[‘శిశిర సుమాలు’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వారణాసి నాగలక్ష్మి గారూ.
వారణాసి నాగలక్ష్మి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1. మీ తాజా కథల సంపుటికి శీర్షికగా ‘శిశిర సుమాలు’ అనే పేరుని ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? మీ కృతజ్ఞాతాంజలిలో కొంత మేరకు చెప్పారు. పుస్తకం ఇంకా చదవనివారి కోసం మరింత వివరిస్తారా? పుస్తకానికి ఈ పేరుని ఎంచుకోవడంలో ‘శిశిరంలో విరిసిన కుసుమం’ అనే కథ ప్రభావం ఏమైనా ఉన్నదా?
జ: వసంతంలో అనుకూల వాతావరణంలో వికసించి సుగంధాలు వెదజల్లే అందమైన పూలని మనందరం ఎంతో అబ్బురంగా చూస్తాం కదండీ. ఆకురాలు కాలమైన శిశిరంలోనూ కొన్ని పూలు వికసిస్తాయి. అందవిహీనమైన పరిసరాల్ని అవి కొద్దో గొప్పో అలంకరిస్తాయి, ఆ ప్రాంతాల్లో తిరిగే వాళ్లకి కాసింత ఆశని కలిగిస్తాయి. మనుషుల్లోనూ కొందరలా ఉంటారు.
నిజానికి జీవితంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, కళారంగంలో కావచ్చు, అన్నీ అనుకూలంగా ఉండి విజేతలైన వాళ్ళని మనం ఆకాశానికెత్తి అభినందనలు కురిపిస్తాం. అలా గెలిచినవాళ్లు ఒకోసారి తాము ఆకాశంనించి ఊడిపడ్డట్టు అహంకరిస్తూ, ఇతరులకి నీతిబోధలు చేస్తూ ఉండడం కూడా మనకి కొత్త కాదు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ, మనుషుల్ని విడదీయడానికి కాకుండా కలపడానికీ, ఆత్మీయతని పంచడానికీ పెంచడానికీ ప్రయత్నించే వాళ్ళకే ఈ సమాజంలో కొఱత.
పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా అనుకూలంగా మార్చుకుంటూ, అలా వీలు కాని చోట సర్దుకుంటూ ముందుకి సాగి విజేతలైన వాళ్ళ పట్ల నాకు చెప్పలేని గౌరవం. అపురూపంగా చూసుకోవలసిన అలాంటివాళ్ళని గుర్తించడంలో చాలాసార్లు మనం విఫలమవుతూ ఉంటాం. కళారంగంలో క్రీడారంగంలో సరే, జీవితరంగంలో పరిస్థితులకెదురీది, ఎన్నో కష్టనష్టాలకోర్చి, సంసారాన్ని తీరం చేర్చడానికి నిరంతరం శ్రమ పడిన వాళ్ళు నాకు తెలుసు. అన్నీ సజావుగా ఉన్నా చిన్న చిన్న సమస్యలనే పెద్దవిగా చెప్పుకుని విజేతలుగా చెలామణీ అయ్యేవాళ్ళ మధ్యలో ఈ శిశిర సుమాలు కనపడకుండా దాగి ఉంటాయి. గుర్తింపు దొరకక అనామకంగా ఉంటాయి. అలాంటివాళ్ళకి ప్రేమతో గౌరవంతో నేనందించే సాహితీ సుమగుచ్ఛం ఈ పుస్తకం.
మీ రెండో ప్రశ్న – ఈ పుస్తకం పేరు ‘శిశిర సుమాలు’ అని పెట్టడంలో ‘శిశిరంలో విరిసిన కుసుమం’ కథ ప్రభావం ఏమీ లేదండి. ఈ కథ కూడా అలాంటి ఒక అపురూప వ్యక్తి నుంచి నాకు లభించిన ప్రేరణతో రాసినదే.
ప్రశ్న 2. “మానవ సంబంధాల్లోని సంఘర్షణను మరింత లోతుగా చిత్రించగల నైపుణ్యం నాగలక్ష్మికి ఉంది. ఈ నైపుణ్యానికి పదును పెడితే కథనం, పాత్రచిత్రణ ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి” అన్నారు డా. సి. మృణాళిని గారు తమ ముందుమాటలో. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: సాహిత్య అకాడమీ కన్వీనర్ అయ్యాక ఏమాత్రం తీరికలేకుండా ఉన్న మృణాళిని గారు నా కథా సంపుటికి ముందుమాట రాయడం ఆమె సౌజన్యం. ఆమె సూచనని శ్రద్ధగా గుర్తుపెట్టుకుంటాను.
