ప్రముఖ విమర్శకులు కే.పి. అశోక్ కుమార్‌కు ‘లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం’

4
2

[dropcap]ప్ర[/dropcap]ముఖ సాహితీ మరియు సినిమా విమర్శకులు, పుస్తక రచయిత, విశ్లేషకులు కే.పి. అశోక్ కుమార్‌కు  ‘లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం’ లభించనుంది.

నవంబర్ 26, సాయంత్రం 4 గంటలకు, గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే ‘విమర్శ వీక్షణం’ పుస్తకావిష్కరణ సభలో, ఈ సాహితీ పురస్కారాన్ని ఆయనకు అందజేయనున్నట్లు ప్రొఫెసర్ శ్రీమతి సి.హెచ్.సుశీలమ్మ ప్రకటించారు.

తన తండ్రి లక్ష్మీనారాయణ పేరిట ప్రతి ఏటా ఈ సాహితీ పురస్కారాన్ని ఆమె అందజేస్తున్నారు. గతంలో ఇప్పటికే మరో ప్రముఖ విమర్శకులు కడియాల రామ్మోహన్ కు,  ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి గార్లకు  ప్రదానం చేసినట్లు ఆమె తెలిపారు.

కాగా, నవంబర్ 26 వ తేదీన జరిగే ‘విమర్శ వీక్షణం’ గ్రంధావిష్కరణ సభకు ముఖ్య అతిధిగా అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయ బాబు  రానున్నట్లు ఆమె తెలిపారు.

***

కే. పి. అశోక్‍కుమార్ జీవితం, కృషి:

శ్రీ అశోక్ కుమార్ గారు 02-02-1956 నాడు సికింద్రాబాద్ లోని మచ్చ బొల్లారంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ కట్టెకోల పెంటయ్య.

అశోక్ కుమార్ 1 నుండి 7 వ తరగతి వరకు  మచ్చబొల్లారం లోని ప్రాథమికోన్నత పాఠశాల  లోనూ, 8 నుండి 11 వరకు బొల్లారం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ బొల్లారం లోని లక్ష్మీరాజలింగం మొదలియార్ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజ్ నుంచి బి.కాం. పాసయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఏ. చేశారు. ఇదే విశ్వవిద్యాలయం నుంచి ‘ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి’ అనే అంశంపై ఎం.ఫిల్. చేశారు. హైదరాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి యం.ఓ.యల్,; యస్.కె. యూనివర్సిటీ, అనంతపురం నుంచి యం.యల్.ఐ.యస్సీ ఛేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఇడి చేశారు.

ఫిబ్రవరి 1983 నుండి డిసెంబర్ 1988 వరకు స్పెషల్ టీచర్, ప్రాథమిక పాఠశాల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండలంలో పని చేశారు. ఆపై 02 డిసెంబర్ 1988 నుండి ఆగష్టు 2020 వరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్‌లో పని చేశారు. ఆగష్టు 2002 నుండి ఫిబ్రవరి 2014 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసాబాంక్, హైదరాబాద్‌లో గ్రంథపాలకుడిగా పనిచేశారు.

హాలీవుడ్ సినిమా, కథావలోకనం (కథా విమర్శ), తెలుగులో మారుపేరు రచయితలు (పరిశోధనా గ్రంథం), తెలుగు నవల – వస్తువైవిధ్యం (విమర్శ), కథానుశీలనం (విమర్శ), ప్రపంచ సినిమా (పరిచయాలు) వీరి ముద్రిత్ర గ్రంథాలు.

దళిత గీతాలు, ఎనిమిదో అడుగు (నవీన్ కథలు), జాంబా పురాణం, నోబెల్ కవిత్వం – అనే పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.

వందలాది వ్యాసాలు, వెయ్యికి పైగా హాలివుడ్ సమీక్షలు, రెండువేలకు పైగా పుస్తక సమీక్షలు వెలువరించారు.

కొన్నేళ్ళు  పాలపిట్ట మాసపత్రిక ఎడిటర్‌గా వ్యవహరించారు.

