[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
153.
ఉ:
శ్రీమదహోబిలాగ్రమున శ్రీసతి గూడుచు నిల్చియున్న, ఆ
కామితసిద్ధిదాయకుడు ఖండిత పాపలతా సమూహుడున్
మామక సర్వజీవన సమాశ్రయ కారకుడా నృసింహునిన్
ఏమరుపాటు లేక భజియింతును నిత్యము రాగముక్తికై
154.
వన మయూరము:
భక్తజన కల్ప సురవంద్య, మధునాశీ
వ్యక్తనిజ దివ్య పావన సురూపా
ముక్తి ప్రద హస్తయుగ పోషిత ప్రపంచా
రక్తి నిను గొల్వ నఘ నాశమగు శౌరీ!
155.
తే.గీ.:
సుదతి దితి గర్భమున బుట్టిరి దనుజులు, హి
రణ్యకశిపుండు జ్యేష్ఠుడు రాక్షసాధి
పతి, హిరణ్యాక్షుడాతని యనుజుడు, ఘన
వర పరాక్రమ గర్వులై వాసి గనిరి
156.
తే.గీ.:
ఆ హిరణ్యాక్షు డవనిని బంతి చేసి
వేదముల మ్రుచ్చిలించుచు వేగజనగ
ఘోర వారాహ రూపంబు గూడి యపుడు
దునిమె శ్రీనాథుడాతని దోర్బలమున.
157.
మ:
తన తమ్ముండటు ఘోర మృత్యుగతుడై తానట్లు ధన్యాత్ముడై
చన, కోపంబున గ్రాలు మానసమునన్ సాధించగన్ పెంపగన్
ఘన దైత్యుండు హిరణ్యకశ్యపుడు చీకాకుంబొంది, వ్యగ్రాత్ముడై
తన సైన్యమ్ము, వికుంఠ పట్టణముపై దాడింజేయ సంసిద్ధుడై
158.
వచనము:
నిరంతర హరిద్వేష జ్వలిత మానసుండైన హిరణ్యకశిపుండు, తన ప్రియ సోదరుండు మాధవు చేత హతుడైన కతంబున, అగ్నికి అజ్యము తోడైన రీతిని మండుచుండెను. అప్పుడు అసురగురుండు, దానవ సంక్షేమాభిలాషి, శుక్రుడేతెంచి, నిలింపవైరి చక్రవర్తితో నిట్లు పలికె.
159.
కం:
బలమే యన్నిట గెలవదు
బలయుతుడగు సోదరుండు మరణించె గదా!
నిలువుము దానవ శేఖర!
తెలిపెద నీ శత్రు గెలుచు తీరును వినుమా!
160.
చం:
కలుగును శత్రునాశనము కల్గు జగత్పరిపాలనంబునున్
తొలగును సర్వభీతులును, ద్రుంపగ వచ్చు మహారి విష్ణునిన్
ఎలమిని నీకు ఘోర తపమే తగు బ్రహ్మను గూర్చి చేయుమా
నలువయె నిన్ను దివ్యవర మండితు జేసి ఘటించు కార్యమున్
161.
వచనము:
అని గురుడానతిచ్చిన, దానిని శిరోధార్యముగా దలంచిన హిరణ్యకశిపుండు
162.
కం:
మండెడు కోపము తనువై
చండతరంబైన దౌష్ట్య సంరంభమునన్
నిండిన గర్వము వెలుగన్
పిండీకృత సర్వభువన భీకరుడగుచున్
163.
సీ:
తన ఘోర విక్రమం బెనలేనిదని చాట
దానవాగ్రణి తాను ఘనత జూప
ఎంతొ ఘనమైన నేన్గుల దంతములను
మ్రోగు బ్రహ్మండ వాయిద్య మోత బోలు
వికృత వికటాట్టహాసముల్ వెడలజేయ
దివిజుల గుండెలు దిగ్గురనగ
నక్షత్ర కాంతులే నవముత్యముల వోలె
జాబిల్లి యాతని ఛత్రమవగ
తే.గీ.:
తేరిపారగ గనలేని తేజమునను
అలఘు నిజ శౌర్యమైశ్వర్య మతిశయింప
సకల జగములు భయమున సంచలింప
హేమకశిపుడు వర్తించె భీముడగుచు
164
చం:
త్రిశిర! త్రినేత్ర! శంబర! యతీత పరాక్రమ! విప్రఛిత్తి! ధీ
ర! శతసుబాహు! ఇల్వల! సురారి పులోముడ! పాకుడా! మహా
భృశగతి! దంష్ట్ర భీకర! ప్రపూర్ణ మనస్కులుగా వినుండు, నా
వశమును జేయ దుష్టుడగు మాయల విష్ణుని, దైత్యులెల్లరన్
165.