మంచి కథకి మీరు ప్రస్తావించిన వస్తువు, శిల్పం, శైలి – మూడూ ముఖ్యమైనవే. కేవలం కాలక్షేపం కోసం కాని ఏ కథకైనా, వస్తువు ఎంతో ముఖ్యమైనది. అయితే చక్కని వస్తువున్న ఒక కథ చిరాయువైతే దానికి ముఖ్యకారణం శిల్పమే అని నా అభిప్రాయం. శైలి, కథని ఆసక్తిగా చదివించడానికి ఉపయోగపడుతుంది గాని చదివేశాక కథావస్తువుని మనసులో నిలిపేది శిల్పమే.
వస్తువు మట్టిదైనా పాలరాయిదైనా పసిడిదైనా దానిలోని పనితనమే మనని ఆకట్టుకుంటుంది. కానీ కాలానికి నిలిచే గుణం పదార్ధాన్ని బట్టి మారుతుంది. మట్టో పాలరాయో బంగారమో – ఇక్కడ కథావస్తువనుకుంటే అది చక్కని శిల్పంగా చెక్కబడినపుడు, అంటే అనవసరాలన్నీ తీసేసి అందమైన రూపం దాల్చినపుడు, ఆ కథ మంచి కథవుతుంది. వస్తువు కూడా మంచిదైతే ఆ కథ కాలానికి నిలుస్తుంది. రోజువారీ జీవితంలో కూడా ఒకే విషయం ఎందరో చెప్పచ్చు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. ఎవరైనా మనసుకి హత్తుకునేలా చెప్పినప్పుడే మనకి వినాలనిపిస్తుంది, ఆచరించాలనిపిస్తుంది.
ప్రశ్న 3. “ఏదో ఒక పోలికను గాని విభిన్నమైన అనుభవాన్ని గాని కలుపుతూ అసలు కథని చెప్పడం నాగలక్ష్మి గారి ప్రత్యేకత” అంటూ ముందుమాటలో వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు ప్రస్తావించిన ‘కలువకొలనులో వెన్నెల’ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకాహారం, నిద్ర ఎంత అవసరమో మనసు సంతోషంగా, సంతృప్తిగా ఉండడమూ అంతే అవసరం. కానీ సాధారణంగా ఆ సంతోషం, సంతృప్తుల కోసం వెతుకులాడే వాళ్లే గాని దాని గుట్టుమట్లు తెలిసినవాళ్ళు తక్కువ. ముఖ్యంగా దాంపత్య జీవనంలో. మన పెద్దలు తెలుసుకున్న చిట్కా ఏమిటంటే – ఇవ్వడంలోనే పొందడం ఉంటుందని. అయితే ఇద్దరూ ఆ చిట్కా పాటించాలి. చాలాసార్లు ఒకరు లాక్కుంటూ ఉంటారు, రెండోవాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. ఇలాంటి కొన్ని సంసారాలని అనేక దశాబ్దాలపాటు గమనించి చూస్తుంటే, పెళ్ళైన కొత్తల్లోనే వీళ్ళు ఒకరికొకరు అనుగుణంగా మారి ఉంటే ఆ సంసారం ఎంత అందంగా ఉండేదా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనే ఈ కథకి మూలమైంది.
2017 లో యద్దనపూడి సులోచనారాణి గారు ఆకస్మికంగా మరణించినపుడు ఆవిడ స్మృతిలో వంశీ సంస్థ తరఫున తెన్నేటి సుధగారు ‘కొత్తకథలు’ పేర ఒక కథా సంకలనం వేయాలని తలపెట్టి, కథలకోసం ప్రకటన చేశారు. చాలా తక్కువ సమయం ఇవ్వడంతో నేనేదో పనుల హడావుడిలో ఉండి రాయలేకపోయాను. ఒకరోజు లేఖిని సమావేశం కోసం వెళ్తే అక్కడ సుధగారు ఎదురై, ‘మీరు కథ ఇవ్వకపోతే ఎలా? వెంటనే రాసి ఇవ్వండి’ అని చనువుగా కోప్పడ్డారు. అలా అడగడం నాకెంతో ముచ్చటగా అనిపించింది. నిజమే, యద్దనపూడి స్మృతిలో పుస్తకం వెలువరిస్తుంటే ఆవిడ అభిమానినైన నేను పాల్గొనకపోవడమేమిటి అనిపించింది. అపుడు నేను కోయంబత్తూరులోని ఈశా కేంద్రానికి వెళ్ళబోతూ ఉన్నాను. మధ్యలో ఒక్కరోజే సమయం ఉంది. ఆ వేళ కూర్చుని పైన చెప్పిన టాపిక్ మీద ఆవిడైతే ఎలా రాస్తారు అని ఆలోచిస్తుంటే ఈ కథ పుట్టింది.
