Site icon Sanchika

శ్రీ మహా భారతంలో మంచి కథలు-11

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

29. తపతీ సంవరణోపాఖ్యానం!

[dropcap]వే[/dropcap]దం, యజ్ఞ వేదిక కలిగినట్టి అధిక పుణ్యుడు, ధర్మతత్వం, పవిత్రమైన నడవడి కలిగిన వాడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు పురోహితుడుగా ఉన్న రాచవంశాలు సుఖసంతోషాలు కలిగి ఉండడమే కాక, ధర్మ వర్తనులై కీర్త ప్రతిష్ఠలు కలిగి ఉంటాయి. అందుకే రాజవంశస్థులు పాపరహితులను, బ్రహ్మతేజులను, రాగ భయదూరులను పురోహితులుగా నియమించుకునేవారు.

పురహితం కోరే పురోహితుల ద్వారా యజ్ఞయాగాదులు, నెరవేర్చుకోనేవారు. ధర్మమార్గపు మెళకువలను అలవరుచుకొనేవారు. వివాహాది సందర్భాలలో తమ మనోభీష్టం నెరవేర్చుకొనడానికై, సంధికార్యాలను నెరవేర్చుకొనడానికై వారిని రాయబారులుగా చేసుకొనేవారు.

సూర్యనికి విశాల నేత్రి, నిర్మలగాత్రి, యౌవనవతియైన తపతి అనే కూతురు కలదు. ఆమెకు యోగ్యుడైన వరుడి కొరకు సూర్యుడు అన్వేషిస్తున్నాడు. భరత వంశస్థుడు, ధార్మికుడు, ఆజామీఢుని పుత్రుడైన సంవరణుడు అదే సమయంలో జప నియమాలతో సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు.

సూర్యుడు ‘నాలాగే ఇతడు వెలుగుతున్నాడు. ఇతడే నా కూతురుకు తగిన భర్త’ అని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు సంవరణుడు వేటకై వెళ్ళి, ఆకలి దప్పులతో గుర్రం అలిసిపోగా, తానొక కొండ పైకి నడిచి వెళ్ళాడు. అక్కడ సకల సౌందర్యరాశి యైన తపతిని చూసాడు. ‘అందంలో, శృంగారంలో దేవతాకన్యలలోనైన ఇటువంటివారున్నారా’ అని ఆశ్చర్యపోయాడు. మన్మథ పీడితుడు అయ్యాడు. ఆమె రూపమనే అమృతాన్ని త్రాగడం చేత రెప్పపాటు లేని కళ్ళను ఆమెపై నిలిపి, “ఓ వనితా! క్రూరమృగాదులు సంచారం చేసే ఈ అరణ్యంలో, ఎగుడు దిగుడు పర్వత ప్రదేశాలలో ఒంటరిదానివై ఉన్న నీవెవరు?” అన్నాడు. తపతి ఆ మాటలు విని మెరుపు తీగవలె మాయమైపోయింది. ఆమె ఆదృశ్యమైపోగా అతడు నేల మీద పడి దుఃఖించాడు. తపతి తాను కూడా అతడిని ప్రేమించడంతో, అతడి బాధను గమనించి, తపతి మరలా ప్రత్యక్షమయింది. “ఎందుకు మోహం పొందావు” అని అడిగింది. సంవరణుడు “నీ కారణంగా పొందాను. మన్మథుని దెబ్బతో మరణం పొందకుండా నన్ను కాపాడుము. నన్ను గాంధర్వ వివాహం చేసుకో” అన్నాడు. అపుడు తపతి “నాపై ప్రేమ ఉంటే మా తండ్రిని అడుగుము. అది సరైన పద్ధతి. స్త్రీలకి స్వాతంత్య్రం లేదని తెలుసుకదా. జప, నియమ, నమస్కారాలతో మెప్పించు” అని చెప్పి వెళ్ళిపోయింది. అటుపై మరలా సంవరణుడు మూర్ఛపోయాడు. అతడి మంత్రి వచ్చి, అతడి మూర్ఛ తేర్చాడు. ఆ పర్వతం పైననే సంవరణుడు మహాభక్తితో సూర్యుడిని ఆరాధించాడు. అటుపై తమ పురోహితుడైన బ్రహ్మర్షి వశిష్ఠుని స్మరించాడు. అతడు పన్నెండవ నాడు ప్రత్యక్షమ్వగానే, తన కోరిక వెలిబుచ్చాడు. తన యోగ దృష్టి ద్వారా వారి మధ్యన ఉన్న ప్రేమను గూర్చి తెలుసుకున్నాడు. వెంటనే సంవరణుడి కోరిక మేరకు పదివేల అమడలు పయనించి సహస్ర కిరణుడిని వేదోక్త మంత్రాలతో స్తోత్రం చేసాడు. సూర్యుడు  ప్రసన్నుడై రాకకు కైరణ మడిగాడు.

