[dropcap]పా[/dropcap]ణ్యం దత్తశర్మ నృసింహ ఉపాసకులు. ఛందస్సుపై పట్టు గలవారు. వీరి పద్య కావ్యం ‘సమకాలీనం’ ఇదివరకు ‘సంచిక’లో ధారావాహికగా వచ్చింది.
తన ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, దత్తశర్మ, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము రచిస్తున్నారు. ఇష్ట దేవతాస్తుతి, సుకవిస్తుతి, షష్ఠ్యంతములు, ఆశ్వాసాంత పద్యగద్యములు మున్నగు ప్రబంధ లక్షణము లన్నియు కవి ఈ గ్రంథములో పాటించినారు. దీనిని ఆయన అహాబల నారసింహుని పద కమలములకే అంకితమిచ్చినారు.
ఈ కావ్యము ఐదు ఆశ్వాసములతో నలరారును. మొత్తం 800కు పైగా (సుమారు) పద్యములుండును. యథా రీతిగా వాడే వృత్తములు, జాతులు కాక, మాలిని, మహాస్రగ్ధర, సుగంధి, తరళము, పద్మనాభము, వసంతతిలకము, మంగళ మహాశ్రీ, ఉత్సాహము, పంచచామరము, మందాక్రాంతము, తరువోజ వంటి ఎన్నో ఛందోరీతులను దత్తశర్మ తన కావ్యములో వెలయించినారు. కావ్యమంతయు ద్రాక్షాపాకమున, కదళీపాకమున, సులభసుందర సుబోధకముగా నడచినది. సుదీర్ఘ సంస్కృత సమాస భూయిష్టమసలు కాదు.
“తేనెసోక నోరు తీయనమగు రీతి
దోడ నర్థమెల్ల తోచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు
మూగ చెవిటివారి ముచ్చటగును”
అన్నారు కవయిత్రి మొల్ల. దీనిని త్రిగుణశుద్ధిగా నమ్మి ఈ కావ్యము వ్రాస్తున్నారు కవి.
ఎర్రన ‘నృసింహ పురాణము’, వ్యాసభాగవతములోని ‘సప్తమ స్కంధము’లను దత్తశర్మ తన కథాక్రమమన అవలంబనగా గ్రహించినారు. పద్యప్రేమికులకు ‘సంచిక’ అందిస్తున్న ప్రబంధ కుసుమ పరిమళమిది.
వచ్చేవారం నుండీ, ప్రతి వారం కొన్ని పద్యాలు, వాటి భావసౌకుమార్యం, ప్రయోగ వైవిధ్యం, ఇతర విశేషాలతో కవిగారి లఘు వ్యాఖ్యతో, సంచిక పాఠకులకు అందించబోతున్నాము.