[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
12. గరుత్మంతుడి పరాభవ గాథ!
తన శక్తినీ, ఎదుటివారి శక్తినీ గమనించక ధిక్కరించటం మూర్ఖుల లక్షణం. ఒక్కొక్కసారి అది ఎంతటివారికైనా గౌరవహాని కలిగిస్తుంది. అది వజ్రాయుధాన్నైనా లెక్కచేయని బలశాలి గరుత్మంతుడినైనా సరే.
దేవేంద్రుడి రథసారధియైన మాతలి గుణకేశి అను తన కుమార్తెకు, ఆర్యకుడు అనే సర్వనాయకుడి మనుమడు, చికురుడు అనేవాడి తనయుడు అయిన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. ఆర్యకుడి దగ్గరికి వెళ్ళి ప్రీతితో సుముఖుడిని కోరాడు. ఆర్యకుడు, “గరుత్మంతుడు, వీని తండ్రియైన చికురుడిని చంపివేసాడు. నెల రోజులలో సుముఖుడిని కూడా చంపివేస్తానని పంతగించి వెళ్ళిపోయాడు. ఈ దశలో వివాహానికి ఒప్పుకోలేను” అన్నాడు. ఆ మాటలు విన్న మాతలి వారిని చూచి వచ్చిన కార్యము నివేదించాడు. అందుకే సురపతి విష్ణుదేవుడికి చెప్పి, చేయించదలచి గరుత్మంతుడి విషయంలో చాలుదునని భావించి, సుముఖుణ్ణి దీర్ఘాయుత్మంతుణ్ణి చేశాడు.
మాతలి తన పుత్రికను సుముఖుడికిచ్చి వివాహం జరిపించి ఉండగా, ఈ సంగతి నెరిగిన గరుత్మంతుడు క్రోధావేశపరుడై నారాయణుడి సమక్షంలో ఇంద్రుడితో, “నీవు ఆదితి పుత్యుడవు. నేను వినతా పుత్రుడను. మనిద్దరికీ కశ్యపుడు తండ్రి. ఏ విషయంలో నేను నీకంటే తక్కువ. నా నిర్ణయానికెందుకు అడ్డు పడ్డావు” అన్నాడు. అపుడు ఇంద్రుడు, “నీ గొప్పతనానికి విష్ణువు తప్ప మరొకడు కారణం కాదు” అన్నాడు. అపుడు గరుడుడు, “నీవు నా శక్తి సామర్థ్యాలు ఎట్టివో వాస్తవంగా గ్రహించలేక నాకు హీనత్వం కలిగేట్లు ప్రవర్తించావు. అదితిగన్న సమస్త దేవతా కులాన్ని ఒక సన్నని ఈకపై ధరించగలను సుమా. ఇలాంటి బలాఢ్యుడిని నన్ను నీవీ రకంగా చిన్నబుచ్చుతావా?” అని ఇంద్రుడిపై గుడ్లురుమగా, నారాయణుడు వెటకారంగా నవ్వుతూ, “అవివేకి! నీవు ఏపాటి భారం మోయగలవురా? నా సామర్థ్యంతో నిన్ను నడుపుకొని వస్తుంటే నీకెంత పొగరు” అంటూ తన ముంజేతిని అతడి వీపుపై మోసాడు.
విష్ణువు ముంజేయి గరుడుని వీపుపై మోపగానే, ఆ బరువుకు గరుత్మంతుడు రెక్కలు చాస్తూ, నోరు తెరుస్తూ, నేలమీద కూలి ఒడలు తెలియక ఆక్రందన చేశాడు. అంతట శ్రీహరి “భయపడవద్దు” అని అతడిని లేవదీసి, “గర్వము విడిచి, బుద్ధికలిగి ఉండుము” అని సెలవిచ్చి పంపాడు.
‘బలవంతుల బలములు న
నగ్గలమగు బల మెదురఁ గలుగఁగాఁ గీడ్పడు నే
కొలఁదుల వారికి గర్వము
నిలుచునె నయమార్గ వృత్తి నిలిచిన భంగిన్.’ (5-3-303)
బలవంతుల యొక్క బలాల ఎదుట అంతకంటె మిక్కుటమైన బలాలు కలిగినపుడు అవి క్రింద పడిపోతాయి. ఎంతటి శక్తి సంపనులకయినా ధర్మమార్గ ప్రవర్తనం తలెత్తి నిలబడినట్లుగా అహంకారం నిలబడలేదు.
భుజబలాఢ్యులకు, శక్తిశాలులకు ఏదో ఒక సందర్భములో తమను తాము ఎక్కువగా అంచనా వేసుకోవడం కద్దు. అక్కడి నుండి వారు మదగర్వాలకు లొంగడం కద్దు. అలాంటప్పుడు ఇలాంటి సంఘటన లెదురయితే మళ్ళీ నేలమీద నడుస్తాం. కళ్ళు తెరచుకొని ప్రవర్తిస్తాం.
