[dropcap]23[/dropcap]-12-2021 తేదీన విశాఖ సాహితి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత కీ.శే. ఘండికోట బ్రహ్మాజీరావు గారి జయంతి సందర్భంగా విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన “శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి శతజయంతి సంవత్సర ప్రకటన” మరియు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి “శ్రీలంకా యాత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు అంతర్జాల మాధ్యమంలో జరిగినవి.
ఆచార్య మలయవాసిని గారు కీ.శే. ఘండికోట బ్రహ్మాజీరావు గారి శతజయంతి సంవత్సరం ప్రకటన చేసి, 23-12-2021 నుండి 23-12-2022 వరకు వారి గౌరవార్థం పలు సాహితీ కార్యక్రమాలు విశాఖ సాహితి చేబడుతుందని తెలియజేసారు.
తదుపరి, విశాఖ సాహితి వేదికగా శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారు తమ పుస్తకం “శ్రీలంకా యాత్ర” ఆవిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిథి ‘ఆచార్య సార్వభౌమ’ ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుస్తక ఆవిష్కరణ కావించి, శ్రీమతి వరలక్ష్మిగారు తమ శ్రీలంక యాత్రా విశేషాలు పద్య రూపంలో ప్రకటించినందులకు వారిని అభినందించారు. ఆత్మీయ అతితిగా సభలో పాల్గొన్న ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠల్ మూర్తి గారు తాము కూడా 2019లో చేపట్టిన శ్రీలంక యాత్రలో పాల్గొన్నామని, శ్రీమతి వరలక్ష్మిగారు ఆ యాత్రా విశేషాలను పద్యరూపంలో పుస్తకంగా వెలువరించడం ఆనందదాయకమని అన్నారు.
సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య గారు గౌరవ అతిథిగా పాల్గొని, ఛందో కవిత్వంలో శ్రీమతి వరలక్ష్మి గారు చేసిన కృషిని కొనియాడారు. శ్రీ కోలవెన్ను వెంకట రమణరావు గారు, సాహితీ బంధు శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్యం గారు పుస్తక సమీక్ష కావించారు. రచయిత్రి శ్రీమతి వరలక్ష్మి గారు తమ స్పందనలో తాము ‘అనంతఛ్చందం’ సమూహంలోని పండితుల ప్రోత్సాహ సహకారాలతోనే తాము చందో కవిత్వం వ్రాయడం ప్రారంభించామని చెబుతూ ‘శ్రీ లంకా యాత్ర’ పుస్తక రచన, ఆవిష్కరణలో సహకరించిన అందరికీ ముఖ్యంగా ఆచార్య మలయవాసిని దంపతులకు ధన్యవాదాలు తెలియజేసారు.
దేశ విదేశాల నుండి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభలో విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. కందాళ కనకమహాలక్ష్మిగారు సభా ప్రారంభంలో స్వాగత వచనాలు పలికి, సభాంతంలో వందన సమర్పణ చేశారు.