[box type=’note’ fontsize=’16’]తన బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు వయసుకి మించిన సాహసం చేసిన బాలుడి కథ “శ్రవణ్”.
[/box]
సాయంత్రం ఆరు దాటింది.విపరీతమైన గాలి. సన్నగా వర్షం మొదలైంది.ఆ వాతావరణం చూస్తే శ్రవణ్ కి ఎందుకో భయం వేసింది,.వెంటనే ఇంటికి వెళ్ళి పోవాలని పించింది. అంతే సెల్లార్ లో ఆడుకుంటున్న శ్రవణ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళింటికి ఇంటికెళ్ళాడు.
అలవాటుగా గుమ్మం దగ్గర్నుంచే “అమ్మా” అని అరవబోతూ, చెప్పుల స్టాండు వైపు చూసాడు.లేవు.చెప్పులుంటే అమ్మ ఉన్నట్టు, లోపల్నించి టీవి మాటలు వినిపిస్తూంటే అమ్మ ఉన్నట్టు.వంటింట్లోంచి కమ్మటి వాసనలు వస్తూంటే అమ్మ ఉన్నట్టు.కానీ ఆ జాడలేం కనిపించలేదు.
ఒకవేళ లోపల వంటింట్లో ఉందేమో….ఎందుకంటే అమ్మ అప్పుడప్పుడు వంటింట్లో కూరలు తరుగుతూనో మార్కెట్ నుంచి తెచ్చిన సరుకుల్ని డబ్బాల్లో పోస్తూ, నిశ్శబ్ధంగా ఏదో పని చేసుకుంటూంటుంది.లోపల్నించి, ఏవో గిన్నెల శబ్ధాలు విని పిస్తున్నాయి అయితే అమ్మ ఉంది..అందుకని వంటింటి గుమ్మం దగ్గరికెళ్ళి చూసాడు. అక్కడ అమ్మ లేదు .పనిమనిషి గిన్నెలు తోముతోంది. .ఆమె ఎక్కడున్నా వినిపించాలని గట్టిగా “అమ్మా” అని పిలిచాడు. “ఓయ్” అన్న జవాబు రాలేదు. నిశ్శబ్ధంగా ఉంది.ఇంట్లో అమ్మ లేదా!.ఇల్లంతా వెతికాడు . కనిపించలేదు. రోజూ ఆడుకుని రాగానే కనపడే అమ్మ ఇవాళ కనిపించలేదు. ఎక్కడి వెళ్ళింది.?ఎందుకో కాస్త భయం వేసింది మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు. .
“అమ్మ ఎక్కడికి వెళ్ళిందీ వెంకటమ్మా..?..”
వెనక్కి తిరిగింది. “ తమ్ముడు ఆడుకుంటూ కింద పడిపోయాడు.బాగా దెబ్బ తగిలింది.అందుకని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది.నువ్వు రాగానే నిన్ను హోంవర్క్ చేసుకోమంది.టీవీ పెట్టద్దని చెప్పింది.”
ఆమె మాటలని వినిపించుకోలేదు
“అమ్మ వెళ్ళిచాలా సేపయిందా…..! “.
అవునన్నట్లుగా తల ఊపి,తన పని కంటిన్యూ చేసుకుంది.
అంతలోనే ఆటో శబ్ధం అయితే అమ్మ వచ్చిందేమో నని గబగబా పరిగెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు.ఆ ఆటో ఆగకుండా వెళ్ళిపోయింది.నిరాశగా రోడ్డుని చూస్తూ అక్కడే నుంచున్నాడు,.మరో ఆటో ఏదైనా వస్తుందేమో అందులో అమ్మ ఉంటుందేమోనని , కానీ ఆటో రాలేదు. అమ్మ కూడా రాలేదు. వర్షం ఇంకా పెద్దదయింది.. ఉరుములు, మెరుపులూ. చాలాభయం వేసింది.. ఇప్పుడు అమ్మ ఎలా వస్తుంది?
“ వెంకటమ్మా, అమ్మ ఏ డాక్టరు దగ్గరికి వెళ్లిందో తెలుసా…!”..వంటింటి గుమ్మం దగ్గర నుంచుని అడిగాడు.
“నాకు తెలీదు … కొత్తగా వచ్చిన మాల్ కి దగ్గర అని మాత్రం అంది. నువ్వు హోంవర్క్ చేసుకో మీ అమ్మ వచ్చేస్తుంది…….”
