శ్రీ మహా భారతంలో మంచి కథలు-13

0
2

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

33. శిశుపాల వధ!

[dropcap]రా[/dropcap]జసూయ యాగం ధర్మరాజు అత్యంత వైభవంగా నిర్వహించాడు. లోకులు ధర్మరాజును ప్రశంసించారు. భీష్ముడు – ధర్మరాజుతో – కృష్ణుడికి అర్ఘ్య ప్రదానములు సమర్పించి పూజించమన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి అర్ఘ్యమునిచ్చి పూజించాడు. శ్రీకృష్ణుడిని అలా పూజించి, గౌరవించడం శిశుపాలాది రాజవర్గమునకు నచ్చలేదు. దానితో సభలోనే శిశుపాలుడు వాదానికి దిగాడు. సంస్కృతీ, సంస్కారం, సభా మర్యాదలను పక్కకు నెట్టి ఘనంగా నోటికి పని చెప్పాడు. వినాశకాలే విపరీత బుద్ధి కదా.

“ధర్మరాజా! ఈ సభలలో ఇందరు రాజులుండగా, పూజంచదగిన పెద్దలు, బ్రాహ్మణులు ఉండగా, భీష్ముని మాటల ననుసరించి వృష్ణి వంశస్థుడిని పూజించి నీ తెలివితక్కువతనం చాటావు. భీష్ముడు ఆలోచన లేనివాడు. శ్రీకృష్ణుడనే బుద్ధిహీనుడికి అర్ఘ్యం ఇమ్మని, ధర్మబాహ్యుడివైన నిన్ను ఒప్పించాడు. అయినా ‘వృద్ధుల బుద్ధులు సంచలింపవే’. కృష్ణుడు మీకు ఇష్టమైతే మీ ఇంటికి పిలిచి ధనమవ్వండి. ప్రీతికరమైన పనులు చేయండి. పోషించండి. కాని శాస్త్రంలో చెప్పబడిన ఈ గొప్ప పూజ పొందటానికి ఏ మాత్రం యోగ్యత లేని వాడిని పూజించటం న్యాయం కాదు. శ్రీకృష్ణుడు వృద్ధుడా? కాదు. అతడి తండ్రి వసుదేవుడున్నాడు కదా. ఋత్విజుడని ఆలోచించావా? వ్యాసుడు సభలో ఉన్నాడు కదా! గురువు గారని వినయంతో పూజించావా? ద్రోణుడు, కృపుడు ఉన్నారు కదా. మహారాజని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? పూజించేవారిని వదిలి పూజంచగూడని వాడిని పూజించి మూడునివి అనిపించుకున్నావు. ధర్మరాజూ! నీవు ఉత్తముడవని అవనీశులందరు నీ యజ్ఞానికి వచ్చారు. కాని వారిని అలా అవమానం చేయటం న్యాయమా? ధర్మమా?

నీవు అజ్ఞానంతో ఇచ్చావు సరే. కృష్ణుడు సిగ్గు లేకుండా అర్ఘ్యాన్ని స్వీకరించాడు. అది ఉచితమా?

చనఁ బేడికి దారక్రియ! యును, జెవిటికి మధురగీతియును, జీకునక

త్యనుపమ సురూపదర్శన! మును జేయుటఁ బోలు గృష్ణుఁ బూజించు టిలన్. (2-2-14)

కృష్ణుని పూజించటం నపుంసకునికి పెండ్లి చేయటం వంటిది. చెవిటివాడికి కమ్మని పాలు వంటిది. గుడ్డివాడికి అందమైన రూపాన్ని చూపటం వంటిది.” అని పలు విధాలుగా దూషిస్తూ తన బలగంతో గూడి సభ నుండి వెళ్ళిపోబోయాడు. ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి అతడిని బుజ్జగిస్తూ,

“భూరిగుణోన్నతు లనఁదగు! వారికి ధీరులకు ధరణివల్లభులకు వా

క్పారుష్యము చన్నె? మహా! దారుణ మది విషముకంటె దహనము కంటెన్.” (2-2-17)