ప్రశ్న 4. ‘వేకువపాట’ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ళ వరకూ మరో కథా సంపుటి వెలువరించకపోవటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? వివరించండి.
జ: ‘వేకువపాట’ 2015లో వచ్చింది. అప్పటికి రెండేళ్ల క్రితమే మా మామగారు పోయారు. మా నాన్నగారపుడు మంచం పట్టి ఉన్నారు. నేను కౌమారంలో ఉన్న రోజుల్లో ఒకసారి నాన్నగారు, తాతగారి గురించి చెపుతూ, ‘మనకి ఆప్తులైన వారికోసం మనమేం చేసినా ఆ వ్యక్తి జీవించి ఉన్నంతవరకేనమ్మా. వాళ్ళుండగా చేయవలసిన పని చేయకపోతే, చెప్పవలసిన మాట చెప్పకపోతే, ఒక్కసారి మనిషి అంతర్ధానమయ్యాక మనమేం చేసినా ఆ లోటు భర్తీ చేయలేము. ఆ లోటు వాళ్ళకి కాదు, వాళ్ళ తర్వాత జీవితం కొనసాగించవలసి మనకే!’ అన్నారు. ఆ మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి.
‘వేకువపాట’ ఆవిష్కరణ పూర్తయ్యాక నా ఖాళీ సమయమంతా పూర్తిగా మంచానికే పరిమితమైన నాన్నగారితో గడిపాను. తర్వాతి సంవత్సరం ఆయన పోయారు. ఆయన తర్వాత కేవలం నాలుగు సంవత్సరాలు అమ్మ జీవించింది. ఆ సమయంలో వీలైనంత ఎక్కువగా అమ్మతో గడిపాను. 2020లో అమ్మ మరణించింది. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల్ని వెతికే పని నాకే పెట్టారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేయడం నా అలవాటు. 2021 లో అమ్మాయి పెళ్లి, 2022 లో అబ్బాయి పెళ్లి జరిగాయి. ఈ మధ్య కాలంలో కథలు చాలా తక్కువగా రాశాను. కవితలూ పాటలూ మాత్రం రాయడానికి తీసుకునే సమయం తక్కువ కనుక రాస్తూ వచ్చాను.
ప్రశ్న 5. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సమాజంలోనూ, సాహిత్య రంగంలోనూ ఏయే మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు? ఈ వ్యవధిలో ఎన్ని కథలు వ్రాశారు? ఈ పీరియడ్‌లో కాలానుగుణంగా మీ రచనశైలి కానీ, కథ చెప్పే విధానం గానీ మార్చుకోవాల్సిన అవసరం ఎదురైందా?
జ: కాలానుగుణంగా సమాజంలోనూ, సాహితీరంగంలోనూ మార్పులొస్తూనే ఉంటాయి గానీ పూర్వంతో పోలిస్తే గత దశాబ్ద కాలంలో సమాజంలోనూ సాహిత్యంలోనూ కూడా అసహన ధోరణి బాగా పెరిగిందని అనుకుంటున్నాను. విద్వేషపూరిత, విచ్ఛిన్నకర ధోరణులకి ప్రోత్సాహం పెరిగిందనుకుంటాను. అభినందన్ వర్తమాన్ గురించి వార్తల్లో వచ్చినపుడు ముఖ పుస్తకంలో కూడా ఎన్నో చర్చలు జరిగాయి. దేశభక్తి గురించి ప్రస్తావన వచ్చింది. కొందరు ఆ పదాన్ని అవహేళన చేస్తూ పోస్టులు పెట్టారు. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి వల్లే అతన్ని మాతృదేశానికి అప్పగించే పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా ‘ఇతను పెద్ద ఊడబొడిచిందేముంది?’ అన్నట్టు కామెంట్స్ చేశారు. ‘ఇమ్రాన్ ఖాన్‌ని పొగడబోయి, పొరబాటున అభినందన్‌ని పొగుడుతున్నట్టున్నారు’ అని ఒకరు ముఖపుస్తకంలో రాశారు. ఇలాంటివాళ్ళందరి రక్షణ కోసం తమ ప్రాణాలర్పించే జవాన్లని తలుచుకుంటే బాధనిపించింది. దేశం పట్ల అనుబంధం, ప్రేమకన్నా పై స్థాయిలో లేకపోతే దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించే తెగింపు ఎలా వస్తుంది ఎవరికైనా?
