[శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి గారి ‘శ్రీ నారాసింహ క్షేత్రాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]శ్రీ[/dropcap]మతి పి.యస్.యమ్. లక్ష్మి గారు కథా, నాటక రచయిత్రిగా, బాలసాహితీవేత్తగా కన్నా కూడా భక్తి పర్యటనల రచయిత్రిగా ఎక్కువ ప్రసిద్ధులు. వీరు అనేక ప్రదేశాలలోని ఆలయాలను సందర్శించి వాటి విశేషాలను వివరిస్తూ ‘యాత్రాదీపిక’ అనే సీరిస్‍లో పుస్తకాలు వెలువరించారు. అటువంటి వాటిలో ఆరవది ‘శ్రీ నారాసింహ క్షేత్రాలు’.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని 27 నారసింహుని ఆలయాల విశేషాలతో ఈ పుస్తకం వెలువరించారు. శ్రీ మహావిష్ణువు నాల్గవ అవతారమైన నారసింహుని ప్రార్థనతో ప్రారంభించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నారసింహుని ఆలయాల గురించి ప్రాథమిక సమాచారం అంటే.. ఎక్కడ ఉన్నది, ఎలా వెళ్ళాలి, దర్శన సమయాలు, చరిత్ర, స్థానిక శాసనాల వివరాలతో పాటుగా – ఆ ఆలయపు మహత్యం పట్ల భక్తులలో ఉన్న నమ్మకాలు, కొన్ని వింతలను పాఠకులకి తెలియబరిచారు రచయిత్రి.
~
నరసింహస్వామి వ్యాఘ్రరూపంతో కనిపించే అరుదైన గుడి ఆంధ్రప్రదేశ్‍లోని కృష్ణాజిల్లాలోని ఆగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొండ మీద ఉన్న ఈ ఆలయానికి ఎగువన మరో వంద మెట్లు ఎక్కితే, శివాలయం ఉంది. ఒకే కొండపై శివకేశవుల ఆలయాలు ఉండడం మరో విశేషం.
కర్నూలు జిల్లా అహోబిలంలోని నారసింహుని రెండు ఆలయాలు జగత్పసిద్ధమైనవి. ఎగువ అహోబిలంలోని స్వామివారు నవనారసింహులలో ఒకరు. ఎగువ అహోబిలం లోని ఉగ్రస్తంభం అనే ఎత్తైన కొండ మీద నరసింహస్వామి ఉద్భవించాడని భక్తుల నమ్మకమని చెప్తారు రచయిత్రి. దిగువ అహోబిలం లోని ఆలయంలో స్వామివారి శిరస్సుని ఆదిశేషువు కొలువై ఉండడం ఓ విశేషమని రచయిత్రి వివరిస్తారు. అలాగే ఇక్కడ జరిగే పార్వేట ఉత్సవం గురించి క్లుప్తంగా తెలియజేశారు.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయపు ప్రత్యేకత – స్వామివారికి నిత్యం అభిషేకం జరగడం! అందుకు కారణమేమిటో ఆలయ చరిత్రలో భాగంగా వివరించారు రచయిత్రి.
అనంతపురం జిల్లాలోని కదిరి నరసింహ ఆలయం గురించి చెబుతూ ఓ తెలుగు సినిమా పాట వల్ల ఈ స్వామి పేరు అందరి నోళ్ళలో నానిందని తెలిపారు రచయిత్రి. మూలవిరాట్టుకి చెమటలు పట్టడం ఈ ఆలయంలోని వింత. ఈ ఆలయం సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను గురించి, వేమన సమాధి గురించి క్లుప్తంగా తెలియజేశారు.
గుంటూరు జిల్లా కేతవరంలోని వజ్రాలయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆ పేరెలా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికీ ఈ ఊర్లో వర్షాలు పడితే భూమిలో వజ్రాలు దొరుకుతాయట. అందుకని స్వామివారు వజ్రాలయ్య అయ్యారు. అయితే ఈ చిన్న ఊరులోనే మరో రెండు నారసింహుని ఆలయాలు ఉండడం విశేషం.