గొప్ప గుణాల చేత శ్రేష్ఠులని చెప్పదగినవారికి, పండితులకు, ప్రభువులకు కఠినంగా మాట్లాడటం తగునా? మాట కాఠిన్యం – విషం కంటే, అగ్నికంటే భయకరం కదా. బ్రహ్మ పుట్టుకకు స్థానమైనవాడు, లోకాద్యుడు, త్రిలోక పూజ్యుడని కృష్ణుడు పూజార్హుడని భీష్ముడు పలికాడు. ఇది దోషమెలా అవుతుంది? కృష్ణుడిని భీష్ముడు అర్థం చేసుకున్నట్లుగా నీవు అర్థం చేసుకోవడం సాధ్యమా. మహాత్ముల చరిత్రలను అల్పులు అర్థం చేసుకోగలరా. శ్రీకృష్ణునికిచ్చిన గౌరవాన్ని పెద్ద పెద్ద రాజులే సమ్మతిస్తుంటే నీవు వ్యతిరేకించటం తగునా?” అని అన్నాడు.

అపుడు భీష్ముడు ధర్మరాజుతో, “శిశుపాలుడు అపరిపక్వుడు, చెడు నడత కలవాడు, అసూయా క్రోధాల చేత నిండినవాడు. మదించినవాడు, మహాత్ములను నిందించేవాడు. వీడికి ధర్మమోలా తెలుస్తుంది?” అని అతడిని వారించి, ఆపై శిశుపాలుడితో, “శిశుపాలా! శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వటం తప్పంటున్నావు. ఇక్కడున్న వారంతా ఆయన దయ చేత చెరను విడిపించబడిన వారే లేదా శరణు కోరిన వారు లేదా యుద్ధంలో ఓడినవారు. మరొక్క మాట వినుము.

ఉత్తమ జ్ఞానవృద్ధు నా నుండెనేని! బాలుఁడయ్యును బూజ్యుండు బ్రాహ్మణుండు:

క్షత్రియుఁడు పూజ్యుఁ డమిత విక్రమసమృద్ధి! నుర్విపతులలో నధికుడై యుండె నేని. (2-2-25)

ఉత్తమ జ్ఞానము చేత గొప్పవాడయితే, వయస్సు చేత బాలుడయినా బ్రాహ్మణుడు పూజార్హుడు. అమితమైన పరాక్రమంతో రాజుల్లో అధికుడయితే క్షత్రియుడు పూజార్హుడవువాడు.

వృద్ధు లొక లక్ష యున్నను! బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింపంగా;

నిద్ధరణీశులలో గుణ! వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్. (2-2-27)

వయసు చేత వృద్ధులైన వాళ్ళు ఒక లక్ష మంది ఉన్నా, ఎవరినైనా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి పూజిస్తాము. రాజులందరిలో గుణం చేత గొప్పవాడినే పూజించాం. లోకంలో ఇతరులెవరైనా పూజింపబడితే వాళ్ళు మాత్రం తృప్తి పొందుతారు. కాని కృష్ణుడు పూజింపబడితే ముల్లోకాలు పూజితాలై పుణ్యసమృద్ధితో తృప్తి పొందుతాయి.” అని భీష్ముడు పలికాడు. ఇదంతా చూస్తున్న సహదేవుడు ఉగ్రుడై, “శ్రీకృష్ణునికి అర్ఘ్యం ఇచ్చాము. దీనికి తిరుగులేదు. కాదన్న వీరుల తల మీద, ఇదిగో నా పాదం పెట్టి అణగద్రొక్కుతా” అని పలికాడు.

సభా సభాసదులు హర్షించారు. ఆకాశం నుండి ‘బాగు బాగు’ అను ధ్వనులు వినిపించాయి. సహదేవునిపై పూలవాన కురిసింది.