అలాగే సినిమాల్లోనూ, ఇతర సోషల్ మీడియా లోనూ, సాహిత్యంలోనూ కూడా సెన్సారింగ్ తగ్గిపోయి విశృంఖలత పెరిగిపోయింది. దాని ఫలితం సమాజంలో పిల్లలమీదా యువత మీదా పడింది. మా ఇంట్లో పనిచేసే ఆమె పిల్లలు ఇద్దరూ బడిలో చదువుకునే వయసులో పదహారేళ్ళకే ప్రేమలో పడి, పెళ్ళికి వెంపర్లాడి, ఇంట్లో కల్లోలం సృష్టించారు. పెద్దమ్మాయికి పద్ధెనిమిదేళ్ళకే ఇద్దరు పిల్లలు. ఒక సిజేరియన్.
ఇక మీ రెండవ ప్రశ్న – ఈ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో కథలు 14 మాత్రమే రాశాను. ఈ కాలంలో నా కథ చెప్పే విధానంలో మార్పు వచ్చింది. పాఠకులు కథ తీరుబాటుగా కాకుండా వేగంగా చదివించాలని ఆశిస్తున్నారు. నేను చిత్రకారిణిని, ముఖ్యంగా డీటైలింగ్ ఎక్కువగా ఉండే ఆయిల్ పెయింటింగ్ చేసే ఆర్టిస్ట్‌ని కావడం వల్ల, నా కథల్లో కూడా పరిసరాల, ప్రవృత్తుల వర్ణన ఎక్కువగా ఉంటుంది. అది ప్రయత్నపూర్వకంగా తగ్గించుకునే ప్రయత్నం చేశాను. కథకవసరమైన క్లుప్తత కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాను.
పదహారేళ్ళ వయసులో రాసిన మొట్ట మొదటి కథ నుంచీ శైలిలో మాత్రం పెద్ద మార్పు లేదంటారు, సాహిత్యాభిలాషులైన మిత్రులు.
ప్రశ్న 6. మీరు కవయిత్రి, చిత్రకారిణి అవడం వల్ల సహజంగానే ఆ ప్రభావం మీ కథలపై కూడా ఉంటుంది. ఏవైనా కథలలో – సంభాషణలు కవితాత్మకంగా ఉన్నాయనో లేక సన్నివేశంలోని దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా ఉందనో – ప్రశంస వచ్చిందా? వస్తే ఏ కథకు? (‘శిశిరంలో విరిసిన కుసుమం’ కథలో “ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాలిపడిన నవ్వులపువ్వులు పరిమళభరితంగా తోచాయి ఆవిడకి” అనే వాక్యం మా ఉదాహరణ 😀).
జ: అవునండి, నా కథనంలో కవితాత్మకత ఆహ్లాదకరంగా ఉంటుందనీ, చదువుతుంటే సన్నివేశాలు సులువుగా దృశ్యమానమవుతాయనీ ప్రశంసలు తఱచుగానే వినిపిస్తాయి. ‘ఆనాటి వాన చినుకులు’ కథ చదివి చాలామంది ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. పుష్య విలాసం, ఒక ప్రేమలేఖ కథలు చదివిన పాఠకులు కూడా ఇదే అన్నారు.
తెలుగువన్, అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ‘శిశిరంలో విరిసిన కుసుమం’ కథకు ప్రథమ బహుమతి వచ్చింది. అపుడు నిర్వహించిన సమావేశంలో అక్షరయాన్ అధ్యక్షులైన ఐనంపూడి శ్రీలక్ష్మిగారి నుంచి, ఇతర న్యాయనిర్ణేతలనుంచి ఇదే విషయంలో ప్రశంసలు వచ్చాయి. అలాగే ‘పూలపల్లి విత్తనాలు, ఇరుగూ పొరుగూ’ కథల గురించి కూడా కొంతమంది ఇలా అన్నవాళ్లున్నారు. ఈ కథల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘మధ్య తరగతి జీవన పరిమళమే ఈ కథలు’ అన్నారు యువకవి శ్రీరామ్ పుప్పాల, ‘అసలే చిత్రకారిణి, పైగా గేయ కవి కూడా కనుక కథలు ఆసాంతం లలితమైన పదజాలంతో అందమైన వర్ణనలతో ఆకట్టుకుంటాయి’ అంటూ ‘శిశిర సుమాలు’ ముందుమాటలో మృణాళిని గారు రాసినది మీరు చదివే ఉంటారు.
