కవయిత్రి, అనువాదకురాలు శ్రీమతి షేక్ కాశింబి ప్రత్యేక ఇంటర్వ్యూ

19
1

[‘చూస్తుండగానే’ అనే కవితా సంపుటిని వెలువరించిన శ్రీమతి షేక్ కాశింబి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం షేక్ కాశింబి గారూ.

షేక్ కాశింబి: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. చూస్తూండగానేకవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. 58 కవితలున్న ఈ సంపుటికి 16వ కవిత పేరునే శీర్షికగా ఎందుకు ఎంచుకున్నారు? వివరిస్తారా?

జ: ఈ కవిత సమాజంలో ప్రబలుతున్న మత్తుమందుల సేవనం గురించి ఆర్తితో రాసినది. ‘డ్రగ్స్’ అనేవి ఒకప్పుడు ఎక్కడో దొరికేవి. వాడే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడో పట్టుబడుతుండేవి. కానీ చూస్తుండగానే.. ఈ మహమ్మారి సర్వవ్యాపిగా మారి సమాజాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా యువతరాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ సంపుటి లోని బలమైన కవితల్లో ఇదొకటి. దీని వైపు పాఠకుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది.

ఆదరించి, దారి చూపిన అన్నయ్య, వదినలు – శ్రీ షేక్ మస్తాన్ వలి, శ్రీమతి అస్మత్ ఆరా లతో కవయిత్రి

ప్రశ్న 2. “కాశింబి కవిత్వమంతా మానవీయ దృక్పథంతోనే కొనసాగుతుంది. ఇవాళ్టి అస్తిత్వవాదాల పట్ల మొగ్గు చూపలేదు. తనదైన శైలిలోనే మానవతావాదాన్ని చాటుకున్నారు. తాను కవయిత్రిగా ఎదుగుతున్న క్రమంలో ఈ ఏడేళ్ళలో మంచి పరిణతి సాధించారనే చెప్పవచ్చు” అని ముందుమాటలో డా. రాధేయ గారు వ్యాఖ్యానించారు. కవయిత్రిగా, అనువాదకురాలిగా మీ సాహిత్య ప్రస్థానం గురించి చెప్తారా?

జ: డా. రాధేయ గారి వ్యాఖ్యానాన్ని సత్యమని నమ్ముతున్నాను. ఎందుకంటే.. వారితో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిజానికి నా రచనా వ్యాసంగం – నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ప్రారంభమైంది. డిగ్రీ పూర్తయ్యే నాటికే ‘ఆంధ్రభూమి’, ‘ప్రగతి’, ‘కాలమేఘం’ (ఒంగోలు) వంటి పత్రికలలో దాదాపు 20-25 కవితలు ప్రచురింపబడ్డాయి. అడపాదడపా రాస్తున్నా – కారణాంతరాల వలన ఈ ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడి – తిరిగి రిటైర్మెంట్ తర్వాత డా. సి భవానీ దేవి గారి చొరవతో పునరుజ్జీవమై, పుస్తక రూపం దాల్చింది. అప్పట్నించి నిర్విఘ్నంగా కొనసాగడం దైవకృపగా భావిస్తాను. ఇంతవరకు వచ్చిన నా రచనలు:-

  • అంతశ్చేతన – తెలుగు కవితా సంపుటి 2017
  • జీవితం పేరు – తెలుగు కవితా సంపుటి 2021
  • చూస్తుండగానే – తెలుగు కవితా సంపుటి 2024 (ISBN NO: 978-93-340-4621-2)
  • तप्तशिला (తప్తశిల) (2021) డా. సి. భవానీదేని గారి తెలుగు కథా సంపుటికి హిందీ అనువాదం – (ISBN 978-81-952225-0-6)
  • फीनिक्स (ఫీనిక్స్) (2024) – హిందీ కవితా సంకలనం (ISBN: 978-13-340-1499-0)

ప్రశ్న 3. కవిత్వం అనేది మౌలికంగా అనుభూతి ప్రధానమైనది. ఎలాంటి అనుభూతులు మీ విభిన్నమైన కవితలకి ప్రేరణగా నిలిచాయి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.

జ: మీరన్నది అక్షర సత్యం. నేను ఎదుర్కొన్న లేక నాకెదురైన జీవితపు భిన్న పార్శ్వాలు.. ఆయా సందర్భాల్లో నా ప్రతిస్పందనలు చాలా వరకు నా కవితలకి ప్రేరణలు. ఇందులో వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి, వృత్తిపరమైనవి, సమాజగతమైనవి కూడా మిళతమై ఉన్నాయి. మానవ సంబంధాల విషమతలు నన్నెక్కువగా ప్రభావితం చేశాయి. అందుకే ఈ దిశగా ఎక్కువ దృష్టి పెట్టి రాశాను..

