‘రామకథాసుధ’ కథా సంకలనంలోని ‘శ్రీరాముని చింతన’ కథా రచయిత్రి శ్రీమతి సంధ్య యల్లాప్రగడ తో ప్రత్యేక ఇంటర్వ్యూ

11
2

[‘రామకథాసుధ’ కథా సంకలనంలోని ‘శ్రీరాముని చింతన’ కథా రచయిత్రి సంధ్య యల్లాప్రగడ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ]

సంచిక టీమ్: నమస్కారం సంధ్య యల్లాప్రగడ గారు.

సంధ్య యల్లాప్రగడ: నమస్కారమండీ.

ప్రశ్న1: రామకథాసుధ కథల సంకలనంలో మీ కథ మొదటి కథ. సాధారణంగా మొదటి కథ సంకలనం థీమ్‌ని సెట్ చేస్తుందంటారు. సంకలనంలోని ఇతర కథలతో పోల్చుకుంటే మీ కథ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు:

ఆపదా మపహర్తారం
దాతారం సర్వసంపదాం।
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం॥

~

‘రామో విగ్రహవాన్ ధర్మః’

ధర్మమును ఆలంబనగా చేసుకున్న మానవుడి జీవితములో ధర్మము నిలబెడుతుందని శ్రీరాముడు నిరూపించాడు.

రాముడు మొదటినుంచి జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు. అందుకే రామునికి జీవితంలో కలిగిన ఆటుపోట్లను స్థిరంగా నిలబడి ఎదురుకొన్నాడు. మానవులు ఎలా జీవించాలో తను జీవించి చూపించాడు.

ఆయనలో జీవన్ముక్త స్థితిని కలిగించినది చూపే ‘యోగవాశిష్ఠము’ను పరిచయం చేసే కథ మొదట ఉంచటము వలన సంకలనములో కథలు చెప్పబోయేది సూచించినట్లగా ఉన్నదని భావము కలిగింది.

అదీ కాక ఎడిటరు గారు కథలను టైంలైనుగా అమర్చామని చెప్పుకొచ్చారు. కాబట్టి అందంగా అమరిందని అనిపించింది.

ప్రశ్న2: ‘యోగవాశిష్ఠం’ చాలా గహనమైన ఆధ్యాత్మికపుటాలోచనలని పొదుగుకున్న గ్రంథం. దీని ఆధారంగా కథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జవాబు: సాధనలో ఉండగా.. తెలుసుకోవలసిన జ్ఞానము గురువుల ద్వారా రకరకాలుగా అందుతుంది..

అలా అంబికాపతి కృపతో ఈ జ్ఞానము తెలుసుకోమన్న సందేశము, తెలుసుకునే అవకాశము వచ్చాయి.

అలా ‘యోగవాశిష్ఠం’ రెండు సంవత్సరాలు చెప్పుకోవటం జరిగింది. (వేదాన్ని, తత్‌ సమానమైన జ్ఞానం చెప్పుకోవటము అని అంటారు)

అదొక అవ్యాజమైన అనుభవము.

చదివినది ప్రవచనములా వినటం, విన్నది తిరిగి చదవటం, దానిని విచారించటము..

సర్వవేళలా ఆ ఆలోచనలలో గడపటమూ..

ఆ అనుభవము కొంత సాధన చేసిన వారికి పరిచయమే.

ఈ విషయం తెలిసిన ఎడిటరు గారు (యోగవాశిష్ఠం చదువుతున్నామని) రాముని గురించి ఈ గ్రంథమాధారముగా కథ వ్రాయమని కోరితే అది రామాజ్ఞ భావించి చేసిన యత్నం.

ప్రశ్న3: కథలో మీరు చెప్పాలనుకున్న విషయాలను చెప్తూ కూడా ఆసక్తికరంగా వుండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జవాబు: క్లుప్తత పాటించే యత్నం, విషయం సూటిగా, స్పష్టంగా చెప్ప యత్నం చెయ్యటం జరిగింది.

యోగవాశిష్ఠమన్న సముద్రం చిలికి, అమృతం వంటి రామకథను అందించే ప్రయత్నం చెయ్యటము ఒక విధంగా సాహసమే. రాముడే ధైర్యం.. రాముడే పెన్నిధి. ఇలా ఈ కథ జన్మించింది.