“పురువంశ శిరోభూషణుడు, ధర్మార్థప్రసిద్ధుడు అయిన సంవరణుడికి భార్యగా తపతిని యివ్వాలి. కుమార్తెలను కన్నందుకు ఫలం – ధర్మబద్ధమైన నడవడి గల నరులకు ఇవ్వగలగలటమే కదా” అన్నాడు వశిష్ఠుడు. సూర్యుడు సంవరణుడికి తపతికి తగిన వరుడని భావించి ఋషి వెంట యిచ్చి పంపించాడు. నిమిషానికి 364 ఆమడులు పరుగెత్తే సూర్యుని రథంతో పాటు శ్రమ లేకుండా పయనించి తపతిని తీసుకుని వచ్చాడు. తపతి సంవరణులకు వివాహం జరిపించాడు. అయితే మన్మథ సుఖప్రీతితో సంవరణుడు తపతితో కాపురం చేస్తూ రాచరాక్యాలను, ధర్మాలను వదిలి పన్నెండేళ్ళు ఆడవుల్లోనే ఉండిపోయాడు. దాని వలన భూమండలం పైన అనావృష్టి ఏర్పడింది.

వశిష్ఠుడు మరలా సంవరణుడిని నగరానికి రప్పించి శాంతిక, పౌష్ఠిక వైదిక క్రియలు నిర్వహించాడు. అపుడు అనావృష్టి తొలగింది.

ప్రేమించుకున్న వారిని కలిపి వివాహం జరిపింది – క్షత్రియ సంతతిని నిలిపి రాజ్యాన్ని శత్రు అభేద్యంగా చేయడానికై శాంతిక, పౌష్టిక క్రియల జరిపింది – ప్రజా సంక్షేమానికై. అంటే పురహితం, ప్రజాహితం కోరి పని చేసేవాడు పురోహితుడు అన్నమాట. దానితో ప్రజలు ఆనందించారు. తపతి సంవరణులకు కురుడు పుట్టాడు. అందుకే పాండవులు తాపత్యులు అయ్యారు.

రాజులు ప్రేమలో పడినపుడు వివాహప్రయత్నాలు చేసి, భోగ లాలసులయి రాజ్యాన్ని, ప్రజలను గాలికి వదిలి వేసినపుడు మరలా తగిన విధంగా కర్తవ్యోపదేశం చేసి, వారిని సరైన దారికి మరల్చి, ప్రజాహితానికై రాజులు కృషి సలిపేట్లుగా చేసి అటు రాజవంశాలకు ఇటు ప్రజాబహుళ్యానికి వారధిగా ఉంటూ వైదిక కర్మలతో పాటు మంత్రిత్వాన్ని, మంత్రాగాన్ని నెరవేరుస్తూ రాజ్యభివృద్ధితో ప్రధానపాత్ర వహించే వారు పురోహితులు.

ఇది ఒక వంశ కథ మాత్రమే కాదు. మరే వంశకర్త జీవితంలోనూ కనబడని పురోహిత మహాత్యగాథ.

ఆదిపర్వం ప్రథమాశ్వాసం లోనిది.

30. వశిష్ఠుడు

ఇక్ష్వాకుల వంశానికి పురోహితుడు, అనేక యజ్ఞయాగాలు చేసిన వాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు అపకారం చేసి తన కొడుకులను మట్టుపెట్టినపుడు, సమర్థుడై యుండి కూడా చెలియలికట్టను సముద్రం దాటనట్లుగా, కోపాన్ని దిగమింగుకొని, బ్రహ్మర్షులెలా ఉండాలో నిరూపించినవాడు వశిష్ఠుడు.