అప్పుడు శిశుపాలుడు సేనానియైన సునీథుడు కొందరు రాజులను కలుపుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. యదువృష్ణిభోజ కుకురాంధక వంశ వీరుల సైన్యాలలో కలత మొదలయింది. వెంటనే ధర్మరాజు భీష్ముని దగ్గరికి వెళ్ళి “పితామహా! ప్రజలకు కీడు పుట్టుకుండా చూడు” అన్నాడు. “సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఈ రాజసూయాన్ని చేపట్టి యజ్ఞాన్ని రక్షిస్తుండగా, ఇతరులు నీ యజ్ఞానికి చెరుపు చేయగలరా?” అని భీష్ముడనగా, దానికి శిశుపాలుడు కోపించాడు. భీష్ముణ్ణి చూచి, “తప్పనిసరై ధర్మరాజు నిన్ను ఆధారం చేసుకొని అర్ఘ్యానికి శ్రీకృష్ణుడిని స్వీకరించాడు. ఓడతో కట్టిన ఓడలా గౌరవాని కోల్పోతున్నాడు. ఎక్కడైనా నీవంటి దుర్మార్గులున్నారా? ఈ రాజులంతా అంత ధైర్యం లేనివారా?” అని పలికాడు. శిశుపాలుడు మరలా భీష్ముని వైపు చూస్తూ “పూతన అనే ఆడడాన్ని చంపటం, ప్రాణం లేని బండిని పడద్రోయటం, సారం లేని చెట్లను విరవటం, పుట్టంత కొండను ఏడు రోజులు మోయటం, ఎద్దుని చంపటం – వంటి వాటిని పరక్రమాలుగా పొగుడుతున్న నీ నాలుక ఒక్కటే అయినా, అది నూరుగా చీలాలి. అట్లయితే అతడిని పొగడడటానికి సరిపోవు. ఆ విషయాలు నాకు తెలుసు. ఏ విషయంలో వాడు అర్ఘ్యం యివ్వడానికి తగిన వాడో తెలుపుము. స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను, అన్నం పెట్టిన వారిని, నమ్మిన వాళ్ళను చంపడం మహా పాపమని పెద్దలు చెబుతారు. అట్టి పాపాల్లో గోవిందుడు స్త్రీ వధను, గోవధను చేశాడు. నీకేదో గొప్పగా ధర్మం తెలిసినట్లు మాట్లాడుచున్నావు. పాపాలు చేసిన కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇప్పించావు. మరొకరిని ప్రేమించిన అంబను అపహరించుకొచ్చావు. ఆ సంగతి తెలిసి విచిత్రవీర్యుడు ఆమెను విడిచి పెట్టాడు. అయినా ‘సంతానం లేదు’ అనే అధర్మం నీలో ఉండగా, నీ ఆజ్ఞకు విలువేముంటుంది? పూర్వం ఒక ముసలి హంస పక్షులకు ఉపదేశాలిస్తూ, మంచిదానినని నమ్మించి, పక్షి గుడ్లన్ని తిన్నది. చివరకు పక్షులు విషయం నెరిగి ముసలి హంసను చంపివేసాయి. నీవు కూడా ముసలి హంసలాంటి వాడివే.. నీవు అధర్మమార్గాన నడుస్తూ, ధర్మబోధ చేసి కౌరవులకు కీడు కలిగిస్తున్నావు. కృష్ణుడు యేదో గొప్పవాడని పలు మార్లు అంటున్నావు. జరాసంధుడిని యెదుర్కోలేక పదిమార్లు పరుగెత్తు పోలేదా? జరాసంధుణ్ణి భీమార్జునుల సహాయంతో చంపలేదా? బట్టువాని వలె వారిని పొగడక కర్ణ శల్యుల వంటి వారిని పొగడవచ్చుకదా.

అన్యకీర్తనంబు నన్యనిందయుఁ దన్నుఁ బరఁగఁ బొగడికోలుఁ బ్రబ్బికోలు

నాపగాతనూజ! యార్యవృత్తములు గా వనిరి వీని నాద్యులయిన మునులు. (2-2-49)

గాంగేయా! ఇతరులను పొగడటం, నిందించటం, తనను తాను పొగుడుకోవటం నిందించటం పెద్దలు చేయదగిన పనులు కావని మహార్షులు చెప్పారు” అని పలకడం విన్న భీముడు భయరకరంగా కోపించాడు.

భీముని కోపాన్ని చూసి, భీష్ముడు అతడిని ఆపి శిశుపాలుని వృత్తాంతం ఇలా చెప్పాడు.

