శ్రీ మహా భారతంలో మంచి కథలు-15

0
3

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

38. అష్టావక్రు చరిత్ర!

జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు.

పూర్వం ఏకపాదుడనే ముని ఉండేవాడు. అతడి భార్య పేరు సుజాత. ఆవిడ గర్భవతి. మహా విద్యాంసుడైన ఏకపాదుడు తన శిష్యులకు నిరంతరం వేదాధ్యయనం చేయిస్తుండేవాడు. ఒకనాడు గర్భస్థ శిశువు తన తండ్రితో “నీ శిష్యులు పగలనక, రేయనక ఎడతెరిపి లేకుండా విద్యాభ్యాసం చేస్తూ, నిద్రలేమి చేత, మందబుద్ధులవుతూ, వేద పాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఇలా తప్పులు చదివించడమెందుకు?” అని నిందించాడు. దానికి తండ్రి కోపించాడు. “నీవు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు కావున అష్టావక్రుడవై పుట్టుము” అని శపించాడు. ఇంతలో సుజాతకు నెలలు నిండాయి. ఆమె ప్రసవ భారాన్ని తలుచుకొని భయపడి భర్తతో, “భూమిపై నున్న మిక్కిలి పేదవారు కూడా పురిటి సమయానికి ముందే నూనె, నేయి, తిండి గింజలు తెచ్చిపెట్టుకుంటారు. మరి మనం పేదవారం కాబట్టి మనకు అవి సులభంగా దొరకవు కదా” అన్నది.

దానిలో ఏకపాదుడు ధనం సంపాదించాలని నిశ్చయించుకొని జనకుడి ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ జనకుడి ఆస్థానంలో వరుణుడి కుమారుడైన వందితో వాదానికి దిగి పరాజయం పొందాడు. నీటిలో మునిగియుండే శిక్షను పొందాడు. అదే సమయంలో ఇక్కడ సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అదే సమయాన ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని ప్రసవించింది. మేనమామ, మేనళ్ళులైన శ్వేతకేతుడు, అష్టావక్రుడు సమవయస్కులై ఉద్ధాలకుడి వద్ద పన్నెండేళ్ళు వేద విద్యలు నేర్చుకున్నారు.

ఒకనాడు అష్టావక్రుడు, ఉద్దాలకుడి తొడపై ఎక్కి ఆడుకుంటున్నాడు. శ్వేతకేతుడు అది చూచి, “నీవు మీ నాన్న తొడపై ఎక్కి ఆడుకో. మా నాన్న తొడపై ఎందుకు ఎక్కావు?” అన్నాడు. దానితో అతడు ఏడుస్తూ, తల్లి దగ్గరకి వెళ్ళి, “మా తండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్లారు?” అని అడిగారు. తల్లి జరిగినది చెప్పింది. అష్టావకుడు వెంటనే శ్వేతకేతుడిని వెంటబెట్టుకొని జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్లాడు.

అక్కడ ద్వార పాలకులు ఈ పిల్లలను లోనికి రానీయలేదు. “మేము బ్రాహ్మణులము. మమ్మల్ని అడ్డగిస్తారెందుకు?” అన్నారు. మరలా “ఈ వాకిలి గుండా మూగ, చెవిటివారు, స్త్రీలు కూడా లోనికి వెతతున్నారు కదా” అన్నారు. దానికి వారు “వృద్ధులైన విద్వాంసులు, అనుభవజ్ఞులైన ఋత్విజులు ఈ యజ్ఞవాటికలో ప్రవేశానికి అర్హులు. మీరు బాలురు. మీకు అర్హత లేదు” అన్నారు.