కృష్ణరాయబారానంతరం కురుసభలో నున్న మహామునులు దుర్యోధనుడికి బుద్ధి చెబుతున్న సందర్భంలో కణ్వుడు దుర్యోధనునికి చెప్పిన కథ.
ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం లోనిది.
He that is proud eats up himself – Shakespeare.
13. సువర్ణష్ఠీవి కథ!
అభిమన్యుడు యుద్ధము నందు అధర్మముగా చంపబడెను. పుత్రుడి మరణానికి దుఃఖిస్తున్న ధర్మరాజుకు మృత్యువు అనివార్యమనుచు తెలుపబడినది సువర్ణష్ఠీవి కథ.
పూర్వం సృంజయుడను మహారాజు మహావైభవంతో సంపూర్ణ దక్షిణలతో పెక్కు యాగములు చేసెను. సృంజయునికి అపారమైన రాజ్య సంపద కలదు. కానీ సంతానం లేకపోవటం చేత మిక్కిలిగా దుఃఖించు చుండెను. సృంజయునికి నారదముని మిక్కిలి సన్నిహితుడు మిత్రుడి బాధ తొలిగించుటకై నారదుడు, సృంజయునికి కొడుకును అనుగ్రహించెను. ఆ బాలుడు గావించు మలమూత్ర విసర్జనములన్నియు సువర్ణమయములుగా నుండుటచే అతనికి సువర్ణష్ఠీవి యను పేరు కలిగెను.
బాలుడి సర్వ విసర్జనల వలన లభించు సువర్ణములచే రాజు పెక్కు దానధర్మములు గావించెను. ఆ వింత బాలుని వృత్తాంతము విన్న దొంగలు దురాశచే అతడిని అపహరించి, సంహరించిరి. అతడి అవయవములన్ని వెదికిననూ వారికి బంగారం దొరకలేదు. సృంజయుడు తన కుమారుడిని కోలుపోవుట దురంత దుఃఖమును పొందుచుండెడివాడు. అపుడు నారదుడు సృంజయుడి వద్దకు వచ్చి, మృత్యువు అనివార్యమని, మహాప్రభవశీలురు, దానశీలురు, పరాక్రమవంతులు, శీలవంతులైన షోడష చక్రవర్తులు కూడా భూమిపై శాశ్వతంగా జీవించజాలక పోయారని, సామాన్య మానవు లెంతటి వారని, మృత్యువు సమయం వచ్చినప్పుడు అందరినీ అక్కున చేర్చుకుంటుందని, కావున తప్పక జరుగవలసిన, జరిగే మృత్యు సంఘటనకు చింతించరాదని ఆతనిని ఊరడించెను.
సృంజయునికి వివేకము కలిగి దుఃఖము విడిచెను.
మహాభారతం ద్రోణ పర్వతములోనిది.
‘ఋణాను బంధరూపేణ పశుపత్నీ సుతాలయాః
ఋణక్షయేక్షయం యాంతి కాతత్ర పరివేదనా’
Cattle, a wife, children and a house are the cause of debt; if the debt is cleared, they go to ruin – what sorrow is there in that.
ప్రాప్తకాలో నజీవతి – He whose time has come, lives not.
14. కాకి హంసల కథ!
మహాభారత యుద్ధం జరుగుతున్నది. కర్ణుడు సైన్యాధ్యక్షుడు అయినాడు. కాని అతడికి సరైన సారథి దొరకలేదు. దుర్యోధనుడి కోరిక మేరకు మహాబలుడు, పాండవ పక్షపాతియైన శల్యుడు, కర్ణుడికి సారథ్యానికి అంగీకరించినాడు. కర్ణుడంటే శల్యుడికి అయిష్టం. పాండవులంటే ఇష్టం. అదే అదనుగా చూసుకొని శల్యుడు కర్ణుని సూటిపోటి మాటలతో వేధించినాడు. దానికి కర్ణుడు కోపించి, శల్యుడిని “గదతో నీ తల పగులగొడతాను”. అన్నాడు. దానికి శల్యుడు “నేనేమి తప్పు చేశాను? ఎంగిలికూడు తిని బలిసిన కాకి లాంటిది నీ జీవితం. ఆ కథ చెబుతాను విను” అంటూ ఈ కాకి హంసల కథ చెప్పాడు.