ప్రశ్న 7. ఈ సంపుటి లోని ‘కలువకొలనులో వెన్నెల’ కథలో కుసుమ, ప్రకాశ్‌లు కలువకొలనుకు రావడం, అక్కడ మనసులు విప్పుకుని ఒకరొనొకరు అర్థం చేసుకోవడం అసలైన హనీమూన్ అనిపిస్తుంది. ఈ కథకి ప్రేరణగా నిల్చిన వ్యక్తులెవరైనా ఉన్నారా?
జ: ఈ తరం యువతని ప్రతిబింబించే కుసుమ ప్రకాశ్‌లు కల్పిత పాత్రలే. ప్రేరణ ఎవరూ లేరు గాని ఆ కథలోని తాతగారిలో మా నాన్నగారి ఛాయలున్నాయి.
ప్రశ్న 8. ‘పూలపల్లి విత్తనాలు’ అనే కథలో విత్తనానికి గింజకి ఉన్న సూక్ష్మమైన తేడాని చాలా చక్కగా తెలిపారు. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ఐనంపూడి శ్రీలక్ష్మి గారి సారథ్యంలో నడుస్తున్న ‘అక్షరయాన్’ అనే రచయిత్రుల సమూహం గురించి వినే ఉంటారు. ‘తెలంగాణా రాష్ట్ర విత్తనోత్పత్తి & విత్తన ధ్రువీకరణ సంస్థ’ ఆధ్వర్యంలో, సాగులో మేలైన విత్తనాల ఆవశ్యకత గురించి వివరిస్తూ మహిళా రచయిత్రులకొక సదస్సు నిర్వహించారు. సదస్సు తర్వాత ఆ అవగాహనతో రచయిత్రులు రాసిన కథలనెన్నుకుని ‘విత్తనం చెప్పిన కథలు’ పేర ఒక కథా సంకలనం వెలువరించారు. ఆ సంకలనం కోసం రాసిన కథ ఇది. దాదాపు కథంతా కల్పితమే అయినా ఈ కథలోని పరిసరాల్లో, పాత్రల వ్యక్తిత్వాల్లో నా పుట్టింటి ఛాయలు కనిపిస్తాయి.
ప్రశ్న 9. ఈ సంపుటిలోనే అతి చిన్నది ‘వృద్ధపురుషః’ కథ. దాదాపు యాభై ఏళ్ళకు పైబడిన దాంపత్య జీవితంలోని ఒడిదుడుకులని రెండు పేజీలలో ఎలా కుదించగలిగారు? దీని వెనుక ఏదైనా సంఘటన ఉందా?
జ: ప్రత్యేకించి ఏ సంఘటనా లేదండి. నాన్నగారి వైపూ, అమ్మ వైపూ, నేను మెట్టినిల్లూ.. అన్నీ చాలా పెద్ద పెద్ద కుటుంబాలు. బంధు జనం ఎక్కువ. ఇంకా పరిచయస్థుల కుటుంబాలు ఎన్నో. ఇన్ని సమూహాల్లో – స్నేహంతో, సరస సల్లాపాలతో, చక్కని అవగాహనతో దాంపత్య జీవితాన్ని అనురాగమయం చేసుకున్న వాళ్ళనీ చూశాను, భార్యని బానిసలా చూసే మగవాళ్ళనీ చూశాను, భర్తని పెంపుడు జంతువులా లొంగదీసుకుని తోచినట్టు ఆడించే భార్యలనీ చూశాను. కుటుంబవ్యవస్థలోని ఇన్ని కోణాల్లో, ఒక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కథ.
ఇంతకు చాలాకాలం ముందే, 2005లో నా మొదటి కథా సంపుటి వచ్చింది. అందులో పురుషాహంకారంతో భార్యాభర్తల అనుబంధాన్ని యజమాని సేవకురాలు మధ్యనుండే సంబంధంగా మార్చేసిన ఓ మగాడి స్వగతాన్ని రెండు పేజీల కథగా రాస్తే అబ్బూరి ఛాయాదేవిగారు ఎంతగానో మెచ్చుకున్నారు. ‘ఆలంబన’ అనే ఆ కథా సంపుటికి ముందుమాట ఆవిడే రాశారు. ఆ పుస్తకం వెలువడిన సంవత్సరమే ‘నవకథా రచయిత్రి’గా నన్ను సన్మానించి తన అత్తగారిపేర ఆమె స్థాపించిన ‘శ్రీమతి అబ్బూరి రుక్మిణమ్మ’ పురస్కారాన్ని నాకు అందజేశారు.
ప్రశ్న 10. సాధారణంగా రచయితలకు తాము రాసే అన్ని కథలు నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు మరింత బాగా నచ్చింది? ఎందుకు?