అప్పుడు వారు

“అలయక యేండ్లు గడుం బె | క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ

ద్ధుల లక్షణమే? జ్ఞానము | గలఁ డేనిన్‌ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్‌” (3-3-248)

“చాలా సంవత్సరాలు ఓర్పుతో బ్రతకటం, వెండ్రుకలు తెల్లబడడం, ముసలి వారికి చిహ్నాలా? జ్ఞానం కలవాడైతే బాలుడైనా పెద్దగానే భూమిపై భాసిల్లుతాడు. చక్కగా చదువుకొని, ఆ చదువును తన నిత్య జీవితంలో ప్రతిఫలించేటట్లు తన ప్రవర్తనను తీర్చిదిద్దుకునేవాడు, వయసులో చిన్నవాడైనా ప్రజల చేత మన్నన పొందగలడు. కావున చిన్నవారమని అనుమానించవద్దు. జనక మహారాజు సభలో గర్వముతో విర్రవీగుతున్న వేదవాదులతో సిద్ధాంత రాద్దాంతాలు చేయడానికి వచ్చాము” అన్నారు.

ఆపై వారు ఆహ్వానం పొందారు. ఆపై అష్టావక్రుడు అక్కడ పండితులను, వందిని వాదనలో ఓడించి, బంధితుడైన తండ్రిని విడిపించాడు. రాజుగారి, పండితుల గౌరవాదరాలు పొంది, శ్వేతకేతుడితో ఆశ్రమానికి తిరిగి వచ్చారు. జ్ఞానం దీపం వంటిది. అది చిన్న గాజుకుప్పెలో నున్నా, పెద్దగాజు కుప్పెలో నున్నా యిచ్చే వెలుగు సమానమే. తండ్రి కోపించినా, తండ్రి కష్టాన్ని, కుటుంబ కష్టాన్ని తన విద్యా పాండిత్యాదులతో తీర్చి, తండ్రి ఋణాన్ని తీర్చుకున్న ఉత్తమ పుత్రుడు అష్టావక్రుడు.

ఆధునిక కాలానికి ఈ కథను అన్వయిస్తే, కొడుకలు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే తండ్రి కష్టాలు తీరుతాయని చెప్పుకోవచ్చు. మరియు ఈ కథ జ్ఞానానికి, వయసుకు సంబంధం లేదని తేల్చి చెప్పునది.

రామాయణంలో పిడకల వేట. ఆ కాలంలో కూతురుతో పాటు తల్లి కూడా పిల్లల్ని కనేదని తెలుస్తున్నది. ఈ జాడ్యం మనము మొన్నమొన్నటి వరకు చూస్తూనే వచ్చాము. ప్రస్తుత కాలంలో కనిపించడం లేదు. శుభ పరిణామం.

అరణ్యపర్వము తృతీయాశ్వాసం లోనిది రోమశుడు ధర్మరాజుకు చెప్పినది.

– బాలాదపి సుభాషితం – A well spoken word should be received even from youth.

– యుక్తియుక్తం వచో గ్రాహ్యం బాలాదపి శుకాదసి – A reasonable word should be received even from a child or a parrot.

39. యువక్రీతుడి చరిత్ర!

గురు ముఖతః చదువుకోని విద్య, తపస్సు చేత పొందినప్పటికీ అది నిరర్థకము. వినయ సంపన్నత నీయదు. మద మాత్సర్యాలను నెలవుగా మారుతుంది. పూర్వం రైభ్యుడు, భరద్వాజుడు అనే మహానుభావులు ఉండేవారు. వారు యోగీశ్వరులు. మంచి మిత్రులు. అరణ్యంలో తపోదీక్షలో ఉండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు అర్ధావనుడు, పరావసుడు. వీరు బహు గొప్ప వేదాధ్యయనశీలురు. విద్వాంసుల చేత పూజితులు. భరద్వాజుడి కుమారుడు యువక్రీతుడు. యువక్రీతుడికి రైభ్యుడిని, అతని కుమారుల పాండిత్యాన్ని చూసి అసూయ కలిగింది. వారిని మించి విద్యా సంపద పొందాలని తీవ్రమైన తపస్సు చేశాడు.