చేది వంశంలో సాత్వతీ దమఘోషులకు శిశుపాలుడు పుట్టాడు. పుడుతూనే ఇతనికి నాలుగు భుజాలు, నొసలు, కన్ను, గాడిదకంఠ ద్వనితో ఏడుపు వచ్చాయి. తల్లిదండ్రులు అది చూచి భయపడ్డారు. ఆశ్చర్యపోయారు. అప్పుడొక అశరీర వాణి ఇలా అన్నది. ఈ బాలుడిని ఇతరులెవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ణి ఎత్తుకోగానే ఎక్కువగా ఉన్న రెండు చేతులు, కన్ను అణగిపోతాయో అతడే ఇతడి పాలిట యముడు. ఆ మాటలు విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఇంటికి ఎవరు వచ్చినా, పిల్లవాడిని వాళ్ళ చేతికి ఇచ్చేవారు. ఒకనాడు బలరామకృష్ణులిద్దరూ మేనత్తయైన సాత్వతీ ఇంటికి బంధువులతో, మిత్రులతో వచ్చారు. సాత్వతీ ముందుగా బలరాముని చేతికి, ఆపై కృష్ణుడి చేతికి ఎత్తుకోవడానికి ఇచ్చింది.

శిశుపాలుడిని కృష్ణుడు చేతిలోకి చేసుకొని ఎత్తుకోగానే ఆశ్చర్యంగా అతడికి అధికంగా ఉన్న రెండు చేతులు, కన్ను ఒక్కసారిగా అణగిపోయాయి. దీనిని చూసి సాత్వతి ఆశ్చర్యపోయింది. అశరీరవాణి మాటలు తలుచుకున్నది. శ్రీకృష్ణుడి వల్లనే తన కొడుకుకు మరణం తప్పదని తెలుసుకున్నది. శ్రీకృష్ణునితో –

కుపథప్రవృత్తుఁ డయి వీఁ డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా

నిపుణుఁడవై నీ మఱఁదికి నపరాధశతంబు సైఁపుమయ్య యుపేంద్రా! (2-2-59)

‘కృష్ణా! ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై అపకారం చేసి నీకు అప్రియుడైనా, నీ మరిది చేసే తప్పులు నూరింటిని దయతో క్షమించుము’ అని సాత్వతి ప్రార్థించింది. ఆయన దయతో వరం పొందింది. కనుక నూరు తప్పులు నిండేదాకా ఇతడు ఇతరుల చేత హతుడు కాడు, కృష్ణుడి చేతనే హతుడవుతాడు” అని భీష్ముడు భీముడితో పలికాడు. భీముణ్ణి త్రోసిపుచ్చి, శిశుపాలుడు శ్రీకృష్ణునితో ముఖాముఖిగా “అవమానించదగిన నిన్ను వీరు పూజించారు. కేశవా! ఆ పాండవులు, ఈ భీష్ముడం, నీవు నాతో యుద్ధం చేయటానికి సిద్ధం కండి” అన్నాడు.

శ్రీకృష్ణుడు సమస్త రాజసమూహం వినేటట్లుగా “ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుని మీద మేము దండెత్తే సమయంలో – ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలురకు, వృద్ధులకు భయం కలిగేట్లు, ద్వారకానగరాన్ని తగులబెట్టాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలిసి రైవతకాద్రి మీద క్రీడిస్తూ మైమరిచి ఉన్న వేళలలో క్రూరుడై వాళ్ళను వధించాడు. వసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అహహరించి యాగానికి చెరుపు చేశాడు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అంతేకాక మాటలకు సంబంధించి అనేక అపకారాలు చేశాడు. మా అత్త, సాత్వతి ప్రార్థన మేరకు ఈ దుర్మార్గుడు చేసిన నూరు తప్పులను సహించాను. ఇప్పుడు మీరంతా చూస్తుండగా దుర్మార్గంగా ప్రవర్తించాడు” అనగా శిశుపాలుడు, “మొదలు నాకిచ్చిన కన్యను నీదానిగా చేసుకొని ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గులేదా?” అన్నాడు.

