[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
40. జటాసుర వధ!
[dropcap]పాం[/dropcap]డవులు అరణ్యవాసం చేస్తుండగా ఒకసారి వారు కుబేరుడి తోటలో విహరించసాగారు. అప్పుడు ఆ వన పాలకులైన యక్షులు అక్కడికి వచ్చి రోమశ ముని, ధౌమ్యుడు వంటి వారితో నున్న పాండవులను చేరి, వారికి వినయపూర్వకంగా నమస్కరించి, “ఇది యక్ష రాక్షసులు విహరించే భయానక స్థలము. ఇచట మీరు విహరించరాదు” అని పలికారు. వారు అక్కడి నుండి వెళ్ళిపోయి మరికొంత దూరంలో నివాస మేర్పరుచుకొని ఉన్నారు.
అంతవరకు తమతో ఉన్న ఘతోట్కచుని, అతని రాక్షస పరివారమును పంపించి వేశారు. ఒకనాడు ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపధారియై వచ్చాడు. “నేను వేదవిద్యలు నేర్చాను. పరశురాముడి వద్ద విలువిద్య నేర్చాను” అని తెలుపుకొని, పాండవులను సేవిస్తూ ఉండిపోయాడు. ఒకనాడు భీముడు ఆశ్రమంలో లేని సమయం చూసుకొని, ధర్మరాజును, నకులుని, ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకొని వారి ఆయుధాలతో పాటుగా వారిని మూపున ఎక్కించుకొని, పరుగెత్తుకొని పోయాడు. సహదేవుడు భీముడిని పిలుస్తూ, అరణ్యంలోకి వెళ్ళాడు.
ధర్మరాజు రాక్షసుడితో, “మానవులను కాపాడేవాళ్ళం. పైగా పరోపకార పారీణులము. మాకు నీవు కీడు తలపోయుట భావ్యం కాదు. నీవు ధర్ము వెఱుంగవు; విశ్వసించినవారికిం గుడువంబెట్టినవారికి నెగ్గుచేయుట కడుంబాపంబు” అని పలికాడు.
మరల “మా ఆయుధాలు మాకిచ్చి మాతో యుద్ధం చేయుము. ఇలా పరుగెత్తటం భావ్యం కాదు” అని తన పొడువాటి చేతులతో రాక్షసుడి వేగాన్ని తగ్గించాడు.
ఇంతలో సహదేవుడు వచ్చి, రాక్షసుడితో, “ఒరేయి రాక్షసుడా! తిన్నగా నిలిచి యుద్దం చేయుము” అని పలికాడు. అంతలో భీముడు వచ్చాడు. రాక్షసుడితో పాటున్న ధర్మరాజాదులను, క్రింద భూమిపై నిలిచిన సహదేవుడిని చూశాడు. రాక్షసుడితో,
“అతిథివై వచ్చి నీవు మాయందుఁ గుడిచి యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె?
యెందుఁ గుడిచినచోటికి నెగ్గు సేయ రెట్టి దుర్జను లైనను నెఱుక విడిచి” (3-3-390)
నీవు మా దగ్గరకి అతిథివై వచ్చి మాతో పాటు తిండి తిని, రాక్షసుడవై, ఉపకారం చేసిన వారికి అపకారం చేయుట నీకు తగునా? ఎంతటి చెడ్డవారైనప్పటికీ తిండి పెట్టిన వారికి – బుద్ధి లేకుండా కీడు చేయరు. నీవు బుద్ది తెచ్చుకొని, వారిని వదులు లేదా బకుడినీ, హిడింబుడినీ, కిమ్మీరుడినీ చంపినట్లుగా నిన్న చంపుతాను” అని పలికి, తనతో తలపడిన రాక్షసుడైన జటాసురునితో యద్ధం చేసి క్షణంలో చంపివేశాడు. అందరూ శ్లాఘించారు. కృతఘ్నుడు, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడు ఎలా ఉంటాడు, కృతఘ్నత ఎంత పాపభూయిష్టమైనది అనే విషయాలు ఈ కథ ద్వారా తెలుస్తాయి.
జనమేజయునికి వైశంపాయనుడు చెప్పినది.
అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.
-”If you pick up a starving dog and make him prosperous, he will not bite you, that is the principal difference between, dog and a man.” – Mark Twain
41. అజగరోపాఖ్యానం!
పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు కొంతకాలం హిమవత్పర్వత ప్రాంతాలలో నివసించారు. ఒకనాడు భీముడు వేటకు వెళ్ళాడు. వేటలో అలసిపోయి ఉండగా ఒక కొండచిలువ భీముడిని బిగియపట్టింది. పదివేల ఏనుగుల బలం కలవాడు, కుబేరుడిని ఓడించినవాడు ఒక మాములు పాముకు చిక్కుపడ్డాడు. ఇది ఆశ్చర్యం.
ఇదెలా జరిగిందని ఆశ్చర్యంతో జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు.