కుటుంబ సభ్యులతో కవయిత్రి

ప్రశ్న 4. ఈ సంపుటి లోని కవితలకు ఏకసూత్రత ఉందా? ఒక్కో కవిత విడివిడిగా కనబడినా, సంపుటిలో వాటినన్నింటినీ కలిపి ఉంచిన కనబడని దారం లాంటి అంతస్సూత్రం గురించి చెప్పండి.

జ: మంచి ప్రశ్న వేశారండీ! కళ్ళ ముందు కదిలే ఆర్థిక, సామాజిక వైషమ్యాలు, మత, లింగ పరమైన వివక్షలు నన్నెక్కువ ఆర్ద్రపరిచాయి. ఆ ఆర్ద్రత నుండి, ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలనే ఆవేదన, ఆతృత, తీవ్రమైన సంఘర్షణ నుంచి నా కవిత్వం ఉద్భవించింది. కవితల శీర్షికలు, అందులో వెలిబుచ్చిన లేక చర్చించిన విషయాలు భిన్నంగా కనిపించినా.. వీటి వెనుక ఉన్న ఏకసూత్రత ఇదే. ఈ భావావేశం, ఊపిరాడనితనం – వాటి సముద్ధరణ, కనీస పరిష్కరానికి గొంతెత్తాలనే నా ఆరాటం.. ఈ రచనలకి మూలమైన దారం.

ప్రశ్న 5. కవిత్వానికి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: నిజానికివన్నీ ప్రభావాత్మకమైన కవిత్వానికి అవసరమే. దేని ప్రాధ్యానత దానిదే. అయితే, నేను వస్తువుకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. ఈ సందర్భంలో ఆరుద్రగారి కవితా పంక్తులు గుర్తు చెయ్యడం సముచితంగా భావిస్తాను.

‘కీర్తి కోసం కాక ఆర్తి వల్ల అరిస్తే
చెప్పకుండానే ఏదో ఒక ఛందంలో
చెవికింపుగా వినసొంపుగా
కవి పలకడం ఖచ్చితంగా ఖాయం’

ఇది నా నమ్మకం కూడా.

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యవర్గ సభ్యురాలుగా..

ప్రశ్న 6. 70 ఎమ్. ఎమ్.కవితలో “ఉద్యమాలకు అందని సమానత్వపు చంద్రుణ్ణి/ఉనికి మాత్రంతోనే నేలపైకి దించింది” అన్నారు. ఉద్యమాల ద్వారా సమానత్వాన్ని సాధించలేకపోయామని, కరోనా ఆ పని చేసిందని అన్నారు. కానీ ఆ ఉపద్రవపు తీవ్రత సమసిపోగానే మనుషుల్లో వ్యక్తిగత/సామాజిక అవలక్షణాలు మళ్ళీ తలెత్తున్నాయి కదా. మరి దీని గురించి మీ అభిప్రాయం?

జ: మీరే అంటున్నారు కదా, అవలక్షణాలని! వాటికి మనిషి ఆత్మ లోంచి పుట్టే గట్టి సంకల్పమే విరుగుడు కాగలదు. నేటి సమాజంలో మంచిని ఆచరించాలన్న సంకల్పబలం కన్నా భయానికి, బెదిరింపులకు ఎక్కువ ప్రభావితులౌతున్నారు జనం. జన మానసాల్లో పరిణతి, దూరాలోచన ఉంటేనే.. ఏ కరోనా రాకున్నా.. మార్పు సాధ్యమవుతుంది. కానీ, అది అంత సులువుగా నెరవేరదేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనంలో ఓర్పు, నిలకడ, నిజాయితీ కొరవడ్డాయి. చిటికెలో అన్నీ జరగాలనే తత్వం పెరిగింది.

తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయబాబు గారిచే సన్మానం పొందుతూ..

ప్రశ్న 7. ఈ సంపుటి శీర్షికగా నిలిచిన చూస్తుండగానేఅనే కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?

జ: ‘డ్రగ్ ఎడిక్టు’లయిన ఒకరిద్దరు యువకులు చూస్తూండగానే పూర్తిగా దిగజారి ఆరోగ్యం కోల్పోవడం.. వారి కుటుంబాలు మనోవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం కావడం.. మనసుని గాయపరిచింది. అదృష్టవశాత్తూ వారు కొంత కాలానికి బాగుపడ్డారు. ఒకవేళ ‘వారు మారకుంటే..’ అన్న భావనే ఈ కవితకి నేపథ్యం.