కం:
బలహీనులైన దివిజులు
కొలుతురు యా యధము విష్ణు, గుణహీనుని, నా
మేలును కోరెడు తమ్ముని
తల ద్రుంచెను వాడు, దుఃఖ తాపము కలిగెన్
166.
తే.గీ.:
మనకు చిరవైరియున్, సురపక్షపాతి
దొంగ మాయల పందిగా దృటిని మారు
చంచలాత్ముడు, నతని, భావించు తరిని
నాదు చిత్తము దందహ్య మానమగును
167.
వచనము:
దానవ శ్రేష్ఠులారా! ఇదే నా ప్రతిజ్ఞ.
168.
భుజంగ ప్రయాతము:
మహశూలమున్ బూని మాయావి విష్ణున్
సహాయంబు లేకుండ శౌర్యంబు తోడన్
అహో! వక్షమున్ చీల్చి హర్యక్ష భంగిన్
మహత్కార్య సంస్ఫూర్తి మ్రందింతు భీరున్
169.
తే.గీ.:
తప్త రుధిరంబు చేతను తర్పణంబు
చేసి నా కూర్మి తమ్ముని శ్రేష్ఠమైన
యాత్మ దనియింతు మన వైరి యనిని ద్రుంచి
నాదు శపథంబు వినుడు ఓ జోదులార!
~
లఘువ్యాఖ్య:
ఈ భాగములో – పద్యాలు 153, 154 కృతిపతి మహత్తు వర్ణన. ఇది కావ్యలక్షణమే. పద్యం 155 – దితి, కశ్యపుల కడుపున జయవిజయులు హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మించారని చెబుతుంది. పద్యం 156లో హిరణ్యాక్షుడు లోక కంటకుడై వేదములను అపహరించి, భూమిని బంతిని చేసి పీడించ, విష్ణువతనిని భీకరవరాహ రూపుముతో సంహరిస్తాడు. ఈ పద్యంలో వాడిన ‘మ్రుచ్చిలించుట’ ఒక చక్కని అచ్చ తెనుగుపదం. దొంగిలించడం. అది కూడ తెలుగుపదమే.
పద్యం 157లో తమ్ముని చావుతో వ్యగ్రుడై, క్రోధంతో, వైకుంఠం మీదికి దండయాత్రకు సిద్ధమైనాడు. 158 వచనం. దీనిలో దానవ గురువు శుక్రాచార్యుడు వచ్చి, హితవచనములు పలుకుచున్నాడు. పద్యం 159లో “రాక్షసరాజా! బలమే అన్ని చోట్ల పని చేయదు. నీ తమ్ముడు కూడ మహా బలశాలి. కానీ చంపబడ్డాడు కదా! కాబట్టి శత్రువుని గెలిచే విధానం చెబుతా విను” అంటున్నాడు. పద్యం 160లో శుక్రాచార్యుడు తపస్సు యొక్క ప్రభావాన్ని చెబుతున్నాడు. “అది సర్వశత్రువులను నశింప చేస్తుంది. కాబట్టి బ్రహ్మను గూర్చి తపస్సు చేయి” అంటున్నాడు. ఈ పద్యము చివర పాదములో ‘నలువ’ అన్నది అచ్చతెనుగు పదం, బ్రహ్మకు పర్యాయపదం. పద్యం 163లో హిరణ్యాక్షుని వైభవము, కోపాతిశయము, తేజస్సు, శౌర్యము వర్ణింపబడినాయి. పద్యం 164లో తన అనుచరులైన వివిధ రాక్షసులను పేర్లతో సంబోధిస్తున్నాడు రాక్షసపతి. పద్యం 168లో విష్ణువుని వధిస్తానని ప్రతిన. ఇది భుజంగ ప్రయాతమనే ఛందస్సు. పాము సాగే విధంగా సాగుతుంది కాబట్టి దానికా పేరు. పద్యం 169లో తమ్మునికి విష్ణువు రక్తముతో తర్పణము చేసి అతని ఆత్మకు శాంతి చేకూరుస్తాడట.
(సశేషం)