ఆలోచిస్తూనే అక్కడినుంచి గది వైపు నడిచాడు.
గదిలోకి వెళ్ళి,బాగ్ లోంచి ,డైరీ తీసి చూసాడు.మాథ్స్ లో త్రీ డిజిట్ తీసివేతలున్నాయి, అంతే . మరే హోంవర్క్ లేదు. పుస్తకాలు బాగ్ లోంచి తీస్తూండగానే కరెంటు పోయింది. ఇన్వర్టెర్ ఉంది కాబట్టి ,కొన్ని గదుల్లోకి లైటు వెంటనే వచ్చింది. శ్రవణ్ ఉన్న గదిలో లేదు.అందుకని పుస్తకాలు బాగ్ లో పెట్టేసాడు.
ముందు గదిలోకి వచ్చాడు.గాలికి కిటికీ రెక్కలు బాగా శబ్ధం చేస్తూ, గట్టిగా కొట్టుకుంటున్నాయి. వీస్తున్న ఈదురు గాలికి పరదాలు పైకి లేచి పోతున్నాయి.కిటికీ లోంచి బయటికి చూసాడు.వర్షం ఇంకా పెద్దదైంది.ఈ వర్షంలో ఈ గాలిలో ,అమ్మ ఎలా వస్తుంది.?బయట అంతా చీకటి .ఒక్కసారి ఏడుపొచ్చింది.
ఇంత పెద్ద వర్షంలో నేను ఒక్కడినే ఇంట్లో ఎలా ఉండాలి.? అసలు అమ్మ నన్ను ఇంట్లో వదిలి ఎలా వెళ్ళింది.?
నన్ను కూడా తీసికెళ్ళి ఉండాల్సింది. అమ్మ మీద కోపం వచ్చెేస్తోంది. కోపంలో గాలికి కింద పడ్డ పేపరుని తొక్కి తొక్కి చింపి చింపి పెట్టాడు. ఆ ముక్కలన్నీ వణికిపోతూ డేకుతూ నాలుగు మూలలకి వెళ్ళాయి.
అంతలో ఒక్కసారి ఫోను మోగింది.ఆ ఫోను శబ్ధంతో ఉలిక్కి పడ్డాడు.
“ శ్రవణ్ ఫోను. ఇక్కడ వంటింట్లో ఉన్నఫోన్ నేను తియ్యనా,అక్కడ నువ్వు తీస్తావా.!.”అన్న వెంకటమ్మ తో “నువ్వు తియ్యి.”అని బయటికి చూసాడు.. వర్షం ఇంకా పెద్దయింది. ఒక్కడూ ఎలా ఉండాలి.. ఏడుపొచ్చెేస్తోంది.
“ఫోను నాకు కాదు నీకే… అమ్మ మాట్లాడుతోంది…..లైన్ లో ఉంది……”
వెంటనే కళ్ళు తుడుచుకుంటూ, ఫోన్ అందుకోడానికి పరుగు పరుగున వెళ్ళాడు .తనని ఇంట్లో వదిలేసి ఎలా వెళ్ళింది. ఆ విషయం అమ్మని గట్టిగా అడగాలి. తనకి కోపం వచ్చిందని అమ్మకి తెలియాలి. అన్నం మానేయాలి.
“ నువ్వు ఎప్పుడొస్తావ్……? “ కోపంగా అడిగాడు.
“ఎప్పుడంటే ఏం చెప్తాను? నా ముందు ఓ ముగ్గురున్నారు. వాళ్ళదయ్యాకా నేను. డాక్టరు గారూ ఇప్పుడే వచ్చారు…ముందు ఇది చెప్పు, అక్కడ కరెంటుందా……!”
“ లేదు.” కోపంగా అన్నాడు.
“ చీకటిగా ఉందని ఒక్కడివే ఉన్నావని భయపడతున్నావా! లేదు కదా…..!. “ అమ్మగొంతులో ప్రేమ కరిగిపోయాను.
“ లేదు….” బింకంగా అన్నాడు..ఎందుకో తెలీదు. భయం వేస్తోందని అనలేకపోయాడు
“ నాకు తెలుసు నువ్వు భయపడవని,యూ ఆర్ ఎ బ్రేవ్ బాయ్…పెద్దవాడివి….కదా……”
“ ఏ డాక్టరు దగ్గరికి వెళ్ళావ్.. ? .” అమ్మ మాటలతో కోపం కాస్త తగ్గింది. మామూలుగా అయిపోయాడు.