ఇంద్రుడు ప్రత్యక్షమై, “ఎందుకింత గొప్ప తపస్సు చేస్తున్నావు” అని అడిగాడు. దానికి యువక్రీతుడు “ఏ గురువు దగ్గర విద్య నభ్యసించకుండానే, సకల వేదాలు, శాస్త్రాలు అవగతం కావాలి” అన్నాడు. అపుడు ఇంద్రుడు

“గురుముఖమునఁ బడయక దు | ష్కరతపమునఁ జేసి పడయఁగాఁబడు విద్యల్‌

పరమార్థము మదమును మ | త్సరమును గావించు నెట్టిసాధుల కైనన్‌.” (3-3-256)

“అధ్యాపకుడి నోటి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందని తీవ్రమైన తపస్సు వలన పొందేటటువంటి విద్యలు పరమార్థములో మంచి వారికైనా గర్వాన్ని, అసూయను కలిగిస్తాయి. ఇది విద్యను సంపాదించే పద్ధతి కాదు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

యువక్రీతుడు ఇంద్రుని మాట వినకుండా మరింత తీవ్రంగా తపస్సు చేయసాగాడు. ఒకనాడు ఇంద్రుడు ముసలి వేషం దాల్చి వచ్చాడు. అతడు కృంగి కృశించిన దేహం కలవాడై, గంగానది వద్ద లోతైన గంగ నీటి వెల్లువకు పిడికిళ్ళతో ఇసుక పోస్తూ ఆనకట్టు కట్టే యత్నం చేస్తున్నాడు. అది చూసి యువక్రీతుడు బ్రాహ్మణుడిని పరిహసిస్తూ “నూరేళ్ళ ముసడివాడివి. మిక్కిలి కృశించినావు. ఎందుకే అసాధ్యమైన లక్ష్యమందు ఆసక్తి చూపుతున్నావు? మందబుద్ధివైనావు. ఎప్పుడు ఈ ఆనకట్ట పూర్తి కాగలదు?” అన్నాడు.

అపుడు ఇంద్రుడు “నేను నీవలెనే అసాధ్యమైన లక్ష్యమందు కృషి చేయుచున్నాను” అని నిజరూపం దెచ్చి “వృథా ప్రయాసను మానము” అన్నాడు. “నేను నా తీవ్ర తపమును లక్ష్యాన్ని సాధించునంత వరకు విరమించలేను” అని తెలిపి, మొండిపట్టు పట్టి ఇంద్రుడి దగ్గర తగిన వరములను పొందాడు.

యువక్రీతుడు వరగర్వంతో, విద్యాగర్వంతో తన విజయ గాథను భరద్వాజునికి వినిపించాడు. అపుడు భరద్వాజుడు యువక్రీతుణ్ణి గర్వాన్ని చూచి బాలధి కథ వినిపించాడు. ఆ కథ ఎట్టిదనిన, “పూర్వం బాలధి అనే మునివరేణ్యుడు ఉండేవాడు. అతడి పుత్రుడు మరణించాడు. ఉగ్రమైన తపస్సుచేసి చిరంజీవియైన పుత్రుడిని వరంగా పొందాడు. అతడి పేరు మేధావి. మేధావి తాను చిరంజీవి నన్న గర్వంతో, కన్నూ మిన్నూ కానక తిరుగుతూ ఒకనాడు ధనూపాక్షుడు అనే మునిని అవమానించాడు. ఆ తపస్వి ఆగ్రహించి మేధావిని యమపురికి పంపినాడు. ఇదే కథ. ఈ కథను భరద్వాజుడు యువక్రీతుడికి చెప్పి, మరియు “గర్వంబు చెట్ట; యెట్టివారి నైనఁ గ్రాఁచుఁ దత్‌క్షణంబు గర్వంబు; గర్వంబు నొడిచియున్నవాఁడ యుత్తముండు”  అని తెలిపి, “గర్వాన్ని విడిచి, శాంతస్వభావిపై రైభ్యుడి కొడుకులతో అసూయలు లేని వాడై యుండుము” అని తెలిపాడు. దానికి యవక్రీతుడు “నాకు రైభ్యుడు నీతో సమానుడు. అలాగే మీరు చెప్పినట్లే నడుచుకుంటాను” అన్నాడు. కానీ ఋషుల సభలో పాండిత్య ప్రకర్ష ప్రదర్శించసాగాడు. ఒకనాడు రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మహా సుందరాంగియైన రైభ్యుడి కోడలిని చూసి మోహించినాడు. తన మనసు లోని వలపును ఆమెకు తెలిపాడు. ఆమె ఇతడు ఎక్కడ శపిస్తాడోనని, భయపడి, సమ్మతిని నటించి, మామగారైన రైభ్యుడి వద్దకు యేడుస్తూ వెళ్ళి, జరిగింది చెప్పింది. దానికి ఉగ్రుడైన రైభ్యుడు ఒక జడను శిఖనుండి లాగి అగ్నిలో వ్రేల్చాడు. అగ్నిహోత్రము నుండి ‘కృత్తి’ అను ఒక సుందరాంగి మరియు రాక్షసుడు జన్మించారు. వాడు రైభ్యుడిని కర్తవ్యం ఆదేశించమన్నారు. రైభ్యుడు వారిని “యువక్రీతుడని సంహరించండి” అని ఆజ్ఞాపించాడు.