ప్రశ్న 8. బాపట్ల రచయితల సంఘం నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దసరా వేషాలుకవిత నేపథ్యాన్ని వివరిస్తారా?

జ: తప్పకుండా! నా చిన్నతనంలో మా ఊర్లో (దరిశి, ప్రకాశం జిల్లా), దసరా సమయంలో దాదాపు 11 రోజులు దసరా వేషాలు కొనసాగేవి. అందులో ముఖ్యమైనవి – దొంగవేషం, పులి వేషం, పిట్టల దొర వేషం ఉండేవి. పిల్లలందరం వారి వెంట ఊరంతా తిరిగి ఆనందించే వాళ్ళం. ఆ జ్ఞాపకాలే ఈ కవితకి నేపథ్యం.

గత ఉగాదికి సాహితీకిరణం వారి కవితలపోటీలో శ్రీ బైసా దేవదాస్ గారినించి బహుమతి స్వీకరిస్తూ..

ప్రశ్న 9. సాధారణంగా రచయితలకు వారి రచనలన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది?

జ: మీరన్నది అక్షరాల సత్యం. అన్ని కవితలూ నచ్చినవే అయినా అనాథ బాలలను ఉద్దేశించి రాసిన ‘మనలో ఒకరు’ నాకు నచ్చిన కవిత. నిజానికిది ఒక కవితల పోటీ కోసం రాసిన కవిత. అయితే, సరైన సమయానికి పంపలేక పోయాను. ఇది ఎక్కువ ఆర్ద్రపరిచిన కవిత. కన్నీళ్ళ తోనే దీన్ని రాశాను.

ప్రశ్న 10. ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఏ కవితలోని పంక్తులైనా మరో విధంగా రాసి ఉంటే భావ వ్యక్తీకరణ బాగుండేది అని అనిపించిందా?

జ: భావావేశము, సంఘర్షణల తర్వాత కవితకు జన్మనివ్వడం సాధారణం. ఇది ఎంతో ఇష్టంతో చేసే పని గనుక కష్టంగా అనిపించదు. కొన్ని కవితల్ని గంటల్లో పూర్తి చేస్తే, కొన్ని రోజులు, వారాలు, నెలలు పట్టవచ్చు, తప్ప ఆ క్రమంలో ఏం జరిగినా.. కవిత చూసుకున్నాక మరేమీ తెలియదు.. సాధారణంగా నాకు నచ్చిన సరళిని ఒకటికి రెండుసార్లు, సరి చూసుకునే రాస్తాను. గనుక, మరో విధంగా రాస్తే బాగుండేదన్న ఆలోచన రాలేదు.

భవానిదేవి గారు.. ఇతర సంఘ సభ్యులతో..

ప్రశ్న11. డా. సి. భవానీదేవి గారి కథల సంపుటిని తప్తశిలపేరిట హిందీలోకి అనువదించారు. తెలుగు భావాలను, ఉద్వేగాలను, ఉపమానాలను హిందీలోకి తర్జుమా చేయడంలో ఏవైనా ఇబ్బందులెదుర్కున్నారా? అనువాదానికి స్పందన ఎలా ఉంది?

జ: చిన్న చిన్న ఇబ్బందులు అనువాదకులందరికీ సాధారణంగా ఎదురయ్యేవే – ‘ముక్కాలి పీట’, ‘తలంబ్రాలు’, ‘అరిసెలు’, ‘మరచెంబు’, ‘మడి’ వంటి పదాల కోసం మిత్రులను సంప్రదించాను. కొన్నింటిని ఫుట్‌నోట్‌లో వివరించడం జరిగింది. అనువాదానికి స్పందన సంతృప్తి కరంగా ఉంది.

ప్రపంచ తెలుగు మహాసభల్లో..

ప్రశ్న12. ఫీనిక్స్పేరిట హిందీలో ఓ కవితా సంపుటి ప్రచురించారు కదా, ఆ పుస్తకం గురించి పాఠకులకు వివరిస్తారా?