భీముడు పాముకు చిక్కుపడ్డాడు. అతడు తాను చంద్రవంశజుడినని చెప్పినా వదలలేదు. భీముడు వేటకు వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవడంతో ధర్మరాజు ఏదో కీడు శంకించాడు. అతనికి దుశ్శకునాలు గోచరించాయి. ధౌమ్యుడితో కలిసి వెళ్ళాడు. అడవి అంతటా గాలించాడు. ఒకచోట సర్పాధీనుడయి యున్న భీముడిని చూచాడు. ఆ సర్పం సామాన్యమైనది కాదని ఊహించి వివరాలు అడిగాడు. ఆ కొండచిలువ రూపములోనున్నది శాప పీడితుడైన నహుషుడని తెలుసుకున్నాడు. ఇక్కడ మనం నహుషుడెందుకు కొండచిలువగా మారాడో తెలుసుకోవాలి.
నహుషుడు పాండవుల కంటే ముందు చంద్రవంశంలో పుట్టినవాడు. దేవేంద్రునితో సమానుడు. తాత్కాలికంగా అధికారం ఐశ్వర్యం సిద్ధించడంతో మదించిన వాడు. ఆ మదం చేత విచక్షణ కోల్పోయి వేయి మంది బ్రాహ్మణులు మోస్తున్న రధాన్ని అధిరోహించి, వారిని అవమానించాడు. దానితో కలశ సంభవుడైన అగస్త్యుడు కోపించి, అతడిని మిక్కిలి భయంరకరమైన పామువు కమ్మని శపించాడు. ఇది అతడు దేవేంద్ర పదవి నుండి, ఒక్కసారిగా దిగజారి శాపగ్రస్థుడైన వైనము.
వేదాలన్నీ చదివినా, శతక్రతువులు చేసినా, ఇంద్ర పదవి పొందినా మదోన్మత్తుడై మునిపుంగవులను అవమానిస్తే ఎంతటి వాడైనా తత్ఫలితాన్ని అనుభవించాల్సిందేనన్న సత్యాన్ని తెలిపే వృత్తాంతమిది. నడమంత్రపు సిరి అంటే ఇదే.
సరే! ధర్మరాజు నహుషుడి శాపవృత్తాంతం తెలుసుకున్న తరువాత, తన తమ్ముడిని విడిచిపెట్టమని ప్రార్థించాడు. అప్పుడు నహుషుడు “నేనడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే, నీ తమ్ముడిని విడిచిపెడతాను” అన్నాడు. ధర్మరాజు అందుకు ఒప్పుకున్నాడు. నహుషుడు అడిగిన ప్రశ్నలు, ధర్మజుడు ఇచ్చిన సమాధానాలు సార్వకాలికాలు, సార్వజనీనాలు. మానవ జాతికి మార్గదర్శకాలు.
నహుషుడు: ఏ గుణాలు కలవాడు బ్రాహ్మణుడు? అతడిని గుర్తించు వస్తువేది?
ధర్మరాజు: సత్యం, క్షమ, దమం, శౌచం, దయ, తపస్సు, దానశీలం అనే గుణాలు కలవాడు బ్రాహ్మణుడు. సుఖదుఃఖాలు పొందినపుడు మోహాన్ని పొందకుండా ఉండే స్వభావం బ్రాహ్మణుని గుర్తించడానికి తోడ్పడే సాధనం.
నహుషుడు: నీవు చెప్పిన గుణాలు, ఆచరణా శూద్రుడి యందు కూడా ఉంటే అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాగలడా? సత్యాన్ని విడిచి పెడితే బ్రాహ్మణాది వర్ణ విభాగం ఎలా కలుగుతుంది? ఉత్తమాధమ వివేకం అపార్థాన్ని కలిగిస్తుంది కదా?
ధర్మరాజు: పొరపాటున వర్ణ సాంకర్యం ఏర్పడితే వర్ణపరీక్షను నిర్వహించటంలో బ్రాహ్మణాదుల ప్రవర్తనను స్వాయంభువ మనువు ప్రత్యేకించి చెప్పాడు. సత్యం మొదలైన గుణాలు శూద్రుడి యందు కలిగినప్పటికీ అతడు సత్ శూద్రుడు అవుతాడు కాని బ్రాహ్మణుడు కాలేడు. ఆ గుణాలు బ్రాహ్మణుడిలో లేకపోతే శూద్రుడు అనబడతాడు. కావున శీలం, ప్రవర్తన ముఖ్యం. అంతేకాదు,
“వృత్తవంతుండు వెండియు వివిధగతుల వృత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుఁ
డైనవాఁడు విహీనుండ యండ్రు గాన విత్తరక్షకుఁ గడు మేలు వృత్తరక్ష.” (3-4-129)
మంచి నడవడి కలవాడు, మరల మరల పెక్కు మారులు తన సౌశీల్యాన్ని కాపాడుకోగలడు. సత్ప్రవర్తన లేనివాడు ఎన్నటికీ అట్లు చేయడు. ధనాన్ని కాపాడుకోవటం కంటే సత్ప్రవర్తనను కాపాడుకోవటమే మేలు.
