‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-2

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

 

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

పూర్వకవి స్తుతి:

14. ఆదిశంకరులు:

ఉ:
మెండుగ స్తోత్రరాజముల మేదిని భక్తులకిచ్చి, నిత్యుడై
యుండెడు యాది శంకరుని నుంచెద చిత్తమునందు, భక్తిమై
నిండగు వేద ధర్మమును నేమము గాచిన ధర్మమూర్తికిన్
ఖండిత దుష్ట దుర్మత వికాసు, విరాగు, సుయోగి పుంగవున్

~

15. వ్యాసమహర్షి:

సీ:
భారతంబును వ్రాసె పంచమ వేదంబు
మానవ జాతికి మార్గదర్శి
భాగవతంబును బ్రకటించి జనులకు
భక్తియోగము చాటె పరమగురుడు
సంస్కృత భాషలో సౌలభ్యములనెల్ల
పాఠకాళికి నిచ్చె మహిత గరిమ
విష్ణ్వంశతో బుట్టి వేదాలు విభజించె
బ్రహ్మసూత్రంబుల బ్రజకునిచ్చె
తే.గీ.:
అవని వెల్గెను కృష్ణ ద్వైపాయనుండు
వ్యాసనామము అన్వర్థ మనగ వివిధ
గ్రంథరాజిని సంకలనంబు జేసె
అఖిల కవులకు ఆదర్శమైన స్ఫూర్తి

~

16. వాల్మీకి:

ఉ:
మానవుడై జనించి, ఘనమైన గుణంబుల మించి, మేదినిన్
మానవ జాతి కెల్ల తన మార్గమె యాచరణీయమై, బృహ
ద్దానవ రాజి దృంచి, తగు ధర్మము నెల్లెడ పెంచినట్టి, యా
దీన శరణ్యు రాము కథ దెల్పిన యాది కవిన్ నుతించెదన్

~

17. నన్నయ:

ఉ:
నన్నయ వోలె వ్రాయుటకు నాకెటు శక్తియు లేదు, యాతనిన్
సన్నుతి చేసినన్ గలుగు సర్వకవిత్వ పటుత్వ సంపదల్
చెన్నగు భావ సంపదయు శ్రీకరమైన పదప్రరూఢియున్
తన్నిటు మ్రొక్కి, రమ్యకవితా ఝరి నింపెద, నింపు పెంపునన్

~

18. పోతన:

కం:
పోతన్న సహజపాండితి
చేతమునన్ నిలిపి యతని చేత గ్రహింతున్
పీతాంబరధరు హరిగను
కైతల వెలయించు నేర్పు, కమనీయముగన్

~

19. తిక్కన:

సీ:
కవి విరించిగ తాను యవనిలో నుతినొందె
ఉభయ కవి హితుడై శోభనొందె
సింహభాగము దానె చిరకీర్తి నొందుచు
ఘన భారతంబును యనువదించె
హరిహరాత్మకుడైన ఆదిదేవుని యొక్క
దివ్యతత్త్వము దెల్పె సవ్యముగను
అచ్చతెనుగు లోన అనువైన కైతల
తెలుగు తల్లికి గూర్చె మాలనల్లి
తే.గీ:
అతడు తిక్కన, అక్కజమైన ధిషణ
కవులు త్రయమైన విష్ణువై కలిమి గాంచు
అతని సేవింతు పాండిత్యగతిని కోరి
నాటకీయత సంభాషణముల నేర్పు

~

20. ఎర్రన:

ఉ:
రాజిత నారసింహుని పురాణము వ్రాసి మదీయ స్ఫూర్తికిన్
తేజము గూర్చి యెర్రన, అతీత మహామహిమాన్వితుండు, వి
భ్రాజితమైన కీర్తి వనపర్వము పూర్ణము జేసె, ధీయుతుం
డీజగమందు నిల్చు, నిజ దివ్యకవిత్వ విశేష శేముషిన్

~

21. ఎర్రన:

తేగీ:
శంభుదాసుండు ఈ కావ్య సఫలమునకు
నాకు చేదోడు వాదోడునై రహించి
నారసింహుని మాహత్మ్య మరయు త్రోవ
మార్గదర్శిగ వేడుదు మహితభక్తి

~

22. ఎర్రన:

కం:
కథయును కథనము నెర్రన
పథమును నేనసునుసరింతు పరిపూర్ణముగన్
పథదర్శి ఎర్రనార్యుని
కథితం బే క్రమము నాదు కబ్బము నడుపున్

~

23. ఎర్రన:

తే.గీ:
అల్పవిషయజ్ఞతా మతిని యగుట చేత
అలఘు పాండిత్య గరిమంబు అసలు లేక
శంభుదాసుడె గురుడుగా సాగుచుంటి
నారసింహుని మాహత్మ్య మరయు గతిని

~

24. విశ్వనాథ సత్యనారాయణ:

చం:
తనరెను జ్ఞానపీఠమున తాను కవీశ్వర చక్రవర్తిగా.
మనదగు యార్ష ధర్మమును భాసిలచేసెను, కల్పవృక్షమున్
ఇనకుల ధీరుకిచ్చి, మహనీయ కవిత్వఝరీ ధురీణు, నే
వినతుల, విశ్వనాథకవి వేమరజేతును, భావపుష్టికై

~

25. అంకితము:

ఉ:
పంకజనాభుడా నృహరి భాసిత కౌస్తుభధారి, లచ్చి వా
మాంకము వెల్గ శేషఫణి మాలిక నీడను సింహరూపుడై
సంకటనాశుడై దనరు శాశ్వత ముక్తిప్రదాన శీలికిన్
అంకితమిచ్చుచుంటి నిటు మామక కావ్యము మా నృసింహుకున్

~

లఘు వ్యాఖ్య:

కవి, ప్రబంధ లక్షణములలో ఒకటైన ‘పూర్వకవి స్తుతి’ ని పాటించి, మొదట ఆదిశంకరాచార్యులను ప్రస్తుతించారు. మెండుగ స్తోత్రరాజముల మేదిని భక్తులకిచ్చిన మహనీయు ధర్మాన్ని, నియమాలను పరిరక్షించిన వాడని కొనియాడారు.

వ్యాస స్తుతిలో, మానవజాతికి మార్గదర్శియైన పంచమవేదము భారతాన్ని, భక్తియోగాన్ని ప్రకటించడానికి, భాగవతాన్ని ఆయన వ్రాశాడు. విష్ణు అంశతో జనించి వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడని, ‘వ్యాసుడు’ అంటేనే అనుసంధానకర్త అనీ చెప్పారు.

వాల్మీకిమహర్షి, ధర్మరక్షణడైన రాముని కథ మనకు చెప్పిన ఆదికవి అన్నారు కవి. “మానవ జాతి కెల్ల తన మార్గమె యాచరణీయమై” అనడంలో రామావతార తత్త్వం విశదమైంది.

నన్నయ్యగారి వలె వ్రాయడానికి తనకు శక్తి లేదనీ, ఆయనను స్తుతిస్తే, “సర్వకవిత్వ పటుత్వ సంపదలు, చెన్నగు భావసంపద, శ్రీకరమైన పద ప్రరూడి” లభిస్తాయని కవి ఆకాంక్షించారు.

తిక్కనను కవి విరించిగ అభివర్ణించారు. అచ్చతెనుగును తన కావ్యంలో ఉపయోగించి “తెలుగు తల్లికి కూర్చె మాలనల్లి” అంటున్నారు కవి. తిక్కనది “అక్కజమైన ధిషణ” అన్నారు.

ఇక ఎర్రనార్యుని తనకు మార్గదర్శిగా ప్రకటించుకున్నారు కవి. ఆయన ‘నృసింహపురాణ ప్రబంధం’ తనకు స్ఫూర్తి అని, కథ, కథనక్రమం అంతా ఎర్రన మార్గంలోనే తాను నడిపించాననీ. తాను అల్పవిషయజ్ఞుడననీ, అలఘు పాండిత్య గరిమంబు లేనివాడననీ, కాబట్టి శంభుదాసుడైన ఎర్రననే తన గురువుగా స్వీకరించానని, కవి వినయంగా చెప్పుకొన్నారు.

చివరగా (The last but not the least) కవిసమాట్ విశ్వనాథ వారిని ‘మనదగు ఆర్ష ధర్మమును భాసిల జేసినవానిగా, మహనీయ కవిత్వఝరీ ధురీణు’నిగా నుతించారు.

అంకిత పద్యంలో ‘మా నృసింహుకున్’ అనడంలో స్వామిని కవి ఎంత own చేసుకున్నారో తెలుస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here