Site icon Sanchika

శ్రీ సత్యదేవ కథాసుధ – పుస్తక పరిచయం

[dropcap]’శ్రీ [/dropcap]సత్యదేవ కథాసుధ’ శీర్షికతో అన్నవరం క్షేత్ర చరిత్రను రచించారు వీరమాచనేని రమేష్‌ బాబు. శ్రీ సత్యదేవుని పరిచయం లేని వారికి ఇది పరిచయ గ్రంథమని, తెలిసినవారికి పరిశీలనా గ్రంథమని రచయిత పేర్కొన్నారు.

***

“శ్రీ సత్యదేవ కథాసుధ” (అన్నవరము) అనే పేరుతో శ్రీ రమేష్‌ బాబు రచించిన యీ గ్రంథం తెలుగులో వచ్చిన సమగ్ర నూతన “అన్నవర స్థలపురాణం” అని చెప్పవచ్చు. దీనిలో కథాభాగాలు వచ్చిన చోట ఈ రచయిత నవీన కథనరీతిని పాటించి సన్నివేశాలను ఉత్కంఠ భరితం చేశారు. తాత్విక విషయాలు వచ్చిన సందర్భాలలో పౌరాణికశైలినే అనుసరించారు. చారిత్రక సంఘటనల దగ్గర సమన్వయం అనే సూత్రాలను ఆశ్రయించారు. అందువల్ల ఈ గ్రంథానికి స్థల పురాణ లక్షణాలన్నీ పూర్తిగా పట్టాయి.

అన్నవరం దేవతామూర్తులు స్వయంభూమూర్తులా ప్రతిష్ఠితమూర్తుల అనే వివాదాన్ని వారు సమన్వయ దృష్టితో పరిశోధించి, రెండూ సత్యమేనని తేదీల వివరాలతో సహా నిరూపించారు.

ఆలయప్రతిష్ఠావర్ణన, ప్రతిష్ఠాయంత్రవర్ణన – ఇలాంటి అంశాలలో ఈ రచయిత తన ఆగమశాస్త్ర పరిచయాన్ని శాస్త్రీయంగా ఆవిష్కరించారు.

సత్యము – దైవము, పురుష సూక్తంలో పురుషుడే శ్రీ సత్యనారాయణస్వామి, అంగదేవతలు ఇత్యాది ఖండికలలో వీరు తన తాత్త్విక దృష్టిని చక్కగా వ్యక్తీకరించారు.

చివరగా స్కాందపురాణ రేవాఖండంలోని సత్యనారాయణ వ్రత కథా వివరణంతో ఈ గ్రంథం ముగింపుకు వచ్చింది. ఈ అధ్యాయాలు ఐదా, తొమ్మిదా అనే విషయంలో పరిశోధకుల మధ్య వైమత్యాలున్నాయి. వీరు తొమ్మిది అధ్యాయాల పక్షాన్ని స్వీకరించారు. దాని తరువాత షోడశోపచార పూజా విధానంలో శివాష్టోత్తర శతనామాన్ని గూడ చేర్చటంవల్ల సత్యనారాయణ విరాట్పురుషుడి అర్చనకు పరిపూర్ణత్వాన్ని కలిగించారు.

ఈ విధంగా తెలుగులో ఒక సమగ్రక్షేత్ర స్థలపురాణాన్ని వెలయించారు” అని “నూతన స్థలపురాణము” అనే ముందుమాటలో వ్యాఖ్యానించారు కుప్పా వేంకట కృష్ణమూర్తి.

***

మన క్షేత్రాలలో ప్రతి ఒక్కదానికి స్థల పురాణంతో పాటు చారిత్రక విశేషాలు ప్రాకృతిక ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. పురాణోక్తమైన శ్రీ సత్యనారాయణ వ్రతం దేశమంతా ప్రసిద్ధి. దానికి క్షేత్రంతో నిమిత్తం లేదు.

తదనంతర కాలంలో శ్రీ సత్యనారాయణునికంటూ ఒక క్షేత్రం ఏర్పడింది. దానికి ఐతిహ్యం, స్థల పురాణం, లీలా వైభవం, యంత్ర-విగ్రహ ప్రాధాన్యం వంటివి ఉండడం చేత ఆ క్షేత్రం – మందిరం ప్రాముఖ్యాన్ని పొందాయి.

ఆ విషయ వివరాలన్నిటినీ పరిశీలించి, సమీకరించి చక్కని గ్రంథంగా మలిచారు రమేష్ బాబు గారు. ఆలయ క్షేత్ర విశేషాలతో పాటు వ్రత విధానం – కథా సంవిధానం కూడా దీనితో సమకూర్చారు. ప్రశంసనీయమైన ఈ రచన ద్వారా వీరు స్వామి భక్తులకు మహోపకారము చేశారు” అని శ్రీ సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

***

“అన్నవర క్షేత్రము నందు వెలసిన శ్రీ వీర వేంకట నారాయణ స్వామి వారు భక్తులకు కొంగు బంగారము. ఉపనయన, వివాహ, గృహప్రవేశాది ఉత్సవ సమయములలో శ్రీ సత్య నారాయణ వ్రతమాచరించుట ఎల్లరూ పాటించునదే! శ్రీ స్వామి వారి ఆవిర్భావ వృత్తాంతమును, కథా విశేషములనూ, క్షేత్రమహాత్మ్యమునూ పూజా మరియు వ్రత. వైశిష్ట్యమునూ ఈ గ్రంథమందు తేలిక భాషలో వివరించిరి” అని తమ ‘ఆముఖము’లో పేర్కొన్నారు శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ.

***

శ్రీ సత్యదేవ కథాసుధ (అన్నవరం క్షేత్ర చరిత్ర)
రచన: వీరమాచనేని రమేష్‌ బాబు
ప్రచురణ: శ్రీ రమణ సారస్వత సరస్వతీ సమితి
పుటలు: 213+xviii
వెల: ₹ 120
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణకర్త
శ్రీ రమణ సారస్వత సరస్వతీ సమితి, 12-5-101/1,
విజయపురి, సౌత్ లాలాగూడ,
సికింద్రాబాద్ 500017.
ఫోన్: 040-27003622

Exit mobile version