[శ్రీమతి టి. శ్రీవల్లీ రాధిక రచించిన ‘శ్రీకృష్ణానురక్తి’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]
[dropcap]శ్రీ[/dropcap]రాముని పాదాలు పట్టుకుని భయము, ధైన్యము, అజ్ఞానము పోగొట్టుకుంటే ‘తక్కువేమి మనకూ!’ అంటూ చక్కని కథలు రాసిన శ్రీవల్లీ రాధిక భాగవతములోని దశమస్కంధసారాన్ని ‘శ్రీకృష్ణానురక్తి’ పేర సరళతరంగా రచించి పాఠకుల ముందుంచారు.
శ్రీకృష్ణుని వైభవంతో కూడిన దశమస్కంధం భాగవతానికి హృదయం లాంటిది. ఈ స్కంధంలోని దేవకి, యశోద, సత్యభామ, ద్రౌపది వంటి తొమ్మిది స్త్రీ పాత్రలు స్వగతాలు చెబుతున్నట్టుగా ఈ పుస్తకం ఉంటుంది. అన్ని పాత్రలూ సంతృప్తితో తమను గురించీ, కృష్ణుడితో తమ బాంధవ్యాన్ని గురించీ ప్రియమార విపులంగా చెప్పడం ఎంతో బాగుంటుంది. రుక్మిణి తాను శ్రీకృష్ణుడిని వలచి అతడిని పిలిపించుకొని మరీ పెళ్లాడడాన్ని లోకులేమనుకున్నారోనని కొంత విచారం చేస్తూనే, నాటి పరిస్థితిని విశదీకరిస్తూ వివరించిన తీరు ఔచిత్యమంతంగా ఉంది.
భాగవతంలోని దశమస్కంధసారాన్ని అందులోని ముఖ్యమైన తొమ్మిది స్త్రీపాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, కథనంతా వ్యాసాల రూపంలోకి మలిచి చెప్పడం వల్ల ఈ స్కంధం పాఠకుల మనసుల్లో చక్కగా ముద్ర పడేటట్టుగా ఉంది. దశమస్కంధంలో వరుసగా ఉండే ఆ కృష్ణలీలలు ఒక ముత్యాలదండలా చక్కగా అమిరాయి. ఆయా పాత్రలు పాఠకుల ఎదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడాయి. ఆత్మీయంగా తమ మనోభావాలను వారి ముందు అమాయకత్వంతో కూడిన నిజాయితీతో కుమ్మరించాయి, కళ్ళకు కట్టినట్టు చదువరుల కనిపించేటట్టు. దశమ స్కంధము చదివినప్పుడు కలిగిన అనుభూతికి అనేక రెట్ల ఆనందానుభూతి ఈ పద్ధతిలో (కథల్లోని పాత్రలు ముఖాముఖీగా తమ అనుభవాల్ని) చెప్పడం వల్ల కలిగింది.
ఈ స్వగతాలన్నీ హృద్యమూ సున్నితమూ అయిన భాషలో వినేవారి మనసును హత్తుకునేటట్టుగా రాయడంలో రచయిత్రి కృతకృత్యురాలయ్యారు. అలా కృష్ణతత్వం అంతా చక్కనిభాషలో చెప్పబడింది. స్త్రీల స్వగతాలుగా రాసిన వ్యాసాల్లోని, వాక్యనిర్మాణంలో ఒక తాజాదనం ఒక వినూత్నకాంతీ ఉన్నాయి ఆపకుండా మనల్ని చదివించేటట్టు.
ప్రమథ మోహన చేసిన కవర్ డిజైన్ ఎంతో సుకుమారంగా, ఆహ్లాదకరమైన రంగులో ఆకర్షణీయంగా ఉంది.పచ్చని పచ్చికపై పక్షుల, గోవులమధ్య నిలబడిన గోపాలుడితో ముఖచిత్రం ఎంతో అందంగా ఉంది. పేపరూ, ప్రింటింగూ కూడా బావున్నాయి.
రాధిక ఇలాగే మరిన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని సులభవచనంలో పాఠకులకు అందిస్తారని ఆశించవచ్చు. ప్రతి ఇంటా ఉండవలసిన విలువైన పుస్తకము ఇది.
***
(దశమస్కంధసారము)
రచన: టి.శ్రీవల్లీరాధిక
ప్రచురణ: ప్రమథ ప్రచురణలు, హైదరాబాదు
పేజీలు: 101
వెల: ₹ 200/-
ప్రతులకు:
టి.శ్రీవల్లీ రాధిక
5-4-345, రోడ్ నెం.5
కమలానగర్, వనస్థలిపురం
హైదరాబాదు– 500 070.
valli.radhika@gmail.com
ఫోన్:9441644644