[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
~
ఉ.
తల్లులు రాఘవేంద్రులకు తల్లులు వత్సలతా ప్రపూర్ణ వా
గ్వల్లులు ఇచ్ఛ జ్ఞానము నపారము శక్తియు రూపమైన వా
రుల్లము నందు దాశరథులొక్కటియే యనుకొందురెప్డు సం
ఫుల్లము కల్పవృక్షసుమపుంజము పోలిక నిత్యశోభితుల్. (31)
శా.
తామై కోసలకన్యకామణి సుమిత్రాదేవి కైకేయి శ్రీ
సమ్మాన్యల్ నిజభర్త్రురాసికలటన్ సంసేవ్యరాజ్యప్రజా
క్షేమాసక్తలు రంగనాథపదవీసేవాసమర్చాప్త చి
త్తామోదల్ ఘృణివంశకీర్తిపరమల్ హ్లాదైకమోదాబ్ధులున్. (32)
తే.గీ.
ప్రభువు దశరధుడేలెడి పట్టణంబు
ప్రభువు శ్రీరాము డుదయించు పట్టణంబు
జీవుడును పరమాత్మయు చెలగు వీడు
గూఢముగ సూర్యు డెడదల కొలువుదీరు. (33)
తే.గీ.
అష్టచక్ర నవద్వార యైన నగరి
దేవతలు నివసించెడి దివ్యనగరి
అఖిలవిశ్వమునకు నాభియైన చోటు
లేదు సాటి అయోధ్యకు లేదు లేదు. (34)
చం.
తన హృదయంబు నందున నుదాత్తము సామము మ్రోగినట్లు తో
చిన వెలుగై అయోధ్యయయి శ్రీమయమార్గము భావలగ్నమై
తన కనులందు గాంచినటు గాధితనూజుని జీవనంబు వే
చిన ఫలమై సశిష్యముగ శ్రీమదయోధ్యకు సత్వరన్ చనెన్. (35)
ఉ.
దేశము లేదు కాలమును తేలదు శ్రీప్రభుసన్నిధాన మా
శ్వాసితమైన యంత నగరాగ్రము చేరగనే వశిష్ఠు డు
ర్వీశుడు నర్ఘ్యపాద్యముల ప్రీతినొసంగిన స్వీకరించి ప్రా
జ్ఞేశుడు ధాతృసన్నిభుడు నీగతి పల్కె నుదాత్తవైఖరిన్. (36)
సీ.
నిత్యావతార నిర్నిద్రుడౌ పరమాత్మ
పుత్రత నీయింట పొలుపు గాంచు
వైకుంఠమున నుండు పరవాసుదేవుడ
పత్యత నీయిండ్ల ప్రమదమిడును
ఇక్ష్వాకు కులదైవ మిల రంగనాథుడు
కొడుకుల రూపాన కొలువుదీర్చు
యోగుల హృదయాన నుండు తేజోమూర్తి
శిశువు లై నీ వీట సిరుల పెంచు
తే.గీ.
ఈ రహస్యము నెరుగుదు రిచటి మునులు
బ్రహ్మసూమౌని దీనికి ప్రథమ సాక్షి
వారి దర్శింప నిచటికి వచ్చినాడ
జన్మ మిదియెల్ల సఫలత సంభవింప. (37)
తే.గీ.
ఎంత పుణ్యము చేసితి రీరు రఘుకు
లంబు నదితియు కశ్యపు లైతి రీరు
రాణులును భూమిపతియు సంక్రాంతమహిమ
కలుగ దెవ్వారి కైన సంక్రందనాభ. (38)
తే.గీ.
అశ్వమన దేశకాలబంధానుభవము
అశ్వమేధ సవన మతితరింపు
వేదము చివళ్లు దీనిని విశదపరిచె
అశ్వమేధము నిజము బ్రహ్మానుభవము. (39)
తే.గీ.
అనిన సంయమీంద్రుని మాట నవధరించి
అంతరంగ రహస్యము ననుమతించి
తనయులను బ్రహ్మనిభు మౌని దర్శనమున
కచటికిని వచ్చుటకు పిల్వ నంపె రాజు. (40)
(సశేషం)