విశిష్ట వ్యక్తిత్వం – కీ.శే. శ్రీ సిహెచ్. లక్ష్మీ నారాయణ

11
2

[box type=’note’ fontsize=’16’] ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో వివిధ హోదాలలో పని చేసి ప్రజలకి విశేష సేవలందించిన శ్రీ సిహెచ్. లక్ష్మీ నారాయణ గారి పరిచయం అందిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. [/box]

ఉపోద్ఘాతం:

[dropcap]శ్రీ [/dropcap]సిహెచ్. లక్ష్మీ నారాయణ గారి స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడు (జననం: ఏప్రిల్ 2, 1913 – మరణం: నవంబరు 26, 1989). వారి ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం చీరాల పట్టణంలో సాగింది. గుంటూరు ఎ.సి. కాలేజీలో పి.యు.సి. మరియు గ్రాడ్యుయేషన్ చేసారు. తమ గ్రామ నివాసి అయిన శ్రీ లక్ష్మీ నారాయణ గారు నీతి నిజాయితీ గలిగిన మంచి అధికారిగా పేరు తెచ్చుకుని, ఊరికి కూడా మంచి పేరు సాధించిపెట్టినందుకు కృతజ్ఞతగా ది 02-10-1984 న కారంచేడు గ్రామస్తులు అందరూ ఆయనను సన్మానించి గౌరవ పురస్కారాలు ప్రదానం చేయడం జరిగినది.

ఉద్యోగ ప్రస్థానం:

శ్రీ సిహెచ్.లక్ష్మీ నారాయణ గారు, అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా సెప్టెంబరు 11, 1936 నాడు ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు నందు ఎస్.ఐ.గా South Arcot జిల్లాలో నియామకం పొందారు. ఆంధ్రా ప్రాంతంలో మొదటి పోస్టింగు ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం. ఆ తరువాత దర్శి, వినుకొండ, నరసరావు పేట, బద్వేలు, ప్రొద్దుటూరు మరియు బళ్ళారి ప్రాంతాలలో కూడా విధులు నిర్వహించారు. అప్పుడు బళ్ళారి కూడా ఉమ్మడి ఆంధ్రా ప్రాంతంలో ఉండేది. తదుపరి సర్వీసులో అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఆఫీసరుగా ప్రమోషన్ పొంది నర్సాపూరు, హోస్పేట, బళ్ళారి, ఆదోని, రాజమండ్రి లలో పనిచేసారు. ఆ తదుపరి చివరిగా అప్పటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు అనుబంధంగా ఉన్న ఇంటలిజెన్స్ బ్యూరోలో జనగామలో విధి నిర్వహణ చేశారు. డిప్యూటీ ప్రొహిబిషన్ ఆఫీసరుగా పెనుగొండ, రాజమండ్రి మరియు మచిలీపట్నంలలో పని చేసారు. అయన పని చేసిన ప్రాంతాలు ప్రస్తుతం ఉన్న అయిదు రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. అవి -తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒరిస్సా.

పోలీసు శాఖలో:

1956 సం.లో ప్రభుత్వం అప్పటి మధ్య నిషేధ శాఖను రద్దుపరిచి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేసినప్పుడు, ఫిజికల్‌గా ఫిట్నెస్ ఉన్న వారిని మరియు సమర్థవంతంగా పనిచేసే వారిని పోలీసు డిపార్ట్‌మెంటుకు కేటాయించడం జరిగినది. ఆ క్రమంలో పోలీసు డిపార్ట్‌మెంటులో ఆయన ఉద్యోగ ప్రయాణం మొదలైనది.

సమర్ధత – సాహసం – మానవీయ కోణం:

పోలీసు డిపార్ట్‌మెంటులో ఈ నియామకం సమయంలో శ్రీ లక్ష్మీ నారాయణ గారు ఎక్సైజ్ విభాగంలో పనిచేస్తున్న పోస్టు స్థాయి చిన్నది అయినప్పటికీ ఆయన ప్రతిభా పాటవాలు గుర్తించి ఆయనకు ఇవ్వవలసిన పోస్టు స్థాయి కంటే ఉన్నత స్థాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పోస్టుకు ఎంపిక చేయడం చెప్పుకోదగిన విశేషం. ఆయన మీద నమ్మకంతో చేసిన ఎంపిక సరైనదే అని నిరూపించుకోగలిగారు. అది ఎలాగంటే 1959లో శ్రీకాకుళంలో నాగావళి నదికి అంతకు ముందు వందేళ్ళు కాలంలో రానంత వరద సంభవించినప్పుడు, శీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి.