జ: ఇతివృత్తం నాకు బాగా నచ్చితే గాని ఏ కథా రాయను. మీరన్నట్టు నే రాసిన కథలన్నీ నాకు ఇష్టమైనవే గాని ఈ సంపుటిలోని ‘పూలపల్లి విత్తనాలు’ నాకెక్కువగా నచ్చిన కథ. ఒక తరం నుంచి తర్వాతి తరానికి ఔదార్యం, అవగాహనా, ప్రేమా, ఆత్మీయతా ఆస్తులుగా అందాలనీ, దానికవసరమైన నారు పోసి నీరందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని నేను నమ్ముతాను. అయితే అదంత తేలికైన విషయం కాదు. పెద్దలెంత ప్రయత్నించినా, పిల్లల్ని ప్రభావితం చేసే అంశాలెన్నో ఉంటాయి. ఇవాళ్టి తరం విషయంలో అది మరీ కష్టం.
ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: రేపటి వెలుగు, భూపాలం కథలు రాయడం ఎక్కువ కష్టమనిపించింది. ఈ రెండూ రాసి తీరాలనిపించిన ఇతివృత్తాలు. ‘రేపటి వెలుగు’ కథ, కొండాపూర్ లోని భరోసా సెంటర్‌లో తెలంగాణా వుమన్ సేఫ్టీ వింగ్ వారు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని, అక్కడ అనేకమంది బాధిత స్త్రీల ప్రత్యక్ష అనుభవాలను విన్నాక, అలాంటి వారికోసం తెలంగాణా పోలీస్ రూపొందించిన సహాయకాల గురించి స్వాతి లక్రా వంటి పోలీస్ ఉన్నతాధికారుల నుంచి విన్నాక, ఒక బాధిత స్త్రీ అనుభవాన్ని కథగా రాశాను. నిర్దేశిత నిడివిలో కథగా రూపొందించడం కొంచెం కష్టమే అయింది. దీన్నే ‘డాక్యుమెంటరీలా ఉందనీ, ప్రయోజనకరమే అయినా కూడా, ప్రభుత్వ పథకాలకి ప్రకటనలందించడం రచయితల పనికాదనీ’ మృణాళిని గారన్నారు. ఈ కథ ఇంకా మెరుగ్గా రాసి ఉండొచ్చనుకుంటాను.
ఇక రెండో కథ భూపాలం. ఈ కథలో సగభాగం మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కథ. మేముండే టౌన్‌షిప్‌లో లో వెయ్యి కుటుంబాలున్నాయి. అందరిళ్ళలో కలిపి ఐదారొందల మంది పనివాళ్ళుంటారు. కనీసం వందమంది జీవితాలు ఈమె కథకి దగ్గరగా ఉంటాయి. కథలో సరిత లాగే ప్రయత్నించి ప్రయత్నించి నిస్పృహ చెందిన సమయంలో పుట్టిన కథ ఇది. ఆంధ్రజ్యోతికి కథ కావాలని అడిగితే ఈ కథ పంపాను. కథ చాలా బావుంది గాని నిడివి ఎక్కువైందనీ, కుదించి రాయమనీ అడిగారు. తగ్గించడం ఇష్టం లేక వేరే కథ రాసి పంపాను. ఈ సంపుటిలోని ఏ కథా రాసి పంపాక తిరిగి రావడమన్నది జరగలేదు. పంపిన వెంటనే ప్రచురితమైనవే అన్నీ. కొన్నిటికి బహుమతులొచ్చాయి కూడా. నాకెంతో విలువైనదనిపించిన ఈ కథని మాత్రం కనీసం అయిదారు కథల పోటీలకి పంపాను, ప్రతిసారీ చిన్న చిన్న మార్పులతో. సాధారణ ప్రచురణకి కూడా తీసుకోలేదు. మిత్రులొకరు కథాంశం పాతదైపోయిందన్నారు. ఇవాళ్టికీ గృహహింస సాగుతూనే ఉంది. భార్యమీద అనుమానంతో భౌతికంగానో మానసికంగానో హింసించి వేధించే భర్తలు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. దైనందిన వార్తల్లో కిరోసిన్ పోసి కోడల్నో, భార్యనో చంపేస్తున్న అత్తమామలూ భర్తలూ కనిపిస్తున్నారు. తాగి భార్యని కొట్టే వర్కింగ్ క్లాస్ భర్తలు మా గేటెడ్ కమ్యూనిటీలోనే బోలెడుమంది ఉన్నారు. అంతదాకా ఎందుకు, భరోసా సెంటర్‌కి వచ్చే అధికశాతం స్త్రీలు ఇలాంటి బాధితులే. ఇలాంటి బాధితులున్నన్నాళ్ళూ ఈ ఇతివృత్తం పాతదని ఎలా వదిలేస్తాం? చివరికి కల్పనా రెంటాల ఏదైనా కథ పంపమని అడగ్గానే ఈ కథ పంపించాను. ఇలస్ట్రేషన్ కూడా వేసి పంపమని అడిగి, బొమ్మతో సహా వెంటనే ప్రచురించారు. సారంగ జాల పత్రికలో వచ్చిన ఈ కథ చదివి ‘చాలా మంచి కథ చదివా’మంటూ ఎంతమందో స్పందించారు.