ఒకానొక గ్రామంలో దానరతుడు, పుత్రవంతుడు అయిన ఒక వైశ్యుడు కలడు. ఒకనాడు అతని ఇంటికి ఒక కాకి వచ్చింది. అతని కొడుకులు దానికి ఎంగిళ్ళు పెట్టుచూ, దాని గుణరసములు పొగుడుచు పెంచసాగిరి. ఆ కాకి వారి ఇంటిలో ఎంగిళ్ళు తిని, పెరిగి, క్రొవ్వెక్కి యే పక్షీ తనకు సాటిరాదని దురభిమానంతో ఉండెను. ఒకనాడు కొన్ని హంసలు, పక్షబలము నందు గరుత్మంతునితో సాటిరాదుగు నట్టివి, అక్కడి సముద్ర తీరమున విహరించసాగినవి.
వైశ్య పుత్రులు కాకితో “అదిగో హంసలు, వెళ్ళుము! వెళ్ళి, హంసలతో పోటీపడి గెలువుము” అనిరి. ఎంగిళ్ళు మెక్కి మదించిన కాకము, జ్ఞాన శూన్యులగు, అల్పబుద్ధులగు వారి మాటలు విని, హంసలను చేరి, ఒక హంసతో, “పరుగిడుదము రమ్ము” అని పిలిచినది.
అపుడు హంసలు “మేము మానస సరోవరంలో తిరుగుతుంటాము. మాకు జవసత్వాలు అధికము. హంసలతో పందెము కట్టు పక్షులెక్కడైనా కలవా?” అన్నవి. దానికి కాకము, “నూటొక్క గమనగతులు గలవు. అవి అన్నియు నాకు కరతలామలకములు. మీలో మేటియైన దానిని నాతో పోటీకి పంపుడు. నేను గెలువగలను” అన్నది.
అపుడు హంసలు “ఒక్క గమనానికే నీకు శక్తి చాలదు. నిరుత్యాహపడతావు! ఈ పేలుళ్ళు మాని, నీ దారిని నీవు వెళ్ళుము” అన్నాయి. కానీ కాకి మాట వినలేదు. పందెమునకు ఆహ్వానించింది. మిగిలిన కాకములు హంసలకు పరాభవం తప్పదని ఉత్సాహపరిచినవి. హంస కాకముల కలకలము విని పడమటివైపుకు రివ్వున ఎగిరిపోవుచుండగా, అందులో ఒక దృఢమైన హంసను ఎంచుకొని కాకము వెంబడించినది.
హంస గమన పారీణతను చూపగా, కాకము వెంటనే అలిసినది. “నన్ను నేనెఱుగక హంసను వెంబడించితిని. క్రింద చెట్లు, చేమలు, కొండలు యేవియు లేవు. దాహము వేయుచున్నది. శరీరము డస్సిపోయినది. ఇపుడెట్లు” అని చింతించినది. “అయ్యో! నీకు నూటొక్క గమనములు తెలుసును కదా. అపుడే డస్సితివేమి” యని హంస అన్నది. కాకము అలసి సొలసి ఎగరలేక, బలము నశించి, నీటిపై బడి బాధను పొందుచుండగా, “ఆలోచించి మాట్లాడవలయును. మాట్లాడిన తీరుగ పని చేయవలయును. నీ పని అయినది కదా” అని హంస అన్నది.
అపుడు కాకి, “ఎంగిళ్ళు తిని క్రొవ్వుపట్టి తిరుగుచూ నాకు గరుడుడు. సరికాదంటిని. నాకు బుద్ధి వచ్చినది. నన్ను కాకులలో కలుపుము” అని వేడుకున్నది.
హంసదయతో కాకిని తన చరణముల నిరికించి, మూపుపై పెట్టుకొని యెప్పటి నెలవున నిలిపిపోయెను. ఆ కాకి తెప్పరిల్లిన పిమ్మట మిగిలిన కాకులు వినుచుండగా “యెంగిలి కూళ్ళ కొవ్వుతో యెపుడిట్టి అవినయం ప్రదర్శించకు” అని చెప్పి వెళ్ళిపోయాను.
తన బలము, ప్రక్కవారి మాటలు విని కాకుండా, తనంతట తాను అంచనా వేసుకొనేవాడు, తన బలం, ఎదిరి బలం లెక్కించి చూసుకొనేవాడు. ఉత్తమ వీరుడు కాగలడు. కానీ ఆ అంచనా వేసుకోవడంలో తప్పినవాడు అవమానింపబడతాడు అని ఈ కథ తెలుపుతుంది.
ఇది కర్ణుడిని దెప్పిపొడుస్తూ వ్యంగ్యంగా, అధిక్షేపంగా చెప్పిన కథ. శ్రీ మహాభారతం కర్ణపర్వం లోనిది.
– కాచః కాచోమణిర్మణిః Glass is glass, a gem is gem.
(ఇంకా ఉంది)