ఆ వరద తాకిడికి నదికి అవతల ఒడ్డున ఉన్న జిల్లా జైలు మునిగిపోవస్తున్నది. అలాంటి విపత్కర పరిస్థితులలో కూడా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా DSP హోదాలో శ్రీ లక్ష్మీ నారాయణ గారు, కలెక్టర్ ఆఫీసు నందు పనిచేసే శ్రీ సుదర్శన రావు అనే మరో ఉద్యోగితో కలిసి ప్రవాహానికి ఎదురుగా వెళ్లి మరీ జిల్లా జైలు చేరుకొని పరిస్థితిని సమీక్షించినారు. అప్పుడు జిల్లా జైలు వరదలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్న విషయాన్ని వైర్‌లెస్ ద్వారా కలెక్టరుకు తెలియపరచి, ఆ జైలులో ఉన్న 39 మంది ఖైదీలను వరద ముగిసేవరకు బయటకు విడిచి పెట్టేందుకు మరియు వరదలు తగ్గిన 4 రోజుల లోపు తిరిగి వారు జైలుకు రావాలని వారితో మాట్లాడి అందుకు ఒప్పించి, సొంత పూచీ కత్తు మీద మానవీయ కోణంలో వారిని విడుదల చేయడం జరిగింది. అయితే 9 మంది తప్ప మిగిలిన ఖైదీలందరూ రిపోర్టు చేయగా, రాకుండా ఉన్న ఆ 9 మంది ఖైదీలను పోలీసులు గాలించి పట్టుకున్నారు. ఈ విధంగా తన ఉద్యోగాన్ని కెరీర్‌ను ఫణంగా పెట్టి మానవీయ కోణంలో అలోచించి సాహసపూరితమైన నిర్ణయం తీసుకున్నందుకు గాను ఆయనకు KENDAL HUMANITY MEDAL ను ప్రకటించి, ది.15-8-1960 న చిత్తూరులో పనిచేస్తున్నప్పుడు ఆయనకు బహూకరించడం జరిగినది.

జైలు ఖైదీల ప్రాణాలను వరదల నుండి కాపాడినందుకు Kendal Humanity Medal బహుకరణ

కాగా, 1961లో ఆయనను తిరిగి ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంటుకు పోస్టు చేసినారు. అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద డిప్యూటీ ప్రొహిబిషన్ పోస్టులు రెండు మాత్రమే ఉండేవి. అందులో ఒక పోస్టు DPO (NORTH) పోస్టులో శ్రీ లక్ష్మీ నారాయణ గారు నియమింపబడినారు (గుంటూరు హెడ్ క్వార్టర్స్‌ గా పనిచేసే ఈ పోస్టు పరిధిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల వరకు ఉండేవి).

పలు రకాల హోదాలలో అంకితబద్ధమైన సేవలందించి ప్రభుత్వ సర్వీసుల నుండి తేది 01-04-1968 న పదవీ విరమణ చేశారు.

ఘనమైన వ్యక్తిత్వం:

శ్రీ లక్ష్మీ నారాయణ గారు తన సర్వీసు మొత్తం సమర్థతతో పాటు, నీతి నిజాయితీలకు లోబడి పనిచేసారు. నిరాడంబరంగా జీవించేవారు. క్రింది స్థాయి సిబ్బందితో ప్రేమాభిమానాలతో మెలిగేవారు. వాళ్ల పట్ల దయాగుణం చూపేవారు. నిరంతరం వాళ్ళ బాగోగులు సంక్షేమం గురించి పట్టించుకునేవారు. ఆయనతో పనిచేసిన ఎంతో మంది ఉద్యోగులు రిటైర్ కావడం ఆ తర్వాత కాలంలో కొంత మంది చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ జీవించి ఉన్న వారు మరియు ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు పని చేస్తున్న కొంతమంది ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు .

సంస్మరణ:

ఆయన పెద్ద కుమార్తె డాక్టర్ సి హెచ్. సుశీలమ్మ ఎం.ఎ(తెలుగు), పిహెచ్.డి, చేసి కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. ఆయన స్మారకార్థం 26 నవంబరు 2021న ఏర్పాటు చేసిన సభలో ఆమె రచించిన ‘విమర్శనాలోకనం’ గ్రంథాన్ని తన సోదరి శ్రీమతి డాక్టర్ ప్రసూనాంబ, మరిది డాక్టర్ కే. కిషోర్, ఎం..డి, డి.జి.ఓ దంపతులకు అందచేశారు.

అదే విధంగా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన 2వ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి గారికి అందచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here