగీకరించడమే కాకుండా తనకు తెలిసిన ప్రింటర్ గురించి నాకు పరిచయం చేశారు ఎంతో ఆనందం కలిగింది. 8 వ తేదీ జూలై 2023 అంటే లేత మనసులు పుస్తకానికి ఏడాది పుట్టినరోజు జరిగింది.
పాఠకుల ఆదరణ
వార్షికోత్సవ సంబరాలకు హాజరైన ఎందరో పెద్దలకు, మిత్రులకు ఈ పుస్తకం అందించిన తృప్తి.
విజయనగరంలో లాయర్ బాబుగా పిలువబడే ఎస్.ఎస్.ఎస్.ఎస్. రాజుగారు మంచి సాహిత్య అభిమాని.
ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రచయితల దగ్గర సగం ఖరీదుకి పుస్తకాలు కొని, ఎవరిని కలిసినా పుస్తకం బహుమతిగా ఇస్తారు.
విజయనగరంలో వాకర్స్ క్లబ్ తరఫున నాకు సన్మానం జరిపి, సుమారు ఒక వంద పుస్తకాలు కొని అందరికీ పంచారు.
నాకు చాలా ఆనందం కలిగింది.
ఏ రచయితకైనా తన రచన ఎక్కువమంది చదివితే కలిగే ఆనందం అనిర్వచనీయం.
కథల సంపుటి ఒకేసారి నవలలాగా చదవనక్కరలేదు. చదివిన కథ నచ్చగానే రచయితకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేయవచ్చును.
ప్రశ్న13. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? మీరు త్వరలో వెలువరించనున్న ‘నాదయోగులు’, ‘సహస్ర తెలుగు శతకాల సంకలనం’ గురించి వివరిస్తారా?
జ: భవిష్యత్ ప్రణాళిక నేను మొదలు పెట్టిన రెండు బృహత్ గ్రంథాలనూ పూర్తి చేసి, ప్రచురించడం.
నాదయోగులు:
విజయనగర వైభవానికి దిక్సూచి పుస్తకం 2017 ఆగస్టులో ఆవిష్కరణ జరిగిన తర్వాత ఏమి రాయాలా? అన్నదానికి ఒక ఆలోచన ఉండేది.
విజయనగర వైభవానికి దిక్సూచి పుస్తకంలో విషయసేకరణ కోసం అనేక పర్యాయాలు నేను విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాలకు వెళ్లడం జరిగింది. ఆరు బయట చెట్ల క్రింద వివిధ ప్రక్రియలలో (గాత్రం, నాట్యం, వయొలిన్, సన్నాయి, డోలు, మృదంగం విభాగాల్లో) అభ్యాసం చేస్తున్న విద్యార్థులను చూసిన తర్వాత ఆ గాలిలో ఒక పవిత్రత కనిపించింది. షష్టిపూర్తి సమయంలో గాత్రం ఒకటవ తరగతిలో నేను చేరడం అనేది నా సంకల్పం అయితే కాదు. ఎందుకంటే అంతకుముందు చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులు నాకు తెలుసు నా గళం విని సంగీతం నేర్చుకోమని వాళ్లు అడగడం కూడా జరిగేది. కానీ దేనికైనా సమయం రావాలి అని పెద్దలు అంటారు కదా! 2018 సంవత్సరంలో నేను అక్కడ గాత్రం అధ్యాపకురాలు శ్రీమతి చాగంటి రాజ్యలక్ష్మిగారి దగ్గర విద్యార్థినిగా చేరడం జరిగింది. 2019లో కళాశాలకు శత వార్షికసంబరాలు జరిగే సమయంలో అక్కడ ఒక విద్యార్థినిగా నేను పాల్గొనడం ఒక అద్భుతం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ కళాశాలతో సంబంధం ఉన్న ఎందరో మహనీయులు అక్కడకు వచ్చి ఆ వేదిక మీద నుంచి ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఆ సమయంలో శతగళార్చనలో నేను కూడా వేదికపై పాల్గొన్నాను. మా బృందం మధ్యలో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ హరి జవహర్ లాల్ గారు కూడా కూర్చుని థిల్లానా పాడడం అద్భుతం.
ఈ సందర్భం కోసమే నేను ఎంతో శ్రమకూర్చి మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల విజయనగరం పేరుతో గంటన్నర నిడివిగల నాలుగు ఎపిసోడ్లు లఘు చిత్రం తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి విజయనగరం సంగీత కళాశాల పేరుతో రెండు ఎపిసోడ్లు ఆ కళాశాల గురించి మాట్లాడటం జరిగింది. సాహిత్యంలో ఒక స్థాయిని చేరిన నేను సంగీతంలో మొదటి మెట్టు ‘స’ అనే స్వరం మీద నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉండేది. ప్రాక్టికల్ గా కంటే నేను థియరీ చదివేటప్పుడు అందులోని నిగూఢమైన భావాలను ఆ వాగ్గేయకారులను గురించి చదివేటప్పుడు నాలో ఒక ఆనందం ఉప్పొంగి, ఇంకా దీనిని లోతైన అధ్యయనం చేసి మన ప్రాచీన సంగీతాన్ని ఇప్పటి వారికి అందజేయాలి అని అనిపించింది.