అయితే మహాత్ములు కూడా రాగద్వేషాలకు లోనై, బలహీనక్షణాలలో మహాపాపమైన ఆత్మహత్యలకు పాలుపడతారని, అయితే వారి తపోనిష్ఠ వలననైతేనేమి, సమయానికి తగిన దైవకృప వలననైతే నేమి, ఆ పాపకృత్యాలను అధిగమిస్తారని నిరూపించే, సూచించే ఒక మంచి వృత్తాంతం వశిష్ఠుల వారి జీవితంలో కనబడుతుంది.

తిన్న యింటి వాసాలను లెక్కబెట్టటం, ఉపకారికి అపకారం చేయడం, రాజస, తామస, క్షాత్రధర్మంలో విశ్వామిత్రుల వారు వశిష్ఠుడిని హింసలపాలు చేయటం, విశ్వామిత్రుడు వశిష్ఠుడిని బాధించే సందర్భంలో ఒక నృపాలుడు కూడా శిక్షింపబడటం.. వంటి సంఘటనలు, ఈ కథలో పిట్టకథలై మానవ జాతికి మానవతా విలువలను, శాంతచిత్తమును, క్షమాగుణమును, ధార్మిక ప్రవర్తనను, జీవన పరమార్ధమును తెలుపుతాయి. ఈ వృత్తాంతం ఉత్తమ వృత్తాంతంగా భాసిస్తుంది. క్రోధాహంకారాలు, మానావమానాలు, ప్రతీకారేచ్ఛలు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపే అంశంగా శోభిస్తుంది.

పూర్వం కన్యాకుబ్జంలో గాధి కుమారడైన విశ్వామిత్రుడు అనే రాజుండేవాడు. ఒకసారి వేటకై తన పరివరంతో కలిసి అడవికి వెళ్ళాడు. బాగా వేటాడి మిక్కిలి తాపం పొంది అలిసిపోయాడు. విశ్రాంతికి వశిష్ఠుని ఆశ్రమము చేరుకున్నాడు. మానవతామూర్తియైన వశిష్ఠ మహర్థి వారిని మిక్కిలి పూజించి, తన ఆశ్రమ హోమధేనువైన నందిని సహాయంతో పంచభక్ష్యపరమాన్నాలతో విందు చేసాడు. అతడి ఆతిథ్యాన్ని చూసి గాధేయుడు ఆశ్చర్యంతో, అసూయ పొందాడు. అదే లోక విచిత్రం. ఎదుటి వారి నిండు మనసు సేవలు కూడా కొందరు హర్షించలేరు. ఇట్టి హోమధేనువు తనలాంటి వారి వద్ద ఉండాలి తప్ప, శాంతుడైన బ్రాహ్మణుడి వద్ద యేల ఉండాలని యోచించాడు. సుఖసౌఖ్యాలు, ఆనందాలు, ఆర్భాటాలు ఉన్నతమైన వస్తుసంపదలు రాజుల సొంతమై ఉండాలి తప్ప సామాన్య ప్రజానీకం వద్ద ఉంటే రాజులకు, ప్రజలకు తేడా ఏముంటుందీ అన్న అహంకార ధోరణి అది.

అందుకే వశిష్ఠుడితో “నీకు లక్షపాడి ఆవులనిస్తాను. దీనిని నాకిమ్ము” అన్నాడు. వశిష్ఠుడు “పితృ, అతిథి దేవతలకు దీనితో తృప్తిపరుస్తాను. ఈ ఒక్క ఆవును కాపాడుకుంటే నాకు చాలు. అయినా ఋషులకు సంపదలెందుకు” అని శాంతచిత్తంతో సమాధానమిచ్చాడు. దానికి కోపించిన విశ్వామిత్రుడు “బలవంతంగా దీనిని గ్రహిస్తాను చూడుము” అని అన్నాడు. అన్నంత పని చేశాడు.

ఇతరుల వలన బాధ కలుగకుండ, సాధుజనుల ధనాన్ని కాపాడే ప్రభువే దయ తప్పి, తాను అపహరించే వాడైతే, సాధుజనుల సమూహం ఏమి చేయగలదు?

