[dropcap]కా[/dropcap]ర్మికులారా..
కర్షకులారా..
కదలిరండి..
హక్కులకై పోరాడండి!
కాని బాధ్యతలను విడనాడకండి!
నేటి నాయకుల, దళారుల కుట్రలు
కుతంత్రాలను తెలుసుకుని.. మసలుకోండి!
ధనికవర్గాల, భూస్వాముల.. ఆగడాలు ఇక చెల్లవంటూ..
సంఘటితంగా ముందుకు సాగండి!
‘శ్రమయేవ జయతే..’ అంటూ నినదిస్తూ..
మీరెంతో కష్టపడుతుంటారు..
శ్రమకు తగిన ప్రతిఫలం అందని చోట.. తిరగబడండి!
మా జీవితాలు ఇంతేనా? అంటూ.. ఎంతటి వారినైనా నిలదీయండి!
కార్మికులారా.. కర్షకులారా..
రేపటి నవీన సమాజ సృష్టికర్తలు మీరేనండి..!
మార్కెట్ మాయాజాలంలో పడకుండా..
మీ శ్రమకి, ఉత్పత్తులకి…
తగిన గుర్తింపు రావాలని ఆశించండి!
అందుకు పోరాడండి!
పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్ళు తప్ప!
కొండకోనల్ని దాటుకుంటూ.. ఉబికివస్తున్న ‘రవిబింబం’
నీలాకాశానికి ఎర్రరంగు పులుముకుంటూ పైకొస్తుంటుంది!
అప్పుడే సూర్యోదయమవుతుంటుంది!
మీరూ.. గెలుపుకు చిరునామాలై ‘విజేతలుగా..’ నిలిచే రోజవుతుంది!
విజేతల్లారా.. విజయ నిర్ణేతల్లారా.. లాల్ సలాం!