ప్రశ్న12. ‘శిశిర సుమాలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా?
జ: పుస్తక ప్రచురణలో ప్రత్యేక అనుభవాలేమీ లేవండి. నా పుస్తకాలన్నిటికీ నేనే ముఖ చిత్రాలు, లోపల బొమ్మలు వేసుకుంటాను. అలాగే దీనికీ వేశాను. చాలా కాలమైంది పుస్తకం వెలువరించి. మా ఇంటి వాతావరణంలో అటూ ఇటూ కూడా సాహిత్య రంగంలో ఎవరూ లేరు. నే రాసిన కథ అచ్చయితే లేదా బహుమతి వస్తే – చదవడమే గొప్ప. అందువల్ల నాకు సలహా సంప్రదింపులకు గాని, సహాయానికి తోడొచ్చేవాళ్ళు గాని ఎవరూ లేరు. పైగా పుస్తక ప్రచురణ పనులు సాగుతుండగా, హాలు బుక్ చేసుకుని ఆవిష్కరణ తేదీ ఖరారు చేసుకున్నాక, అదే వారంలో అకస్మాత్తుగా 92 సంవత్సరాల మా అత్తగారికి సుస్తీ చేసి హాస్పిటలైజ్ అయారు, అనుకోకుండా సర్జరీ చేయాల్సి వచ్చింది. అన్నీ కాన్సిల్ చేసేద్దామా అనుకున్నాను. చివరికి అన్నీ సజావుగా సాగి కార్యక్రమం విజయవంతమైంది. అత్తగారు చక్కగా కోలుకుని ఇంటికి వచ్చారు.
ప్రశ్న13. ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: చాలా బావుందండి. మినీస్ అనే పోర్టల్ లో నా పుస్తకాలకి ఆన్‌లైన్ స్టోర్ (https://vana.ministore ) ఏర్పాటు చేశారు మా అబ్బాయీ, కోడలూ కలిసి. ఆన్‌లైన్‌లో కొనుక్కున్న సాహితీప్రియులెందరో చక్కని స్పందనలు తెలియజేశారు. నాతో పరిచయం ఉన్నవాళ్లు నాకే ఫోన్ పే చేసి, చిరునామా మెసేజ్ చేస్తున్నారు. అన్వీక్షకి, కాచిగూడ నవోదయాలలో కూడా నా పుస్తకాలు దొరుకుతున్నాయి. చదివినవారి స్పందన ముఖపుస్తకంలో చదివి మరింతమంది పుస్తకం కొనుక్కుంటున్నారు. ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు కొనుక్కున్నంత సులువుగా ఈ లింక్ మీద క్లిక్ చేసి, కోరిన పుస్తకం వారం రోజుల్లోగా ఇంటికే తెప్పించుకుంటున్నారు చాలామంది. పాఠకులకి ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రస్తుతం మేము పోస్టల్ చార్జీలు తీసుకోకుండా పంపుతున్నాము. అధికశాతం రచయితలకి పుస్తకం వెలువరించడం వెనుక ఉన్న మేధోపరమైన, సృజనాత్మకమైన శ్రమకి ప్రతిఫలం ఎలాగూ లభించదు. ప్రచురణకి పెట్టిన ఖర్చు కూడా తిరిగి పొందడం అరుదే అని చెప్పాలి. ఈ పుస్తకాలకి సంబంధించినంతవరకూ నేను పెట్టిన ఖర్చులో పదోవంతు, పది వారాల్లోనే వచ్చేయడం నిజానికి చాలా మంచి స్పందన అని చెప్పాలి.
ప్రశ్న14. శిశిర సుమాలతో పాటు వెలువరించిన మరో పుస్తకం పేరేమిటి? దీని గురించి క్లుప్తంగా రెండు వాక్యాలు చెప్పండి.