“పరులవలన బాధ పొరయకుండఁగ సాధు | జనుల ధనము గాచు జనవిభుండు

కరుణ తప్పి తాన హరియించువాఁ డగు | నేని సాధులోక మేమి సేయు?” (1-7-104)

కంచె చేను మేస్తే కాపేమి చేయగలడు? ఉపకారానికి పోతే అపకారం ఎదురైతే సామాన్యుడు ఏమి చేయగలడు? వశిష్ఠుడు సమర్థుడు కానీ సాత్వికుడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. నందిని తనకు వచ్చిన కష్టాన్ని తలచి, వశిష్ఠుడి వద్ద వాపోయింది. అయినా వశిష్ఠుడు ప్రతికారేచ్ఛ చూపలేదు.

శాంతము మునులకు ఆభరణం కదా! నందిని కోపించి, తన దేహాన్ని విదిల్చి, నిప్పుల వాన కురిపిస్తూ తోక నుండి శబరులను, మలమూత్రాల నుండి శక, యవన, పులింద పుండ్ర, ద్రవిడ, సింహళులను, నురగల నుండి దరద బర్చరులను పుట్టించింది. వారు ఐదురెట్లు అధికమైన గాధేయ సైన్యాన్ని తరిమి కొట్టారు. దానితో గాధేయుడు క్షత్రియ బలం కన్నా బ్రాహ్మణ తపోబలం గొప్పదని గ్రహించాడు. కాని ఎంతటి తపోధనుడైనా అహంకారాన్ని విడిచి పెట్టలేడు. తననంటి ఉన్న రజోతమోగుణాలను విడిచిపెట్ట లేడు.

ఇదిలా ఉండగా. ఇక్ష్వాకువంశంలో కల్మషపాదుడు అనే రాజుండేవాడు. అతనికిక పురోహితుడు వశిష్ఠుడు. ఈ కల్మషపాదుడికి గాధేయుడు యాజికుడు కావాలి అనుకున్నాడు. ఒకనాడు ఈ కల్మషపాదుడు అడవికి వేటకై వెళ్ళి, వేటలో అలిసిపోయి, వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు.

వశిష్ఠుడికి వందమంది పుత్రులు. అందులో పెద్దవాడు శక్తి మహాతపశ్శాలి. కల్మషపాదుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చినప్పుడు శక్తి ఎదురుపడ్డాడు. కల్మషపాదుడు క్షాత్రగర్వంతో త్రోవ నుండి తప్పుకొమ్మని శక్తితో అన్నాడు. శక్తి “ఎంతటి రాజులైనా బ్రాహ్మణులెదురుగా వచ్చినపుడు పక్కకు తొలగి ప్రియంగా మాట్లాడాలి. పైగా నేను ధర్మమార్గంలో ఉన్నాను. ఎందుకు తొలగుతాను” అన్నాడు. చిలికి చిలికిగాలి వాన అయింది.

కల్మషపాదుడు కోపించి చేతి కొరడాతో కొడ్డాడు. అవమానింపబడిన ముని “రాక్షసుడవై నరమాంస భక్షకుడవై జీవించుము” అని కల్మషపాదుని శపించాడు. అతడు వశిష్ఠుని కుమారుడని గ్రహించి, శాపవిమోచనం కోరుకున్నాడు. వశిష్ఠుడిపై ఎంతో కాలంగా ప్రతీకారేచ్ఛకై అవకాశం కోసం కనిపెట్టియున్న గాధేయుడు అపుడే అక్కడికి వచ్చి కనబడకుండా దాగియుండి, జరిగినదంతా గమనించి, కింకరుడనే రాక్షసుడిని సృష్టించి, కల్మషపాదుని అంతరాత్మలో ప్రవేశించుమని ఆజ్ఞాపించాడు. ఆ కింకరుడు రాజు మనసును ఆవేశించాడు. అలా అతడు ఆవేశించినపుడు రాజు రాచకార్యాలు మరచిపోయేవాడు. ఆవేశించనపుడు రాచకార్యాలు చేస్తుండేవాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుడి వద్దకు వచ్చాడు. అతడు “నాకు ఆకలిగా ఉంది. మాంసాహారం కావాలి” అని అడిగాడు. రాజు సరేనని మాట ఇచ్చాడు. అంతఃపురానికి వెళ్ళిపోయాడు. మాట మరిచిపోయాడు. అర్ధరాత్రి వేళ గుర్తుకు వచ్చి, వంటవాడిని పిలిచి బ్రాహ్మణుడికి మాంసాహారం పెట్టవలసినదిగా ఆజ్ఞాపించాడు. అక్కడ ఆ వంటవాడు మాంసాహారం లేదు అన్నాడు. అపుడు ఆ రాజులో కింకరుడు ఆవహించాడు. “నరమాంసం వండిపెట్టు” మన్నాడు. వంటవాడు అలాగే చేసాడు. ఆ బ్రాహ్మణుడు తిన్నాడు. యోగదృష్టి ద్వారా విషయం తెలుసుకొని, “నాకు నర మాంసంతో భోజనం పెట్టావు కాబట్టి నీవు నరమాంసం తినే రాక్షసుడువగు గాక” అని శపించాడు. బ్రాహ్మణ శాపం చేత కల్మషపాదుడు రాక్షసుడై, శక్తి దగ్గరికి వచ్చి, “నీవలనే ఈ శాపం వచ్చింది. ఈ ఫలం మొదలు నీవే అనుభవించు” అని అతడిని చంపివేసాడు.

