Site icon Sanchika

శ్రీ శిరిడీ సాయినాథుని దివ్యలీలలు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘శ్రీ శిరిడీ సాయినాధుని దివ్యలీలలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]వ్యాజ కరుణమూర్తి, ఆర్తత్రాణ పరాయణుడైన సాయినాథుని లీలలు పాలసముద్రం వలె అపారమైనవి, లోతైనవి, గంభీరమైనవి, మధురమైనవి. జీవన శీతల పాలసులైన వారు ఈ సాగర తీరాన ఏ రవ్వంత సంచరించినా వారి ఆవేదనలకు, చింతనలకు తక్షణం దూరమౌతారు. శ్రీ సాయి ఏనాడూ శిరిడి గ్రామన్ని విడిచి వెళ్ళలేదు. ఏ రైలు బండీ ఎక్కలేదు. కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో వున్న తన భక్తుల విశేషాలు అనుక్షణం తెలుస్తుండేవి. అవకాశం దొరికినప్పుడు ఆయన ఆ విశేషాలను, వారి అనుభవాలను భక్తులకు చెప్పేవారు. అప్పుడు ఆ భక్తుల ఆనందాన్ని వర్ణించడానికి ఏ మాటలు చాలవు. పూర్ణ పరబ్రహ్మ స్వరూపులు, ఆత్మ సాక్షాత్కారాన్ని, పూర్ణ బ్రహ్మత్వాన్ని పొందిన శ్రీ సాయి సాధారణుని వలె తమ భక్తుల కోసం తాపత్రయపడుతున్న ఆ సద్గురునాథునికి ఏమిచ్చి మన ఋణం తీర్చుకోగలం? తనను నమ్మి కొలిచిన వారికి ఆయన ఎల్లవేళ్లా బాసటగా నిలిచారు. ఆయన ప్రతిఫలంగా మన నుండి ఐహికమైన ధన ధాన్యాలను, బంగారాన్ని, ఆస్తి అంతస్తులనూ కోరలేదు. అవి ఆయనకు గడ్డిపోచతో సమానం. ఆయన తన భక్తుల నుండి ఆశించినది శ్రద్ధ, సబూరి. శ్రీ సాయి ఎల్లవేళలా తన భక్తులకు ఓర్పుతో కూడిన సహనం, పరిపూర్ణ విశ్వాసం అలవరచుకోమని ప్రేమపూరిత సందేశాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే ఆ రెండు లేనిదే మనిషి అధ్యాత్మిక ఉన్నతిని సాధించలేడు.

దాసగణు కీర్తనలు, హరికథల వలన శ్రీ సాయినాథుని లీలా విశేషాలు మహారాష్ట్ర లోనే కాక దేశమంతటా విపరీతంగా వ్యాపించాయి. శ్రీ సాయి యొక్క అద్భుత వ్యక్తిత్వాన్ని, శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఆయన భక్తులలో శ్రేష్ఠుడిగా వెలుగొందిన పితళే గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.