“ కొత్తగా వచ్చిన మాల్ పక్కన గౌతమ్ రెడ్డి క్లినిక్… దగ్గరేలే “
శ్రవణ్ కి తెలుసు ఆ క్లినిక్ చాలా దగ్గర అని.ఈ క్లినిక్ మనకి చాలా దగ్గర, ఒక్క ఐదు నిమిషాల్లో వెళ్ళి రావచ్చు అని నాన్న అన్నారు.ఐదు నిమిషాలంటే ఎంత దూరం అవుతుందో ఆలోచిస్తున్నాడు
“ఎప్పుడొస్తావ్….? “ గంభీరంగా అడిగాడు.
“ తెలీదు.,డాక్టరుగారు తమ్ముడిని చూసాకా, ఆయన రాసిచ్చిన మందులు కొన్నాకా వస్తాను.పైగా వర్షం వస్తోంది.ఎలా వస్తానో ఏమో….. ఆటో దొరికితే తొందరగా రావచ్చు. సరేనా….”
శ్రవణ్ ఏం మాట్లాడలేదు.
“ హోం వర్క్ ఏదైనా ఉంటే చేసుకో….ఈ లోపు నే వచ్చెస్తాను.ఇంటికి పెద్దవాడివి.నాన్న ఊళ్ళో లేరు కాబట్టీ ఇప్పుడు నాన్న తరవాత ఇంట్లో నువ్వే పెద్ద మొగాడివి…“అమ్మనవ్వు వినిపించింది.
అమ్మ పెట్టేసింది. వాడికి పెద్ద సందేహం వచ్చింది.
ఇంతకీ నేను పెద్ద వాడినా.. చిన్న వాడినా… ఇప్పుడైతే చిన్నవాడినే…. పదేళ్ళే కదా ! అమ్మ పెద్దవాడినని ఎలా అంటుంది? నేను చిన్న వాడినే. అని అనుకుంటూనే లైటున్న ముందు గదిలోకి వచ్చి,హోంవర్క్ చేయడానికి కూచున్నాడు,కానీ చెయ్యాలనిపించడం లేదు.
అంతలో ఫోను.ఎప్పటిలాగే వంటింట్లో ఉన్న వెంకటమ్మ తీసింది
“ శ్రవణ్,ఫోను నీకే,అమ్మ మాట్లాడుతోంది.. “ ఒక్క అంగలో వెళ్ళి మూలన ఉన్నఫోను తీసాడు.
“డాక్టరు గారు తమ్ముడిని చూడడం అయిపోయిందా!.వచ్చెస్తున్నావా….! “ గబుక్కున ఆత్రంగా అడిగాడు.
“ అయిపోయింది .పక్కనున్న మెడికల్ షాపులో మందులు కూడా కొనేసాను,ఇప్పుడే బయటి కొచ్చాను. కానీ..ఏం చెయ్యనూ. పెద్ద వర్షం…. ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు.. ఆటో దొరికితే వెంటనే వచ్చేస్తాను.సరేనా……”.
సరే అనలేదు..ఎలా అంటాడు..? ఎందుకంటాడు? అనడు.మళ్ళీ కోపం వచ్చేస్తోంది. అందుకే తమ్ముడికేం అయిందని అడగలేదు. ఏం మాట్లాడ లేదు.
.”…..ఎంత సేపని తమ్ముడిని ఎత్తుకుని ఇక్కడ నుంచుంటాను.పైగా ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేట్టు లేదు.. ఓ పని చెయ్యకూడదూ…రానూ పోనూ ఆటో మాట్లాడుకుని వచ్చెయ్యి,నేనూ వచ్చెేస్తాను…..”..
“ దగ్గరే కదా….నడిచి వచ్చెయ్యి,…..”అన్నాడు కోపంగా..
“ఎలా వస్తాను.మున్సిపాలిటీ వాళ్ళ లైట్లు కూడా లేవు. చీకటిగా ఉంది. తమ్ముడిని ఎత్తుకుని, గొడుగు పట్టుకుని, చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకుని రావాలి. ఇన్ని ఎలా చేస్తాను…. కష్టం కదా… నువ్వు ఆటో తీసుకురా…”
ఒక్కసారి కంగారు పడిపోయాడు. తను ఆటో తీసుకుని వెళ్ళాలా….!. అమ్మా నేను చిన్న వాడిని .నాకు ఇంకా పదేళ్ళే అని అనాలనుకున్నాడు.