వశిష్ఠుడు యోగశక్తి కలవాడైనా, ప్రతిక్రియా సమర్థుడైనా సహనం వహించాడు. మిక్కిలి దుఃఖం వహించాడు. తీవ్రమైన ధుఃఖం, మోహం, బంధం ఎంతటి వారినైనా క్రుంగదీస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. స్వీయ శక్తిని, కర్తవ్యాన్ని, బాధ్యతలను మరిపింప చేసి బేలతనాన్ని నింపుతుంది. ఒక్కసారిగా తాము నిస్సహాయులమయ్యామని, ఇంక వేరే దారి లేదని, ఇంకా బ్రతకడమెందుకని నిరాశనిస్పృహలకు లోను చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. వశిష్ఠుడి మనసు వంద మంది పుత్రుల మరణంతో స్వాధీనం తప్పింది. పది మందికి చెప్పగలగే వాడు పిరికి వాడైనాడు. ఆత్మహత్య మహాపాతకమని తెలిసి కూడా, ఆ పాపానికి పూనుకన్నాడు. అందుకే 1. కార్చిచ్చులోకి ప్రవేశించాడు.. అతడి తపోమహిమ కార్చిచ్చును చల్లబరిచింది. 2. మెడుకు రాయి కట్టుకొని సముద్రంలోకి దూకాడు. సముద్రము తన అలలు అనే చేతులతో అతడిని పైకెత్తి ఒడ్డుకు చేర్చింది. 3. మేరుపర్వతం శిఖరం ఎక్కి క్రిందికి దూకాడు. అంతులేని వ్రతనియమాలు కలవాడు అగుట చేత, దేహం దూది మూట వలె గాయపడలేదు. 4. భయంకరమైన మొసళ్ళు గల నదిలోకి ప్రవేశించాడు. ఆ నది వంద పాయలుగా మారి మెరక అయి శతద్రువు యింది. 5. పెద్ద రాళ్ళతో అవయావాలన్ని ఒక్కటిగా చేర్చి నదిలో మునిగాడు. ఆ నది తన దివ్యశక్తితో అతడికి కట్లు విప్పి ఒడ్డుకు చేర్చింది. ఆ నది విపాశ అయింది.

