శ్రీ శిరిడీ సాయి సేవాభాగ్యం

0
2

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘శ్రీ శిరిడీ సాయి సేవాభాగ్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క కుమ్మరి స్త్రీ యొక్క బిడ్డ ప్రమాదవశాత్తు కొలిమిలో పడగా, ద్వారకామాయి మశీదులో వున్న శ్రీ సాయినాథులు తన అపూర్వమైన కరుణా కటాక్షాలతో, ధునిలో చేతిని వుంచి ఆ బిడ్డను రక్షించారు. వందల మైళ్ళ దూరంలో వున్న ఒక బిడ్డను ఎక్కడికీ కదలకుండా తన అపూర్వ యోగ శక్తితో ఆయన రక్షించిన వైనం అపూర్వం, అద్వితీయం మరియు అసామాన్యం. మొదట్లో అదంతా ఒక కట్టుకథగా భావించిన సాయి భక్తులు సాక్షాత్తూ ఆ కుమ్మరి దంపతులు శిరిడీకి వచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి తన కుమారుడిని రక్షించినందుకు వేన్నోళ్ళ కృతజ్ఞతలు అర్పించడంతో శ్రీ సాయి యొక్క సర్వజ్ఞతకు, సర్వవ్యాపకతకు, శక్తి సామర్థ్యాలకు ఆశ్చర్యపోయారు. శ్రీ సాయి సాక్షాత్తు పరిశుద్ధ, పరమేశ్వర అవతారం. ఆ స్వామికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు.

శ్రీ సాయి కొలిమిలో పెట్టినందుకు చేయి తీవ్రంగా కాలిపోయి బొబ్బలెక్కిపోయిందని తెలుసుకున్న సాయి భక్తాగ్రేసరుడు నానా చందోర్కర్ బొంబాయి నుండి డా. ప్రేమానంద్ అనే సర్జన్‌ను హుటాహుటిగా వెంటబెట్టుకొని శిరిడీ వచ్చాడు. నానా ఎంత ప్రార్థించినా శ్రీ సాయి తన చేతిని ఆ డాక్టర్ పరీక్షించడానికి ఒప్పుకోలేదు. బహుశా ఈ సృష్టికే పెద్ద డాక్టర్ అయిన తాను ఈ వైద్యాలకు, గాయాలకు అతీతుడినని శ్రీ సాయి భావించి వుండవచ్చు. అయితే శిరిడీలో వున్న నాలుగు రోజుల లోనూ శ్రీ సాయి యొక్క మహత్యాన్ని గుర్తించిన డా. ప్రేమానంద్ శ్రీ సాయికి భక్తునిగా మారిపోయి తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. శ్రీ సాయి యొక్క ప్రత్యక్ష దర్శనం ప్రేమానంద్‌లో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది.

శ్రీ సాయి యొక్క గాయాన్ని చూసి తట్టుకోలేక కుష్ఠురోగి అయిన భాగోజీ షిండే స్వతంత్రంగా ఆకులు, మూలికలు తీసుకు వచ్చి శ్రీ సాయి చేతిని మర్దనా చేసి కట్టు కట్టనారంభించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో భాగోజి సేవలను స్వీకరించారు. భాగోజీకి గతంలో కుష్ఠురోగం తీవ్రంగా వచ్చింది. అతని వేళ్ళు ఈడ్చుకొని పోయివుండేవి. శరీరమంతా చీము కారుతూ దుర్వాసన కొడుతూ వుండేది. యావత్ శిరిడీ గ్రామం అతనిని బహిష్కరించింది. తీవ్రమైన బాధన, వేదనలను అనుభవించలేక అవసాన దశలో వున్న భాగోజీ షిండేను శ్రీ సాయి ఆదరించి, మశీదుకు తీసుకు వచ్చి స్వయంగా సపర్యలు చేసి అతని బాధలు తగ్గించి పూర్తి స్వస్థత చేకూర్చారు. అప్పటి నుండి భాగోజీకి మశీదు లోనే స్థిర నివాసం. ఉదయం శ్రీ సాయి నిద్ర లేచిన దగ్గర నుండి భాగోజీ తన సేవా కార్యం మొదలు పెట్టేవాడు. ప్రస్తుత లీలలో ప్రతీ రోజూ పాత కట్టు విప్పి, మూలికలతో చేతిని మర్దనా చేసి తిరిగి కొత్త కట్టు కట్టేవాడు. చాలా సంవత్సరాల పాటు భాగోజి శ్రీ సాయి సేవా కార్యాని అతి సమర్థవంతంగా నిర్వర్తించాడు. భాగోజీకి గత జన్మల పాప కర్మల ఫలితం ఎక్కువగా వున్నందున దానిని రూపు మాపడానికి శ్రీ సాయి ‘సేవ’ అనే కార్యాన్ని భాగోజీకి అనుగ్రహించారు. అంతే కాక ఆ సేవా కార్యాన్ని తన జీవిత కాలమంతా స్వీకరించి తన భక్తుడిని అనుగ్రహించి ఆఖరులో అతనికి ముక్తిని ప్రసాదించారు.

భక్తుల పాలిటి ఆశిత కల్ప వృక్షం, ఆర్త త్రాణ పరాయణుడు అయిన శ్రీ సాయి భగవానునికి సేవలు చేసే భాగ్యం కలగడం భాగోజి యొక్క పూర్వ జన్మ సుకృతం గానే భావించాలి. భక్తి కేవలం మానసిక భావావేశం కాదు. భగవంతుణ్ణి సేవించడమే నిజమైన భక్తి. ఆచరణీయ ప్రామాణిక పద్ధతుల్లో శ్రీకృష్ణుణ్ణి సేవించడమే మాధవ సేవ. శ్రీకృష్ణుడికి ఎటువంటి సేవలను మనం చేయగలమో నవవిధ భక్తి మార్గాల రూపంలో ప్రహ్లాదుడు ‘శ్రీమద్భాగవతం’లో సవివరంగా తెలియజేశాడు.

అటువంటి భాగ్యం మనకూ లభించాలని శ్రీ సాయినాథులను మనస్పూర్తిగా ప్రార్థిద్దాం. తద్వారా లభించే సేవలో త్రికరణ శుద్ధిగా పాల్గొని తరిద్దాం, శ్రీ సాయి భగవానుని అనుగ్రహానికి పాత్రులం అవుదాం.

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జనః సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here