“నీ రెయిన్ కోటు వేసుకో. ఇంట్లోంచి బయటికి రా.. మనిల్లు కార్నర్ లోనే ఉంది కాబట్టి, ఏదో ఒక ఆటో దొరుకుతుంది. నువ్వు రానూ పోనూ అంటే వస్తారులే. సరేనా……”
సరే అని అనలేకపోయాడు.శ్రవణ్ కి నోట మాట రాలేదు.ఈ చీకట్లో,పెద్ద వర్షంలో,,అంత దూరం వెళ్ళాలా.! వస్తానని అమ్మ ఎలా అనుకుంటోంది.తను చిన్నవాడు కాదా!.అమ్మ కి తన వయసు పదేళ్ళే అని గుర్తు లేదా! ,.తను పెద్దవాడిననే అనుకుంటోందా .!
“ ఓ కే నా……” .అక్కడ అమ్మ.
ఓ కే అని ఎలా అంటాడు ?… ఓ కే కాదు. తను ఆటో తీసుకుని రావడం ఏంటీ. ?అమ్మ జోక్ చేస్తోంది…..కరెంటు లేదు.చీకటి, ఉరుములూ,మెరుపులూ,హోరున వర్షం.ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు ఎలా వస్తానని అమ్మ అనుకుంటోంది.? భయం తను రావడం కష్టం .
“ సరేనా……” అమ్మ రెట్టించింది.
“ సరే….” అనాలోచితంగా అనేసాను.
“ గొడుగు తీసుకో,నీ టోపి కూడా..వర్షాకాలం కోసం నీకు బూట్లు కొన్నాం కదా..అది వేసుకో….”
ఆందోళనతో ఫోను పెట్టేసాడు.
ఆశ్చర్యంగా ఉంది,సరే అని ఎలా అనగలిగాడు… ?ఏదో అనేసాడు. కానీ, ఇప్పుడు రాలేను అని చెప్పేస్తాను….నాకు భయం .నేను రాను,నువ్వే ఎలాగో ఓలాగా వచ్చెయ్యి.అని అనాలనుకుని ఫోను వరకూ వెళ్ళీ ఆగిపోయాడు.
నాన్న ఎప్పుడూ అంటూంటారు,నువ్వు పెద్దవాడివి,తమ్ముడిని ఏడిపించకు. నువ్వు పెద్దవాడివి వాడితో దెబ్బలాడకు.ఆ కారు వాడికిచ్చెయ్యి,ఆ పెన్సిలు వాడికిచ్చెయ్యి,..యిలాగే ప్రతీసారి,పెద్దవాడివి అంటూ నోరు మూయించే వారు.
ఎప్పుడైనా ఏడిస్తే…ఛ…పెద్దవాళ్ళు ఏడుస్తారేంటీ.భయపడితే పెద్దవాళ్ళు భయపడతారేంటీ,ఇలాంటివి ఎన్నో విని వినీ అప్పుడు నిజంగానే పెద్దవాడిననే అనుకున్నాడు.అలాగే ప్రవర్తించాడు
ఇప్పుడు కూడా నిజంగా అంతేనా…! .పెద్దవాడిని.నేను భయపడడం ఏంటీ….?
వెంటనేశ్రవణ్ తను చదువుకున్న పుస్తకాల్లోని హీరోలని గుర్తు తెచ్చుకున్నాడు.ఛోటా భీమ్, హీమాన్,స్పైడర్ మాన్, బాట్ మాన్, కామిక్స్ గుర్తు తెచ్చుకున్నాడు.వాళ్ళేనా…. ఇంకా ఎంతో మంది హీరోలని గుర్తు తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా, ఆపదలో ఉన్నవాళ్ళని రక్షించారు, సాయం అడిగిన వాళ్ళకి సాయం చేసారు. ఒక్కసారిగా శ్రవణ్ నరనరాల్లో ధైర్యం జరజరా పాకింది. ఛాతి ఉబ్బినట్లయింది.
ఇప్పుడు ఏం చెయ్యాలి…! సాయం అడిగిన ఓ స్త్రీ, ఓ చిన్న పిల్లాడికి సాయం చేయ్యాలి. వాళ్ళు ఎవరు..? తన వాళ్ళే కదా!తన వాళ్ళకి సాయం చేయడానికి ఇంత ఆలోచన ఎందుకు?