ఈ విధంగా తన పంచప్రాణాలు దీసుకోవడానికి పంచప్రయత్నాలు చేసాడు. కాని మహాత్ముల మరణాన్ని ప్రకృతి, ప్రకృతిలో భాగమైన పంచభూతాలు చూస్తూ ఊరుకోవు కదా. అందుకే అతడి ప్రయత్నాలు ఫలించలేదు. ఎంత దృఢంగా ప్రయత్నించినా మరణం పొందక పోవడంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తన కోడలు, శక్తి భార్య అయిన అదృశ్యంతిని చూశాడు. ఆమె గర్భం నుండి షడాంగాలంకృత వేద ధ్వని మనోహరంగా వినిస్తుంది. అతడికి ఆశ చివురించింది. పన్నెండు సంవత్సరాలు తన తండ్రియైన శక్తి యొక్క చదువు నంతా గర్భంలో ఉండి, వేదాలు నేర్చుకున్న మనవడిని చూడాలనుకున్నాడు. ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు. ఇదే మానవ జీవిత వైచిత్రి. కొండంత బాధ ఉన్నా, గోరంత సంతోషం మనిషికి పునరుజ్జీవనం కలిగిస్తుంది. ఇంతలో కల్మషపాదుడు రాక్షసరూపంలో వచ్చాడు. అదృశ్యంతిని చంపబోయాడు. వెంటనే వశిష్ఠుడు హుంకరించి మంత్రపూరితమైన కమండల జలాన్ని అతడిపై చల్లాడు. కల్మషపాదుడు పన్నెండేళ్ళపాటు రాక్షసుడై ఉండి, ఇపుడు ఆ రూపాన్ని విడిచి మానవ రూపం ధరించి, అతడికి పాదాభివందనం చేసాడు. వశిష్ఠుడు అతడితో “సద్గుణాలతో బ్రాహ్మణ భక్తుడవై, ప్రజలకిష్టుడవై, కోపం లేకుండా సుఖంగా జీవించుము. బ్రాహ్మణులను అవమానిస్తే, ఇంద్రుడైన దుర్గతి పాలవుతాడు” అని తెలిపి, ఆశీర్వదించాడు. బహుశా ఇదంతా ఎక్కడి నుంచో, చాటు నుండి వింటున్న విశ్వామిత్రుడు కూడా విని ఉంటాడు. ఇదీ కథ. అవేశకావేశాలు, ఆహంకారాలు మనుషులను ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకొని వెళతాయి. మహాత్ములు కూడా రాగద్వేషాలకు లోనవుతారని, బలహీన క్షణలలో తప్పులు చేస్తారని, అయితే తపోధనులకు, భగవత శక్తి ఆలంబనతో బ్రతికేవారికి యేదో ఒక సందర్భము తమను తాము నిలదొక్కుకోనేలా చేస్తుందని, కృతఘ్నలకు, ఆకారణ కోపులకు, ఉట్టి పుణ్యాల ఇతరులను బాధించే వారికి లోటు లేదని ఈ కథ తెలియచేస్తుంది.

అయితే ఎట్టి, పరిస్థితులలోనైనా భగవత్మక్తి, వ్రత, జప, నియమ శక్తులు మనను కాపాడి సరైన దారికి చేరుస్తాయి. కావున ఆ శక్తులు మనం పొందే ప్రయత్నాలు చేయాలి. ఈ కథలో యే కల్మషపాదుడు తన కొడుకు సంహారానికి కారకుడయ్యాడో, ఆ కల్మషపాదుడు సంతానం పొందకుండా శాపం ఉండే కారణాన, వశిష్ఠుడే అతడి భార్యయైన మదయాతికి గర్భాన్నిచ్చి, అశ్మకుడు అనే రాజర్షి పుట్టుకకు కారణమయ్యాడు.

మహాత్మ లెన్నటికీ మహాత్మలేనని ఈ కథ తెలుపుతుంది.

ఆత్మహత్య మహాపాపం. దానికి పూనుకొనేవారు నిరాశా నిస్పృహలకులోనై ఇంక తమకు ఏమీ మిగలలేదు, ఇది తప్ప వేరే ఉపాయం లేదు అని భావించేవారికి, ఆ పరిస్థితులలో దైవికంగానో, మనుష్య ప్రయత్నంలోనో వారిలో విశ్వాసం కలిగి, ఆశ రగిల్చబడినట్టయితే ఆత్మహత్యలు ఉండవు. వారినా శ్రయించిన వారికి ఆత్మక్షోభ ఉండదు.

ఈ కథ ఆదిపర్వం సప్తమాశ్వాసం లోనిది.

పితృదుఃఖంతు షణ్మాసం మాతృ దుఃఖం తు వత్సరః

భార్యాదుఃఖం పునర్భార్యా పుత్ర దుఃఖం నిరంతరం

Sorrow for the loss of a father (lasts) six months. Sorrow for a mother, a year. Sorrow for wife until a second wife (comes), sorrow for a son, forever.

– నహి సుఖం దుఃఖైర్వినా లభ్యతే

 No pleasure is obtained without pain.

– మునీనాంచ మతిభ్రమః

 The minds of munis are (sometimes) confused.

(ఇంకా ఉంది)

Exit mobile version