అలా శిశుపాలుడు ఒకదాని వెంట ఒకటి నిందా వాక్యాలు పలుకుతుండగా ‘దుర్మార్గుడు – శిక్షించాల్సిన వేళవరకే క్షమించబడతాడు – ఆపై సమయం రానే శిక్షించబడతాడు’ అన్న సూత్రం ప్రకారం అంతవరకు కృష్ణుని చేత ఉపేక్షించబడి, తను చేసిన తప్పులకు శిక్ష స్వీకరించే సమయం ఆసన్నమయేసరికి కృష్ణుడి చేతి నుండి సుదర్శన చక్రం అగ్ని జ్వాలలు వెదజల్లబడుతూ వెళ్ళి శిశుపాలుడి తల నరికింది.

యే భగవంతుడు తనకు జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా అతడిని కీర్తించాలో, ఆ నోరు అంత సేపు నిందించి, నిందించి చక్రఘాతంతో మూగబోయింది.

భగవంతుడి రక్షణలోనూ, శిక్షణలోను కొంత వేచి యుండుటము ఉంటుందని గ్రహించిన సభాసదులు సంభ్రమాశ్చర్య భయసంతోషాలతో శ్రీకృష్ణుని చూస్తూ.. ఆపై కీర్తిస్తూ ఉండిపోయారు.

శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందపడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి ఆ ప్రదేశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చి కృష్ణుని శరీరంలో చేరిపోయింది.

అంతే కదా! భగవంతుడిని ప్రేమతోనైనా సరే ద్వేషంతో సరే నైనా చేరుకోవాలి. శిశుపాలుడు పశు మార్గాన్ని ఎంచుకున్నాడు. దిశ తప్పైనా లక్ష్యం ఒకటే కదా.

శిశుపాలుడి మరణంతో పిడుగులతో కూడిన పెద్ద వాన కురిసింది. శ్రీకృష్ణునికై పలికిన జయజయధ్వానాలలో ఆ పిడుగుల శబ్దం వినబడలేదు.

సభాపర్వం – ద్వితీయాశ్వాసం లోనిది.

కొందరు తమ తలకు మించిన ధర్మపన్నాలు పలుకుతూ తమ వివేకాన్ని ప్రదర్శించబోయి, దూషణపర్వంలో ముందూ వెనుకా తెలియకుండా దూసుకు వెళ్లి చివరికి తమకే ముప్పు తెచ్చుకుంటారు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది వంటి సామెతలు వీరి తలకెక్కవు. ఇలాంటి వృక్తులకు చివరికి శిశుపాలుడికి పట్టిన గతే పడుతుంది. మస్తకఖండన తప్పించుకున్నా మాన ఖండన నుండి తప్పించుకోలేరు.

ఆత్మచ్ఛిద్రం న జానంతి పరచ్ఛిద్రానుసారిణః –

They know not their own defects who search for the defects of others.

పాపాత్మానం పాప శతేన కిం వా –

What of a hundred sins to sinners!

~

అకరుణత్వమకారణవిగ్రహః పరాధనే పరయోషితి చ స్పృహా

సుజనబంధుజనేష్వసహిష్ణుతా ప్రకృతిసిద్ధమిదం హి దురాత్మనామ్ (భర్తృహరి).

34. పరశురాముని కథ!

తండ్రి మాట మేరకు తల్లిని సంహరించినవాడు, తండ్రి కోపానికి గురియైన అన్నదమ్ములకు శాపోపశమనాన్ని కలిగించిన వాడు, తల్లి ప్రాణాన్ని తండ్రి నుండి వరంగా స్వీకరించినవాడు, భువిపై గర్వించిన క్షత్రియాధములపై ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించిన వాడు, సామాన్యుడి కోపం ఏ స్థాయిదో చాటిన వాడు, తాను ఎంతో సాధించినప్పటికి, అంతా తృణప్రాయంగా భావించి, విడిచి పెట్టి తపస్సుకై వెళ్ళిన త్యాగధనుడు, పరశురాముడు.