అంతే. ఆవేశంతో రెయిన్ కోటు తీసాడు. గొడుగు పట్టుకున్నాడు.
“ ఏంటీ శబ్ధం అవుతోంది .రామూ అక్కడ ఉన్నావా….!” వెంకటమ్మ గొంతు
“ ఆఁ..ఉన్నాను ” అంటూ తలుపు తీసుకుని బయటికి వచ్చాడు.రివ్వున వీస్తున్న గాలి మొహాన్ని కొట్టింది. ఏంచేయాలో తెలీలేదు. అలాగే నుంచున్నాడు.
అంతలో పెద్ద మెరుపు ,వెంటనే చెవులు చిల్లులు పడేంతటి శబ్ధం. వణికి పోయాడు. మళ్ళీ హారీ పాటర్, హర్డీ బాయ్స్ ని, ఫేమస్ ఫైవ్ ని, క్లూస్ టీం ని, ఫెంటాస్టిక్ ఫోర్….ఇలా కార్టూన్స్ ని తలుచుకోగానే పారిపోతున్న ధైర్యం వచ్చింది.
గొడుగుని విప్పాడు.కానీ,అది గాలికి ఆగలేక పోయింది.అటూ ఇటూ ఊగి,వెనక్కి వెళ్ళింది.అలాగే బయటికి వచ్చాడు.ఇంక ఆటో మాట్లాడాలి.కానీ ఎప్పుడూ తనంతట తానుగా ఆటో మాట్లాడ లేదు.ఎప్పుడూ ఎవరూ తోడు లేకుండా ఒక్కడే ఆటో ఎక్కలేదు.ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలో తెలీలేదు.
అదేదో సినిమా లో ఓ అబ్బాయి ఇలా ఆటో కోసం ఎదురు చూస్తూంటే ,ఓ ఆటో వస్తే దాన్లో ఎక్కుతాడు.ఆటోవాడు ఆ పిల్లాడిని ఎక్కడికో తీసుకెళ్తాడు. డబ్బు కావాలంటాడు.డబ్బు ఇవ్వక పోతే, చంపెేస్తానంటాడు. ఇలాంటి కిడ్నాపర్ల గురించి, టీవీల్లో, సినిమాల్లో చూసాడు. వాళ్ళు ఇలా ఆటో డ్రైవర్లలా వచ్చీ, పిల్లల్నెత్తుకు పోతారు అని….ఈ ఆలోచన రాగానే భయం వేసిది.
ఇంటికెళ్ళిపోతే…..!..అనిపించింది.వెంటనే వెనక్కి తిరిగాడు..అంతలోనే ఆటో శబ్ధం వినపడింది.
“ బాబూ…ఆటో కావాలా…!.ఇంత పెద్ద వర్షంలో అలా నుంచున్నావు. ….తడిసిపోతున్నావు..” అంటూ శ్రవణ్ ముందు ఆటోని ఆపాడు.
లోపలున్న డ్రైవర్ని చూసాడు. తలకి నల్ల ప్లాస్టిక్ కాప్. అతను వేసుకున్న రెయిన్ కోటు అతనికన్నా చాలా పెద్దగా ఉంది. మీసాలు సన్నగా ఉండి కిందికి దిగాయి. తను చూసిన సినిమాల్లో విలన్ లాగే ఉన్నాడు. తను చూసిన యాక్షన్ సినిమాలని గుర్తు చేసుకున్నాడు. అన్ని సినిమాల్లో చెడ్డవాళ్ళు ఇలాగే మీసాల్తో ఉన్నారు. మంచివాళ్ళు చక్కగా ఈజీగా గుర్తు పట్టేలాగా ఉంటారు.
వద్దు అని అందామనుకున్నాడు.కానీ ఈ ఆటోని వద్దనుకుంటే మరో ఆటో దొరుకుతుందో లేదో…..
“ వస్తున్నావా …..లేదా…..” అని అంటూనే ఆటో స్టార్ట్ చెయ్యబోయాడు.