తెనాలి నాజర్‍పేట లోని శ్రీలక్ష్మీ నరసింహ దేవాలయంలో స్వామి వారి విగ్రహాన్ని శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రం లోని 18వ శ్లోకం ప్రకారం రూపొందించారు. కొండల, గుహలలోనూ కాకుండా నేల మీద ఉన్న అతి తక్కువ నారసింహ ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి ఎదురుగా రణవీర ఆంజనేయస్వామి ఆలయం ఉండండం మరో విశేషం.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహ ఆలయంలో శివునికి, బ్రహ్మకి ఆలయాలు ఉండడం వల్ల ఇది త్రిమూర్తుల ఆలయంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ ఆలయంలో యమధర్మరాజుకు ఉపాలయం ఉండడం మరో విశేషమని వివరించారు రచయిత్రి. కుజదోషం ఉందని తెలియక వివాహాం చేసుకున్న వారికి వివాహానంతరం ఎదురయ్యే సమస్యలకు ఈ ఆలయం పరిష్కారం చూపిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
మెదక్ జిల్లా నాచారంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం శ్వేతగిరి అనే కొండపై ఉన్నదని చెబుతూ, ఈ ఆలయానికి 600 ఏళ్ళ చరిత్ర ఉన్నదని అంటారు. ఇక్కడ స్వామి ఉగ్రమూర్తిగా నాలుక జాపి దర్శనమిస్తారని చెప్తారు రచయిత్రి.
వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో సోమేశ్వరాలయం, నరసింహ ఆలయం మహిమాన్వితమైనవని చెప్తారు. అపరిశుభ్రంగా దర్శనానికి వచ్చిన వ్యక్తులను తేనెటీగలు కుట్టి తరిమేయడం ఇక్కడి విశేషం. ఇక్కడికి సమీపంలో ప్రముఖ తెలుగు కవులు, బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుని సమాధులు ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా పుల్లూరులో కొండపైన వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సరైన ఆదరణ లేదని బాధపడతారు రచయిత్రి. సంబంధిత అధికారులు పూనుకుని తగిన ప్రచారం, సౌకర్యాలు కల్పించి ఆలయానికి భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లా పెంచలకోనలోని ఛత్రవట లక్ష్మీనరసింహ ఆలయం ప్రసిద్ధి చెందిన నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఈ స్వామికి కొండికాసులవాడు అనే పేరు ఎందుకు వచ్చిందో రచయిత్రి తెలియజేశారు. సమీపంలోని కండలేరుకి ఆ పేరు రావడానికి వెనుక ఉన్న చరిత్రను క్లుప్తంగా వివరించారు.
స్వామి వారి కుడి పాదం ముద్ర మీద నిర్మించబడినది అనంతపురం జిల్లా పెన్నహోబిలం లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయ సందర్శనం వల్ల శీఘ్ర వివాహం, కలతలు లేని సంసారం ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
హైదరాబాదులో అత్యంత పురాతనమైన ఆలయం ఫణిగిరి లోని కొనకండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయమని చెప్తారు రచయిత్రి. అందుకు నిదర్శనంగా ఆలయం ప్రాంగణంలో లభించిన శిలాశాసనాలను ప్రస్తావించారు. అలాగే హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఉన్న లక్ష్మీనరసింహుని గుడి గురించి తెలియజేశారు.
కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టత ఏమిటంటే 30 అడుగుల ఎత్తున్న ఆండాళ్ స్తంభం. సంతానార్థులైన స్త్రీలు ఈ స్తంభానికి చీర కట్టి ఒడి బియ్యం పోస్తే పిల్లలు పుడతారని భక్తులు విశ్వసిస్తారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం మహిమాన్వితమైనది. స్వామివారి నోట్లో పానకం సగం పోయగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. మిగిలిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కొండ క్రింద మరో రెండు నారసింహ ఆలయాలు ఉన్నాయి.
హుజుర్‍నగర్ లోని మట్టపల్లిలో వెలసిన అన్నాలయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని స్వామివారిని భారద్వాజ మహర్షి ఎన్నో ఏళ్ళ పాటు సేవించారని ఐతిహ్యం. ఇక్కడ స్వామివారి పూజకు ఆరె పత్రిని అధికంగా వినియోగించడం విశేషం.
వరంగల్ జిల్లాలోని మల్లూరులో నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాలి. ఇక్కడి స్వామివారి విగ్రహంలో వక్షస్థలం నుంచి నాభి వరకు ఎక్కడ నొక్కినా వేలు లోపలికి వెళ్తుందని చెప్తారు రచయిత్రి.
