Site icon Sanchika

శ్రీ సీతారామ కథాసుధ-11

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]


~
మధ్యాక్కర
కొదువలు లేవు నాకింక కోరిన దర్శనమిచ్చి
ముదితను గావించినావు మోహముల్‌ తొలగెను నాకు
పదపదమున నీకు జయము పరమ కల్యాణముల్‌ జరుగు
నుదయార్చినున్మేష భావ! ఇంక నే దాసిని నీకు. (101)

తే.గీ.
అనుచు గౌతము సతి రామునభినుతించి
నేత్రములయందు రోచిస్సు లాత్రముగను
వెలుగులను జిమ్మ ఇక నేను వెడలిపోదు
బ్రహ్మలోకమునకు తఫః పరత పొంద. (102)

వచనము
అని సర్వవృత్తాంతమును నారదుడు వాల్మీకికి వివరించి నీవు చిత్తమునందు ధ్యానించి తెలియవలసిన గాథను వివరింతును. శ్రీరామలక్ష్మణులు గౌతమాశ్రమము దాటి మిథిలకు చేరిరి. (103)

కం.
మిథిలానగరము బ్రహ్మ
ప్రథితమ్మై చెలగు బ్రహ్మ భావన తోడన్‌
విధి ముఖ్యులు తన్నగరీ
పృథులాంగణములను తత్త్వవేత్తలు కాగన్‌. (104)

మధ్యాక్కర
ఆ నగరమున శివధనువర్హమై పూజ్యత చెందు
దానిని భంగించుటేమి తత్త్వము వివరింతు నీకు
మానిత సత్కవిగణ్యమును మరి శివుని చాపమ్ము
గౌణమై ప్రణవ భావమ్మె గుహ్యము విశ్వదీప్తమ్ము. (105)

మధ్యాక్కర
అది పినాకమ్మొ, శార్ఙ్గమ్మొ అంతస్సులో చూడగలము
విదితమై ఆధారమందు వెలసి వేయంచుల దాక
కదలని వెలుగుకంబమ్ము గమనింప ఊర్థ్వాభిముఖము
అది లొంగిపోవలెనన్న ఆ స్వామి కొకనికే చెల్లు (106)

వచనము
ఇట్లు శివధనుఃస్థానంబున లీలా మానుష విగ్రహుడై నిలిచి యున్న శ్రీరామచంద్రుని చూచి ఊర్థ్వ లోకముల వారు త్రివిక్రముడని భావించిరి. ఆ స్వామికి సీతామహాదేవి వనమాలలు అర్పించి అతడు ఆది నారాయణుడు అని ఆమెను ఆద్యాది శ్రీ మహాలక్ష్మి అని ఇరువురును గుర్తించుకొనిరి. వారి ఫాలములయందు ఇంద్రధనుస్సు ప్రకాశించెను. (107)

మ.
శివుడే రాముడు రాముడే శివుడు సృష్టింపంగ నీలోకముల్‌
శివుడే రాముడు రాముడే శివుడు రక్షింపంగ నీలోకముల్‌
శివుడే రాముడు రాముడే శివుడు సంలీనంబు గావింపగా
భవభేదంబులు లేవు జీవులకు సర్వావస్థలందుండినన్‌. (108)

వచనము
అపుడు నేను మహతిని మ్రోగించితిని. సర్వ లోకములు అంతస్సుల యందు సుఖము పొందెను. నా తల్లి సరస్వతీదేవి కచ్ఛపి తనంత తానుగా మ్రోగెను. బ్రహ్మ లోకము వారు ఆత్మానందమున మునిగిరి. రాముని ధనుర్‌ నిర్వహణ సీతాదేవి పెళ్లి వార్త వేగరుల చేత అయోధ్యకు వార్త నంపగా దశరథుడు భరత శత్రుఘ్నులతో రాణులతో మంత్రుల గూడి మిథిలకు చేరుకొనిరి. విశ్వామిత్ర జనకుల నిర్ణయమున సీతను రామునకు, జనకుని మరొక బిడ్డ ఐన ఊర్మిళను లక్ష్మణునకు, జనకుడి సోదరుడైన వృషధ్వజుని కూతుండ్రు మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయ దశరథుడు అంగీకరించెను. వారి వివాహములు సర్వ లోకముల, సర్వ దేవతల సర్వ మునీంద్రుల సమక్షమున అతి వైభవముగా జరిగినవి. జనక రాజర్షి రామునితో.. (109)

ద్విపద
ఈ సీత నా పుత్రి ఈవు గైకొనుము
భాసిత యోగిని పరమపవిత్ర
నిత్య సహచరి యామె నిను వీడదెపుడు
సర్వలోకేశ్వరి, సకలాఘదూర. (110)

వచనము
అని పలికి సమర్పించెను. (111)

శా.
సీతారాముల పెండ్లి లోకమున కాశీర్వాదమున్ సర్వ వి
ద్యా తాత్పర్యమునౌచు యోగులకు ప్రాణార్చిస్సు వెల్గింపగా
చేతో మార్గములెల్ల రామమయమై శ్రీదేవతాభావ్యమై
ప్రీతాష్టాపది యౌచు సప్తపది హర్షింపంగ ముల్లోకముల్‌. (112)

శా.
సీతానామక యోగ విద్య నుపదేశింపంగ శ్రీ వాయుసం
జాతుండో రఘురాముడో తగుదురెంచన్‌ దీనికిన్‌ వేత్తలె
వ్వారల్‌ సాధన తీర్పజాలుదురు సర్వంబై ధరాజాత నా
చేతోవీథిని తానె గూఢగుహ విచ్చున్‌ బ్రహ్మమార్గంబునన్‌. (113)

మ.
ఎదలోనన్‌ గణియించి సాధుమతి నీవే భూపతిశ్రేష్ఠుడం
చెదలోనన్‌ రణియించు నాదరతి నీవే తారక బ్రహ్మమం
చెదలో కూర్చొనజేసి దీప్తమతి నీవే అంతరాదిత్యుడం
చదనుల్‌ గుర్తుకు వచ్చి చెక్కితిని రామా! జానకీ వల్లభా! (114)

ఇతి శ్రీ సీతారామకథాసుధ యను చంపూకావ్యము సంపూర్ణము

(సమాప్తం)

Exit mobile version