శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి ప్రసంగ కార్యక్రమం – ప్రెస్ నోట్

0
2

[dropcap]2[/dropcap]8-11-2021 తేదీన విశాఖ సాహితి ఆధ్వర్యంలో ‘ప్రముఖ విశాఖ రచయిత కీ.శే. అవసరాల రామకృష్ణారావు గారి కథా సాహిత్యం’ అనే అంశంపై వర్ధమాన రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి ప్రసంగ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో జరిగింది.

సభకు అధ్యక్షత వహించిన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య మలయవాసిని గారు, విశాఖ రచయితలలో పేరేన్నికగన్న శ్రీ అవసరాల రామకృష్ణారావు గారి కథా సాహిత్యంపై విశాఖ సాహితి వేదికగా ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకమైనదని అంటూ, వారితో తమకుగల పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీ అవసరాల వారి రచనలు చమత్కారవంతమైనవి గాను, ఆలోచన రేకెత్తింపజేసేవిగాను ఉంటాయని పేర్కొంటూ, వారి కథా శీర్షికలు కూడ విలక్షణంగా ఉంటాయని, వారి రచనలలో స్త్రీల సమస్యలకి ప్రాధాన్యత కనిపిస్తుందని అన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు శ్రీ అవసరాలవారితో తమకుగల ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేసి, వారి రచనలవల్ల ప్రభావితులై తాముకూడ కొన్ని కథలు వ్రాసామని పేర్కొన్నారు.

ప్రధాన వక్త శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు వారికి శ్రీ అవసరాల రామకృష్ణారావు వారితో గల పరిచయాన్ని గుర్తుచేసుకొని, వారి కథల వైశిష్ఠ్యాన్ని సోదాహరణంగా వివరించారు.

సభలో పాల్గొన్న అవసరాలవారి ఏకైక సంతానం శ్రీ అవసరాల జగన్నాధరావు గారు మాట్లాడుతూ, శ్రీ రామకృష్ణారావు గారి సాహితీ ప్రస్థానం తమ పదిహేనవ ఏట ‘చందమామ’లో ప్రచురించబడ్డ మొదటి కథ ‘పొట్టి పిచ్చిక కథ’ శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారి ప్రేరణతో మొదలయిందని తెలియజేసారు.

పలువురు రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ అంతర్జాల సభలో విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సభారంభంలో స్వాగత వచనాలు పలికి సభాంతంలో వందన సమర్పణ గావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here