వారు యువక్రీతుడి దగ్గరికి వెళ్ళారు. యువక్రీతుడు ఆ సుందరిని చూచి మోహించాడు. ఆమె వలపుకు లొంగినప్పుడు ఆ సుందరాంగి యువక్రీతుడి కమండలాన్ని గ్రహించింది. దీనితో యువక్రీతుడు అపవిత్రుడై, తపశ్శక్తి హీనుడైనాడు. అది చూచి యువక్రీతుడిని సంహరించడానికి రాక్షసుడు వెంటపడ్డాడు. యువక్రీతుడు పారిపోయి సరస్సుల్లో, నదుల్లో ప్రవేశించాడు. కాని అవి ఎండిపోతున్నాయి అంటే పాపులు ఎక్కడ కాలు వెడితే అక్కడ దగ్ధమే. చివరికి తండ్రి యజ్ఞశాలకు వెళ్ళి దాక్కున్నాడు. కాని అపవిత్రుడైన యువక్రీతుడి వల్ల తండ్రి యజ్ఞవాటిక కూడా సహాయం చేయలేక పోయింది. వెంటనే రాక్షసుడు అతడిని సంహరించాడు. ఇంతలో భరద్వాజుడు వచ్చాడు. నిత్యం అతడికి లేచి స్వాగతం ఆచరించే అగ్నులు అణిగి ఉన్నాయి. విషయాన్ని గ్రహించాడు. మిక్కిలి దుఃఖించాడు. “గర్వితునకు బుద్ధి గాన నగునె?” అని పలికి పుత్రుడికి అగ్నిసంస్కారం చేశాడు. పుత్రశోకం తట్టుకోలేక అతడూ చితిలో పడి మరణించాడు.

దుర్మార్గులైన పుత్రులు పుడితే తల్లిదండ్రులకు చావే కదే.

కొంత కాలానికి బృహద్యుమ్నుడు సత్రయాగం చేయాలనుకున్నాడు. రైభ్యుడి కుమారులైన అర్ధావసు, పరావసులను ఋత్విజులుగా ఎన్నుకున్నాడు. వారు తండ్రి అనుమతితో యజ్ఞం చేయసాగారు. ఒకనాడు వేకువ జామున పరావసుడు తన ఆశ్రమానికి వస్తున్నాడు.

