‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-1

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

 

 

[dropcap]నా[/dropcap] ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ఇష్టదేవతా స్తుతి:

1. విఘ్నేశ్వర స్తుతి:

శా:
అన్నా! ఇంతటి బొజ్జ నీది! మిగులన్ ఆయాసమున్ బొందుచున్
ఇన్నీ రీతి భుజింపనేల? యనుచున్ ఎంతేని హాస్యంబుతో
తన్నున్ పల్కెడు స్కందుగాంచి, నగుచున్, తాల్తున్ మహావిఘ్నముల్
ఎన్నో బొజ్జను; కాతు విశ్వమను నా విఘ్నేశ్వరున్ గొల్చెదన్

~

2. నృసింహ స్తుతి:

చం:
శ్రీసతి వామభాగమున శేముషి జూపగ, నాదిశేషుడున్
వాసిగ ఛత్రసేవను సమంచిత రీతిని జేయ, శాంతమున్
పోసిన మోము, నిత్యము కృపోజ్వల కాంతి దలిర్ప, యోగులున్
భాసిలు పాదపద్మములు బట్టగ, వెల్గు నృసింహ మ్రొక్కెదన్

~

3. వాణీ స్తుతి:

తే.గీ.:
బ్రహ్మదేవుని పట్టపురాణి వాణి
నాదు కలమున వసియించి నన్ను బ్రోచి
పద్యశతములు వ్రాయించ ప్రార్థనమును
వినయశీలముగా జేతు ఘనపు భక్తి

~

4. దత్త స్తుతి:

కం:
దత్తాత్రేయస్వామిని
చిత్తములో నిలుపుకొనుచు, సేవింతు, మహా
విత్తంబు రాగముక్తిని
మిత్తిని నెదిరించు మతిని నీయగ్, ననఘన్

~

5. శివ స్తుతి:

శా:
స్వామీ! మేన సగంబు తీసుకొని నా సంభావ యస్తిత్వమున్
లేమిం జేసితి రన్న గౌరి గని, ‘ఈ రీతింబల్క భావ్యంబె? ఏ
సీమల్ లేని యభేదమే మనది, నిన్ సేవింతున్ పరాశక్తిగాన్’
ఈ మాటల్ సతి తోడ బల్కెడు శివుని కీర్తించెదన్ నిత్యమున్

~

6. హయగ్రీవ స్తుతి:

ఉ:
జ్ఞానముచేత గల్గిన ఘన ద్యుతి వెల్గుచు సర్వవ్యాపియై
దీనత బాపి, భక్తులకు దివ్యసుఖంబుల గూర్చి, బ్ర్రోచుచున్
మానిత సర్వవిద్యలకు భాసుర మూలమునైన దేవునిన్
పూనిక నశ్వకంఠునకు పూజలు సేయుదు కార్యసిద్ధికై

~

7. శ్రీకృష్ణ స్తుతిః

తే.గీ.:
పనియె నీదని కాదెప్డు ఫలితమనుచు
దివ్యబోధను చేసిన దేవ దేవు
కృష్ణపరమాత్మ ప్రార్థింతు కావ్యసిద్ధి
కొరకు, గీతామృతసార గురుని, హరిని

~

8. శ్రీరామ స్తుతిః

మనిషిని నేనని చెప్పిన
ఘనతర ధర్మాభివ్యక్తి, కరుణా స్ఫూర్తిన్
ఇనవంశ కీర్తి చంద్రుని
అనయము వినుతింతు రామచంద్రుని మదిలో

~

9. శ్రీ వేంకటేశ్వర స్తుతి:

చం:
తిరముగ నేడుకొండలను తేజము నొప్పగ నిల్చియుండు నా
తిరుపతి వేంకటేశ్వరుడు తీర్చుత నాదగు కావ్య కామితం
బరమర లేక, కైతలను పారగ జేయుత బాస మీర, నా
కరమును బట్టి పద్యములు, కాగ సుబోధకశైలి, హృద్యముల్

~

గురుస్తుతి:

10.

తే.గీ.:
చిన్నతనమున నాదగు చేయి పట్టి
విద్యగరపిన గురుదేవు వినతి జేతు
శంకరయ్యను సాక్షాత్తు శర్వు భక్తి
శిష్యవాత్సల్య శేముషీ శ్రేష్ఠునకును

~

11.

సయ్యదు మహమ్మ దాజము
నెయ్యముతో నాకు నేర్పె, నీతియు, యెఱుకన్
అయ్యారే! ఆ గురువును
చయ్యన మరి బోలు నొజ్జ అరయగ గలడే?

~

మాతాపితరుల స్తుతి:

12.

ఉ:
చల్లని తల్లి లక్ష్మినరసమ్మ, విశేష ప్రపూర్ణ ప్రేమ, శ్రీ
వల్లియు, నన్ను పెంచి, తన వాక్కుల మంచిని పంచి ధీరతన్
ఉల్లము లోన నింపి నను ఊర్జితు జేసిన మాతృదేవి, యా
తల్లికి జన్మ జన్మలకు, తప్పక తీర రుణంబు, మ్రొక్కెదన్

~

13.

సీ:
సంస్కృతాంధ్రమ్ముల సమమైన పాండిత్య
స్ఫూర్తిని వెలిగించి కీర్తిగనియె
నిఖిల పురాణాల సకల జనుల జేర్చి
ప్రవచనకర్తయై భాసురిల్లె
అష్టావధానముల్ అవలీలనొనరించి
పండితోత్తములతో ప్రాపుగాంచె
ఆధ్యాత్మ విద్యలో నభ్యాసయోగంబు
విస్తృత రీతిలో విశదపరచె
తే.గీ:
బ్రహ్మ తేజమ్మది మానవ రూపమై
వెలుగొంద ధీశక్తి వెలిగె మిగుల
నాకు సాహిత్య జ్ఞానంబు నమర జేసి
తానె ఛందస్సు నేరిపి ధన్యు జేసి
హరిని చేరెడు త్రోవను అరయచేసె
తండ్రి నరసింహశాస్త్రి నే దలతు సతము

~

లఘు వ్యాఖ్య:

ప్రబంధ లక్షణములైన ఇష్టదేవతాస్తుతితో కవి తన కావ్యమును ప్రారంభించుచున్నాడు. మొదట విఘ్నపతిని స్తుతిస్తూ ఒక చమత్కార పద్యం. కుమారస్వామి, “అన్నా, ఇంత పెద్ద బొజ్జ కదా నీది? మళ్లీ ఆ ఉండ్రాళ్లు, కుడుములు తినకపోతేనేమి?” అని గణేశునితో హాస్యమాడినాడు. అప్పుడా గణనాథుడు, “ఈ బొజ్జ తిండి వల్ల వచ్చింది కాదురా, భక్తులు తమ విఘ్నాలు తొలగించమని నన్ను వేడుకొంటారు. వాటినన్నింటినీ ఈ బొజ్జలో దాచి, వారిని కాపాడుతాను” అన్నాడు. ఆయనకు జోత! ఈ పద్యానికి స్ఫూర్తి, అల్లసాని పెద్దనగారి మను చరిత్రము లోని నాందీ పద్యము, ‘అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ’ అను వినాయక స్తుతి.

ఇక నాల్గవది శివపార్వతీ స్తుతి. అమ్మవారు “స్వామీ! నన్ను మీ మేన సగం చేసుకొని నాకు ఒక ఐడెంటిటీ లేకుండా చేసినారు” అని నిష్ఠూరం చేయగా, “దేవీ! ఎంతమాట! మనిద్దరం ఒకటే ! నిన్ను పరాశక్తిగా సేవిస్తాను” అన్నాడట. అర్ధనారీశ్వరతత్త్యంలోని చమత్కారం.

ఆరవ పద్యంలో అశ్వకంఠుని స్తుతించాడు కవి. అంటే హయగ్రీవుడు! “జ్ఞానానందమయం దేవం” అన్న శ్లోకం దీనికి స్ఫూర్తి. ‘నిష్మామ కర్మ’ను “పనియె నీదని కాదెప్డు పలితమనుచు” అని అన్నాడు కవి. అట్లే, “ఆత్మానం మానుషం మన్యే” అన్న శ్రీరాముని మాటను “మనిషిని నేనని చెప్పిన ఘనతర వ్యక్తిత్వమూర్తి” గా అభివర్ణించాడు కవి. అట్లే, వేంకటేశ్వరుడు ‘నా కరమును బట్టి పద్యములు పారగ జేయుత’ అనడంలో ‘నాహం కర్తాహరిఃకర్తా’ అన్న అన్నమయ్య మాట స్ఫూర్తి.

ఇక గురుస్తుతిలో, తన చిన్నతనమున తనను తీర్చిదిద్దిన గురువులు శ్రీ శంకరయ్య, శ్రీ మహమ్మద్ ఆజాం గారలను కవి స్మరించుకున్నాడు. తర్వాత తల్లిదండ్రులను ప్రేమతో స్మరించాడు. తల్లిని “విశేష ప్రపూర్ణ ప్రేమ శ్రీవల్లి” అంటాడు కవి. ఇక తన తండ్రిని గురించిన 13వ పద్యము ఆ మహాపండితుని మన కళ్లముందు నిలుపుతుంది. ఆయన తనకు “హరిని జేరెడు త్రోవను అరయ చేసే” అంటాడు. ‘తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి’ అన్న ప్రహ్లాదుని మాటలు ఈ భావానికి స్ఫూర్తి.

వచ్చేవారం ‘పూర్వకవిస్తుతి’, కావ్యాన్ని నరసింహదేవుని కంకితమిచ్చిన పద్యములతో కలుసుకుందాం.

‘లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్’

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here