శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం-3

0
2

[సి.హెచ్. ప్రతాప్ గారి ‘శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం-3’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]ప్పటి వరకు ఈ పవిత్ర భారతావనిలో అవతరించిన సత్పురుషులలో కెల్లా కోహినూర్ వజ్రం వంటి వారు, మహా మహిమాన్వితులు శ్రీ శిరిడీ సాయినాథులు. కుల, మత, పేదా, గొప్పా బేధాలను ఎరుగక తనను శరణు వేడిన సర్వులకు అన్ని వేళలా అభయహస్తం అందించే అవాజ్య కరుణామూర్తి శ్రీ సాయి.

కలి మాయ వలన పెడద్రోవ పట్టిన మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే శ్రీ సాయి. “గురువే సర్వస్వం, గురువును మించిన దైవం లేదని” అని అనుక్షణం చెప్పే శ్రీ సాయి భక్త సులభుడు, స్మరణ, దర్శనం మాత్రం చేతనే అనుగ్రహం చిందించే మహోన్నత శక్తి సంపన్నులు. ప్రజలను సన్మార్గులను చేసి, వారిని చివరికంటా గమ్యం చేర్చేందుకు మనపై కరుణతో మానవ రూపంలో అవతరించిన పరిశుద్ధ, సంపూర్ణ పరబ్రహ్మ అవతారమే శ్రీ సాయి.

మహారాష్ట్ర రాష్ట్రంలో ముల్కీ గ్రామంలో వెంకట్రావు అనే వ్యక్తి నివసిస్తుండేవాడు. వెంకట్రావు స్వతహాగా నాస్తికుడు. దేవుడు లేడని, రాయి రప్పలకు, చిత్రపటాలకు దణ్ణం పెట్టి మన వ్యక్తిత్వాలను కించపరచుకోవనవసరం లేదని, మానవ శక్తే అన్నింటి కన్నా గొప్పదని వాదిస్తుండేవాడు. అయితే అతని తండ్రి గొప్ప సాయి భక్తుడు. నిత్యం సాయి అర్చన, శిరిడీ దర్శనం చేస్తుండేవాడు. అనేక సందర్భాలలో బాబాను దర్శించినప్పుడు తన కొడుకు యొక్క మూర్ఖత్వం గురించి బాబాకు చెప్పి, ఎలాగైనా కొడుకును సన్మార్గంలో పెట్టమని ప్రార్థిస్తుండేవాడు. ప్రతీ సారి ఒక చిరునవ్వే బాబాగారి సమాధానం అయ్యేది.

ఒకసారి 1917వ సంవత్సరంలో ఉద్యోగ నిర్వహణలో వుండగా వెంకట్రావుకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సహాద్యోగులందరూ అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. వచ్చిన గుండెపోటు తీవ్రమైనది కావడంతో ప్రాణాలకే ముప్పు అని దాక్టర్లు తేల్చి చెప్పారు. వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో పడి వున్న వెంకట్రావుకు స్వప్నంలో బాబా దర్శనం ఇచ్చి నుదుట విభూతిని అద్ది గుండెలపై తన చేతులతో రాసి ఆశీర్వదించారు. ఆ తర్వాత ఇద్దరు సేవకుల వెంకట్రావు వారిస్తున్నా వినకుండా అతని కాళ్ళు వత్తారు. చిత్రం! ఆ స్వప్నం వచ్చిన తరువాత వెంకట్రావు ఆరోగ్య పరిస్థితిలో మంచి మార్పు వచ్చింది. గబాగబా కోలుకోవడం ప్రారంభించడంతో ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతు అయింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళిన వెంకట్రావుకు దీనజనోద్ధారకుడు, భక్త జన సంరక్షకుడు అయిన శ్రీ సాయినాథుని దివ్య కటాక్షం, ఆశీస్సుల వలనే తన జబ్బు నయమయ్యిందన్న విషయం తెలుసుకొని సజలపూరిత నయనాలతో బాబాకు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. నాటి నుండి వెంకట్రావు ఆస్తికుడిగా మారి గొప్ప సాయి భక్తుడయ్యాడు.

త్వరలోనే శ్రీ సాయినాథుని దర్శనం చేసుకుని ఆయనను తగు రీతిన పూజించుకున్నాడు. మశీదులో శ్రీ సాయి వద్ద నున్న భాల్దారులు (సేవకులు) తనకు స్వప్నంలో కనిపించిన వారే కావడంతో ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయినాథుని దివ్య లీలకు ముదమొందాడు. ఆ రోజు నుండి వెంకట్రావు తన జీవితానికి శ్రీ సాయిని రథసారథిగా చేసుకున్నాడు. తనకు ఏ కష్టమొచ్చినా శ్రీ సాయికి ఉత్తరం రాసేవాడు. ఆ ఉత్తరం శ్రీ సాయికి చేరగానే అతని కష్టాలు తీరేది. నాస్తికుడైన వారిని ఆస్తికుడిగా, తన భక్తునిగా మార్చిన శ్రీ సాయినాథుని లీలలు చిత్రాతి చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here