బొంబాయి నివాసి అయిన హరిచంద్ర పితళే కేవలం సాయినాథుని దర్శన మాత్రాన భక్తులు తమ ఈతి బాధల నుండి విముక్తులౌతారని తెలుసుకొని మందులతో ఏ విధంగా నయం కాని తన కుమారుని మూర్ఛ వ్యాధి బాబా వారి కరుణతో, ఆశీస్సులతో తగ్గుతుందని భావించి శిరిడీకి బయలుదేరాడు. శ్రీ సాయిని అనేక బహుమతులతో సత్కరించి తన కుమారుడిని ఆయన పాదాల వద్ద పడుకోబెట్టాడు. శ్రీ సాయి యొక్క చూపులు ప్రసరించినంతనే ఆ పిల్లవాడు నురగలు కక్కుతూ క్రింద పడిపోయాడు. మూర్ఛ రోగి అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన మూర్ఛ తీవ్రమైనది కావడంతో ఆ తల్లిదండ్రులు కలవరపడ్దారు. అప్పుడు శ్రీ సాయి “ఆ బిడ్దను బసకు తీసుకొని వెళ్ళండి. ఓక అరగంటలో పూర్తి స్వస్థత పొందుతాడు” అని తన అభయ హస్తాన్ని ఆ బిడ్ద తలపై వుంచారు. బాబా పలుకుల ప్రకారం ఆ పిల్లవానికి అరగంటలోనే తెలివి వచ్చింది. అప్పటి నుండి వాని ఆరోగ్యంలో మంచి మార్పు వచ్చింది. ఇతర పిల్లల వలె చక్కగా ఆడుకోసాగాడు. పిల్లవానికి మూర్ఛ వ్యాధి నయం చేసి ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతతో పితళే తన కుటుంబంతో పాటు శ్రీ సాయిని మరల దర్శించాడు. ఆయన భక్త వాత్సల్యానికి ముదమొందాడు. శ్రీ సాయి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి “భగవంతుడిని మనస్పూర్తిగా నమ్మిన వారికి కష్టాలు ఎన్నడూ కలుగవు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ భగవంతుని కరుణ వలన అన్ని తొలగిపోయి జీవితం సుఖాంతమౌతుంది. మీకు ఇదివరలో రెండు రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు మూడు రూపాయలనిస్తున్నాను. నీ పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం పూజించుకో!” అని ఆశీర్వదించి పితళే చేతిలో మూడు రూపాయలను వుంచారు. ఇంటికి వెళ్లాక పితళే తన తల్లితో “నేను శిరిడీ వెళ్ళడం ఇదే కదా మొదటిసారి, మరి శ్రీ సాయి నాకు ఇదివరలో రెండు రూపాయలను ఇచ్చానని అన్నారేమిటి?” అని తన సందేహం వెలిబుచ్చాడు. అప్పుడు పితలే తల్లి ఆనంద బాష్పాలతో “నాయనా! నీవు ఇప్పుడు నీ కుటుంబంతో శిరిడీ వెళ్ళినట్లే మేము కూడా అక్కల్‌కోట్ మహరాజు గారిని దర్శించుకున్నాము. అప్పుడు ఆ మహరాజు మీ నాన్నగారికి రెండు రూపాయి బిళ్ళలను ఇచ్చి పూజా మందిరంలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజించమని సలహా ఇచ్చారు. మీ నాన్నగారు బ్రతికి వున్నంతవరకు ఆ నాణాలను నిత్యం క్రమం తప్పక పూజించేవారు. ఆయన మరణించాక నీవు ఉద్యోగ బాధ్యతలలో పడి ఆ విషయన్నే మరిచిపోయావు. ఇప్పుడు శ్రీ సాయి ఆ విషయాన్ని నీకు మరల గుర్తు చేసారు. శ్రీ సాయినాథ మహారాజు సామాన్య యోగీశ్వరుడు కదు, ఆయనకు ఈ లోకంలో జరిగే ప్రతీ విషయం తెలుసు” అని భావోద్వేగంతో అన్నది. ఆ మాటలకు పితళే ఎంతో ఆనందించాడు. ఆతని కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. చిన్నతనం తన తండ్రితో అక్కలకోట్ మహారాజును దర్శించిన విషయన్ని మరల గుర్తు చేసి తన సర్వజ్ఞతను చాటుకున్న శ్రీ సాయినాథునికి పితలే మనసు లోనే కృతజ్ఞతలను అర్పించుకున్నాడు. శ్రీ సాయి ఆదేశానుసారం నాటి నుండి అయిదు రూపాయల కాసులను క్రమం తప్పక పూజించసాగాడు. ఆనతి కాలం లోనే జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు.

శ్రీ సాయి మార్గదర్శకత్వం అత్యంత విశిష్టమైనది. ఏ కారణం చేతనైనా తన భక్తుల సంతానం పూజాది కార్యక్రమాలను మానివేస్తే శ్రీ సాయి వారిని స్వయంగా తన సన్నిధికి పిలిపించుకొని వారి పూర్వపు వృత్తాంతాలను ఎరుకపరిచి వారి చేత తిరిగి పూజాది కార్యక్రమలను ప్రారంభింపజేసేవారు. పితళే విషయంలో కూడా అదే జరిగింది. పితళే తండ్రి అక్కల్‌కోట మహరాజు వారి పరమ భక్తుడు. ఆయన పరమపదించాక పితళే ఆ మహారాజు యొక్క ఆరాధనను పూర్తిగా మానివేసాడు. పితళే కుమారుని అనారోగ్యం అనే కారణాన్ని సాకుగా తీసుకొని పితళేలో అధ్యాత్మిక చిగురులను తొడిగింపజేసి తిరిగి అతని చేత భగవంతుని ఆరాధనను ప్రారంభింపజేసారు సాయి.

శ్రీ సాయినాథుని లీలలు అద్భుతాలు. ఆ లీలలను స్వయంగా అనుభవించిన భక్తులు ఎంతో భాగ్యవంతులు. ఆ సాయినాథుని కన్న ఈ ధరణి ధన్యమైనది. ఆ కరుణామూర్తి పుట్టిన ఈ పవిత్రమైన పుణ్యభూమిలో మనం కూడా జన్మ నెత్తడం మనం ఎన్నో వేల జన్మలలో చేసుకున్న పుణ్య ఫలం.

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జనః సుఖినోభవంతు

Exit mobile version