రామప్రభు కరుణిస్తే.. అనుగ్రహిస్తే కుదిరితే పూర్తి నిడివితో యోగవాశిష్ఠ సారాంశం అందించాలని కోరిక.

ప్రశ్న4: కథను సామాన్య పాఠకులు అర్థం చేసుకోవటం కష్టం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి మీరేమంటారు?

జవాబు: జీవితంలో వివిధ స్థాయిలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ జీవనయానంలో పురోగమించాలి. ఆ పురోగమనం పరబ్రహ్మం వైపుకు, స్వస్వరూపం వైపుకు, అంతర్ముఖంగా సాగాలి.

నిన్నలా ఈ రోజు లేదు. ఈ రోజులా రేపు ఉండదు.

ఎప్పుడూ పైపైనే తేలి ఇంద్రియాలను తృప్తి పరిచే స్థితిలో తిరిగే వారికి ఎన్నో కథలు విషయాలు లభ్యం.

అంతర్ముఖత్వం వైపుగా చూపించే కథలూ, విషయాలు అరుదు.

‘నేను’ అంటే ఏమిటి? ఆత్మ, సత్యం అన్న విషయము పై జిజ్ఞాస, తపన ఉన్నవారికి ఈ కథ కరతలామలకం.

ప్రశ్న5: ‘రామకథాసుధ’ కథల సంకలనంలో మీ కథ కాక మీకు నచ్చిన మరో కథ ఏమిటి? ఎందుకు?

జవాబు: రామ నామము వల్ల అన్నీ పునీతమైనాయి.

ప్రతీ కథ రామస్వామి పాదాల వద్ద పుష్పమే. అందుకే ఈ సంకలనము కదంబమై స్వామికి అమరింది.

ప్రశ్న6: ప్రస్తుత వైజ్ఞానిక యుగంలో, అస్తిత్వ ఉద్యమాల కాలంలో రామకథాసుధ లాంటి కథల సంకలనాల అవసరం వుందంటారా?

జవాబు: కలము కాగితం పై పెట్టి మొదటి మాట ‘శ్రీరామ’ అని వ్రాసే జాతి ఇది.

శ్రీ రాముడు భారతీయుల గుండె చప్పుడు, కనపడని ఆపన్నహస్తం.

ప్రజల ప్రాణవాయువు!! ఒక రక్ష!!

సదా ఆ పరబ్రహ్మంని తిరిగి తిరిగి మననం చెయ్యటమే మానవ ధర్మం.

కాబట్టి అటుగా నడిపించే ప్రతి పని ఎల్లప్పుడూ అవసరమే.

ప్రశ్న7: ఇటీవల రాముడు, రామాయణం గురించి వికృతమైన ఆలోచనలతో, తమ మెదళ్ళలోని కుళ్ళును, వికృతాలను వాటికి రాముడికి, రామాయణ పాత్రలకు ఆపాదించి సాహిత్యాన్ని సృజిస్తున్నారు. అవార్డులు పొందుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు: వికృతమైన కుళ్ళని మీరే చెబుతున్నారు.

చెప్పేదేముంది?!!

వైర భక్తిలో పరమాత్మతో విరోధించి, స్వామిలో లయమయ్యే వారి గురించిన వివరాలెన్నో ఉన్నాయి. వీటి మీద సమయం పెట్టడం అనవసరమని వ్యక్తిగత అభిప్రాయం.

రామపాదాల వద్ద చిరు పుష్పం సమర్పించే అవకాశమిచ్చిన సంపాదక బృందానికి కృతజ్ఞతలు.

సంచిక టీమ్: ఈ ఇంటర్వ్యూకి సమయం కేటాయించి, మా ప్రశ్నలకు తగిన జవాబులిచ్చినందుకు కృతజ్ఞలు సంధ్య గారు.

సంధ్య యల్లాప్రగడ: ధన్యవాదాలు. సర్వం శ్రీరామ పాదార్పణమస్తు.

***

‘రామకథాసుధ’ పుస్తకం ప్రతులకు 0866-2436643. 9849992890
ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here