శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-5

0
3

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

 

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

55.

మ:
కనియన్ మౌనివరుండు మాధవు, బృహత్కారుణ్యవారాశు, దా
ఘనమౌ భక్తి ప్రపత్తులన్ సకలమౌ కైవల్యసంధాయి, నా
దిననాథోజ్వల తేజు, సింహముఖునిన్, దేదీప్యమానప్రభా
వినతాసూన వహున్, స్వయంభువు, మహవేదాంత సారున్, హరిన్

56.

సీ:
కొండ యంచున నున్న గుహ లోన వెలుగొందు
నోబలనరసింహు నుతుల జేసె
ఏకశిల వెలసి సకలార్థదాయియౌ
చిన్మయరూపుని సేవ చేసె
ఘోరకాననమందు చరియించు హర్యక్షు
నర్ఘ్య పాద్యంబుల నాదరించె
తీక్ష్ణ దంష్ట్రా నేత్ర దీప్తుల గ్రాలెడు
పంకజ నాభుని ప్రాపు గనియె
తే.గీ.:
ఇదె నహోబిల మిదె భవ్య మిదియె పరము
లచ్చి మగనికి నెలవైన లలితనగము
భక్తకోటిని నిజలీల చూచునట్టి
మహిత నరసింహదేవుని మంత్ర యశము

57.

కం:
తనువున బులకలు వొడమగ
మనమున హరి ధ్యాన జనిత పావన విధులన్
కనులను హర్షపు బాష్పము
లను గావలమౌని దనిసె నమలిన మతియై

58.

కం:
దేవశ్రవుడను మునిపుం
గవుడాగిరి హరిని గూర్చి కమ్మని కథలన్
చెవులారగ వినిపించుచు
గైవల్యపు బోధ జనుల గఱపుచునుండెన్

59.

ఉ:
ఆ మహనీయు జేరి తగనాతని మ్రొక్కెను మౌని గావలుం
డా, ముని యాదరించి, ఉచితాసన సంస్థితు జేసి, త
న్నామము, దేశ, వంశముల నాదర మొప్పగ గోర, మౌనియున్
నేమము తోడ దెల్పె, శ్రమ మేర్పడ, యాత్రల తీరు తెన్నులన్

60.

వ:

దేవశ్రవుని చేత నారాయణుని దివ్య కథలను విన్నవాడై, గావలుడు పరమానందమును బొంది ఆయనతో ఇట్లు పలుకుచున్నాడు.

61.

మ:
మునినాథా! కనుగొంటి నెన్నియొ మహా ముక్తిప్రద క్షేత్రముల్
కనినా నెన్నియొ పుణ్యతీర్ధములు నే కాలక్రమాయాతినై
కనలేదెచ్చట నిట్టి తేజ విలసత్కల్యాణ కృద్ధామమున్
వినగా గౌతుక ముద్భవించె మదిలో, వేడ్కన్ నాకెరింగింపరే!

62.

తే.గీ.:
ఘోర దనుజుని తన వాడి గోళ్ళ జీల్చి
హేమకశిపుని బరిమార్చి, యమిత కరుణ
బాలప్రహ్లాదు గాచిన భద్రమూర్తి
నారసింహుని నెలవని నెరిగియుంటి

63.

ఉ:
కారణమేమి దైత్యపతి కయ్యము బూనగ బద్మనాభు తోన్!
కోరకమున్నె దైత్యసుతు ఘోర విపత్తుల నుండి గాచు నా
భారము కేశవుండెటుల బట్టి నహోబలనాథుడియ్యెడన్
వారిత సర్వదుఃఖ పరిపాలితుడెవ్విధినయ్యె? తెల్పుమా?

64.

తే.గీ.:
మధుర గంభీరమగు పల్కులధరములను
తనర వచియించె దేవశ్రవానఘుండు
హరిమహత్తును గావలు డెఱుగ గోర
అఖిలమునులును చెవియొగ్గి యాలకింప

65.

చం:
మునివర! నీవు కోరినటు పూనికనీ కథ నీకు జెప్పెదన్
ఘన శృతి శాస్త్రసాధక మఖండ ముముక్షు గణప్రబోధితం
బనితర యోగ సిద్ధికరమష్ట సుసిద్ధుల నిచ్చు మంత్రమున్
వినుము విశేష భక్తియుత ప్రేరిత మానస భాసితుండవై

66

కం:
నా కొలది నీకు దెల్పెద
నాకును గురువర్య విదిత మగునా తీరున్
లోకవినుతమగు చరితము
నీ కథ వినుమయ్య! నరహరీశుని గరిమన్

~

లఘు వ్యాఖ్య:

పద్యం 55 లో గావల ముని అహోబిల నరసింహ దర్శనం చేసుకుంటాడు. మత్తేభవృత్తంలో కవి ఈ సందర్భాన్ని వర్ణించారు. స్వామిని కైవల్యసంధాయిగా, దిన నాథోజ్వల తేజునిగా, సింహముఖునిగా, స్వయంభువుగా, మహా వేదాంతసారునిగా వర్ణిస్తారు.

పద్యం 56 లో ‘ఇదె నహోబిల మిదె భవ్యమిదియె పరము’ అంటారు కవి. ‘మహిత నరసింహదేవుని మంత్ర యశము’ అనడంలో స్వామి వారి దివ్య శక్తి ప్రభావం విదితం.

పద్యం 57 లో నరసింహ దర్శనం వల్ల గావలుడు పొందిన అలౌకిక స్థితిని వర్ణిస్తారు కవి. ఆ పర్వతం మీద దేవశ్రవుడను మునీశ్వరుడు (ప. 58) హరిని గురించిన కథలను వినిపిస్తూ ఉంటాడు. ఆయన వద్దకు వెళ్లి (ప 61) “మునినాథా, ఎన్నో మహ క్షేత్రములు కనుగొన్నాను కాని, ఇటువంటి తేజవిలసిత కల్యాణకృత ధామమును చూడలేదు”, (ప 62) “ఇక్కడేనట కదా నృసింహ ప్రభువు హిరణ్యకశిపుని వధించి, బాలప్రహ్లాదుని గాచినాడు, ఎందుకు దైత్యునికి స్వామితో వైరం కలిగింది?” అని అడగగా, (ప 65) అహోబల క్షేత్ర వైశిష్ట్యమును దేవశ్రవుడు గావలునికి తెల్పుతాడు. అది “ఘన శృతి శాస్త్ర సాధకము. అఖండ ముముక్షు గణములకు జ్ఞాన సిద్ధిని కలిగించింది. అష్టసిద్ధులనిచ్చేది” అని తనకు తెలిసినంత చెబుతానని, దేవశ్రవుడు చెబుతాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here