ప్రస్తుతం తెలంగాణా సాహిత్య అకాడెమీ ప్రచురించే మాస పత్రిక పునాస లో  పనిచేస్తున్నారు.

విమర్శ అన్నది అశోక్ కుమార్‍కు ఊపిరి వంటిది. సాహిత్యం, సినిమాలు ఆయన నరనరాన రక్తమై ప్రవహిస్తున్నట్టుంటాయి. అనేక విహంగ వీక్షక విమర్శకులు, భట్రాజ విమర్శకులతో నిండివున్న తెలుగు సాహిత్య ప్రపంచంలో అరుదయిన అసలయిన విమర్శకులు అశోక్ కుమార్. కేపీ అని సన్నిహితులు ప్రేమగా పిలిచే అశోక్ కుమార్ నిక్కచ్చి అయిన విమర్శలు నిజాయితీగా చేస్తున్నా సరే ఆశ్చర్యంగా అజాత శత్రువు. ఆయన చీల్చిచెండాడినవారు కూడా, అశోక్ విమర్శలోని నిజాన్ని, నిజాయితీని  ఒప్పుకుంటారు. ఆయనకు సన్నిహితులవుతారు. ఎలాంటి రాజీ పడకుండా, మనసులో వున్నది వున్నట్టు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పినా సరే ఎవ్వరూ నొచ్చుకోకుండా, పైగా ఆలోచించే రీతిలో చెప్పటం అశోక్ ప్రత్యేకత. వామపక్షభావాల ప్రభావం వున్నా సాహిత్య పఠనంలోకానీ, విమర్శకు కానీ ఆయన భావజాలం ఆయనకు ప్రతిబంధకం ఎన్నడూ కాలేదు. ఉత్తమ సాహిత్యాన్ని ఎవరు సృజించినా ఇష్టంగా చదువుతారు. మనస్ఫూర్తిగా అభినందిస్తారు. తన చుట్టూ గిరిగీసుకుని, వీరి రచనలే చదవాలి, ఇలాంటివే రచనలు అని సాహిత్యాన్ని సంకుచితం చేయటాని అశోక్ ఎన్నడూ సమర్థించలేదు. అలాంటి విమర్శలను ఆమోదించలేదు. ఎందరో మరుగున పడిన అత్యుత్తమ కథకుల కథలను విమర్శించి, వాటిని వెలుగులోకి తెచ్చి, వారికి సాహిత్య ప్రపంచంలో సముచిత సమున్నత స్థానం లభించటంలో అశోక్ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు, ఒక కథ నచ్చితే పదిమందికీ చెప్పి చదివిస్తే కానీ నిద్రపోరు అశోక్.  కథలు, నవలలు, నాటకాలతో సహా సాహిత్యంలోని విభిన్నమయిన సృజనాత్మక ప్రక్రియల విమర్శపై పట్టువున్న అశోక్, గత నలభై ఏళ్ళుగా అవిశ్రాంతంగా విమర్శ రచనలు చేస్తున్నారు. ఇలా అన్ని ప్రక్రియలపై సాధికారంగా విమర్శలు చేయగలిగిన ఏకైక విమర్శకుడు అశోక్ కుమార్. తన విమర్శలను లబ్ధప్రతిష్ఠులకు, ఏదో ఒక భావజాలంతో రాసేవారికో, వాదానికో, ప్రాంతానికి చెందిన రచనకో పరిమితం చేయలేదు అశోక్. అనంతమైన సాహిత్యసాగరంలో ఎల్లలు లేని విశృంఖల విహారం అశోక్‌ది. ప్రాంతీయ, భావజాల సంకుచితాలను ఎన్నడూ ప్రదర్శించలేదు. అలాగే, దళిత, స్త్రీవాద, మాండలిక, సాంఘిక, థ్రిల్లర్, హారర్.. రచన ఏదయినా బాగుంటే మెచ్చుతారు. బాగోలేకపోతే నిర్మొహమాటంగా చెప్తారు. అశోక్ సాహిత్యమే కాదు, సినీ విమర్శకులు కూడా. తెలుగు, హిందీ, హాలీవుడ్ సినిమాలతో పాటూ యూరోపియన్ సినిమాలు వెరసి ప్రపంచ సినిమా విమర్శకుడు అశోక్.