జ: ‘ఫీనిక్స్’, మౌలికమైన హిందీ రచన. ఇందులో 61 కవితలు హిందీలో రాసినవి. 09 కవితలు తెలుగు నుంచి అనువదించినవి. ఈ అనువాద కవితల్లో మూడు డా. సి. భవానీ దేవి గారివి, ఒకటి శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిది, మూడు శ్రీ మహమ్మద్ ఖాన్ గారివి, రెండు మా అన్నయ్య షేక్ మస్తాన్ వలి గారివి ఉన్నాయి. హిందీలో ప్రచురింపబడినవి, ఆకాశవాణిలో ప్రసారమైనవి, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో చదివిన కవితలు.. ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.

ప్రొఫెసర్లు, పెద్దలు, మిత్రులు, శిష్యుల అభినందనలు పొందింది. ఇంకా జనం లోకి వెళ్ళవలసి ఉంది.

అమరావతి సాహితీమిత్రులు సంస్థ ద్వారా ఉగాది పురస్కారం పొందుతూ.. శ్రీ రావి రంగారవు గారు.. శ్రీ పాపినేని శివశంకర్ గార్లతో..

ప్రశ్న13. చూస్తూండగానేకవితా సంపుటి ప్రచురణలో ఏవైనా గుర్తుండిపోయే అనుభవాలు ఉన్నాయా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: ప్రత్యేకమైన అనుభవాలంటూ ఏమీ లేకున్నా.. ఈ పుస్తకానికి సంబంధించిన పనులన్నీ నెల లోపే పూర్తవడం ఒక మంచి జ్ఞాపకం. మిత్రులు, సమీక్షకులు, ఆత్మీయుల మన్ననలు పొందిందని చెప్పగలను. పాఠకుల ఆదరణ మొదలైంది. కానీ ఇంకా ఊపందుకోవల్సి ఉంది.

ప్రశ్న14. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? ఏవైనా పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?

జ: నిర్దుష్టమైన రచనలు చెయ్యాలనే ప్రణాళికేమీ లేదు. ప్రభావాత్మకమైన గుర్తుండిపోయే కవితల్ని.. ముఖ్యంగా దేశభక్తి కవితల్ని రాయాలని అనుకుంటున్నాను.

ఒక దీర్ఘకవిత తుది మెరుగుల్లో ఉంది. బహుశా అదే నా తదుపరి ప్రచురణ కావచ్చును.

ప్రశ్న15. సాహిత్యానికి సంబంధించి ఇంకేమైనా చెప్తారా?

జ: తప్పకుండా!

  • హిందీలో ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాల నుంచి దాదాపు 30 కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఇందులో నేను S.C.I.M. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నప్పుడు నా విద్యార్థులు 10 మందితో కలిపి చేసిన ‘శాస్త్ర సమ్మేళన్’ అనే ఏకాంకి నాటిక మా కాలేజీలో రికార్డ్ అయ్యి ప్రసారమవడం మంచి జ్ఞాపకం.
  • దూరదర్శన్ విజయవాడ నుంచి హిందీలో కవితా పఠనం ప్రసారమయ్యింది ‘గుల్‍దస్తా’ కార్యక్రమంలో.
  • దాదాపు 12 జాతీయ, 03 అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణ జరిగింది.
  • దాదాపు 5-6 వ్యాసాలు జాతీయస్థాయి సంకలనాల్లో ప్రచురింపబడ్డాయి.
  • ‘సమకాలీన్ భారతీయ సాహిత్య్’, ‘అనువాద్’ జాతీయ పత్రికల్లో తెలుగు నుంచి అనువదించిన 2 కథలు ప్రచురితములు (తెలుగులో శ్రీ మన్నె సత్యనారాయణ గారి కథలు).
  • ‘విపుల’లో హిందీ నుంచి అనువదింపబడిన కథ (శ్రీ జిందర్, పంజాబీ రచయిత) ప్రచురితం.
  • అనేక సామాజిక, సాహిత్యాంశాలపై తెలుగు, హిందీ భాషల్లో విద్యాలయాల్లోను, ఇతర వేదికలపైనా ప్రసంగించడం మంచి జ్ఞాపకం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు షేక్ కాశింబి గారూ.

షేక్ కాశింబి: ధన్యవాదాలండీ! సంచిక టీమ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

***

చూస్తుండగానే (కవిత్వం)
రచన: షేక్ కాశింబి
పేజీలు: 112
వెల: ₹ 120
ప్రతులకు:
షేక్ కాశింబి
ఫ్లాట్ నెం. 101, వైష్ణవి ఆర్చిడ్స్,
1వ లేన్, విజయపురి కాలనీ,
జె.కె.సి. కాలేజీ రోడ్,
గుంటూరు – 522 006
ఫోన్: 9052216044

 

~

‘చూస్తుండగానే’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/choostundagaane-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here