అదే సమయంలో రైభ్యుడు ఆశ్రమం నుండి వస్తున్నాడు. చీకటిలో నడిచి వస్తున్న రైభ్యుడిని క్రూరమృగంగా భావించి, పరావసు తండ్రిని సంహరించాడు. తరువాత అసలు విషయం గ్రహించి, మిక్కిలి దుఃఖించాడు. అగ్ని సంస్కారం నెరవేర్చాడు. అన్నయైన అర్ధావసు దగ్గరికి వచ్చి” అన్నా! ఆ సత్ర యాగాన్ని నీవు ఒక్కడివే నిర్వహించలేవు. నేను ఒక్కడినే నిర్వహించగలను. కాబట్టి నీవు నాకు బదులుగా బ్రహ్మహత్య పోగొట్టే వ్రతమును చేయుము” అని అర్థించాడు. తమ్ముడు చెప్పనట్లే అర్ధావసు వెళ్ళి బ్రహ్మహత్యా పాతకానికి నిష్కృతి కలిగించే వ్రతాలు నిర్వర్తించి, తిరిగి సత్రయాగానికి వచ్చాడు. ఇక్కడ తమ్ముడు పరావసు ఒక్కడే యాగం నిర్వహిస్తున్నాడు. అన్నగారు తిరిగిరావడం అతడికి నచ్చలేదు. మనుషులెలా ఉంటారో చూడండి. అందుకే పరావసు రాజుతో “ఓ బృహద్యుమ్న మహారాజ! ఇతడు శుభకార్యాలను విడిచి బ్రహ్మహత్యా పాతక నిష్కృతి వ్రతాలను ఆచరిస్తున్నాడు. కావున యాగానికి యోగ్యుడు కాదు” అన్నాడు. అపుడు అర్ధావసు, బ్రహ్మహత్య చేసింది తాను కాదు, తన తమ్ముడేనని; అతని పాపాలు పోగొట్టడానికే వ్రతాలు చేసానని సభాముఖంగా తెలిపాడు. అతడి మాటలను వేల్పులు అంగీకరించారు. వరాలను కోరుకోమన్నారు.

భరద్వాజుడు, యువక్రీతుడు, రైభ్యుడు తిరిగి బ్రతకాలనీ, తన తమ్ముడికి బ్రహ్మహత్యా దోషం పోవాలని కోరుకున్నాడు. అందరూ బ్రతికారు. యువక్రీతుడు దేవతలతో, “నేను వివిధ శాస్త్రాలు, వేదాలు ఎరిగినవాడిని. సమస్త వ్రతాలు దీక్షతో ఆచరించినవాడిని. కాని ఈ విధంగా రైభ్యుడి చేత ఎలా చంపబడినాను? నాకంటే రైభ్యుడికి హెచ్చు శక్తి ఎక్కడిది?” అని అన్నాడు.

“గురుశుశ్రూష యొనర్చుచుఁ | బరమక్లేశమునఁ జేసి పడసిన విద్యల్‌

స్ఫురియించుఁగాక; గురుముఖ | విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్‌?” (3-3-282)

“గురువుగారికి పరిచర్య చేస్తూ, మిక్కిలి ప్రయాసకు ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి. కానీ, అధ్యాపకుడి నుండి అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు ఎక్కడైనా శోభిస్తాయా? నీవు గురుముఖతః వేదవిద్యలు పొందలేదు. ఇతరేతర విధానాలచే నేర్చుట ద్వారా అవి శక్తిహీనములైనాయి. గురువు సంతసించేటట్లు రైభ్యుడు వేదశాస్త్రజ్ఞానం ఆర్జించుట చేత అతడికి ఆ శక్తి యేర్పడింది” అని తెలిపారు.

అపవిత్రుడైన వాడిని, పాపబుద్ధిని – తాను చేసిన తపస్సు కానీ పవిత్రమైన యజ్ఞవాటికలు వంటివి కూడా రక్షించలేవు. అర్ధావసు, పరావసుల వృత్తాంతంలో పరావసు చదువుకున్న, స్పార్థపరుడైన దుర్మార్గుడు. అర్ధావసు నిజమైన బ్రహ్మజ్ఞాని. అందుకే తమ్ముడి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టటమే కాక, రైభ్యుడిని, భరద్వాజుడిని, తమకు కీడు తలపెట్టిన యువక్రీతుడిని బ్రతికించాడు. కొడుకు దుర్మార్గుడైతే తండ్రికి వ్యథతో పాటు, మత్యువు కూడా సన్నిహితమేనని భరద్వాజుడి మరణం తెలుపుతుంది.

గురుముఖతః చదివే విద్యయే విద్య అనునది తెలుపు కథ అరణ్యపర్యం తృతీయాశ్వాసంలోనిది. రోమశుడు ధర్మరాజుకు చెప్పినది .

– అల్పవిద్యో మహాగర్వః – Little learning much pride

– He that is proud eats up himself – Shakespeare

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here