పూర్వం గాధి అనే రాజు కన్యాకుబ్జ పట్టణమును పాలించేవాడు. అతని కూతురు సత్యవతి. భృగు మహర్ష్మి కుమారుడైన ఋచీకుడు సత్యవతిని పెండ్లాడగోరి, గాధిని అర్థించాడు. గాధి అతనితో “ఒక చెవి నల్లగా, శరీరమంత తెల్లగా ఉన్న గుర్రాలను కన్యాశుల్కంగా తెచ్చివ్వు. అపుడు నా కుతురును నీకిచ్చి వివాహం చేస్తాను. ఇది మా సంప్రదాయం” అన్నాడు. ఋచీకుడు వరుణిడిని ప్రార్థించి, అలాంటి వెయ్యి గుర్రాలను పొంది గాధికిచ్చి సత్యవతిని పెండ్లాడినాడు. గంగానది నుండి గుర్రాలు ఉద్భవించాయి కావున, అప్పటి నుండి కన్యాకుబ్జములో గంగానదికి అశ్వతీర్థం అను పేరు వచ్చింది.

ఒకనాడు కన్యాకుబ్జానికి భృగు మహర్షి వచ్చాడు. కొడుకునూ, కోడలును చూచి సంతోషించాడు. కోడలి మంచితనానికి ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. “నాకు ఒక కొడుకును, నా తల్లికి ఒక కొడుకును వరంగా ప్రసాదించండి” అని కోరింది. “అట్లే జరుగుగాక! పరిశుభ్రంగా స్నానం చేసి నీవు మేడి చెట్టునూ, నీ తల్లి అశ్వత్థ వృక్షమును కౌగిలించుకోండి” అని ఆనతిచ్చాడు. కాని వారు పొరపాటున తారుమారుగా ఆలింగనం చేసుకున్నారు. భృగు మహర్షి అపుడు, “నీకు పుణ్యడైన కొడుకు పుడతాడు. కాని అతడు దారుణ క్షత్రియ ప్రవృత్తితో గర్వంతో ప్రవర్తిస్తాడు. ఇక నీ తల్లికి క్షత్రియుడిగా పుట్టినప్పటికీ తపస్వియై, బ్రాహ్మణభావం, జ్ఞానం, గొప్ప తేజస్సును నిష్ఠతో పొందుతాడు” అన్నాడు.

అప్పుడు సత్యవతి మామగారికి మొక్కి క్షత్రియభావం తన కొడుకుకు కాక, మనుమడికి కలిగేట్లు వరం పొందింది. సత్యవతికి చతుర్వేదపారాయణుడు, విలువిద్యా నేర్పరి, మహాత్ముడైన జమదగ్ని పట్టాడు. అక్కడ ఆమె తల్లికి, విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని ప్రసేనజితు మహారాజు కూతురైన రేణుకను పెళ్లాడినాడు. అయిదుగురు కొడుకులను పొందాడు. అందులో ఒకడు పరశురాముడు. ఒకరోజు జమదగ్ని అడవిలో తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. పుత్రులు పండ్లు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. వారి వెంట రేణుక కూడా వెళ్ళింది. అక్కడ ఒక కొలనులో భార్యలతో జలకాలాడుతున్న చిత్రరథుడనే రాజును చూచింది. ఆమె మనస్సు చలించింది. దివ్యదృష్టితో మానసికమైన ఆమె చెడు నడవడిని కనిపెట్టిన జమదగ్ని ఆవేశపరుడై, తన నలుగురు కొడుకులను వరుసగా పిలిచి, తమ తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. వారు అది పాపమని ఆ పనికి పూనుకోలేదు.

“తనయుల నలువురఁ గ్రమమునఁ | బనిచెన్‌ జమదగ్ని దనదు భార్య వధింపన్‌;

జననీఘాతము పాతక | మని వారలు పలుకకుండి రవ్యవసితులై.” (3-3-140)

దానికి జమదగ్ని కోపించి, “భయంకరమైన అడవిలో బుద్ధి జ్ఞాన శూన్యులై జంతువులలా, పక్షులలా ఉండండి” అని శపించాడు. గండ్రగొడ్డలిని చేత బూనిన రాముడిని పిలిచి, “ఈ రేణుకను సంహరించుము” అన్నాడు. రాముడు తక్షణమే తండ్రి మాట మేరకు తల్లిని మేరకు తల్లిని సంహరించాడు.