“ వస్తున్నాను ” ఎక్కడికెళ్ళాలో చెప్పి గబుక్కున ఆటోలోకి ఎక్కి కూచున్నాడు. కూచోవడం అయితే కూచున్నాడు కానీ, భయంగానే ఉంది. ఒకవేళ నిజంగా ఇతను కిడ్నాపర్ అయితే. తన దగ్గర డబ్బుంటే లాక్కుంటాడు. తీసుకుంటాడు.కానీ, తన దగ్గర లేదు ,అందుకని కోపం వచ్చి,ఎక్కడో ఓ చెట్ల మధ్య నోట్లో బట్టలు ,కుక్కేసి,కాళ్ళూ ,చేతులూ కట్టేసి పడేస్తాడా .చంపెేస్తాడా. అమ్మా వాళ్ళకి తను కనిపించకపోతే…… ఆ ఆలోచన రాగానే ఒక్కసారి వణికి పోయాడు.
దేవుడా…! ఏ దేవుడిని ప్రార్థించాలి..? సమయానికి ఏ దేవుడూ గుర్తుకు రావడం లేదు. ఆ ఆలోచనలోనే మాల్ దగ్గరికి వచ్చారు .
“ ఇక్కడేనా….” అన్న ఆటో వాడి మాటలకి ఎదురుగా చూసాను.మాల్ .అరే అప్పుడే వచ్చేసామా. .నాన్న అన్నట్లుగా నిజంగానే చాలా దగ్గర అనుకున్నాడు. ఆటో దిగకుండానే అమ్మ కోసం చూసాడు.వర్షానికి తడవకుండా ఓ వారగా అమ్మ తమ్ముడిని ఎత్తుకుని పైమెట్టు మీద నుంచుంది. ” అక్కడికి తీసుకెళ్ళి ఆపు, ”అని అన్నాడు.
తన ముందు ఆగిన ఆటో ,అందులో ఉన్న శ్రవణ్ ని చూసిన అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం. ఆనందం. నవ్వుతూ మెట్లు దిగి, తమ్ముడితో ఏదో అంటూ ఆటో ఎక్కి, లోపల కూచుంది.
“ వావ్…గ్రేట్… నువ్వు చాలా పెద్దవాడివయ్యావు, ఈ వానలో ధైర్యంగా ఆటో మాట్లాడి అమ్మని ,తమ్ముడిని తీసుకెళ్ళడానికి వచ్చావు…” అని అంటూ ముద్దు పెట్టుకుంది.
శ్రవణ్ ఛాతి ఉబ్బిపోయింది. పెద్దవాడివి అన్న ఆమాట నచ్చింది. కానీ ఆ మాటలు తనని కానట్టు గంభీరంగా చూసాడు.
“ చూసావా, శ్రవణ్ అన్నయ్య, నీ బిగ్ బ్రదర్, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు.ఈ వర్షంలో మనకోసం ఆటో చేసుకుని వచ్చాడు ”అంటూ.
అలాంటి మాటలు వినడానికి అలవాటైనట్లుగా నవ్వాను,తమ్ముడిని చూసాను.
“ అన్నయ్యా నువ్వు గ్రేట్. సల్మాన్ ఖాన్ వి…”.అంటూ ఓ హీరోని చూసినట్లు ఆరాధనగా చూసాడు.
,“ ఆటో తీసుకు రావడానికి భయపడ్డావా…!..” అంది అమ్మ
“ భయమా..! నాకా..! అయినా ఇది మనింటి నుంచి ఓ ఐదు నిమిషాలే కదా..భయపడ్డానికేం ఉంది.”
అమ్మ నవ్వేసింది…తమ్ముడిని చూస్తూ,నాతో అంది . “ నువ్వు వీడికి బిగ్ బ్రదర్ కదూ…..అందుకే నీకు భయం కలగ లేదు .కదా..ఇంట్లో పెద్దవాడివి నీ బాధ్యత ఎంటో ఎవరూ చెప్పకుండానే తెలుసుకున్నావు.నువ్వు గ్రేట్.” అంది శ్రవణ్ వీపు నిమురుతూ, వాడి మోహం లోకి చూస్తూ.
భయం కలిగింది. “అమ్మా నేను నిజంగానే భయపడ్డాను కానీ, దాన్ని ఓ బాధ్యత జయించేసింది” అని అందామనుకున్నాడు. కానీ అనలేదు.అలా అని తనని తాను తక్కువ చేసుకోదల్చుకోలేదు. ఈ చిన్ని సాహసం,ఓ చక్కని జ్ఞాపకం చేసింది అమ్మ. జీవితాంతం గుర్తుకుండిపోయె జ్ఞాపకం.
- గంటి భానుమతి