ఆ మూడు రోజులు వేదికను అలరించిన పెద్దలందరికి నా ప్రయత్నం చెప్పి వారి ఆశీస్సులు తీసుకున్నాను. కానీ సంగీతంలో ఒక స్థాయికి చేరడం అనేది చాలా అవసరం అనిపించింది. అందువలన ఈ నాదయోగులకు పునాది పడి ఆరు సంవత్సరాలు జరిగింది. నేను సంగీతం నేర్చుకోవడం నాదయోగులు పుస్తకానికి పునాది కోసం మాత్రమే. రాస్తూనే ఉన్నాను. ఇంకా పూర్తి కావడం లేదు ఇప్పుడు డిప్లమో పరీక్ష కూడా రాసిన తర్వాత నేను తొందరలో ఇది పూర్తి చేయగల శక్తి లభించినట్లు భావిస్తున్నాను.
సహస్ర తెలుగు శతకాల సంకలనం.
తెలుగు భాష అంటే అందరిలాగే నాకు కూడా చాలా మక్కువ. ఎంతో గాఢమైన విషయాన్ని కూడా నాలుగు పంక్తులు గల పద్యంలో అద్భుతంగా చెప్పగల ఒక ప్రక్రియ పద్యం. అందులో మకుటంతో కూడిన పద్యం అయితే ఇంకా ఆనందం. తెలుగు వాళ్ళందరూ తమ విద్యాభ్యాసం సమయంలో తెలుగు పద్యాలు సుమతి, వేమన, దాశరథి శతకం మొదలైన పద్యాలు చదివి ఉంటారు. పద్యం చదవని తెలుగు వాళ్ళు ఉండరు.
మా తాతయ్యగారు కోట అనంత శాస్త్రిగారు ‘అనంత గీతావళి’ అనే ఒక శతకాన్ని రాశారు.
మా నాన్నగారు కోట దేవప్రసాద్ భగవద్గీతను 108 పద్యాలలో అందంగా తెలిపారు.
నేను కూడా సత్యసాయిబాబా వారి మీద 108 పద్యాలతో ‘సాయి గీతాంజలి’ రాసి బాబావారికి అందించాను.
కరోనా సమయంలో అనేక విశ్వవిద్యాలయాలు అంతర్జాల వేదికలు ఏర్పాటుచేసి పలు విషయాలపైన సదస్సులు నిర్వహించాయి. అందులో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ‘తెలుగు శతక సాహిత్యం’ గురించి నిర్వహించిన సదస్సులో నేను విజయనగర సంస్థానానికి చెందిన శ్రీ గోగులపాటి కూర్మనాధ కవిగారు సాధారణ శకం 1720 నుంచి 1740 ప్రాంతంలో వ్రాసిన “సింహాద్రి నారసింహశతకం” పైన మాట్లాడాను. ఆ సదస్సులో మాట్లాడిన అనేకమంది ప్రముఖుల అభిప్రాయాలను విన్న తర్వాత నాకు మన శతకాలను ఒక సంకలనంగా తీసుకురావాలి. ఏ భాషకు లేని గొప్ప సంపద మనది అని ఉద్దేశంతో సాధారణ శకము 1000 నుండి 2020 వరకూ వ్రాయబడిన ముద్రిత, అముద్రిత శతకాలని సేకరించడం ప్రారంభించాను. మహాభారతంలోనే శతకం యొక్క పునాది ఉన్నది అందువలన నన్నయ్య మొదటి శతకకారుడుగా పరిచయం చేస్తూ ఈ శతక సంకలనం తయారు చేస్తున్నాను. ప్రస్తుతానికి నా వద్దకు చేరినవి సుమారు ఒక నాలుగు వందలు మాత్రమే నేను ఇంకా అనేక గ్రంథాలయాలను సందర్శించి సేకరణ చేయవలసి ఉన్నది. తప్పకుండా ఆ కార్యం జరుగుతుందని భావిస్తున్నాను.
అనేకమంది పెద్దలు వారి శతకాలను మాత్రమే కాక వారి పూర్వీకులవి, వారి స్నేహితులవి, బంధువులవి, కూడా నాకు అందించారు. వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు చివుకుల శ్రీలక్ష్మి గారూ.
చివుకుల శ్రీలక్ష్మి: ధన్యవాదాలండీ.
***
రచన: చివుకుల శ్రీలక్ష్మి
పేజీలు: (150+x) 160
వెల: ₹ 150/-
ప్రతులకు:
చివుకుల శ్రీలక్ష్మి
ఇంటి నెంబరు 20-24-18
పద్మావతి నగర్, ఆరవ వీధి
విజయనగరం- 535002
ఫోన్: 9441957325
~
‘లేత మనసులు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/leta-manasulu-book-review-kss/