వ్యక్తిగతంగా అశోక్ అత్యంత ఉత్తములు. ఎవరికయినా సహాయం చేస్తారు తప్ప హాని చేయాలన్న ఆలోచన కూడా రాదు అశోక్‌కు. ఇతర విమర్శకులకు భిన్నంగా, అశోక్ తాను సమీక్షించే పుస్తకాన్ని పూర్తిగా ఒకటికి రెండు మార్లు చదువుతారు. అనేక ఇతర సభాపక్షులకు భిన్నంగా, వేదికనెక్కేముందు తాను మాట్లాడాల్సిన అంశం గురించి క్షుణ్ణంగా అభ్యసించి, ఉపన్యాసం రాసుకుంటారు అశోక్. అశోక్ రాసే ప్రతి విమర్శ వెనుక, ఇచ్చే ప్రతి ఉపన్యాసం వెనుకా ఎంతో పరిశోధన, ఎంతో తపన, అధ్యయనాలుంటాయి. ఆయన ఆషామాషీగా ఏ పనీ చేయరు. అశోక్‍కు ఉన్న ఒక అరుదయిన ఆశ్చర్యకరమయిన గుణం ఏమిటంటే, పుస్తక ప్రేమికుడయి, పుస్తకాలను విరివిగా కొంటూ, ఇంట్లో ఒక పెద్ద గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసుకున్న అశోక్, ఎవరికి ఎప్పుడు ఏ పుస్తకం అవసరమయినా వెంటనే ఇవ్వటమే కాదు, వారే అంశం గురించి పరిశోధిస్తున్నారో ఆ అంశానికి సంధించిన ఇతర పుస్తకాలను కూడా తెలియచెప్పి తన దగ్గర వున్న పుస్తకాలను ఆప్యాయంగా అందచేస్తారు. సాధారణంగా పుస్తక ప్రేమికులు ఇతరులవద్ద పుస్తకాలను తీసుకుంటారు కానీ, తమవద్ద వున్న పుస్తకాలను ఇతరులకు చూపించేందుకు కూడా ఇష్టపడరు. కానీ, అశోక్ ఎంత సహృదయులంటే, తనదగ్గర ఏదయినా పుస్తకం రెండు కాపీలుంటే, ఆ పుస్తకాన్ని ఎవరు సరిగా ఉపయోగించగలరో వారికి ఆ పుస్తకాని అందచేస్తారు. తన పుస్తకాన్ని మరొకరికి సంతోషంగా ఇచ్చే అరుదయిన సహృదయ పుస్తక ప్రేమికుడు అశోక్ కుమార్. అలాంటి అశోక్ కుమార్‌కు ఉత్తమ విమర్శకుడిగా అవార్డు రావటం అత్యంత ఆనందదాయకం. అశోక్ కుమార్ తెలంగాణాకు చెందినవారు. ప్రాంతీయ భావాలు వ్యక్తుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ఈ కాలంలో అశోక్‌కు అధికంగా అవార్డులు రావటం, సన్మానాలు జరగటం ఆంధ్ర ప్రాంతంలోనే అవటం గమనార్హం.  సంచికకు ఆప్తులు, సన్నిహితులు శ్రేయోభిలాషి అయిన  కేపీ అశోక్ కుమార్‌కు, సంచికకు ఆప్తులు, సన్నిహితులు, శ్రేయోభిలాషి అయిన సుశీలమ్మగారు తమ పితృదేవుల స్మారకార్థం అందించే అవార్డుకు ఎంపిక చేయటం అత్యంత ఆనందదాయకం. అర్హులకు అందాల్సిన బహుమతులు అందటం, జరగాల్సిన సత్కారాలు జరగటం తెలుగు సాహిత్య ప్రపంచానికి మంచిరోజులొస్తున్నాయన్నదానికి సూచన. అందుకే, అశోక్ కుమార్‌కు అభినందనలు, సుశీలమ్మ గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలుపుతోంది సంచిక.

ashok.0940@gmail.com అనే మెయిల్ ఐడిలో వారిని సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here