కేవలం శనివారం నాడు మాత్రమే తెరిచి ఉండే ఆలయం నెల్లూరు జిల్లా మాలకొండలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయం. అందుకు కారణమేమిటో రచయిత్రి వివరించారు. ఇక్కడ పిండి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు.
యాదాద్రిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి భక్తుల కొంగుబంగారం. ఇటీవల కాలంలో ఆలయం పునర్నిర్మాణం జరుపుకుని మరింతగా శోభిల్లడం అందరికీ తెలిసినదే. మెట్ల మార్గం గుండా కొండ ఎక్కి స్వామివారిని సేవించుకున్నవారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని ప్రతీతి.
అనంతపురం జిల్లాలోని వజ్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టత ఏమిటంటే – ఇక్కడి ద్వజస్తంభానికి నెయ్యి రాసి చూస్తే, దొంగలు ఎక్కడున్నది కనబడడం. అందువల్ల తర్వాతి కాలంలో కొందరు దొంగలు ఆ ధ్వజస్తంభాన్ని ధ్వంసం చేశారు. దాంతో దాని పక్కగా మరో ధ్వజస్తంభాన్ని స్థాపించారు.
మిర్యాలగూడా తాలూకాలోని దామరచర్ల మండంలోని వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సమీపంలోని అగస్త్యేశ్వర ఆలయాలను అగస్త్య ముని నిర్మింపజేశాడని ప్రతీతి. ఇక్కడి నరసింహస్వామి దీపాలయ్య అని అంటారు.
నెల్లూరులోని వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చిన్న కొండ మీద గుహలో ఉంది. స్వామివారిది ఆరడుగుల ఎత్తైన విగ్రహం. సప్తర్షులలో ఒకరైన కశ్యప ప్రజాపతి ఈ స్వామివారికి కొలిచారనేది ఐతిహ్యం.
కృష్ణాజిల్లా వేదాద్రిలో వెలసిన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పంచారూపాలు ఉంటాయి. శ్రీ నారాయణతీర్థుల వారు తరంగాలు రచించడానికి ఈ స్వామివారే ప్రేరణ. ఈ క్షేత్రంలో కోతుల బెడద అధికం.
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారు రెండు రూపాలలో దర్శనమిస్తారు. కొండపైన వరాహ నరసింహమూర్తిగా, దిగువన యోగానంద నరసింహస్వామిగా పూజలందుకుంటారు. దిగువ ఆలయంలో పూజలు పగటి పూట మాత్రమే జరుగుతాయి. యోగానంద నరసింహస్వామికి తాతగారు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
మహబూబ్‍నగర్ జిల్లా కొల్హాపూర్ మండలంలోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టత ఏమిటో తెలుసా? నరసింహస్వామి లింగ రూపంలో ఉండడం! ఈ గుడిని పాదం గుడి అని కూడా అంటారు. ఇక్కడి స్వామిది శివకేశవ స్వరూపం.
విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ నరసింహ స్వామి ఆలయం వైభవం అందరికీ తెలిసినదే. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అక్షయ తృతీయ నాడు స్వామి వారు నిజరూపంలో దర్శనమిస్తారు. మిగతా రోజుల్లో స్వామివారిని చందనంతో కప్పి ఉంచుతారు. ఆలయ ప్రాంగణంలోని కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
~
ఈ పుస్తకం ఒక వారధిగా, ఒక సారథిగా.. ప్రతి దేవస్థానాన్ని దర్శించడానికి మనను దగ్గరుండి నడిపించిందని ముందుమాటలో ప్రముఖ సినీ రచయిత, దర్శకులు శ్రీ జనార్దన మహర్షి చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
ఆయా ఆలయాలను, పరిసర ప్రాంతాలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడం ద్వారా పాఠకులని కూడా ఆ దేవాలయాలని మానసికంగా దర్శింపజేశారు రచయిత్రి.
***
శ్రీ నారాసింహ క్షేత్రాలు (యాత్రా దీపిక-6)
రచన: పి.యస్.యమ్. లక్ష్మి
పుటలు: 136
వెల: ₹ 120.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
అచ్చంగా తెలుగు (8558899478 వాట్సప్)
రచయిత్రి: 9866001629
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు