[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ప్రథమాశ్వాసము:
127.
దత్తగీతి:
మౌని జనవర్యులును పావనులు ఘనులున్
పూని హరి జాడగను పోయిరతి భక్తిన్
కాని సనకున్ సనందనుని, భటులున్
కానగ పరాత్పరుని కాదిపుడు యనుచున్
128.
కం:
జయవిజయ నామధేయులు
నయమున మునిద్వయముతో, వినయము వెలుంగన్
శయనము ఇప్పుడె ముగిసెను
నియమము కాదిపుడు నిలుడు మీరని యనగన్
129.
వ:
సనకసనందనులు మిక్కిలి కోపించిన వారై
130.
ఉ:
కోపము చేత మానసము, కూడిన శాంతము ద్రోసివేయగా
మాపగ సద్వివేకమును మౌనివరేణ్యుల ఓర్మి చావగా
‘మాపయి మీరు చూపినది మన్నన చేయగ రాని దోషమే!
చూపెద మా ఫలంబున’ని జృంభిత క్రోధము తోడ బల్కినన్
131.
సుగంధి:
నీరజాక్షు మేము జూడ నిశ్చయించి వచ్చినన్
మీరు మమ్ము లెక్కలేక నిగ్రహించి రిమ్మెయిన్
గౌరవంబు భంగమయ్య క్రుంగె మానసంబులున్
చేరలేరు మీరు విష్ణు శ్రేష్ఠమౌ సమీపమున్
132
మ:
ఇదె మా శాపము ధూర్తులార! ఇకపై మీరిద్దరున్, ధర్మమున్
మది పాటించక, కిల్పిషంబు కతనన్; భావించి దామోదరున్
విదితుండైన విశేష శత్రువునుగా, విస్తార మాత్సర్యముల్
ఎద సంక్షోభము జూప రాక్షసులుగా నీరీతి జన్మింపరే!
133.
కం:
అను మునివర్యుల శాపము
మనమున భీతియును దుఃఖ మతిశయమవగా
తనువులు మూర్ఛను బొందగ
ఘనశోకము దీరలేక కళవళపడగన్
134.
శా:
శాంతాసక్తులు, సంయమీంద్రు లిటులన్ జాజ్వల్య కోపానలం
బెంతేనిన్ ప్రభవింప, శీతశశిలో పెంపొందు నుష్ణంబు నాన్
సంతుల్ శాపము నివ్వ నేదియె విశాలంబైన సత్కారణం
బంతేవాసుల కిట్లు కీడు కలుగన్, భావింపగన్ కల్గదే?
135.
వ:
అని, అచట హరి దర్శనా మనోరధులైన మునిసురగణంబులు పరిపరివిధములు చర్చించుకొన దొడంగిరి.
136.
సీ:
దీనినంతయు తన దివ్య చిత్తమునందు
తెలిసికొని విష్ణుండు తేజమలర
నచ్చోటి కరుదెంచి అమ్మునీంద్రుల జూచి
దరహాస వదనుడై తాను పలికె
‘సకల లోకంబుల దిరుగు శమదమ ఘనులు
మిము నిరోధించిన వీరి తప్పు
నాది గావున క్షమియించి ఆదుకొనుడు’
అనగను శాంతులై చనిరివారు
తే.గీ.:
దానవాంతకు దివ్య సందర్శనమున
వారి కోపంబు నశియించె మనసు దనిసె
మాధవుండును జనె నిజ మందిరముకు
వైనతేయుని బంపెను వారి కొరకు
137.
కం:
నిరతము నిశ్చల భక్తిని
హరిద్వారము గాచునట్టి నాత్మీయులు, నా
వరభృత్యులు జయవిజయులు
శిరములు హరిపదములందు చేర్చిరి వ్యథ తోన్
138.
వ:
వారిని ప్రేమతో లేవనెత్తి, పరమాత్ముండైన కేశవుండు, కరుణా పూరిత వాక్కులతో నిట్లు పలికె “ఓ జయవిజయులారా! సనక సనందనులు కోపించి శపించినను, మీరు ఎంతో సహనము వహించి, మాటలాడక, స్థిరచిత్తముతో నిలిచినారు. ఇది ప్రశంసనీయము. మునుల శాపంబు మరలింప నాకును శక్యము గాదు. తపశ్శాలురు, విశ్వకల్యాణకాములునగు యోగిపుంగవుల ఆగ్రహమును సైతము అనుగ్రహము గానే భావించవలెను. ఏలయన..”
139.
ఉ:
యోగులు మౌనిసత్తములు, ఊర్జిత దివ్య తపోనిధానులున్
ఆగమ సర్వశాస్త్ర విదులందరి మేలును కోరువారు, నే
భోగములన్ చరింపరు విమోహ విదూరులు, జ్ఞానపూర్ణులున్
ఈ గతి మీరు పొందుటకు నేపరమార్థము గోరి యల్గిరో?
~
లఘువ్యాఖ్య:
పద్యం 127 కవి స్వంత సృష్టి, ‘దత్తగీతి’ అనే ఛందస్సు – అందులో సనకసనందన మహర్షులు విష్ణు దర్శనం కోరి రాగా, జయవిజయులు వారిని అడ్డగించి, ఇపుడు కుదరదని అంటారు. పద్యం 130లో ఆ మహర్షులకు విపరీతమైన కోపం వచ్చి, దాని వల్ల వారిలోని శమము నశిస్తుంది. పద్యం132లో వారు జయవిజయులకిచ్చిన ఘోరశాపమును కవి చెబుతున్నారు. అందులో ‘కిల్బిషము’ అన్న పదప్రయోగాన్ని గమనించాలి. దానికర్థము, ‘మౌఢ్యం’. ‘మీకు రాక్షస జన్మ లభిస్తుంది’ అని ముని శాపం. పద్యం 134 లో వారి కోపం, చంద్రునిలో పెంపొందే వేడిమిలా ఉందనడం చక్కని పోలిక (ఉపమ). పద్యం 136 లో సర్వజ్ఞుడైన శ్రీహరి అక్కడికి వచ్చి, తన ద్వారపాలకులు చేసిన తప్పు తనదే అని అనడం, మహర్షుల పట్ల ఆయనకు గల విశేష గౌరవాన్ని సూచిస్తుంది. వారిని శాంతపరచి, దర్శన మొసగి పంపుతాడు స్వామి. పద్యం 138 (వచనం) లో తనను శరణుజొచ్చిన జయవిజయులకు అభయమిస్తాడు పరాత్పరుడు. బుషులెంత కోపించినా, నిగ్రహం కోల్పోని తన ద్వారపాలకులను మెచ్చుకుంటాడు. ఋషుల ఆగ్రహం కొంత అనుగ్రహమే. దీనిలో ఏదో పరమార్థం ఉంది. వారి కోపాన్ని మరలించడం తనకు కూడ సాధ్యం కాదని స్వామి అనడంతో ఈ భాగం ముగుస్తుంది.
వచ్చే భాగంలో ప్రథమాశ్వాసం పూర్తవుతుంది.
(సశేషం)