జ: చిన్నప్పటి నుంచి కవితలు కూడా రాస్తూ వచ్చినా ఇంతవరకూ పుస్తకంగా వెలువరించలేదు. ఈ సారి కథాసంపుటితో పాటు కవితా సంపుటి కూడా వెలువరించాలని తలపెట్టాను. కవితా సంపుటి పేరు ‘కలవరాలూ కలరవాలూ’. ప్రముఖ కవులు కె. శివారెడ్డిగారూ, వాడ్రేవు చినవీరభద్రుడు గారూ ఈ పుస్తకానికి తొలిపలుకులు రాశారు. మాకు ఆత్మీయులైన రామవరపు గణేశ్వరరావు గారు విశ్లేషణాత్మకమైన ఆప్తవాక్యమందించారు. ‘శిశిర సుమాలు’ పుస్తకావిష్కరణ డా. అమృతలతగారు చేయగా, ‘కలవరాలూ కలరవాలూ’ కవితా సంపుటిని శివారెడ్డిగారు ఆవిష్కరించారు.
ప్రశ్న15. తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ జంట పుస్తకాల ఆవిష్కరణతో బాటు లలితగీత విభావరి కూడా జరిగింది కదా? దాని గురించి వివరిస్తారా? మీరు పాటలు ఎప్పటి నుంచి రాస్తున్నారు?
జ: నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాటలు రాస్తూ ఉన్నానండి. ఇప్పటికి దాదాపు రెండు వందల లలిత గీతాలు రాశాను. 2003 చివర్లో వచ్చిన నా మొదటి పుస్తకం ‘వాన చినుకులు’ వంద పాటల లలితగీత మాలిక. కేవలం పుస్తకావిష్కరణ అంటే ఆసక్తి అంతగా ఉండదని ఆవిష్కరణతో పాటు లలితగీత విభావరి కూడా పెట్టుకోవాలని అనుకున్నాను.
పాటల కార్యక్రమం అంటే గేయాలకు బాణీలు కట్టి, పాడించేవాళ్లుండాలి. రెండు దశాబ్దాలకి పైగా LMA రామాచారి గారితో, డా. MRK ప్రభాకర్ గారితో పరిచయం. ఇద్దరూ నా పాటలెన్నో బాణీలు కట్టి ఆకాశవాణిలో పాడించి ఉన్నారు. నా మీద అభిమానం కొద్దీ వారిద్దరూ బాణీ కట్టినందుకు పారితోషికమేమీ తీసుకోలేదు గాని రికార్డింగ్ చేయించాలంటే స్టూడియో ఖర్చూ, నేపథ్య సంగీతానికయే ఖర్చూ పెట్టుకోవాలి. అలాగే సిద్ధపడ్డాను. చక్కని పాటలతో ఆనాటి పాటల కార్యక్రమం వీనులవిందుగా సాగింది. రామాచారి గారి నేతృత్వంలో LMA విద్యార్థులూ, సినీ నేపథ్య గాయకులుగా ప్రముఖులైన దీపూ, సాహితి, ఐశ్వర్య తదితరులు అద్భుతంగా పాడారు. మా అమ్మాయి వర్షిణి కూడా పాడింది. తాను స్వరపరచిన పాటల్ని ప్రభాకర్ గారు ఆలపించారు. కళ్యాణ్ వసంత్ అనే మరో యువ గాయకుడు ‘ఒక అల కదిలింది మదిలో.. ఒక జల పొంగింది హృదిలో’ అంటూ రామాచారిగారి ప్రశంసలందుకునేలా నా పాటకి బాణీ కూర్చి పాడి వినిపించాడు.
ప్రశ్న16. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఇతర పుస్తకాలు ఏవైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?
జ: భవిష్యత్తు ప్రణాళికలేమీ లేవండి. ఏ ఒత్తిడీ లేకుండా కథలూ, కవితలూ, పాటలూ రాసుకుంటూ పోవడమే. లలిత గీతాలతో మరో పుస్తకం ‘ఒక రాగం పిలిచింది’ సిద్ధమవుతోంది. త్వరలో ప్రచురించి మళ్ళీ ఇలాగే ఒక పాటల పూదోటలో ఆవిష్కరించాలని అనుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వారణాసి నాగలక్ష్మి గారూ.
వారణాసి నాగలక్ష్మి: ధన్యవాదాలండీ.
***
శిశిర సుమాలు (కథలు)
రచన: వారణాసి నాగలక్ష్మి
ప్రచురణ: అన్వీక్షికి పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 162
వెల: ₹250.00
ప్రతులకు:
అన్వీక్షికి పబ్లికేషన్స్, ఫోన్: 9705972222, 9849888773
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‍లైన్‍లో:
https://vana.mini.store/products/5b6f9ac6-e1b9-4274-bcf2-1d041cf7c1a9?slug=vana
~
‘శిశిర సుమాలు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/shishira-sumaalu-book-review-sridhara/