నహుషుడు: అప్రియమైన పనులు చేసినా, అబద్ధాలాడినా సరే హింస చేయకుండా ఉంటే చాలు ఉత్తమగతిని పొందుతారని కొందరంటారు. ఆ అహింస అంత గొప్పది ఎందుకైనదో చెప్పగలవా?
ధర్మరాజు: దానం, మేలు చేయటం, సత్యం, అహింస అనేవి నాలుగు సమానాలే అయినప్పటికి అహింసయే శ్రేష్ఠం. ఎట్లాగంటే దేవతలలో, మనుష్యులలో, పశుపక్ష్యాదులలో పుట్టినవారిలో మనుష్యుడు దానాదిగుణాలు కలిగి అహింసాపరుడైతే దేవగతిని పొందుతాడు. ఆ గుణాలు పాటించకపోతే పశుపక్ష్యాదులలో పుట్టి పతితుడవుతాడు.
ఈ విధంగా నహుషుని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానమిచ్చి, నహుషుడి పట్టు నుండి తమ్ముడిని విడిపించుకున్నాడు. నహుషునికి శాపాన్ని దూరం చేశాడు. శౌర్యప్రతాపాలు కల భీమార్జునుల వృత్తాంతంతో పులకితులయ్యే మహాభారత పఠితలు తన ఆధ్యాత్మిక, బౌద్ధిక, మానసిక ప్రజ్ఞాబలంతో అనేక సమస్యలను పరిష్కరించిన ధర్మరాజుకు వందనమాచరిస్తారు.
మహాభారతంలో భీమార్జునులు తమ భుజబలం చేత, అస్త్ర శస్త్రాల చేత, అవక్ర విక్రమ పరాక్రమం చూపి, శత్రువులను గెలిచారు. కాని ధర్మరాజు అత్యంత విపత్కర పరిస్థితులలో తన మేధోసంపత్తిని, ధర్మాధర్మ విచక్షణ ప్రదర్శించి తన తమ్ముళ్ళను కాపాడుకొని దేవతలచే ప్రశంసించబడి భారత నాయకుడని నిరూపించుకున్నాడు.
ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోనిది.
-”That which is possible by stratagem is not possible by valour.”
ఉపాయేనహి యచ్ఛక్యం నతచ్ఛక్యం పరాక్రమైః
42. బ్రాహ్మణ ప్రభావం!
పూర్వం హైహయవంశంలో ధుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు వేటకు వెళ్ళి పొదల మాటున జింక చర్మం ఉత్తరీయంగా ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వ్రేటుకు ఆ యువకుడు మరణించాడు. ధుంధుమారుడు ఆ బ్రాహ్మణ మృత కళేబరాన్ని చూచి, మిక్కిలి విచారించి, రాజధానికి తిరిగి వెళ్లి, జరిగిన సంగతి పెద్దలకి చెప్పి వారిని వెంటబెట్టుకొని అడవికి వచ్చి ఆ శవాన్ని చూపించాడు.
ఆ సమీపంలోనే తారక్ష్యుడు అనే మహర్షి ఆశ్రమం ఉన్నది. వారందరు కలిసి అక్కడికి వెళ్ళారు. జరిగిన సంగతి చెప్పారు. ఆ బ్రాహ్మణ యువకుడిని చంపిన మహా పాపాన్ని తొలగించుకొనే ఉపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు తారక్ష్యుడు వారితో ఇలా పలికాడు – “మా ఆశ్రమంలోని వారికి భయం, రోగం, చావు మొదలైన బాధలు ఉండవు. ముల్లోకాలకు ఈ విషయం తెలుసు” అంటూ, “చనిపోయిన వ్యక్తి యితడేనా?” అంటూ, రాజుచే మృత్యువాత పొందిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా చూపించాడు. చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికిన మహిమకు కారణమేమిటని వారు అడిగారు. అప్పడు తారక్ష్యుడు
“ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్,
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నఁడున్” (3-4-190)
“ఈ ఆశ్రమంలో మేము కొన్ని నియమాలను నిష్ఠతో ఆచరిస్తాము. ఎన్నడూ కాలహరణం చేయము. ఆహారం పరిశుభ్రంగా ఉంచుతాము. అతిథులను పూజిస్తాము. సదా సత్యవ్రతాన్ని పాటిస్తాము. శాంతి, బ్రహ్మచర్యము మాకు మేలైన అనుష్ఠానాలు. ఇట్టి నియమ నిష్ఠలతో కూడిన జీవన విధానం వలన మాకు మృత్యభయం లేదు. ఎట్టి ఆందోళనకు ఈ ఆశ్రమంలో తావు లేదు” అని చెప్పాడు.
ఇది బ్రాహ్మణ ప్రభావాన్ని వర్ణిస్తూ మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన కథ. ఈ కథ ఆనాటి ఆశ్రమ జీవన విధానమును, మృత్యుంజయత్యానికి మానవ జాతి ఆచరించాల్సిన నియమ నిష్ఠలు తెలుపును.
అరణ్యపర్వం చతుర్థాశ్వాసం లోనిది.
– “Discipline is the refining fire by which talent becomes ability” – Roy Langdon Smith
(ఇంకా ఉంది)