పరశురాముడు ఇక్కడ తల్లికి నిజానికి మేలు చేసాడు. ఈ జున్మలో ఆమె పోయిన పాపపు పోకడకు ఆమెను చంపుట ద్వారా ఆమె పాపపు జన్మకు భరతగీతం పలికి, మరలా పునీతురాలైన క్రొత్త జన్మనెత్తడానికి తోడ్పడ్డాడు. ఒకవేళ ఆమెకు ఆ శిక్ష పడకపోతే ఆమె జీవితాంతం తప్పు చేసిన దాని వలె మిగిలిపోయేది. శారీరక పాపమే కాదు మానసిక పాపమూ పాపమే కదా. కొన్ని విషయాలను ఆయా కాలాల ధర్మాధర్మాలను బట్టి తేల్చాల్సి ఉంటుంది.

రాముడి పితృవాక్య పరిపాలనకు, తెగువకు సంతోషించి కోపం తగ్గిన ఏకైక జమదగ్ని రాముడిని వరం కోరుకోమన్నాడు. “నా తల్లి తిరిగి బ్రతకాలి. నామాతృహత్యా దోషం పోవాలి. నా పాపం పోవాలి. నా సోదరులకు శాపవిమోచనం కావాలి. నాకు యుద్ధాలలో ఎదుగులేని బలం కలగాలి. చిరకాలం జీవించాలి” అని కోరాడు. ఎంతటి సమయస్ఫూరితో కుటుంబంలో వచ్చిన పెను తుపానును, ఇట్టే విచారించి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసాడు. తండ్రి తన కుమారుడి మాతృ, భ్రాతృ, పితృప్రేమకు సంతోషించి అడిగిన వరాలిచ్చాడు.

కొంతకాలం గడిచింది. హైహయ వంశంలో అరి వీర పరాక్రముడు, అమిత శౌర్యుడు, సహస్రబాహుడనే ప్రసిద్ధుడైన కార్తవీర్యుడుండేవాడు. ఒకనాడు వేటాడి వేటాడి అలసి జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించాడు. జమదగ్ని మాంచి ఆతిథ్యమిచ్చాడు. క్షత్రియ మదము తలకెక్కిన ఆ రాజు ఆశ్రమవాసులను అవమానించి, ఆశ్రమ వృక్షాలను కూర్చి, హోమధేనువును లేగ దూడతో సహా బంధించి తీసుకువెళ్ళాడు. దర్బలకై వెళ్ళిన రాముడు తిరిగి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. వెంటనే కార్తవీర్యుడిపై యుద్ధానికి వెళ్ళి అతడి వెయ్యి భుజాలను ఖండించి, అతడిని సంహరించాడు. అటుపై కార్తవీర్యుడి కొడుకులు పగబట్టి, రాముడు లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని చెల్లాచెదురు చేసి, అందరూ భీతిల్లేట్లుగా జమదగ్నిని సంహరించారు. అది తెలుసుకున్న రాముడు క్షత్రియజాతిని సంహరించెదనని శపథం చేసాడు. అన్నట్లుగానే 21 సార్లు దండెత్తి క్షత్రియులను సంహరించి, భూమండలం జయించాడు. శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని చేసి, ఋత్విజుడికి సమర్పించేటటు వంటి సంభావనా ద్రవ్యంగా భూమండలాన్ని కశ్యపుడికి దానం చేసి తపస్సుకై మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు.

ఈ కథలో జమదగ్నికి గల క్షణికావేశం భార్యను చంపమనడానికి వెనుదీయలేదు. అదే విధంగా కార్తవీర్యార్జునిని పుత్రుల కోపం ప్రపంచానికే అనర్థదాయకమైనవి. కోపమును కోపంతో, పగను పగతో జయించలేము. అయితే పరశురాముడి కోపం ధర్మాగ్రహం లాగే కనబడుతుంది. పైగా ఆ కోపంతో సిరిసంపదలూ, రాజ్యాలు కోరుకోలేదు. సంపాదించింది దానంగా ఇచ్చినాడు. పితృవాక్యపరిపాలన, మాతృభక్తి, దౌర్జన్యాన్ని సహించలేని ప్రవృత్తి, శౌర్యప్రతాపాలు కలగలసిన మహనీయ వ్యక్తిత్వం వరశురాముడిది. అకృతవ్రణుడు ధర్మరాజుకు చెప్పినది. అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

అవశ్యం పితురాచారః – A father’s rule is binding (on the son).

~

అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః।

ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి॥

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here